కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వృద్ధ సహోదరులారా​—⁠మీ విశ్వసనీయతను యెహోవా విలువైనదిగా చూస్తాడు

వృద్ధ సహోదరులారా​—⁠మీ విశ్వసనీయతను యెహోవా విలువైనదిగా చూస్తాడు

ప్రపంచవ్యాప్తంగా, సంఘపెద్దలు తమ నియామకాల్ని అమూల్యంగా ఎంచుతారు. వాళ్లు మన మధ్య ఉండడం నిజంగా ఒక దీవెన! అయితే, సంస్థ ఈ మధ్యకాలంలో ఒక మార్పు చేసింది. వృద్ధ సంఘపెద్దలు తమకున్న బరువైన బాధ్యతల్లో కొన్నిటిని యౌవన సంఘపెద్దలకు అప్పగించాలని సంస్థ కోరింది. దానర్థం ఏంటి?

ప్రాంతీయ పర్యవేక్షకులు, బైబిలు పాఠశాలల ఉపదేశకులు 70 ఏళ్ల వయసుకు చేరుకున్నప్పుడు ఆ నియామకాల నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా లేదా పెద్దల సభ సమన్వయకర్తగా సేవచేస్తున్న సంఘపెద్దలు 80 ఏళ్ల వయసుకు చేరుకున్నప్పుడు ఆ నియామకాల్ని యౌవన సంఘపెద్దలకు అప్పగించాల్సి ఉంటుంది. మరి ఈ మార్పుకు వృద్ధ సంఘపెద్దలు ఎలా స్పందించారు? వాళ్లు యెహోవాపట్ల, ఆయన సంస్థపట్ల విశ్వసనీయత చూపించారు!

దాదాపు 49 ఏళ్లు బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా సేవచేసిన కెన్‌ ఇలా అంటున్నాడు, “ఆ నిర్ణయంతో నేను ఏకీభవించాను. దానిగురించి తెలిసిన రోజే, సమన్వయకర్తగా సేవచేయడానికి ఒక యౌవన సహోదరుడు కావాలని యెహోవాకు ప్రార్థించాను.” ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమైన వృద్ధ సహోదరులు కెన్‌లాగే భావిస్తున్నారు. నిజమే, తమ సహోదరులకు సేవ చేయడమంటే వాళ్లకు ఇష్టం కాబట్టి మొదట్లో వాళ్లు కాస్త నిరుత్సాహపడ్డారు.

పెద్దల సభ సమన్వయకర్తగా సేవచేసిన ఎస్పరాండీయూ ఇలా అన్నాడు, “నాకు కాస్త బాధనిపించింది. కానీ నా ఆరోగ్యం క్షీణిస్తోంది కాబట్టి దానిగురించి శ్రద్ధ తీసుకోవడానికి ఎక్కువ సమయం కావాలని నాకు అర్థమైంది.” ఇప్పుడు ఆ సహోదరుడు యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతూ, తన సంఘానికి ఒక దీవెనగా ఉన్నాడు.

ఎంతోకాలంపాటు ప్రాంతీయ పర్యవేక్షకులుగా సేవచేసి, ఇప్పుడు వేరే నియామకాల్లో ఉన్న సహోదరుల సంగతేంటి? 38 ఏళ్ల పాటు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేసిన అలన్‌ ఇలా అంటున్నాడు, “దానిగురించి తెలిసినప్పుడు నేను అవాక్కయ్యాను.” కానీ, యౌవన సహోదరులకు శిక్షణ ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించి, అలన్‌ యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతున్నాడు.

తాను, తన భార్య మొదట్లో కాస్త నిరుత్సాహపడ్డామని 40 ఏళ్లు ప్రాంతీయ పర్యవేక్షకునిగా, బైబిలు పాఠశాలల ఉపదేశకునిగా సేవచేసిన రస్సెల్‌ చెప్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, “మా నియామకం అంటే మాకు చాలా ఇష్టం. దానిలో కొనసాగడానికి కావాల్సిన శక్తి మాకు ఉందని అనుకున్నాం.” ఇప్పుడు రస్సెల్‌, ఆయన భార్య తాము పొందిన శిక్షణను, అనుభవాన్ని ఉపయోగించి స్థానిక సంఘానికి సహాయం చేస్తున్నారు. అక్కడి ప్రచారకులు కూడా వాళ్లనుండి ఎంతో ప్రయోజనం పొందుతున్నారు.

ఆ సహోదరులకు అనిపించినట్లు మీకు అనిపించకపోయినా, వాళ్ల భావాల్ని అర్థంచేసుకోవడానికి రెండో సమూయేలులోని ఒక వృత్తాంతం మీకు సహాయం చేస్తుంది.

అణకువ, సహేతుకత చూపించిన వ్యక్తి

అబ్షాలోము తన తండ్రైన దావీదు రాజుపై తిరుగుబాటు చేసిన సందర్భం గురించి ఆలోచించండి. అప్పుడు దావీదు యెరూషలేము నుండి యొర్దాను నదికి తూర్పున ఉన్న మహనయీముకు పారిపోయాడు. అక్కడ దావీదుకు, ఆయనతో ఉన్నవాళ్లకు కొన్ని నిత్యావసర వస్తువులు అవసరమయ్యాయి. అప్పుడు ఏం జరిగింది?

ఆ ప్రాంతంలోని ముగ్గురు వ్యక్తులు దావీదు కోసం, ఆయనతో ఉన్నవాళ్ల కోసం పరుపులను, రకరకాల ఆహార పదార్థాలను, అవసరమైన పాత్రలను ఎంతో ఉదారంగా తీసుకొచ్చారు. ఆ ముగ్గురిలో బర్జిల్లయి ఒకడు. (2 సమూ. 17:27-29) అబ్షాలోము తిరుగుబాటును ఆపేయడంతో, దావీదు యెరూషలేముకు తిరిగి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు బర్జిల్లయి దావీదును యొర్దాను వరకు సాగనంపాడు. బర్జిల్లయిని యెరూషలేముకు రమ్మని, అక్కడ తనకు ఆహారం ఏర్పాటు చేస్తానని దావీదు బ్రతిమాలాడు. నిజానికి, బర్జిల్లయి “అధిక ఐశ్వర్యవంతుడు” కాబట్టి రాజు ఏర్పాటు చేసే ఆహారం ఆయనకు అవసరంలేదు. (2 సమూ. 19:31-33) బహుశా బర్జిల్లయిలో ఉన్న లక్షణాలు, ఆయన ఇచ్చే మంచి సలహాలు తనకు ఉపయోగపడతాయని దావీదు అనుకొనివుంటాడు. రాజభవనంలో ఉంటూ, అక్కడ పనిచేయడం బర్జిల్లయికి నిజంగా ఒక గొప్ప అవకాశం!

బర్జిల్లయి అణకువతో, సహేతుకతతో తాను 80 ఏళ్ల వృద్ధుణ్ణని చెప్పాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, ‘నేను మంచి చెడుల తేడాను గుర్తుపట్టగలనా?’ (2 సమూ. 19:35, NW) అలా అనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? బర్జిల్లయి తన జీవిత కాలమంతటిలో ఎంతో తెలివిని సంపాదించివుంటాడు. ఆయన ఈ వయసులో కూడా మంచి సలహాలు ఇవ్వగలడు. ఎందుకంటే ఆ తర్వాతి కాలాల్లో, రాజైన రెహబాముకు కూడా కొంతమంది “పెద్దలు” సలహా ఇచ్చారు. (1 రాజు. 12:6, 7; కీర్త. 92:12, 13, 15; సామె. 16:31) బర్జిల్లయి ‘మంచి చెడుల తేడాను గుర్తుపట్టగలనా’ అని అన్నప్పుడు, వయసు పైబడడంవల్ల వచ్చే శారీరక పరిమితుల గురించి మాట్లాడుతుండవచ్చు. అప్పటికే వృద్ధాప్యంవల్ల తనకు సరిగ్గా రుచి తెలియడంలేదని, సరిగ్గా వినిపించడం లేదని ఆయన చెప్పాడు. (ప్రసం. 12:4, 5) అంతేకాదు, యువకుడైన కింహామును యెరూషలేముకు తీసుకెళ్లమని స్వయంగా బర్జిల్లయే దావీదును బ్రతిమాలాడు. బహుశా కింహాము బర్జిల్లయి కొడుకు అయ్యుండవచ్చు.—2 సమూ. 19:36-40.

భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం

సంస్థ బర్జిల్లయి ఉదాహరణను బట్టి, మొదట్లో పేర్కొన్న ఆ మార్పు చేసింది. అయితే మన కాలంలో, కేవలం ఒక్క వ్యక్తి గురించి కాకుండా బర్జిల్లయిలాంటి పరిస్థితిలో ఉండి నమ్మకంగా సేవచేస్తున్న వృద్ధులందరి గురించి ఆలోచించాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి సంఘ పెద్దలందరికీ ఏది ఉత్తమమో సహేతుకంగా ఆలోచించాల్సి ఉంది.

తాము ఎంతోకాలంగా చేస్తున్న నియామకాల్ని యౌవన సహోదరులకు అప్పగిస్తే యెహోవా సంస్థ మరింత అభివృద్ధి సాధిస్తుందని అణకువగల వృద్ధ సంఘపెద్దలు గుర్తించారు. బహుశా బర్జిల్లయి తన కొడుకుకు, అలాగే అపొస్తలుడైన పౌలు తిమోతికి శిక్షణ ఇచ్చినట్టే, నేడు చాలావరకు వృద్ధ సహోదరులే యౌవన సహోదరులకు శిక్షణ ఇస్తున్నారు. (1 కొరిం. 4:17; ఫిలి. 2:20-22) ఇప్పుడు ఆ యౌవన సహోదరులు తాము ‘మనుషుల్లో వరాలుగా’ నిరూపించుకుంటున్నారు, “క్రీస్తు శరీరాన్ని బలపర్చడానికి” సహాయం చేస్తున్నారు.—ఎఫె. 4:8-12; సంఖ్యాకాండము 11:16, 17, 29 పోల్చండి.

సేవ చేయడానికి వేర్వేరు అవకాశాలు ఉన్నాయి

ప్రపంచవ్యాప్తంగా, యౌవనులకు బాధ్యతల్ని అప్పగించిన చాలామంది వృద్ధ సహోదరులు ఇప్పుడు కొత్త బాధ్యతల్ని చేపడుతున్నారు, లేదా వేరే విధాలుగా తమ సేవను విస్తృతం చేసుకుంటున్నారు.

19 ఏళ్లు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేసిన మార్కో ఇలా అంటున్నాడు, “నా పరిస్థితులు మారాయి కాబట్టి, ఇప్పుడు మా సంఘంలోని సహోదరీల అవిశ్వాస భర్తలను ఎక్కువగా కలుస్తున్నాను.”

28 ఏళ్లు ప్రాంతీయ సేవచేసిన జరాల్డూ ఏమంటున్నాడంటే, “నిష్క్రియుల్ని కలవడం, ఎక్కువ బైబిలు స్టడీలు చేయడం వంటి కొత్త లక్ష్యాల్ని మేము పెట్టుకున్నాం.” తాను, తన భార్య 15 బైబిలు స్టడీలు చేస్తున్నామని, నిష్క్రియుల్లో చాలామంది ఇప్పుడు మీటింగ్స్‌కు వస్తున్నారని జరాల్డూ చెప్తున్నాడు.

ఇంతకుముందు ప్రస్తావించిన అలన్‌ ఇలా అంటున్నాడు, “మేము ఇప్పుడు చాలా పద్ధతుల్లో పరిచర్య చేయగలుగుతున్నాం. బహిరంగ సాక్ష్యం చేస్తున్నాం, వ్యాపార క్షేత్రంలో ప్రకటిస్తున్నాం, మా పొరుగువాళ్లకు సాక్ష్యమిస్తున్నాం. వాళ్లలో ఇద్దరు రాజ్యమందిరానికి కూడా వచ్చారు.”

వృద్ధులైన మీరు మీ సామర్థ్యానికి తగ్గట్టు ఒక కొత్త నియామకం పొందివుండవచ్చు. ఇప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన విధానంలో ఇతరులకు సహాయం చేయవచ్చు. వెలకట్టలేని మీ అనుభవాన్ని సంఘంలోని యువకులతో పంచుకుంటూ యెహోవా పనికి మద్దతివ్వవచ్చు. పైన ప్రస్తావించిన రస్సెల్‌ ఇలా అంటున్నాడు: “నైపుణ్యమున్న యౌవనులకు యెహోవా శిక్షణ ఇస్తున్నాడు, వాళ్లను ఉపయోగించుకుంటున్నాడు. వాళ్లు ఉత్సాహంగా చేసే ప్రసంగాల నుండి, కాపరి సందర్శనాల నుండి సహోదర సహోదరీలందరూ ప్రయోజనం పొందుతున్నారు!”—“తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా యౌవన సహోదరులకు సహాయం చేయండి” అనే బాక్సు చూడండి.

మీ విశ్వసనీయతను యెహోవా విలువైనదిగా చూస్తాడు

మీరు ఈ మధ్యే వేరే నియామకంలో అడుగుపెట్టి ఉంటే, సానుకూలంగా ఉండండి. ఇప్పటికే మీరు మనస్ఫూర్తిగా చేసిన సేవ ఎంతోమందికి సహాయం చేసింది, ఇకమీదట కూడా చేస్తుంది. మీరు ఎంతోమంది ప్రేమను పొందారు, ఇకమీదట కూడా ఖచ్చితంగా పొందుతారు.

మరిముఖ్యంగా, మీరు యెహోవా హృదయంలో శాశ్వతంగా ఒక చోటు సంపాదించుకున్నారు. “మీరు పవిత్రులకు సేవచేశారు, ఇంకా చేస్తున్నారు. అలా మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను దేవుడు మర్చిపోడు.” (హెబ్రీ. 6:10) గతంలో చేసినవాటికే కాకుండా, ఇంకా చేస్తున్నవాటికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని ఆ లేఖనం అభయమిస్తుంది. ఆయన్ని సంతోషపెట్టడానికి మీరు గతంలో చేసిన కృషిని, ఇప్పుడు చేస్తున్న కృషిని యెహోవా మర్చిపోడు, ఎందుకంటే మీరు యెహోవాకు ఎంతో విలువైనవాళ్లు!

ఒకవేళ మీరు వృద్ధ సహోదరులు కాకపోతే, మీ నియామకంలో ఏ మార్పూ లేకపోతే, అప్పుడేంటి? ఈ సమాచారం మీకు కూడా ఉపయోగపడుతుంది. ఏ విధంగా?

ప్రస్తుతం వేరే నియామకం చేస్తున్న నమ్మకమైన వృద్ధ సహోదరుడు ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే, ఆయన సాధించిన పరిణతి నుండి, అనుభవం నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. ఆయన సలహాల్ని, సూచనల్ని తీసుకోండి. ఆయన తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ప్రస్తుత నియామకంలో ఎలా నమ్మకంగా కొనసాగుతున్నాడో గమనించండి.

మీరు వేరే నియామకంలో సేవచేస్తున్న వృద్ధ సహోదరులు అయ్యుండవచ్చు లేదా వాళ్లనుండి ప్రయోజనం పొందుతున్న సహోదరసహోదరీలు అయ్యుండవచ్చు. మీరు ఎవరైనప్పటికీ, తనకు ఎంతోకాలంగా సేవచేసిన, ఇంకా చేస్తున్న వాళ్ల విశ్వసనీయతను యెహోవా విలువైనదిగా చూస్తాడని మర్చిపోకండి.