కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సంతోషంగల దేవుణ్ణి’ ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారు

‘సంతోషంగల దేవుణ్ణి’ ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారు

“యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.”—కీర్త. 144:15.

పాటలు: 44, 125

1. యెహోవాసాక్షులు ఎందుకు సంతోషంగా ఉంటారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

యెహోవాసాక్షులు సంతోషంగా ఉండే ప్రజలు. వాళ్లు మీటింగ్స్‌లో, సమావేశాల్లో, ఇతర సందర్భాల్లో కలుసుకున్నప్పుడు చక్కగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ ఉంటారు. వాళ్లు ఎందుకంత సంతోషంగా ఉంటారు? దానికి ముఖ్య కారణమేమిటంటే ‘సంతోషంగల దేవుడైన’ యెహోవా వాళ్లకు తెలుసు. వాళ్లు ఆయన్ని సేవిస్తారు, అనుకరించడానికి ప్రయత్నిస్తారు. (1 తిమో. 1:11; కీర్త. 16:11) యెహోవాయే సంతోషానికి మూలం. కాబట్టి మనం కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు అలా ఉండడానికి ఆయన మనకు ఎన్నో దయచేస్తున్నాడు.—ద్వితీ. 12:7; ప్రసం. 3:12, 13.

2, 3. (ఎ) సంతోషంగా ఉండడమంటే ఏంటి? (బి) సంతోషంగా ఉండడం ఈరోజుల్లో ఎందుకంత సులభం కాదు?

2 మరి మీ సంగతేంటి? మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండడమంటే ప్రశాంతంగా, సంతృప్తిగా, ఆనందంగా జీవించడమని అర్థం. యెహోవా చేత దీవించబడినవాళ్లు నిజంగా సంతోషంగా ఉండగలరని బైబిలు చెప్తుంది. కానీ ఈరోజుల్లో సంతోషంగా ఉండడం సులభం కాదు. ఎందుకు?

3 ఒత్తిడి కలిగించే సంఘటనలు, అంటే ఇష్టమైనవాళ్లు చనిపోవడం లేదా బహిష్కరించబడడం, వివాహం విచ్ఛిన్నం అవ్వడం, ఉద్యోగం పోవడం వంటివాటి వల్ల మన సంతోషాన్ని కోల్పోతాం. అంతేకాదు, చీటికిమాటికి గొడవలుపడడం వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువైనప్పుడు, తోటి ఉద్యోగస్థులు లేదా విద్యార్థులు ఎగతాళి చేసినప్పుడు, యెహోవా సేవ చేస్తున్నందుకు హింసలు ఎదురైనప్పుడు లేదా జైలు పాలైనప్పుడు మనం సంతోషంగా ఉండలేం. వీటికి తోడు, మన ఆరోగ్యం పాడైనప్పుడు లేదా దీర్ఘకాల వ్యాధి వచ్చినప్పుడు, కృంగుదలతో బాధపడుతున్నప్పుడు కూడా మన సంతోషాన్ని కోల్పోతాం. కానీ “సంతోషంగల, శక్తిమంతుడైన” యేసుక్రీస్తు ప్రజలకు ఓదార్పును, సేదదీర్పును ఇచ్చాడని గుర్తుచేసుకోండి. (1 తిమో. 6:15; మత్త. 11:28-30) మనం సాతాను లోకంలో జీవిస్తున్నాం కాబట్టి చాలా సమస్యలు వస్తాయి. అయినప్పటికీ, సంతోషంగా ఉండడానికి సహాయపడే కొన్ని లక్షణాల గురించి యేసు కొండమీది ప్రసంగంలో చెప్పాడు.

యెహోవా లేకుండా మనం సంతోషంగా ఉండలేం

4, 5. సంతోషంగా ఉండాలంటే ఏ విషయాన్ని గుర్తించాలి? మన సంతోషం కలకాలం ఉండాలంటే ఏం చేయాలి?

4 కొండమీది ప్రసంగంలో యేసు చెప్పిన మొదటి విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఆయనిలా చెప్పాడు, “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.” (మత్త. 5:3) మనకు దేవుని నిర్దేశం ఎంత అవసరమో గుర్తించామని ఎలా చూపిస్తాం? బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా, ఆయనకు లోబడడం ద్వారా, మన జీవితంలో ఆయన ఆరాధనకు మొదటిస్థానం ఇవ్వడం ద్వారా చూపిస్తాం. అవన్నీ చేసినప్పుడు సంతోషంగా ఉంటాం, దేవుని వాగ్దానాలమీద మనకున్న విశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు బైబిల్లో ఉన్న “అద్భుత నిరీక్షణ” కూడా మనల్ని బలపరుస్తుంది.—తీతు 2:13.

5 మన సంతోషం కలకాలం ఉండాలంటే, యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చుకుంటూ ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఎప్పుడూ ప్రభువు విషయంలో సంతోషించండి. మళ్లీ చెప్తున్నాను, సంతోషించండి!” (ఫిలి. 4:4) యెహోవాకు సన్నిహిత స్నేహితులుగా ఉండాలంటే మనకు దేవుని జ్ఞానం అవసరం. బైబిలు ఇలా చెప్తుంది, “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.”—సామె. 3:13, 18.

6. మన సంతోషం కలకాలం ఉండాలంటే ఇంకా ఏం చేయాలి?

6 అయితే మన సంతోషం కలకాలం ఉండాలంటే ఇంకా ఏం చేయాలి? బైబిల్లో నేర్చుకున్న విషయాల్ని పాటిస్తూ ఉండాలి. అదెంత ముఖ్యమో యేసు చెప్పిన ఈ మాటల్నిబట్టి అర్థమౌతుంది: “మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి, వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు.” (యోహా. 13:17; యాకోబు 1:25 చదవండి.) మనం దేవుని నిర్దేశాన్ని పొందాలన్నా, మన సంతోషం కలకాలం ఉండాలన్నా నేర్చుకున్న విషయాల్ని పాటిస్తూ ఉండడం ప్రాముఖ్యం. కానీ సంతోషాన్ని దూరంచేసే సమస్యలు ఉన్నప్పటికీ మనమెలా సంతోషంగా ఉండవచ్చు? యేసు కొండమీది ప్రసంగంలో చెప్పిన తర్వాతి విషయాన్ని పరిశీలిద్దాం.

సంతోషంగా ఉండడానికి సహాయపడే లక్షణాలు

7. దుఃఖించేవాళ్లు సంతోషంగా ఎలా ఉంటారు?

7 “దుఃఖించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు ఓదార్చబడతారు.” (మత్త. 5:4) ‘దుఃఖించే వ్యక్తి ఎలా సంతోషంగా ఉంటాడు?’ అని మనం అనుకోవచ్చు. అయితే, దుఃఖించే ప్రతీ వ్యక్తి గురించి యేసు మాట్లాడట్లేదు. ఈ “చివరి రోజుల్లో” ఎదురయ్యే కష్టాల వల్ల చాలామంది చెడ్డవాళ్లు దుఃఖిస్తారు లేదా బాధపడతారు. (2 తిమో. 3:1) అలాంటివాళ్లు కేవలం తమ గురించే ఆలోచించుకుంటారు తప్ప యెహోవా గురించి ఆలోచించరు, ఆయనతో స్నేహాన్ని ఏర్పర్చుకోరు, ఫలితంగా సంతోషాన్ని పొందలేరు. అయితే యేసు ప్రస్తావించిన దుఃఖించే వాళ్లెవరంటే, దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించినవాళ్లు. చాలామంది దేవున్ని నిరాకరించడం, ఆయనకు నచ్చిన విధంగా జీవించకపోవడం చూసి వాళ్లు దుఃఖిస్తారు. అంతేకాదు వాళ్లు తమ పాపస్థితిని బట్టి, లోకంలో జరుగుతున్న ఘోరమైన సంఘటనల్ని బట్టి దుఃఖిస్తారు. అలాంటివాళ్లను యెహోవా గమనించి, తన వాక్యం ద్వారా వాళ్లకు ఊరటనిస్తాడు, వాళ్లకు సంతోషాన్ని, శాశ్వత జీవితాన్ని ఇస్తాడు.—యెహెజ్కేలు 5:11; 9:4 చదవండి.

8. సౌమ్యంగా ఉండడంవల్ల మీరెలా సంతోషంగా ఉండవచ్చు?

8 “సౌమ్యులు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు భూమికి వారసులౌతారు.” (మత్త. 5:5) సౌమ్యంగా ఉండడంవల్ల మీరెలా సంతోషంగా ఉండవచ్చు? చాలామంది దురుసుగా, కోపిష్ఠులుగా ప్రవర్తించి ఎన్నో సమస్యలు కొనితెచ్చుకున్నారు. కానీ సత్యం నేర్చుకున్నాక తమ ప్రవర్తనను మార్చుకొని, “కొత్త వ్యక్తిత్వాన్ని” అలవర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లు “వాత్సల్యంతో కూడిన ప్రేమను, కనికరాన్ని, దయను, వినయాన్ని, సౌమ్యతను, ఓర్పును” చూపిస్తున్నారు. (కొలొ. 3:9-12) ఫలితంగా వాళ్లు శాంతిగా, ఇతరులతో మంచి సంబంధాలు కలిగివుంటూ సంతోషంగా ఉంటున్నారు. అంతేకాదు వాళ్లు “భూమికి వారసులౌతారు” అని బైబిలు మాటిస్తుంది.—కీర్త. 37:8-10, 29.

9. (ఎ) సౌమ్యంగా ఉండేవాళ్లు “భూమికి వారసులౌతారు” అని అన్నప్పుడు యేసు ఉద్దేశమేమిటి? (బి) “నీతిని బలంగా కోరుకునేవాళ్లు సంతోషంగా ఉంటారు” అని ఎందుకు చెప్పవచ్చు?

9 సౌమ్యంగా ఉండేవాళ్లు “భూమికి వారసులౌతారు” అని అన్నప్పుడు యేసు ఉద్దేశమేమిటి? అభిషిక్తులు రాజులుగా, యాజకులుగా భూమిని పరిపాలించినప్పుడు వాళ్లు దానికి వారసులౌతారు. (ప్రక. 20:6) అయితే పరలోక నిరీక్షణలేని లక్షలమంది, భూమ్మీద శాశ్వతంగా జీవించే అవకాశాన్ని పొందినప్పుడు దానికి వారసులౌతారు. అప్పుడు వాళ్లు పరిపూర్ణతకు చేరుకుంటారు, శాంతి-సంతోషాల్ని అనుభవిస్తారు. “నీతిని బలంగా కోరుకునేవాళ్లు సంతోషంగా ఉంటారు” అని యేసు చెప్పిన వాళ్లలో భూనిరీక్షణగలవాళ్లు కూడా ఉన్నారు. (మత్త. 5:6) యెహోవా చెడుతనమంతటినీ తీసేసినప్పుడు నీతిని బలంగా కోరుకునేవాళ్లు తృప్తిపర్చబడతారు. (2 పేతు. 3:13) కొత్తలోకంలో చెడ్డవాళ్లు ఉండరు, చెడ్డపనులు ఉండవు కాబట్టి నీతిమంతులు సంతోషిస్తారు.—కీర్త. 37:17.

10. కరుణ చూపించడం అంటే ఏంటి?

10 “కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లమీద ఇతరులు కరుణ చూపిస్తారు.” (మత్త. 5:7) కరుణ చూపించడం అంటే బాధపడేవాళ్ల పట్ల ఆప్యాయతను, కనికరాన్ని, జాలిని చూపించడమని అర్థం. కరుణ కేవలం మనసులో కలిగే సున్నితమైన భావన కాదు. ఆ లక్షణం ఉంటే ఇతరులకు సహాయం చేస్తామని కూడా బైబిలు చెప్తుంది.

11. మంచి సమరయుడి ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

11 లూకా 10:30-37 చదవండి. కరుణ చూపించడం అంటే ఏంటో, యేసు చెప్పిన మంచి సమరయుడి ఉదాహరణ చక్కగా వర్ణిస్తుంది. బాధపడుతున్న వ్యక్తిని చూసినప్పుడు ఆ సమరయుడికి కనికరం, జాలి కలిగాయి. దాంతో ఆ వ్యక్తికి సహాయం చేశాడు. యేసు ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత ఇలా అన్నాడు, “నువ్వు కూడా వెళ్లి అలా చేయి.” కాబట్టి మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను ఆ సమరయుడు చేసినట్లే చేస్తున్నానా? ఎవరైనా బాధపడుతున్నప్పుడు వాళ్లకు ఏ విధంగా సహాయం చేయగలను? ఉదాహరణకు సంఘంలోని వృద్ధులకు, విధవరాళ్లకు, సత్యంలో ఒంటరిగా ఉన్న పిల్లలకు సహాయం చేయగలనా? “కృంగినవాళ్లతో ప్రోత్సాహకరంగా” మాట్లాడి, వాళ్లను ఓదార్చగలనా?’—1 థెస్స. 5:14; యాకో. 1:27.

ఇతరులకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నప్పుడు, మీరూ ఇతరులూ సంతోషంగా ఉంటారు (12వ పేరా చూడండి)

12. ఇతరులపట్ల కరుణ చూపించినప్పుడు మనమెందుకు సంతోషంగా ఉంటాం?

12 ఇతరులపట్ల కరుణ చూపించినప్పుడు మనమెందుకు సంతోషంగా ఉంటాం? ఒక కారణమేమిటంటే, ఇవ్వడంలో సంతోషం ఉంటుందని యేసు చెప్పాడు. మనం కరుణ చూపించినప్పుడు ఇతరులకు ఏదోఒకటి ఇస్తాం కాబట్టి సంతోషంగా ఉంటాం. ఇంకో కారణమేమిటంటే, అలా చేయడంవల్ల యెహోవాను సంతోషపెడతాం. (అపొ. 20:35; హెబ్రీయులు 13:16 చదవండి.) కరుణ చూపించేవాళ్ల గురించి చెప్తూ రాజైన దావీదు ఇలా అన్నాడు, “యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును.” (కీర్త. 41:1, 2) ఇతరులపట్ల కరుణ, కనికరం చూపిస్తే మనం కూడా యెహోవా కరుణను పొందుతాం, కలకాలం సంతోషంగా ఉంటాం.—యాకో. 2:13.

“స్వచ్ఛమైన హృదయం గలవాళ్లు” ఎందుకు సంతోషంగా ఉంటారు?

13, 14. “స్వచ్ఛమైన హృదయం” కలిగి ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

13 “స్వచ్ఛమైన హృదయం గలవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుణ్ణి చూస్తారు” అని యేసు అన్నాడు. (మత్త. 5:8) మన హృదయం స్వచ్ఛంగా ఉండాలంటే మన ఆలోచనలు, కోరికలు పవిత్రంగా ఉండాలి. యెహోవా మన ఆరాధనను అంగీకరించాలంటే అలా ఉండడం చాలా ప్రాముఖ్యం.—2 కొరింథీయులు 4:2 చదవండి; 1 తిమో. 1:5.

14 స్వచ్ఛమైన హృదయం గలవాళ్లు యెహోవాతో మంచి సంబంధం కలిగివుండవచ్చు. యెహోవా ఇలా అన్నాడు, “తమ వస్త్రాల్ని ఉతుక్కున్న వాళ్లు సంతోషంగా ఉంటారు.” (ప్రక. 22:14) దానర్థం ఏంటి? అభిషిక్తుల విషయంలోనైతే, యెహోవా వాళ్లను పవిత్రులుగా చూస్తాడని, పరలోకంలో అమర్త్యమైన జీవితాన్ని ఇస్తాడని, వాళ్లు కలకాలం సంతోషంగా ఉంటారని అర్థం. భూనిరీక్షణ ఉన్న గొప్పసమూహం విషయంలోనైతే, యెహోవా వాళ్లను నీతిమంతులుగా చూస్తాడని, తన స్నేహితులుగా ఉండే అవకాశాన్ని ఇస్తాడని అర్థం. వాళ్లు “గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెల్లగా చేసుకున్నారు” అని బైబిలు చెప్తుంది.—ప్రక. 7:9, 13, 14.

15, 16. స్వచ్ఛమైన హృదయం గలవాళ్లు ఎలా “దేవుణ్ణి చూస్తారు”?

15 “ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడు” అని యెహోవా అన్నాడు. (నిర్గ. 33:20) మరి స్వచ్ఛమైన హృదయం గలవాళ్లు ఎలా “దేవుణ్ణి చూస్తారు”? ఇక్కడ “చూస్తారు” అని అనువదించబడిన గ్రీకు పదానికి ఊహించుకోవడం, అర్థంచేసుకోవడం, తెలుసుకోవడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి ‘దేవుణ్ణి చూడడం’ అంటే ఆయన ఎలాంటివాడో అర్థంచేసుకోవడం, ఆయన లక్షణాలను ప్రేమించడం. (ఎఫె. 1:18) యేసు దేవుని లక్షణాలను పరిపూర్ణంగా అనుకరించాడు కాబట్టి ఆయనిలా చెప్పగలిగాడు, “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు.”—యోహా. 14:7-9.

16 మన జీవితంలో దేవుని సహాయాన్ని పొందినప్పుడు కూడా ‘దేవుణ్ణి చూస్తాం.’ (యోబు 42:5) అంతేకాదు స్వచ్ఛంగా ఉండేవాళ్లకు, తనకు నమ్మకంగా సేవచేసేవాళ్లకు అద్భుతమైన ఆశీర్వాదాల్ని ఇస్తానని యెహోవా మాటిచ్చాడు. ఆ ఆశీర్వాదాల మీద మనసుపెట్టడం ద్వారా కూడా మనం ‘దేవుణ్ణి చూస్తాం.’ అభిషిక్తులు పునరుత్థానమై పరలోకానికి వెళ్లినప్పుడు యెహోవాను నిజంగా చూస్తారు.—1 యోహా. 3:2.

సమస్యలు ఉన్నా సంతోషంగా ఉండవచ్చు

17. శాంతిని నెలకొల్పేవాళ్లు ఎందుకు సంతోషంగా ఉంటారు?

17 యేసు ఇంకా ఇలా అన్నాడు, “శాంతిని నెలకొల్పేవాళ్లు సంతోషంగా ఉంటారు.” (మత్త. 5:9) ఇతరులతో శాంతిగా ఉండడానికి చొరవ తీసుకున్నప్పుడు మనం సంతోషంగా ఉండవచ్చు. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు, “శాంతిగా ఉండేవాళ్లు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతారు. ఫలితంగా, వాళ్ల పనులు నీతిగా ఉంటాయి.” (యాకో. 3:18) కాబట్టి, సంఘంలో లేదా కుటుంబంలో ఎవరితోనైనా సర్దుకుపోవడం మీకు కష్టంగా ఉంటే, వాళ్లతో శాంతి నెలకొల్పుకునేలా సహాయం చేయమని యెహోవాను వేడుకోండి. అప్పుడు ఆయన మీకు పవిత్రశక్తిని ఇస్తాడు, ఫలితంగా మీరు క్రైస్తవ లక్షణాల్ని చూపించగలుగుతారు, మీ సంతోషం రెట్టింపు అవుతుంది. ఇతరులతో శాంతిని నెలకొల్పడానికి మనమే చొరవ తీసుకోవడం ఎంత ముఖ్యమో యేసు తెలియజేశాడు. ఆయనిలా చెప్పాడు: “కాబట్టి, నువ్వు బలిపీఠం దగ్గరకు నీ అర్పణను తెస్తున్నప్పుడు, నీ సోదరుడు నీవల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే, బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్లి, ముందు నీ సోదరునితో సఖ్యత కుదుర్చుకో; తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు.”—మత్త. 5:23, 24.

18, 19. హింసలు ఎదురైనా క్రైస్తవులు ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?

18 “మీరు నా శిష్యులనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ గురించి అబద్ధాలు చెప్తూ మీకు వ్యతిరేకంగా అన్నిరకాల చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు” అని యేసు చెప్పాడు. ఆ మాటలకు అర్థమేమిటి? తర్వాతి వచనంలో ఆయనిలా అన్నాడు, “పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం వేచివుంది కాబట్టి సంతోషించండి, ఎంతో ఆనందించండి; ఎందుకంటే వాళ్లు అంతకుముందు ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారు.” (మత్త. 5:11, 12) అపొస్తలులను కొట్టి, ప్రకటించొద్దని ఆజ్ఞాపించినప్పుడు వాళ్లు ‘సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు.’ తమను కొట్టినందుకు కాదుగానీ “యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం” దక్కినందుకు వాళ్లు సంతోషించారు.—అపొ. 5:41.

19 నేడు, యెహోవా ప్రజలు కూడా యేసు పేరు కోసం హింసలు అనుభవిస్తున్నందుకు సంతోషిస్తున్నారు. (యాకోబు 1:2-4 చదవండి.) అపొస్తలుల్లాగే మనం కూడా బాధలు, హింసలు ఎదురవ్వాలని కోరుకోం. కానీ యెహోవాకు నమ్మకంగా ఉంటే, వాటిని సహించడానికి కావాల్సిన ధైర్యాన్ని ఆయన మనకు ఇస్తాడు. సహోదరుడు హెన్రిక్‌ డోర్నిక్‌కు, వాళ్ల అన్నయ్యకు ఏం జరిగిందో పరిశీలించండి. 1944 ఆగస్టులో వాళ్లను కాన్‌సంట్రేషన్‌ క్యాంపుకు పంపించారు. ఆ సహోదరుల్ని హింసించినవాళ్లు ఇలా అన్నారు, “వాళ్లతో ఏదీ చేయించలేం. తమ మత విశ్వాసం కోసం ప్రాణాలర్పించడం వాళ్లకు సంతోషాన్నిస్తుంది.” హెన్రిక్‌ ఇలా వివరించాడు, “నేను హతసాక్షిని అవ్వాలని కోరుకోకపోయినా, యెహోవాపట్ల యథార్థంగా ఉండేందుకు ధైర్యంగా, గౌరవప్రదంగా బాధలు అనుభవించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఎడతెగక ప్రార్థన చేయడంవల్ల నేను యెహోవాకు దగ్గరయ్యాను, ఆయన నాకు నమ్మకంగా సహాయాన్ని అందించాడు.”

20. ‘సంతోషంగల దేవుడైన’ యెహోవాను ఆరాధిస్తున్నందుకు మనమెందుకు సంతోషంగా ఉంటాం?

20 ‘సంతోషంగల దేవుడైన’ యెహోవాకు ఇష్టమైన విధంగా జీవిస్తే హింస, కుటుంబ సభ్యుల వ్యతిరేకత, అనారోగ్యం, వృద్ధాప్యం వంటివి వచ్చినా మనం సంతోషంగా ఉండవచ్చు. (1 తిమో. 1:11) అంతేకాదు, “అబద్ధమాడలేని” యెహోవా మనకు ఎన్నో ఆశీర్వాదాల్ని ఇస్తానని మాటిచ్చాడు కాబట్టి మనం సంతోషంగా ఉండవచ్చు. (తీతు 1:2) ఆ వాగ్దానాలన్నీ నెరవేరినప్పుడు, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కష్టాలు కనీసం గుర్తుకు కూడా రావు. పరదైసులో జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, మనమెంత సంతోషంగా ఉంటామో మన ఊహకు అందదు! అవును, పరదైసులో మనం ‘బహు క్షేమము కలిగి సుఖిస్తాం.’—కీర్త. 37:11.