కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 39

‘ఇదిగో! ఒక గొప్పసమూహం’

‘ఇదిగో! ఒక గొప్పసమూహం’

‘ఇదిగో! ఏ మనిషీ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడి ఉంది.’—ప్రక. 7:9.

పాట 60 జీవాన్నిచ్చే సందేశం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మొదటి శతాబ్దం చివర్లో, అపొస్తలుడైన యోహాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు?

మొదటి శతాబ్దం చివర్లో, అపొస్తలుడైన యోహాను చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. అప్పటికే ఆయన వృద్ధుడు, పైగా పత్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాడు, బహుశా అపొస్తలుల్లో ఆయనొక్కడే ఇంకా బ్రతికివున్నాడు. (ప్రక. 1:9) వ్యతిరేకులు అబద్ధాలు బోధిస్తూ క్రైస్తవుల మధ్య విభజనలు సృష్టిస్తున్నారని ఆయనకు తెలిసింది. కొన్నిరోజులు పోతే ఇక నిజక్రైస్తవులే ఉండరేమో అనే పరిస్థితి తలెత్తింది.—యూదా 4; ప్రక. 2:15, 20; 3:1, 17.

తెల్లని బట్టలు వేసుకుని, చేతిలో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్న ‘ఒక గొప్పసమూహాన్ని’ అపొస్తలుడైన యోహాను చూశాడు. (2వ పేరా చూడండి)

2. ప్రకటన 7:9-14 ప్రకారం, యోహాను ఎలాంటి అద్భుతమైన దర్శనం చూశాడు? (ముఖచిత్రం చూడండి.)

2 అలాంటి కష్టమైన పరిస్థితుల మధ్య, భవిష్యత్తు గురించి దేవుడు యోహానుకు ఒక అద్భుతమైన దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో, దేవుని దాసులు చివరి ముద్ర పొందేవరకు నాశనకరమైన గాలుల్ని గట్టిగా పట్టుకొని ఉండమని ఒక దేవదూత మిగతా నలుగురు దేవదూతలకు చెప్పాడు. ఆ గాలులు మహాశ్రమను సూచిస్తున్నాయి. (ప్రక. 7:1-3) ఆ దాసుల గుంపులో 1,44,000 మంది ఉంటారు, వాళ్లు యేసుతోపాటు పరలోకంలో పరిపాలిస్తారు. (లూకా 12:32; ప్రక. 7:4) తర్వాత యోహాను ఇంకో గుంపు గురించి చెప్పాడు. ఆ గుంపు ఎంత పెద్దగా ఉందంటే, బహుశా ఆశ్చర్యం వల్ల ఆయన “ఇదిగో!” అంటూ మొదలుపెట్టాడు. ఇంతకీ యోహాను ఏం చూశాడు? ఆయనకు “ఏ మనిషీ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం కనిపించింది. వాళ్లు అన్ని దేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి వచ్చారు. వాళ్లు . . . ఆ సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడి ఉన్నారు.” (ప్రకటన 7:9-14 చదవండి.) భవిష్యత్తులో దేవున్ని సరైన విధంగా ఆరాధించేవాళ్లు చాలామంది ఉంటారని తెలుసుకుని యోహాను చాలా సంతోషించివుంటాడు!

3. (ఎ) యోహాను చూసిన దర్శనం మన విశ్వాసాన్ని ఎందుకు బలపర్చాలి? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?

3 ఆ దర్శనం చూసినప్పుడు యోహాను విశ్వాసం ఖచ్చితంగా బలపడివుంటుంది. అది మన విశ్వాసాన్ని కూడా ఎంతో బలపరుస్తుంది, ఎందుకంటే మనం ఆ దర్శనం నెరవేరుతున్న కాలంలో జీవిస్తున్నాం! మహాశ్రమను తప్పించుకుని భూమ్మీద ఎప్పటికీ జీవించాలని ఎదురుచూసే లక్షలాదిమంది సమకూర్చబడడం మనం చూశాం. ఆ గొప్పసమూహాన్ని గుర్తించడానికి సుమారు 80 సంవత్సరాల క్రితం యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేశాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అలాగే గొప్పసమూహం గురించి రెండు విషయాలు, అంటే (1) అది చాలా పెద్దదని, (2) దానిలోని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చూస్తాం. ఈ ఆర్టికల్‌ని పరిశీలించడం వల్ల, ఆశీర్వదించబడిన ఆ గుంపులో భాగంగా ఉన్న వాళ్లందరి విశ్వాసం బలపడుతుంది.

గొప్పసమూహంలోని వాళ్లు ఎక్కడ జీవిస్తారు?

4. క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది బైబిల్లోని ఏ సత్యాన్ని అర్థంచేసుకోలేదు? ఈ విషయంలో బైబిలు విద్యార్థులు ఎలా వేరుగా ఉన్నారు?

4 దేవునికి లోబడే ప్రజలు భవిష్యత్తులో ఇదే భూమ్మీద శాశ్వతంగా జీవిస్తారని బైబిలు చెప్తుంది. అయితే క్రైస్తవులమని చెప్పుకునే చాలామంది ఆ సత్యాన్ని ప్రజలకు బోధించరు. (2 కొరిం. 4:3, 4) చాలా చర్చీలు మంచివాళ్లు చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్తారని బోధిస్తున్నాయి. అయితే 1879లో కావలికోట పత్రికను ప్రచురించిన బైబిలు విద్యార్థుల చిన్న గుంపు అలా చేయలేదు. దేవుడు భూమిని మళ్లీ అందమైన తోటగా మారుస్తాడని, ఆయనకు లోబడే లక్షలమంది పరలోకంలో కాదుగానీ ఇదే భూమ్మీద జీవిస్తారని వాళ్లు అర్థంచేసుకున్నారు. అయితే, వాళ్లు ఎవరో స్పష్టంగా గుర్తించడానికి బైబిలు విద్యార్థులకు కొంత సమయం పట్టింది.—మత్త. 6:10.

5. బైబిలు విద్యార్థులు 1,44,000 మంది గురించి ఏం నమ్మేవాళ్లు?

5 ఆ బైబిలు విద్యార్థులు లేఖనాల్ని పరిశీలించి, ‘భూమ్మీది నుండి కొనబడిన’ కొంతమంది యేసుతోపాటు పరలోకంలో పరిపాలిస్తారని కూడా అర్థంచేసుకున్నారు. (ప్రక. 14:3) ఆ గుంపులో, దేవునికి భూమ్మీద నమ్మకంగా సేవచేసిన ఉత్సాహవంతులైన 1,44,000 మంది సమర్పిత క్రైస్తవులు ఉంటారు. మరి గొప్పసమూహం సంగతేంటి?

6. గొప్పసమూహం గురించి బైబిలు విద్యార్థులు ఏం నమ్మేవాళ్లు?

6 గొప్పసమూహం “సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు” నిలబడి ఉండడం యోహాను తన దర్శనంలో చూశాడు. (ప్రక. 7:9) కాబట్టి 1,44,000 మందిలాగే గొప్పసమూహం కూడా పరలోకానికి వెళ్తుందని బైబిలు విద్యార్థులు అనుకున్నారు. ఆ రెండు గుంపులూ పరలోకానికి వెళ్తే, మరి ఆ రెండిటికీ తేడా ఏంటి? భూమ్మీద ఉన్నప్పుడు దేవునికి పూర్తిస్థాయిలో లోబడనివాళ్లు గొప్పసమూహంలో ఉంటారని ఆ బైబిలు విద్యార్థులు అనుకున్నారు. వాళ్లు బైబిలు ప్రమాణాలు పాటిస్తున్నా, బహుశా వాళ్లలో కొందరు ఇంకా చర్చి సభ్యులుగానే కొనసాగివుంటారు. అలాంటివాళ్లు దేవుని సేవలో కొంతవరకు ఉత్సాహం చూపించినా, యేసుతోపాటు పరిపాలించడానికి కావాల్సినంత ఉత్సాహం చూపించరని బైబిలు విద్యార్థులు అనుకున్నారు. దేవుని మీద ప్రగాఢమైన ప్రేమ లేకపోవడం వల్ల గొప్పసమూహంలోని వాళ్లు పరలోకంలో సింహాసనం ముందు ఉండడానికి అర్హులౌతారు కానీ సింహాసనాల మీద మాత్రం కూర్చోరని వాళ్లు అనుకున్నారు.

7. వెయ్యేళ్ల పరిపాలన కాలంలో భూమ్మీద ఎవరు జీవిస్తారని బైబిలు విద్యార్థులు అనుకున్నారు? ప్రాచీన కాలంలోని నమ్మకమైన సేవకుల గురించి వాళ్లు ఏం నమ్మారు?

7 మరైతే భూమ్మీద ఎవరు జీవిస్తారు? 1,44,000 మంది, అలాగే గొప్పసమూహం పరలోకానికి సమకూర్చబడ్డాక, కోట్లాది ప్రజలు ఇదే భూమ్మీద నివసిస్తూ క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలోని ఆశీర్వాదాలు పొందుతారని బైబిలు విద్యార్థులు నమ్మారు. అయితే, ఆ కోట్లాది ప్రజలు క్రీస్తు పరిపాలన మొదలవ్వక ముందు యెహోవాను సేవించరని, బదులుగా వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో యెహోవా మార్గాల గురించి నేర్చుకుంటారని ఆ బైబిలు విద్యార్థులు అనుకున్నారు. అప్పుడు ఎవరైతే యెహోవా ప్రమాణాలు పాటిస్తారో వాళ్లు భూమ్మీద శాశ్వత జీవితం పొందుతారు, ఎవరైతే పాటించరో వాళ్లు నాశనం చేయబడతారు. ఆ సమయంలో భూమ్మీద ‘అధికారులుగా’ ఉండే కొంతమంది వెయ్యేళ్ల పరిపాలన చివర్లో పరలోకానికి వెళ్తారని కూడా బైబిలు విద్యార్థులు అనుకున్నారు. ఆ ‘అధికారుల్లో,’ పునరుత్థానమైన కొంతమంది “ప్రాచీనకాల అర్హులు” (క్రీస్తుకు ముందు చనిపోయిన నమ్మకమైన పురుషులు) కూడా ఉంటారని వాళ్లు నమ్మారు.—కీర్త. 45:16.

8. దేవుని సంకల్పంలో ఏ మూడు గుంపులవాళ్లు భాగంగా ఉన్నారని బైబిలు విద్యార్థులు అనుకున్నారు?

8 కాబట్టి, మొత్తం మూడు గుంపులవాళ్లు ఉన్నారని బైబిలు విద్యార్థులు అనుకున్నారు. వాళ్లెవరంటే, (1) యేసుతోపాటు పరలోకంలో పరిపాలించే 1,44,000 మంది; (2) పరలోకంలో “సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు నిలబడే” తక్కువ ఉత్సాహంగల క్రైస్తవుల గొప్పసమూహం; (3) క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన కాలంలో యెహోవా మార్గాల గురించి నేర్చుకునే కోట్లాది ప్రజలు. * అయితే సమయం వచ్చినప్పుడు, ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి యెహోవా వాళ్లకు సహాయం చేశాడు.—సామె. 4:18.

సత్యపు వెలుగు ఎక్కువైంది

1935లో జరిగిన సమావేశంలో, భూనిరీక్షణ ఉన్న చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు (9వ పేరా చూడండి)

9. (ఎ) గొప్పసమూహం ఏ భావంలో “సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు” నిలబడవచ్చు? (బి) ప్రకటన 7:9⁠లోని మాటల్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నామని ఎలా చెప్పవచ్చు?

9 యోహాను దర్శనంలో చూసిన గొప్పసమూహం ఎవరనేది 1935లో స్పష్టమైంది. “సింహాసనం ముందు, గొర్రెపిల్ల ముందు” నిలబడాలంటే గొప్పసమూహం అక్షరార్థంగా పరలోకంలో ఉండాల్సిన అవసరం లేదని, వాళ్లు సూచనార్థకంగా అలా నిలబడతారని యెహోవాసాక్షులు అర్థంచేసుకున్నారు. గొప్పసమూహం భూమ్మీదే జీవించినప్పటికీ యెహోవా అధికారాన్ని గుర్తించడం ద్వారా, ఆయన సర్వాధిపత్యానికి లోబడడం ద్వారా “సింహాసనం ముందు” నిలబడవచ్చు. (యెష. 66:1) అలాగే, యేసు విమోచనా క్రయధన బలి మీద విశ్వాసం చూపించడం ద్వారా వాళ్లు “గొర్రెపిల్ల ముందు” నిలబడవచ్చు. ఆ భావంలోనే మత్తయి 25:31, 32⁠లో “అన్నిదేశాల వాళ్లు,” చివరికి చెడ్డవాళ్లు కూడా, మహిమాన్విత సింహాసనం మీద కూర్చున్న యేసు “ముందు సమకూర్చబడతారు.” వాళ్లంతా పరలోకంలో కాదుగానీ భూమ్మీదే ఉన్నారని స్పష్టమౌతోంది. అవగాహనలో వచ్చిన ఈ మార్పు సరైనదని అనిపిస్తుంది. ఎందుకంటే, గొప్పసమూహం పరలోకానికి వెళ్తుందని బైబిలు చెప్పలేదు. కేవలం ఒక్క గుంపువాళ్లు మాత్రమే, అంటే 1,44,000 మంది మాత్రమే పరలోకంలో శాశ్వత జీవితం పొందుతారని, వాళ్లు యేసుతోపాటు “రాజులుగా ఈ భూమిని పరిపాలిస్తారు” అని వాగ్దానం చేయబడింది.—ప్రక. 5:10.

10. గొప్పసమూహంలోని వాళ్లు వెయ్యేళ్ల పరిపాలన కన్నా ముందే యెహోవా మార్గాలు ఎందుకు నేర్చుకొని ఉండాలి?

10 అలా, యోహాను దర్శనంలోని గొప్పసమూహంలో భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉన్న నమ్మకమైన క్రైస్తవులు ఉంటారని 1935 నుండి యెహోవాసాక్షులు అర్థంచేసుకున్నారు. గొప్పసమూహం మహాశ్రమను తప్పించుకోవాలంటే, వెయ్యేళ్ల పరిపాలన కన్నా ముందే యెహోవా మార్గాలు నేర్చుకొని ఉండాలి. ‘జరగాల్సిన వీటన్నిటినీ తప్పించుకోవాలంటే’ వాళ్లు క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనకు ముందే బలమైన విశ్వాసం చూపించాలి.—లూకా 21:34-36.

11. వెయ్యేళ్ల పరిపాలన చివర్లో కొంతమంది పరలోకానికి వెళ్తారని కొందరు బైబిలు విద్యార్థులు ఎందుకు అనుకొనివుంటారు?

11 మరి ఆదర్శవంతంగా ఉన్న కొంతమంది, వెయ్యేళ్ల పరిపాలన చివర్లో పరలోకానికి వెళ్తారనే అభిప్రాయం సంగతేంటి? ఆ అభిప్రాయం గురించి ద వాచ్‌ టవర్‌ 1913 ఫిబ్రవరి 15 సంచికలో వచ్చింది. ‘అంత నమ్మకంగా లేని క్రైస్తవులే పరలోకానికి వెళ్తున్నప్పుడు, ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన సేవకులు భూమ్మీదే ఎందుకు ఉంటారు?’ అని కొంతమంది ఆలోచించి ఉండవచ్చు. అయితే వాళ్ల అభిప్రాయం రెండు తప్పుడు నమ్మకాల మీద ఆధారపడివుంది. అవేంటంటే, (1) గొప్పసమూహం పరలోకానికి వెళ్తుంది, (2) గొప్పసమూహంలో తక్కువ ఉత్సాహం చూపించిన క్రైస్తవులు ఉంటారు.

12-13. తాము పొందే ప్రతిఫలం గురించి అభిషిక్త క్రైస్తవులు, గొప్పసమూహంలోని వాళ్లు ఏం గుర్తిస్తారు?

12 అయితే మనం ఇప్పటివరకు గమనించినట్టు, 1935 నుండి యెహోవాసాక్షులు ఒక విషయం స్పష్టంగా అర్థంచేసుకున్నారు. అదేంటంటే, యోహాను దర్శనంలో చూసిన గొప్పసమూహం అలాగే హార్‌మెగిద్దోన్‌ను తప్పించుకునే గుంపు రెండూ ఒక్కటే. వాళ్లు ఇదే భూమ్మీద “మహాశ్రమను దాటి” వస్తారు, ‘పెద్ద స్వరంతో “సింహాసనం మీద కూర్చున్న మన దేవుని నుండి, గొర్రెపిల్ల నుండి మా రక్షణ వస్తుంది” అని అంటూ ఉంటారు.’ (ప్రక. 7:10, 14) అంతేకాదు, పరలోకానికి పునరుత్థానమయ్యే వాళ్లు ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైన సేవకుల కన్నా “మెరుగైనదాన్ని” పొందుతారని లేఖనాలు చెప్తున్నాయి. (హెబ్రీ. 11:40) కాబట్టి మన సహోదరులు, భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణతో యెహోవాను సేవించేలా ప్రజల్ని ఉత్సాహంగా ఆహ్వానించడం మొదలుపెట్టారు.

13 గొప్పసమూహంలోని వాళ్లు తమ నిరీక్షణను బట్టి ఎంతో సంతోషిస్తారు. నమ్మకమైన తన ఆరాధకులు తనను పరలోకంలో సేవించాలా, భూమ్మీద సేవించాలా అనేది యెహోవాయే నిర్ణయిస్తాడని వాళ్లు అర్థంచేసుకుంటారు. యేసుక్రీస్తు విమోచన క్రయధనం ద్వారా యెహోవా చూపించిన అపారదయ వల్లే తమకు ప్రతిఫలం వస్తుందని అభిషిక్త క్రైస్తవులు, అలాగే గొప్పసమూహంలోని వాళ్లు గుర్తిస్తారు.—రోమా. 3:24.

చాలా పెద్దది

14. గొప్పసమూహానికి సంబంధించిన ప్రవచన నెరవేర్పు గురించి 1935 తర్వాత యెహోవా ప్రజల్లో చాలామంది ఏమనుకున్నారు? ఎందుకు?

14 యెహోవా ప్రజల అవగాహన 1935లో మారిన తర్వాత కూడా వాళ్లలో చాలామంది, భూనిరీక్షణ ఉన్నవాళ్లు ఎలా ఒక “గొప్ప” సమూహంగా తయారౌతారని అనుకునేవాళ్లు. ఉదాహరణకు, గొప్పసమూహం ఎవరో స్పష్టమయ్యే సమయానికి రానల్డ్‌ పార్కింగ్‌కి 12 ఏళ్లు. ఆయన ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 56,000 మంది ప్రచారకులు ఉండేవాళ్లు, పైగా వాళ్లలో చాలామంది బహుశా అభిషిక్తులే. కాబట్టి గొప్పసమూహంలో ఎక్కువమంది లేనట్టే అనిపించింది.”

15. గొప్పసమూహాన్ని సమకూర్చే పని ఎలా ముందుకుసాగింది?

15 అయితే తర్వాతి సంవత్సరాల్లో చాలా దేశాలకు మిషనరీల్ని పంపడంతో యెహోవాసాక్షుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1968లో, నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం ఉపయోగించి యెహోవాసాక్షులు ప్రజలతో బైబిలు అధ్యయనాలు చేయడం మొదలుపెట్టారు. ఆ పుస్తకం, బైబిల్లోని సత్యాల్ని సరళంగా వివరించింది కాబట్టి చాలామంది యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు. నాలుగేళ్లలో 5 లక్షల కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకుని శిష్యులయ్యారు. లాటిన్‌ అమెరికాలో, ఇతర దేశాల్లో క్యాథలిక్‌ చర్చి ప్రభావం తగ్గిపోవడం వల్ల; అలాగే తూర్పు ఐరోపాలో, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మన పని మీదున్న ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ఇంకా లక్షలమంది బాప్తిస్మం తీసుకున్నారు. (యెష. 60:22) ఇటీవలి సంవత్సరాల్లో బైబిలు బోధించే విషయాల్ని ప్రజలకు నేర్పించడానికి యెహోవా సంస్థ ఎన్నో చక్కని పనిముట్లను తయారుచేసింది. నిజంగానే ఒక గొప్పసమూహం సమకూర్చబడింది, ఇప్పుడు వాళ్లు 80 లక్షల కన్నా ఎక్కువమంది ఉన్నారు!

ప్రపంచవ్యాప్తంగా ఉంటారు

16. గొప్పసమూహంలో ఎవరెవరు ఉన్నారు?

16 యోహాను తన దర్శనాన్ని రాస్తున్నప్పుడు, గొప్పసమూహంలోని ప్రజలు “అన్ని దేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి వచ్చారు” అన్నాడు. అంతకుముందు, జెకర్యా ప్రవక్త కూడా భవిష్యత్తు గురించి అలాంటి మాటలే రాశాడు. ఆయన, “ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు” అని రాశాడు.—జెక. 8:23.

17. అన్నిదేశాల, భాషల ప్రజలకు ప్రకటించడానికి యెహోవా ప్రజలు ఏం చేస్తున్నారు?

17 అన్ని భాషల ప్రజల్ని సమకూర్చాలంటే, మంచివార్తను చాలా భాషల్లో ప్రకటించాలని యెహోవాసాక్షులు అర్థంచేసుకున్నారు. అందుకే 130 కన్నా ఎక్కువ సంవత్సరాల నుండి, బైబిల్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించే సమాచారాన్ని అనువదిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో, ముందెన్నడూ లేనంత భారీస్థాయిలో వందల భాషల్లోకి అనువదిస్తున్నారు. అన్నిదేశాల ప్రజల్లో నుండి గొప్పసమూహాన్ని సమకూర్చడం ద్వారా యెహోవా ఇప్పుడు ఒక అద్భుతమే చేస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆహారం చాలా భాషల్లో అందుబాటులో ఉండడంవల్ల, గొప్పసమూహంలోని వాళ్లు వేర్వేరు దేశాల నుండి వచ్చినా ఐక్యంగా యెహోవాను ఆరాధిస్తున్నారు. అంతేకాదు వాళ్లు ఉత్సాహంగా ప్రకటిస్తారని, ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకుంటారని చాలామందికి తెలుసు. అది ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బలపరుస్తుంది!—మత్త. 24:14; యోహా. 13:35.

ఆ దర్శనం మనకెందుకు ప్రాముఖ్యం?

18. (ఎ) యెషయా 46:10, 11 ప్రకారం, గొప్పసమూహం గురించిన ప్రవచనాన్ని యెహోవా అద్భుతంగా నెరవేర్చడం చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోం? (బి) గొప్పసమూహంలోని వాళ్లు తాము పరలోకానికి వెళ్లట్లేదని ఎందుకు బాధపడరు?

18 గొప్పసమూహం గురించిన ప్రవచనం మనకెంతో సంతోషాన్నిస్తుంది! ఆ ప్రవచనాన్ని యెహోవా ఇంత అద్భుతంగా నెరవేర్చడం చూసి మనం ఆశ్చర్యపోం. (యెషయా 46:10, 11 చదవండి.) యెహోవా తమకు ఇచ్చిన నిరీక్షణను బట్టి గొప్పసమూహంలోని వాళ్లు చాలా కృతజ్ఞతతో ఉంటారు. యేసుతోపాటు పరలోకంలో సేవచేసేలా యెహోవా తమను పవిత్రశక్తితో అభిషేకించలేదని వాళ్లు బాధపడరు. పవిత్రశక్తితో నిర్దేశించబడిన నమ్మకమైన స్త్రీపురుషుల గురించి మనం బైబిలంతటా చదువుతాం, కానీ వాళ్లు 1,44,000 మందిలో భాగం కాదు. అందుకు ఒక ఉదాహరణ, బాప్తిస్మమిచ్చే యోహాను. (మత్త. 11:11) ఇంకొక ఉదాహరణ, దావీదు. (అపొ. 2:34) వాళ్లూ, అలాగే లెక్కలేనంతమంది ఇతరులు పరదైసుగా మారే భూమ్మీద జీవించడానికి పునరుత్థానం చేయబడతారు. యెహోవాకు, ఆయన సర్వాధిపత్యానికి విశ్వసనీయంగా ఉన్నామని చూపించే అవకాశం వాళ్లకు, అలాగే గొప్పసమూహానికి ఉంటుంది.

19. గొప్పసమూహం గురించి యోహాను చూసిన దర్శనం మనకాలంలో నెరవేరుతోందని గుర్తించినప్పుడు మనం ఏం చేస్తాం?

19 ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా, యెహోవా అన్ని దేశాలకు చెందిన లక్షలాది ప్రజల్ని ఐక్యం చేస్తున్నాడు. మనం పరలోకంలో జీవించాలని ఎదురుచూస్తున్నా లేక భూమ్మీద జీవించాలని ఎదురుచూస్తున్నా, ‘వేరే గొర్రెలకు’ చెందిన గొప్పసమూహంలో భాగమయ్యేలా వీలైనంత ఎక్కువమందికి సహాయం చేయాలి. (యోహా. 10:16) మనుషుల్ని ఎంతో బాధపెట్టిన ప్రభుత్వాల్ని, మతాల్ని నాశనంచేసే మహాశ్రమను యెహోవా త్వరలోనే రప్పిస్తాడు. గొప్పసమూహంలోని వాళ్లందరికీ ఇదే భూమ్మీద జీవిస్తూ యెహోవాను ఎప్పటికీ సేవించే సాటిలేని గొప్ప అవకాశం ఉంది!—ప్రక. 7:14.

పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!

^ పేరా 5 భవిష్యత్తులో “ఒక గొప్పసమూహం” సమకూర్చబడడం గురించి యోహాను చూసిన దర్శనాన్ని ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. ఆశీర్వదించబడిన ఆ గుంపులోని వాళ్లందరి విశ్వాసాన్ని ఈ ఆర్టికల్‌ ఖచ్చితంగా బలపరుస్తుంది.