కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 38

“నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను”

“నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను”

“భారం మోస్తూ అలసిపోయిన మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను.”—మత్త. 11:28.

పాట 17 “నాకు ఇష్టమే”

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మత్తయి 11:28-30 లో యేసు ఏ వాగ్దానం చేశాడు?

తన మాటల్ని వింటున్న ప్రజలతో యేసు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు. ఆయనిలా అన్నాడు, “నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను.” (మత్తయి 11:28-30 చదవండి.) ఆయన ఆ మాటలు ఊరికే చెప్పలేదు. ఉదాహరణకు, తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న ఒక స్త్రీకి ఆయన ఏం చేశాడో ఆలోచించండి.

2. జబ్బుతో బాధపడుతున్న స్త్రీకి యేసు ఏం చేశాడు?

2 ఆ స్త్రీ చాలా దయనీయ స్థితిలో ఉంది. తన జబ్బు నయమౌతుందనే ఆశతో ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్లింది. 12 సంవత్సరాలు బాధ అనుభవించినా ఆమె జబ్బు నయం కాలేదు. ధర్మశాస్త్రం ప్రకారం ఆమె అపవిత్రురాలు. (లేవీ. 15:25) యేసు జబ్బుల్ని నయం చేయగలడని విని ఆమె ఆయన్ని వెతుక్కుంటూ వెళ్లింది. ఆయన కనిపించినప్పుడు, ఆయన పైవస్త్రపు అంచును ముట్టుకుంది, వెంటనే ఆమె జబ్బు నయమైంది! అయితే, యేసు కేవలం ఆమె జబ్బును తగ్గించడమే కాదు ఆమె తిరిగి గౌరవించబడేలా చేశాడు. ఉదాహరణకు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా “అమ్మా” అని సంబోధించాడు. అది ఖచ్చితంగా ఆమెకు సేదదీర్పును, బలాన్ని ఇచ్చివుంటుంది.—లూకా 8:43-48.

3. మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 ఆ స్త్రీ చొరవ తీసుకొని యేసు దగ్గరకు వెళ్లిందని గమనించండి. మనం కూడా అలాగే చేయాలి, యేసు దగ్గరకు వెళ్లడానికి మనమే కృషి చేయాలి. ప్రస్తుతం యేసు తన దగ్గరకు వచ్చేవాళ్ల జబ్బుల్ని అద్భుతరీతిలో నయం చేయడు. అయితే “నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను” అని ఇప్పటికీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆర్టికల్‌లో మనం ఐదు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. అవేంటంటే, మనం ‘యేసు దగ్గరకు’ ఎలా వెళ్లవచ్చు? ‘మీమీద నా కాడిని ఎత్తుకోండి’ అని అన్నప్పుడు యేసు భావమేమిటి? ఆయన నుండి మనమేం నేర్చుకోవచ్చు? ఆయన అప్పగించిన పని మనకు ఎందుకు సేదదీర్పునిస్తుంది? ఆయన కాడి కింద సేదదీర్పు పొందుతూ ఉండాలంటే మనమేం చేయాలి?

“నా దగ్గరికి రండి”

4-5. మనం ‘యేసు దగ్గరకు’ వెళ్లడానికి కొన్ని మార్గాలు ఏంటి?

4 మనం ‘యేసు దగ్గరకు’ వెళ్లడానికి ఒక మార్గం ఏంటంటే ఆయన చెప్పిన, చేసిన వాటి గురించి వీలైనంత ఎక్కువ నేర్చుకోవడం. (లూకా 1:1-4) యేసు గురించి బైబిలు చెప్తున్న విషయాల్ని మనమే స్వయంగా అధ్యయనం చేయాలి, మనకోసం వేరేవాళ్లు దాన్ని చేయలేరు. అలాగే, మనం బాప్తిస్మం తీసుకొని క్రీస్తు శిష్యులు అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ‘యేసు దగ్గరకు’ వెళ్తాం.

5 మనం ‘యేసు దగ్గరకు’ వెళ్లడానికి మరో మార్గం ఏంటంటే, సహాయం అవసరమైనప్పుడు సంఘపెద్దల్ని సమీపించడం. ఈ సంఘపెద్దలు ‘మనుషుల్లో వరాలుగా’ ఉన్నారు, తన గొర్రెల్ని చూసుకునే పనిని యేసు వాళ్లకు అప్పగించాడు. (ఎఫె. 4:7, 8, 11; యోహా. 21:16; 1 పేతు. 5:1-3) వాళ్లను సహాయం అడగడానికి మనమే చొరవ తీసుకోవాలి. పెద్దలు మన మనసును చదివి మనకేం అవసరమో తెలుసుకోవాలని ఎదురుచూడలేం. జూల్యన్‌ అనే సహోదరుడు ఏం చెప్తున్నాడంటే, “నా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను బెతెల్‌ సేవ విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పుడు నా స్నేహితుడు ఒకతను, కాపరి సందర్శనం కోసం పెద్దల్ని అడగమని సలహా ఇచ్చాడు. ముందు అది నాకు అవసరం లేదని అనుకున్నాను, కానీ తర్వాత అడిగాను. ఆ సందర్శనం నాకొక గొప్ప బహుమతిగా మిగిలిపోయింది.” జూల్యన్‌ను సందర్శించిన ఇద్దరు పెద్దల్లాగే నమ్మకమైన పెద్దలు ‘క్రీస్తు మనసును’ తెలుసుకోవడానికి అంటే ఆయన ఆలోచనా విధానాన్ని, మనస్తత్వాన్ని అర్థంచేసుకోవడానికి, అనుకరించడానికి మనకు సహాయం చేస్తారు. (1 కొరిం. 2:16; 1 పేతు. 2:21) అది వాళ్లు ఇవ్వగల ఒక గొప్ప బహుమతి.

‘మీమీద నా కాడిని ఎత్తుకోండి’

6. ‘మీమీద నా కాడిని ఎత్తుకోండి’ అని అన్నప్పుడు యేసు భావం ఏంటి?

6 ‘మీమీద నా కాడిని ఎత్తుకోండి’ అని యేసు అన్నప్పుడు “నా అధికారాన్ని అంగీకరించండి” లేదా “నాతోపాటు నా కాడి కిందకు రండి, మనం కలిసి యెహోవా కోసం పనిచేద్దాం” అని ఆయన భావం కావచ్చు. ఏదేమైనా, కాడి అనే పదం మనం పనిచేయాలని చెప్తుంది.

7. మత్తయి 28:18-20 ప్రకారం, మనకు ఏ పని ఉంది? మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

7 మన జీవితాల్ని యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసు ఆహ్వానాన్ని అంగీకరిస్తాం. యేసు అందర్నీ ఆహ్వానిస్తున్నాడు, దేవున్ని సేవించాలని నిజంగా కోరుకునే వాళ్లెవ్వర్నీ ఆయన కాదనడు. (యోహా. 6:37, 38) యెహోవా, యేసుకు అప్పగించిన పనిలో భాగం వహించే గొప్ప అవకాశం క్రీస్తు అనుచరులందరికీ ఉంది. ఆ పనిలో మనకు సహాయం చేయడానికి యేసు ఎల్లప్పుడూ మనతోపాటు ఉంటాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.—మత్తయి 28:18-20 చదవండి.

“నా దగ్గర నేర్చుకోండి”

యేసులా ఇతరులకు సేదదీర్పు ఇవ్వండి (8-11 పేరాలు చూడండి) *

8-9. వినయస్థులు యేసు దగ్గరకు రావడానికి ఎందుకు ఇష్టపడేవాళ్లు? మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

8 వినయస్థులు యేసు దగ్గరకు రావడానికి ఇష్టపడేవాళ్లు. (మత్త. 19:13, 14; లూకా 7:37, 38) ఎందుకు? యేసుకు, పరిసయ్యులకు మధ్య తేడా గమనించండి. ఆ మతనాయకులు ప్రజల్ని ద్వేషించేవాళ్లు, గర్వం చూపించేవాళ్లు. (మత్త. 12:9-14) యేసు మాత్రం ప్రజల్ని ప్రేమించేవాడు, వినయంగా ఉండేవాడు. పరిసయ్యులు పేరుప్రఖ్యాతుల కోసం ప్రాకులాడేవాళ్లు, సమాజంలో తమకున్న ఉన్నత స్థానాన్ని బట్టి గర్వించేవాళ్లు. కానీ యేసు పేరుప్రఖ్యాతులకు ప్రాముఖ్యత ఇవ్వొద్దని చెప్పాడు. అంతేకాదు వినయంగా ఉంటూ ఇతరులకు సేవ చేయమని తన శిష్యులకు నేర్పించాడు. (మత్త. 23:2, 6 -11) పరిసయ్యులు ఇతరుల్ని భయపెట్టి, బెదిరించి వాళ్లమీద పెత్తనం చెలాయించేవాళ్లు. (యోహా. 9:13, 22) అయితే యేసు ప్రేమ చూపిస్తూ, దయగా మాట్లాడుతూ ప్రజలకు సేదదీర్పును ఇచ్చేవాడు.

9 యేసు నుండి మీరు ఈ పాఠాలు నేర్చుకున్నారా? మీరిలా ప్రశ్నించుకోండి: ‘నాకు సౌమ్యుడు, వినయస్థుడు అనే పేరు ఉందా? ఇతరుల కోసం తక్కువస్థాయి పనులు చేయడానికి ఇష్టపడుతున్నానా? ఇతరులతో దయగా ఉంటున్నానా?’

10. యేసు ఎలాంటి వాతావరణాన్ని కల్పించాడు?

10 తనతోపాటు పనిచేసేవాళ్ల కోసం యేసు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాడు, వాళ్లకు సంతోషంగా శిక్షణ ఇచ్చాడు. (లూకా 10:1, 19-21) ప్రశ్నలు అడగమని ఆయన తన శిష్యుల్ని ప్రోత్సహించేవాడు, వాళ్ల అభిప్రాయాల్ని వినడానికి ఇష్టపడేవాడు. (మత్త. 16:13-16) దానివల్ల శిష్యులు, సురక్షితమైన ప్రాంతంలో ఉన్న మొక్కల్లా చక్కగా వర్ధిల్లారు. వాళ్లు యేసు బోధల్ని హృదయంలోకి తీసుకొని, మంచి పనులు చేయడం ద్వారా ఫలించారు.

ఇతరులు సమీపించేలా స్నేహపూర్వకంగా ఉండండి

చురుగ్గా, ఉత్సాహంగా ఉండండి

వినయంగా ఉండండి, కష్టపడి పనిచేయండి *

11. మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

11 ఇతరుల మీద మీకు కొంత అధికారం ఉందా? అలాగైతే ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నేను ఉద్యోగ స్థలంలో, ఇంట్లో ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తున్నాను? ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకుంటున్నానా? ప్రశ్నలు అడగమని ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నానా? వాళ్ల అభిప్రాయాల్ని వినడానికి ఇష్టపడుతున్నానా?’ మనం పరిసయ్యుల్లా ఉండాలని ఎన్నడూ కోరుకోం. ఆ పరిసయ్యులు ఎవరైనా తమను ప్రశ్నిస్తే వాళ్లమీద పగ పెట్టుకునేవాళ్లు, ఎవరికైనా వేరే అభిప్రాయం ఉంటే వాళ్లను హింసించేవాళ్లు.—మార్కు 3:1-6; యోహా. 9:29-34.

“మీరు సేదదీర్పు పొందుతారు”

12-14. యేసు అప్పగించిన పని ఎందుకు సేదదీర్పు ఇస్తుంది?

12 యేసు ఇచ్చిన పనిని చేసినప్పుడు మనం ఎందుకు సేదదీర్పు పొందుతాం? దానికి చాలా కారణాలు ఉన్నాయి, అయితే వాటిలో కొన్నిటిని చర్చిద్దాం.

13 మనకు చాలా మంచి పర్యవేక్షకులు ఉన్నారు. మన అత్యున్నత పర్యవేక్షకుడైన యెహోవా కృతజ్ఞత లేనివాడో క్రూరుడో కాదు. మనం చేసే పనిని ఆయన విలువైనదిగా చూస్తాడు. (హెబ్రీ. 6:10) మన బాధ్యతను నిర్వర్తించడానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తాడు. (2 కొరిం. 4:7; గల. 6:5, అధస్సూచి) మన రాజైన యేసు, తన ఆదర్శంతో మనల్ని నడిపిస్తాడు. (యోహా. 13:15) మనల్ని సంరక్షించే పెద్దలు, “గొప్ప కాపరియైన” యేసును అనుకరించడానికి ప్రయత్నిస్తారు. (హెబ్రీ. 13:20; 1 పేతు. 5:2) వాళ్లు మనకు బోధిస్తున్నప్పుడు, మనల్ని సంరక్షిస్తున్నప్పుడు దయగా, ప్రోత్సాహకరంగా, ధైర్యంగా ఉండడానికి శాయశక్తులా కృషిచేస్తారు.

14 మనకు చాలా మంచి స్నేహితులు ఉన్నారు. మనకున్న లాంటి ప్రేమగల స్నేహితులు, అర్థవంతమైన పని ఇంకెవ్వరికీ లేవు. దీని గురించి ఆలోచించండి: అత్యున్నత నైతిక ప్రమాణాలు పాటిస్తున్నా, తామే నీతిమంతులమని అనుకోనివాళ్లతో మనం కలిసి పనిచేస్తున్నాం. వాళ్లకు ఎంతో సామర్థ్యం ఉన్నప్పటికీ గొప్పలు చెప్పుకోరు, బదులుగా ఇతరుల్ని తమకన్నా గొప్పగా చూస్తారు. వాళ్లు మనల్ని కేవలం తోటిపనివాళ్లుగా కాదుగానీ స్నేహితులుగా చూస్తారు, ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమిస్తారు.

15. మన పని గురించి మనమెలా భావించాలి?

15 మనకు చాలా మంచి పని ఉంది. మనం ప్రజలకు యెహోవా గురించిన సత్యాన్ని బోధిస్తాం, అపవాది చెప్పే అబద్ధాల్ని బట్టబయలు చేస్తాం. (యోహా. 8:44) సాతాను నిరుత్సాహపర్చే అబద్ధాలు ఉపయోగించి ప్రజల్ని అణగదొక్కుతున్నాడు. ఉదాహరణకు, యెహోవా మన పాపాల్ని క్షమించడని, మనం ఆయన ప్రేమకు అర్హులం కాదనుకోవలని అతను కోరుకుంటున్నాడు. అవి ఎంత ఘోరమైన అబద్ధాలో కదా! మనం ‘యేసు దగ్గరకు’ వెళ్లినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. నిజానికి యెహోవా మనందర్నీ ఎంతో ప్రేమిస్తున్నాడు. (రోమా. 8:32, 38, 39) యెహోవా మీద ఆధారపడడం ప్రజలకు నేర్పించినప్పుడు, వాళ్లు తమ జీవితాల్ని మెరుగుపర్చుకోవడం చూసినప్పుడు మనకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా!

యేసు కాడి కింద సేదదీర్పు పొందుతూ ఉండండి

16. మనం మోయాల్సిన ఇతర బరువులకు, యేసు మనల్ని మోయమంటున్న బరువుకు తేడా ఏంటి?

16 మనం మోయాల్సిన ఇతర బరువులకు, యేసు మనల్ని మోయమంటున్న బరువుకు తేడా ఉంది. ఉదాహరణకు, రోజంతా ఉద్యోగం చేసి ఇంటికొచ్చేసరికి చాలామందికి ఎంతో అలసటగా, అసంతృప్తిగా అనిపిస్తుంది. కానీ యెహోవాకు, యేసుకు సేవ చేసినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగం వల్ల అలసిపోయి సాయంత్రం మీటింగ్‌కి వెళ్లాలంటే మనకు కష్టంగా ఉండవచ్చు. కానీ మీటింగ్‌ నుండి ఇంటికి తిరిగొచ్చేసరికి సేదదీర్పుగా, బలం పొందినట్టుగా అనిపిస్తుంది. పరిచర్య, వ్యక్తిగత బైబిలు అధ్యయనం విషయం కూడా అంతే. వాటికోసం మనం ఎంత శక్తి వెచ్చిస్తామో అంతకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ ప్రతిఫలం పొందుతాం.

17. మనం ఏం గుర్తించాలి? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

17 మనందరికీ పరిమిత శక్తి మాత్రమే ఉంటుందని మనం గుర్తించాలి. అందుకే మనం చేయాలనుకునే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, మనం వస్తుసంపదల్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తే మన శక్తి వృథా అయ్యే ప్రమాదం ఉంది. ధనవంతుడైన ఒక యువకుడు, “శాశ్వత జీవితం పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగినప్పుడు యేసు ఏమన్నాడో గమనించండి. ఆ యువకుడు అప్పటికే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. అతను మర్యాదస్థుడు అయ్యుంటాడు. ఎందుకంటే, యేసు “అతన్ని ప్రేమగా” చూశాడని మార్కు సువార్తలో ప్రత్యేకంగా చెప్పబడింది. యేసు ఆ యువకుడికి ఒక ఆహ్వానం ఇచ్చాడు. ‘నువ్వు వెళ్లి, నీ దగ్గర ఉన్నవి అమ్మేసి నా శిష్యుడివి అవ్వు’ అన్నాడు. ఆ యువకుడికి యేసు అనుచరుడు అవ్వాలనే కోరిక ఉన్నా, తనకున్న “చాలా ఆస్తిపాస్తుల్ని” వదులుకోలేకపోయాడు. (మార్కు 10:17-22) దానివల్ల అతను యేసు కాడిని వద్దని, ‘డబ్బుకు దాసునిగా’ ఉండిపోయాడు. (మత్త. 6:24) మీరైతే ఏం చేసేవాళ్లు?

18. అప్పుడప్పుడూ మనం ఏం చేయాలి? ఎందుకు?

18 మన జీవితంలో వేటికి ముఖ్యమైన స్థానం ఇస్తున్నామో అప్పుడప్పుడూ ఆలోచించుకోవడం మంచిది. అలా చేస్తే మన శక్తిని తెలివిగా ఉపయోగించగలుగుతాం. మార్క్‌ అనే యువకుడు ఇలా చెప్తున్నాడు, “నేను సాదాసీదాగా జీవిస్తున్నానని చాలా సంవత్సరాలపాటు అనుకున్నాను. నేను పయినీరు సేవ చేసేవాణ్ణి, అయినప్పటికీ డబ్బు గురించి, సౌకర్యవంతమైన జీవితం గడపడం గురించే ఎప్పుడూ ఆలోచించేవాణ్ణి. నా జీవితం కష్టంగా తయారైంది. అలా ఎందుకు జరిగిందో ఆలోచించాను. అప్పుడు, నేను నా సొంత విషయాలకు మొదటిస్థానం ఇస్తూ మిగిలిన సమయాన్ని, శక్తిని యెహోవా సేవకు ఉపయోగిస్తున్నానని అర్థమైంది.” మార్క్‌ యెహోవా సేవను ఎక్కువ చేసేలా తన ఆలోచనా విధానంలో, జీవన విధానంలో మార్పులు చేసుకున్నాడు. మార్క్‌ ఇలా అంటున్నాడు, “నేను కొన్నిసార్లు డబ్బు గురించి ఆందోళనపడుతుంటాను. కానీ యెహోవా సహాయంతో, యేసు మద్దతుతో నా సమస్యల్ని అధిగమించగలిగాను.”

19. సరైన ఆలోచనా విధానం కలిగివుండడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

19 యేసు కాడి కింద సేదదీర్పు పొందుతూ ఉండాలంటే మనం మూడు పనులు చేయాలి. మొదటిది, సరైన ఆలోచనా విధానం కలిగివుండాలి. మనం యెహోవా పని చేస్తున్నాం, కాబట్టి దాన్ని ఆయన చెప్పిన పద్ధతిలో చేయాలి. మనం పనివాళ్లం, యెహోవా మన యజమాని. (లూకా 17:10) ఆయన ఇచ్చిన పనిని మన పద్ధతిలో చేయడానికి ప్రయత్నిస్తే, అది మనకు భారంగా తయారౌతుంది. ఉదాహరణకు ఒక ఎద్దు ఎంత బలంగా ఉన్నా, అది యజమాని కాడి కిందికి రాకుండా ఇష్టమొచ్చినట్టు వెళ్లడానికి ప్రయత్నిస్తే అది గాయపడొచ్చు, బాగా అలసిపోవచ్చు. కానీ మనం యెహోవా నిర్దేశాన్ని పాటిస్తే ఊహించని ఫలితాల్ని సాధిస్తాం, ఎలాంటి ఆటంకాన్నైనా అధిగమిస్తాం. యెహోవా ఇష్టం నెరవేరకుండా ఎవ్వరూ ఆపలేరని గుర్తుంచుకోండి!—రోమా. 8:31; 1 యోహా. 4:4.

20. మనం ఏ ఉద్దేశంతో యేసు కాడి మోయాలి?

20 రెండోది, సరైన ఉద్దేశంతో పని చేయాలి. మన ప్రేమగల తండ్రియైన యెహోవాకు మహిమ తీసుకురావడమే మన లక్ష్యం. మొదటి శతాబ్దంలో అత్యాశతో, స్వార్థంతో యేసును అనుసరించినవాళ్లు కొంతకాలానికే అసంతృప్తి చెంది ఆయన కాడిని వదిలేశారు. (యోహా. 6:25-27, 51, 60, 66; ఫిలి. 3:18, 19) అయితే దేవుని మీద, పొరుగువాళ్ల మీద నిస్వార్థమైన ప్రేమతో సేవ చేసినవాళ్లు తాము భూమ్మీద జీవించినంత కాలం యేసు కాడిని సంతోషంగా మోశారు. వాళ్లకు పరలోకంలో యేసుతోపాటు సేవ చేసే నిరీక్షణ ఉంది. మనం కూడా సరైన ఉద్దేశంతో యేసు కాడిని మోస్తూ ఉంటే సంతోషంగా ఉంటాం.

21. మత్తయి 6:31-33 ప్రకారం, యెహోవా ఏం ఇస్తాడని మనం ఎదురుచూడవచ్చు?

21 మూడోది, యెహోవా సహాయం చేస్తాడని ఎదురుచూడాలి. మనం స్వయంత్యాగ స్ఫూర్తి చూపిస్తూ, కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మనకు హింసలు వస్తాయని యేసు హెచ్చరించాడు. అయితే, ఎలాంటి హింసనైనా సహించడానికి కావాల్సిన బలాన్ని యెహోవా ఇస్తాడని మనం ఎదురుచూడవచ్చు. మనం ఎంత సహిస్తే, అంత బలంగా తయారౌతాం. (యాకో. 1:2-4) యెహోవా మనకు అవసరమైనవాటిని ఇస్తాడని, యేసు మన కాపరిగా ఉంటూ మనల్ని సంరక్షిస్తాడని, మన సహోదరసహోదరీలు మనల్ని ప్రోత్సహిస్తారని కూడా మనం ఎదురుచూడవచ్చు. (మత్తయి 6:31-33 చదవండి; యోహా. 10:14; 1 థెస్స. 5:11) అవును, ఎలాంటి పరిస్థితినైనా సహించడానికి కావాల్సినవన్నీ మనకు ఉన్నాయి!

22. మనం ఏ విషయంలో కృతజ్ఞతతో ఉండవచ్చు?

22 యేసు స్వస్థపర్చిన స్త్రీ అదే రోజున సేదదీర్పు పొందింది. కానీ ఆమె ఎప్పటికీ సేదదీర్పు పొందుతూ ఉండాలంటే క్రీస్తుకు నమ్మకమైన శిష్యురాలు అవ్వాలి. ఆమె ఏం చేసిందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఆమె యేసు కాడి కిందకు రావాలని నిర్ణయించుకునివుంటే యేసుతోపాటు పరలోకంలో సేవచేసే గొప్ప అవకాశం పొందుతుంది! యేసును అనుకరించడానికి ఆమె చేసిన త్యాగాలన్నిటికన్నా ఆ ఆశీర్వాదం ఎంతో గొప్పది. మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా, “నా దగ్గరికి రండి” అని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించినందుకు మనం ఎంత కృతజ్ఞతతో ఉండవచ్చో కదా!

పాట 13 క్రీస్తు మన ఆదర్శం

^ పేరా 5 యేసు మనల్ని తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మనం ఆయన ఆహ్వానాన్ని ఎలా అంగీకరించవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాం. యేసుతో కలిసి పనిచేయడం వల్ల మనమెలా సేదదీర్పు పొందవచ్చో కూడా చూస్తాం.

^ పేరా 60 చిత్రాల వివరణ: యేసు చాలా విధాలుగా ఇతరులకు సేదదీర్పు ఇచ్చాడు.

^ పేరా 66 చిత్రాల వివరణ: యేసులాగే ఒక సహోదరుడు ఎన్నో విధాలుగా ఇతరులకు సేదదీర్పు ఇస్తున్నాడు.