కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 35

యెహోవా వినయస్థుల్ని ఇష్టపడతాడు

యెహోవా వినయస్థుల్ని ఇష్టపడతాడు

‘దేవుడు వినయస్థులకు అపారదయను ప్రసాదిస్తాడు.’—1 పేతు. 5:5.

పాట 48 ప్రతీరోజు యెహోవాతో నడుద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా వినయస్థుల్ని ఎలా చూస్తాడు? వివరించండి.

యెహోవా వినయస్థుల్ని ప్రేమిస్తాడు. నిజమైన వినయం ఉన్నవాళ్లు మాత్రమే యెహోవాతో ప్రేమపూర్వకమైన సన్నిహిత సంబంధం కలిగివుంటారు. మరోవైపు, ‘గర్విష్ఠుల్ని ఆయన వ్యతిరేకిస్తాడు.’ (1 పేతు. 5:5) మనందరం యెహోవాను సంతోషపెట్టాలని, ఆయనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి వినయాన్ని అలవర్చుకోవడానికి మంచి కారణాలే ఉన్నాయి.

2. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

2 ఈ ఆర్టికల్‌లో మనం మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. (1) వినయం అంటే ఏంటి? (2) మనం దాన్ని ఎందుకు అలవర్చుకోవాలి? (3) ఎలాంటి సందర్భాల్లో వినయంగా ఉండడం కష్టం కావచ్చు? ఇప్పుడు పరిశీలించబోతున్నట్టు, మనం వినయంగా ఉంటే యెహోవా హృదయాన్ని సంతోషపెడతాం, మనం కూడా ప్రయోజనం పొందుతాం.—సామె. 27:11; యెష. 48:17.

వినయం అంటే ఏంటి?

3. వినయం అంటే ఏంటి?

3 వినయం ఉన్నవాళ్లు ఇతరులకన్నా తామే గొప్ప అని అనుకోరు, గర్వం చూపించరు. వాళ్లు, యెహోవా తమకన్నా చాలా గొప్పవాడని అర్థంచేసుకుంటారు, ఇతరుల స్థానాన్ని గుర్తిస్తారు. ప్రతీఒక్కరు ఏదో విధంగా తమకన్నా గొప్పవాళ్లని వినయస్థులకు తెలుసు.—ఫిలి. 2:3, 4.

4-5. పైకి వినయంగా కనిపించే వాళ్లందరూ వినయస్థులు కాకపోవచ్చని ఎందుకు చెప్పవచ్చు?

4 కొంతమంది పైకి వినయంగా కనిపించినా నిజానికి వాళ్లు వినయస్థులు కాకపోవచ్చు. బహుశా బిడియం వల్ల వాళ్లు అలా కనిపిస్తుండవచ్చు. లేదా వాళ్లు పెరిగిన విధానం బట్టి ఇతరులపట్ల గౌరవమర్యాదలు చూపిస్తుండవచ్చు. కానీ వాళ్ల హృదయంలో చాలా గర్వం ఉండవచ్చు, అది ఎప్పుడోకప్పుడు బయటపడుతుంది.—లూకా 6:45.

5 మరోవైపు కొంతమంది ధైర్యంగా కనిపిస్తూ ముక్కుసూటిగా మాట్లాడినా, నిజానికి వాళ్లు గర్విష్ఠులు కాకపోవచ్చు. (యోహా. 1:46, 47) అయినాసరే, అలాంటివాళ్లు తమ సొంత సామర్థ్యాల మీద ఆధారపడకుండా జాగ్రత్తపడాలి. మనం బిడియస్థులమైనా, ధైర్యవంతులమైనా నిజమైన వినయాన్ని అలవర్చుకోవడానికి శాయశక్తులా కృషిచేయాలి.

అపొస్తలుడైన పౌలు ఇతరుల కన్నా తాను గొప్పవాణ్ణి అనుకోలేదు (6వ పేరా చూడండి) *

6. మొదటి కొరింథీయులు 15:10 ప్రకారం, పౌలు ఆదర్శం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

6 అపొస్తలుడైన పౌలు ఉదాహరణ పరిశీలించండి. ఎన్నో నగరాల్లో కొత్త సంఘాల్ని స్థాపించడానికి యెహోవా పౌలును ఉపయోగించుకున్నాడు. నిజానికి పౌలు మిగతా అపొస్తలుల కన్నా ఎక్కువ నగరాల్లో ప్రకటించి ఉండవచ్చు. అయినప్పటికీ, తన సహోదరుల కంటే తాను గొప్పవాణ్ణని పౌలు అనుకోలేదు. ఆయన వినయంగా ఇలా అన్నాడు, “నేను అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి. నేను దేవుని సంఘాన్ని హింసించాను కాబట్టి, అపొస్తలుణ్ణని పిలవబడే అర్హత కూడా నాకు లేదు.” (1 కొరిం. 15:9) తన సొంత సామర్థ్యాల వల్లో తాను సాధించినవాటి వల్లో కాదుగానీ యెహోవా అపారదయ వల్లే దేవునితో మంచి సంబంధం కలిగివున్నానని పౌలు సరిగ్గానే చెప్పాడు. (1 కొరింథీయులు 15:10 చదవండి.) పౌలు వినయం చూపించడంలో చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయన కొరింథులోని క్రైస్తవులకు ఉత్తరం రాసే సమయానికి, ఆ సంఘంలో కొంతమంది తమను తాము గొప్ప చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా పౌలు మాత్రం అలా చేయలేదు.—2 కొరిం. 10:10.

పరిపాలక సభలో సేవ చేసిన వినయస్థుడైన సహోదరుడు కార్ల్‌ ఎఫ్‌. క్లయిన్‌ (7వ పేరా చూడండి)

7. మనకాలంలో, బాధ్యతగల ఒక సహోదరుడు ఎలా వినయం చూపించాడు?

7 పరిపాలక సభ సభ్యునిగా సేవ చేసిన సహోదరుడు కార్ల్‌ ఎఫ్‌. క్లయిన్‌ జీవిత కథను చదవడం ద్వారా చాలామంది యెహోవా సేవకులు ప్రోత్సాహం పొందారు. ఆ జీవిత కథలో ఆయన తనకున్న ఎన్నో బలహీనతల గురించి, సమస్యల గురించి వినయంగా, నిజాయితీగా చెప్పాడు. ఉదాహరణకు, 1922లో ఆయన మొదటిసారి ఇంటింటి పరిచర్య చేయడానికి ప్రయత్నించాడు. అది ఆయనకు ఎంత కష్టంగా అనిపించిందంటే, దాదాపు రెండు సంవత్సరాల వరకు మళ్లీ ఇంటింటి పరిచర్యకు వెళ్లలేదు. తర్వాత, ఆయన బెతెల్‌లో సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు మందలించాడు, దాంతో కొంతకాలం అతని మీద కోపం పెట్టుకున్నాడు. సహోదరుడు క్లయిన్‌ డిప్రెషన్‌తో కూడా బాధపడ్డాడు, తర్వాత కోలుకున్నాడు. అయినప్పటికీ, ఆయన ఎన్నో చక్కని సేవావకాశాల్ని పొందాడు. ప్రముఖ స్థానంలో సేవ చేసిన ఆ సహోదరుడు తన బలహీనతల గురించి అంత నిజాయితీగా చెప్పాడంటే ఆయనకు ఎంత వినయం ఉందో ఆలోచించండి! సహోదరుడు క్లయిన్‌ని, నిజాయితీగా ఆసక్తికరంగా ఉన్న ఆయన జీవిత కథను చాలామంది సహోదరసహోదరీలు ఇష్టంగా గుర్తుచేసుకుంటారు. *

వినయాన్ని ఎందుకు అలవర్చుకోవాలి?

8. వినయం చూపిస్తే యెహోవా సంతోషిస్తాడని అర్థంచేసుకోవడానికి 1 పేతురు 5:6 ఎలా సహాయం చేస్తుంది?

8 వినయాన్ని అలవర్చుకోవడానికి అన్నిటికన్నా ముఖ్య కారణం ఏంటంటే, మనం అలా చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. ఆ విషయాన్ని అపొస్తలుడైన పేతురు స్పష్టం చేశాడు. (1 పేతురు 5:6 చదవండి.) “వచ్చి నన్ను అనుసరించండి” (ఇంగ్లీష్‌) పుస్తకం పేతురు మాటల్ని ఇలా వివరించింది, ‘గర్వం విషం లాంటిది. దానివల్ల ఘోరమైన పర్యవసానాలు వస్తాయి. ఒక వ్యక్తికి ఎంత సామర్థ్యం ఉన్నా అతనికి గర్వం ఉంటే దేవుడు ఉపయోగించుకోడు. మరోవైపు ఒక వ్యక్తికి పెద్దగా సామర్థ్యం లేకపోయినా అతను వినయస్థుడైతే దేవుడు ఎంతో ఉపయోగించుకుంటాడు. మీకు వినయం ఉంటే యెహోవా మీకు సంతోషంగా ప్రతిఫలమిస్తాడు.’ * యెహోవా హృదయాన్ని సంతోషపెట్టడం కన్నా మంచి విషయం మరొకటి ఉందంటారా?—సామె. 23:15.

9. వినయస్థులతో ఉండడానికి ఇతరులు ఎందుకు ఇష్టపడతారు?

9 మనం వినయాన్ని అలవర్చుకుంటే యెహోవాను సంతోషపెట్టడంతో పాటు ఎన్నో ప్రయోజనాల్ని పొందుతాం. మనం వినయంగా ఉంటే ఇతరులు మనతో ఉండడానికి ఇష్టపడతారు. దీన్ని అర్థంచేసుకోవాలంటే, మీరు ఎలాంటి ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారో ఆలోచించండి. (మత్త. 7:12) తమకు నచ్చిందే చేయాలని పట్టుబట్టేవాళ్లతో, ఇతరుల సలహాల్ని అస్సలు పట్టించుకోనివాళ్లతో ఉండడానికి మనం ఇష్టపడం. బదులుగా “సహానుభూతిని, సోదర ప్రేమను, వాత్సల్యాన్ని, వినయాన్ని చూపించే” తోటి సహోదరసహోదరీలతో ఉండడానికి ఇష్టపడతాం. (1 పేతు. 3:8) మనం కూడా వినయం చూపిస్తే, ఇతరులు మనతో ఉండడానికి ఇష్టపడతారు.

10. వినయం ఉంటే మన జీవితం ఎందుకు సాఫీగా సాగుతుంది?

10 వినయం ఉంటే మన జీవితం కూడా సాఫీగా సాగుతుంది. కొన్నిసార్లు మనకు అన్యాయంగా అనిపించే విషయాలు జరగవచ్చు. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా అన్నాడు, “పనివారు గుఱ్ఱముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.” (ప్రసం. 10:7) కొన్నిసార్లు, మంచి నైపుణ్యం ఉన్నవాళ్లకు గుర్తింపు రాకపోవచ్చు. ఇంకొన్నిసార్లు, తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్లకు ఎక్కువ ఘనత రావచ్చు. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల గురించి అతిగా బాధపడే బదులు, జీవితంలో మనకెదురయ్యే వాటిని అంగీకరించాలని సొలొమోను గుర్తించాడు. (ప్రసం. 6:9) మనకు వినయం ఉంటే, జీవితం మనం అనుకున్నట్టు లేకపోయినా సర్దుకుపోతాం.

వినయంగా ఉండడం ఎప్పుడు కష్టం కావచ్చు?

ఇలాంటి పరిస్థితిలో వినయంగా ఉండడం ఎందుకు కష్టం కావచ్చు? (11-12 పేరాలు చూడండి) *

11. మనకు ఎవరైనా సలహా ఇస్తే ఎలా స్పందించాలి?

11 వినయం చూపించడానికి మనకు ప్రతీరోజు ఎన్నో అవకాశాలు వస్తాయి. కొన్ని సందర్భాల్ని పరిశీలించండి. మనకు ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు. మనమీద శ్రద్ధతో ఎవరైనా మనకు సలహా ఇచ్చారంటే, మనం అనుకున్నదాని కన్నా పెద్ద పొరపాటే చేసివుండవచ్చని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భాల్లో, మనకు ఆ సలహా వెంటనే నచ్చకపోవచ్చు. దాన్ని ఇచ్చిన వ్యక్తిని లేదా ఇచ్చిన విధానాన్ని మనం విమర్శించే అవకాశం ఉంది. కానీ మనకు వినయం ఉంటే, సరిగ్గా ఆలోచించడానికి ప్రయత్నిస్తాం.

12. మనకు ఎవరైనా సలహా ఇస్తే, సామెతలు 27:5, 6 ప్రకారం వాళ్లపట్ల ఎందుకు కృతజ్ఞత కలిగివుండాలి? ఉదాహరణ చెప్పండి.

12 ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు వినయస్థులు దానికి కృతజ్ఞత కలిగివుంటారు. ఉదాహరణకు, మీరు రాజ్యమందిరంలో ఉన్నట్టు ఊహించుకోండి. మీరు కొంతమంది సహోదరసహోదరీలతో మాట్లాడిన తర్వాత, వాళ్లలో ఒకరు మిమ్మల్ని పక్కకు పిలిచి మీ పళ్లలో ఆహారం ఇరుక్కుందని చెప్పారు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఇబ్బందిపడతారు. అయినాసరే, అలా చెప్పిన వ్యక్తిపట్ల మీరు కృతజ్ఞతతో ఉంటారు. నిజానికి ఇంకా ముందే చెప్పుంటే బాగుండేదని అనుకుంటారు. అదేవిధంగా, మనకు అవసరమైన సమయంలో ఒక సహోదరుడు లేదా సహోదరి సలహా ఇస్తే మనం వినయం చూపిస్తూ వాళ్లపట్ల కృతజ్ఞత కలిగివుంటాం. మనం వాళ్లను స్నేహితుల్లా చూస్తాం గానీ శత్రువుల్లా చూడం.—సామెతలు 27:5, 6 చదవండి; గల. 4:16.

ఇతరులకు సేవావకాశాలు వచ్చినప్పుడు, వినయం ఎందుకు అవసరం? (13-14 పేరాలు చూడండి) *

13. ఇతరులకు సేవావకాశాలు వచ్చినప్పుడు మనం ఎలా వినయం చూపించవచ్చు?

13 ఇతరులకు సేవావకాశాలు వచ్చినప్పుడు. జేసన్‌ అనే సంఘపెద్ద ఇలా అంటున్నాడు, “ఇతరులకు సేవావకాశాలు వచ్చినప్పుడు, అవి నాకు ఎందుకు రాలేదని కొన్నిసార్లు అనిపిస్తుంది.” మీకు కూడా అలా ఎప్పుడైనా అనిపించిందా? సేవావకాశాల కోసం ‘కృషిచేస్తుండడం’ తప్పేమీ కాదు. (1 తిమో. 3:1) కానీ మనం ఎలా ఆలోచిస్తున్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేకపోతే మన హృదయంలో గర్వం పెరగవచ్చు. అప్పుడు ఒక క్రైస్తవుడు, ఫలానా నియామకానికి తానే అర్హుణ్ణని అనుకోవడం మొదలుపెట్టవచ్చు. ఒక క్రైస్తవ భార్య, ‘ఆ సహోదరుని కన్నా నా భర్తే ఈ పనిని బాగా చేయగలడు’ అని అనుకోవచ్చు. కానీ మనకు నిజంగా వినయం ఉంటే, అలాంటి గర్వపు ఆలోచనల్ని రానివ్వం.

14. ఇతరులకు సేవావకాశాలు వచ్చినప్పుడు మోషే స్పందించిన విధానం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

14 ఇతరులకు సేవావకాశాలు వచ్చినప్పుడు మోషే స్పందించిన విధానం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే బాధ్యతను యెహోవా తనకు ఇచ్చినందుకు మోషే కృతజ్ఞత కలిగివున్నాడు. అయినా, ఆ పనిలో సహాయం చేయడానికి యెహోవా వేరేవాళ్లను అనుమతించినప్పుడు మోషే అసూయపడలేదు. (సంఖ్యా. 11:24-29) ఆయన వినయం చూపిస్తూ, తీర్పు తీర్చే పనిలో వేరేవాళ్లు తనకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. (నిర్గ. 18:13-24) దానివల్ల ఇశ్రాయేలీయులు తీర్పు కోసం ఎక్కువసేపు వేచివుండాల్సిన అవసరం రాలేదు. అలా మోషే తన సేవావకాశాల కన్నా ఇతరుల సంక్షేమానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. ఆయన మనకు ఎంత చక్కని ఆదర్శమో కదా! మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా మనల్ని చక్కగా ఉపయోగించుకోవాలంటే, మనకు సామర్థ్యాల కన్నా వినయమే ఎక్కువ ఉండాలి. యెహోవా ఎంతో గొప్పవాడైనా “వినయస్థులకు అపారదయను ప్రసాదిస్తాడు.”—1 పేతు. 5:5; కీర్త. 138:6.

15. చాలామంది సహోదరసహోదరీల పరిస్థితులు ఎలా మారాయి?

15 పరిస్థితులు మారినప్పుడు. ఈ మధ్యకాలంలో, ఎన్నో ఏళ్లపాటు యెహోవా సేవ చేసిన చాలామంది సహోదరసహోదరీల నియామకాలు మారాయి. ఉదాహరణకు 2014లో, జిల్లా పర్యవేక్షకుల నియామకం ఇక ఉండదని సంస్థ చెప్పింది. కాబట్టి జిల్లా పర్యవేక్షకులు, వాళ్ల భార్యలు వేరే నియామకానికి మారాల్సి వచ్చింది. అలాగే, 70 ఏళ్లు దాటిన సహోదరులు ప్రాంతీయ పర్యవేక్షకులుగా కొనసాగలేరని కూడా అదే సంవత్సరంలో సంస్థ చెప్పింది. అంతేకాదు, 80 ఏళ్లు దాటిన సహోదరులు ఇకమీదట పెద్దల సభ సమన్వయకర్తలుగా సేవ చేయలేరని కూడా చెప్పింది. వీటికితోడు గత కొన్ని సంవత్సరాల్లో, చాలామంది బెతెల్‌ కుటుంబ సభ్యుల్ని పయినీర్లుగా నియమించారు. కొంతమంది ప్రత్యేక పూర్తికాల సేవకులు అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు లేదా ఇతర కారణాల వల్ల తమ సేవను ఆపేయాల్సి వచ్చింది.

16. కొత్త నియామకాలకు అలవాటుపడే విషయంలో మన సహోదరసహోదరీలు ఎలా వినయం చూపించారు?

16 అలాంటి మార్పులకు అలవాటుపడడం ఆ సహోదరసహోదరీలకు కాస్త కష్టంగా అనిపించింది, కొంతమందైతే “చాలా బాధపడ్డారు.” ఎందుకంటే వాళ్లు తమ పాత నియామకాన్ని ఎంతో ప్రేమించారు, వాళ్లలో చాలామంది ఎన్నో ఏళ్లుగా ఆ నియామకంలో ఉన్నారు. కానీ మెల్లమెల్లగా వాళ్లు కొత్త నియామకానికి అలవాటుపడగలిగారు. ఎందుకంటే వాళ్లు యెహోవానే ఎక్కువగా ప్రేమించారు. తాము సమర్పించుకున్నది ఒక పనికో, బిరుదుకో, నియామకానికో కాదుగానీ దేవునికేనని వాళ్లకు తెలుసు. (కొలొ. 3:23) నియామకం ఏదైనా వాళ్లు యెహోవాకు వినయంగా సేవ చేయడంలో ఆనందిస్తారు. ఆయనకు తమ మీద పట్టింపు ఉందని అర్థంచేసుకుంటూ తమ ‘ఆందోళనంతా ఆయన మీద వేస్తారు.’—1 పేతు. 5:6, 7.

17. వినయాన్ని అలవర్చుకోమని దేవుని వాక్యం ప్రోత్సహిస్తున్నందుకు మనం ఎందుకు కృతజ్ఞత కలిగివుంటాం?

17 వినయాన్ని అలవర్చుకోమని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా! మనం ఈ చక్కని లక్షణాన్ని అలవర్చుకున్నప్పుడు, మనతోపాటు ఇతరులు కూడా ప్రయోజనం పొందుతారు. మనం సమస్యలతో చక్కగా వ్యవహరించగలుగుతాం, ముఖ్యంగా మన పరలోక తండ్రికి మరింత దగ్గరౌతాం. యెహోవా ‘మహా ఘనుడు, మహోన్నతుడు’ అయినప్పటికీ వినయస్థులైన తన సేవకుల్ని ప్రేమిస్తాడని, విలువైనవాళ్లలా చూస్తాడని తెలుసుకోవడం ఎంత సంతోషాన్నిస్తుందో కదా!—యెష. 57:15.

పాట 45 నా హృదయ ధ్యానం

^ పేరా 5 మనం చూపించాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన లక్షణాల్లో వినయం ఒకటి. ఈ ఆర్టికల్‌లో, వినయం అంటే ఏంటి? దాన్ని ఎందుకు అలవర్చుకోవాలి? కొన్నిసార్లు వినయంగా ఉండడం ఎందుకు కష్టం కావచ్చు? అనే ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం.

^ పేరా 7 1984 అక్టోబరు 1 కావలికోట (ఇంగ్లీష్‌) సంచికలో వచ్చిన “యెహోవా నన్ను మెండుగా ఆశీర్వదించాడు” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 8 ఆ పుస్తకంలోని 3వ అధ్యాయం, 23వ పేరా చూడండి.

^ పేరా 53 చిత్రాల వివరణ: అపొస్తలుడైన పౌలు ఒక సహోదరుని ఇంట్లో ఉన్నప్పుడు, తోటి సహోదరసహోదరీలతో పాటు చిన్నపిల్లలతో కూడా సంతోషంగా సమయం గడుపుతున్నాడు.

^ పేరా 57 చిత్రాల వివరణ: యౌవన సహోదరుడు బైబిలు ఆధారిత సలహా ఇస్తుంటే పెద్దవయసు సహోదరుడు అంగీకరిస్తున్నాడు.

^ పేరా 59 చిత్రాల వివరణ: యౌవన సహోదరునికి సంఘంలో సేవావకాశం వచ్చినప్పుడు పెద్దవయసు సహోదరుడు ఈర్ష్యపడట్లేదు.