కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 36

హార్‌మెగిద్దోన్‌ ఒక శుభవార్త!

హార్‌మెగిద్దోన్‌ ఒక శుభవార్త!

‘అవి ఆ రాజుల్ని హార్‌మెగిద్దోన్‌ దగ్గరికి పోగుచేశాయి.’—ప్రక. 16:16.

పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) హార్‌మెగిద్దోన్‌ ఒక శుభవార్త అని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

చాలామంది ఒక అణుయుద్ధం వల్లో, పెద్ద ప్రకృతి విపత్తు వల్లో ఈ లోకం అంతమౌతుందని అనుకుంటారు. అయితే బైబిలు అలా చెప్పట్లేదు. బదులుగా త్వరలో ఒక యుద్ధం జరుగుతుందని, అది ప్రజలకు మంచి చేస్తుందని బైబిలు చెప్తుంది. ఆ యుద్ధం పేరే హార్‌మెగిద్దోన్‌. దాని గురించి బైబిలు చెప్పే విషయాలు మనకు సంతోషాన్నిస్తాయి. (ప్రక. 1:3) హార్‌మెగిద్దోన్‌ యుద్ధం మానవజాతిని నాశనం చేయదు గానీ కాపాడుతుంది! అదెలా?

2 మనుషుల పరిపాలనను అంతం చేయడం ద్వారా, చెడ్డవాళ్లను నాశనం చేసి నీతిమంతుల్ని కాపాడడం ద్వారా, మన భూమిని నాశనమవ్వకుండా కాపాడడం ద్వారా హార్‌మెగిద్దోన్‌ యుద్ధం మానవజాతిని రక్షిస్తుందని బైబిలు చెప్తుంది. (ప్రక. 11:18) ఈ విషయాల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ నాలుగు ప్రశ్నల్ని పరిశీలిద్దాం: హార్‌మెగిద్దోన్‌ అంటే ఏంటి? దానికి ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? హార్‌మెగిద్దోన్‌ వచ్చినప్పుడు రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? హార్‌మెగిద్దోన్‌ సమీపిస్తుండగా మనం ఎలా నమ్మకంగా ఉండవచ్చు?

హార్‌మెగిద్దోన్‌ అంటే ఏంటి?

3. (ఎ) “హార్‌మెగిద్దోన్‌” అనే పదానికి అర్థం ఏంటి? (బి) ప్రకటన 16:14, 16 ప్రకారం, హార్‌మెగిద్దోన్‌ అక్షరార్థమైన చోటు కాదని ఎలా చెప్పవచ్చు?

3 ప్రకటన 16:14, 16 చదవండి. “హార్‌మెగిద్దోన్‌” అనే పదం బైబిల్లో ఒకే ఒక్కసారి కనిపిస్తుంది, ఆ హీబ్రూ పదానికి “మెగిద్దో పర్వతం” అని అర్థం. (ప్రక. 16:16; అధస్సూచి) మెగిద్దో అనేది ప్రాచీన ఇశ్రాయేలులోని ఒక నగరం పేరు. (యెహో. 17:11) అయితే హార్‌మెగిద్దోన్‌ ఒక అక్షరార్థమైన చోటు కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే, అది యెహోవాకు వ్యతిరేకంగా “భూమంతటా ఉన్న రాజులు” సమకూడే ఒక పరిస్థితిని సూచిస్తుంది. (ప్రక. 16:14) అయితే ఈ ఆర్టికల్‌లో, భూమంతటా ఉన్న రాజులు సమకూడిన వెంటనే జరిగే యుద్ధాన్ని సూచించడానికి కూడా “హార్‌మెగిద్దోన్‌” అనే పదం ఉపయోగించబడింది. హార్‌మెగిద్దోన్‌ ఒక సూచనార్థక స్థలమని మనకెలా తెలుసు? మొదటిగా, అసలు మెగిద్దో అనే పర్వతమే లేదు. రెండవదిగా, మెగిద్దో పరిసర ప్రాంతం “భూమంతటా ఉన్న రాజులు,” వాళ్ల సైన్యాలు సమకూడడానికి, వాళ్ల యుద్ధ యంత్రాలు పెట్టడానికి సరిపోదు. మూడవదిగా, మనం ఈ ఆర్టికల్‌లో చూడబోతున్నట్టు, భూరాజులు దేవుని ప్రజల మీద దాడిచేసినప్పుడు హార్‌మెగిద్దోన్‌ మొదలౌతుంది; అయితే దేవుని ప్రజలు భూమంతటా చాలా చోట్లలో ఉన్నారు.

4. యెహోవా, చివరి మహా యుద్ధాన్ని మెగిద్దోతో ఎందుకు ముడిపెట్టాడు?

4 యెహోవా, చివరి మహా యుద్ధాన్ని మెగిద్దోతో ఎందుకు ముడిపెట్టాడు? ఎందుకంటే బైబిలు కాలాల్లో మెగిద్దో, అలాగే దాని దగ్గర్లో ఉన్న యెజ్రెయేలు లోయలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఒక్కోసారి ఆ యుద్ధాల్లో యెహోవాయే నేరుగా జోక్యం చేసుకున్నాడు. ఉదాహరణకు, “మెగిద్దో కాలువల” దగ్గర సీసెరా సైన్యాన్ని ఓడించడానికి దేవుడు ఇశ్రాయేలు న్యాయాధిపతియైన బారాకుకు సహాయం చేశాడు. అలా అద్భుతరీతిలో తమను గెలిపించినందుకు బారాకు, దెబోరా ప్రవక్త్రి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పారు. వాళ్లు ఇలా పాడారు, ‘నక్షత్రాలు ఆకాశం నుండి సీసెరాతో యుద్ధం చేశాయి. కీషోను వాగు వెంబడి వాళ్లు కొట్టుకొనిపోయారు.’—న్యాయా. 5:19-21.

5. హార్‌మెగిద్దోన్‌ యుద్ధానికి, బారాకు చేసిన యుద్ధానికి మధ్య ఏ ముఖ్యమైన తేడా ఉంది?

5 బారాకు, దెబోరా ఆ పాటను ఈ మాటలతో ముగించారు, “యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు.” (న్యాయా. 5:31) అదేవిధంగా హార్‌మెగిద్దోన్‌లో దేవుని శత్రువులు నాశనమౌతారు, కానీ దేవుణ్ణి ప్రేమించేవాళ్లు రక్షించబడతారు. అయితే ఈ రెండు యుద్ధాల మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. అదేంటంటే, హార్‌మెగిద్దోన్‌లో దేవుని ప్రజలు పోరాడరు. కనీసం ఆయుధాలు కూడా పట్టుకోరు! వాళ్లు “ఊరకుండి” యెహోవాను, ఆయన పరలోక సైన్యాల్ని ‘నమ్ముకోవడం వల్ల బలం పొందుతారు.’—యెష. 30:15; ప్రక. 19:11-15.

6. హార్‌మెగిద్దోన్‌ యుద్ధంలో తన శత్రువుల్ని ఓడించడానికి యెహోవా వేటిని ఉపయోగించవచ్చు?

6 హార్‌మెగిద్దోన్‌ యుద్ధంలో యెహోవా తన శత్రువుల్ని ఎలా ఓడిస్తాడు? ఆయన ఎన్నో పద్ధతులు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఆయన భూకంపాల్ని, వడగండ్లను, మెరుపుల్ని ఉపయోగించవచ్చు. (యోబు 38:22, 23; యెహె. 38:19-22) శత్రువులు ఒకరినొకరు చంపుకునేలా చేయవచ్చు. (2 దిన. 20:17, 22, 23) లేదా దుష్టుల్ని నాశనం చేయమని తన దూతలకు చెప్పవచ్చు. (యెష. 37:36) ఏ పద్ధతి ఉపయోగించినా గెలుపు దేవునిదే! ఆయన శత్రువులందరూ నాశనమౌతారు. నీతిమంతులందరూ రక్షించబడతారు.—సామె. 3:25, 26.

హార్‌మెగిద్దోన్‌కి ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి?

7-8. (ఎ) మొదటి థెస్సలొనీకయులు 5:1-6 ప్రకారం, లోక పరిపాలకులు ఏ అసాధారణమైన ప్రకటన చేస్తారు? (బి) అది ఒక ప్రమాదకరమైన అబద్ధం అని ఎందుకు చెప్పవచ్చు?

7 “యెహోవా రోజు” వచ్చే ముందు “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు” అనే ప్రకటన వినిపిస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:1-6 చదవండి.) 1 థెస్సలొనీకయులు 5:2 లో చెప్పిన “యెహోవా రోజు” “మహాశ్రమను” సూచిస్తుంది. (ప్రక. 7:14) ఆ శ్రమ మొదలవ్వబోతుందని మనకెలా తెలుస్తుంది? అప్పుడు ఒక అసాధారణమైన ప్రకటన వినిపిస్తుందని బైబిలు చెప్తుంది. ఆ ప్రకటన, మహాశ్రమ మొదలవ్వబోతుందనే సంకేతాన్ని ఇస్తుంది.

8 “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు” అనేదే ఆ ప్రకటన అని బైబిలు ముందే చెప్పింది. లోక పరిపాలకులు ఆ ప్రకటన ఎందుకు చేస్తారు? మతనాయకులు కూడా వాళ్లతో కలుస్తారా? బహుశా కలవవచ్చు. ఏదేమైనా, ఆ ప్రకటన చెడ్డదూతల నుండి పుట్టే మరో అబద్ధం మాత్రమే అని మనకు తెలుసు. అయితే ఆ అబద్ధం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే, చరిత్రలో కనీవినీ ఎరుగనంత పెద్ద శ్రమ వచ్చేముందు ప్రజలు తాము సురక్షితంగా ఉన్నామని అనుకునేలా అది చేస్తుంది. అవును, “గర్భవతికి పురిటి నొప్పులు వచ్చినట్టు, హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది.” మరి యెహోవా విశ్వసనీయ సేవకుల విషయమేంటి? మహాశ్రమ అకస్మాత్తుగా మొదలవ్వడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయినా, వాళ్లు దాని కోసం సిద్ధంగా ఉంటారు.

9. యెహోవా సాతాను లోకమంతటినీ ఒకేసారి నాశనం చేస్తాడా? వివరించండి.

9 అయితే యెహోవా నోవహు రోజుల్లో చేసినట్టు సాతాను లోకమంతటినీ ఒకేసారి నాశనం చేయడు. ఆ నాశనం ముఖ్యంగా రెండు దశల్లో జరుగుతుంది. మొదట ఆయన మహాబబులోనును, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధమతాలన్నిటినీ నాశనం చేస్తాడు. తర్వాత రాజకీయ, సైనిక, వాణిజ్య వ్యవస్థలతో సహా సాతాను లోకంలోని మిగతావాటన్నిటినీ హార్‌మెగిద్దోన్‌లో నాశనం చేస్తాడు. ఈ రెండు ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.

10. ప్రకటన 17:1, 6 అలాగే 18:24 ప్రకారం, యెహోవా మహాబబులోనును ఎందుకు నాశనం చేస్తాడు?

10 ‘గొప్ప వేశ్య తీర్పు పొందుతుంది.’ (ప్రకటన 17:1, 6; 18:24 చదవండి.) మహాబబులోను దేవుని పేరుకు ఎంతో నింద తీసుకొచ్చింది. అది దేవుని గురించి అబద్ధాలు బోధించింది. భూమ్మీది పరిపాలకులకు మద్దతివ్వడం ద్వారా ఆధ్యాత్మిక వ్యభిచారం చేసింది. దాని అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించి తన సభ్యుల్ని దోచుకుంది. దేవుని సేవకులతో సహా ఎంతోమంది చావుకు కారణమైంది. (ప్రక. 19:2) మరి మహాబబులోనును యెహోవా ఎలా నాశనం చేస్తాడు?

11. “ఎర్రని క్రూరమృగం” దేన్ని సూచిస్తుంది? మహాబబులోనును నాశనం చేయడానికి దేవుడు దాన్నెలా ఉపయోగిస్తాడు?

11 ‘ఎర్రని క్రూరమృగానికి’ ఉన్న ‘పది కొమ్ముల్ని’ ఉపయోగించుకొని యెహోవా ఆ ‘గొప్ప వేశ్యను’ నాశనం చేస్తాడు. “క్రూరమృగం” ఐక్యరాజ్య సమితిని సూచిస్తుంది. దానికి మద్దతిచ్చే ప్రభుత్వాల్ని “పది కొమ్ములు” సూచిస్తున్నాయి. దేవుడు నిర్ణయించిన సమయంలో, ఐక్యరాజ్య సమితి అలాగే లోక ప్రభుత్వాలు సూచనార్థక బబులోను మీద తిరగబడతాయి. అవి ఆమె సంపదను దోచుకోవడం ద్వారా, ఆమె దుష్టత్వాన్ని బట్టబయలు చేయడం ద్వారా ‘ఆమెను కొల్లగొట్టి, ఆమె బట్టలు తీసేస్తాయి.’ (ప్రక. 17:3, 16) ఆమెకు మద్దతిచ్చినవాళ్లు, ఆమె “ఒక్క రోజులోనే” అన్నట్టు హఠాత్తుగా నాశనమవ్వడం చూసి అవాక్కౌతారు. ఎందుకంటే, ఆమె “నేను రాణిలా కూర్చున్నాను, నేను విధవరాలిని కాను, దుఃఖపడాల్సిన పరిస్థితి నాకు ఎప్పటికీ రాదు” అని ఎంతోకాలంగా గొప్పలు చెప్పుకుంది.—ప్రక. 18:7, 8.

12. దేశాలు ఏం చేయడాన్ని యెహోవా అనుమతించడు? ఎందుకు?

12 అయితే ఆ దేశాలు తన ప్రజల్ని నాశనం చేసేందుకు యెహోవా అనుమతించడు. ఎందుకంటే, యెహోవా ప్రజలు ఆయన పేరును ధరించడం గొప్ప గౌరవంగా భావిస్తారు, అలాగే మహాబబులోను నుండి బయటికి రమ్మనే ఆజ్ఞకు వాళ్లు లోబడ్డారు. (అపొ. 15:16, 17; ప్రక. 18:4) అంతేకాదు, మహా బబులోనును విడిచి వచ్చేలా ఇతరులకు సహాయం చేయడానికి కూడా వాళ్లు ఎంతో కృషిచేశారు. కాబట్టి దాని “తెగుళ్లు” యెహోవా సేవకుల మీదికి రావు. అయినాసరే, వాళ్ల విశ్వాసం పరీక్షించబడుతుంది.

దాడి జరిగినప్పుడు దేవుని ప్రజలు భూమ్మీద ఎక్కడున్నా, వాళ్లు ఆయన మీద నమ్మకం ఉంచుతారు (13వ పేరా చూడండి) *

13. (ఎ) గోగు ఎవరు? (బి) యెహెజ్కేలు 38:2, 8, 9 ప్రకారం, గోగు హార్‌మెగిద్దోన్‌ అనే సూచనార్థక స్థలానికి ఎప్పుడు వస్తాడు?

13 గోగు దాడి చేస్తాడు. (యెహెజ్కేలు 38:2, 8, 9 చదవండి.) అబద్ధమత సంస్థలన్నీ నాశనమయ్యాక, భూమ్మీద ఒక్క మతం మాత్రమే ఉంటుంది. యెహోవా సేవకులు మాత్రమే మిగిలివుంటారు. అప్పుడు సాతానుకు విపరీతమైన కోపం వస్తుంది. అతను “అపవిత్రమైన ప్రేరేపిత సందేశాలు” ఉపయోగించి తన కోపాన్ని వెళ్లగక్కుతాడు. చెడ్డదూతల నుండి వచ్చే ఆ సందేశాల్లో, యెహోవా సేవకులపై దాడిచేసేలా దేశాల గుంపును పురికొల్పే తప్పుడు సమాచారం ఉంటుంది. (ప్రక. 16:13, 14) ఆ దేశాల గుంపునే బైబిలు “మాగోగు దేశపువాడగు గోగు” అని పిలుస్తుంది. దేశాలు తమ దాడి మొదలుపెట్టినప్పుడు, హార్‌మెగిద్దోన్‌ అనే సూచనార్థక స్థలానికి వస్తాయి.—ప్రక. 16:16.

14. గోగు ఏం గ్రహిస్తాడు?

14 గోగు “మాంససంబంధమైన బాహువు” మీద, అంటే తన సైనిక శక్తి మీద నమ్మకం పెట్టుకుంటాడు. (2 దిన. 32:8) అయితే మనం మన దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకుంటాం. అది చూసినప్పుడు దేశాలు మనల్ని వెర్రివాళ్లు అనుకుంటాయి. ఎందుకంటే, ఎంతో శక్తివంతమైన మహాబబులోనును దాని దేవుళ్లు “క్రూరమృగం” నుండి, “పది కొమ్ముల” నుండి రక్షించలేకపోయారు! (ప్రక. 17:16) కాబట్టి, మనల్ని కూడా తేలిగ్గా ఓడించవచ్చని గోగు అనుకుంటాడు. “మేఘము భూమిని కమ్మినట్లు” అతను యెహోవా ప్రజల మీద దాడిచేస్తాడు. (యెహె. 38:16) అయితే, తాను ఉచ్చులో చిక్కుకున్నానని గోగు త్వరలోనే గ్రహిస్తాడు. ఎర్ర సముద్రం దగ్గర ఫరో గ్రహించినట్టే, తాను నిజానికి యెహోవాతో పోరాడుతున్నానని గోగు గ్రహిస్తాడు.—నిర్గ. 14:1-4; యెహె. 38:3, 4, 18, 21-23.

15. యేసు తన విజయాన్ని ఎలా పూర్తిచేస్తాడు?

15 క్రీస్తు, ఆయన పరలోక సైన్యాలు గోగు దాడి నుండి దేవుని ప్రజల్ని కాపాడతారు, గోగు సైన్యాల్ని అంతం చేస్తారు. (ప్రక. 19:11, 14, 15) మరి, యెహోవా ప్రధాన శత్రువైన సాతాను సంగతేంటి? ఎంతైనా, అబద్ధాలు చెప్పి దేశాల్ని హార్‌మెగిద్దోన్‌కి నడిపించింది అతనే కదా. యేసు సాతానును, అతని చెడ్డదూతల్ని అగాధంలో పడేసి, వెయ్యి సంవత్సరాల పాటు బంధిస్తాడు.—ప్రక. 20:1-3.

హార్‌మెగిద్దోన్‌లో రక్షించబడాలంటే మనం ఏం చేయాలి?

16. (ఎ) మనకు ‘దేవుడు తెలుసని’ ఎప్పుడు చెప్పగలం? (బి) మనకు ‘దేవుడు తెలియడం’ హార్‌మెగిద్దోన్‌ సమయంలో ఒక ఆశీర్వాదంగా ఎలా ఉంటుంది?

16 మనం ఎంతోకాలంగా సత్యంలో ఉన్నా లేదా ఈ మధ్యే సత్యంలోకి వచ్చినా, హార్‌మెగిద్దోన్‌లో రక్షించబడాలంటే మనకు ‘దేవుడు తెలుసని,’ ‘మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తకు లోబడుతున్నామని’ చూపించాలి. (2 థెస్స. 1:7-9) మనకు ‘దేవుడు తెలుసని’ చెప్పాలంటే, దేవునికి ఏవి నచ్చుతాయో ఏవి నచ్చవో, ఆయన ప్రమాణాలేంటో తెలిసుండాలి. అంతేకాదు ఆయన్ని ప్రేమించాలి, ఆయనకు లోబడాలి, ఆయన మీదే సంపూర్ణ భక్తి చూపించాలి. (1 యోహా. 2:3-5; 5:3) అవన్నీ చేస్తే, మనం కూడా “దేవునికి తెలుసు” అని చెప్పవచ్చు. అంటే, ఆయన ఆమోదం మనకు ఉంటుంది. (1 కొరిం. 8:3) దానివల్ల మనం హార్‌మెగిద్దోన్‌లో రక్షించబడతాం!

17. ‘మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తకు లోబడాలంటే’ మనం ఏమేం చేయాలి?

17 ‘మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తలో’ యేసు బోధించిన సత్యాలన్నీ ఉన్నాయి, వాటిని మనం బైబిల్లో చదవొచ్చు. ఆ మంచివార్తకు లోబడాలంటే, దాన్ని మన జీవితాల్లో పాటించాలి. అంటే, రాజ్యానికి సంబంధించిన విషయాలకు మొదటిస్థానం ఇవ్వాలి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం జీవించాలి, దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి. (మత్త. 6:33; 24:14) అలాగే, బరువైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రీస్తు అభిషిక్త సహోదరులకు మనం మద్దతివ్వాలి.—మత్త. 25:31-40.

18. వేరే గొర్రెలు తమకు చేసిన సహాయానికి క్రీస్తు అభిషిక్త సహోదరులు ఎలా ప్రతిఫలం ఇస్తారు?

18 “వేరే గొర్రెలు” తమకు చేసిన సహాయానికి దేవుని అభిషిక్త సేవకులు త్వరలోనే ప్రతిఫలం ఇస్తారు. (యోహా. 10:16) ఎలా? హార్‌మెగిద్దోన్‌ మొదలయ్యేసరికి, మొత్తం 1,44,000 మంది అమర్త్యులుగా పునరుత్థానం చేయబడి పరలోకంలో ఉంటారు. అప్పుడు వాళ్లు పరలోక సైన్యాల్లో భాగమై గోగును నాశనం చేస్తారు, గొర్రెల్లాంటి ‘గొప్పసమూహాన్ని’ రక్షిస్తారు. (ప్రక. 2:26, 27; 7:9, 10) దేవుని అభిషిక్త సేవకులు భూమ్మీద ఉన్నప్పుడు వాళ్లకు మద్దతిచ్చే అవకాశం దొరికినందుకు గొప్పసమూహం ఎంతో సంతోషిస్తుంది!

అంతం సమీపిస్తుండగా మనమెలా నమ్మకంగా ఉండవచ్చు?

19-20. హార్‌మెగిద్దోన్‌ సమీపిస్తుండగా, పరీక్షలు ఉన్నా సరే మనమెలా నమ్మకంగా ఉండవచ్చు?

19 కష్టమైన ఈ చివరి రోజుల్లో యెహోవా ప్రజలు ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటున్నారు. అయితే మనం వాటిని సంతోషంగా సహించవచ్చు. (యాకో. 1:2-4) అందుకోసం మనం చేయాల్సిన ముఖ్యమైన పని, పట్టుదలతో హృదయపూర్వకంగా ప్రార్థించడం. (లూకా 21:36) దాంతోపాటు మనం ప్రతీరోజు బైబిల్ని అధ్యయనం చేయాలి, ధ్యానించాలి. ముఖ్యంగా మన కాలానికి సంబంధించిన అద్భుతమైన ప్రవచనాల గురించి ధ్యానించాలి. (కీర్త. 77:12) అలాగే, మనం పరిచర్యలో పూర్తిగా పాల్గొనాలి. అవన్నీ చేస్తే మనం మన విశ్వాసాన్ని, నిరీక్షణను బలంగా ఉంచుకుంటాం!

20 మహాబబులోను నాశనమై, హార్‌మెగిద్దోన్‌ ముగిశాక మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఒక్కసారి ఊహించండి! మరిముఖ్యంగా, అందరూ దేవుని పేరును, ఆయన పరిపాలనా హక్కును గౌరవించడం చూసి మీకెంత సంతృప్తిగా ఉంటుందో ఆలోచించండి! (యెహె. 38:23) దేవుడు తెలిసినవాళ్లకు, ఆయన కుమారునికి లోబడేవాళ్లకు, అంతంవరకు సహించేవాళ్లకు హార్‌మెగిద్దోన్‌ నిజంగా ఒక శుభవార్తే!—మత్త. 24:13.

పాట 143 పనిచేస్తూ, కనిపెట్టుకుంటూ, ఎదురుచూస్తూ ఉండండి

^ పేరా 5 యెహోవా ప్రజలు ఎంతోకాలం నుండి హార్‌మెగిద్దోన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఆర్టికల్‌లో, హార్‌మెగిద్దోన్‌ అంటే ఏంటి? దానికి ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? అది సమీపిస్తుండగా మనం ఎలా నమ్మకంగా ఉండవచ్చు? అనే ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం.

^ పేరా 71 చిత్రాల వివరణ: మన చుట్టూ ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. మనం (1) వీలైనంత కాలం పరిచర్యలో పాల్గొంటాం, (2) క్రమంగా అధ్యయనం చేస్తూ ఉంటాం, (3) దేవుడు రక్షిస్తాడనే నమ్మకంతో ఉంటాం.

^ పేరా 85 చిత్రాల వివరణ: పోలీసులు యెహోవాసాక్షుల ఇంట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు; జరుగుతున్నదంతా యేసు, దేవదూతలు చూస్తున్నారని ఆ ఇంట్లోవాళ్లు నమ్మకంతో ఉన్నారు.