కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 40

“నీకు అప్పగించబడినదాన్ని కాపాడు”

“నీకు అప్పగించబడినదాన్ని కాపాడు”

“తిమోతీ, నీకు అప్పగించబడినదాన్ని కాపాడు.”—1 తిమో. 6:20.

పాట 29 మన పేరుకు తగ్గట్టుగా జీవిద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. మొదటి తిమోతి 6:20 ప్రకారం, తిమోతికి ఏం అప్పగించబడింది?

మనం తరచూ మన దగ్గరున్న విలువైన వాటిని వేరేవాళ్లకు అప్పగించి, వాటిని భద్రంగా ఉంచమని చెప్తాం. ఉదాహరణకు, మన డబ్బును బ్యాంకులో డిపాజిట్‌ చేస్తాం. అలా చేసినప్పుడు, మన డబ్బు దొంగిలించబడకుండా భద్రంగా ఉండేలా బ్యాంకు చూసుకోవాలని ఆశిస్తాం. కాబట్టి, విలువైన వాటిని వేరేవాళ్లకు అప్పగించడం అనేది మనకు తెలిసిన విషయమే.

2 మొదటి తిమోతి 6:20 చదవండి. తిమోతి విలువైన దాన్ని పొందాడని, అంటే మనుషుల విషయంలో దేవుని సంకల్పానికి సంబంధించి సరైన జ్ఞానాన్ని పొందాడని అపొస్తలుడైన పౌలు గుర్తుచేశాడు. అంతేకాదు ‘వాక్యాన్ని ప్రకటించే,’ ‘మంచివార్త ప్రచారకుడిగా పనిచేసే’ గొప్ప అవకాశం కూడా తిమోతికి అప్పగించబడింది. (2 తిమో. 4:2, 5) తనకు అప్పగించబడిన దాన్ని కాపాడుకోమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. తిమోతికి అప్పగించినట్టే, యెహోవా మనకు కూడా విలువైన వాటిని అప్పగించాడు. ఏంటవి? వాటిని మనం ఎందుకు కాపాడుకోవాలి?

యెహోవా మనకు విలువైన సత్యాల్ని అప్పగించాడు

3-4. బైబిలు సత్యాలు విలువైనవని చెప్పడానికి గల కొన్ని కారణాలు ఏంటి?

3 తన వాక్యమైన బైబిల్లోని విలువైన సత్యాలకు సంబంధించిన సరైన జ్ఞానాన్ని యెహోవా మనకు అనుగ్రహించాడు. బైబిలు సత్యాలు ఎందుకు విలువైనవి? ఎందుకంటే, యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉండడానికి, జీవితంలో నిజమైన సంతోషాన్ని పొందడానికి ఏం చేయాలో అవి మనకు తెలియజేస్తాయి. మనం ఆ సత్యాల్ని అంగీకరించి వాటి ప్రకారం జీవించినప్పుడు అబద్ధ బోధల నుండి, చెడు అలవాట్ల నుండి బయటపడతాం.—1 కొరిం. 6:9-11.

4 దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు విలువైనవని చెప్పడానికి మరో కారణం ఏంటంటే, యెహోవా వాటిని “తగిన హృదయ స్థితి” ఉన్న వినయస్థులకు మాత్రమే తెలియజేస్తాడు. (అపొ. 13:48) నేడు యెహోవా ఆ సత్యాల్ని నమ్మకమైన, బుద్ధిగల దాసుని ద్వారా తెలియజేస్తున్నాడని వినయస్థులు అంగీకరిస్తారు. (మత్త. 11:25; 24:45) ఆ సత్యాల్ని మనకై మనం సొంతగా తెలుసుకోలేం, పైగా అంతకన్నా విలువైనవి వేరే ఏవీ లేవు.—సామె. 3:13, 15.

5. యెహోవా మనకు ఇంకా ఏం అప్పగించాడు?

5 తన గురించిన, తన సంకల్పాల గురించిన సత్యాన్ని ఇతరులకు బోధించే గొప్ప అవకాశాన్ని కూడా యెహోవా మనకు ఇచ్చాడు. (మత్త. 24:14) మనం ప్రకటించే సందేశం చాలా విలువైనది. ఎందుకంటే ప్రజలు యెహోవా కుటుంబంలో ఒకరవ్వడానికి అది సహాయం చేస్తుంది, అంతేకాదు శాశ్వత జీవితం పొందే అవకాశాన్ని వాళ్లకు ఇస్తుంది. (1 తిమో. 4:16) మనం పరిచర్య ఎక్కువ చేస్తున్నా, తక్కువ చేస్తున్నా మన కాలంలో జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పనికి మద్దతిస్తున్నట్టే. (1 తిమో. 2:3, 4) దేవుని తోటి పనివాళ్లుగా ఉండడం ఎంత గొప్ప గౌరవమో కదా!—1 కొరిం. 3:9.

మీకు అప్పగించబడిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉండండి!

కొంతమంది సత్యాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నా, తిమోతి దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి (6వ పేరా చూడండి)

6. తమకు అప్పగించబడిన దాన్ని విలువైనదిగా ఎంచడం మానేసిన వాళ్లకు ఏమైంది?

6 తిమోతి కాలంనాటి కొంతమంది, దేవుని తోటి పనివాళ్లుగా ఉండే అవకాశాన్ని విలువైనదిగా చూడలేదు. దేమా ఈ వ్యవస్థ మీద ప్రేమ పెంచుకుని, పౌలుతో కలిసి సేవచేసే అవకాశాన్ని వదిలేసుకున్నాడు. (2 తిమో. 4:10) ఫుగెల్లు, హెర్మొగెనే బహుశా పౌలులాగే తాము కూడా హింసలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పరిచర్యను విడిచిపెట్టి ఉంటారు. (2 తిమో. 1:15) హుమెనైయు, అలెక్సంద్రు, ఫిలేతు మతభ్రష్టులుగా మారి సత్యాన్ని విడిచిపెట్టారు. (1 తిమో. 1:19, 20; 2 తిమో. 2:16-18) బహుశా వాళ్లందరూ ఒకప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉండివుంటారు, కానీ వాళ్లు తమకు అప్పగించబడిన దాన్ని విలువైనదిగా ఎంచడం మానేశారు.

7. సాతాను ఏ పన్నాగాలు ఉపయోగిస్తాడు?

7 మనకు అప్పగించబడిన దాన్ని వదులుకునేలా సాతాను ఎలా మనల్ని తప్పుదారి పట్టిస్తాడు? సాతాను ఉపయోగించే కొన్ని పన్నాగాల్ని గమనించండి. అతను వినోదాన్ని, మీడియాను ఉపయోగించి తప్పుడు ప్రమాణాల్ని, ఆలోచనల్ని, ప్రవర్తనను ప్రోత్సహిస్తాడు. అలా మనం సత్యం మీద పట్టు కోల్పోయేలా చేయాలన్నది అతని కోరిక. అంతేకాదు హింసను లేదా తోటివాళ్ల ఒత్తిడిని ఉపయోగించి మనల్ని భయపెట్టాలని, మన ప్రకటనా పనిని ఆపుజేయాలని ప్రయత్నిస్తాడు. మతభ్రష్టుల “తప్పుడు ‘జ్ఞానం’” విని సత్యాన్ని విడిచిపెట్టేలా సాతాను మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తాడు.—1 తిమో. 6:20, 21.

8. డానియేల్‌ అనే సహోదరుని అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

8 జాగ్రత్తగా లేకపోతే, మనం మెల్లమెల్లగా సత్యం మీద పట్టు కోల్పోవచ్చు. డానియేల్‌ * ఉదాహరణ పరిశీలించండి, అతనికి వీడియో గేములంటే చాలా ఇష్టం. అతను ఇలా చెప్తున్నాడు: “నాకు దాదాపు పదేళ్లు ఉన్నప్పుడు వీడియో గేములు ఆడడం మొదలుపెట్టాను. మొదట్లో అంతగా హానికరంకాని ఆటలు ఆడేవాణ్ణి. కానీ మెల్లమెల్లగా హింస, మంత్రతంత్రాలు ఉన్న ఆటలు ఆడడం మొదలుపెట్టాను.” చివరికి, రోజుకు దాదాపు 15 గంటలపాటు వీడియో గేములు ఆడడం అతనికి అలవాటైంది. అతను ఇంకా ఇలా అంటున్నాడు: “నిజం చెప్పాలంటే, నేను ఆడుతున్న ఆటలు, వాటికోసం వెచ్చించే సమయం నన్ను యెహోవా నుండి దూరం చేస్తున్నాయని నాకు తెలుసు. కానీ బైబిలు సూత్రాలు నాకు వర్తించవని అనుకునేంతగా నా హృదయం మొద్దుబారిపోయింది.” జాగ్రత్తగా లేకపోతే, వినోదం వల్ల మనం సత్యం మీద పట్టు కోల్పోవచ్చు. అదేగనక జరిగితే, యెహోవా అప్పగించిన విలువైన వాటిని మనం వదులుకునే ప్రమాదం ఉంది.

సత్యాన్ని ఎలా గట్టిగా పట్టుకుని ఉండవచ్చు?

9. మొదటి తిమోతి 1:18, 19 ప్రకారం, పౌలు తిమోతిని ఎవరితో పోల్చాడు?

9 మొదటి తిమోతి 1:18, 19 చదవండి. పౌలు తిమోతిని సైనికుడితో పోలుస్తూ, “మంచి పోరాటం పోరాడుతూ” ఉండమని చెప్పాడు. అది మనుషులతో చేసే పోరాటం కాదు, ఆధ్యాత్మిక పోరాటం. క్రైస్తవుల్ని సైనికులతో ఎందుకు పోల్చవచ్చు? క్రీస్తు సైనికులుగా ఉండాలంటే మనం ఏ లక్షణాలు అలవర్చుకోవాలి? పౌలు చెప్పిన ఉదాహరణ నుండి మనం నేర్చుకోగల ఐదు పాఠాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. సత్యాన్ని గట్టిగా పట్టుకుని ఉండడానికి ఆ పాఠాలు మనకు సహాయం చేస్తాయి.

10. దైవభక్తి అంటే ఏంటి? అది ఎందుకు అవసరం?

10 దైవభక్తిని అలవర్చుకోండి. మంచి సైనికుడు విశ్వసనీయంగా ఉంటాడు. తాను ప్రేమించేవాళ్లను లేదా తాను విలువైనవిగా ఎంచేవాటిని కాపాడుకోవడానికి అతను తీవ్రంగా పోరాడతాడు. దైవభక్తిని అలవర్చుకోమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. దైవభక్తి అంటే దేవునికి విశ్వసనీయంగా అంటిపెట్టుకుని ఉండడం. (1 తిమో. 4:7) దేవుని మీద ప్రేమ, భక్తి పెరిగేకొద్దీ సత్యాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలనే మన కోరిక బలపడుతుంది.—1 తిమో. 4:8-10; 6:6.

రోజంతా పని చేసి అలసిపోయినప్పుడు, మీటింగ్‌కి వెళ్లాలని అనిపించకపోవచ్చు. కానీ వెళ్తే ఆశీర్వాదాలు పొందుతాం! (11వ పేరా చూడండి)

11. మనకు క్రమశిక్షణ ఎందుకు అవసరం?

11 క్రమశిక్షణను అలవర్చుకోండి. యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలంటే సైనికుడికి క్రమశిక్షణ ఉండాలి. తప్పుడు కోరికల నుండి పారిపోమని, దైవిక లక్షణాలు అలవర్చుకోమని, తోటి విశ్వాసులతో సహవసించమని పౌలు దైవప్రేరణతో తిమోతికి సలహా ఇచ్చాడు. దాన్ని పాటించడం వల్ల తిమోతి ఆధ్యాత్మికంగా బలంగా ఉండగలిగాడు. (2 తిమో. 2:22) ఆ సలహాను పాటించాలంటే ఎంతో క్రమశిక్షణ అవసరం. శరీర కోరికలతో పోరాడి గెలవాలంటే మనకు క్రమశిక్షణ ఉండాలి. (రోమా. 7:21-25) పాత వ్యక్తిత్వాన్ని వదిలేసి కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటూ ఉండాలంటే కూడా క్రమశిక్షణ అవసరం. (ఎఫె. 4:22, 24) రోజంతా పని చేసి అలసిపోయినప్పుడు మనకు విశ్రాంతి తీసుకోవాలని అనిపించవచ్చు, అయినా మీటింగ్‌కి వెళ్లాలంటే క్రమశిక్షణ అవసరం.—హెబ్రీ. 10:24, 25.

12. బైబిల్ని ఉపయోగించే నైపుణ్యాన్ని మనం ఏయే విధాలుగా మెరుగుపర్చుకోవచ్చు?

12 ఒక సైనికుడు తన ఆయుధాల్ని ఉపయోగిస్తూ ప్రాక్టీసు చేయాలి. నైపుణ్యం సంపాదించాలంటే అతను అలా క్రమంగా సాధన చేయడం ప్రాముఖ్యం. అదేవిధంగా మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించడంలో నైపుణ్యం సంపాదించాలి. (2 తిమో. 2:15) కొన్ని నైపుణ్యాల్ని మన మీటింగ్స్‌లో నేర్చుకోవచ్చు. కానీ బైబిలు సత్యం నిజంగా విలువైనదని ఇతరుల్ని ఒప్పించాలంటే, మనకు క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేసే అలవాటు ఉండాలి. దేవుని వాక్యాన్ని ఉపయోగించి మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలి. అందుకు బైబిలు చదవడం ఒక్కటే సరిపోదు. మనం లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకుని, బోధించగలిగేలా చదివిన వాటిని ధ్యానించాలి, మన ప్రచురణల్లో పరిశోధన చేయాలి. (1 తిమో. 4:13-15) అప్పుడు మనం బోధనా పనిలో దేవుని వాక్యాన్ని చక్కగా ఉపయోగించగలుగుతాం. అయితే ఈ విషయంలో కూడా బైబిలు చదవడం ఒక్కటే సరిపోదు. వినేవాళ్లు లేఖనాన్ని అర్థం చేసుకునేలా, అది తమకెలా వర్తిస్తుందో గ్రహించేలా మనం సహాయం చేయాలి. మనం క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేస్తే, దేవుని ప్రేరేపిత వాక్యాన్ని ఉపయోగిస్తూ నైపుణ్యవంతంగా బోధించగలుగుతాం.—2 తిమో. 3:16, 17.

13. హెబ్రీయులు 5:14 ప్రకారం, మనం ఎందుకు వివేచన చూపించాలి?

13 వివేచన చూపించండి. ఒక సైనికుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టి దాన్ని తప్పించుకోగలగాలి. మనం కూడా హాని కలిగించగల పరిస్థితుల్ని పసిగట్టి ప్రమాదాల్ని తప్పించుకోవడం నేర్చుకోవాలి. (సామె. 22:3; హెబ్రీయులు 5:14 చదవండి.) ఉదాహరణకు మనం వినోదాన్ని, ఉల్లాస కార్యక్రమాల్ని తెలివిగా ఎంచుకోవాలి. నేడు టీవీ కార్యక్రమాల్లో, సినిమాల్లో తరచూ అనైతిక ప్రవర్తన కనిపిస్తోంది. అలాంటి ప్రవర్తన దేవునికి ఏమాత్రం ఇష్టముండదు, అది మనకు ఖచ్చితంగా హాని చేస్తుంది. అది దేవుని మీద మనకున్న ప్రేమను మెల్లమెల్లగా నీరుగారుస్తుంది, కాబట్టి అలాంటి వినోదానికి మనం దూరంగా ఉండాలి.—ఎఫె. 5:5, 6.

14. వివేచన చూపించడం వల్ల డానియేల్‌ ఎలా ప్రయోజనం పొందాడు?

14 పై పేరాల్లో ప్రస్తావించిన డానియేల్‌ హింస, మంత్రతంత్రాలు ఉన్న వీడియో గేములు ఆడడం ప్రమాదకరమని గుర్తించాడు. ఆ సమస్య నుండి బయటపడడానికి సహాయం చేసే సమాచారం కోసం కావలికోట లైబ్రరీలో పరిశోధన చేశాడు. దానివల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? అతను హానికరమైన వీడియో గేములు ఆడడం మానేశాడు. ఆన్‌లైన్‌ గేముల సబ్‌స్క్రిప్షన్‌లు ఆపేసుకున్నాడు, అవి ఆడేవాళ్లతో స్నేహం తెంచేసుకున్నాడు. డానియేల్‌ ఇలా అంటున్నాడు: “వీడియో గేములు ఆడుతూ కూర్చునే బదులు నేను ఇప్పుడు బయటికెళ్లి పనులు చేస్తున్నాను, సంఘంలో ఉన్న స్నేహితులతో సమయం గడుపుతున్నాను.” డానియేల్‌ ఇప్పుడు పయినీరుగా, సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు.

15. తప్పుడు ప్రచారం ఎందుకు ప్రమాదకరమైనది?

15 తిమోతిలాగే మనం కూడా, మతభ్రష్టులు వ్యాప్తి చేసే తప్పుడు సమాచారం ఎంత ప్రమాదకరమైనదో గుర్తించాలి. (1 తిమో. 4:1, 7; 2 తిమో. 2:16) ఉదాహరణకు, మతభ్రష్టులు మన సహోదరుల గురించి కట్టుకథలు వ్యాప్తి చేయవచ్చు లేదా యెహోవా సంస్థ గురించి మన మనసులో సందేహాలు నాటవచ్చు. అలాంటి తప్పుడు సమాచారం మన విశ్వాసాన్ని నీరుగార్చగలదు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మి మనం మోసపోకూడదు. ఎందుకు? ఎందుకంటే, “తమ మనసు కలుషితమైపోయి, సత్యాన్ని ఇక అర్థం చేసుకునే స్థితిలో లేని మనుషులు” వాటిని వ్యాప్తి చేస్తారు. వాదోపవాదాల్ని ఉసిగొల్పడమే వాళ్ల లక్ష్యం. (1 తిమో. 6:4, 5) మనం వాళ్ల కట్టుకథలు నమ్మి, మన సహోదరుల్ని అనుమానించాలన్నది వాళ్ల కోరిక.

16. వేటివల్ల మనం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది?

16 పక్కదారి పట్టకండి. “క్రీస్తుయేసుకు మంచి సైనికుడిగా,” తిమోతి పరిచర్య మీదే మనసుపెట్టాలి. అంతేగానీ లోక సంబంధ విషయాల వల్ల, వస్తుసంపదల వల్ల పక్కదారి పట్టకూడదు. (2 తిమో. 2:3, 4) మనం కూడా వస్తుసంపదల మీది మోజు వల్ల పక్కదారి పట్టకూడదు. “సిరిసంపదలకున్న మోసకరమైన శక్తి” వల్ల యెహోవా మీద మనకున్న ప్రేమ, దేవుని వాక్యం పట్ల ఉన్న కృతజ్ఞత, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలనే కోరిక సన్నగిల్లవచ్చు. (మత్త. 13:22) మనం సాదాసీదాగా జీవిస్తూ మన సమయాన్ని, శక్తిని ‘రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ’ ఉండడానికి ఉపయోగించాలి.—మత్త. 6:22-25, 33.

17-18. ఆధ్యాత్మిక హాని కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?

17 చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఒక సైనికుడు తనను తాను కాపాడుకోవడానికి ఏం చేయాలో ముందే ప్రణాళిక వేసుకోవాలి. మనకు అప్పగించబడిన వాటిని కాపాడుకోవాలంటే, ప్రమాదాన్ని చూసిన వెంటనే చర్య తీసుకోవాలి. అలా చేయడానికి మనకేది సహాయం చేస్తుంది? ప్రమాదం ఎదురైతే ఏం చేయాలో ముందే ప్రణాళిక వేసుకోవాలి.

18 ఉదాహరణకు ఏదైనా కార్యక్రమానికి వెళ్లినప్పుడు, అత్యవసర పరిస్థితిలో హాలు నుండి బయటికి వెళ్లడానికి దగ్గర్లో ఏ ద్వారం ఉందో చూసుకోమని కార్యక్రమం మొదలయ్యే ముందు సాధారణంగా ఒక ప్రకటన చేస్తారు. ఎందుకంటే, అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు అందరూ వెంటనే ఆ ద్వారాల గుండా తప్పించుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంటర్నెట్‌ వాడుతున్నప్పుడు, సినిమా లేదా టీవీ కార్యక్రమం చూస్తున్నప్పుడు అనుకోకుండా అశ్లీల చిత్రం గానీ, క్రూరమైన హింస గానీ, మతభ్రష్ట సమాచారం గానీ కనిపిస్తే ఏ “ద్వారం” నుండి బయటపడాలో ముందే ఆలోచించి పెట్టుకోవచ్చు. మనం ముందే సిద్ధపడితే ఆధ్యాత్మిక హాని కలగకుండా వెంటనే తప్పించుకుంటాం, యెహోవా దృష్టిలో పవిత్రంగా ఉంటాం.—కీర్త. 101:3; 1 తిమో. 4:12.

19. యెహోవా మనకు అప్పగించిన విలువైన వాటిని కాపాడుకుంటే ఏ ప్రయోజనాలు పొందుతాం?

19 యెహోవా మనకు ఇచ్చిన విలువైన వాటిని అంటే అమూల్యమైన బైబిలు సత్యాల్ని, ఇతరులకు బోధించే గొప్ప అవకాశాన్ని మనం కాపాడుకోవాలి. అలా చేస్తే మనకు మంచి మనస్సాక్షి ఉంటుంది, మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, యెహోవాను తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేశామనే సంతృప్తి ఉంటుంది. యెహోవా సహాయంతో, ఆయన మనకు అప్పగించిన వాటిని కాపాడుకోగలుగుతాం.—1 తిమో. 6:12, 19.

పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి

^ పేరా 5 సత్యాన్ని తెలుసుకుని దాన్ని ఇతరులకు బోధించే గొప్ప అవకాశం మనకు ఇవ్వబడింది. ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా గట్టిగా పట్టుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

^ పేరా 8 అసలు పేరు కాదు.