కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 37

“నీ చేతికి విశ్రాంతినివ్వకు”

“నీ చేతికి విశ్రాంతినివ్వకు”

“ఉదయం విత్తనాలు విత్తు, సాయంత్రం వరకు నీ చేతికి విశ్రాంతినివ్వకు.”—ప్రసం. 11:6.

పాట 68 రాజ్య విత్తనాలు చల్లుదాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. ప్రసంగి 11:6 కు, రాజ్య ప్రకటనా పనికి ఎలాంటి సంబంధం ఉంది?

కొన్ని దేశాల్లో ప్రజలు మంచివార్తకు చక్కగా స్పందిస్తారు. నిజానికి వాళ్లు ఆ మంచివార్త కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు! మరికొన్ని దేశాల్లో ప్రజలకు దేవుడన్నా, బైబిలన్నా అంతగా ఆసక్తి ఉండదు. సాధారణంగా మీ ప్రాంతంలో ప్రజలు ఎలా స్పందిస్తారు? ప్రజలు ఎలా స్పందించినా, తాను ఆపమని చెప్పేవరకు మనం ప్రకటనా పనిలో కొనసాగుతూ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు.

2 యెహోవా నిర్ణయించిన సమయంలో ప్రకటనా పని ముగుస్తుంది, అప్పుడు “అంతం వస్తుంది.” (మత్త. 24:14, 36) ఈలోపు, “నీ చేతికి విశ్రాంతినివ్వకు” * అనే మాటకు మనమెలా లోబడవచ్చు?—ప్రసంగి 11:6 చదవండి.

3. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 “మనుషుల్ని పట్టే” పనిని సమర్థవంతంగా చేయడానికి సహాయపడే నాలుగు లక్షణాల్ని ముందటి ఆర్టికల్‌లో పరిశీలించాం. (మత్త. 4:19) ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రకటనా పనిలో కొనసాగుతూ ఉండాలనే మన నిశ్చయాన్ని బలపర్చుకోవచ్చు. అందుకు సహాయపడే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం: (1) ప్రకటనా పనిమీదే దృష్టిపెట్టడం, (2) ఓర్పు చూపించడం, (3) విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడం.

ప్రకటనా పనిమీదే దృష్టిపెట్టండి

4. మనం యెహోవా అప్పగించిన పనిమీదే ఎందుకు దృష్టిపెట్టాలి?

4 చివరి రోజుల్లో ఎలాంటి మనుషులు ఉంటారో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో యేసు తన శిష్యులకు ముందే చెప్పాడు. అవి తన అనుచరుల్ని ప్రకటనా పనిమీద దృష్టి పెట్టకుండా చేసే అవకాశం ఉందని యేసుకు తెలుసు. ఆయన తన శిష్యులకు, “అప్రమత్తంగా ఉండండి” అని చెప్పాడు. (మత్త. 24:42) నోవహు కాలంలోని ప్రజలు రకరకాల విషయాల్లో మునిగిపోయి, ఆయన ఇచ్చిన హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. అలాంటివి నేడు మన దృష్టిని కూడా పక్కకు మళ్లించే అవకాశం ఉంది. (మత్త. 24:37-39; 2 పేతు. 2:5) కాబట్టి యెహోవా మనకు అప్పగించిన పనిమీదే దృష్టిపెట్టాలని మనం నిశ్చయించుకుందాం.

5. అపొస్తలుల కార్యాలు 1:6-8 ప్రకారం, ప్రకటనా పని ఎంత విస్తృతంగా జరుగుతుంది?

5 నేడు మనం రాజ్య సువార్తను ప్రకటించడం మీద దృష్టిపెట్టడం చాలా అవసరం. తాను చనిపోయిన తర్వాత తన అనుచరులు ప్రకటనా పనిని కొనసాగిస్తారని, ఆ పనిని ఎక్కువ ప్రాంతాలకు విస్తరింపజేస్తారని యేసు ముందే చెప్పాడు. (యోహా. 14:12) యేసు చనిపోయిన తర్వాత ఆయన శిష్యుల్లో కొంతమంది చేపలు పట్టే పనిని మళ్లీ మొదలుపెట్టారు. పునరుత్థానమైన తర్వాత యేసు తన శిష్యుల్లో కొంతమందికి అద్భుతరీతిలో ఎక్కువ చేపల్ని పట్టేలా సహాయం చేశాడు. ఆయన ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని, వేరే ఏ పని కన్నా మనుషుల్ని పట్టే పనే ఎక్కువ ప్రాముఖ్యమైనదని స్పష్టం చేశాడు. (యోహా. 21:15-17) తాను మొదలుపెట్టిన ప్రకటనా పని ఇశ్రాయేలు సరిహద్దుల్ని దాటి ఎన్నో ప్రాంతాలకు విస్తరిస్తుందని పరలోకానికి వెళ్లబోయే ముందు యేసు తన శిష్యులకు చెప్పాడు. (అపొస్తలుల కార్యాలు 1:6-8 చదవండి.) కొన్ని సంవత్సరాల తర్వాత, యేసు అపొస్తలుడైన యోహానుకు “ప్రభువు రోజున” * ఏం జరుగుతుందో ఒక దర్శనంలో చూపించాడు. ఆ దర్శనంలో యోహాను ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చూశాడు. వాటిలో ఒకటి, “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు” దేవదూత నిత్యసువార్త ప్రకటించడం. (ప్రక. 1:10; 14:6) ఈ ప్రపంచవ్యాప్త ప్రకటనా పని పూర్తయ్యే వరకు అందులో మనం కొనసాగాలన్నది యెహోవా ఇష్టమని స్పష్టమౌతోంది.

6. మనం ప్రకటనా పనిమీదే దృష్టిపెట్టడానికి ఏది సహాయం చేస్తుంది?

6 ప్రకటనా పని చేసే విషయంలో యెహోవా మనకు ఎంతో సహాయం చేస్తున్నాడు. దానిగురించి ధ్యానించడం ఆ పనిమీదే దృష్టిపెట్టడానికి మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు ముద్రిత ప్రచురణలు, డిజిటల్‌ ప్రచురణలు, ఆడియోలు, వీడియోలు, ఇంటర్నెట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ల ద్వారా యెహోవా మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా అందిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి: మన అధికారిక వెబ్‌సైట్‌లో 1,000 కన్నా ఎక్కువ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంది! (మత్త. 24:45-47) రాజకీయంగా, మతపరంగా, ఆర్థికంగా ముక్కలుముక్కలు అయిపోయిన ఈ లోకంలో ఎనభై లక్షలకన్నా ఎక్కువమంది దేవుని సేవకులు ప్రపంచవ్యాప్త సహోదర బృందంగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఉదాహరణకు, ఏప్రిల్‌ 19, 2019 శుక్రవారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఐక్యంగా దినవచనాన్ని పరిశీలించారు. ఆరోజు సాయంత్రం 2,09,19,041 మంది యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు. అలాంటి అద్భుత సంఘటనల్ని కళ్లారా చూడడం, వాటిలో పాల్గొనడం ఎంత గొప్ప అవకాశమో ధ్యానించినప్పుడు రాజ్య ప్రకటనా పనిమీదే దృష్టిపెట్టాలనే మన నిశ్చయం బలపడుతుంది.

సత్యం గురించి సాక్ష్యమిచ్చే పని నుండి యేసు దృష్టి పక్కకు మళ్లలేదు (7వ పేరా చూడండి)

7. ప్రకటనా పనిమీదే దృష్టిపెట్టేలా యేసు ఆదర్శం మనకెలా సహాయం చేస్తుంది?

7 యేసు ఆదర్శాన్ని పాటించడం ద్వారా కూడా మనం ప్రకటనా పనిమీద దృష్టిపెట్టవచ్చు. దేనివల్ల కూడా సత్యం గురించి సాక్ష్యమిచ్చే పని నుండి యేసు దృష్టి పక్కకు మళ్లలేదు. (యోహా. 18:37) సాతాను ఈ “లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమనూ” ఇస్తానని చెప్పినప్పుడు, అలాగే ప్రజలు తనను రాజుగా చేయాలని అనుకున్నప్పుడు యేసు ఆ ప్రలోభాలకు లొంగిపోలేదు. (మత్త. 4:8, 9; యోహా. 6:15) ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనే కోరిక వల్ల గానీ, తీవ్రమైన వ్యతిరేకత వల్ల గానీ ఆయన దృష్టి పక్కకు మళ్లలేదు. (లూకా 9:58; యోహా. 8:59) మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను గుర్తుంచుకుంటే ప్రకటనా పనిమీద దృష్టి పెట్టగలుగుతాం. “అలసిపోయి పట్టువదలకుండా ఉండేలా” యేసు ఆదర్శాన్ని అనుకరించమని పౌలు క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు.—హెబ్రీ. 12:3.

ఓర్పు చూపించండి

8. ఓర్పు అంటే ఏంటి? అది ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు అవసరం?

8 ఓర్పు అంటే పరిస్థితి మారేంతవరకు ప్రశాంతంగా వేచివుండడం. ఏదైనా ఒక కష్టమైన పరిస్థితి ముగిసిపోవాలని, లేదా ఎన్నాళ్ల నుండో ఉన్న కల నెరవేరాలని ఎదురుచూస్తున్నప్పుడు మనకు ఓర్పు అవసరం. యూదాలో ఉన్న దౌర్జన్యకరమైన పరిస్థితులు ముగిసిపోవాలని హబక్కూకు ప్రవక్త ఎంతో ఎదురుచూశాడు. (హబ. 1:2) దేవుని రాజ్యం “వెంటనే కనిపిస్తుందని,” అది రోమన్ల అణచివేత నుండి తమను కాపాడుతుందని యేసు శిష్యులు అనుకున్నారు. (లూకా 19:11) దేవుని రాజ్యం దుష్టత్వాన్ని నిర్మూలించి, నీతి నివసించే కొత్త లోకాన్ని తీసుకొస్తుంది. ఆ రోజు కోసమే మనం ఎదురుచూస్తున్నాం. (2 పేతు. 3:13) అయితే యెహోవా నిర్ణయించిన సమయం వరకు మనం ఓపిగ్గా ఎదురుచూడాలి. యెహోవా ఏయే విధాలుగా మనకు ఓర్పు చూపించడం నేర్పిస్తున్నాడో ఇప్పుడు పరిశీలిద్దాం.

9. యెహోవా ఏయే విధాలుగా ఓర్పు చూపించాడు?

9 ఓర్పు చూపించే విషయంలో యెహోవాయే అత్యుత్తమ ఆదర్శం. ఓడను కట్టడానికి, ‘నీతిని ప్రకటించడానికి’ యెహోవా నోవహుకు తగినంత సమయం ఇచ్చాడు. (2 పేతు. 2:5; 1 పేతు. 3:20) దుష్ట నగరాలైన సొదొమ గొమొర్రాల్లోని ప్రజల్ని నాశనం చేయాలని యెహోవా నిర్ణయించుకున్నప్పుడు, అబ్రాహాము పదేపదే ప్రశ్నలు అడిగినా యెహోవా ఓపిగ్గా విన్నాడు. (ఆది. 18:20-33) నమ్మకద్రోహులైన ఇశ్రాయేలీయులతో యెహోవా వందల సంవత్సరాల పాటు ఎంతో ఓపిగ్గా వ్యవహరించాడు. (నెహె. 9:30, 31) యెహోవా నేడు కూడా ఓర్పు చూపిస్తున్నాడు. తాను ఆకర్షించే ప్రజలందరికీ “పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని” సమయం ఇస్తున్నాడు. (2 పేతు. 3:9; యోహా. 6:44; 1 తిమో. 2:3, 4) ప్రకటనా పనిలో, బోధనా పనిలో ఓపిగ్గా కొనసాగడానికి యెహోవా ఆదర్శం మనకెంతో సహాయం చేస్తుంది. తన వాక్యంలో ఉన్న ఒక ఉదాహరణ ద్వారా కూడా ఆయన మనకు ఓర్పు చూపించడం నేర్పిస్తున్నాడు.

కష్టపడి పనిచేస్తూ ఓర్పు చూపించే రైతులాగే, మనం కూడా ఫలితాల కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాం (10-11 పేరాలు చూడండి)

10. యాకోబు 5:7, 8 లో ఉన్న రైతు ఉదాహరణ మనకేం నేర్పిస్తుంది?

10 యాకోబు 5:7, 8 చదవండి. పంటలు పండించే రైతు ఉదాహరణ నుండి మనం ఓర్పు చూపించడం నేర్చుకోవచ్చు. నిజమే, కొన్ని మొక్కలు త్వరగా పెరుగుతాయి. కానీ చాలా మొక్కలు, ముఖ్యంగా పండ్లనిచ్చే మొక్కలు పెరగడానికి ఎక్కువకాలం పడుతుంది. ఇశ్రాయేలులో పంటలు పండడానికి దాదాపు ఆరు నెలలు పట్టేది. ఆ కాలంనాటి రైతు అక్టోబరు మధ్యలో తొలకరి వానలు కురిశాక విత్తనాలు విత్తేవాడు, ఏప్రిల్‌ మధ్యలో కడవరి వానలు కురిశాక పంటను కోసేవాడు. (మార్కు 4:28) మనం కూడా ఆ రైతులాగే ఓర్పు చూపించడం మంచిది. కానీ అదంత తేలిక కాకపోవచ్చు.

11. పరిచర్యలో ఓర్పు మనకెలా సహాయం చేస్తుంది?

11 అపరిపూర్ణులైన మనుషులు తమ పనులకు ఫలితాలు వెంటనే రావాలని కోరుకుంటారు. మొక్కలు పెరిగి వాటికి పండ్లు రావాలంటే మనం నేలను తవ్వాలి, విత్తనాలు నాటాలి, కలుపు మొక్కల్ని ఏరివేయాలి, చెట్లకు నీరుపెట్టాలి, ఎప్పుడూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా శిష్యుల్ని చేయడానికి కూడా మనం కష్టపడి పనిచేయాలి. మన బైబిలు విద్యార్థుల్లో నుండి పక్షపాతం, వివక్ష లాంటి కలుపు మొక్కల్ని ఏరివేయాలంటే సమయం పడుతుంది. ప్రజలు మన సందేశాన్ని విననప్పుడు నిరుత్సాహంలో మునిగిపోకుండా ఓర్పు మనకు సహాయం చేస్తుంది. ఒకవేళ ప్రజలు మన సందేశానికి చక్కగా స్పందించినా మనం ఓర్పు చూపించాలి. ఎందుకంటే విశ్వాసాన్ని పెంచుకోమని మనం బైబిలు విద్యార్థుల్ని ఒత్తిడి చేయలేం. కొన్ని సందర్భాల్లో, యేసు శిష్యులు సైతం ఆయన చెప్పిన విషయాల్ని వెంటనే అర్థం చేసుకోలేకపోయారు. (యోహా. 14:9) మనం నాటుతాం, నీళ్లు పోస్తాం, కానీ దాన్ని పెరిగేలా చేసేది దేవుడే అని గుర్తుంచుకుంటాం.—1 కొరిం. 3:6.

12. సత్యంలోలేని కుటుంబ సభ్యులకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు మనమెలా ఓర్పు చూపించవచ్చు?

12 ముఖ్యంగా సత్యంలోలేని కుటుంబ సభ్యులకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఓర్పు చూపించడం మనకు కష్టమనిపించవచ్చు. ప్రసంగి 3:1, 7 లో ఉన్న సూత్రం మనకు సహాయం చేస్తుంది. అక్కడిలా ఉంది: “ప్రతీదానికి ఒక సమయం ఉంది, . . . మౌనంగా ఉండడానికి ఒక సమయం, మాట్లాడడానికి ఒక సమయం.” మనం మౌనంగా ఉంటూ మన మంచి ప్రవర్తన ద్వారా సత్యంలోలేని కుటుంబ సభ్యులకు సాక్ష్యం ఇవ్వవచ్చు, కానీ అవకాశం దొరికినప్పుడు వాళ్లతో సత్యం గురించి మాట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. (1 పేతు. 3:1, 2) మనం ఉత్సాహంగా ప్రకటిస్తాం, బోధిస్తాం. అయితే మన కుటుంబ సభ్యులతో సహా ప్రతీఒక్కరితో ఓపిగ్గా వ్యవహరిస్తాం.

13-14. ఓర్పు చూపించే విషయంలో మంచి ఆదర్శం ఉంచిన వాళ్ల ఉదాహరణలు చెప్పండి.

13 బైబిలు కాలాల్లో, అలాగే మన కాలంలో ఉన్న నమ్మకమైన సేవకుల ఉదాహరణల నుండి మనం ఓర్పు చూపించడం నేర్చుకోవచ్చు. దుష్టత్వం అంతమయ్యే రోజు కోసం హబక్కూకు ఎంతగానో ఎదురుచూశాడు. అయినా ఆయన ఓర్పు చూపిస్తూ ఇలా అన్నాడు: “నా కావలి స్థలం దగ్గర నేను ఇలాగే నిలబడి ఉంటాను.” (హబ. 2:1) అపొస్తలుడైన పౌలు తన పరిచర్యను ముగించి పరలోక బహుమానం పొందాలని ఎంతగానో కోరుకున్నాడు. అయినప్పటికీ “మంచివార్త గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యమివ్వడంలో ఆయన ఓపిగ్గా కొనసాగాడు.—అపొ. 20:24.

14 ఒక అనుభవం పరిశీలించండి. ఒక జంట గిలియడ్‌ పాఠశాల పూర్తిచేసుకున్న తర్వాత, సాక్షులు ఎక్కువగా లేని దేశంలో సేవచేయడానికి నియమించబడ్డారు. ఆ దేశంలో క్రైస్తవ మతస్థులు చాలా తక్కువమంది ఉండేవాళ్లు. అక్కడి ప్రజలు బైబిలు స్టడీ పట్ల అంతగా ఆసక్తి చూపించేవాళ్లు కాదు. వేరే దేశాల్లో సేవచేస్తున్న తోటి గిలియడ్‌ విద్యార్థులేమో, తాము ఎన్నో మంచిమంచి బైబిలు అధ్యయనాలు చేస్తున్నామని చెప్పేవాళ్లు. అయితే ఆ జంట తమ ప్రాంతంలో ఫలితాలు పెద్దగా రాకపోయినా ప్రకటనా పనిలో ఓపిగ్గా కొనసాగారు. అలాంటి ప్రాంతంలో ఎనిమిదేళ్లు ప్రకటించిన తర్వాత, వాళ్ల బైబిలు విద్యార్థుల్లో ఒకరు బాప్తిస్మం తీసుకోవడం చూసి ఆ జంట ఎంతో సంతోషించారు. బైబిలు కాలంలోని, మన కాలంలోని ఉదాహరణల నుండి ఏం నేర్చుకోవచ్చు? ఈ నమ్మకమైన దేవుని సేవకులు తమ ఉత్సాహాన్ని కోల్పోలేదు, తమ చేతికి విశ్రాంతినివ్వలేదు. వాళ్లు చూపించిన ఓర్పుకు యెహోవా ప్రతిఫలం ఇచ్చాడు. “విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా వాగ్దానాలకు వారసులైనవాళ్లను” మనం అనుసరిద్దాం.—హెబ్రీ. 6:10-12.

విశ్వాసాన్ని బలంగా ఉంచుకోండి

15. ప్రకటించాలనే మన నిశ్చయాన్ని విశ్వాసం ఏ విధంగా బలపరుస్తుంది?

15 మనం ప్రకటిస్తున్న సందేశం మీద మనకు విశ్వాసం ఉంది. కాబట్టి దాన్ని వీలైనంత ఎక్కువమందికి చెప్పాలని కోరుకుంటాం. మనం దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాల్ని నమ్ముతాం. (కీర్త. 119:42; యెష. 40:8) బైబిలు ప్రవచనాలు మనకాలంలో నెరవేరడం గమనించాం. అంతేకాదు, బైబిలు సూత్రాల్ని పాటించడం మొదలుపెట్టాక ప్రజల జీవితాలు ఎలా మెరుగయ్యాయో మన కళ్లారా చూశాం. ఇవన్నీ, రాజ్య సువార్త ప్రతీఒక్కరు వినాల్సిన ముఖ్యమైన సందేశమనే నమ్మకాన్ని మనలో పెంచుతాయి.

16. కీర్తన 46:1-3 ప్రకారం యెహోవా మీద, యేసు మీద ఉన్న విశ్వాసం ప్రకటనా పనిలో కొనసాగాలనే మన నిశ్చయాన్ని ఎలా బలపరుస్తుంది?

16 అంతేకాదు, మన సందేశానికి మూలమైన యెహోవా మీద, ఆయన రాజుగా నియమించిన యేసు మీద మనకు విశ్వాసం ఉంది. (యోహా. 14:1) ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎల్లప్పుడూ యెహోవాయే మన ఆశ్రయం, మన బలం. (కీర్తన 46:1-3 చదవండి.) అంతేకాదు యేసు తనకు ఇవ్వబడిన శక్తిని, అధికారాన్ని ఉపయోగిస్తూ పరలోకం నుండి ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నాడని మనం నమ్ముతాం.—మత్త. 28:18-20.

17. మనం ప్రకటనా పనిలో ఎందుకు కొనసాగాలో తెలిపే ఒక ఉదాహరణ చెప్పండి.

17 యెహోవా మనల్ని దీవిస్తాడనే నమ్మకాన్ని విశ్వాసం మనలో కలిగిస్తుంది. కొన్నిసార్లు మనం ఊహించని రీతిలో ఆయన మనల్ని దీవించవచ్చు. (ప్రసం. 11:6) ఉదాహరణకు, ప్రతీరోజు కొన్ని వేలమంది మన లిటరేచర్‌ కార్ట్‌లను, టేబుళ్లను చూస్తున్నారు. ఈ విధమైన పరిచర్య వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయా? వస్తున్నాయి! నవంబరు 2014, మన రాజ్య పరిచర్యలో ఒక అనుభవం వచ్చింది. ఒక కళాశాల విద్యార్థిని యెహోవాసాక్షుల మీద వ్యాసం రాయాలని అనుకుంది. కానీ రాజ్యమందిరం ఎక్కడుందో కనుక్కోలేకపోయింది. వాళ్ల కళాశాల ప్రాంగణంలో సాక్షులు టేబులు ఉపయోగించి ప్రకటించడం చూసింది. అలా, వ్యాసం రాయడానికి కావల్సిన సమాచారం ఆమెకు దొరికింది. తర్వాత ఆమె బాప్తిస్మం తీసుకుని ఒక యెహోవాసాక్షి అయ్యి, ఇప్పుడు క్రమ పయినీరుగా సేవ చేస్తోంది. అలాంటి అనుభవాలు, రాజ్య సందేశాన్ని వినాలని కోరుకునేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని చూపిస్తున్నాయి. అవి ప్రకటనా పనిలో కొనసాగాలనే మన నిశ్చయాన్ని బలపరుస్తాయి.

మీ చేతికి విశ్రాంతినివ్వకూడదని నిశ్చయించుకోండి

18. రాజ్య ప్రకటనా పని యెహోవా నిర్ణయించిన సమయానికే ముగుస్తుందని మనం ఎందుకు నమ్మవచ్చు?

18 రాజ్య ప్రకటనా పని యెహోవా నిర్ణయించిన సమయానికే ముగుస్తుందని మనం నమ్మవచ్చు. నోవహు రోజుల్లో ఏం జరిగిందో పరిశీలించండి. యెహోవా ప్రతీది తాను చెప్పిన సమయంలోనే చేస్తాడని నిరూపించుకున్నాడు. జలప్రళయం ఎప్పుడు రావాలో దాదాపు 120 సంవత్సరాల ముందే యెహోవా నిర్ణయించాడు. అలా నిర్ణయించిన కొన్ని దశాబ్దాల తర్వాత, అంటే జలప్రళయం రావడానికి సుమారు 40-50 సంవత్సరాల ముందు ఓడ కట్టమని యెహోవా నోవహుకు చెప్పాడు. నోవహు కష్టపడి పని చేశాడు, అంతేకాదు ప్రజలు స్పందించకపోయినా హెచ్చరికా సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఓడలోకి జంతువుల్ని తీసుకెళ్లమని యెహోవా చెప్పేంతవరకు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. తర్వాత తాను చెప్పిన సమయానికే “యెహోవా ఓడ తలుపును మూసేశాడు.”—ఆది. 6:3; 7:1, 2, 16.

19. మన చేతికి విశ్రాంతినివ్వకుండా ఉంటే ఏ దీవెన పొందుతాం?

19 యెహోవా త్వరలోనే రాజ్య ప్రకటనా పనిని ముగింపుకు తెస్తాడు. ఆయన సాతాను వ్యవస్థకు తలుపు మూసేసి, నీతి నివసించే కొత్త లోకానికి తలుపు తెరుస్తాడు. అప్పటివరకు మనం తమ చేతికి విశ్రాంతినివ్వకుండా పనిచేసిన నోవహును, హబక్కూకును, ఇతరుల్ని అనుకరిద్దాం. అంతేకాదు ప్రకటనా పనిమీదే దృష్టిపెడదాం; ఓర్పు చూపిద్దాం; యెహోవా మీద, ఆయన వాగ్దానాల మీద విశ్వాసాన్ని బలంగా ఉంచుకుందాం.

పాట 75 ‘నేనున్నాను! నన్ను పంపించు!’

^ పేరా 5 మనుషుల్ని పట్టే జాలర్లు అవ్వమని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించేలా ముందటి ఆర్టికల్‌ బైబిలు విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కొత్త ప్రచారకులు, అనుభవంగల ప్రచారకులు అందరూ యెహోవా ఆపమని చెప్పేంతవరకు రాజ్య ప్రకటనా పనిలో కొనసాగాలనే తమ నిశ్చయాన్ని బలపర్చుకోవచ్చు. అందుకు సహాయం చేసే మూడు విషయాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ పేరా 2 పదాల వివరణ: ఈ ఆర్టికల్‌లో “నీ చేతికి విశ్రాంతినివ్వకు” అనే మాట, యెహోవా ఆపమని చెప్పేంతవరకు ప్రకటనా పనిలో కొనసాగుతూ ఉండాలనే మన నిశ్చయాన్ని సూచిస్తుంది.

^ పేరా 5 “ప్రభువు రోజు” 1914⁠లో యేసు రాజైనప్పుడు మొదలైంది, అది వెయ్యేళ్ల పరిపాలన ముగిసే వరకు కొనసాగుతుంది.