కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

ప్రసంగి 5:8 మానవ పరిపాలకుల గురించి మాత్రమే మాట్లాడుతుందా లేక యెహోవా గురించి కూడానా?

ఆ లేఖనంలో ఇలా ఉంది: “ఏ ప్రాంతంలోనైనా పేదవాళ్లు అణచివేయబడడం, నీతిన్యాయాలు జరగకపోవడం నువ్వు గమనిస్తే ఆశ్చర్యపోకు. ఎందుకంటే ఆ ఉన్నతాధికారి కన్నా పైస్థానంలో ఉన్న వ్యక్తి అతన్ని గమనిస్తున్నాడు, వాళ్లకన్నా పైస్థానంలో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.”—ప్రసం. 5:8.

మామూలుగా చూస్తే, ఈ లేఖనం కేవలం ప్రభుత్వ అధికారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే, అది యెహోవా గురించి కూడా ఒక సత్యాన్ని చెప్తుంది. ఆ సత్యం మనకు ఓదార్పును, భరోసాను ఇస్తుంది.

పేదవాళ్లను అణచివేస్తూ వాళ్లకు న్యాయం జరగకుండా చేస్తున్న ఒక అధికారి గురించి ఆ లేఖనం మాట్లాడుతుంది. తనకన్నా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, లేదా తనకన్నా ఎక్కువ అధికారం ఉన్న వ్యక్తి తనను గమనించే అవకాశం ఉందని అతను గుర్తుంచుకోవాలి. నిజానికి, వాళ్ల మీద కూడా పైఅధికారులు ఉండవచ్చు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, మానవ ప్రభుత్వాల్లో కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు అందరూ అవినీతిపరులే ఉండే అవకాశం ఉంది. దానివల్ల సామాన్య ప్రజలు అన్ని స్థాయిల్లోనూ అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఇక న్యాయం జరిగే అవకాశమే లేదని అనిపించినప్పుడు, ‘పైస్థానంలో ఉన్నవాళ్లను కూడా’ యెహోవా గమనిస్తున్నాడని తెలుసుకోవడం ఊరటను ఇస్తుంది. అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే, సహాయం కోసం దేవున్ని వేడుకుంటూ, మన భారాన్ని ఆయన మీద వేయవచ్చు. (కీర్త. 55:22; ఫిలి. 4:6, 7) “ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున తన బలం చూపించడానికి యెహోవా కళ్లు భూమంతటా సంచరిస్తూ ఉన్నాయి” అని బైబిలు హామీ ఇస్తుంది.—2 దిన. 16:9.

లోకంలో ఒక అధికారి పైన ఎప్పుడూ ఇంకో అధికారి ఉంటాడని ప్రసంగి 5:8 చెప్తుంది. మరిముఖ్యంగా, అందరికన్నా పైనున్న అధికారి సర్వశక్తిమంతుడైన యెహోవా అని ఆ లేఖనం మనకు గుర్తుచేస్తుంది. ఆయన ఇప్పుడు తన కుమారుని ద్వారా, అంటే దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు ద్వారా పరిపాలిస్తున్నాడు. అందర్నీ గమనిస్తున్న యెహోవా, ఆయన కుమారుడైన యేసు సంపూర్ణ న్యాయవంతులు అనే నమ్మకంతో మనం ఉండవచ్చు.