కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 38

ప్రశాంతంగా ఉన్న సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి

ప్రశాంతంగా ఉన్న సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి

“యెహోవా అతనికి విశ్రాంతి ఇవ్వడంతో ఆ సంవత్సరాల్లో దేశం ప్రశాంతంగా ఉంది, అతని మీద ఏ యుద్ధం జరగలేదు.”—2 దిన. 14:6.

పాట 60 జీవాన్నిచ్చే సందేశం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవాను సేవించడం ఎప్పుడు కష్టంగా ఉండవచ్చు?

యెహోవాను సేవించడం ఎప్పుడు కష్టంగా ఉండవచ్చు? తీవ్రమైన సమస్యలతో పోరాడుతున్నప్పుడా లేక జీవితం కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడా? సమస్యలు వచ్చినప్పుడు మనం వెంటనే యెహోవా మీద ఆధారపడతాం. కానీ మన జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తామా? అలా జరిగే అవకాశం ఉందని యెహోవా ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు.—ద్వితీ. 6:10-12.

ఆసా రాజు అబద్ధ ఆరాధనను నిర్మూలించడానికి చర్య తీసుకున్నాడు (2వ పేరా చూడండి) *

2. ఆసా రాజు మనకు ఎలాంటి ఆదర్శం ఉంచాడు?

2 ఆసా రాజు మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. అతను యెహోవాపై పూర్తిగా ఆధారపడడం ద్వారా తెలివిగా ప్రవర్తించాడు. అతను కష్ట సమయాల్లోనే కాదు, ప్రశాంతంగా ఉన్న సమయాల్లో కూడా యెహోవాను సేవించాడు. చిన్నప్పటి నుండి ‘ఆసా హృదయం యెహోవా పట్ల సంపూర్ణంగా ఉంది.’ (1 రాజు. 15:14) యూదాలో అబద్ధ ఆరాధనను నిర్మూలించడం ద్వారా తన హృదయం యెహోవా పట్ల సంపూర్ణంగా ఉందని ఆసా చూపించాడు. అతను “అన్య దేవుళ్ల బలిపీఠాల్ని, ఉన్నత స్థలాల్ని తీయించాడు, పూజా స్తంభాల్ని పగలగొట్టించి, పూజా కర్రల్ని నరికించాడు.” (2 దిన. 14:3, 5) అంతేకాదు, ఆసా తన అవ్వ మయకాను రాజమాత స్థానంలో నుండి తీసేశాడు. ఎందుకంటే ఆమె ఒక విగ్రహాన్ని చేయించి, అబద్ధ ఆరాధనను ప్రోత్సహించింది.—1 రాజు. 15:11-13.

3. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 ఆసా అబద్ధ ఆరాధనను నిర్మూలించడమే కాదు, సత్యారాధనను ప్రోత్సహించాడు కూడా. యూదా ప్రజలు యెహోవా దగ్గరికి తిరిగొచ్చేలా అతను సహాయం చేశాడు. యెహోవా ఆసాకు, ఇశ్రాయేలీయులకు ప్రశాంతమైన కాలాల్ని * అనుగ్రహించాడు. ఆసా పరిపాలనలో పది సంవత్సరాల పాటు “దేశం ప్రశాంతంగా ఉంది.” (2 దిన. 14:1, 4, 6) ప్రశాంతంగా ఉన్న ఆ సమయాన్ని ఆసా ఎలా ఉపయోగించాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు, ఆసాలాగే ప్రశాంతంగా ఉన్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్న మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి చూస్తాం. ఒకవేళ మీరు ఉంటున్న దేశంలో యెహోవాను స్వేచ్ఛగా ఆరాధించే అవకాశం ఉంటే, ప్రశాంతంగా ఉన్న ఆ సమయాన్ని మీరెలా ఉపయోగించవచ్చో కూడా చర్చిస్తాం.

ప్రశాంతంగా ఉన్న సమయాన్ని ఆసా ఎలా ఉపయోగించాడు?

4. రెండో దినవృత్తాంతాలు 14:2, 6, 7 ప్రకారం, ప్రశాంతంగా ఉన్న సమయాన్ని ఆసా ఎలా ఉపయోగించాడు?

4 రెండో దినవృత్తాంతాలు 14:2, 6, 7 చదవండి. ‘అన్నివైపుల నుండి [తమకు] విశ్రాంతినిచ్చింది’ యెహోవాయే అని ఆసా ప్రజలతో చెప్పాడు. ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో హాయిగా విశ్రాంతి తీసుకుందామని ఆసా అనుకోలేదు. బదులుగా అతను నగరాల్ని, ప్రాకారాల్ని, బురుజుల్ని నిర్మించడం, ద్వారాల్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. అతను యూదా ప్రజలతో, “దేశం ఇంకా మన చేతుల్లోనే ఉంది” అన్నాడు. దానర్థం ఏంటి? దేవుడు తమకు ఇచ్చిన దేశంలో శత్రువుల భయం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరగవచ్చని, నిర్మాణ పనుల్లో కొనసాగవచ్చని ఆసా చెప్తున్నాడు. ప్రశాంతంగా ఉన్న ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోమని ఆసా ప్రజల్ని ప్రోత్సహించాడు.

5. ఆసా తన సైనిక బలాన్ని ఎందుకు పెంచుకున్నాడు?

5 ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో ఆసా తన సైనిక బలాన్ని పెంచుకున్నాడు. (2 దిన. 14:8) ఎందుకు? అతనికి యెహోవా మీద నమ్మకం లేదా? కానేకాదు. భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని ఎదుర్కొనేలా ప్రజల్ని సిద్ధం చేయడం రాజుగా తన బాధ్యతని ఆసాకు తెలుసు. ప్రస్తుతం యాదా ప్రజలు అనుభవిస్తున్న శాంతి ఎక్కువకాలం ఉండకపోవచ్చని కూడా ఆసాకు తెలుసు. అదే నిజమైంది.

ప్రశాంతంగా ఉన్న సమయాన్ని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా ఉపయోగించారు?

6. ప్రశాంతంగా ఉన్న సమయాన్ని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా ఉపయోగించారు?

6 మొదటి శతాబ్దపు క్రైస్తవులు తరచూ హింసను ఎదుర్కొన్నా, అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉన్న సమయాల్ని ఆనందించారు. ఆ సమయాల్ని వాళ్లు ఎలా ఉపయోగించారు? ఆ నమ్మకమైన స్త్రీపురుషులు మానకుండా మంచివార్త ప్రకటించారు. వాళ్లు “యెహోవా మార్గంలో నడుస్తూ” ఉన్నారని అపొస్తలుల కార్యాలు పుస్తకం చెప్తుంది. వాళ్లు మంచివార్త ప్రకటిస్తూ ఉండడం వల్ల “వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.” ప్రశాంతంగా ఉన్న సమయాల్లో వాళ్లు ఉత్సాహంగా చేసిన పరిచర్యను యెహోవా ఆశీర్వదించాడు.—అపొ. 9:26-31.

7-8. పౌలు, ఇతర క్రైస్తవులు తమకు దొరికిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నారు? వివరించండి.

7 మొదటి శతాబ్దపు క్రైస్తవులు మంచివార్త ప్రకటించడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు, పరిచర్య విషయంలో తన కోసం పెద్ద తలుపు తెరవబడిందని గుర్తించాడు. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అతను ఎఫెసులోనే ఉండి ప్రకటించాడు.—1 కొరిం. 16:8, 9.

8 క్రీ.శ. 49 లో సున్నతి గురించిన సమస్య పరిష్కారమైన తర్వాత పౌలుకు, ఇతర క్రైస్తవులకు మరో అవకాశం దొరికింది. (అపొ. 15:23-29) సున్నతి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సంఘాలకు తెలియజేసిన తర్వాత పౌలు, బర్నబా చాలామంది సహోదరులతో కలిసి “యెహోవా వాక్యం గురించిన మంచివార్త” చెప్పడానికి ఎంతో కృషి చేశారు. (అపొ. 15:30-35) దానివల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? “సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి, విశ్వాసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది” అని బైబిలు చెప్తుంది.—అపొ. 16:4, 5.

ప్రశాంతంగా ఉన్న సమయాల్ని మనమెలా ఉపయోగించుకోవచ్చు?

9. నేడు చాలా దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవచ్చు?

9 నేడు చాలా దేశాల్లో మనం ఏ ఇబ్బందీ లేకుండా ప్రకటించగలుగుతున్నాం. మీరు ఉంటున్న దేశంలో యెహోవాను స్వేచ్ఛగా ఆరాధించే అవకాశం ఉందా? అలాగైతే, ‘ప్రశాంతంగా ఉన్న ఈ సమయాన్ని నేనెలా ఉపయోగిస్తున్నాను?’ అని ప్రశ్నించుకోండి. ఈ చివరి రోజుల్లో యెహోవా ప్రజలు ముందెన్నడూ లేనంత ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు. (మార్కు 13:10) ఆ పని చేయడానికి మన ముందు ఏయే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

వేరే దేశంలో ప్రకటించడం ద్వారా లేదా వేరే భాషలో ప్రకటించడం ద్వారా చాలామంది ఎన్నో ఆశీర్వాదాలు పొందారు (10-12 పేరాలు చూడండి) *

10. రెండో తిమోతి 4:2 మనల్ని ఏం చేయమని ప్రోత్సహిస్తుంది?

10 ప్రశాంతంగా ఉన్న ఈ సమయాన్ని మీరెలా ఉపయోగించుకోవచ్చు? (2 తిమోతి 4:2 చదవండి.) మీ పరిస్థితుల్ని పరిశీలించుకుని మీరు గానీ మీ కుటుంబంలో ఒకరు గానీ ఇంకా ఎక్కువగా పరిచర్య చేయగలరేమో, వీలైతే పయినీరు సేవ చేయగలరేమో ఆలోచించవచ్చు. ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికి ఇది సమయం కాదు, ఎందుకంటే మహాశ్రమ దాటుకుని వెళ్లేటప్పుడు అవి మనతోపాటు రావు.—సామె. 11:4; మత్త. 6:31-33; 1 యోహా. 2:15-17.

11. వీలైనంత ఎక్కువమందికి మంచివార్త ప్రకటించడం కోసం కొంతమంది ప్రచారకులు ఏం చేశారు?

11 చాలామంది ప్రచారకులు ఇతరులకు ప్రకటించడం, బోధించడం కోసం కొత్త భాష నేర్చుకున్నారు. అలాంటి వాళ్లకు సహాయం చేయడానికి దేవుని సంస్థ ఎన్నో భాషల్లో బైబిలు ప్రచురణల్ని తయారుచేసింది. ఉదాహరణకు, 2010 లో మన ప్రచురణలు సుమారు 500 భాషల్లో ఉండేవి. ఇప్పుడు అవి 1,000 కన్నా ఎక్కువ భాషల్లో ఉన్నాయి!

12. రాజ్య సందేశాన్ని తమ మాతృభాషలో విన్నప్పుడు ప్రజలకు ఎలా అనిపిస్తుంది? ఒక ఉదాహరణ చెప్పండి.

12 దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని తమ మాతృభాషలో విన్నప్పుడు ప్రజలకు ఎలా అనిపిస్తుంది? అమెరికాలో ఉంటున్న ఒక సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె మాతృభాష అయిన కిన్యర్వాండలో ఒక ప్రాదేశిక సమావేశం జరిగింది. కిన్యర్వాండ అనేది కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాట్లాడే భాష. సమావేశానికి హాజరైన తర్వాత ఆ సహోదరి ఇలా అంది: “నేను అమెరికాకు వచ్చి 17 ఏళ్లు అయింది. ఇన్ని సంవత్సరాల్లో నాకు పూర్తిగా అర్థమైన సమావేశం ఇదొక్కటే.” అవును, సమావేశం తన మాతృభాషలో జరగడం వల్ల, విన్న విషయాలు ఆమె మనసును తాకాయి. మీ పరిస్థితుల్ని బట్టి, మీ ప్రాంతంలో కొంతమందికి సహాయం చేసేలా మీరు వేరే భాష నేర్చుకోగలరేమో ఆలోచించండి. ఒకవేళ వేరే భాషలో ప్రకటిస్తే మీ ప్రాంతంలో కొంతమంది ఎక్కువ ఆసక్తి చూపించవచ్చు. అలా ప్రయత్నిస్తే మీరు ఎంతో ఆనందం పొందుతారు.

13. ప్రశాంతంగా ఉన్న సమయాన్ని రష్యాలోని సహోదరులు ఎలా ఉపయోగించుకున్నారు?

13 మన సహోదరుల్లో చాలామందికి బహిరంగంగా ప్రకటించే స్వేచ్ఛ లేదు. కొన్ని దేశాల్లో ప్రభుత్వ ఆంక్షల వల్ల సహోదరులు స్వేచ్ఛగా ప్రకటించలేకపోతున్నారు. ఉదాహరణకు, రష్యాలో ఉన్న మన సహోదరుల గురించి ఆలోచించండి. చాలా దశాబ్దాల పాటు హింసను ఎదుర్కొన్న తర్వాత, 1991 మార్చిలో వాళ్లకు అధికారిక గుర్తింపు వచ్చింది. ఆ సమయంలో రష్యాలో సుమారు 16,000 మంది రాజ్య ప్రచారకులు ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత వాళ్ల సంఖ్య 1,60,000 దాటింది! స్వేచ్ఛగా ప్రకటించే అవకాశం ఉన్నప్పుడు మన సహోదరులు దాన్ని తెలివిగా ఉపయోగించుకున్నారని స్పష్టమౌతోంది. అయితే, ప్రశాంతంగా ఉన్న ఆ సమయం ఎక్కువకాలం కొనసాగలేదు. పరిస్థితులు మళ్లీ కష్టంగా మారాయి, అయినా సత్యారాధన పట్ల వాళ్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. తమకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్లు యెహోవా సేవలో కొనసాగుతున్నారు.

ప్రశాంతంగా ఉన్న సమయం ఎక్కువకాలం కొనసాగదు

ఆసా రాజు పట్టుదలగా ప్రార్థించిన తర్వాత, యూదా రాజ్యం పెద్ద శత్రు సైన్యాన్ని ఓడించేలా యెహోవా సహాయం చేశాడు (14-15 పేరాలు చూడండి)

14-15. ఆసాకు సహాయం చేయడానికి యెహోవా తన శక్తిని ఎలా ఉపయోగించాడు?

14 ఆసా రోజుల్లో, ప్రశాంతంగా ఉన్న సమయం కొంతకాలానికి ముగిసింది. ఇతియోపియాకు చెందిన జెరహు అనే సైన్యాధిపతి పది లక్షల కన్నా ఎక్కువమంది సైనికులతో యూదా మీదికి దండెత్తాడు. తాను, తన సైన్యం యూదాను ఖచ్చితంగా ఓడించగలమని అతను అనుకున్నాడు. ఆసా మాత్రం మనుషుల మీద కాదుగానీ తన దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆసా ఇలా ప్రార్థించాడు: “మా దేవా, యెహోవా, మేము నీ మీద ఆధారపడుతున్నాం, మాకు సహాయం చేయి, మేము నీ పేరున ఈ సమూహం మీదికి వచ్చాం.”—2 దిన. 14:11.

15 ఇతియోపీయుల సైన్యం ఆసా సైన్యం కన్నా దాదాపు రెండింతలు పెద్దది. అయినప్పటికీ, యెహోవా తన ప్రజల పక్షాన చర్య తీసుకోగలడని, ఆయనకు ఆ శక్తి ఉందని ఆసా నమ్మాడు. యెహోవా అతని నమ్మకాన్ని వమ్ము చేయలేదు; ఇతియోపీయులు ఘోరంగా ఓడిపోయారు.—2 దిన. 14:8-13.

16. ప్రశాంతంగా ఉన్న సమయం ఎక్కువకాలం కొనసాగదని మనకెలా తెలుసు?

16 భవిష్యత్తులో మనలో ప్రతీఒక్కరికి ఏం జరుగుతుందో మనకు వివరంగా తెలీదు. కానీ మనకు ఒక విషయం తెలుసు, అదేంటంటే ఇప్పుడు దేవుని ప్రజలు అనుభవిస్తున్న ప్రశాంతమైన సమయం ఎక్కువకాలం ఉండదు. ఎందుకంటే, చివరి రోజుల్లో తన శిష్యుల్ని ‘అన్నిదేశాల ప్రజలు ద్వేషిస్తారని’ యేసు ముందే చెప్పాడు. (మత్త. 24:9) “క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి” అని అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. (2 తిమో. 3:12) సాతాను “చాలా కోపంతో” ఉన్నాడు, మనం ఏదోక విధంగా అతని ఆగ్రహాన్ని తప్పించుకోగలం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే.—ప్రక. 12:12.

17. మన విశ్వాసం ఏయే విధాలుగా పరీక్షించబడవచ్చు?

17 అతిత్వరలో మనందరి విశ్వాసం పరీక్షించబడుతుంది. “లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు” రాని “మహాశ్రమ” వస్తుంది. (మత్త. 24:21) ఆ సమయంలో మన కుటుంబ సభ్యులే మనకు శత్రువులు అవ్వవచ్చు, ప్రభుత్వాలు మన పనిని నిషేధించవచ్చు. (మత్త. 10:35, 36) అప్పుడు ఆసాలాగే మనలో ప్రతీఒక్కరం యెహోవా మనకు సహాయం చేస్తాడని, కాపాడతాడని నమ్ముతామా?

18. హెబ్రీయులు 10:38, 39 ప్రకారం, భవిష్యత్తులో రాబోయే పరీక్షలకు మనమెలా సిద్ధంగా ఉండవచ్చు?

18 భవిష్యత్తులో రాబోయే పరీక్షల కోసం యెహోవా మనల్ని ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తున్నాడు. మనం తన సేవలో స్థిరంగా ఉండేలా “నమ్మకమైన, బుద్ధిగల దాసుడి” ద్వారా తగిన సమయంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తున్నాడు. (మత్త. 24:45) అయితే మన వంతు కృషి మనం చేస్తూ, యెహోవా మీద అచంచల విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి.—హెబ్రీయులు 10:38, 39 చదవండి.

19-20. మొదటి దినవృత్తాంతాలు 28:9 ప్రకారం, మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి? మనం ఆ ప్రశ్నలు ఎందుకు వేసుకోవాలి?

19 ఆసా రాజులాగే మనం ‘యెహోవాను వెదకాలి.’ (2 దిన. 14:4; 15:1, 2) మనం యెహోవాను తెలుసుకుని బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయన్ని వెదకడం మొదలుపెడతాం. దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుని యెహోవా మీద ప్రేమ పెంచుకుంటాం. ఈ విషయంలో మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఈ ప్రశ్న వేసుకోవచ్చు: ‘నేను సంఘ కూటాలకు క్రమంగా వెళ్తున్నానా?’ యెహోవా సంస్థ ఏర్పాటు చేసిన కూటాలకు హాజరైనప్పుడు ఆధ్యాత్మిక సేదదీర్పును, సహోదరసహోదరీలు ఇచ్చే ప్రోత్సాహాన్ని పొందుతాం. (మత్త. 11:28) మనం ఇలా కూడా ప్రశ్నించుకోవచ్చు: ‘నాకు మంచి వ్యక్తిగత అధ్యయన అలవాట్లు ఉన్నాయా? ప్రతీవారం కుటుంబ ఆరాధన కోసం సమయం వెచ్చిస్తున్నానా? ఒకవేళ నేను కుటుంబంతో కాకుండా ఒంటరిగా జీవిస్తుంటే, వారంలో ఒకరోజును అధ్యయనం కోసం కేటాయిస్తున్నానా? ప్రకటనా పనిలో, శిష్యుల్ని చేసే పనిలో వీలైనంత ఎక్కువగా పాల్గొంటున్నానా?’

20 మనం ఆ ప్రశ్నలు ఎందుకు వేసుకోవాలి? యెహోవా మన ఆలోచనల్ని, హృదయాన్ని పరిశీలిస్తాడని బైబిలు చెప్తుంది. మనం కూడా వాటిని పరిశీలించుకోవాలి. (1 దినవృత్తాంతాలు 28:9 చదవండి.) ఒకవేళ మన లక్ష్యాల్లో, వైఖరిలో, లేదా ఆలోచనా విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తే, అలా మార్పులు చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడగాలి. రాబోయే పరీక్షల కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రశాంతంగా ఉన్న సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి, అలా చేయకుండా మిమ్మల్ని ఏదీ అడ్డుకోనివ్వకండి!

పాట 62 కొత్త పాట

^ పేరా 5 మీరు ఉంటున్న దేశంలో యెహోవాను స్వేచ్ఛగా ఆరాధించే అవకాశం ఉందా? అలాగైతే, ప్రశాంతంగా ఉన్న ఈ సమయాన్ని మీరెలా ఉపయోగించుకుంటున్నారు? యూదా రాజైన ఆసాను, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని మీరెలా అనుకరించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ప్రశాంతంగా ఉన్న సమయాన్ని వాళ్లు తెలివిగా ఉపయోగించుకున్నారు.

^ పేరా 3 పదాల వివరణ: ప్రశాంతత అనే పదం యుద్ధం లేకపోవడాన్ని మాత్రమే సూచించట్లేదు. ఆ హీబ్రూ పదం ఆరోగ్యంగా, సురక్షితంగా, క్షేమంగా ఉండడాన్ని కూడా సూచిస్తుంది.

^ పేరా 57 చిత్రాల వివరణ: ఆసా తన అవ్వను రాజమాత స్థానంలో నుండి తీసేశాడు, ఎందుకంటే ఆమె అబద్ధ ఆరాధనను ప్రోత్సహించింది. ఆసాకు నమ్మకంగా మద్దతిచ్చిన వాళ్లు అతని ఆదర్శాన్ని పాటిస్తూ విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు.

^ పేరా 59 చిత్రాల వివరణ: అవసరం ఎక్కువున్న చోట సేవ చేయగలిగేలా ఒక జంట తమ జీవితాన్ని సరళం చేసుకుంటున్నారు.