కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 39

“జీవగ్రంథంలో” మీ పేరు ఉందా?

“జీవగ్రంథంలో” మీ పేరు ఉందా?

“యెహోవాకు భయపడుతున్నవాళ్ల కోసం, . . . ఆయన ముందు ఒక జ్ఞాపకార్థ గ్రంథం రాయబడింది.”మలా. 3:16.

పాట 61 సాక్షుల్లారా, ముందుకు సాగండి!

ఈ ఆర్టికల్‌లో. . . *

వందల సంవత్సరాలుగా, యెహోవా చాలామంది పేర్లను “జీవగ్రంథంలో” రాస్తూ ఉన్నాడు (1-2 పేరాలు చూడండి)

1. మలాకీ 3:16 ప్రకారం, యెహోవా ఏ పుస్తకం రాస్తున్నాడు? అందులో ఏం రాస్తున్నాడు?

 ఎన్నో వేల సంవత్సరాలుగా యెహోవా ఒక ప్రత్యేకమైన పుస్తకం రాస్తూ ఉన్నాడు. ఆ పుస్తకంలో ఆయన కొంతమంది పేర్లు రాస్తున్నాడు. అందులోని మొట్టమొదటి పేరు, నమ్మకమైన సాక్షి అయిన హేబెలుది. * (లూకా 11:50, 51) వందల సంవత్సరాలుగా, యెహోవా ఆ పుస్తకంలో చాలా పేర్లు రాస్తున్నాడు. ప్రస్తుతం దాంట్లో లక్షలమంది పేర్లు ఉన్నాయి. బైబిలు ఆ పుస్తకాన్ని “జ్ఞాపకార్థ గ్రంథం” లేదా “జీవగ్రంథం” అని పిలుస్తుంది. అయితే ఈ ఆర్టికల్‌లో మనం “జీవగ్రంథం” అనే మాటను ఉపయోగిస్తాం.—మలాకీ 3:16 చదవండి; ప్రక. 3:5; 17:8

2. జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయి? అందులో మన పేర్లు కూడా ఉండాలంటే ఏం చేయాలి?

2 యెహోవా పేరును విలువైనదిగా చూస్తూ భయంతో, ప్రగాఢ గౌరవంతో ఆయన్ని ఆరాధించే వాళ్లందరి పేర్లు ఈ ప్రత్యేక పుస్తకమైన జీవగ్రంథంలో ఉన్నాయి. అందులో ఎవరి పేర్లయితే ఉన్నాయో వాళ్లకు శాశ్వత జీవితం పొందే అవకాశం ఉంది. మనం కూడా ఒకవేళ యెహోవాతో దగ్గరి సంబంధం కలిగి ఉండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు విమోచన క్రయధనం మీద విశ్వాసం చూపిస్తే ఆ పుస్తకంలో మన పేర్లు రాయబడతాయి. (యోహా. 3:16, 36) మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా ఆ పుస్తకంలో మన పేర్లు ఉండాలని ప్రతీఒక్కరం కోరుకుంటాం.

3-4. (ఎ) ప్రస్తుతం మన పేరు జీవగ్రంథంలో ఉంటే, మనకు శాశ్వత జీవితం దొరికినట్టేనా? వివరించండి. (బి) ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏం తెలుసుకుంటాం?

3 అయితే, ఆ పుస్తకంలో పేర్లున్న వాళ్లందరూ ఖచ్చితంగా శాశ్వత జీవితాన్ని పొందుతారా? ఆ ప్రశ్నకు జవాబు యెహోవా మోషేతో అన్నమాటల్లో ఉంది. నిర్గమకాండం 32:33 లో యెహోవా ఇలా అన్నాడు: “ఎవరైతే నాకు వ్యతిరేకంగా పాపం చేశారో అతని పేరునే నా పుస్తకంలో నుండి తుడిచేస్తాను.” కాబట్టి ఆ పుస్తకంలో ఉన్న పేర్లను తుడిచేయవచ్చు అని అర్థమౌతుంది. అంటే, ఒక విధంగా యెహోవా మన పేర్లను పెన్సిల్‌తో రాశాడని చెప్పవచ్చు. (ప్రక. 3:5, అధస్సూచి) అయితే భవిష్యత్తులో ఆయన ఆ పేర్లను ఎప్పటికీ ఉండేలా, ఒకవిధంగా పెన్‌తో రాస్తాడు. అప్పటివరకు మన పేరు ఆ పుస్తకంలో అలానే ఉండేలా మనం చూసుకోవాలి.

4 అయితే మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. ఉదాహరణకు, జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ల గురించి అలాగే అందులో పేర్లు రాయబడని వాళ్ల గురించి బైబిలు ఏం చెప్తుంది? అందులో ఎవరి పేర్లయితే ఉన్నాయో వాళ్లు శాశ్వత జీవితాన్ని ఎప్పుడు పొందుతారు? యెహోవా గురించి తెలుసుకునే అవకాశం దొరకకముందే చనిపోయినవాళ్ల సంగతేంటి? వాళ్ల పేర్లు అందులో రాయబడే అవకాశం ఉందా? ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం.

జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయి?

5-6. (ఎ) ఫిలిప్పీయులు 4:3 ప్రకారం, జీవగ్రంథంలో పేర్లు ఉండే కొంతమంది ఎవరు? (బి) వాళ్ల పేర్లు అందులో ఎప్పటికీ ఉండేలా ఎప్పుడు రాయబడతాయి?

5 ఈ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయి? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి మనం ఐదు వేర్వేరు గుంపుల గురించి చూద్దాం. వీళ్లలో కొంతమంది పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, ఇంకొంతమందివి లేవు.

6 మొదటి గుంపు, యేసుతో పాటు పరలోకంలో పరిపాలించడానికి ఎంచుకోబడినవాళ్లు. ప్రస్తుతం వాళ్ల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న తన ‘తోటి పనివాళ్లతో’ అన్నమాటల్ని బట్టి, యేసుతో కలిసి పరిపాలించే అభిషిక్తుల పేర్లు ప్రస్తుతం జీవగ్రంథంలో ఉన్నాయని తెలుస్తోంది. (ఫిలిప్పీయులు 4:3 చదవండి.) కానీ ఆ గ్రంథంలో వాళ్ల పేర్లు ఎప్పటికీ ఉండాలంటే, వాళ్లు అంతం వరకు నమ్మకంగా ఉండాలి. వాళ్లు చివరి ముద్ర పొందిన తర్వాత, అంటే వాళ్లు చనిపోక ముందైనా లేదా మహాశ్రమ మొదలవ్వక ముందైనా, వాళ్ల పేర్లు ఈ గ్రంథంలో ఎప్పటికీ ఉండేలా రాయబడతాయి.—ప్రక. 7:3.

7. ప్రకటన 7:16, 17 ప్రకారం, వేరే గొర్రెలు ఉన్న గొప్ప సమూహం వాళ్ల పేర్లు జీవగ్రంథంలో ఎప్పటికీ ఉండేలా ఎప్పుడు రాయబడతాయి?

7 రెండో గుంపు, వేరే గొర్రెలు ఉన్న గొప్ప సమూహం. వాళ్ల పేర్లు ప్రస్తుతం జీవగ్రంథంలో ఉన్నాయా? ఉన్నాయి. హార్‌మెగిద్దోన్‌ దాటిన తర్వాత వాళ్ల పేర్లు జీవగ్రంథంలో అలానే ఉంటాయా? ఉంటాయి. (ప్రక. 7:14) ఈ గొర్రెల్లాంటి వాళ్లు “శాశ్వత జీవితాన్ని పొందుతారు” అని యేసు చెప్పాడు. (మత్త. 25:46) అయితే హార్‌మెగిద్దోన్‌ దాటాక వాళ్లు వెంటనే శాశ్వత జీవితాన్ని పొందరు. అప్పుడు కూడా వాళ్ల పేర్లు జీవగ్రంథంలో పెన్సిల్‌తో రాసినట్టే ఉంటాయి. వెయ్యేళ్ల పరిపాలనలో యేసు, “వాళ్లను కాపరిలా చూసుకుంటూ, జీవజలాల ఊటల దగ్గరికి నడిపిస్తాడు.” క్రీస్తు నడిపింపుకు లోబడి, యెహోవాకు నమ్మకంగా ఉన్నారని చివరి తీర్పు పొందినవాళ్ల పేర్లు జీవగ్రంథంలో ఎప్పటికీ ఉండిపోతాయి. అంటే, ఒకవిధంగా అప్పుడు వాళ్ల పేర్లు పెన్‌తో రాయబడతాయి.—ప్రకటన 7:16, 17 చదవండి.

8. జీవగ్రంథంలో ఎవరి పేర్లు లేవు? వాళ్లకు ఏం జరుగుతుంది?

8 మూడో గుంపు, హార్‌మెగిద్దోన్‌లో నాశనమయ్యే మేకల్లాంటి వాళ్లు. వాళ్ల పేర్లు జీవగ్రంథంలో లేవు. వాళ్లు “శాశ్వతంగా నాశనమౌతారు” అని యేసు చెప్పాడు. (మత్త. 25:46) వాళ్లకు “శాశ్వత నాశనమనే శిక్ష” పడుతుందని, అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. (2 థెస్స. 1:9; 2 పేతు. 2:9) అలాగే ఇప్పటివరకు భూమ్మీద జీవించిన వాళ్లలో ఎవరైతే పవిత్రశక్తికి వ్యతిరేకంగా కావాలనే పాపం చేశారో, వాళ్లు కూడా శాశ్వతంగా నాశనమౌతారు. అంటే వాళ్లకు శాశ్వత జీవితం దొరకదు. కాబట్టి వాళ్లు పునరుత్థానం అవ్వరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. (మత్త. 12:32; మార్కు 3:28, 29; హెబ్రీ. 6:4-6) అయితే ఇప్పుడు భూమ్మీద పునరుత్థానం అయ్యే రెండు గుంపుల వాళ్ల గురించి చూద్దాం.

పునరుత్థానం అయ్యే వాళ్లు ...

9. అపొస్తలుల కార్యాలు 24:15 ప్రకారం, భూమ్మీద పునరుత్థానం అయ్యే రెండు గుంపుల వాళ్లు ఎవరు? ఈ రెండు గుంపుల మధ్య తేడా ఏంటి?

9 భూమ్మీద ఎప్పటికీ జీవించే అవకాశంతో పునరుత్థానం అయ్యే రెండు గుంపుల గురించి బైబిలు చెప్తుంది. వాళ్లు ఎవరంటే, ‘నీతిమంతులు, అనీతిమంతులు.’ (అపొస్తలుల కార్యాలు 24:15 చదవండి.) “నీతిమంతులు” అంటే, బ్రతికున్నప్పుడు యెహోవాను నమ్మకంగా సేవించిన వాళ్లు. “అనీతిమంతులు” అంటే, యెహోవాను సేవించని వాళ్లు. ఈ అనీతిమంతుల్లో ఎంతోమంది చాలా చెడ్డ పనులు చేశారు. ఈ రెండు గుంపుల వాళ్లు పునరుత్థానం అవుతారు కాబట్టి, వాళ్ల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని చెప్పవచ్చా? దానికి జవాబు తెలుసుకోవడానికి, మనం ఈ రెండు గుంపుల్లో ఒక్కోదాని గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం.

10. “నీతిమంతులు” ఎందుకు పునరుత్థానం అవుతారు? వాళ్లలో కొంతమంది ఏ అవకాశాన్ని పొందుతారు? (ఈ పత్రికలో, భూమ్మీద జరగబోయే పునరుత్థానం గురించి వివరించే “పాఠకుల ప్రశ్న” కూడా చూడండి.)

10 నాలుగో గుంపు, “నీతిమంతులు.” చనిపోకముందు వాళ్ల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అయితే వాళ్లు చనిపోయినప్పుడు, వాళ్ల పేర్లు ఆ గ్రంథంలో నుండి తుడిచేయబడ్డాయా? లేదు. ఎందుకంటే, వాళ్లంతా యెహోవా దృష్టిలో “బ్రతికే ఉన్నారు.” ఆయన “చనిపోయినవాళ్లకు కాదు, బ్రతికున్నవాళ్లకే దేవుడు.” (లూకా 20:38) అంటే నీతిమంతులు భూమ్మీద తిరిగి బ్రతికించబడినప్పుడు, వాళ్ల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. కానీ పెన్సిల్‌తో రాసినట్టు ఉంటాయి. (లూకా 14:14) ఇలా పునరుత్థానమైన వాళ్లలో కొంతమంది “భూమంతటా అధిపతులుగా” సేవచేసే అవకాశాన్ని పొందుతారు.—కీర్త. 45:16.

11. తమ పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే “అనీతిమంతులు” ఏం నేర్చుకోవాలి?

11 చివరిగా ఐదో గుంపు, “అనీతిమంతులు.” బహుశా, వాళ్లు చనిపోకముందు యెహోవా ప్రమాణాలు తెలీక నీతిగా నడుచుకోలేదు. అందుకే వాళ్ల పేర్లు జీవగ్రంథంలో లేవు. అయితే వాళ్లను పునరుత్థానం చేయడం ద్వారా, వాళ్ల పేర్లు ఆ గ్రంథంలో రాయబడే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ “అనీతిమంతులకు” చాలా సహాయం అవసరం. ఎందుకంటే చనిపోకముందు వాళ్లలో కొంతమంది చాలా ఘోరమైన, చెడ్డ పనులు చేశారు. కాబట్టి యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం జీవించడం వాళ్లు నేర్చుకోవాలి. అందుకోసం దేవుడు తన రాజ్యం ద్వారా భూమ్మీద ముందెన్నడూ జరగని ఒక గొప్ప బోధనా పనిని మొదలుపెడతాడు.

12. (ఎ) అనీతిమంతులకు ఎవరు బోధిస్తారు? (బి) నేర్చుకోవడానికి ఇష్టపడనివాళ్లకు ఏం జరుగుతుంది?

12 అనీతిమంతులకు ఎవరు బోధిస్తారు? గొప్ప సమూహంలోని వాళ్లు, అలాగే పునరుత్థానమైన నీతిమంతులు. అనీతిమంతుల పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే వాళ్లు యెహోవాకు స్నేహితులవ్వాలి, ఆయనకు సమర్పించుకోవాలి. వీళ్లందరూ యెహోవా నీతి ప్రమాణాల్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో లేదో యేసుక్రీస్తు, ఆయన తోటి పరిపాలకులు జాగ్రత్తగా గమనిస్తుంటారు. (ప్రక. 20:4) నేర్చుకోవడానికి ఇష్టపడనివాళ్లు కొత్తలోకం నుండి తీసేయబడతారు, వాళ్లకు నూరేళ్లు ఉన్నాసరే. (యెష. 65:20) యెహోవా, యేసు హృదయాల్ని చదవగలరు కాబట్టి, ఇతరులకు హాని చేసే వాళ్లెవ్వర్నీ కొత్తలోకంలో ఉండనివ్వరు.—యెష. 11:9; 60:18; 65:25; యోహా. 2:25.

జీవించడానికి బ్రతికించబడడం, తీర్పు పొందడానికి బ్రతికించబడడం

13-14. (ఎ) యోహాను 5:29 లో ఉన్న యేసు మాటల్ని గతంలో మనం ఎలా అర్థం చేసుకున్నాం? (బి) యేసు మాటల్ని పరిశీలించాక ఏం స్పష్టమౌతుంది?

13 భూమ్మీద పునరుత్థానం అయ్యే వాళ్ల గురించి యేసు కూడా చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు; మంచిపనులు చేసినవాళ్లు జీవించడానికి బ్రతికించబడతారు, అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు తీర్పు పొందడానికి బ్రతికించబడతారు.” (యోహా. 5:28, 29) యేసు మాటలకు అర్థమేంటి?

14 యేసు ఇక్కడ, చనిపోయినవాళ్లు తిరిగి బ్రతికించబడిన తర్వాత చేసే పనుల గురించి చెప్తున్నాడని మనం గతంలో అనుకున్నాం. అంటే పునరుత్థానం అయ్యాక కొంతమంది మంచిపనులు చేస్తారని, కొంతమంది నీచమైన పనులు చేస్తారని మనం అనుకున్నాం. అయితే సమాధుల్లో నుండి బయటికి వచ్చినవాళ్లు మంచిపనులు చేస్తారని లేదా నీచమైన పనులు చేస్తారని యేసు చెప్పలేదని గమనించండి. బదులుగా “మంచిపనులు చేసినవాళ్లు,” “నీచమైన పనులు చేసినవాళ్లు” అని అన్నాడు. అంటే, వాళ్లు చనిపోకముందు చేసిన పనుల గురించి యేసు మాట్లాడుతున్నాడని అర్థమౌతుంది. అలా అనుకోవడమే సరైనది. ఎందుకంటే, కొత్తలోకంలో నీచమైన పనులు చేసే వాళ్లెవ్వర్నీ యెహోవా, యేసు ఉండనివ్వరు. కాబట్టి అనీతిమంతులు నీచమైన పనులు చేసింది చనిపోకముందే అని స్పష్టమౌతుంది. మరైతే “జీవించడానికి బ్రతికించబడతారు,” “తీర్పు పొందడానికి బ్రతికించబడతారు” అన్న యేసు మాటలకు అర్థమేంటి?

15. ‘జీవించడానికి బ్రతికించబడేది’ ఎవరు? ఎందుకు?

15 నీతిమంతులు, అంటే చనిపోకముందు మంచిపనులు చేసినవాళ్లు “జీవించడానికి బ్రతికించబడతారు.” ఎందుకంటే, అప్పటికే వాళ్ల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. దానర్థం, యోహాను 5:29 లో చెప్పిన “మంచిపనులు చేసినవాళ్లు,” అలాగే అపొస్తలుల కార్యాలు 24:15 లో చెప్పిన “నీతిమంతులు” ఒక్కరే. ఈ అవగాహన రోమీయులు 6:7 లో ఉన్న మాటలతో సరిగ్గా సరిపోతుంది. అక్కడిలా ఉంది: “చనిపోయిన వ్యక్తి తన పాపం నుండి విడుదల పొందాడు.” కాబట్టి ఈ నీతిమంతులు చనిపోయినప్పుడు, వాళ్లు చేసిన పాపాల్ని యెహోవా క్షమించేశాడు. కానీ వాళ్లు బ్రతికి ఉన్నప్పుడు విశ్వాసంతో చేసిన మంచి పనులన్నిటినీ ఆయన గుర్తుంచుకుంటాడు. (హెబ్రీ. 6:10) అయితే వాళ్ల పేర్లు జీవగ్రంథంలో ఎప్పటికీ అలాగే ఉండాలంటే, పునరుత్థానమైన ఈ నీతిమంతులు యెహోవాకు ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి.

16. ‘తీర్పు పొందడానికి బ్రతికించబడడం’ అంటే ఏంటి?

16 చనిపోకముందు నీచమైన పనులు చేసినవాళ్ల సంగతేంటి? చనిపోయినప్పుడు యెహోవా వాళ్ల పాపాల్ని క్షమించేశాడు. అయితే చనిపోకముందు వాళ్లు యెహోవాను ఆరాధించలేదు. అందుకే వాళ్ల పేర్లు జీవగ్రంథంలో లేవు. కాబట్టి యోహాను 5:29 లో ఉన్న “నీచమైన పనులు చేసినవాళ్లు,” అలాగే అపొస్తలుల కార్యాలు 24:15 లో ఉన్న “అనీతిమంతులు” ఒక్కరే. వాళ్లు “తీర్పు పొందడానికి బ్రతికించబడతారు.” * అంటే పునరుత్థానం అయిన తర్వాత వాళ్లు చేసే పనుల్ని యేసు జాగ్రత్తగా గమనిస్తాడు. (లూకా 22:30) జీవగ్రంథంలో వాళ్ల పేర్లు రాయడానికి వాళ్లు అర్హులో కాదో నిర్ణయించడానికి సమయం పడుతుంది. చనిపోకముందు వాళ్లు చేసిన చెడ్డపనుల్ని పూర్తిగా విడిచిపెట్టి, యెహోవాకు సమర్పించుకుంటేనే ఈ అనీతిమంతుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి.

17-18. భూమ్మీద జీవించడానికి పునరుత్థానం అయ్యే వాళ్లందరూ ఏం చేయాలి? ప్రకటన 20:12, 13 లో చెప్పిన “తమతమ పనుల్ని బట్టి” అనే మాటకు అర్థం ఏంటి?

17 నీతిమంతులైనా, అనీతిమంతులైనా పునరుత్థానమైన వాళ్లందరూ వెయ్యేళ్లలో విప్పబడే కొత్త గ్రంథాల్లో ఉన్న ఆజ్ఞలకు లోబడాలి. అపొస్తలుడైన యోహాను తాను దర్శనంలో చూసిన దానిగురించి ఇలా రాశాడు: “గొప్పవాళ్లే గానీ, సామాన్యులే గానీ చనిపోయిన వాళ్లందరూ ఆ సింహాసనం ముందు నిలబడి ఉండడం నేను చూశాను. అప్పుడు గ్రంథపు చుట్టలు విప్పబడ్డాయి. అయితే ఇంకో గ్రంథపు చుట్ట విప్పబడింది, అది జీవగ్రంథం. చనిపోయినవాళ్లు గ్రంథపు చుట్టల్లో రాసివున్న వాటి ప్రకారం తమతమ పనుల్ని బట్టి తీర్పు పొందారు.”—ప్రక. 20:12, 13.

18 పునరుత్థానమైన వాళ్లు ఏ “పనుల్ని బట్టి” తీర్పు పొందుతారు? వాళ్లు చనిపోకముందు చేసిన పనుల్ని బట్టా? కాదు! వాళ్లు చనిపోయినప్పుడు తమ పాపాల నుండి విడుదల పొందారని గుర్తుంచుకోండి. కాబట్టి “తమతమ పనుల్ని బట్టి” అనే మాటకు అర్థం, వాళ్లు చనిపోకముందు చేసిన పనులైతే కాదు. బదులుగా కొత్తలోకంలో వాళ్లు నేర్చుకునేవాటిని బట్టి చేసే పనుల్ని అది సూచిస్తుంది. దేవున్ని ఎంతో నమ్మకంగా సేవించిన నోవహు, సమూయేలు, దావీదు, దానియేలు లాంటి వాళ్లు కూడా యేసుక్రీస్తు గురించి నేర్చుకుని, ఆయన బలిమీద విశ్వాసం చూపించాలి. అలాంటప్పుడు, “అనీతిమంతులు” ఇంకెంత నేర్చుకోవాలో కదా!

19. ఈ గొప్ప అవకాశాన్ని కాదనుకున్న వాళ్లకు చివరికి ఏం జరుగుతుంది?

19 ఈ గొప్ప అవకాశాన్ని కాదనుకున్న వాళ్లకు చివరికి ఏం జరుగుతుంది? ప్రకటన 20:15 ఇలా చెప్తుంది: “ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో లేవో వాళ్లు అగ్ని సరస్సులో పడేయబడ్డారు.” వాళ్లు ఎప్పటికీ తిరిగిరాకుండా, పూర్తిగా నాశనం చేయబడతారు. కాబట్టి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి, అందులో ఎప్పటికీ అలాగే ఉండిపోయేలా చూసుకోవడం ఎంతో ప్రాముఖ్యం.

వెయ్యేళ్లలో జరిగే గొప్ప బోధనా పనిలో, ఒక సహోదరుడు బోధిస్తున్నాడు (20వ పేరా చూడండి)

20. వెయ్యేళ్ల పరిపాలనలో ఎలాంటి ఆసక్తికరమైన పని జరుగుతుంది? (కవర్‌ పేజీ మీదున్న చిత్రాన్ని చూడండి.)

20 వెయ్యేళ్ల పరిపాలన ఎంత ఆసక్తికరమైన సమయమో కదా! అప్పుడు భూమ్మీద ముందెన్నడూ జరగని ఒక గొప్ప బోధనా పని మొదలౌతుంది. అంతేకాదు ఆ సమయంలో నీతిమంతులు, అలాగే అనీతిమంతులు యెహోవాకు ఇష్టపూర్వకంగా లోబడతారో లేదో నిరూపించుకోవాలి. (యెష. 26:9; అపొ. 17:31) ఈ గొప్ప బోధనా పని ఎలా జరుగుతుంది? దాని గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

పాట 147 యెహోవా శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు

^ యోహాను 5:28, 29 లో కొంతమంది “జీవించడానికి బ్రతికించబడతారు” అని, కొంతమంది “తీర్పు పొందడానికి బ్రతికించబడతారు” అని యేసు చెప్పాడు. ఆ మాటలకు, మన అవగాహనలో వచ్చిన మార్పును ఈ ఆర్టికల్‌లో చూస్తాం. యేసు మాటలకు అర్థం ఏంటో, ఎవరెవరు తిరిగి బ్రతికించబడతారో లేదా పునరుత్థానం అవుతారో తెలుసుకుంటాం.

^ “ప్రపంచం పుట్టిన దగ్గర నుండి” యెహోవా ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. ప్రపంచం అనే మాట, యేసు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉన్న ప్రజల్ని సూచిస్తుంది. (మత్త. 25:34; ప్రక. 17:8) అందుకే జీవగ్రంథంలో మొదటి పేరు నీతిమంతుడైన హేబెలుదే అని చెప్పవచ్చు.

^ ఇక్కడ ఉపయోగించబడిన “తీర్పు” అనే మాటకు, శిక్షించడం లేదా ఖండించడం అనే అర్థాలు ఉన్నాయని ఇంతకుముందు అనుకున్నాం. నిజానికి “తీర్పు” అనే మాటకు ఆ అర్థాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో యేసు ఉపయోగించిన “తీర్పు” అనే మాటకు, ఎవరినైనా బాగా గమనించడం, పరీక్షించడం లేదా ఒక గ్రీకు డిక్షనరీ చెప్తున్నట్టు “ఒకరి ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించడం” అనే అర్థాలున్నాయి అని చెప్పవచ్చు.