కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

ఈ భూమ్మీద ఎవరు పునరుత్థానం అవుతారు? వాళ్లు ఎలాంటి పునరుత్థానాన్ని పొందుతారు?

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు చూద్దాం.

“నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడని” లేదా పునరుత్థానం చేస్తాడని అపొస్తలుల కార్యాలు 24:15 చెప్తుంది. నీతిమంతులు అంటే, చనిపోకముందు దేవునికి లోబడినవాళ్లు. కాబట్టి వాళ్ల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. (మలా. 3:16) అనీతిమంతులు అంటే, యెహోవా గురించి నేర్చుకునే అవకాశం దొరకకముందే చనిపోయినవాళ్లు. కాబట్టి వాళ్ల పేర్లు జీవగ్రంథంలో రాయబడలేదు.

అపొస్తలుల కార్యాలు 24:15 లో ఉన్న రెండు గుంపుల గురించి యోహాను 5:28, 29 కూడా చెప్తోంది. “మంచిపనులు చేసినవాళ్లు జీవించడానికి బ్రతికించబడతారు, అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు తీర్పు పొందడానికి బ్రతికించబడతారు” అని యేసు చెప్పాడు. నీతిమంతులు చనిపోకముందు మంచిపనులు చేశారు. వాళ్ల పేర్లు ఇంకా జీవగ్రంథంలో ఉన్నాయి, కాబట్టి వాళ్లు జీవించడానికి తిరిగి బ్రతికించబడతారు. అయితే అనీతిమంతులు చనిపోకముందు అలవాటుగా నీచమైన పనులు చేశారు, కాబట్టి వాళ్లు తీర్పు పొందడానికి తిరిగి బ్రతికించబడతారు. వాళ్ల పేర్లు ఇంకా జీవగ్రంథంలో రాయబడలేదు. వాళ్లకు కొంతకాలం తీర్పు తీర్చబడుతుంది, అంటే వాళ్ల ప్రవర్తన గమనించబడుతుంది. ఆ సమయంలో యెహోవా గురించి నేర్చుకుని, వాళ్ల పేర్లు జీవగ్రంథంలో రాయించుకునే అవకాశం వాళ్లకు దొరుకుతుంది.

తిరిగి బ్రతికించబడిన వాళ్లందరూ “గ్రంథపు చుట్టల్లో రాసివున్న” వాటికి, అంటే కొత్తలోకంలో దేవుడిచ్చే కొత్త ఆజ్ఞలకు లోబడాలి అని ప్రకటన 20:12, 13 చెప్తుంది. వాటికి లోబడని వాళ్లను యెహోవా నాశనం చేస్తాడు.—యెష. 65:20.

“చనిపోయిన చాలామంది లేస్తారు; కొంతమంది శాశ్వత జీవితం కోసం లేస్తారు, ఇతరులు నిందలపాలు కావడం కోసం, శాశ్వత తిరస్కారానికి గురవ్వడం కోసం లేస్తారు” అని దానియేలు 12:2 ముందే చెప్పింది. ఈ వచనం, తిరిగి బ్రతికించబడిన వాళ్లకు చివరికి ఏమౌతుందో చెప్తుంది. వాళ్లు “శాశ్వత జీవితం” గానీ“శాశ్వత తిరస్కారం” గానీ పొందుతారు. కాబట్టి వెయ్యేళ్ల చివర్లో, కొంతమంది శాశ్వత జీవితాన్ని పొందుతారు, ఇతరులు శాశ్వతంగా నాశనమౌతారు.—ప్రక. 20:15; 21:3, 4.

దీన్ని అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. తిరిగి బ్రతికించబడిన ఈ రెండు గుంపుల వాళ్లను, వేరే దేశంలో ఉండడానికి వలస వెళ్లే వాళ్లతో పోల్చవచ్చు. అలా వెళ్లే వాళ్లలో కొంతమందికి, అక్కడ పని చేసుకోవడానికి లేదా నివసించడానికి వీసా దొరుకుతుంది. దానివల్ల వాళ్లకు కాస్త స్వేచ్ఛ, గుర్తింపు ఉంటుంది. నీతిమంతుల్ని వీళ్లతో పోల్చవచ్చు. ఇంకొంతమందికి, తాత్కాలిక వీసా లేదా ఆ ప్రాంతాన్ని చూసి రావడానికి కావల్సిన వీసా దొరుకుతుంది. అలాంటివాళ్లు ఆ కొత్త దేశంలో ఎప్పటికీ ఉండిపోవాలంటే, ముందుగా తమనుతాము నిరూపించుకోవాలి. అనీతిమంతుల్ని వీళ్లతో పోల్చవచ్చు. తిరిగి బ్రతికించబడిన అనీతిమంతులు పరదైసు భూమ్మీద ఎప్పటికీ జీవించాలంటే, యెహోవా నియమాలకు లోబడి, తమనుతాము నీతిమంతులుగా నిరూపించుకోవాలి. వలస వెళ్లేవాళ్లు కొత్త దేశానికి వెళ్లినప్పుడు మొదట్లో ఎలాంటి వీసా పొందినా, కొన్నిరోజుల తర్వాత వాళ్లలో కొంతమంది ఆ దేశ పౌరసత్వం పొందుతారు, ఇంకొంతమంది ఆ దేశం నుండి పంపించేయబడతారు. ఆ కొత్త దేశంలో వాళ్ల ప్రవర్తన, అలవాట్లను బట్టి ఆ నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా తిరిగి బ్రతికించబడిన వాళ్లందరికీ చివర్లో ఏం జరుగుతుందనేది, కొత్తలోకంలో వాళ్లు దేవునికి నమ్మకంగా ఉంటారా, వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అనే వాటిమీద ఆధారపడి ఉంటుంది.

యెహోవా ప్రేమ, కనికరం గల దేవుడు మాత్రమే కాదు, నీతిన్యాయాలు గల దేవుడు కూడా. (ద్వితీ. 32:4; కీర్త. 33:5) ఆయన నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని తిరిగి బ్రతికించడం ద్వారా లేదా పునరుత్థానం చేయడం ద్వారా ప్రేమ చూపిస్తాడు. అదే సమయంలో, మంచి చెడుల విషయంలో ఆయన పెట్టిన నీతి ప్రమాణాలకు అందరూ లోబడాలని కోరుకుంటాడు. ఆయన్ని ప్రేమించి, ఆయన నీతి ప్రమాణాలకు లోబడేవాళ్లు మాత్రమే కొత్తలోకంలో ఎప్పటికీ జీవించేలా అనుమతించబడతారు.