కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 38

మీరు నమ్మదగినవాళ్లని నిరూపించుకోండి

మీరు నమ్మదగినవాళ్లని నిరూపించుకోండి

“నమ్మదగినవాడు రహస్యాలు దాచిపెడతాడు.”సామె. 11:13.

పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం

ఈ ఆర్టికల్‌లో. . . a

1. ఎవరైనా నమ్మదగినవాళ్లని మనం ఎలా చెప్పవచ్చు?

 నమ్మదగినవాళ్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, నిజమే మాట్లాడడానికి కృషి చేస్తారు. (కీర్త. 15:4) అలాంటి వాళ్లమీద ఆధారపడవచ్చని మనకు తెలుసు. సహోదర సహోదరీలు మన గురించి అలానే అనుకోవాలని మనం కోరుకుంటాం. అయితే వాళ్ల నమ్మకాన్ని మనం ఎలా సంపాదించుకోవచ్చు?

2. మనం నమ్మదగిన వాళ్లమని ఎలా నిరూపించుకోవచ్చు?

2 మనల్ని నమ్మమని మనం ఇతరుల్ని బలవంతం చేయలేం. నమ్మకాన్ని మనం సంపాదించుకోవాల్సిందే. దాన్ని డబ్బుతో పోల్చవచ్చు. డబ్బును సంపాదించడం కష్టం, కానీ దాన్ని పోగొట్టుకోవడం సులువు. నమ్మకం కూడా అంతే. యెహోవా ఖచ్చితంగా నమ్మదగినవాడని నిరూపించుకున్నాడు. “ఆయన చేసేవన్నీ నమ్మదగినవి” కాబట్టి, ఆయనమీద మన నమ్మకం కోల్పోయే పరిస్థితి ఎప్పటికీ రాదు. (కీర్త. 33:4) మనం కూడా ఆయనలాగే ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (ఎఫె. 5:1) కొంతమంది యెహోవా సేవకులు, తమ పరలోక తండ్రిలానే ఉంటూ నమ్మదగినవాళ్లని నిరూపించుకున్నారు. వాళ్ల ఉదాహరణల్ని ఇప్పుడు చూద్దాం. అలాగే, మనం నమ్మదగినవాళ్లుగా ఉండడానికి సహాయం చేసే ఐదు లక్షణాల గురించి కూడా తెలుసుకుందాం.

నమ్మదగిన యెహోవా సేవకుల నుండి నేర్చుకోండి

3-4. తాను నమ్మదగిన వాడినని దానియేలు ప్రవక్త ఎలా నిరూపించుకున్నాడు? ఆయన ఉదాహరణ చూసి, మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

3 నమ్మదగినవాడిగా నిరూపించుకునే విషయంలో దానియేలు ప్రవక్త మంచి ఆదర్శాన్ని ఉంచాడు. ఆయన్ని బబులోనుకు బందీగా తీసుకెళ్లారు. అయినా, ఆయన అక్కడ నమ్మదగినవాడు అనే పేరు సంపాదించుకున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరుకు వచ్చిన కలల అర్థాన్ని, యెహోవా సహాయంతో చెప్పినప్పుడు ప్రజలకు దానియేలు మీద ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. ఒకసారైతే, రాజుకు అస్సలు ఇష్టంలేని విషయాన్ని దానియేలు చెప్పాల్సి వచ్చింది. రాజు చేస్తున్న పనుల్నిబట్టి యెహోవా సంతోషించట్లేదని ఆయన చెప్పాలి. అలా చేయడానికి దానియేలుకు చాలా ధైర్యం అవసరం, ఎందుకంటే నెబుకద్నెజరు చాలా కోపిష్ఠి. (దాని. 2:12; 4:20-22, 25) చాలా సంవత్సరాల తర్వాత, బబులోను రాజభవనం గోడమీద ఎవ్వరికీ అర్థంకాని ఒక సందేశం కనిపించింది. దాని అర్థాన్ని చెప్పడం ద్వారా తాను నమ్మదగిన వాడినని దానియేలు మళ్లీ నిరూపించుకున్నాడు. (దాని. 5:5, 25-29) కొంతకాలం తర్వాత, దానియేలుకు “అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయి” అని మాదీయుడైన దర్యావేషు, ఆయన అధికారులు గుర్తించారు. “దానియేలు నమ్మకస్థుడు, అతను పనిలో అశ్రద్ధగా ఉండేవాడు కాదు, అవినీతికి పాల్పడేవాడు కాదు” అని కూడా వాళ్లు ఒప్పుకున్నారు. (దాని. 6:3, 4) యెహోవాను ఆరాధించని పరిపాలకులు కూడా దానియేలు నమ్మదగినవాడని గుర్తించారు.

4 దానియేలు ఉదాహరణను మనసులో ఉంచుకుని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘సాక్షులుకాని వాళ్ల దగ్గర నాకు ఎలాంటి పేరుంది? ఇచ్చిన బాధ్యతల్ని చక్కగా చేస్తాడు, నమ్మదగినవాడు అనే పేరు నాకు ఉందా?’ ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం నమ్మదగినవాళ్లలా ఉంటే యెహోవాకు మహిమ తీసుకొస్తాం.

ముఖ్యమైన పనులు చేయడానికి నెహెమ్యా నమ్మకమైన పురుషుల్ని ఎంచుకున్నాడు (5వ పేరా చూడండి)

5. హనన్యాకు నమ్మదగినవాడు అనే పేరు ఎందుకు ఉంది?

5 క్రీ.పూ. 455 లో యెరూషలేము గోడల్ని తిరిగి కట్టిన తర్వాత, నగరాన్ని చక్కగా చూసుకునే నమ్మదగిన వాళ్లకోసం అధిపతి అయిన నెహెమ్యా వెతికాడు. నెహెమ్యా ఎంచుకున్న వాళ్లలో ఒకరు కోట అధిపతి అయిన హనన్యా. ఆయన “ఎంతో నమ్మకస్థుడు, ఎంతోమంది కన్నా సత్యదేవునికి ఎక్కువగా భయపడేవాడు” అని బైబిలు హనన్యా గురించి చెప్తుంది. (నెహె. 7:2) యెహోవా మీద ప్రేమ, ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయకూడదు అనే భయం ఉండడం వల్ల, తనకు ఇచ్చిన ప్రతీ నియామకాన్ని హనన్యా కష్టపడి చేశాడు. మనకు కూడా యెహోవా మీద ప్రేమ, భయం ఉంటే ఆయన సేవలో నమ్మదగిన వాళ్లలా ఉంటాం.

6. అపొస్తలుడైన పౌలుకు నమ్మదగిన స్నేహితుడని తుకికు ఎలా నిరూపించుకున్నాడు?

6 అపొస్తలుడైన పౌలుకు నమ్మదగిన సహోదరుడిగా ఉన్న తుకికు ఉదాహరణ గురించి ఆలోచించండి. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు, పౌలు తుకికు మీద ఆధారపడ్డాడు. తుకికు ఒక “నమ్మకమైన పరిచారకుడు” అని కూడా పౌలు చెప్పాడు. (ఎఫె. 6:21, 22) ఎఫెసు, కొలొస్సయి సంఘాల్లో ఉన్న సహోదరులకు ఉత్తరాల్ని అందించే పనిని, అలాగే వాళ్లను ప్రోత్సహించే, ఓదార్చే పనిని అప్పగించడం ద్వారా తనకు తుకికు మీద ఎంతో నమ్మకం ఉందని పౌలు చూపించాడు. తుకికు గురించి ఆలోచిస్తే, నేడు మన ఆధ్యాత్మిక అవసరాల్ని చూసుకుంటున్న నమ్మదగిన, ఆధారపడదగిన సహోదరులు గుర్తుకొస్తారు.—కొలొ. 4:7-9.

7. మీ పెద్దల్ని, సంఘ పరిచారకుల్ని చూసి నమ్మదగిన వాళ్లుగా ఉండే విషయంలో మీరేం నేర్చుకోవచ్చు?

7 నేడు కూడా పెద్దలు, సంఘ పరిచారకులు నమ్మదగిన వాళ్లుగా ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తాం. వాళ్లు దానియేలు, హనన్యా, తుకికులాగే తమ బాధ్యతల్ని శ్రద్ధగా చేస్తారు. ఉదాహరణకు వారం మధ్యలో జరిగే మీటింగ్‌కి వెళ్లినప్పుడు, కార్యక్రమంలోని అన్ని భాగాల్ని పెద్దలు నియమించారా, లేదా అని మనం అస్సలు సందేహించం. మీటింగ్‌లో నియామకం పొందినవాళ్లు కూడా, తమ భాగాన్ని చక్కగా సిద్ధపడి చేయడం చూసి పెద్దలు ఎంతో సంతోషిస్తారు. అంతేకాదు ఆదివారం జరిగే మీటింగ్‌లో బహిరంగ ప్రసంగాన్ని ఇచ్చే సహోదరుణ్ణి నియమించడం మర్చిపోయారేమో అని అనుకుని, మన బైబిలు విద్యార్థుల్ని పిలవడానికి వెనకాడతామా? లేదు కదా! అలాగే పరిచర్య కోసం ప్రచురణలు ఉంటాయో లేవో అనే సందేహం మనకు రాదు. ఈ నమ్మకమైన సహోదరులు మనల్ని చక్కగా చూసుకుంటున్నందుకు నిజంగా మనం యెహోవాకు థ్యాంక్స్‌ చెప్తాం. అయితే మనం నమ్మదగిన వాళ్లమని ఇంకా ఏ విధాలుగా నిరూపించుకోవచ్చు?

రహస్యంగా ఉంచాల్సిన విషయాల్ని ఎవరికీ చెప్పకుండా నమ్మదగిన వాళ్లుగా ఉండండి

8. మనం వేరేవాళ్ల మీద శ్రద్ధ చూపిస్తూనే, వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఎలా ఉండవచ్చు? (సామెతలు 11:13)

8 మనం సహోదర సహోదరీల్ని ప్రేమిస్తాం. అలాగే వాళ్లు ఎలా ఉన్నారు అనే విషయాల గురించి పట్టించుకుంటాం. అయితే మనం వేరేవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కొన్ని విషయాలు వాళ్ల వ్యక్తిగతం అని గుర్తించి, వాటిలో తలదూర్చకుండా ఉండాలి. మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘంలో కొంతమంది “ఊసుపోని కబుర్లు చెప్పడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, తాము మాట్లాడకూడని విషయాల గురించి మాట్లాడడం” వంటివి చేసేవాళ్లు. (1 తిమో. 5:13) మనం వాళ్లలా ఉండాలని అస్సలు అనుకోం. కానీ ఎవరైనా వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి మనకు చెప్పి, దాన్ని రహస్యంగా ఉంచమని చెప్తే అప్పుడేంటి? ఉదాహరణకు ఒక సహోదరి తన అనారోగ్యం గురించి లేదా తాను ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మనకు చెప్పి, దాన్ని రహస్యంగా ఉంచమని అడిగితే, మనం ఆమె చెప్పినట్టే చేయాలి. b (సామెతలు 11:13 చదవండి.) అయితే మనం ఎవరెవరి విషయాల్ని రహస్యంగా ఉంచాలో ఇప్పుడు చూద్దాం.

9. కుటుంబంలో ప్రతీఒక్కరు, నమ్మదగిన వాళ్లమని ఎలా నిరూపించుకోవచ్చు?

9 కుటుంబంలో. ఇంట్లో విషయాల గురించి వేరేవాళ్లకు చెప్పకుండా ఉండాల్సిన బాధ్యత, కుటుంబంలో ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఉదాహరణకు, తన భార్యకు ఉన్న ఒక అలవాటును బట్టి భర్త ఆమెను ఆటపట్టిస్తుండవచ్చు. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పి, ఆమెను ఇబ్బంది పెడతాడా? ఆయన అస్సలు అలా చేయడు. తన భార్యను ప్రేమిస్తాడు కాబట్టి, ఆమెను బాధపెట్టే ఏ పనీ చేయాలనుకోడు. (ఎఫె. 5:33) టీనేజీలో ఉన్న పిల్లలకు కూడా కాస్త గౌరవం ఇవ్వడం ముఖ్యమని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. వాళ్ల తప్పుల గురించి ఇతరులకు చెప్పి వాళ్లను అవమానించద్దు. (కొలొ. 3:21) పిల్లలు కూడా వివేచన చూపించడం నేర్చుకోవాలి. ఇంట్లోవాళ్లను ఇబ్బందిపెట్టే విషయాల్ని పిల్లలు బయటివాళ్లకు చెప్పకూడదు. (ద్వితీ. 5:16) కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని, వేరేవాళ్లకు చెప్పకుండా ఉండడానికి కుటుంబంలో ప్రతీఒక్కరు బాగా కృషి చేయాలి. అప్పుడు, కుటుంబంలో అందరూ ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు.

10. నిజమైన స్నేహితులు ఎలా ఉంటారు? (సామెతలు 17:17)

10 స్నేహితులతో. కొన్నిసార్లు మనకు నిజంగా ఎలా అనిపిస్తుందో మన స్నేహితులకు చెప్పాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు అలా చేయడం మనకు కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే అలా ఎవరితోనైనా మనసువిప్పి మాట్లాడే అలవాటు మనకు ఉండకపోవచ్చు. ఒకవేళ మన స్నేహితుడు మనం చెప్పినదాని గురించి తర్వాత వేరేవాళ్లకు చెప్పాడని తెలిస్తే, మనకు చాలా బాధేస్తుంది. అయితే మన వ్యక్తిగత విషయాల్ని ఇతరులకు చెప్పకుండా రహస్యంగా ఉంచే స్నేహితులు దొరికినందుకు మనం ఎంతో సంతోషిస్తాం. వాళ్లు మన “నిజమైన స్నేహితులు.”—సామెతలు 17:17 చదవండి.

రహస్యంగా ఉంచాల్సిన విషయాల్ని పెద్దలు తమ కుటుంబ సభ్యులకు చెప్పరు (11వ పేరా చూడండి) c

11. (ఎ) పెద్దలు, వాళ్ల భార్యలు నమ్మదగిన వాళ్లని ఎలా నిరూపించుకుంటారు? (బి) సంఘానికి సంబంధించిన ఒక పని మీద వెళ్లి వచ్చి, ఆ తర్వాత తన ఇంట్లోవాళ్లకు దాని గురించి చెప్పకుండా ఉన్న ఒక పెద్ద నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం చూడండి.)

11 సంఘంలో. రహస్యాల్ని ఎవ్వరికీ చెప్పకుండా ఉండే పెద్దలు “గాలికి చాటైన చోటులా, తుఫాను నుండి దాక్కునే చోటులా” ఉంటారు. (యెష. 32:2) వాళ్లతో మనం అస్సలు భయపడకుండా మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం చెప్పే విషయాల్ని వాళ్లు ఎవ్వరికీ చెప్పరనే పూర్తి నమ్మకం వాళ్లమీద మనకు ఉంది. అంతేకాదు, రహస్యంగా ఉంచాల్సిన విషయాల్ని మనకు చెప్పమని వాళ్లను మనం బలవంతం చేయం. ఆ పెద్దల భార్యల్ని కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే రహస్యంగా ఉంచాల్సిన విషయాల్ని చెప్పమని వాళ్లు తమ భర్తల్ని అడగరు. నిజం చెప్పాలంటే సహోదర సహోదరీల వ్యక్తిగత విషయాల గురించి పెద్దల భార్యలకు తెలీకపోవడమే మంచిది. ఒక సంఘ పెద్ద భార్య ఇలా అంటుంది: “ఆధ్యాత్మిక సహాయం అవసరమైన సహోదర సహోదరీల గురించి నా భర్త నాకు అస్సలు చెప్పడు. కనీసం వాళ్ల పేర్లు కూడా చెప్పడు. అలా చెప్పకుండా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే ఆయన అలా చేయడంవల్ల నేను ఏమీ చేయలేని వాటిగురించి అనవసరంగా కంగారుపడే పరిస్థితి నాకు రాదు. అలాగే సంఘంలో ఉన్న వాళ్లందరితో ఎప్పటిలాగే మామూలుగా మాట్లాడగలుగుతాను. అంతేకాదు నేను నా వ్యక్తి గత విషయాల గురించి లేదా సమస్యల గురించి నా భర్తకు చెప్పినప్పుడు ఆయన వాటిని ఎవ్వరికీ చెప్పడనే నమ్మకం నాకుంది.” నిజమే, నమ్మదగిన వాళ్లమనే పేరు సంపాదించుకోవాలని మనందరం కోరుకుంటాం. అందుకు సహాయం చేసే ఐదు లక్షణాల గురించి ఇప్పుడు చూద్దాం.

నమ్మదగిన వాళ్లుగా ఉండడానికి సహాయం చేసే లక్షణాల్ని పెంచుకోండి

12. నమ్మకానికి ముఖ్యమైన ఆధారం ప్రేమ అని ఎందుకు చెప్పవచ్చు?

12 నమ్మకానికి ముఖ్యమైన ఆధారం ప్రేమ. యెహోవాను ప్రేమించడం, సాటిమనిషిని ప్రేమించడం అన్నిటికన్నా ముఖ్యమైన రెండు ఆజ్ఞలని యేసు చెప్పాడు. (మత్త. 22:37-39) మనం యెహోవాను ప్రేమిస్తాం, కాబట్టి ఆయనలాగే నమ్మదగిన వాళ్లలా ఉండాలనుకుంటాం. అలాగే మన సహోదర సహోదరీల్ని ప్రేమిస్తాం, కాబట్టి వాళ్ల వ్యక్తిగత విషయాల్ని రహస్యంగా ఉంచుతాం. వాళ్లను నొప్పించే, ఇబ్బందిపెట్టే లేదా బాధపెట్టే ఏ విషయాన్నైనా ఇతరులకు చెప్పాలని అస్సలు అనుకోం.—యోహా. 15:12.

13. నమ్మదగిన వాళ్లుగా ఉండడానికి వినయం మనకు ఎలా సహాయం చేస్తుంది?

13 నమ్మదగిన వాళ్లుగా ఉండడానికి వినయం సహాయం చేస్తుంది. వినయంగా ఉండే క్రైస్తవుడు ఇతరులు తనను పొగడాలనే ఉద్దేశంతో, ఏదైనా ఒక విషయాన్ని అందరికన్నా ముందు తనే చెప్పాలని అనుకోడు. (ఫిలి. 2:3) అలాగే, ఇతరులకు తెలియని విషయాలు తనకు తెలుసు అన్నట్టుగా గొప్పలు పోడు. అంతేకాదు బైబిల్లో, ప్రచురణల్లో లేని విషయాల గురించి మన వ్యక్తిగత అభిప్రాయాల్ని అందరికీ చెప్పకుండా ఉండడానికి వినయం మనకు సహాయం చేస్తుంది.

14. నమ్మదగిన వాళ్లుగా ఉండడానికి వివేచన మనకెలా సహాయం చేస్తుంది?

14 వివేచన ఉన్న క్రైస్తవుడికి “మౌనంగా ఉండడానికి ఒక సమయం, మాట్లాడడానికి ఒక సమయం” ఉంటుందని తెలుసు. (ప్రసం. 3:7) కొన్నిసార్లు మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడమే మంచిదని చాలామంది ఒప్పుకుంటారు. సామెతలు 11:12 కూడా ఇలా చెప్తుంది: “నిజమైన వివేచన ఉన్నవాడు మౌనంగా ఉంటాడు.” ఈ ఉదాహరణ చూడండి. ఒక పెద్దకు చాలా అనుభవం ఉండడంతో, ఆయన వేరే సంఘాలకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన గురించి ఇంకో పెద్ద ఇలా అంటున్నాడు: “వేరే సంఘాలకు సంబంధించిన రహస్యమైన విషయాల్ని ఆయన ఎవ్వరికీ చెప్పడు.” ఆ సహోదరుడు వివేచన చూపించడం వల్ల ఆయన సంఘంలోని పెద్దలు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఎందుకంటే రహస్యంగా ఉంచాల్సిన తమ సంఘ విషయాల్ని ఆయన ఎవ్వరికీ చెప్పడని వాళ్లకు పూర్తి నమ్మకం ఉంది.

15. నిజాయితీగా ఉంటే ఇతరులు మనల్ని నమ్ముతారు అనడానికి ఒక ఉదాహరణ చెప్పండి.

15 మనం నమ్మదగిన వాళ్లుగా ఉండాలంటే నిజాయితీగా ఉండడం కూడా ప్రాముఖ్యం. నిజాయితీగా ఉండేవాళ్లు ఎప్పుడూ నిజమే మాట్లాడతారు, కాబట్టి మనం వాళ్లను నమ్ముతాం. (ఎఫె. 4:25; హెబ్రీ. 13:18) ఉదాహరణకు, మీరు మరింత బాగా బోధించాలి అనుకుంటున్నారు. కాబట్టి మీ ప్రసంగం విని ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలో చెప్పమని ఎవరినైనా అడుగుదామని అనుకున్నారు. అయితే మీరు ఎవర్ని సలహా అడుగుతారు. మీకు నచ్చే విషయాల్ని చెప్పే వ్యక్తినా లేదా దయతో నిజాయితీగా మాట్లాడే వ్యక్తినా? నిజాయితీగా చెప్పేవాళ్లనే అడుగుతారు కదా! బైబిలు కూడా ఇలా చెప్తుంది: “లోలోపల ప్రేమించడం కన్నా బహిరంగంగా గద్దించడం మేలు. స్నేహితుడు చేసే గాయాలు నమ్మకమైనవి.” (సామె. 27:5, 6) మన స్నేహితుడు చెప్పే నిజాయితీగల మాటలు ముందు వినడానికి కష్టంగా అనిపించినా, తర్వాత్తర్వాత అవి మనకు చాలా ఉపయోగపడతాయి.

16. సామెతలు 10:19 ప్రకారం, ఆత్మనిగ్రహం చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

16 ఇతరులు మనల్ని నమ్మాలంటే మనకు ఆత్మనిగ్రహం ఉండడం కూడా చాలా ప్రాముఖ్యం. ఒక విషయాన్ని రహస్యంగా ఉంచాలి అని మనకు చెప్తే, మన నోటిని అదుపు చేసుకోవడానికి ఆ లక్షణం సహాయం చేస్తుంది. (సామెతలు 10:19 చదవండి.) సోషల్‌ మీడియాను వాడుతున్నప్పుడు ఆత్మనిగ్రహాన్ని చూపించడం మనకు కష్టంగా ఉండవచ్చు. మనం జాగ్రత్తగా లేకపోతే, రహస్యంగా ఉంచాల్సిన విషయాల్ని అనుకోకుండా చాలామందికి చెప్పేస్తాం. ఒక్కసారి ఆ సమాచారాన్ని మనం ఇంటర్నెట్‌లో పెట్టేశామంటే, దాన్ని ఎవరు ఎలా ఉపయోగిస్తారో, దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మనం చెప్పలేం. అంతేకాదు మన సహోదర సహోదరీల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసే ఏదైనా విషయాన్ని చెప్పమని, వ్యతిరేకులు మనల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు కూడా మనం మౌనంగా ఉండడానికి ఆత్మనిగ్రహం సహాయం చేస్తుంది. ముఖ్యంగా మన పనిపై నిషేధం లేదా ఆంక్షలు ఉన్న దేశాల్లో పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు ఇలాంటివి జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో, ఇంకా ఇతర సందర్భాల్లో ‘నోటికి చిక్కం పెట్టుకోవాలి’ అనే బైబిలు సూత్రాన్ని మనం పాటించాలి. (కీర్త. 39:1) మనం కుటుంబంతో, స్నేహితులతో, సహోదర సహోదరీలతో, అందరితో నమ్మదగిన వాళ్లుగా ఉండాలి. అలా ఉండాలంటే మనకు ఆత్మనిగ్రహం అవసరం.

17. సంఘంలో ఒకరిమీద ఒకరికి నమ్మకం పెరిగేలా మనం ఏం చేయవచ్చు?

17 ప్రేమ గల, నమ్మదగిన సహోదర సహోదరీల ప్రపంచవ్యాప్త కుటుంబంలోకి యెహోవా మనల్ని ఆకర్షించినందుకు మనం ఎంతో కృతజ్ఞులం. మన సహోదర సహోదరీల నమ్మకాన్ని సంపాదించుకునే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనలో ప్రతీఒక్కరం ప్రేమ, వినయం, వివేచన, ఆత్మనిగ్రహం చూపించడానికి, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటే, సంఘంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మనం రాత్రికిరాత్రే నమ్మదగిన వాళ్లుగా మారలేం, దానికోసం మనం కృషిచేస్తూ ఉండాలి. కాబట్టి మన దేవుడైన యెహోవాలా ఉంటూ, నమ్మదగిన వాళ్లమని నిరూపించుకుంటూ ఉందాం.

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

a వేరేవాళ్లు మనల్ని నమ్మాలంటే, ముందు మనం నమ్మదగిన వాళ్లమని నిరూపించుకోవాలి. మనం ఒకరినొకరం నమ్మడం ఎందుకు ముఖ్యమో, అలాగే నమ్మదగినవాళ్లుగా ఉండడానికి మనకు ఏ లక్షణాలు సహాయం చేస్తాయో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

b సంఘంలో ఎవరైనా ఘోరమైన తప్పు చేశారని మనకు తెలిస్తే, సంఘపెద్దల సహాయం తీసుకోమని వాళ్లకు చెప్పాలి. ఒకవేళ వాళ్లు అలా చెప్పకపోతే, యెహోవాకు, సంఘానికి విశ్వసనీయంగా ఉంటూ ఆ విషయాన్ని మనమే పెద్దలకు చెప్పాలి.

c చిత్రాల వివరణ: ఒక సంఘపెద్ద, సంఘానికి సంబంధించిన రహస్యమైన విషయాన్ని తన కుటుంబానికి చెప్పట్లేదు.