కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 40

పేతురులా పట్టుదల చూపించండి

పేతురులా పట్టుదల చూపించండి

“ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచివెళ్లు.”—లూకా 5:8.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

ఈ ఆర్టికల్‌లో . . . a

1. తన కళ్లముందు జరిగిన అద్భుతాన్ని చూసి పేతురు యేసుతో ఏం అన్నాడు?

 పేతురు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా, చేపలు పట్టడానికి ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా వలలో పడలేదు. విడ్డూరంగా, యేసు పేతురుతో ఇలా అన్నాడు: “పడవను లోతుగా ఉన్న చోటికి తీసుకెళ్లి అక్కడ మీ వలలు వేయండి.” (లూకా 5:4) రాత్రంతా పడని చేపలు ఇప్పుడు పడతాయా అని పేతురుకు అనుమానం వచ్చినా యేసు చెప్పింది చేశాడు. వాళ్లు వలలు వేసినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయంటే, ఆ బరువుకి వలలు పిగిలిపోవడం మొదలయ్యాయి. పేతురు, అతనితో ఉన్నవాళ్లు వాళ్ల కళ్లముందే ఒక అద్భుతం జరగడం చూసి “ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.” పేతురు వెంటనే ఇలా అన్నాడు: “ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచివెళ్లు.” (లూకా 5:6-9) అలా అనడం వల్ల, యేసు ముందు నిలబడే అర్హత తనకు లేదని పేతురు అనుకొని ఉంటాడు.

2. పేతురు గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏం అర్థంచేసుకుంటాం?

2 “నేను పాపిని” అని పేతురు సరిగ్గానే చెప్పాడు. ఎందుకంటే, కొన్నిసార్లు అతను దూకుడుగా అనకూడని మాటలు అనేసి, చేయకూడని పనులు చేసేసి తర్వాత వాటిగురించి బాధపడేవాడని లేఖనాలు చెప్తున్నాయి. మీకూ అలాగే జరిగిందా? ఏదైనా లక్షణాన్ని పెంచుకోవడానికి లేదా ఏదైనా బలహీనతతో పోరాడడానికి మీతో మీరే యుద్ధం చేస్తున్నారా? అలాగైతే, పేతురు ఉదాహరణ మీకు ప్రోత్సాహాన్నిస్తుంది. ఎందుకు? యెహోవా కావాలనుకుంటే పేతురు గురించి బైబిల్లో రాయిస్తున్నప్పుడు అతని పొరపాట్లను తీసేసి రాయించవచ్చు. కానీ అతని నుండి మనం పాఠాలు నేర్చుకునేలా వాటిని బైబిల్లో రాయించాడు. (2 తిమో. 3:16, 17) మనలాంటి బలహీనతలు, మనోభావాలు ఉన్న పేతురు గురించి తెలుసుకున్నప్పుడు, మనం ఏ లోపం లేనివాళ్లుగా ఉండాలని కాదుగానీ ఆ లోపాలతో పోరాడుతూ ముందుకు వెళ్లాలన్నదే యెహోవా కోరికని అర్థమౌతుంది.

3. మనం ఎందుకు పట్టుదల చూపించాలి?

3 మనం ఎందుకు పట్టుదల చూపించాలి? ఎందుకంటే పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని ప్రజలు అంటుంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వీణ వాయించడంలో ప్రావీణ్యం సాధించడానికి చాలా సంవత్సరాలపాటు దాన్ని నేర్చుకుంటాడు. అలా నేర్చుకుంటున్నప్పుడు బహుశా అతను రాగాన్ని చాలాసార్లు తప్పుగా వాయించివుంటాడు. అయినాసరే, దాన్ని వాయించడం ఆపకుండా ప్రాక్టీస్‌ చేస్తే అందులో ప్రావీణ్యం సాధిస్తాడు. అయితే, అతను వీణ వాయించడంలో ఆరితేరిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. అయినాసరే, అతను పట్టు విడవకుండా ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటాడు. అదేవిధంగా, మనం ఒక బలహీనతను అధిగమించిన తర్వాత కూడా ఆ బలహీనత వల్ల మళ్లీ పొరపాటు చేసే అవకాశం ఉంది. కానీ మనం డీలా పడిపోకుండా ఆ బలహీనతతో పోరాడాలి. మనందరం అనకూడని మాటలు అనేసి, చేయకూడని పనులు చేసేసి బాధపడతాం. అయినా మనం అక్కడే ఆగిపోకుండా ఉంటే, మనం ముందుకు వెళ్లేలా యెహోవా సహాయం చేస్తాడు. (1 పేతు. 5:10) ఇప్పుడు పేతురు పట్టుదల ఎలా చూపించాడో గమనిద్దాం. అతనిలో లోపాలున్నా యేసు కనికరం చూపించాడు. అది తెలుసుకున్నప్పుడు యెహోవా సేవలో ముందుకు వెళ్లగలుగుతాం.

పేతురు చేసిన పొరపాట్లు, పొందిన దీవెనలు

పేతురుకు ఎదురైన అనుభవమే మీకూ ఎదురైతే మీరేం చేస్తారు? (4వ పేరా చూడండి)

4. లూకా 5:5-10 ప్రకారం, పేతురు తన గురించి ఏమన్నాడు? దానికి యేసు ఏమన్నాడు?

4 “నేను పాపిని” అని పేతురు ఎందుకు అన్నాడో, లేదా ఏ పాపాల్ని మనసులో ఉంచుకొని అలా అన్నాడో బైబిలు చెప్పట్లేదు. (లూకా 5:5-10 చదవండి.) కానీ అతను కొన్ని పెద్ద పొరపాట్లే చేసుంటాడు. తను అంత మంచోడు కాదనే సిగ్గుతో కూడిన భయం పేతురు ముఖంలో యేసుకు కొట్టొచినట్టు కనిపించింది. అలాగే పేతురు నమ్మకంగా ఉండగలడని కూడా యేసుకు తెలుసు. అందుకే యేసు పేతురుతో “భయపడకు” అన్నాడు. యేసు చూపించిన ఆ నమ్మకం పేతురు జీవితాన్ని మార్చేసింది. పేతురు అలాగే అతని సహోదరుడు అంద్రెయ చేపల వ్యాపారాన్ని వదిలేసి, ఇక పూర్తిగా మెస్సీయ అనుచరులయ్యారు. ఆ నిర్ణయమే ఎన్నో దీవెనలకు నాంది!—మార్కు 1:16-18.

5. తన భయాల్ని పక్కనపెట్టి యేసు ఆహ్వానాన్ని అంగీకరించినందుకు పేతురుకు ఎలాంటి దీవెనలు వచ్చాయి?

5 క్రీస్తు శిష్యుడిగా పేతురుకు ఎన్నో అబ్బురపరిచే అనుభవాలు ఎదురయ్యాయి. యేసు రోగుల్ని బాగుచేయడం, చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం, చనిపోయినవాళ్లను సైతం లేపడం అతను చూశాడు. b (మత్త. 8:14-17; మార్కు 5:37, 41, 42) అంతేకాదు ఒక దర్శనంలో యేసు దేవుని రాజ్యానికి రాజుగా ఉండడం పేతురు చూశాడు. దాన్ని అతను కలలో కూడా మర్చిపోలేడు. (మార్కు 9:1-8; 2 పేతు. 1:16-18) అవును, పేతురు చేపల్ని పట్టుకుంటూ కూర్చుంటే ఇవన్నీ ఎప్పటికీ చూసుండేవాడు కాదు. అంతేకాదు, తను అంత మంచోడు కాదనే ఆలోచనతో పేతురు అక్కడే ఆగిపోయుంటే, ఇన్ని దీవెనలు రుచిచూసే వాడే కాదు!

6. పేతురు తన బలహీనతలతో పోరాడుతూనే ఉన్నాడని ఎలా చెప్పవచ్చు?

6 అన్ని చూసినా, అన్ని విన్నా పేతురు తన బలహీనతలతో పోరాడుతూనే ఉన్నాడు. కొన్ని ఉదాహరణల్ని గమనించండి. తను బాధలుపడి చనిపోవాలనే బైబిలు ప్రవచనాన్ని యేసు చెప్తున్నప్పుడు, అలా జరగకూడదని పేతురు అన్నాడు. (మార్కు 8:31-33) అంతేకాదు, పేతురు అలాగే మిగతా అపొస్తలులు చాలాసార్లు తమలో ఎవరు గొప్పా అని వాదించుకున్నారు. (మార్కు 9:33, 34) యేసు చనిపోవడానికి ముందురోజు రాత్రి, పేతురు ఆవేశంతో ఒకతని చెవి నరికేశాడు. (యోహా. 18:10) అదేరోజు రాత్రి పేతురు భయంతో మూడుసార్లు తన స్నేహితుడైన యేసు ఎవరో తెలీదని చెప్పాడు. (మార్కు 14:66-72) కానీ ఆ తర్వాత పేతురు వెక్కివెక్కి ఏడ్చాడు.—మత్త. 26:75.

7. యేసు పునరుత్థానమైన తర్వాత పేతురుకు ఏ అవకాశాన్ని ఇచ్చాడు?

7 తన మనసు విరిచేసినా, యేసు పేతురును వదిలేయలేదు. యేసు పునరుత్థానమైన తర్వాత, తన మీద ఇంకా ప్రేమ ఉందని చెప్పుకునే అవకాశాన్ని పేతురుకు ఇచ్చాడు. అంతేకాదు, తన మందను వినయంగా కాయమని యేసు అతనికి చెప్పాడు. (యోహా. 21:15-17) దానికి అతను వెంటనే ఒప్పుకున్నాడు. అందుకే, యెరూషలేములో పెంతెకొస్తు రోజున పవిత్రశక్తి అభిషేకించిన వాళ్లలో పేతురు కూడా ఉన్నాడు.

8. అంతియొకయలో పేతురు ఏ పొరపాటు చేశాడు?

8 పవిత్రశక్తితో అభిషేకించబడిన తర్వాత కూడా పేతురు తన బలహీనతలతో పోరాడాల్సి వచ్చింది. క్రీ.శ. 36లో సున్నతి పొందని అన్యుడైన కొర్నేలి పవిత్రశక్తితో అభిషేకించబడడం పేతురు కళ్లారా చూశాడు. “దేవునికి పక్షపాతం లేదని” అలాగే అన్యులు కూడా క్రైస్తవ సంఘంలో భాగంగా ఉండొచ్చని అది రుజువు చేసింది. (అపొ. 10:34, 44, 45) అప్పటినుండి పేతురు అన్యులతో కలిసి భోజనం చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తాడని పేతురు కలలో కూడా ఊహించివుండడు. (గల. 2:12) అయితే యూదులు, అన్యులు కలిసి భోజనం చేయకూడదని కొంతమంది యూదా క్రైస్తవులు అనుకునేవాళ్లు. అలా అనుకునే కొంతమంది అంతియొకయకు వచ్చినప్పుడు పేతురు వాళ్లకు భయపడి, అన్యులతో కలిసి భోజనం చేయడం ఆపేశాడు. అది గమనించిన అపొస్తలుడైన పౌలు పేతురును అందరిముందే సరిదిద్దాడు. (గల. 2:13, 14) పేతురు ఈ పొరపాటు చేసినా, పట్టుదలగా ముందుకు సాగాడు. అలా ముందుకు కొనసాగడానికి అతనికి ఏది సహాయం చేసింది?

పేతురు ఎలా పట్టుదల చూపించగలిగాడు?

9. యోహాను 6:68, 69 ప్రకారం, పేతురు ఎలా విశ్వసనీయంగా ఉన్నాడు?

9 పేతురు విశ్వసనీయంగా ఉన్నాడు. అందుకే అతను యేసును అనుసరించకుండా చేసేదేదీ అడ్డురాకుండా చూసుకున్నాడు. ఉదాహరణకు, ఒకసారి యేసు చెప్పిన విషయాలు చాలామంది శిష్యులకు అర్థంకాలేదు. (యోహాను 6:68, 69 చదవండి.) అప్పుడు వాళ్లు, యేసు వివరిస్తాడని ఎదురుచూసే బదులు లేదా దాని అర్థం అడిగే బదులు ఆయన్ని అనుసరించడం ఆపేశారు. కానీ పేతురు మాత్రం యేసును అంటిపెట్టుకుని, తన విశ్వసనీయతను చాటుకున్నాడు. యేసు దగ్గర మాత్రమే “శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు” ఉన్నాయని అతను అన్నాడు.

పేతురు మీద యేసు ఉంచిన నమ్మకం మీకు ఎందుకు ప్రోత్సాహాన్నిస్తుంది? (10వ పేరా చూడండి)

10. యేసు పేతురు మీద ఏ నమ్మకంతో ఉన్నాడు? (చిత్రం కూడా చూడండి.)

10 యేసు పేతురును వదిలేయలేదు. భూమ్మీద తన చివరిరాత్రి పేతురు, ఇతర అపొస్తలులు తనని వదిలేస్తారని యేసుకు తెలుసు. అయినాసరే పేతురు ఖచ్చితంగా తన బాధ నుండి తేరుకొని, తనకు నమ్మకంగా ఉంటాడని యేసు చెప్పాడు. (లూకా 22:31, 32) అలాగే “మనసు సిద్ధమే కానీ శరీరమే బలహీనం” అని యేసు అర్థంచేసుకున్నాడు. (మార్కు 14:38) అందుకే తాను ఎవరో తెలీదని పేతురు చెప్పినా, యేసు మాత్రం అతని మీద ఆశలు వదులుకోలేదు. పునరుత్థానమైన తర్వాత యేసు పేతురును ఒంటరిగా కలిశాడు. (మార్కు 16:7; లూకా 24:34; 1 కొరిం. 15:5) బాధతో కుమిలిపోతున్న పేతురుకి అదెంత బలాన్ని ఇచ్చి ఉంటుందో కదా!

11. యెహోవా తన అవసరాల్ని తీరుస్తాడని యేసు పేతురుకు ఎలా అభయమిచ్చాడు?

11 తన అవసరాల్ని యెహోవా ఖచ్చితంగా తీరుస్తాడని యేసు పేతురుకు అభయమిచ్చాడు. పునరుత్థానమైన తర్వాత యేసు మరోసారి పేతురుకు, ఇతర అపొస్తలులకు అద్భుతరీతిలో చేపలు దొరికేలా చేశాడు. (యోహా. 21:4-6) తన అవసరాల్ని చూసుకోవడం యెహోవాకు పెద్ద పనేం కాదని ఈ అద్భుతం నుండి పేతురుకు అర్థమైంది. ఆ తర్వాత, ‘దేవుని రాజ్యానికి మొదటిస్థానం’ ఇచ్చేవాళ్ల అవసరాల్ని యెహోవా తీరుస్తాడని యేసు చెప్పిన మాటలు పేతురు మదిలో మెదిలివుంటాయి. (మత్త. 6:33) అందుకే, అతను చేపల వ్యాపారానికి కాకుండా పరిచర్యకే మొదటిస్థానం ఇచ్చాడు. క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున అతను ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు. దానివల్ల వేలమంది బాప్తిస్మం తీసుకున్నారు. (అపొ. 2:14, 37-41) ఆ తర్వాత సమరయులు, ఆఖరికి అన్యులు కూడా క్రీస్తును అంగీకరించేలా అతను సహాయం చేశాడు. (అపొ. 8:14-17; 10:44-48) అలా అన్నిరకాల ప్రజలు క్రైస్తవ సంఘంలోకి వచ్చేలా యెహోవా పేతురును గొప్ప స్థాయిలో ఉపయోగించుకున్నాడు.

మనం ఏం నేర్చుకోవచ్చు?

12. పేతురులాగే మనం ఏదైనా బలహీనతతో పోరాడుతుంటే యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?

12 పట్టుదలతో ముందుకు సాగడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు. అయితే ఒకే బలహీనతతో చాలాకాలంగా పోరాడుతూ ఉంటే అలా ముందుకు సాగడం అంత ఈజీ కాకపోవచ్చు. బహుశా, పేతురుతో పోలిస్తే మన బలహీనతలు ఇంకా పెద్దవై ఉండొచ్చు. అయినాసరే, మనం ఆశ వదులుకోకుండా పట్టుదల చూపించడానికి యెహోవా సహాయం చేస్తాడు. (కీర్త. 94:17-19) ఈ అనుభవాన్ని పరిశీలించండి. ఒక బ్రదర్‌ సత్యం తెలుసుకోక ముందు చాలా సంవత్సరాలపాటు స్వలింగ సంపర్కునిగా ఉండేవాడు. కానీ అలాంటి జీవితాన్ని పూర్తిగా వదిలేసి బైబిలుకు తగ్గట్టు బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. అయినాసరే, కొన్నిసార్లు తప్పుడు కోరికలు ఆయనకు వస్తూనే ఉండేవి. మరి వాటితో పోరాడుతూ ముందుకెళ్లడానికి ఆయనకు ఏం సహాయం చేసింది? ఆయన ఇలా అంటున్నాడు: ‘యెహోవా నాకు సహాయం చేస్తున్నాడు. పవిత్రశక్తి సహాయంతో దేవునికి నచ్చినట్టు జీవించడం నేర్చుకున్నాను. అందుకే యెహోవా నన్ను కూడా తన సేవలో ఉపయోగించుకుంటున్నాడు. నాకు బలహీనతలు ఉన్నాసరే ఆయన నన్ను వదిలేయలేదు.’

1950, జనవరి 1న హాస్ట్‌ హెన్షల్‌ పూర్తికాల సేవను మొదలుపెట్టాడు. తన జీవితాన్ని యెహోవా సేవకు అంకితం చేసినందుకు అతను ఎప్పుడైనా బాధపడ్డాడని మీకు అనిపిస్తుందా? (13, 15 పేరాలు చూడండి) d

13. అపొస్తలుల కార్యాలు 4:13, 29, 31 ప్రకారం, పేతురులా మనం ఏం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

13 పేతురు మనుషులకు భయపడి కొన్ని పెద్ద పొరపాట్లే చేశాడు. కానీ ఆ తర్వాత బలం కోసం ప్రార్థించి, ధైర్యం చూపించాడు. (అపొస్తలుల కార్యాలు 4:13, 29, 31 చదవండి.) మనం కూడా మన భయాల్ని పోగొట్టుకోవచ్చు. నాజీ జర్మనీకి చెందిన హాస్ట్‌ అనే టీనేజీ బ్రదర్‌కి ఏం జరిగిందో గమనించండి. స్కూల్లో ఒత్తిడికి లొంగిపోయి అతను ఒకట్రెండుసార్లు “హేల్‌ హిట్లర్‌! (హిట్లర్‌ మనల్ని రక్షిస్తాడు)” అని అన్నాడు. ఆ విషయంలో వాళ్ల అమ్మానాన్నలు హాస్ట్‌కి చీవాట్లు పెట్టే బదులు అతనితో కలిసి ప్రార్థించారు. ధైర్యం ఇవ్వమని యెహోవాను అడిగారు. తన అమ్మానాన్నల సహాయం వల్ల, యెహోవా మీద ఆధారపడడం వల్ల చివరికి హాస్ట్‌ తన భయాలకు ధీటుగా నిలబడగలిగాడు. అతను ఇలా అంటున్నాడు: “యెహోవా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు.” c

14. డీలా పడినవాళ్లకు శ్రద్ధగల కాపరులు ఎలా భరోసా ఇవ్వవచ్చు?

14 యెహోవా, యేసు మనమీద ఆశలు వదులుకోరు. యేసు ఎవరో తెలీదని చెప్పిన తర్వాత పేతురు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అతను అక్కడే ఆగిపోతాడా లేదా క్రీస్తు శిష్యునిగా ముందుకెళ్తాడా? పేతురు విశ్వాసంలో బలహీనపడకుండా ఉండాలని యేసు యెహోవాకు ప్రార్థించాడు. అలా ప్రార్థించానని యేసు పేతురుకు చెప్పాడు. అలాగే పేతురు తన తోటి సహోదరుల్ని బలపర్చగలడనే నమ్మకం తనకు ఉందని కూడా యేసు చెప్పాడు. (లూకా 22:31, 32) యేసు మాటలు గుర్తొచ్చినప్పుడల్లా పేతురుకు ఎంత ధైర్యం వచ్చి ఉంటుందో కదా! మన జీవితంలో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకు భరోసాను ఇవ్వడానికి యెహోవా శ్రద్ధగల కాపరుల్ని ఉపయోగించుకోవచ్చు. (ఎఫె. 4:8, 11) అలాంటి భరోసాను ఇవ్వడానికి చాలాకాలం నుండి సంఘపెద్దగా సేవచేస్తున్న బ్రదర్‌ పాల్‌ ప్రయత్నించేవాడు. ఇక యెహోవా సేవలో ముందుకు వెళ్లలేమని అనుకునేవాళ్లతో ఆయన మాట్లాడేవాడు. అలా మాట్లాడుతున్నప్పుడు, యెహోవా తమను మొదటిసారి సత్యం వైపుకు ఎలా ఆకర్షించాడో గుర్తు తెచ్చుకోమని చెప్పేవాడు. ఆ తర్వాత, యెహోవాకున్న విశ్వసనీయ ప్రేమవల్ల, ఆయన వాళ్ల మీద ఎప్పటికీ ఆశలు వదులుకోడనే భరోసాను ఇచ్చేవాడు. ఆయన ఇలా అంటున్నాడు: “డీలా పడిపోయిన ఎంతోమంది యెహోవా సహాయంతో తేరుకొని తన సేవలో ముందుకు వెళ్లడం నా కళ్లారా చూశాను.”

15. మత్తయి 6:33 లోని మాటలు నిజమని పేతురు అలాగే హాస్ట్‌ ఉదాహరణలు ఎలా చూపిస్తున్నాయి?

15 పరిచర్యకు మొదటిస్థానం ఇస్తే పేతురు, ఇతర అపొస్తలుల అవసరాల్ని తీర్చినట్టే, యెహోవా మన అవసరాల్ని కూడా తీరుస్తాడు. (మత్త. 6:33) ముందటి పేరాల్లో చెప్పిన హాస్ట్‌ అనే బ్రదర్‌ గురించి ఇంకోసారి ఆలోచించండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతను పయినీరు సేవచేయాలని అనుకున్నాడు. కానీ అతను చాలా పేదవాడు కాబట్టి తననుతాను పోషించుకుంటూ పూర్తికాల సేవ చేయగలనా అని సందేహపడ్డాడు. మరి అతను ఏం చేశాడు? ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శన వారంలో ప్రతీరోజు ప్రీచింగ్‌ చేసి యెహోవాను పరీక్షించాలని అనుకున్నాడు. ఆ వారం చివర్లో ప్రాంతీయ పర్యవేక్షకుడు అతనికి ఒక కవర్‌ ఇచ్చాడు. ఆ కవర్‌ ఎవరిచ్చారో మాత్రం చెప్పలేదు. చాలా నెలలు పయినీరు సేవ చేయడానికి సరిపడా డబ్బులు అందులో ఉండడం చూసి అతను అవాక్కయ్యాడు. దాంతో తన అవసరాలు యెహోవా ఖచ్చితంగా తీరుస్తాడనే నమ్మకం హాస్ట్‌కు కలిగింది. ఆ తర్వాత, తన జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేశాడు.—మలా. 3:10.

16. పేతురు గురించి, అతను రాసిన ఉత్తరాల గురించి ఎక్కువ తెలుసుకోవడం ఎందుకు మంచిది?

16 తనను విడిచివెళ్లమని అన్నా సరే యేసు వెళ్లనందుకు పేతురు ఎంత సంతోషించి ఉంటాడో కదా! పేతురు నమ్మకమైన అపొస్తలునిగా, క్రైస్తవులకు మంచి ఆదర్శంగా మారడానికి యేసు అతనికి శిక్షణ ఇస్తూనే ఉన్నాడు. ఆ శిక్షణ నుండి మనం నేర్చుకోవడానికి ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు రాసిన రెండు ఉత్తరాల్లో పేతురు అతను నేర్చుకున్న కొన్ని పాఠాల్ని రాశాడు. ఆ ఉత్తరాల్లో ఉన్న కొన్ని జ్ఞాపికల్ని, వాటి నుండి మనం నేర్చుకునే పాఠాల్ని తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.

పాట 126 మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి

a బలహీనతలతో పోరాడుతున్న వాళ్లకు అభయం ఇవ్వడమే ఈ ఆర్టికల్‌ ఉద్దేశం. వాళ్లు బలహీనతల్ని అధిగమించి, యెహోవాకు నమ్మకమైన సేవకులుగా పట్టుదలతో ముందుకు సాగిపోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

b ఈ ఆర్టికల్‌లో ఉన్న చాలా లేఖనాలు మార్కు సువార్త నుండే తీసుకున్నారు. బహుశా ఆ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షియైన పేతురు నుండి విని మార్కు రాసుంటాడు.

c 1998, ఫిబ్రవరి 22 తేజరిల్లు! (ఇంగ్లీష్‌) పత్రికలోని “నా కుటుంబ విశ్వసనీయతే నాకు ఆదర్శం” అనే హాస్ట్‌ హెన్షల్‌ జీవిత కథ చదవండి.

d చిత్రం వివరణ: ఫోటో కోసం నటించిన చిత్రంలో, హాస్ట్‌ వాళ్ల అమ్మానాన్నలు అతనితో కలిసి ప్రార్థన చేశారు, అతను ధైర్యంగా ఉండడానికి సహాయం చేశారు.