కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 41

పేతురు రాసిన రెండు ఉత్తరాల్లో ఉన్న పాఠాలు

పేతురు రాసిన రెండు ఉత్తరాల్లో ఉన్న పాఠాలు

“వాటిని మీకు గుర్తుచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.”—2 పేతు. 1:12.

పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి

ఈ ఆర్టికల్‌లో . . . a

1. అపొస్తలుడైన పేతురు చనిపోవడానికి ముందు యెహోవా ఏ పెద్ద పని ఇచ్చాడు?

 అపొస్తలుడైన పేతురు చాలా సంవత్సరాలు యెహోవాకు నమ్మకంగా సేవచేశాడు. యేసు పరిచర్య చేస్తున్నప్పుడు పేతురు ఆయనతోనే ఉన్నాడు. అన్యులకు కూడా ప్రీచింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా కూడా సేవచేశాడు. అతని జీవితం చివర్లో ఇక చనిపోతాడని తెలిసినప్పుడు యెహోవా అతనికి ఇంకా పెద్ద పని ఇచ్చాడు. దాదాపు క్రీ.శ. 62-64లో యెహోవా అతనితో రెండు ఉత్తరాల్ని రాయించాడు. అవే ఇప్పుడు మన బైబిల్లో ఉన్న మొదటి పేతురు, రెండో పేతురు పుస్తకాలు. అతను చనిపోయిన తర్వాత క్రైస్తవులకు ఆ ఉత్తరాలు ఉపయోగపడతాయని పేతురు నమ్మాడు.—2 పేతు. 1:12-15.

2. పేతురు ఆ ఉత్తరాల్ని సరిగ్గా అవసరమైన సమయంలోనే రాశాడని ఎందుకు చెప్పవచ్చు?

2 పేతురు ఆ ఉత్తరాల్ని తన తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌కి సరిగ్గా అవసరమైన సమయంలో రాశాడు. అప్పుడు వాళ్లు “రకరకాల కష్టాల వల్ల” బాధపడుతున్నారు. (1 పేతు. 1:6) కొంతమంది సంఘంలో అబద్ధ బోధల్ని నాటడానికి, అనైతిక ప్రవర్తనను ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. (2 పేతు. 2:1, 2, 14) అంతేకాదు, అతి త్వరలో క్రైస్తవులు తమ జీవితంలో పెను మార్పులు చూడాల్సి ఉంది. “అన్నిటి అంతం” అంటే యెరూషలేమును, దాని ఆలయాన్ని రోమా సైనికులు నేలమట్టం చేయడం వాళ్లు చూస్తారు. (1 పేతు. 4:7) కాబట్టి ప్రస్తుతం వాళ్లకున్న కష్టాల్ని ఎలా ఎదుర్కోవాలో, భవిష్యత్తులో రాబోయే కష్టాలకు ఎలా సిద్ధపడాలో పేతురు రాసిన ఉత్తరాల నుండి ఖచ్చితంగా నేర్చుకుని ఉంటారు. b

3. పేతురు రాసిన ఉత్తరాలు మనకెలా సహాయం చేస్తాయి?

3 పేతురు ఈ ఉత్తరాల్ని మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల కోసమే రాసినా, యెహోవా వాటిని తన వాక్యంలో చేర్చాడు. కాబట్టి ఆ ఉత్తరాల నుండి మనం కూడా ప్రయోజనం పొందవచ్చు. (రోమా. 15:4) ఆ క్రైస్తవుల్లాగే అనైతికత నిండిపోయిన లోకంలో మనం జీవిస్తున్నాం. దానికితోడు, మనకు వచ్చే కష్టాల వల్ల యెహోవా సేవ చేయడం అంత ఈజీగా ఉండదు. అంతేకాదు కనీవినీ ఎరుగని ఒక పెద్ద శ్రమను మనం త్వరలోనే ఎదుర్కోవాలి. అది యెరూషలేము, దాని ఆలయం నాశనం కన్నా చాలా దారుణంగా ఉండబోతుంది. కాబట్టి పేతురు రాసిన రెండు ఉత్తరాల్లో మనం ముఖ్యమైన జ్ఞాపికల్ని తెలుసుకుంటాం. అవి యెహోవా రోజును మన మనసులో ఉంచుకోవడానికి, మనుషుల భయాన్ని తీసేసుకోవడానికి, ఒకరిమీద ఒకరం ప్రగాఢమైన ప్రేమను పెంచుకోవడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు, సంఘంలో ఉన్న బ్రదర్స్‌, సిస్టర్స్‌ అవసరాల్ని చక్కగా ఎలా చూసుకోవాలో కూడా పెద్దలు నేర్చుకుంటారు.

యెహోవా రోజును మనసులో ఉంచుకోండి

4. రెండో పేతురు 3:3, 4 ప్రకారం, మన విశ్వాసం ఎప్పుడు కుంటుపడొచ్చు?

4 మనచుట్టూ ఉన్న ప్రజలు భవిష్యత్తు గురించి బైబిలు చెప్తున్న విషయాల్ని నమ్మట్లేదు. మనం ఎన్నో ఏళ్లుగా అంతం దగ్గర్లో ఉందని చెప్తున్నాం. కానీ అది ఇంకా రాలేదు కాబట్టి వ్యతిరేకులు మనల్ని ఎగతాళి చేయవచ్చు. ఇంకొంతమందైతే, అది కలలో కూడా రాదని అంటారు. (2 పేతురు 3:3, 4 చదవండి.) మనం ప్రీచింగ్‌లో కలిసే ఇంటివ్యక్తి నుండో, తోటి ఉద్యోగస్థుల నుండో, లేదా కుటుంబ సభ్యుల నుండో అలాంటి మాటలు విన్నప్పుడు మన విశ్వాసం కుంటుపడవచ్చు. అలాంటప్పుడు మనకు ఏం సహాయం చేస్తుందో పేతురు చెప్పాడు.

5. ఈ దుష్టలోక అంతం విషయంలో సరిగ్గా ఆలోచించడానికి మనకేది సహాయం చేస్తుంది? (2 పేతురు 3:8, 9)

5 ఈ దుష్టలోకాన్ని అంతం చేయడానికి యెహోవా ఆలస్యం చేస్తున్నాడని కొంతమందికి అనిపించవచ్చు. కానీ సరిగ్గా ఆలోచించడానికి పేతురు మాటలు మనకు సహాయం చేస్తాయి. సమయం విషయంలో యెహోవా ఆలోచనకు, మన ఆలోచనకు భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉందని అవి గుర్తుచేస్తాయి. (2 పేతురు 3:8, 9 చదవండి.) యెహోవాకు వెయ్యేళ్లు ఒక్కరోజుతో సమానం. అలాగే ఎవ్వరూ నాశనం అవ్వకూడదని యెహోవా ఓర్పు చూపిస్తున్నాడు. ఆయన రోజు వచ్చినప్పుడు ఈ దుష్టలోక అంతం ఖాయం! అయితే ఈలోపు, మన సమయాన్ని అన్ని దేశాల ప్రజలకు ప్రీచింగ్‌ చేయడానికి ఉపయోగించడం మనకు దొరికిన ఎంత గొప్ప అవకాశమో కదా!

6. యెహోవా రోజును మనం ఎలా “మనసులో” ఉంచుకోవచ్చు? (2 పేతురు 3:11, 12)

6 యెహోవా రోజును “మనసులో ఉంచుకుని” జీవించమని పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. (2 పేతురు 3:11, 12 చదవండి.) దాన్ని మనం ఎలా చేయవచ్చు? ప్రతీరోజు కొత్తలోకంలో ఉండే ఆశీర్వాదాల గురించి ధ్యానించవచ్చు. మీరు అక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నట్టు, పౌష్టికాహారాన్ని తింటున్నట్టు, పునరుత్థానమైన వాళ్లను స్వాగతిస్తున్నట్టు, ఎన్నో ఏళ్ల క్రితం జీవించిన వాళ్లకు నెరవేరిన బైబిలు ప్రవచనాల గురించి బోధిస్తున్నట్టు ఊహించుకోండి. అలా ఆలోచించడం వల్ల యెహోవా రోజును మనసులో ఉంచుకోగలుగుతారు, అది ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉండగలుగుతారు. భవిష్యత్తు గురించిన “ఈ విషయాలు ముందే” తెలుసుకుంటే అబద్ధ బోధకుల వల్ల “తప్పుదోవ పట్టకుండా” ఉంటాం.—2 పేతు. 3:17.

మనుషుల భయాన్ని తీసేసుకోండి

7. మనుషుల భయానికి లొంగిపోయి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం?

7 యెహోవా రోజును మనసులో ఉంచుకుంటే వేరేవాళ్లకు మంచివార్త చెప్పడానికి చేయగలిగినదంతా చేస్తాం. అయినాసరే, కొన్నిసార్లు మనుషులకు భయపడి ప్రీచింగ్‌లో మనం మాట్లాడడానికి తటపటాయిస్తుండవచ్చు. పేతురు విషయంలో కూడా అదే జరిగింది. యేసును విచారణకు తీసుకెళ్లిన రాత్రి పేతురు మనుషుల భయానికి లొంగిపోయాడు. యేసు శిష్యుణ్ణని చెప్పడానికి భయపడడమే కాదు, అసలు యేసు ఎవరో కూడా తెలీదని అతను పదేపదే అన్నాడు. (మత్త. 26:69-75) కానీ అదే పేతురు మనుషుల భయాన్ని అధిగమించి, గట్టి నమ్మకంతో ఇలా అన్నాడు: “వాళ్లు భయపడేదానికి మీరు భయపడకండి, ఆందోళనపడకండి.” (1 పేతు. 3:14) మనం కూడా మనుషుల భయాన్ని తీసేసుకోగలమని ఆ మాటలు భరోసాను ఇవ్వట్లేదా?

8. మనుషుల భయాన్ని తీసేసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? (1 పేతురు 3:15)

8 మనుషుల భయాన్ని తీసేసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? పేతురు ఇలా అన్నాడు: “మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా, పవిత్రుడిగా స్వీకరించండి.” (1 పేతురు 3:15 చదవండి.) అంటే మనం మన ప్రభువు, రాజు అయిన యేసుక్రీస్తుకు ఉన్న స్థానం గురించి, శక్తి గురించి లోతుగా ధ్యానించాలి. ఇతరులకు మంచివార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు మీకు చెమటలు పడుతున్నాయా? గుండెల్లో గుబులుగా ఉందా? అయితే మన రాజును గుర్తుచేసుకోండి. కోట్లమంది దేవదూతల మధ్య పరలోకంలో ఆయన పరిపాలిస్తున్నట్లు ఊహించుకోండి. ఆయనకు ‘పరలోకంలో, భూమ్మీద పూర్తి అధికారం ఇవ్వబడింది’ అని, అలాగే ‘ఈ వ్యవస్థ ముగింపు వరకు ఆయన ఎప్పుడూ మీతో ఉంటాడు’ అని గుర్తుంచుకోండి. (మత్త. 28:18-20) మన నమ్మకాల గురించి చెప్పడానికి “ఎప్పుడూ సిద్ధంగా ఉండమని” పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి పనిస్థలంలో, స్కూల్లో లేదా ఇంకెక్కడైనా మీకు ప్రీచింగ్‌ చేయాలని ఉందా? అలాగైతే, మీరు ఎక్కడ ప్రీచింగ్‌ చేయగలరో ముందే ఆలోచించి పెట్టుకోండి. ఏం మాట్లాడాలో కూడా సిద్ధపడండి. ధైర్యం కోసం ప్రార్థిస్తూ, మనుషుల భయాన్ని తీసేసుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడని నమ్మండి.—అపొ. 4:29.

“ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి”

పౌలు ఇచ్చిన దిద్దుబాటును పేతురు అంగీకరించాడు. అతను రాసిన రెండు ఉత్తరాలు మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ పైన ప్రేమ చూపించాలని నేర్పిస్తున్నాయి (9వ పేరా చూడండి)

9. పేతురు ప్రేమను చూపించకుండా ఉన్న సందర్భం ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

9 పేతురు ప్రేమ ఎలా చూపించాలో నేర్చుకున్నాడు. యేసు ఇలా అన్నాడు: “నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.” ఈ మాటలు అన్నప్పుడు పేతురు అక్కడే ఉన్నాడు. (యోహా. 13:34) అయినాసరే మనుషులకు భయపడి, అన్యులతో కలిసి భోంచేయడం ఆపేశాడు. పేతురు చేసినదాన్ని అపొస్తలుడైన పౌలు ‘నటన’ అని అన్నాడు. (గల. 2:11-14) పేతురు ఆ దిద్దుబాటును అంగీకరించి, దాన్నుండి పాఠం నేర్చుకున్నాడు. అందుకే, అతను రాసిన రెండు ఉత్తరాల్లో మనకు మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద ప్రేమ ఉండడమే కాదు ఆ ప్రేమను చూపించాలని కూడా అతను నొక్కిచెప్పాడు.

10. “వేషధారణలేని సహోదర అనురాగాన్ని” చూపించడానికి మనకేది సహాయం చేస్తుంది? (1 పేతురు 1:22)

10 మనం తోటి ఆరాధకుల మీద “వేషధారణలేని సహోదర అనురాగం” చూపించాలని పేతురు చెప్పాడు. (1 పేతురు 1:22 చదవండి.) అలాంటి అనురాగం “సత్యానికి లోబడడం వల్ల” వస్తుంది. ఆ సత్యంలో “దేవునికి పక్షపాతం లేదు” అనే బోధ కూడా ఉంది. (అపొ. 10:34, 35) మన సంఘంలో కొంతమంది మీదే మనం ప్రేమ చూపించి, మిగతావాళ్ల మీద చూపించకపోతే ప్రేమ గురించి యేసు ఇచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టినట్టే. నిజమే, యేసులాగే మనం కూడా కొంతమందిని ఎక్కువ ఇష్టపడుతుండవచ్చు. (యోహా. 13:23; 20:2) కానీ మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ అంతా మన కుటుంబమే కాబట్టి వాళ్లందరి మీద మనం “సహోదర అనురాగం” చూపించడానికి కృషి చేయాలని పేతురు గుర్తుచేస్తున్నాడు.—1 పేతు. 2:17.

11. “మనస్ఫూర్తిగా” ప్రగాఢమైన ప్రేమ చూపించడం అంటే ఏంటి?

11 “మనస్ఫూర్తిగా ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి” అని పేతురు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈ సందర్భంలో “ప్రగాఢమైన ప్రేమ” అంటే ఎలాంటి హద్దులు లేకుండా, కష్టమైనా సరే ఇతరుల మీద ప్రేమ చూపించడం. ఉదాహరణకు, సంఘంలో ఎవరైనా మనల్ని నొప్పిస్తే, బాధపెడితే వాళ్ల మీద ప్రేమ చూపించాలని కాదుగానీ దెబ్బకు దెబ్బ తీయాలని మన మనసు చెప్పొచ్చు. అయితే, అలాంటి ప్రవర్తన యెహోవాకు ఇష్టంలేదని పేతురు యేసు నుండి నేర్చుకున్నాడు. (యోహా. 18:10, 11) అందుకే అతను ఇలా రాశాడు: “మీకు ఎవరైనా హానిచేస్తే తిరిగి వాళ్లకు హానిచేయకండి, ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే తిరిగి వాళ్లను అవమానించకండి. బదులుగా వాళ్లను దీవించండి.” (1 పేతు. 3:9) మీకు ప్రగాఢమైన ప్రేమ ఉంటే, మీ మనసు విరిచేసిన వాళ్లతో కూడా దయగా ఉంటారు.

12. (ఎ) “ప్రగాఢమైన ప్రేమ” ఏం చేసేలా మనల్ని కదిలిస్తుంది? (బి) ఐక్యత అనే గొప్ప వరాన్ని కాపాడుకుంటూ ఉండండి అనే వీడియోలో చూసినట్టు మీరేం చేయాలనుకుంటున్నారు?

12 పేతురు తన మొదటి ఉత్తరంలో “ప్రగాఢమైన ప్రేమ” గురించి రాశాడు. అలాంటి ప్రేమ కేవలం కొన్ని పాపాల్నే కాదు, “చాలా పాపాల్ని కప్పుతుంది.” (1 పేతు. 4:8) బహుశా పేతురు ఈ మాటలు రాసినప్పుడు, చాలా ఏళ్ల క్రితం క్షమించడం గురించి యేసు నేర్పించిన పాఠం అతనికి గుర్తొచ్చి ఉండవచ్చు. అప్పుడు పేతురు తనది పెద్ద మనసు అనుకొని తన సహోదరుణ్ణి “ఏడుసార్లు” క్షమిస్తానని అన్నాడు. కానీ “77 సార్లు” క్షమించాలని అంటే క్షమించే విషయంలో లెక్కలు వేయకూడదని యేసు అతనికి, మనకు పాఠం నేర్పించాడు. (మత్త. 18:21, 22) ఈ సలహాను పాటించడం మీకు కష్టంగా అనిపిస్తే డీలా పడిపోకండి. అపరిపూర్ణులైన యెహోవా సేవకులందరికీ క్షమించడానికి మనసు రాక కొన్నిసార్లు తమతో తామే యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, మిమ్మల్ని బాధపెట్టిన వాళ్లను క్షమించడానికి, శాంతిగా ఉండడానికి మీరు చేయగలిగినదంతా చేయాలి. c

పెద్దలారా, సంఘాన్ని బాగా చూసుకోండి

13. కొన్నిసార్లు బ్రదర్స్‌, సిస్టర్స్‌ని చూసుకోవడం పెద్దలకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

13 యేసు పునరుత్థానమైన తర్వాత చెప్పిన ఈ మాటల్ని పేతురు తన మనసులో అచ్చేసుకొని ఉంటాడు: “నా చిన్న గొర్రెల్ని కాయి.” (యోహా. 21:16) ఒకవేళ మీరు సంఘపెద్ద అయితే, యేసు ఆ మాటల్ని మీకు కూడా చెప్తున్నాడని మీకు తెలుసు. ఈ ముఖ్యమైన పని చేయడానికి తీరికలేనంత బిజీగా పెద్దలు ఉండవచ్చు. ఎందుకంటే, సంఘపెద్దలు చేసే పనుల గురించి ఒకసారి ఆలోచించండి. ముందుగా, సంఘపెద్దలు తమ సొంత కుటుంబ రోజువారీ అవసరాల్ని చూసుకోవాలి, వాళ్లకు ప్రేమానురాగాల్ని పంచాలి, దేవునికి దగ్గరగా ఉండేలా వాళ్లకు సహాయం చేయాలి. రెండోది, వాళ్లు ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేస్తూ సంఘంలో అందరికీ మంచి ఆదర్శాన్ని ఉంచాలి. మూడోది, మీటింగ్స్‌లో-సమావేశాల్లో వాళ్లకున్న భాగాల్ని చక్కగా సిద్ధపడి, ఇవ్వాలి. ఇంకొంతమంది సంఘపెద్దలు, ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో (HLC) లేదా లోకల్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో (LDC) పనిచేస్తారు. నిజమే, సంఘపెద్దలకు క్షణం తీరిక ఉండదు!

ప్రేమగల సంఘపెద్దలు ఎంత బిజీగా ఉన్నా, యెహోవా గొర్రెలకు కాపరి సందర్శనం చేస్తారు (14-15 పేరాలు చూడండి)

14. పెద్దల నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? (1 పేతురు 5:1-4)

14 “దేవుని మందను కాయండి” అని పేతురు తన తోటి పెద్దల్ని ప్రోత్సహిస్తున్నాడు. (1 పేతురు 5:1-4 చదవండి.) ఒకవేళ మీరు సంఘపెద్ద అయితే, మీ బ్రదర్స్‌-సిస్టర్స్‌ అంటే మీకు శ్రద్ధ ఉందని, కాపరిగా ఉంటూ వాళ్ల బాగోగులు చూసుకోవడానికి ఇష్టపడుతున్నారని మాకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఆ పని చేసేంత టైం లేదని, లేదా దానికి రవ్వంత శక్తి కూడా లేదని మీకు అనిపించవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయవచ్చు? మీకెలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. పేతురు ఇలా రాశాడు: “ఎవరైనా పరిచారం చేస్తే, అతను దేవుడిచ్చే బలం మీద ఆధారపడుతున్నట్టు ఆ పని చేయాలి.” (1 పేతు. 4:11) అయితే, మీ సంఘంలో బ్రదర్స్‌, సిస్టర్స్‌కి వచ్చే సమస్యలు ఈ లోకంలో పూర్తిగా పరిష్కారం అవ్వకపోవచ్చు. కానీ “ముఖ్య కాపరి” అయిన యేసుక్రీస్తు, మీరు చేయగలిగే దానికి మించి వాళ్లకు సహాయం చేయగలడని గుర్తుంచుకోండి. అలా ఆయన కొత్త లోకంలోనే కాదు, ఇప్పుడు కూడా చేయగలుగుతాడు. కాబట్టి సంఘపెద్దలు వాళ్ల బ్రదర్స్‌, సిస్టర్స్‌ని ప్రేమించాలి, వాళ్లకు కాపరిగా ఉంటూ వాళ్ల బాగోగులు చూసుకోవాలి, “మందకు ఆదర్శంగా ఉండాలి.” దేవుడు వాళ్లనుండి ఆశించేది ఇది మాత్రమే!

15. ఒక సంఘపెద్ద కాపరి పనిని ఎలా చేశాడు? (చిత్రం కూడా చూడండి.)

15 కాపరి సందర్శనాలు చాలా ప్రాముఖ్యమని ఎప్పటినుండో సంఘపెద్దగా సేవచేస్తున్న విలియమ్‌ అనే బ్రదర్‌ చెప్తున్నాడు. కోవిడ్‌ మహమ్మారి మొదలైన కొత్తలో ఆయన, ఆయనతోపాటు ఉన్న ఇంకొంతమంది పెద్దలు, వాళ్ల గ్రూపులో ఉన్న ప్రతీఒక్కరితో వారం-వారం మాట్లాడాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఎందుకో ఆయన ఇలా చెప్తున్నాడు: “చాలామంది బ్రదర్స్‌, సిస్టర్స్‌ నాలుగు గోడల మధ్యే మగ్గిపోవడం వల్ల, వాళ్ల హృదయాలు ఏవేవో ఆలోచనలతో నలిగిపోయే ప్రమాదముంది.” ఎవరైనా బ్రదర్‌ లేదా సిస్టర్‌ ఏదైనా సమస్య ఉందని చెప్తున్నప్పుడు వాళ్ల బాధేంటో, వాళ్ల అవసరాలేంటో తెలుసుకోవడానికి విలియమ్‌ ప్రయత్నించేవాడు. ఆ తర్వాత వాళ్లకు సహాయం చేసే సమాచారాన్ని చూపించేవాడు. తరచూ ఆయన మన వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోల్ని ఉపయోగించి వాళ్లకు సహాయం చేసేవాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “ముందెప్పటికన్నా ఇప్పుడు కాపరి సందర్శనాలు చాలా అవసరమయ్యాయి. నిజానికి ప్రజలకు యెహోవా గురించి చెప్పడానికి మనం ఎంతో కష్టపడతాం. అలాంటిది దేవుని ప్రజల్ని కాయడానికి, సత్యంలో నిలదొక్కుకోవడానికి వాళ్లకు ఇంకెంతగా సహాయం చేయాలో కదా!”

యెహోవా మీకిచ్చే శిక్షణను పూర్తి చేయనివ్వండి

16. పేతురు రాసిన ఉత్తరాల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకున్నాం?

16 పేతురు రాసిన రెండు ఉత్తరాల నుండి కేవలం కొన్ని పాఠాల్నే ఈ ఆర్టికల్‌లో చర్చించాం. అయితే, ఈ ఆర్టికల్‌ చదివాక మీకు ఏదైనా ఒక పనిని ఇంకా బాగా చేయాలని అనిపించవచ్చు. ఉదాహరణకు, కొత్తలోకంలో దేవుడిచ్చే దీవెనల గురించి ఇంకా ఎక్కువ ఆలోచించాలని అనుకుంటున్నారా? మీరు ఉద్యోగం చేసే చోట లేదా స్కూల్లో లేదా మీ రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు సాక్ష్యం ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నారా? మీ బ్రదర్స్‌, సిస్టర్స్‌ పైన ప్రగాఢమైన ప్రేమను ఇంకా ఎక్కువ చూపించే మార్గాల కోసం వెతకాలని అనుకుంటున్నారా? పెద్దలారా, యెహోవా గొర్రెలకు ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా కాపరి సందర్శనాలు చేయాలనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకున్నప్పుడు మీకొక బలహీనత ఉందని మీరు గుర్తించవచ్చు. అంతమాత్రాన డీలా పడిపోకండి! మన “ప్రభువు దయగలవాడు.” ఆ బలహీనతను తీసేసుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. (1 పేతు. 2:3) అంతేకాదు పేతురు ఈ అభయాన్ని ఇస్తున్నాడు: “దేవుడే మీ శిక్షణను పూర్తిచేస్తాడు. . . . ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గట్టి పునాది మీద మిమ్మల్ని నిలబెడతాడు.”—1 పేతు. 5:10.

17. పట్టుదల చూపిస్తూ యెహోవా మీకిచ్చే శిక్షణను పూర్తి చేయనిస్తే ఏ ప్రతిఫలం దక్కుతుంది?

17 యేసు ముందు నిలబడే అర్హత కూడా తనకు లేదని పేతురు ఒక సందర్భంలో అనుకున్నాడు. (లూకా 5:8) కానీ యెహోవా అలాగే యేసు ప్రేమతో ఇచ్చిన మద్దతు వల్ల క్రీస్తు అనుచరుడిగా అతను పట్టుదల చూపించాడు. అలా పేతురు, “మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు శాశ్వత రాజ్యంలోకి” ప్రవేశించే అర్హత సంపాదించాడు. (2 పేతు. 1:11) ఎంత గొప్ప ప్రతిఫలమో కదా! పేతురులాగే మీరు పట్టుదల చూపించి, యెహోవా మీకిచ్చే శిక్షణను పూర్తి చేయనిస్తే శాశ్వత జీవితమనే బహుమానం మీ సొంతం! అలా “మీ విశ్వాసం వల్ల మీరు రక్షణ పొందుతారు.”—1 పేతు. 1:9.

పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి

a పేతురు రాసిన ఉత్తరాల నుండి మనం నేర్చుకునే పాఠాలు కష్టాల్ని తట్టుకునేలా మనకు ఎలా సహాయం చేస్తాయో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే సంఘపెద్దలు కాపరులుగా తమ బాధ్యతను ఎలా చక్కగా చేయవచ్చో కూడా పరిశీలిస్తాం.

b బహుశా, క్రీ.శ. 66లో రోమన్లు యెరూషలేము మీద దాడి చేయడానికి ముందే పాలస్తీనాలో ఉన్న క్రైస్తవులు పేతురు రాసిన రెండు ఉత్తరాల్ని అందుకొని ఉంటారు.