కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 38

యౌవనులారా, మీకెలాంటి జీవితం కావాలనుకుంటున్నారు?

యౌవనులారా, మీకెలాంటి జీవితం కావాలనుకుంటున్నారు?

“వివేచన నీకు కాపుదలగా ఉంటుంది.”—సామె. 2:11.

పాట 135 యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’

ఈ ఆర్టికల్‌లో . . . a

1. యెహోయాషు, ఉజ్జియా, యోషీయాలకు ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చింది?

 మీరు ఆడుకునే వయసులో లేదా టీనేజీలో ఉన్నప్పుడే దేవుని ప్రజలకు రాజైనట్టు ఊహించుకోండి. అప్పుడు మీకున్న అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారు? చిన్న వయసులోనే యూదాకు రాజులైనవాళ్ల గురించి బైబిలు చెప్తుంది. ఉదాహరణకు యెహోయాషు 7 ఏళ్లకు, ఉజ్జియా 16 ఏళ్లకు, యోషీయా 8 ఏళ్లకు రాజులయ్యారు. అప్పుడు వాళ్లకది ఎంత కష్టంగా ఉండివుంటుందో కదా! అది అంత ఈజీ కాకపోయినా వాళ్లు ఎన్నో మంచి పనులు చేయడానికి యెహోవా అలాగే వేరేవాళ్లు సహాయం చేశారు.

2. యెహోయాషు, ఉజ్జియా, యోషీయా నుండి మనం ఏం నేర్చుకోబోతున్నాం?

2 అయితే, మనం రాజులం లేదా రాణులం కాకపోయినా ఈ ముగ్గురు నుండి చాలా నేర్చుకోవచ్చు. ఆ ముగ్గురు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, చెడు నిర్ణయాలూ తీసుకున్నారు. అయితే మనం మంచి ఫ్రెండ్స్‌ని ఎందుకు ఎంచుకోవాలో, ఎందుకు వినయంగా ఉండాలో, ఎందుకు యెహోవాను వెదుకుతూ ఉండాలో వాళ్ల ఉదాహరణల నుండి నేర్చుకుందాం.

మంచి ఫ్రెండ్స్‌ని ఎంచుకోండి

మంచి స్నేహితుల సలహాలు వింటే మనం యెహోయాషులా ఉంటాం (3, 7 పేరాలు చూడండి) c

3. రాజైన యెహోయాషు ఎందుకు తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగాడు?

3 యెహోయాషులా తెలివైన నిర్ణయాలు తీసుకోండి. రాజైన యెహోయాషు చిన్నప్పుడే నాన్నను కోల్పోయాడు. అందుకే నమ్మకస్థుడైన ప్రధానయాజకుడు యెహోయాదా యెహోయాషును కన్నకొడుకులా చూసుకుంటూ మంచిచెడులు నేర్పించాడు. యెహోయాషు కూడా యెహోయాదా చెప్పిన మాట విన్నాడు. అందుకే ఆయన సత్యారాధనను ముందుండి నడిపించాలని, యెహోవా సేవ చేయాలని తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగాడు. అంతేకాదు, యెహోవా ఆలయాన్ని బాగుచేయడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేశాడు.—2 దిన. 24:1, 2, 4, 13, 14.

4. బైబిలు ఆధారంగా అమ్మానాన్నలు ఇచ్చే సలహాలు వినడం మీకు ఎందుకు మంచిది? (సామెతలు 2:1, 10-12)

4 మీ అమ్మానాన్న గానీ లేదా ఎవరైనా యెహోవాను ప్రేమించడం, ఆయన ప్రమాణాల ప్రకారం జీవించడం మీకు నేర్పిస్తుంటే వాళ్లు మీకొక మంచి గిఫ్ట్‌ ఇస్తున్నట్టే. (సామెతలు 2:1, 10-12 చదవండి.) అమ్మానాన్నలు చాలా విషయాల్లో మీకు శిక్షణ ఇవ్వచ్చు. కాట్యా అనే సిస్టర్‌కి మంచి నిర్ణయాలు తీసుకునేలా వాళ్ల నాన్న ఎలా సహాయం చేశాడో చూడండి. రోజూ ఆమెను స్కూల్‌కు తీసుకెళ్లే ముందు వాళ్ల నాన్న ఆమెతో దినవచనాన్ని చర్చించేవాడు. ఆమె ఇలా అంటుంది: “అలా చర్చించడం వల్ల ఆరోజు నాకు వచ్చే కష్టమైన పరిస్థితుల్ని ఈజీగా ఎదుర్కోగలిగాను.” అయితే మీ అమ్మానాన్నలు బైబిలు ఆధారంగా ఇచ్చే సలహాలు మిమ్మల్ని కట్టిపడేస్తున్నట్టు అనిపిస్తే అప్పుడేంటి? వాళ్ల మాట వినడానికి మీకేది సహాయం చేస్తుంది? అనస్తేసియా అనే సిస్టర్‌ వాళ్ల అమ్మానాన్నలు తనకు ఎందుకు రూల్స్‌ పెడుతున్నారో కూర్చోబెట్టి ఆమెకు వివరించేవాళ్లు. ఆమె ఇలా చెప్తుంది: “అలా వివరించడం వల్ల వాళ్లు పెట్టే రూల్స్‌ అన్నీ నన్ను కట్టిపడేయడానికి కాదుగానీ నన్ను కాపాడడానికే అని అర్థంచేసుకున్నాను.”

5. మీరు అమ్మానాన్నల మాట వింటే వాళ్లకు, యెహోవాకు ఎలా అనిపిస్తుంది? (సామెతలు 22:6; 23:15, 24, 25)

5 అమ్మానాన్నలు ఇచ్చే లేఖనాధార సలహాలు మీరు విన్నప్పుడు వాళ్లు చాలా సంతోషిస్తారు. అంతకుమించి యెహోవా సంతోషిస్తాడు. అంతేకాదు ఆయనతో చిరకాల స్నేహాన్ని మీరు సంపాదించుకోవచ్చు. (సామెతలు 22:6; 23:15, 24, 25 చదవండి.) చిన్నప్పుడు యెహోయాషు చేసినట్టే, మీరు మీ అమ్మానాన్న మాట వినడానికి ఇవి మంచి కారణాలు కావంటారా?

6. యెహోయాదా చనిపోయిన తర్వాత యెహోయాషు ఎవరి మాట విన్నాడు? ఫలితం ఏంటి? (2 దినవృత్తాంతాలు 24:17, 18)

6 యెహోయాషు చెడ్డ నిర్ణయాల నుండి పాఠం నేర్చుకోండి. యెహోయాదా చనిపోయిన తర్వాత యెహోయాషు పక్కదారిపట్టి, చెడ్డవాళ్లను స్నేహితులుగా చేసుకున్నాడు. (2 దినవృత్తాంతాలు 24:17, 18 చదవండి.) ఆయన యెహోవాను ప్రేమించని యూదా అధిపతుల మాట విన్నాడు. యెహోయాషు అలా చేయకపోతే ఎంత బాగుండో అని మీకు అనిపిస్తుంది కదా! (సామె. 1:10) కానీ యెహోయాషు వాళ్ల మాట విన్నాడు. నిజానికి తన దగ్గరి బంధువైన జెకర్యా యెహోయాషును సరిదిద్దడానికి ప్రయత్నించాడు కానీ యెహోయాషు ఆయన్ని చంపించాడు. (2 దిన. 24:20, 21; మత్త. 23:35) యెహోయాషు ఎంత ఘోరమైన, తెలివితక్కువ పని చేశాడో కదా! ఆయన జీవితం బాగానే మొదలైంది. కానీ తర్వాత్తర్వాత ఆయన ఒక మతభ్రష్టుడిగా తయారై, హంతకుడిగా మిగిలాడు. చివరికి, తన సొంత సేవకులే ఆయన్ని చంపేశారు. (2 దిన. 24:22-25) ఒకవేళ యెహోవా మాట అలాగే ఆయన్ని ప్రేమించేవాళ్ల మాట వినుంటే యెహోయాషు జీవితం ఇంకోలా ఉండేది! ఈయన నుండి మీరేం పాఠం నేర్చుకున్నారు?

7. మీరు ఎలాంటివాళ్లను ఫ్రెండ్స్‌గా చేసుకోవాలి? (చిత్రం కూడా చూడండి.)

7 యెహోయాషు చెడ్డ నిర్ణయం నుండి మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, యెహోవాను ప్రేమించి, ఆయన్ని సంతోషపెట్టాలని అనుకునే వాళ్లనే స్నేహితులుగా ఎంచుకోవాలి. వాళ్లు మనకు మంచి చేస్తారు. అయితే కేవలం మన వయసు వాళ్లతోనే స్నేహం చేయాలని హద్దులు పెట్టుకోవద్దు. ఎందుకంటే యెహోయాషు తన స్నేహితుడైన యెహోయాదా కన్నా చాలా చిన్నవాడని మర్చిపోకండి. మీరు స్నేహితుల్ని ఎంచుకుంటున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా మీద విశ్వాసం పెంచుకోవడానికి వీళ్లు నాకు సహాయం చేస్తారా? యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించేలా నన్ను ప్రోత్సహిస్తారా? యెహోవా గురించి, ఆయన విలువైన సత్యాల గురించి మాట్లాడతారా? యెహోవా ప్రమాణాలంటే వీళ్లకు గౌరవం ఉందా? అవసరమైనప్పుడు నన్ను సరిదిద్దేంత ధైర్యం వీళ్లకు ఉందా?’ (సామె. 27:5, 6, 17) ఒక్కమాటలో చెప్పాలంటే, మీ స్నేహితులు యెహోవాను ప్రేమించకపోతే వాళ్లు మీకు వద్దు. కానీ ఒకవేళ మీ స్నేహితులు యెహోవాను ప్రేమించే వాళ్లయితే వాళ్లను అస్సలు వదలొద్దు. వాళ్లు మీకు మంచి చేస్తారు.—సామె. 13:20.

8. మీరు సోషల్‌ మీడియా వాడుతుంటే వేటిగురించి ఆలోచించాలి?

8 కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండడానికి సోషల్‌ మీడియా బాగా పనికొస్తుంది. కానీ చాలామంది నలుగురి కళ్లు తమమీద పడాలనే ఉద్దేశంతో వాళ్లు కొన్నవాటిని లేదా చేసిన పనుల్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. మీరొకవేళ సోషల్‌ మీడియా వాడుతుంటే ఇలా ప్రశ్నించుకోండి: ‘నలుగురి దృష్టి నా మీద పడాలనే ఉద్దేశంతో నేను దీన్ని వాడుతున్నానా? వేరేవాళ్లను ప్రోత్సహించడానికి వాడుతున్నానా లేదా నన్ను గొప్పగా చూపించుకోవడానికి వాడుతున్నానా? వేరేవాళ్ల అభిప్రాయాలు నా ఆలోచనల్ని, మాటల్ని, పనుల్ని తప్పుదారి పట్టించేలా అనుమతిస్తున్నానా?’ పరిపాలక సభ సభ్యునిగా సేవ చేసిన సహోదరుడు నేథన్‌ నార్‌ ఈ సలహా ఇచ్చాడు: “మనుషుల్ని మెప్పించడానికి ప్రయత్నించకండి. అలా చేస్తే మీరు ఎవ్వర్నీ మెప్పించలేరు. యెహోవాను మెప్పించండి. అప్పుడు ఆయన్ని ప్రేమించే వాళ్లందర్నీ మెప్పించగలుగుతారు.”

వినయంగా ఉండండి

9. యెహోవా ఉజ్జియాకు ఎలా సహాయం చేశాడు? (2 దినవృత్తాంతాలు 26:1-5)

9 ఉజ్జియాలా మంచి నిర్ణయాలు తీసుకోండి. రాజైన ఉజ్జియా టీనేజీలో ఉన్నప్పుడు వినయంగా ఉండేవాడు. యెహోవాకు “భయపడడం” నేర్చుకున్నాడు. అందుకే ఆయన 68 ఏళ్ల జీవితంలో యెహోవా దీవెనలెన్నో రుచి చూశాడు. (2 దినవృత్తాంతాలు 26:1-5 చదవండి.) ఉజ్జియా చాలామంది శత్రువుల్ని మట్టుపెట్టాడు. యెరూషలేము ప్రాకారాల్ని పటిష్ఠం చేశాడు. (2 దిన. 26:6-15) తన ప్రతీ పనిలో యెహోవా సహాయాన్ని చూసి ఉజ్జియా తప్పకుండా సంతోషించి ఉంటాడు.—ప్రసం. 3:12, 13.

10. ఉజ్జియా ఏం చేశాడు? దాని ఫలితం ఏంటి?

10 ఉజ్జియా చెడ్డ నిర్ణయాల నుండి పాఠం నేర్చుకోండి. ఇతరులు ఏం చేయాలో చెప్పే అధికారం రాజైన ఉజ్జియాకు ఉండేది. బహుశా ఆ అధికారం ఆయన తలకెక్కి ఉంటుందా? సాధారణంగా, రాజులకు ఆలయంలో ధూపం వేసే అధికారం లేదు. కానీ ఒకరోజు ఉజ్జియా యెహోవా ఆలయంలోకి ప్రవేశించి, బలిపీఠం మీద ధూపం వేసి తన హద్దులు దాటాడు. (2 దిన. 26:16-18) అప్పుడు ప్రధానయాజకుడైన అజర్యా ఆయన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాడు గానీ ఉజ్జియా చాలా మండిపడ్డాడు. బాధాకరంగా, ఉజ్జియా అప్పటివరకు నమ్మకంగా చేసిన సేవంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఆఖరికి యెహోవా ఆయన్ని కుష్ఠు రోగంతో శిక్షించాడు. (2 దిన. 26:19-21) ఒకవేళ ఉజ్జియా వినయం చూపించివుంటే ఆయన జీవితం ఇంకోలా ఉండేది!

మనం సాధించినవి చూసుకొని, గొప్పలకు పోకుండా ఘనతంతా యెహోవాకు ఇవ్వాలి (11వ పేరా చూడండి) d

11. మనకు వినయం ఉందని ఎలా చూపించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

11 ఉజ్జియా గొప్పవాడు అయ్యాక యెహోవాను, ఆయన చేసిన మేలంతటిని మర్చిపోయాడు. దీన్నుండి మనకేంటి పాఠం? మనకున్న మంచి వాటన్నిటినీ యెహోవాయే ఇచ్చాడని జీవితంలో మర్చిపోకూడదు. కాబట్టి మనం సాధించినవాటిని చూసుకొని గొప్పలకు పోకుండా ఘనతంతా యెహోవాకే ఇవ్వాలి. b (1 కొరిం. 4:7) మనం అపరిపూర్ణులమని, మనకు క్రమశిక్షణ అవసరమని వినయంగా గుర్తించాలి. దాదాపు 60 ఏళ్ల వయసులో ఉన్న ఒక బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “ఎవరైనా నా పొరపాట్ల గురించి చెప్పినప్పుడు నేను కోపం తెచ్చుకోకుండా, బాధపడకుండా ఉండడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు నేను అనాలోచితంగా చేసిన పనులకు క్రమశిక్షణ దొరికితే నేను అక్కడే ఆగిపోకుండా, యెహోవా సేవలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తాను.” ఒక జీవిత సత్యం ఏంటంటే, మనం యెహోవాకు లోబడి వినయంగా ఉంటే మన జీవితం సంతోషంగా సాగిపోతుంది.—సామె. 22:4.

యెహోవాను వెదుకుతూ ఉండండి

12. టీనేజీలో ఉన్నప్పుడు యోషీయా యెహోవాను వెదికాడని ఎలా చూపించాడు? (2 దినవృత్తాంతాలు 34:1-3)

12 యోషీయాలా మంచి నిర్ణయాలు తీసుకోండి. యోషీయా టీనేజీలో ఉన్నప్పుడు యెహోవాను వెదకడం మొదలుపెట్టాడు. ఆయన యెహోవా గురించి తెలుసుకొని, ఆయన ఇష్టం చేయాలని బలంగా కోరుకున్నాడు. అయితే ఆయన జీవితం పూలపాన్పులా ఏమీలేదు. చుట్టూ అబద్ధారాధన ఉన్నా, ఆయన సత్యారాధన వైపు ధైర్యంగా నిలబడాల్సి వచ్చింది. యోషీయాకు 20 ఏళ్లు కూడా రాకముందే దేశంలో అబద్ధారాధనను నామరూపాల్లేకుండా తీసేయడానికి నడుంబిగించాడు.—2 దినవృత్తాంతాలు 34:1-3 చదవండి.

13. దేవునికి సమర్పించుకున్నాక మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది?

13 మీరు టీనేజీలో ఉన్నా లేదా అంతకన్నా చిన్నవయసులో ఉన్నా యోషీయాలాగే యెహోవాను వెదికి, ఆయనకున్న అద్భుతమైన లక్షణాల్ని తెలుసుకోవచ్చు. అలా చేసినప్పుడు యెహోవాకు సమర్పించుకోవాలని మీకు అనిపిస్తుంది. దేవునికి సమర్పించుకున్నాక మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది? 14 ఏళ్లకే బాప్తిస్మం తీసుకున్న లూక్‌ అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “ఇప్పటినుండి నా జీవితంలో యెహోవా సేవ చేయడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి మొదటిస్థానం ఇస్తాను.” (మార్కు 12:30) మీరూ అదే కోరుకుంటే చెప్పలేనన్ని దీవెనలు మీ సొంతం!

14. కొంతమంది యౌవనులు ఎలా రాజైన యోషీయాలా ఉంటున్నారు?

14 యౌవనులుగా మీకు ఎలాంటి సవాళ్లు రావచ్చు? 12 ఏళ్లకే బాప్తిస్మం తీసుకున్న జోహాన్‌ అనే బ్రదర్‌ని తన క్లాస్‌మేట్స్‌ ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ తాగమని ఒత్తిడి చేసేవాళ్లు. ఆ ఒత్తిడిని ఎదిరించడానికి జోహాన్‌, ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ తాగితే తన ఆరోగ్యం ఎలా పాడౌతుందో, యెహోవాతో ఉన్న సంబంధం ఎలా దెబ్బతింటుందో ఆలోచించేవాడు. 14 ఏళ్లకే బాప్తిస్మం తీసుకున్న రేచల్‌ అనే సిస్టర్‌, స్కూల్‌లో తనకు వచ్చే కష్టాల్ని తట్టుకోవడానికి ఏది సహాయం చేసిందో చెప్తుంది. ఆమె ఇలా అంటుంది: “నేను ఏం చూసినా, ఏం విన్నా బైబిలుతో పోల్చుకునేదాన్ని. ఉదాహరణకు, హిస్టరీ క్లాస్‌ వింటున్నప్పుడు నాకు ఒక బైబిలు వృత్తాంతం గానీ ఒక ప్రవచనం గానీ గుర్తొస్తుంది. లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు ఉపయోగపడే లేఖనం నాకు గుర్తొస్తుంది.” బహుశా మీకు వచ్చే కష్టాలు, రాజైన యోషీయాకు వచ్చిన కష్టాలు ఒకటే అయ్యుండకపోవచ్చు. కానీ మీరు ఆయనలాగే తెలివిగా, నమ్మకంగా ఉండొచ్చు. చిన్నప్పటినుండే మీకు వచ్చే కష్టాల్ని చక్కగా ఎదుర్కోగలిగితే, పెద్దయ్యాక వచ్చే కష్టాల్ని కూడా తేలిగ్గా ఎదుర్కోగలుగుతారు.

15. యెహోవాకు నమ్మకంగా సేవచేయడానికి యోషీయాకు ఏది సహాయం చేసింది? (2 దినవృత్తాంతాలు 34:14, 18-21)

15 యోషీయా రాజు పెద్దయ్యాక ఆలయాన్ని బాగుచేయించడం మొదలుపెట్టాడు. ఆ పనులు జరుగుతున్నప్పుడు “మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం” దొరికింది. అందులో ఉన్న విషయాలు విన్న తర్వాత, వాటికి తగ్గట్టు మార్పులు చేయడానికి యోషీయా రాజు నడుంబిగించాడు. (2 దినవృత్తాంతాలు 34:14, 18-21 చదవండి.) మీకు కూడా ప్రతిరోజు బైబిలు చదవడం అంటే ఇష్టమా? మీరిప్పటికే బైబిల్ని ప్రతిరోజు చదువుతుంటే, మీరు దాన్ని ఇష్టపడుతున్నారా? మీకు ఉపయోగపడే లేఖనాల్ని ఎక్కడైనా రాసిపెట్టుకుంటున్నారా? ముందు పేరాల్లో చెప్పిన లూక్‌ అనే బ్రదర్‌, తనకు ఆసక్తిగా అనిపించిన విషయాలన్నిటినీ ఒక పుస్తకంలో రాసుకునేవాడు. లూక్‌లాగే మీరు చదివే లేఖనాల్ని లేదా విషయాల్ని ఒక పుస్తకంలో రాసిపెట్టుకుంటే, ఏదోక సమయంలో అవసరమైనప్పుడు వాటిని మళ్లీ చదువుకోవచ్చు. మీరు బైబిల్ని ఎంతెక్కువగా తెలుసుకుని, దాన్ని ఎంతెక్కువగా ఇష్టపడితే యెహోవా సేవ చేయాలనే కోరిక అంతెక్కువగా పెరుగుతుంది. అంతేకాదు యోషీయా రాజులాగే దేవుని వాక్యానికి తగ్గట్టు మార్పులు చేసుకోవడానికి ఇష్టపడతారు.

16. యోషీయా ఎందుకు పెద్ద పొరపాటు చేశాడు? దాన్నుండి మనకేంటి పాఠం?

16 యోషీయా చెడ్డ నిర్ణయం నుండి పాఠం నేర్చుకోండి. యోషీయాకు దాదాపు 39 ఏళ్లు ఉన్నప్పుడు ఒక పొరపాటు చేసి, తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. నిర్దేశం కోసం ఆయన యెహోవా వైపు చూసే బదులు తనను తాను ఎక్కువ నమ్ముకున్నాడు. (2 దిన. 35:20-25) దీన్నుండి మనకేంటి పాఠం? మనం ఎంత పెద్దవాళ్లమైనా లేదా బైబిల్ని ఎంతకాలం నుండి అధ్యయనం చేస్తున్నా యెహోవాను వెదుకుతూనే ఉండాలి. అంటే ప్రతీరోజు నిర్దేశం కోసం ప్రార్థన చేయాలి, బైబిల్ని అధ్యయనం చేయాలి, పరిణతిగల క్రైస్తవుల సలహాల్ని వినాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం పెద్దపెద్ద పొరపాట్లు చేసే సందర్భాలు తక్కువౌతాయి, సంతోషంగా ఉండే సందర్భాలు ఎక్కువౌతాయి.—యాకో. 1:25.

యౌవనులారా, మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది

17. ముగ్గురు యూదా రాజుల ఉదాహరణల నుండి ఏ ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు?

17 యౌవనం అవకాశాల పంట! యౌవనులు తెలివైన నిర్ణయాలు తీసుకుని, యెహోవాను సంతోషపెట్టేలా జీవించవచ్చని యెహోయాషు, ఉజ్జియా, యోషీయా ఉదాహరణల నుండి నేర్చుకున్నాం. నిజమే మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనే గ్యారంటీ లేదని ఆ ముగ్గురి నుండి నేర్చుకున్నాం. అయితే, ఆ ముగ్గురు రాజులు చేసిన మంచి పనులు చేయండి కానీ వాళ్లు చేసిన పొరపాట్లు చేయకండి. అప్పుడు మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది.

యువకుడైన దావీదు యెహోవాకు దగ్గరయ్యాడు, దేవుని ఆమోదం పొందాడు, జీవితంలో సుఖసంతోషాలు అనుభవించాడు (18వ పేరా చూడండి)

18. మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోగలదని ఏ లేఖనాధార ఉదాహరణలు చూపిస్తున్నాయి? (చిత్రం కూడా చూడండి.)

18 వీళ్లే కాదు యెహోవాకు దగ్గరై, ఆయన ఆమోదాన్ని పొంది, జీవితం సుఖసంతోషాలతో నిండిపోయిన ఎంతోమంది ఇతర యౌవనుల గురించి కూడా బైబిల్లో ఉంది. అందులో దావీదు ఒకడు. ఆయన చిన్న వయసులోనే దేవునివైపు ఉన్నాడు. ఆ తర్వాత నమ్మకమైన రాజయ్యాడు. నిజమే, కొన్నిసార్లు ఆయన తప్పులు చేశాడు. కానీ జీవితం మొత్తంలో యెహోవా ఆమోదాన్ని పొందాడు. (1 రాజు. 3:6; 9:4, 5; 14:8) దావీదు జీవితం గురించి, ఆయన నమ్మకంగా చేసిన సేవ గురించి చదివినప్పుడు మీకు కూడా ఆయనలా బ్రతకాలనే తపన పెరగవచ్చు. అంతేకాదు మార్కు లేదా తిమోతి గురించి ఎక్కువ తెలుసుకోవడానికి మీరొక స్టడీ ప్రాజెక్టు పెట్టుకోవచ్చు. వాళ్లు చిన్నవయసు నుండే యెహోవా సేవ చేస్తూ, జీవితాంతం దేవుని ఆమోదాన్ని పొందారని, వాళ్ల జీవితం సుఖసంతోషాలతో నిండిపోయిందని మీరు తెలుసుకుంటారు.

19. యౌవనులారా మీరు ఎలాంటి జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు?

19 మీరు ఇప్పుడు ఏం చేస్తారు అనే దాన్నిబట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీ సొంత తెలివితేటల మీద కాకుండా యెహోవా మీద ఆధారపడినప్పుడు, ఆయన చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపిస్తాడు. (సామె. 20:24) అప్పుడు మీ జీవితం సుఖసంతోషాలతో, సంతృప్తితో నిండిపోతుంది. మీరు తన కోసం చేసే ప్రతీ చిన్నదాన్ని యెహోవా చాలా విలువైనదిగా చూస్తాడని మర్చిపోకండి. మీ ప్రేమగల పరలోక తండ్రికి సేవ చేయడం కన్నా గొప్ప జీవితం ఇంకేమైనా ఉంటుందా!

పాట 144 మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!

a యౌవనులారా, మీరు సరైనది చేయడానికి, తనకు ఫ్రెండ్స్‌గా ఉండడానికి ఎంత కష్టపడుతున్నారో యెహోవాకు తెలుసు. అయితే మీ పరలోక తండ్రిని సంతోషపెట్టడానికి తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ ఆర్టికల్‌లో యూదాకు రాజులైన ముగ్గురు అబ్బాయిల గురించి పరిశీలిస్తాం. వాళ్లు తీసుకున్న నిర్ణయాల నుండి మీరేం నేర్చుకోవచ్చో ఆలోచించండి.

b 2020, జూలై కావలికోట సంచికలో “మీ గురించి మీరు ఎక్కువగా అంచనా వేసుకోకండి” అనే ఆర్టికల్‌లో 12-15 పేరాలు చూడండి.

c చిత్రాల వివరణ: పరిణతిగల ఒక సహోదరి యౌవన సహోదరికి తెలివైన సలహా ఇస్తుంది.

d చిత్రం వివరణ: సమావేశంలో తన భాగాన్ని చేయడానికి ఒక సిస్టర్‌ యెహోవా మీద ఆధారపడుతుంది. ఆ తర్వాత ఘనతంతా ఆయనకే ఇస్తుంది.