అధ్యయన ఆర్టికల్ 37
సమ్సోనులా యెహోవా మీద ఆధారపడండి
“సర్వోన్నత ప్రభువా, యెహోవా, దయచేసి నన్ను గుర్తుచేసుకో; . . . నన్ను శక్తిమంతుణ్ణి చేయి”—న్యాయా. 16:28.
పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు
ఈ ఆర్టికల్‌లో . . . a
1-2. సమ్సోను గురించి మనమెందుకు చదవాలి?
సమ్సోను అనే పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? అతనికి ఉన్న కండ బలం మీకు గుర్తుకురావచ్చు. నిజమే అతనికి చాలా బలం ఉండేది. కానీ సమ్సోను తీసుకున్న ఒక్క చెడు నిర్ణయం చెప్పలేనన్ని కష్టాల్ని తెచ్చిపెట్టింది. అయినా యెహోవా అతని తప్పుల్ని చూడలేదు గానీ అతని విశ్వాసాన్నే చూశాడు. అందుకే, మనకోసం అతని గురించి బైబిల్లో రాయించాడు.
2 సమ్సోను ఎన్నో గొప్పగొప్ప పనులు చేసి, తన ప్రజలైన ఇశ్రాయేలుకు సహాయం చేసేలా యెహోవా అతన్ని ఉపయోగించుకున్నాడు. సమ్సోను చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత కూడా, అచంచల విశ్వాసం చూపించినవాళ్ల చిట్టాలో అపొస్తలుడైన పౌలు అతని పేరును చేర్చేలా యెహోవా చేశాడు. (హెబ్రీ. 11:32-34) సమ్సోను గురించి చదివినప్పుడు మనకు అతనిలా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే, అతను ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో కూడా యెహోవా వైపు చూశాడు. ఈ ఆర్టికల్‌లో సమ్సోను నుండి మనం ఏం నేర్చుకోవచ్చో, మనం అతనిలా ఎలా ఉండవచ్చో పరిశీలిస్తాం.
సమ్సోను యెహోవాను నమ్మాడు
3. సమ్సోనును యెహోవా ఏ పని కోసం ఎంచుకున్నాడు?
3 సమ్సోను పుట్టేనాటికి ఇశ్రాయేలు దేశాన్ని ఫిలిష్తీయులు పరిపాలిస్తున్నారు. (న్యాయా. 13:1) వాళ్లు చాలా క్రూరంగా ఉంటూ ఇశ్రాయేలీయుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. అయితే, “ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని” రక్షించడానికి యెహోవా సమ్సోనును ఎంచుకున్నాడు. (న్యాయా. 13:5) నిజంగా అదెంత కష్టమైన పనో కదా! ఆ పని పూర్తి చేయాలంటే సమ్సోను యెహోవా మీద ఆధారపడాలి.
4. ఫిలిష్తీయుల నుండి తప్పించుకోవడానికి యెహోవా సమ్సోనుకు ఎలా సహాయం చేశాడు? (న్యాయాధిపతులు 15:14-16)
4 సమ్సోను యెహోవా మీద నమ్మకం ఉంచి, ఆయన మీద ఆధారపడిన ఒక సందర్భం గమనించండి. ఒకసారి ఫిలిష్తీయుల సైన్యం లేహీలో సమ్సోనును పట్టుకోవడానికి మకాం వేసింది. బహుశా అది యూదాలో ఒక ప్రాంతం అయ్యుంటుంది. అయితే, యూదా ప్రజలు ఫిలిష్తీయులకు భయపడిపోయి సమ్సోనును వాళ్లకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. తన సొంత ప్రజలే సమ్సోనును రెండు కొత్త తాళ్లతో బంధించి, ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకొచ్చారు. (న్యాయా. 15:9-13) “అప్పుడు యెహోవా పవిత్రశక్తి సమ్సోనును శక్తిమంతుణ్ణి చేసింది.” దాంతో సమ్సోను ఆ తాళ్లను దారాల్లా తెంపేసుకున్నాడు. తర్వాత అతనికి అక్కడ “మగ గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి కనిపించింది.” అతను దాన్ని తీసుకుని, వెయ్యిమంది ఫిలిష్తీయుల్ని చంపేశాడు.—న్యాయాధిపతులు 15:14-16 చదవండి.
5. గాడిద దవడ ఎముకను ఉపయోగించడం ద్వారా సమ్సోను యెహోవా మీద ఆధారపడ్డాడని ఎలా చూపించాడు?
5 సమ్సోను గాడిద దవడ ఎముకను ఎందుకు ఉపయోగించాడు? చెప్పాలంటే, అది శత్రువుల్ని చంపడానికి ఉపయోగించే ఆయుధం కాదు! తన విజయం తను ఉపయోగించే ఆయుధం మీద కాదుగానీ యెహోవా మీదే ఆధారపడి ఉంటుందని సమ్సోనుకు ఖచ్చితంగా తెలుసు. అవును, ఆ సందర్భంలో సమ్సోను యెహోవా ఇష్టాన్ని చేయడానికి తన చేతికి ఏది దొరికితే అది ఉపయోగించాడు. అలా యెహోవా మీద ఆధారపడ్డాడు, విజయాన్ని తన వశం చేసుకున్నాడు.
6. నియామకాల్ని చేసే విషయంలో సమ్సోను నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
6 కొన్నిసార్లు ఫలానా నియామకం చేయడం మనవల్ల కాదని అనిపించవచ్చు. కానీ, యెహోవా ఇచ్చే శక్తితో మనం దాన్ని చేయవచ్చు. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. సమ్సోనులాగే మీరు యెహోవా మీద ఆధారపడినంత కాలం ఆయన మీకు శక్తిని ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—సామె. 16:3.
7. ఏదైనా ఒక విషయంలో యెహోవా నిర్దేశం కోసం చూడడం ప్రాముఖ్యమని చెప్పే ఒక ఉదాహరణ చెప్పండి.
7 నిర్మాణ పనిలో పనిచేసిన చాలామంది బ్రదర్స్, సిస్టర్స్ యెహోవా మీద నమ్మకం చూపించారు. ఒకప్పుడు రాజ్యమందిరాల్ని అలాగే వేరే భవనాల్ని మనమే సొంతగా ప్లాన్ గీసి, కట్టేవాళ్లం. కానీ కాలం గడిచేకొద్దీ యెహోవా సంస్థలో అవసరాలు మారుతూ వచ్చాయి. అందుకే ఈ విషయంలో మార్పు చేయాల్సి వచ్చింది. నిర్మాణ పనిని ముందుండి నడిపిస్తున్న బ్రదర్స్, యెహోవా నిర్దేశాన్ని తీసుకుంటూ కొత్త పద్ధతిని ప్రయత్నించారు. అదేంటంటే, ఇప్పటికే కట్టిన భవనాల్ని కొని, మన అవసరాలకు తగ్గట్టుగా వాటిని మార్చడం. ప్రపంచవ్యాప్తంగా చాలా నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేసిన రాబర్ట్ అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “ఇలాంటిది ముందెప్పుడూ చేయలేదు కాబట్టి ఈ కొత్త పద్ధతికి అలవాటుపడడం కొంతమందికి కష్టమైంది. కానీ మన బ్రదర్స్ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నారు. అంతేకాదు, ఈ మార్పుల్ని యెహోవా దీవించాడని కూడా మేము చూశాం.” యెహోవా తన ఇష్టానికి తగ్గట్టు తన ప్రజల్ని నడిపిస్తాడని చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే! మనం ఎప్పటికప్పుడు ఇలా ప్రశ్నించుకోవాలి: ‘యెహోవా సేవ చేస్తున్నప్పుడు ఆయన నిర్దేశం కోసం వెదుకుతూ, మార్పులు చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటున్నానా?’
సమ్సోను యెహోవా ఇచ్చేవాటిని పూర్తిగా ఉపయోగించున్నాడు
8. ఒక సందర్భంలో సమ్సోనుకు బాగా దాహం వేసినప్పుడు ఏం చేశాడు?
8 సమ్సోను చేసిన ఇంకొన్ని గొప్ప పనులు కూడా మీరు చదివే ఉంటారు. ఉదాహరణకు, అతను ఒంటి చేత్తో సింహంతో పోరాడాడు. అలాగే అష్కెలోనులో 30 మంది ఫిలిష్తీయుల్ని చంపాడు. (న్యాయా. 14:5, 6, 19) అవన్నీ యెహోవా సహాయం లేకుండా తను ఎప్పటికీ చేయలేడని సమ్సోనుకు తెలుసు. అలాగని మనం ఎందుకు చెప్పవచ్చు? ఒక సందర్భంలో వెయ్యిమంది ఫిలిష్తీయుల్ని చంపిన తర్వాత అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు అతను ఏం చేశాడు? దాహాన్ని తీర్చుకోవడానికి తన సొంత ప్రయత్నాలు చేసే బదులు, అతను యెహోవా సహాయాన్ని అడిగాడు.—న్యాయా. 15:18.
9. సమ్సోనుకు యెహోవా ఎలా సహాయం చేశాడు? (న్యాయాధిపతులు 15:19)
9 యెహోవా అద్భుతరీతిలో నీళ్లు తెప్పించడం ద్వారా సమ్సోనుకు సహాయం చేశాడు. ఆ “నీళ్లు తాగాక సమ్సోనుకు శక్తి వచ్చింది, అతను తేరుకున్నాడు.” (న్యాయాధిపతులు 15:19 చదవండి.) బహుశా, చాలా సంవత్సరాల తర్వాత సమూయేలు ప్రవక్త న్యాయాధిపతులు పుస్తకం రాసినప్పుడు కూడా ఆ నీళ్ల ఊట ఉండివుంటుంది. యెహోవా తన నమ్మకమైన సేవకులకు అవసరమైన సమయంలో సహాయం చేస్తాడని ఆ నీళ్ల ఊట చూసిన ప్రతీ ఇశ్రాయేలీయుడికి గుర్తొచ్చేది.
10. సమ్సోనులా శక్తిని పొందాలంటే మనం ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
10 మనకు ఎన్ని సామర్థ్యాలు ఉన్నా లేదా యెహోవా సేవలో ఎంత సాధించినా, మనం ప్రతీసారి యెహోవా వైపు చూడాల్సిందే! యెహోవా మీద ఆధారపడితేనే నిజమైన విజయం సాధించగలమని అణకువతో ఒప్పుకోవాలి. యెహోవా ఇచ్చిన నీళ్లు తాగాక సమ్సోనుకు శక్తి వచ్చినట్టే, ఆయన మనకిచ్చే వాటన్నిటినీ తీసుకున్నప్పుడు మనం కూడా ఆధ్యాత్మికంగా శక్తి పొందుతాం.—మత్త. 11:28.
11. బ్రదర్ అలెక్సీ, ఆయన భార్యలాగే మనం కూడా యెహోవా మీద ఎలా ఆధారపడవచ్చు?
11 రష్యాలో తీవ్రమైన హింస ఎదుర్కొంటున్న అలెక్సీ అనే బ్రదర్ ఉదాహరణ గమనించండి. అంతటి కష్టాన్ని తట్టుకోవడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? హింసలు రాకముందే ఆయన, ఆయన భార్య క్రమంగా బైబిల్ని అధ్యయనం చేశారు, కుటుంబ ఆరాధన చేసుకున్నారు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను ప్రతీరోజు వ్యక్తిగత అధ్యయనం చేసేవాణ్ణి, బైబిలు చదివేవాణ్ణి. రోజూ ఉదయం నేను, నా భార్య దినవచనాన్ని చదువుకొని, ప్రార్థన చేసుకునేవాళ్లం.” వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎలాంటి పరిస్థితుల్లోనైనా, మన మీద మనం ఆధారపడకుండా యెహోవా మీద ఆధారపడాలి. దాన్నెలా చేయవచ్చు? ప్రతీరోజు బైబిల్ని అధ్యయనం చేయడం, ప్రార్థించడం, మీటింగ్స్‌కి వెళ్లడం, ప్రీచింగ్ చేయడం ద్వారా మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేసినప్పుడు యెహోవా మనల్ని దీవిస్తాడు, తన సేవలో కొనసాగేలా సమ్సోనుకు శక్తిని ఇచ్చినట్టే మనకు కూడా ఇస్తాడు.
సమ్సోను వెనకడుగు వేయలేదు
12. సమ్సోను దెలీలాను ప్రేమించడం ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాల కన్నా ఎలా వేరుగా ఉంది?
12 సమ్సోను మనలాంటి అపరిపూర్ణుడే కాబట్టి అప్పుడప్పుడు అతను చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాడు. అలాంటి ఒక చెడ్డ నిర్ణయం అతనికి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. సమ్సోను న్యాయాధిపతిగా సేవచేసిన కొంతకాలం తర్వాత “అతను శోరేకు లోయలో ఒక స్త్రీని ప్రేమించాడు, ఆమె పేరు దెలీలా.” (న్యాయా. 16:4) దీనికన్నా ముందు సమ్సోనుకు ఫిలిష్తీయుల అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. నిజానికి అది యెహోవా నడిపింపే! ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే “ఫిలిష్తీయులతో పోరాడే అవకాశం” సమ్సోనుకు దొరుకుతుంది. తర్వాత, ఫిలిష్తీయుల నగరమైన గాజాలో ఒక వేశ్య ఇంట్లో సమ్సోను ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి శక్తినిచ్చాడు. దాంతో ఆ నగర తలుపుల్ని, వాటి ద్వారబంధాల్ని ఊడబీకి ఆ నగరానికి రక్షణ లేకుండా చేశాడు. (న్యాయా. 14:1-4; 16:1-3) అయితే దెలీలా విషయంలో పరిస్థితి చాలా వేరుగా ఉంది. ఎందుకంటే బహుశా ఆమె ఒక ఇశ్రాయేలీయురాలై ఉంటుంది.
13. దెలీలా ఏం చేసింది? దానివల్ల సమ్సోనుకు ఏమైంది?
13 సమ్సోనును మోసం చేసి, అతన్ని పట్టిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఫిలిష్తీయులు దెలీలాకు చెప్పారు. దానికి ఆమె ఒప్పుకుంది. నిజానికి దెలీలా చేసే మోసాన్ని పసిగట్టలేనంతగా సమ్సోను ఆమెను నమ్మాడా? లేదా ఆమె ప్రేమ మైకంలో అతని కళ్లు మూసుకుపోయాయా? కారణం ఏదైనాసరే, సమ్సోను బలం వెనకున్న రహస్యాన్ని చెప్పమని దెలీలా పదేపదే ఒత్తిడి చేసింది. దానికి అతను లొంగిపోయి ఆ రహస్యాన్ని చెప్పాడు. దాంతో సమ్సోను తన బలాన్ని కోల్పోయాడు, తాత్కాలికంగా యెహోవా ఆమోదాన్ని కూడా కోల్పోయాడు. అలా సమ్సోను తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు.—న్యాయా. 16:16-20.
14. సమ్సోను దెలీలాను నమ్మి ఎలా తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు?
14 సమ్సోను యెహోవాను కాకుండా దెలీలాను నమ్మి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఫిలిష్తీయులు అతన్ని బంధించి, అతని కళ్లు పీకేశారు. సమ్సోను ఇంతకుముందు ఏ నగర ద్వారబంధాలనైతే ఊడబీకాడో అదే నగరంలో అతను ఖైదీగా ఉన్నాడు, చెరసాలలో తిరగలి తిప్పేవాడయ్యాడు. సమ్సోనును తమ చేతికి అప్పగించినందుకు ఫిలిష్తీయులు అబద్ధ దేవుడైన దాగోనుకు పెద్ద ఎత్తున బలులు అర్పిస్తూ, సంబరాలు జరుపుకున్నారు. వాళ్లకు “కొంచెం వినోదం” కావాలని సమ్సోనును పిలిపించుకొని అతన్ని ఆటపట్టించారు.—న్యాయా. 16:21-25.
15. సమ్సోను మళ్లీ యెహోవా మీద ఎలా ఆధారపడ్డాడు? (న్యాయాధిపతులు 16:28-30) (కవర్ పేజీ మీదున్న చిత్రం చూడండి.)
15 సమ్సోను చాలా పెద్ద పొరపాటే చేశాడు. కానీ అతను వెనకడుగు వేయలేదు. బదులుగా, యెహోవా తనకిచ్చిన నియామకాన్ని పూర్తి చేయడానికి అవకాశాల కోసం వెదికాడు. (న్యాయాధిపతులు 16:28-30 చదవండి.) సమ్సోను యెహోవాను ఇలా వేడుకున్నాడు: “ఫిలిష్తీయుల మీద నన్ను పగ తీర్చుకోనివ్వు.” సత్యదేవుడు సమ్సోను ప్రార్థన విని, అద్భుతరీతిలో అతనికి తన శక్తిని తిరిగి ఇచ్చాడు. దానివల్ల సమ్సోను ముందెప్పటికన్నా ఈ సందర్భంలో ఎక్కువమంది ఫిలిష్తీయుల్ని చంపగలిగాడు.
16. సమ్సోను నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
16 సమ్సోను తను చేసిన తప్పువల్ల చాలా నష్టపోయాడు. అయినా యెహోవా ఇష్టాన్ని చేయడం అతను ఆపలేదు. మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దించబడినా లేదా ఏదైనా సేవావకాశం కోల్పోయినా వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే యెహోవా మన మీద ఆశలు వదులుకోడని గుర్తుంచుకోండి. (కీర్త. 103:8-10) మనం పొరపాట్లు చేసినా, యెహోవా సమ్సోనుకు ఇచ్చినట్టే మనకు కూడా తన ఇష్టాన్ని చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు.
17-18. మైఖేల్ ఉదాహరణలో మీకేది బాగా నచ్చింది? (చిత్రం కూడా చూడండి.)
17 మైఖేల్ అనే యువకుడి అనుభవాన్ని గమనించండి. ఆయన సంఘంలో ఒక సంఘ పరిచారకునిగా, క్రమ పయినీరుగా యెహోవా సేవలో చాలా బిజీగా ఉండేవాడు. కానీ బాధాకరంగా, ఆయన చేసిన ఒక పొరపాటు వల్ల సంఘంలో ఆయనకున్న సేవావకాశాల్ని కోల్పోయాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: ‘ఇప్పటివరకు నేను యెహోవా సేవలో దూసుకెళ్లాను. కానీ ఉన్నట్టుండి నా స్పీడ్‌కి బ్రేక్ పడింది. ఇక నేను యెహోవా సేవలో ఏం చేయలేనని అనుకున్నాను. నాకు ఎప్పుడూ యెహోవా నన్ను వదిలేశాడని అనిపించలేదు గానీ ఆయనతో ఇంతకుముందు లాంటి సంబంధమే ఉంటుందా? మళ్లీ సంఘంలో ఇంతకుముందులా సేవ చేయగలనా? అని అనుకునేవాణ్ణి.’
18 సంతోషకరమైన విషయమేమిటంటే, మైఖేల్ వెనకడుగు వేయలేదు. ఆయన ఇలా అంటున్నాడు: “యెహోవాతో నా బంధాన్ని బాగుచేసుకోవడానికి నేను క్రమంగా నా మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్పుకునేవాణ్ణి, బైబిల్ని అధ్యయనం చేసేవాణ్ణి, ధ్యానించేవాణ్ణి.” కొంతకాలానికి మైఖేల్ సంఘంలో తన సేవావకాశాల్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం ఆయన ఒక సంఘపెద్దగా, క్రమ పయినీరుగా సేవ చేస్తున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “నాకు చాలామంది మద్దతును, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ముఖ్యంగా, సంఘపెద్దలు అలా చేసినప్పుడు యెహోవా నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని అనిపించింది. మంచి మనస్సాక్షితో సంఘంలో మళ్లీ సేవ చేయగలిగాను. నిజమైన పశ్చాత్తాపం చూపిస్తే, యెహోవా మనల్ని క్షమిస్తాడని నా అనుభవం నుండి నేర్చుకున్నాను.” మనం తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకుని, తన మీద ఆధారపడితే యెహోవా మనల్ని ఉపయోగించుకుంటాడు, దీవిస్తాడు.—కీర్త. 86:5; సామె. 28:13.
19. సమ్సోను ఉదాహరణ మీకెలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది?
19 ఈ ఆర్టికల్‌లో సమ్సోను జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనల్ని చూశాం. అతను పరిపూర్ణుడు కాదు. దెలీలాను ప్రేమించి పొరపాటు చేసినా అతను యెహోవా సేవలో వెనకడుగు వేయలేదు. అలాగే యెహోవా కూడా అతని మీద ఆశలు వదులుకోలేదు. దేవుడు సమ్సోనును మళ్లీ గొప్ప స్థాయిలో ఉపయోగించుకున్నాడు. హెబ్రీయులు 11వ అధ్యాయంలో విశ్వాసం చూపించినవాళ్ల చిట్టాలో యెహోవా సమ్సోను పేరు కూడా రాయించాడు. అలా సమ్సోను యెహోవా దృష్టిలో చెక్కుచెదరని విశ్వాసం చూపించిన వ్యక్తిగా మిగిలాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు శక్తిని ఇవ్వాలని మన ప్రేమగల పరలోక తండ్రి ఎదురుచూస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి సేవిస్తున్నామని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా! కాబట్టి సమ్సోనులాగే మనం కూడా యెహోవాను ఇలా వేడుకుందాం: “దయచేసి నన్ను గుర్తుచేసుకో; . . . నన్ను శక్తిమంతుణ్ణి చేయి.”—న్యాయా. 16:28.
పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం
a సమ్సోను! చాలామందికి ఇది సుపరిచితమైన పేరే. బైబిలు గురించి అంతగా తెలియనివాళ్లు కూడా ఆ పేరు వినుంటారు. అతని మీద నాటకాలు, పాటలు, సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అతని జీవితం కేవలం ఒక ఆసక్తికరమైన కథ మాత్రమే కాదు. యెహోవా మీద అతనికున్న చెక్కుచెదరని విశ్వాసం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు.