కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 39

సౌమ్యతే మీ బలం

సౌమ్యతే మీ బలం

“ప్రభువు దాసుడు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా అతను అందరితో మృదువుగా వ్యవహరించాలి.”—2 తిమో. 2:24.

పాట 120 క్రీస్తులా సౌమ్యంగా ఉండండి

ఈ ఆర్టికల్‌లో . . . a

1. మనం పనిచేసే చోట లేదా చదువుకునే దగ్గర ప్రజలు దేనిగురించి అడగవచ్చు?

 మీతో పనిచేసే వ్యక్తి లేదా క్లాస్‌మేట్‌ మీ నమ్మకాల గురించి ప్రశ్నిస్తే మీకెలా అనిపిస్తుంది? కంగారుగా అనిపిస్తుందా? మనలో చాలామందికి అలా అనిపించవచ్చు. వాళ్లు అలా అడగడం వల్ల వాళ్ల ఆలోచన ఏంటో లేదా వాళ్ల నమ్మకాలు ఏంటో అర్థం చేసుకుంటాం. అలాగే వాళ్లతో మంచివార్త చెప్పే అవకాశం దొరుకుతుంది. అయితే కొన్నిసార్లు మనతో వాదించడానికి కూడా కొంతమంది ప్రశ్నలు అడగవచ్చు. అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే బహుశా కొంతమంది మన నమ్మకాల గురించి వాళ్లకు తప్పుగా చెప్పుంటారు. (అపొ. 28:22) దానికితోడు మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నాం కాబట్టి చాలామంది ‘మొండివాళ్లుగా, క్రూరులుగా’ ఉంటున్నారు.—2 తిమో. 3:1, 3.

2. మనం ఎందుకు సౌమ్యత చూపించాలి?

2 ‘నా నమ్మకాల గురించి ఎవరైనా వాదిస్తే నేనెలా మృదువుగా ఉండగలను?’ అని మీకు అనిపించవచ్చు. మరి మీకేది సహాయం చేస్తుంది? ఒక్కమాటలో చెప్పాలంటే, సౌమ్యత అనే లక్షణం. సౌమ్యంగా ఉండే వ్యక్తి కోపం తెప్పించే పరిస్థితిలో కూడా లేదా చిరాకుగా ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. (సామె. 16:32) బహుశా అది చెప్పినంత తేలిక కాదని మీకు అనిపించవచ్చు. అయితే సౌమ్యతను మీరెలా పెంచుకోవచ్చు? మీ నమ్మకాల గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు సౌమ్యంగా ఎలా జవాబివ్వవచ్చు? మీరు ఒకవేళ తల్లిదండ్రులైతే, మీ పిల్లలు తమ నమ్మకాల గురించి ఇతరులకు సౌమ్యంగా చెప్పడానికి మీరెలా సహాయం చేయవచ్చు? ఇప్పుడు చూద్దాం.

సౌమ్యతను ఎలా పెంచుకోవచ్చు?

3. సౌమ్యత బలహీనత కాదు బలమని ఎలా చెప్పవచ్చు? (2 తిమోతి 2:24, 25)

3 సౌమ్యత ఒక బలహీనత కాదు, బలం! ఎందుకంటే కష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండాలంటే చాలా బలం కావాలి. అంతేకాదు సౌమ్యత ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో’ ఒకటి. (గల. 5:22, 23) “సౌమ్యత” అని అనువదించబడిన గ్రీకు పదం, లొంగదీసుకున్న ఒక అడవి గుర్రాన్ని వర్ణించడానికి ఉపయోగించేవాళ్లు. ఒక అడవి గుర్రం సాధు జంతువుగా మారినట్టు ఊహించుకోండి. అది సాధు జంతువుగా మారినంత మాత్రాన దాని బలమేమీ తగ్గిపోదు. అయితే మనుషులుగా మనం సౌమ్యతను పెంచుకుంటూనే బలవంతులుగా ఎలా ఉండొచ్చు? అది కేవలం మన సొంత శక్తి వల్ల కాదు, పవిత్రశక్తి వల్లే సాధ్యమౌతుంది. అందుకే సౌమ్యత అనే అందమైన లక్షణాన్ని పెంచుకోవడానికి సహాయం చేయమని మనం యెహోవాను అడగాలి. అలా చేయడంవల్ల చాలామంది ఈ లక్షణాన్ని పెంచుకోగలిగారు. తమను వ్యతిరేకించినా సౌమ్యత చూపించడం వల్ల చాలామంది సాక్షులు ఇతరుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. (2 తిమోతి 2:24, 25 చదవండి.) మరి సౌమ్యతను మీ బలంగా ఎలా మార్చుకోవచ్చు?

4. సౌమ్యత చూపించడం గురించి ఇస్సాకు నుండి ఏం నేర్చుకోవచ్చు?

4 సౌమ్యత ఎంత విలువైనదో చెప్పే ఉదాహరణలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇస్సాకు గురించే తీసుకోండి. ఆయన ఫిలిష్తీయుల ప్రాంతమైన గెరారులో ఉంటున్నప్పుడు చాలా వర్ధిల్లాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు అసూయతో కుళ్లుకొని ఆయన తండ్రి తవ్వించిన బావుల్ని పూడ్చేశారు. ఇస్సాకు తన హక్కుల గురించి వాళ్లతో పోరాడే బదులు అక్కడ నుండి కొంచెం దూరం వెళ్లి వేరే బావుల్ని తవ్వించాడు. (ఆది. 26:12-18) కానీ ఫిలిష్తీయులు మళ్లీ వచ్చి ఆ బావిలో నీళ్లు కూడా తమవే అన్నారు. అయినాసరే ఇస్సాకు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. (ఆది. 26:19-25) ఇతరులు రెచ్చగొట్టినా లేదా కోపం తెప్పించినా ఇస్సాకు సౌమ్యంగా ఎలా ఉండగలిగాడు? ఆయన తప్పకుండా సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకున్న అబ్రాహాము నుండి అలాగే “ప్రశాంతత, సౌమ్యత అనే లక్షణాలు” చూపించిన తన తల్లి శారా నుండి ఎంతో నేర్చుకుని ఉంటాడు.—1 పేతు. 3:4-6; ఆది. 21:22-34.

5. పిల్లలు సౌమ్యతకున్న విలువను అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు సహాయం చేయగలరని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.

5 తల్లిదండ్రులారా, సౌమ్యతకున్న విలువను అర్థం చేసుకునేలా మీ పిల్లలకు సహాయం చేయవచ్చు. 17 ఏళ్ల మ్యాక్‌సెన్స్‌ అనుభవాన్ని చూడండి. అతనికి స్కూల్లో, ప్రీచింగ్‌లో చాలామంది కోపిష్ఠులు ఎదురయ్యేవాళ్లు. కానీ అతను సౌమ్యతను పెంచుకోవడానికి అతని తల్లిదండ్రులు ఓపిగ్గా సహాయం చేశారు. వాళ్లు ఇలా అంటున్నారు: “ఎవరైనా కోపం తెప్పించినప్పుడు తిరిగి కోప్పడేవాడి కన్నా లేదా కొట్టేవాడి కన్నా ప్రశాంతంగా ఉండేవాడే నిజమైన బలవంతుడని మ్యాక్‌సెన్స్‌ అర్థం చేసుకున్నాడు.” సంతోషకరంగా, ఇప్పుడు మ్యాక్‌సెన్స్‌కి సౌమ్యతే తన బలం.

6. మనం సౌమ్యతను ఇంకా బాగా చూపించడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

6 ఎవరైనా మన దేవుని గురించి చెడుగా మాట్లాడి లేదా బైబిలు గురించి ఎగతాళి చేసి మనకు కోపం తెప్పించినప్పుడు ఏం చేయవచ్చు? వాళ్లతో సౌమ్యంగా మాట్లాడడానికి కావల్సిన తెలివిని అలాగే పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాను అడగొచ్చు. అయితే వాళ్లతో ఇంకాస్త సౌమ్యంగా మాట్లాడివుంటే బాగుండేది అనిపిస్తే అప్పుడేంటి? దానిగురించి కూడా మళ్లీ ప్రార్థన చేసి, ఈసారి వాళ్లతో ఇంకా బాగా ఎలా మాట్లాడవచ్చో ఆలోచించవచ్చు. అప్పుడు మన కోపాన్ని అదుపుచేసుకుని, సౌమ్యతను చూపించడానికి యెహోవా తన పవిత్రశక్తిని ఇస్తాడు.

7. సౌమ్యత చూపించడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో మనకేది సహాయం చేస్తుంది? (సామెతలు 15:1, 18)

7 సౌమ్యతను చూపించడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండడానికి కొన్ని బైబిలు వచనాలు గుర్తుచేసుకోవచ్చు. వాటిని గుర్తుచేసుకోవడానికి పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుంది. (యోహా. 14:26) ఉదాహరణకు, సౌమ్యతను చూపించడానికి సహాయం చేసే ఎన్నో సూత్రాలు సామెతల పుస్తకంలో ఉన్నాయి. (సామెతలు 15:1, 18 చదవండి.) కోపం తెప్పించే పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండడంవల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఆ పుస్తకం చెప్తుంది.—సామె. 10:19; 17:27; 21:23; 25:15.

లోతైన అవగాహన ఉంటే ఎలా సౌమ్యత చూపిస్తాం?

8. మనం ఏం గుర్తుంచుకోవడం మంచిది?

8 లోతైన అవగాహన కూడా మనకు సహాయం చేస్తుంది. (సామె. 19:11) ఎవరైనా మన నమ్మకాల గురించి వాదించినప్పుడు లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఆత్మనిగ్రహం చూపిస్తాడు. మనిషి హృదయంలో ఉన్న ఆలోచనలు లోతైన నీళ్లలాంటివి. కాబట్టి ఏదైనా ప్రశ్నకు జవాబిచ్చే ముందు, ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో అడిగాడో మనకు తెలీదని గుర్తుంచుకోవడం మంచిది.—సామె. 16:23.

9. ఎఫ్రాయిమువాళ్లకు జవాబిస్తున్నప్పుడు గిద్యోను లోతైన అవగాహన, సౌమ్యత ఎలా చూపించాడు?

9 ఎఫ్రాయిమువాళ్లకు గిద్యోను ఎలా జవాబిచ్చాడో ఆలోచించండి. ఇశ్రాయేలు శత్రువులతో పోరాడడానికి వెళ్తున్నప్పుడు తమను ఎందుకు తీసుకెళ్లలేదని వాళ్లు కోపంతో ఊగిపోయారు. వాళ్లకు ఎందుకంత కోపం వచ్చింది? వాళ్లు దాన్ని అవమానంలా తీసుకున్నారా? ఏదేమైనా గిద్యోను లోతైన అవగాహనతో వాళ్ల మనోభావాల్ని పట్టించుకొని సౌమ్యంగా జవాబిచ్చాడు. ఫలితంగా వాళ్లు ఆయుధాల్ని వదిలేసి “శాంతించారు.”—న్యాయా. 8:1-3.

10. మన నమ్మకాల గురించి ఎవరైనా ప్రశ్నలు అడిగితే మనమెలా జవాబివ్వాలి? (1 పేతురు 3:15)

10 మనం బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నప్పుడు మనతోపాటు పనిచేసే వ్యక్తి గానీ, క్లాస్‌మేట్‌ గానీ వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగొచ్చు. అలాంటప్పుడు ఎదుటివ్యక్తి మనోభావాల్ని మనం గౌరవిస్తూనే బైబిలు చెప్పేదే ఎందుకు ఉన్నతమైందో వాళ్లకు వివరించవచ్చు. (1 పేతురు 3:15 చదవండి.) ఒకవ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగితే, మనపై దాడి చేస్తున్నట్టు గానీ లేదా వాదించడానికి ప్రయత్నిస్తున్నట్టు గానీ చూడకండి. బదులుగా ఆ ప్రశ్న వెనుక దాగివున్న ఆలోచనను అర్థం చేసుకోండి. అతను ఏ ఉద్దేశంతో మనల్ని ప్రశ్న అడిగినా సరే మనం దయగా, సౌమ్యంగా జవాబివ్వాలి. బహుశా మనం ఇచ్చే జవాబు అతని ఆలోచనను సరి చేయవచ్చు. కొన్నిసార్లు ఎదుటివ్యక్తి మనల్ని అమర్యాదగా లేదా వెటకారంగా ప్రశ్న అడిగినా మనం మాత్రం సౌమ్యంగా జవాబివ్వాలి.—రోమా. 12:17.

మిమ్మల్ని బర్త్‌డే పార్టీకి ఎందుకు పిలుస్తున్నారో కారణం తెలుసుకుంటే, మీరు వాళ్లకు సరైన జవాబు ఇవ్వగలుగుతారు (11-12 పేరాలు చూడండి)

11-12. (ఎ) మీరు ఎందుకు బర్త్‌డేలు చేసుకోరని ఎవరైనా అడిగితే, మనం వేటిగురించి ఆలోచించాలి? (చిత్రం కూడా చూడండి.) (బి) సున్నితమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా మనం ఏం చేయవచ్చు?

11 ఉదాహరణకు, మీరు ఎందుకు బర్త్‌డేలు చేసుకోరని మీతోపాటు పనిచేసేవాళ్లు అడగొచ్చు. బహుశా సరదాగా సమయం గడపడం మీకు ఇష్టంలేదని వాళ్లు అనుకుంటున్నారా? లేదా మీరు బర్త్‌డేలు చేసుకోకపోవడం వల్ల కంపెనీలో ఉద్యోగుల మధ్యున్న స్నేహాన్ని దెబ్బతీస్తున్నారని వాళ్లు అనుకుంటున్నారా? ఇతరుల గురించి ఆలోచిస్తున్నందుకు మీరు వాళ్లను మెచ్చుకోవచ్చు. అలాగే కంపెనీలో అందరితో సరదాగా ఉండే సమయాన్ని మీరూ ఇష్టపడతారని వాళ్లకు చెప్పవచ్చు. అలా మాట్లాడితే వాళ్ల కంగారు తగ్గి, ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు మీరు బర్త్‌డేలు ఎందుకు చేసుకోరో బైబిల్ని ఉపయోగించి వివరించేందుకు ఒక పునాది వేసినట్టు అవుతుంది.

12 కొన్ని సున్నితమైన అంశాల గురించి ఎవరైనా అడిగినప్పుడు కూడా మనం అదే పద్ధతిలో జవాబివ్వవచ్చు. యెహోవాసాక్షులు స్వలింగ సంపర్కుల గురించి వాళ్ల ఆలోచనను మార్చుకోవాలని మీ క్లాస్‌మేట్‌ అనొచ్చు. బహుశా అతనికి యెహోవాసాక్షుల గురించి పూర్తిగా తెలీదా? లేదా అతనికి స్వలింగ సంపర్కులైన స్నేహితులు గానీ, బంధువులు గానీ ఉన్నారా? మనం స్వలింగ సంపర్కుల్ని అసహ్యించుకుంటామని అతను అనుకుంటున్నాడా? మనం అన్నిరకాల ప్రజల్ని ప్రేమిస్తామని, ప్రతీఒక్కరికి తమకు నచ్చినట్టు జీవించే స్వేచ్ఛ ఉందని, ఆ స్వేచ్ఛను మనమూ గౌరవిస్తామని అతనికి వివరించవచ్చు. b (1 పేతు. 2:17) ఆ తర్వాత అతను ప్రశాంతంగా ఉన్నప్పుడు దానిగురించి బైబిలు ఏం చెప్తుందో, బైబిలు చెప్తున్న దాని ప్రకారం జీవిస్తే ఎలా సంతోషంగా ఉండవచ్చో వివరించవచ్చు.

13. దేవుడు ఉన్నాడని నమ్మడం తెలివితక్కువతనం అని అన్న వ్యక్తికి మీరెలా సహాయం చేయవచ్చు?

13 ఎవరైనా మనం చెప్పేది మొండిగా నిరాకరిస్తే, అతను దేనిగురించి నమ్ముతున్నాడో మనకు పూర్తిగా అర్థమైపోయిందనే ముగింపుకు వెంటనే రావద్దు. (తీతు 3:2) ఉదాహరణకు, మీ క్లాస్‌మేట్‌ దేవుడు ఉన్నాడని నమ్మడం తెలివితక్కువతనం అని అంటే, అతను పరిణామ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతున్నాడని, దానిగురించి అతనికి చాలా తెలుసనే ముగింపుకు రావచ్చా? నిజానికి అతను ఎక్కడో ఏదో వినేసి, దాన్ని చెప్తుండవచ్చు. మీరు వెంటనే అతనితో వాదించే బదులు, అతను దానిగురించి ఆలోచించుకునేలా సహాయం చేయవచ్చు. బహుశా మీరు jw.orgలో సృష్టి గురించి చెప్పే లింక్‌ని పంపించవచ్చు. ఆ తర్వాత దానిలో ఉన్న ఏదైనా ఒక ఆర్టికల్‌ను గానీ, వీడియోను గానీ చర్చించడానికి అతను ఇష్టపడవచ్చు. ఇలా అతని అభిప్రాయాల్ని గౌరవించి, మాట్లాడినప్పుడు అతను తన ఆలోచనను సరిచేసుకొని, బైబిలు చెప్పేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపించవచ్చు.

14. యెహోవాసాక్షుల గురించి తప్పుడు అభిప్రాయాల్ని తీసేయడానికి నీల్‌ మన వెబ్‌సైట్‌ని ఎలా ఉపయోగించాడు?

14 నీల్‌ అనే టీనేజీ బ్రదర్‌ యెహోవాసాక్షుల గురించి వేరేవాళ్లకు ఉన్న తప్పుడు అభిప్రాయాల్ని తీసేయడానికి మన వెబ్‌సైట్‌ని ఉపయోగించాడు. అతను ఇలా అంటున్నాడు: “నేను మనుషులు కల్పించి రాసిన పుస్తకాన్ని నమ్మడంవల్ల వాస్తవాలు ఉన్న సైన్స్‌ని నమ్మట్లేదని నా క్లాస్‌మేట్‌ చాలాసార్లు అన్నాడు.” నీల్‌ తన నమ్మకాల గురించి చెప్తున్నప్పుడు అతను వినడానికి ఇష్టపడలేదు. కాబట్టి jw.orgలో “విజ్ఞాన శాస్త్రం, బైబిలు” అనే సెక్షన్‌ని అతనికి చూపించాడు. ఆ తర్వాత అతను ఆ సమాచారాన్ని చదివాడని, జీవం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడని నీల్‌ గమనించాడు. మీరు కూడా అలా చేస్తే, అదే అనుభవం మీకూ ఎదురవ్వవచ్చు.

మీ పిల్లల్ని సిద్ధం చేయండి

15. పిల్లలు సౌమ్యంగా జవాబిచ్చేలా అమ్మానాన్నలు ఎలా సహాయం చేయవచ్చు?

15 పిల్లల్ని ఎవరైనా తమ నమ్మకాల గురించి ప్రశ్నించినప్పుడు, సౌమ్యంగా ఎలా జవాబివ్వాలో అమ్మానాన్నలు వాళ్లకు చక్కగా నేర్పించవచ్చు. (యాకో. 3:13) కొంతమంది అమ్మానాన్నలు, కుటుంబ ఆరాధనలో వాటిని ప్రాక్టీస్‌ చేయిస్తారు. బహుశా స్కూల్లో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చో, వాటికి ఎలా చక్కగా జవాబివ్వవచ్చో నేర్పిస్తారు. అమ్మానాన్నలే తోటి విద్యార్థులుగా నటిస్తూ పిల్లల్ని ప్రశ్నలు అడిగేవాళ్లు. దానికి పిల్లలు సౌమ్యంగా, ఒప్పించేలా ఎలా జవాబివ్వవచ్చో వాళ్లు నేర్పించేవాళ్లు. “ మీ పిల్లలతో ప్రాక్టీస్‌ చేయించండి” అనే బాక్సు చూడండి.

16-17. ప్రాక్టీస్‌ చేయించడం పిల్లలకు ఎలా సహాయం చేస్తుంది?

16 ప్రాక్టీస్‌ చేయించడం వల్ల పిల్లలు బైబిలు చెప్పేవి సరైనవనే నమ్మకం కుదుర్చుకుంటారు. అలాగే వాటిని వేరేవాళ్లకు చక్కగా వివరించగలుగుతారు. ఈ విషయంలో jw.orgలో ఉన్న “యువత అడిగే ప్రశ్నలు” అనే సిరీస్‌ అలాగే టీనేజర్ల కోసం వర్క్‌షీట్లు సహాయం చేస్తాయి. పిల్లలు తమ నమ్మకాల్ని బలపర్చుకోవడానికి, వాటిగురించి ఎవరైనా అడిగినప్పుడు సొంతమాటల్లో జవాబు చెప్పడానికి ఉపయోగపడేలా అవి తయారుచేయబడ్డాయి. ఆ సిరీస్‌లో ఉన్న ఆర్టికల్స్‌ని కుటుంబంగా చదివినప్పుడు మన నమ్మకాల్ని సౌమ్యంగా, ఒప్పించే విధంగా ఎలా వివరించవచ్చో అందరం నేర్చుకోగలుగుతాం.

17 ప్రాక్టీస్‌ చేయడం వల్ల ఎలా ప్రయోజనం పొందాడో మాథ్యూ అనే యువకుడు చెప్తున్నాడు. కుటుంబ ఆరాధనలో భాగంగా అతను వాళ్ల అమ్మానాన్నలతో కలిసి స్కూల్లో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నల గురించి పరిశోధన చేసేవాడు. అతను ఇలా అంటున్నాడు: “స్కూల్లో అడిగే ప్రశ్నల గురించి ఆలోచించాక, వాటికి ఎలా జవాబివ్వాలో పరిశోధన చేసి ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. ఫలానా విషయం నేను నమ్మడానికిగల కారణాలు నాకు తెలిస్తే, ధైర్యంగా అనిపించేది. దానిగురించి వేరేవాళ్లకు చెప్తున్నప్పుడు సౌమ్యంగా ఉండడం తేలిక అయ్యేది.”

18. మన మాటలు ఎలా ఉండాలని కొలొస్సయులు 4:6 చెప్తుంది?

18 నిజానికి మనం ఎంత స్పష్టంగా, ఒప్పించే విధంగా మాట్లాడినా కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. కానీ మనం నేర్పుగా, సౌమ్యంగా చెప్పినప్పుడు వాళ్లు ఒప్పుకునే అవకాశం ఉంది. (కొలొస్సయులు 4:6 చదవండి.) మన నమ్మకాల గురించి చెప్పడాన్ని బాల్‌ విసరడంతో పోల్చవచ్చు. మనం బాల్‌ని మెల్లగా విసరవచ్చు లేదా గట్టిగా కూడా విసరవచ్చు. కానీ బాల్‌ని మెల్లగా విసిరినప్పుడు మనతోపాటు ఆడే వ్యక్తి దాన్ని ఈజీగా క్యాచ్‌ పట్టుకోగలుగుతాడు, ఆట కొనసాగుతుంది. అదేవిధంగా మన నమ్మకాల గురించి నేర్పుగా, సౌమ్యంగా మాట్లాడినప్పుడు ప్రజలు వినడానికి ఇష్టపడతారు, సంభాషణ కొనసాగుతుంది. నిజమే మనతో వాదించేవాళ్లతో, మన నమ్మకాల్ని ఎగతాళి చేసేవాళ్లతో సంభాషణను కొనసాగించాల్సిన అవసరంలేదు. (సామె. 26:4) కానీ అలాంటి ప్రజలు చాలా అరుదుగా ఉంటారు. ఎక్కువశాతం మంది మనం చెప్పేది వినడానికి ఇష్టపడవచ్చు.

19. మన నమ్మకాల గురించి సౌమ్యంగా మాట్లాడితే వచ్చే ప్రయోజనాలు ఏంటి?

19 సౌమ్యంగా ఉండడం నేర్చుకున్నప్పుడు మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్పష్టంగా తెలుస్తుంది. సున్నితమైన ప్రశ్నలు అడిగినప్పుడు లేదా కోపం తెప్పించే ప్రశ్నలు అడిగినప్పుడు, సౌమ్యంగా ఉండడానికి కావల్సిన బలం ఇవ్వమని యెహోవాను అడగండి. మీకూ, మిమ్మల్ని ప్రశ్న అడిగిన వ్యక్తికీ మధ్య వచ్చిన అభిప్రాయబేధాలు గొడవలకు దారి తీయకుండా సౌమ్యత కాపాడుతుందని గుర్తుంచుకోండి. అంతేకాదు మీరు సౌమ్యంగా, గౌరవపూర్వకంగా జవాబిచ్చినప్పుడు కొంతమంది ప్రజలకు యెహోవాసాక్షుల మీదున్న చెడు అభిప్రాయం పోతుంది. బైబిలు సత్యం తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. కాబట్టి మీ నమ్మకాల గురించి అడిగే ప్రతీఒక్కరికి ‘జవాబు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. అలా జవాబు ఇస్తున్నప్పుడు సౌమ్యంగా, ప్రగాఢ గౌరవంతో మాట్లాడండి.’ (1 పేతు. 3:15) అవును, ఇవన్నీ చేసినప్పుడు సౌమ్యతే మీ బలం!

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

a మన నమ్మకాల గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు లేదా కోపం తెప్పించేలా మాట్లాడినప్పుడు ఎలా సౌమ్యంగా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో కొన్ని సలహాల్ని చూస్తాం.

b కొన్ని మంచి సలహాల కోసం 2016, No. 3 తేజరిల్లు! పత్రికలో “హోమోసెక్సువల్స్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?” అనే ఆర్టికల్‌ చూడండి.

c jw.orgలో “యువత అడిగే ప్రశ్నలు” అలాగే “యెహోవాసాక్షుల గురించి తరచూ అడిగే ప్రశ్నలు” అనే ఆర్టికల్‌ సిరీస్‌లో మీకు మంచి సలహాలు దొరుకుతాయి.