జీవిత కథ
ఆసక్తికరమైన, సంతృప్తికరమైన ఓ ప్రయాణం
1951 లో, కెనడాలోని క్విబెక్ ప్రాంతంలో ఉన్న రోయెన్ అనే చిన్న ఊరికి వెళ్లాను. నాకు ఇచ్చిన ఒక అడ్రెస్‌కు వెళ్లి తలుపు కొట్టాను. మార్సెల్ ఫిల్టో a అనే గిలియడ్ మిషనరీ తలుపు తెరిచాడు. ఆయనకు 23 సంవత్సరాలు ఉంటాయి, చూడడానికి ఎత్తుగా ఉన్నాడు. అప్పుడు నాకు 16 ఏళ్లు, నేను ఆయనకన్నా చాలా పొట్టిగా ఉన్నాను. నా పయినీరు నియామక ఉత్తరాన్ని ఆయనకు చూపించాను. ఆయన దాన్ని చదివి నా వైపు చూసి, చూడడానికి చిన్నపిల్లాడిలా ఉన్నాననే ఉద్దేశంతో “నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ మమ్మీకి తెలుసా?” అని జోక్ చేశాడు.
నా కుటుంబం
నేను 1934 లో పుట్టాను. మా అమ్మానాన్నలు స్విట్జర్లాండ్ నుండి వచ్చి కెనడాలోని ఒంటారియోలో టిమ్మిన్స్ అనే చిన్న ఊరిలో స్థిరపడ్డారు. ఆ ఊరిలో గనులు ఉండేవి. బహుశా 1939 లో కావచ్చు మా అమ్మ కావలికోట పత్రికను చదవడం, యెహోవాసాక్షుల మీటింగ్స్‌కి వెళ్లడం మొదలుపెట్టింది. మేం మొత్తం ఏడుగురు పిల్లలం; మా అందర్నీ వెంటబెట్టుకుని అమ్మ మీటింగ్స్‌కు వెళ్లేది. కొంతకాలానికి ఆమె యెహోవాసాక్షి అయ్యింది.
అమ్మ తీసుకున్న నిర్ణయం నాన్నకు నచ్చలేదు. కానీ ఆమె మాత్రం సత్యాన్ని ప్రేమించింది, ఎట్టి పరిస్థితుల్లో యెహోవాకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది. ఆఖరికి, 1940ల మొదట్లో కెనడాలో యెహోవాసాక్షుల పనిని నిషేధించినప్పుడు కూడా ఆమె అలానే ఉంది. నాన్న అమ్మను నోటికి వచ్చినట్లు మాట్లాడినా ఆమె మాత్రం ఆయనతో ఎప్పుడూ గౌరవంగా, దయగా ఉండేది. ఆమె చూపించిన మంచి ఆదర్శం వల్ల మేం ఏడుగురం సత్యాన్ని నేర్చుకున్నాం. కొంతకాలానికి మా నాన్న మనసు మారి, మా అందరితో చాలా మంచిగా ఉండడం మొదలుపెట్టాడు.
పూర్తికాల సేవ మొదలుపెట్టడం
1950 వేసవిలో, న్యూయార్క్‌లో జరిగిన “థియోక్రెసీస్ ఇంక్రీస్” సమావేశానికి వెళ్లాను. ప్రపంచ నలుమూలల నుండి అక్కడికి వచ్చిన బ్రదర్స్-సిస్టర్స్‌ని కలవడం వల్ల, గిలియడ్ పాఠశాలకు హాజరైన వాళ్ల ఇంటర్వ్యూలను వినడం వల్ల యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేయాలని నాకు అనిపించింది. పూర్తికాల సేవ మొదలుపెట్టాలనే కోరిక ఇంకా బలపడింది. ఇంటికి తిరిగొచ్చిన వెంటనే క్రమ పయినీరు సేవ అప్లికేషన్ నింపి కెనడా బ్రాంచికి పంపాను. క్రమ పయినీరు అవ్వడానికి ముందు బాప్తిస్మం తీసుకోమని బ్రాంచి నుండి నాకు ఉత్తరం వచ్చింది. 1950, అక్టోబరు 1న నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఒక నెల తర్వాత క్రమ పయినీరు అయ్యాను, నా మొదటి నియామకం మీద నన్ను క్యాపస్‌కేసింగ్ అనే ఊరికి పంపారు. ఆ ఊరు మేము ఉండే ప్రాంతానికి చాలా కిలోమీటర్ల దూరంలో ఉంది.
1951 వసంత కాలంలో, ఫ్రెంచ్ భాష వచ్చిన సాక్షులు ఎవరైనా ఉంటే, ఆ భాష మాట్లాడే ప్రజలు ఉండే క్విబెక్
ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని బ్రాంచి చెప్పింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రచారకుల అవసరం ఎక్కువ ఉంది. నేను చిన్నప్పటి నుండి ఇంగ్లీష్‌తోపాటు ఫ్రెంచ్ కూడా మాట్లాడేవాడిని, కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లడానికి ముందుకొచ్చాను. దాంతో నన్ను రోయెన్ ప్రాంతానికి నియమించారు. అక్కడ నాకు ఎవ్వరూ తెలీదు. మొదట్లో చెప్పినట్టు నా చేతిలో ఉందల్లా కేవలం ఆ అడ్రస్ మాత్రమే. అయితే అక్కడికి వెళ్లాక అంతా మంచిగా జరిగింది. నేను, మార్సెల్ మంచి స్నేహితులం అయ్యాం. తర్వాతి నాలుగు సంవత్సరాలు క్విబెక్‌లోనే సేవ చేశాను. అక్కడ ఉన్నప్పుడే ప్రత్యేక పయినీరు కూడా అయ్యాను.గిలియడ్ ఆహ్వానం-ఆలస్యమైన ప్రయాణం
క్విబెక్‌లో ఉన్నప్పుడు, న్యూయార్క్‌లోని సౌత్ ల్యాన్‌సింగ్‌లో జరగనున్న 26వ గిలియడ్ పాఠశాల తరగతికి నాకు ఆహ్వానం వచ్చింది. దాని గ్రాడ్యుయేషన్ 1956, ఫిబ్రవరి 12న జరిగింది. ఆ తర్వాత, ప్రస్తుతం ఘానా b అని పిలుస్తున్న ప్రాంతానికి నన్ను నియమించారు; అది పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. కానీ నేను ఘానా వెళ్లడానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు రెడీ అయ్యేదాక కెనడాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కేవలం రెండు-మూడు వారాలే ఉంటానని అనుకున్నాను.
అయితే ఆ డాక్యుమెంట్లు రెడీ అవ్వడానికి ఏడు నెలలు పట్టింది. ఆ సమయమంతా నేను బ్రదర్ క్రిప్స్ కుటుంబంతో వాళ్ల ఇంట్లోనే ఉన్నాను. అక్కడే వాళ్ల అమ్మాయి షీలా పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని అనుకునే లోపు నాకు ఘానా వెళ్లడానికి వీసా వచ్చేసింది. నేను, షీలా ప్రార్థన చేసి బాగా ఆలోచించాక, ముందు నా నియామకానికి వెళ్లడం కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చాం. అయితే ఇద్దరం ఉత్తరాలు రాసుకుంటూ ఉండాలని, సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలో ఆ నిర్ణయం చాలా కష్టంగా అనిపించినా, అదే కరెక్ట్ అని తర్వాత అర్థమైంది.
ఘానాకు ప్రయాణం అయ్యాను. ఒక నెల రోజులు ట్రైన్‌లో, సరుకులు రవాణా చేసే ఓడలో, విమానంలో ప్రయాణం చేశాక ఘానాలో ఉన్న ఆక్రా అనే ఊరికి చేరుకున్నాను. అక్కడ నన్ను జిల్లా పర్యవేక్షకునిగా నియమించారు. దానిలో భాగంగా నేను ఘానా దేశంతో పాటు, పక్కనున్న ఐవరీ కోస్ట్ (ప్రస్తుతం కొటే డి ఐవరి అని పిలుస్తున్నారు), టోగోలాండ్‌కు (ప్రస్తుతం టోగో అని
పిలుస్తున్నారు) కూడా వెళ్లాలి. సాధారణంగా, ఆ ప్రాంతాలన్నిటికి నేను ఒక్కడినే బ్రాంచి ఇచ్చిన జీప్‌లో వెళ్లేవాడిని. ఆ ప్రయాణాలు నాకెన్నో మర్చిపోలేని అనుభవాల్ని ఇచ్చాయి.వారాంతాల్లో ప్రాంతీయ సమావేశాలు చేసేవాడిని. అక్కడ మనకంటూ సొంత అసెంబ్లీ హాళ్లు లేవు. సమావేశానికి వచ్చినవాళ్లకు ఎండ తగలకుండా బ్రదర్స్ వెదురు కర్రలతో తాత్కాలికంగా పైకప్పును తయారుచేసి, దాని మీద ఈత కొమ్మల్ని పరిచేవాళ్లు. అంతేకాదు, మాంసం భద్రపర్చడానికి ఫ్రిడ్జ్‌లు అందుబాటులో ఉండేవి కావు. దాంతో బ్రదర్స్ బ్రతికున్న జంతువుల్ని తెచ్చి, అప్పటికప్పుడు వాటిని చంపి, కోసి, సమావేశానికి వచ్చినవాళ్లకు వండి పెట్టేవాళ్లు.
ఆ సమావేశాల్లో కొన్ని తమాషాలు కూడా జరిగేవి. ఒకసారి నా తోటి మిషనరీ అయిన హెర్బర్ట్ జెన్నింగ్స్ c ప్రసంగం ఇస్తున్నాడు; ఇంతలో వంట కోసం బ్రదర్స్ తెచ్చిన ఆవు తప్పించుకుని ఎటు వెళ్లాలో తెలీక ప్రేక్షకులకు, స్టేజీకి మధ్య పరుగెత్తింది. ఈ గందరగోళం ఆగేదాక బ్రదర్ హెర్బర్ట్ ప్రసంగాన్ని కాసేపు ఆపాల్సి వచ్చింది. ఈలోపు బలంగా ఉన్న నలుగురు బ్రదర్స్ వచ్చి, దాన్ని పట్టుకుని తిరిగి వంట చేసే ప్రదేశానికి తోలుకెళ్లారు. అదంతా చూస్తున్న ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
సమావేశం జరిగే వారంలో నేను దగ్గర్లో ఉన్న పల్లెటూళ్లకి వెళ్లి, ది న్యూ వరల్డ్ సొసైటీ ఇన్ యాక్షన్ అనే వీడియోని చూపించేవాడిని. దాన్ని చూపించడానికి ఒక తెల్లటి షీట్‌ను రెండు చెట్లకు లేదా రెండు స్తంభాలకు కట్టి, దానిమీద వీడియోని చూపించేవాడిని. ఊళ్లో ప్రజలకు అది చాలా నచ్చింది. అక్కడున్న చాలామందికి వాళ్ల జీవితంలో చూసిన మొట్టమొదటి వీడియో అదే! ప్రజలు బాప్తిస్మం తీసుకుంటున్న సీన్‌లు వచ్చినప్పుడు, అందరూ గట్టి గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్లు. ఆ వీడియో చూసిన వాళ్లందరూ ప్రపంచ నలుమూలలా ఉన్న యెహోవాసాక్షులు ఐక్యంగా ఉంటారని అర్థం చేసుకున్నారు.
ఆఫ్రికాకు వెళ్లి రెండు సంవత్సరాలు పూర్తయ్యాక, 1958 లో న్యూయార్క్‌లో జరిగే అంతర్జాతీయ సమావేశానికి వెళ్లడానికి నేను ఎంతో ఎదురుచూశాను. క్విబెక్‌లో ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తున్న షీలా కూడా వచ్చింది. ఇంతకాలం మేమిద్దరం ఉత్తరాలు రాసుకుంటూ మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు నేరుగా చూడడం చాలా సంతోషంగా అనిపించింది. నన్ను పెళ్లి చేసుకోమని తనను అడిగాను, దానికి ఆమె ఒప్పుకుంది. షీలా కూడా గిలియడ్ పాఠశాలకు హాజరై, మా పెళ్లయ్యాక నాతోపాటు ఆఫ్రికాకు రావొచ్చా అని నేను బ్రదర్ నార్‌ను d అడిగాను. దానికి ఆయన ఒప్పుకున్నాడు. మొత్తానికి షీలా ఘానా వచ్చింది. మేము 1959, అక్టోబరు 3న ఆక్రాలో పెళ్లి చేసుకున్నాం. యెహోవాను ఆరాధించడమే మా జీవితాల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయంగా చేసుకున్నందుకు ఆయన మమ్మల్ని దీవించాడని అనిపించింది.
జంటగా కామెరూన్‌లో సేవ
1961 లో మమ్మల్ని కామెరూన్‌కు నియమించారు. అక్కడ కొత్త బ్రాంచి ఆఫీసును ప్రారంభించడంలో సహాయం చేయమని నాకు చెప్పడంతో, ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకున్నాను. నన్ను బ్రాంచి సర్వెంట్‌గా నియమించారు, ఆ పని కొత్త కావడంతో చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా 1965 లో షీలా గర్భవతి అయింది. మమ్మల్ని మేము తల్లిదండ్రులుగా ఊహించుకోవడమే మొదట్లో చాలా కష్టంగా అనిపించినా మెల్లగా అలవాటుపడ్డాం. ఆ కొత్త బాధ్యత కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ, తిరిగి కెనడా వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇంతలో మేం అస్సలు ఊహించని ఒక విషాదం చోటు చేసుకుంది.
షీలాకు గర్భస్రావం అయ్యింది. కడుపులో ఉన్నది మగబిడ్డ అని డాక్టర్ చెప్పాడు. అది జరిగి ఇప్పటికి 50 ఏళ్లు గడిచిపోయినా మేం దాన్ని అస్సలు మర్చిపోలేదు. జరిగిన దానికి చాలా బాధపడ్డా, ఆ దేశంలోనే ఉంటూ మాకు ఎంతో ఇష్టమైన నియామకాన్ని చేస్తూ వచ్చాం.
కామెరూన్‌లో బ్రదర్స్ రాజకీయ విషయాల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వకపోవడం వల్ల తరచూ హింసకు గురయ్యేవాళ్లు. ఎన్నికల సమయంలోనైతే పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉండేవి. 1970, మే 13న మేం అస్సలు జరగకూడదని అనుకున్నదే జరిగింది. ఆ రోజున, దేశంలో యెహోవాసాక్షుల పనిని నిషేధించారు. కొత్త బ్రాంచి ఆఫీసును మొదలుపెట్టి కనీసం ఐదు నెలలు కూడా అవ్వకుండానే ప్రభుత్వం దానిని జప్తు చేసుకుంది. వారంలోపే మిగతా మిషనరీలతో సహా మా ఇద్దరినీ ఆ దేశం నుండి బలవంతంగా పంపించేశారు. అక్కడనుండి వెళ్లిపోవడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ బ్రదర్స్-సిస్టర్స్‌ని మేం ఎంతో ప్రేమించాం అలాగే రానున్న రోజుల్లో వాళ్లకు ఏం అవుతుందో అని ఆందోళనపడ్డాం.
ఆ తర్వాత ఆరు నెలలు ఫ్రాన్స్ బ్రాంచిలో ఉన్నాం. నేను అక్కడ నుండే కామెరూన్‌లో ఉన్న బ్రదర్స్-సిస్టర్స్ అవసరాలు తీర్చడానికి చేయగలిగిందంతా చేశాను. ఆ సంవత్సరం డిసెంబరులో మమ్మల్ని నైజీరియా బ్రాంచికి పంపించారు. నైజీరియా బ్రాంచే కామెరూన్ దేశంలో జరిగే పనిని చూసుకోవడం మొదలుపెట్టింది. నైజీరియాలో ఉన్న బ్రదర్స్-సిస్టర్స్ మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించారు. అక్కడే చాలా సంవత్సరాలు ఆనందంగా సేవ చేశాం.
కష్టమైన ఒక నిర్ణయం
1973 లో మేము చాలా కష్టమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే షీలా తీవ్రమైన కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటోంది. మేము ఒక సమావేశం కోసం న్యూయార్క్ వెళ్లినప్పుడు, తను ఒక్కసారిగా ఏడుస్తూ, “ఇదంతా చేయడం ఇక నావల్ల కాదు. బాగా అలసిపోతున్నాను, ఒంట్లో అస్సలు బాగుండడం లేదు” అని అంది. తను నాతోపాటు పశ్చిమ ఆఫ్రికాలో 14 సంవత్సరాలకు పైగా సేవ చేసింది. ఆమె చేసిన సేవను చూసి నాకు చాలా గర్వంగా అనిపించినా, మేం కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. మా పరిస్థితి గురించి మాట్లాడుకుని, పట్టుదలగా ప్రార్థన చేశాక, షీలా ఆరోగ్యం కోసం తిరిగి కెనడా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము తీసుకున్న నిర్ణయాలన్నిటిలో కష్టమైన, వేదనకరమైన నిర్ణయం ఏదైనా ఉందా అంటే అది మిషనరీ నియామకాన్ని, పూర్తికాల సేవను వదిలిపెట్టడమే.
కెనడాకు వచ్చేశాక, టొరంటోకు ఉత్తరం వైపున ఉన్న ఒక నగరంలో కార్లను అమ్మే వ్యాపారం చేసే నా స్నేహితుడి దగ్గర ఉద్యోగంలో చేరాను. అలాగే ఒక ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నాం, సెకండ్ హ్యాండ్ ఫర్నీచర్ కొనుక్కున్నాం. అలా అప్పు చేయకుండా మా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాం. తిరిగి ఎప్పటికైనా పూర్తికాల సేవ మొదలుపెడతామనే ఆశతో మా జీవితాన్ని వీలైనంత సాదాసీదాగా
ఉంచుకున్నాం. కానీ మేం అనుకున్న దానికన్నా ముందే, ఆ సేవను మళ్లీ మొదలుపెట్టగలిగాం.అదెలా అంటే, ఒంటారియోలో ఉన్న నార్వల్‌లో ఒక కొత్త అసెంబ్లీ హాలు కట్టడం ప్రారంభించారు. నేను శనివారాలు అక్కడికి వెళ్లి వాలంటీరుగా పని చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత, నన్ను అసెంబ్లీ హాలు పర్యవేక్షకునిగా నియమించారు. షీలా ఆరోగ్యం కుదుటపడడం మొదలైంది కాబట్టి, ఈ నియామకాన్ని చేయగలమని మాకు అనిపించింది. దాంతో 1974 జూన్‌లో అసెంబ్లీ హాలులో ఉన్న ఒక ఫ్లాట్‌లోకి మారాం. తిరిగి పూర్తికాల సేవలోకి రావడం చాలా సంతోషంగా అనిపించింది.
కాలం గడుస్తుండగా షీలా ఆరోగ్యం బాగా మెరుగౌతూ వచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత, మేం ప్రాంతీయ సేవ నియామకాన్ని తీసుకోగలిగాం. మాకు ఇచ్చిన సర్క్యూట్ కెనడాలోని మానిటోబా; చలికాలాల్లో అక్కడ ఎముకలు కొరికే చలి ఉంటుంది. అక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కానీ, అక్కడుండే బ్రదర్స్-సిస్టర్స్ ప్రేమ మాత్రం చలిమంటలా ఉంది; వాళ్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మనం ఎక్కడ సేవ చేస్తాం అనేది ముఖ్యం కాదుగానీ, ఎక్కడున్నా సరే యెహోవాను సేవించడమే ముఖ్యం అని నేర్చుకున్నాం.
నేర్చుకున్న ఒక ముఖ్యమైన పాఠం
చాలా ఏళ్లు ప్రాంతీయ సేవ చేశాక, 1978 లో మమ్మల్ని బెతెల్‌కు ఆహ్వానించారు. కొంతకాలానికే, నాకు కష్టంగా అనిపించినా ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. మాంట్రియాల్‌లో జరిగిన ఒక ప్రత్యేక కూటంలో, ఫ్రెంచ్ భాషలో గంటన్నర ప్రసంగాన్ని ఇవ్వడానికి నన్ను నియమించారు. విచారకరంగా, నా ప్రసంగం ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టలేదు. దాంతో సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే ఒక బ్రదర్ నాకు సలహా ఇచ్చాడు. నేను బాగా నైపుణ్యం ఉన్న ప్రసంగీకుడిని కాదని అప్పుడే గ్రహించాల్సింది, కానీ నేను ఆ సలహాను తీసుకోలేదు. ఆ బ్రదర్ నా ప్రసంగంలో మంచి విషయాలు గురించి చెప్పకుండా, కేవలం నా తప్పుల గురించే మాట్లాడుతున్నాడని అనిపించింది. ఆ సలహా ఇచ్చిన పద్ధతిని బట్టి, ఇస్తున్న వ్యక్తి మీద నాకున్న అభిప్రాయాన్ని బట్టి ఇచ్చిన సలహా సరైంది కాదని నేను తప్పుగా అనుకున్నాను.
కొన్ని రోజుల తర్వాత, ఒక బ్రాంచ్ కమిటీ సభ్యుడు దీని గురించి నాతో మాట్లాడాడు. ఇచ్చిన సలహాను నేను సరిగ్గా తీసుకోలేదని ఒప్పుకుని సారీ చెప్పాను. ఆ తర్వాత, నాకు సలహా ఇచ్చిన బ్రదర్‌తో మాట్లాడాను. ఆయన దయతో నన్ను మన్నించాడు. వినయంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఆ అనుభవం నేర్పించింది. ఆ గుణపాఠాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. (సామె. 16:18) ఈ విషయం గురించి నేను యెహోవాకు చాలాసార్లు ప్రార్థించాను. ఎవరు సలహా ఇచ్చినా దాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.
నేను 40కన్నా ఎక్కువ సంవత్సరాల నుండి కెనడా బెతెల్‌లో సేవ చేస్తున్నాను. 1985 నుండి బ్రాంచ్ కమిటీ సభ్యునిగా సేవ చేస్తున్నాను. 2021 ఫిబ్రవరిలో నా భార్య షీలా చనిపోయింది. ఆమె చనిపోయిన బాధతో పాటు, కొన్ని అనారోగ్య సమస్యలు కూడా నన్ను పీడిస్తున్నాయి. కానీ యెహోవా సేవలో బిజీగా ఉండడం వల్ల సంతోషంగా ఉంటున్నాను; “రోజులు ఎలా గడిచిపోతున్నాయో” కూడా తెలియట్లేదు. (ప్రసం. 5:20) నేను జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను, కానీ వాటికి మించిన ఆనందాలు అనుభవించాను. నా జీవితంలో మొదటి స్థానాన్ని యెహోవాకు ఇచ్చి, 70 సంవత్సరాలుగా పూర్తికాల సేవ చేస్తున్నందుకు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. మన మధ్య ఉన్న యౌవన బ్రదర్స్-సిస్టర్స్ కూడా యెహోవాకు మొదటి స్థానం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. వాళ్ల జీవితం కూడా అప్పుడు ఆసక్తికరంగా, సంతృప్తికరంగా ఉంటుంది!
a కావలికోట 2000, ఫిబ్రవరి 1 సంచికలో మార్సెల్ ఫిల్టో జీవిత కథ, “యెహోవాయే నాకు అభయమూ, బలమూ” చూడండి.
b 1957 వరకు, ఆఫ్రికాలోని ఈ ప్రాంతం బ్రిటిష్ వాళ్ల అధీనంలో ఉంది; అప్పట్లో దాన్ని గోల్డ్ కోస్ట్ అని పిలిచేవాళ్లు.
c కావలికోట 2000, డిసెంబరు 1 సంచికలో హెర్బర్ట్ జెన్నింగ్స్ జీవిత కథ, “రేపేమి సంభవించునో మీకు తెలియదు” చూడండి.
d ఆ సమయంలో నేథన్ హెచ్. నార్ మన పనికి నాయకత్వం వహిస్తున్నారు.