కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 39

పాట 125 “కరుణ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు”

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని సొంతం చేసుకోండి

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని సొంతం చేసుకోండి

“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”అపొ. 20:35.

ముఖ్యాంశం

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందడానికి, దాన్ని పెంచుకోవడానికి ఏం చేయవచ్చో తెలుసుకుంటాం.

1-2. తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం పొందేలా యెహోవా మనల్ని ఎందుకు సృష్టించాడు?

 తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం పొందే సామర్థ్యంతో యెహోవా మనుషుల్ని తయారుచేశాడు. (అపొ. 20:35) అంటే తీసుకోవడంలో ఎలాంటి ఆనందం లేదని దానర్థమా? కాదు. ఎవరైనా మనకు గిఫ్ట్‌ ఇస్తే హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మనమే ఇతరులకు ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. చెప్పాలంటే, యెహోవా మనల్ని అలా తయారుచేయడం మన మంచికే. ఎందుకు?

2 యెహోవా మనల్ని అలా సృష్టించడం వల్ల మన సంతోషాన్ని మనమే పెంచుకోవచ్చు. వేరేవాళ్లకు ఏదైనా ఇచ్చే లేదా సహాయం చేసే అవకాశాల కోసం మనం వెదకవచ్చు. యెహోవా మనల్ని ఎంత అద్భుతంగా సృష్టించాడో కదా!—కీర్త. 139:14.

3. బైబిలు యెహోవాను “సంతోషంగల దేవుడు” అని ఎందుకు పిలుస్తుంది?

3 ఇవ్వడంలోనే సంతోషం ఉందని లేఖనాలు చెప్తున్నాయి, కాబట్టి బైబిలు యెహోవాను “సంతోషంగల దేవుడు” అని ఎందుకు పిలుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. (1 తిమో. 1:11) అసలు ఇవ్వడం మొదలుపెట్టింది ఆయనే. ఇచ్చే విషయంలో ఆయనకు ఎవ్వరూ సాటిరారు. “ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (అపొ. 17:28) నిజం చెప్పాలంటే యెహోవా నుండే “ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం” వస్తాయి.—యాకో. 1:17.

4. ఇంకా ఎక్కువ సంతోషం పొందడానికి మనం ఏం చేయవచ్చు?

4 ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ సంతోషాన్ని పొందాలని మనందరం అనుకుంటాం. దానికోసం యెహోవాకున్న ఇచ్చే గుణాన్ని మనం చూపించాలి. (ఎఫె. 5:1) అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. మనం వేరేవాళ్లకు ఏదైనా ఇచ్చినా వాళ్లు కృతజ్ఞత చూపించకపోతే ఏం చేయాలో కూడా నేర్చుకుంటాం. అలా ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని కాపాడుకోవడమే కాదు, దాన్ని ఇంకా పెంచుకోగలుగుతాం.

ఇచ్చే విషయంలో యెహోవాలా ఉండండి

5. యెహోవా మనకు వేటిని ఇస్తున్నాడు?

5 యెహోవా మనకు వేటిని సంతోషంగా ఇస్తున్నాడు? కొన్నిటిని గమనించండి. యెహోవా మనకు అవసరమైనవి ఇస్తున్నాడు. మనం కోరుకునే సౌకర్యాలన్నీ ఆయన ఇవ్వకపోవచ్చు గానీ మనకు అవసరమైనవని ఎప్పుడూ ఉండేలా ఆయన చూసుకుంటాడు. ఉదాహరణకు ఆయన మనకు ఆహారం, బట్టలు, ఉండడానికి ఒక చోటు ఇస్తాడు. (కీర్త. 4:8; మత్త. 6:31-33; 1 తిమో. 6:6-8) యెహోవా వీటన్నిటినీ ఏదో ఇవ్వాలి కదా అని ఇస్తున్నాడా? కానేకాదు. మరైతే ఆయన మనకోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు?

6. మత్తయి 6:25, 26 నుండి మనమేం నేర్చుకుంటాం?

6 ఒక్కమాటలో చెప్పాలంటే, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు అవసరమైనవన్నీ ఇస్తున్నాడు. మత్తయి 6:25, 26లో యేసు చెప్పిన మాటల్ని చూడండి. (చదవండి.) సృష్టిలోని కొన్నిటి గురించి ఆయన అక్కడ చెప్పాడు. పక్షుల గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “అవి విత్తవు, కోయవు, గోదాముల్లో పోగుచేసుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు.” ఆ తర్వాత యేసు ఈ ప్రశ్న అడిగాడు: “మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా?” దీన్నుండి మనకేంటి పాఠం? యెహోవా తన నమ్మకమైన సేవకుల్ని జంతువులు, పక్షులకన్నా చాలా విలువైనవాళ్లుగా చూస్తాడు. యెహోవా వాటి అవసరాల్నే చూసుకుంటున్నాడంటే మన అవసరాల్ని కూడా ఖచ్చితంగా చూసుకుంటాడు. ఒక శ్రద్ధగల తండ్రి ప్రేమతో తన కుటుంబాన్ని పోషించినట్టే, యెహోవా కూడా మన అవసరాల్ని తీరుస్తాడు.—కీర్త. 145:16; మత్త. 6:32.

7. ఇచ్చే విషయంలో యెహోవాలా ఉండడానికి ఏం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

7 మనం కూడా యెహోవాలాగే ఇతరుల మీద ప్రేమతో వాళ్లకు అవసరమైనవి ఇవ్వచ్చు. ఉదాహరణకు బట్టలు, ఆహారం అవసరమైన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఎవరైనా మీకు తెలుసా? వాళ్ల అవసరాలు తీర్చడానికి యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. విపత్తు వచ్చినప్పుడు వేరేవాళ్లకు సహాయం చేయడంలో యెహోవా ప్రజలు ముందుంటారు. అంతెందుకు కోవిడ్‌ వచ్చినప్పుడు అవసరంలో ఉన్నవాళ్లకు బట్టల్ని, ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఇచ్చారు. ప్రపంచవ్యాప్త పనికోసం చాలామంది మనస్ఫూర్తిగా విరాళాలు కూడా ఇచ్చారు. ప్రపంచంలో విపత్తులు ఎక్కడొచ్చినా సహాయక చర్యలకు ఆ విరాళాలు బాగా ఉపయోగపడ్డాయి. అలా సహాయం చేసిన బ్రదర్స్‌-సిస్టర్స్‌ హెబ్రీయులు 13:16 లో ఉన్న ఈ మాటల్ని పాటించారు: “మంచి చేయడం, మీకున్న వాటిని ఇతరులతో పంచుకోవడం మర్చిపోకండి. అలాంటి బలులు దేవునికి చాలా ఇష్టం.”

మనస్ఫూర్తిగా ఉదారంగా ఇచ్చే విషయంలో మనలో ప్రతీఒక్కరం యెహోవాలా ఉండవచ్చు (7వ పేరా చూడండి)


8. యెహోవా శక్తిని ఇవ్వడం వల్ల మనం ఏం చేయగలుగుతాం? (ఫిలిప్పీయులు 2:13)

8 యెహోవా శక్తిని ఇస్తాడు. యెహోవాకు అంతులేని శక్తివుంది. దాన్ని తన సేవకులకు ఇవ్వడం అంటే ఆయనకు చాలా ఇష్టం. (ఫిలిప్పీయులు 2:13 చదవండి.) తప్పు చేయాలనే ఒత్తిడిని ఎదిరించడానికి, కష్టమైన పరిస్థితిని సహించడానికి శక్తి కోసం మీరెప్పుడైనా ప్రార్థించారా? లేదా ఏరోజుకారోజు అవసరమయ్యే బలం కోసం యెహోవాను అడిగారా? అలాంటి ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు అపొస్తలుడైన పౌలులాగే మీరూ ఇలా అంటారు: “ఎందుకంటే, నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలి. 4:13.

9. యెహోవాలా ఇతరులకు సహాయం చేయడానికి మన శక్తిని ఏయే విధాలుగా ఉపయోగించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

9 యెహోవాలా మనకు అంతులేని శక్తి లేదు. అలాగని ఆయన మనకు శక్తిని ఇచ్చినట్టు, మనం వేరేవాళ్లకు ఇవ్వలేం. కానీ మన శక్తిని ఉపయోగించి ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం యెహోవాలా ఉంటాం. ఉదాహరణకు, వృద్ధులైన లేదా ఒంట్లో బాలేని బ్రదర్స్‌-సిస్టర్స్‌కి వాళ్ల ఇంటి పనుల్లో సహాయం చేయవచ్చు లేదా వాళ్లకు అవసరమైన సరుకులు తెచ్చిపెట్టవచ్చు. మన పరిస్థితులు అనుకూలిస్తే రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే విషయంలో, రిపేర్లు చేసే విషయంలో సహాయం చేయడానికి మనం ముందుకు రావచ్చు. మన శక్తిని ఇలా ఉపయోగించినప్పుడు బ్రదర్‌-సిస్టర్స్‌కి మంచి చేసినవాళ్లమౌతాం.

మనం ఇతరులకు సహాయం చేయడానికి మన శక్తిని ఉపయోగించవచ్చు (9వ పేరా చూడండి)


10. మన మాటల ద్వారా ఇతరుల్ని ఎలా బలపర్చవచ్చు?

10 మాటలకు కూడా శక్తి ఉంటుందని మనం మర్చిపోకూడదు. మీరు మెచ్చుకుంటూ మాట్లాడే నాలుగు మాటలు ఎవరికైనా సహాయం చేస్తాయా? ఓదార్పు అవసరమయ్యే వాళ్లెవరైనా మీకు తెలుసా? అలాగైతే మీరే చొరవ తీసుకుని వాళ్లతో మాట్లాడండి. మీరు వాళ్లను నేరుగా కలవవచ్చు, ఫోన్‌ చేసి మాట్లాడవచ్చు; కార్డ్‌ గానీ, మెయిల్‌ గానీ, మెసేజ్‌ గానీ పంపించవచ్చు. ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అని మరీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరంలేదు. యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగడానికి లేదా వాళ్ల మనసు కుదుటపడడానికి ప్రేమగా రెండుమూడు మాటలు మాట్లాడినా చాలు.—సామె. 12:25; ఎఫె. 4:29.

11. యెహోవా తెలివిని ఎలా ఇస్తాడు?

11 యెహోవా తెలివిని ఇస్తాడు. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “మీలో ఎవరికైనా తెలివి తక్కువగా ఉంటే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, అది అతనికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఆయన తప్పుబట్టకుండా అందరికీ ఉదారంగా ఇస్తాడు.” (యాకో. 1:5, అధస్సూచి) ఈ మాటల్నిబట్టి యెహోవా తనకున్న తెలివిని తన దగ్గరే ఉంచుకోడు అని అర్థమౌతుంది. దాన్ని ఉదారంగా లేదా మనస్ఫూర్తిగా ఇతరులకు ఇస్తాడు. ఇంకా మీరు ఒకటి గమనించారా? యెహోవా తెలివిని ఇచ్చేటప్పుడు “కోప్పడకుండా” లేదా “తప్పుబట్టకుండా” ఇస్తాడు. అంటే తన తెలివిని అడిగినందుకు ఆయన మనల్ని చిన్నచూపు చూడడు. నిజానికి అలా అడగమని ఆయన మనల్ని కోరుతున్నాడు.—సామె. 2:1-6.

12. మనకున్న తెలివిని ఇతరులతో ఎప్పుడెప్పుడు పంచుకోవచ్చు?

12 మన సంగతేంటి? మనం కూడా యెహోవాలా మనకున్న తెలివిని ఇతరులతో పంచుకోవచ్చా? (కీర్త. 32:8) నేర్చుకున్నవాటిని ఇతరులకు చెప్పే అవకాశాలు యెహోవా ప్రజలకు చాలా ఉంటాయి. ఉదాహరణకు, ప్రీచింగ్‌ ఎలా చేయాలో మనం కొత్తవాళ్లకు నేర్పిస్తూ ఉంటాం. పెద్దలేమో సంఘ పరిచారకులకు, బాప్తిస్మం తీసుకున్న బ్రదర్స్‌కు ఓపిగ్గా సహాయం చేస్తూ వేర్వేరు నియామకాల్ని ఎలా చేయాలో నేర్పిస్తుంటారు. అలాగే నిర్మాణ పనుల్లో, రిపేరు పనుల్లో అనుభవం ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ వాళ్లకున్న నైపుణ్యాల్ని ఇతరులతో పంచుకుంటారు.

13. ఇతరులకు ట్రైనింగ్‌ ఇచ్చేటప్పుడు మనం యెహోవాలా ఎలా ఉండవచ్చు?

13 ఇతరులకు ట్రైనింగ్‌ ఇచ్చేటప్పుడు యెహోవాలా ఉండండి. యెహోవా తనకున్న తెలివిని ఇతరులకు ఉదారంగా, మనస్ఫూర్తిగా ఇస్తాడని గుర్తుంచుకోండి. మనం కూడా మనకున్న అనుభవాన్ని, తెలివిని దాచుకోకుండా ఇతరులతో పంచుకోవాలి. నేర్చుకున్న వ్యక్తి ఏదోకరోజు మన స్థానం తీసేసుకుంటాడు అనే భయంతో మనకు తెలిసినవాటిని చెప్పకుండా దాచిపెట్టడం లాంటివి చేయం. మనం ఇలా కూడా అనుకోకూడదు: ‘నాకు ఎవ్వరూ ట్రైనింగ్‌ ఇవ్వలేదు, నేనెందుకు చెప్పాలి? వాళ్లు సొంతగా నేర్చుకుంటారులే.’ ఇలాంటి ఆలోచనల్ని యెహోవా ప్రజలు అస్సలు రానివ్వకూడదు. నిజానికి మనకు తెలిసినవి చెప్పడమే కాదు, మన ‘ప్రాణాల్ని ఇవ్వడానికి’ కూడా సంతోషంగా ముందుకు రావాలి. (1 థెస్స. 2:8) “వాళ్లు కూడా ఇతరులకు బోధించడానికి తగినవిధంగా అర్హులౌతారు” అని మనం ఆశిస్తాం. (2 తిమో. 2:1, 2) అలా మనం ఎప్పుడైతే మనకు తెలిసినవాటిని సంతోషంగా ఇతరులతో పంచుకుంటామో మనమే కాదు, ఇతరులు కూడా సంతోషంగా ఉంటారు.

మనం చేసినదానికి కృతజ్ఞత చూపించకపోతే . . .

14. మనం ఉదారంగా ఏదైనా చేసినా, ఇచ్చినా చాలామంది తిరిగి ఏం చేస్తుంటారు?

14 ముఖ్యంగా బ్రదర్స్‌-సిస్టర్స్‌ కోసం మనం ఉదారంగా ఏదైనా చేసినా, ఇచ్చినా వాళ్లు మనకు థ్యాంక్స్‌ చెప్తుంటారు. వాళ్లు కొన్నిసార్లు కార్డ్‌ రాసిస్తారు లేదా వేరే విధంగా కృతజ్ఞత చూపిస్తారు. (కొలొ. 3:15) అలా వాళ్లు కృతజ్ఞత చూపించినప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

15. ఎవరైనా కృతజ్ఞత చూపించకపోతే మనం ఏం గుర్తుంచుకోవాలి?

15 నిజం చెప్పాలంటే, మనం చేసినవాటికి ప్రతీఒక్కరు థ్యాంక్స్‌ చెప్పకపోవచ్చు. మనం వాళ్లకోసం ఎంత టైంని, శక్తిని త్యాగం చేశామో దానిగురించి వాళ్లు కొంచెమైనా ఆలోచించారా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు కోపం రాకూడదంటే, మన సంతోషాన్ని కోల్పోకూడదంటే ఏం చేయాలి? ఈ ఆర్టికల్‌ ముఖ్య వచనమైన అపొస్తలుల కార్యాలు 20:35 లో ఉన్న మాటల్ని గుర్తుంచుకోండి. మన సంతోషం, అవతలి వ్యక్తి ఎంత కృతజ్ఞత చూపిస్తున్నాడు అనే దానిమీద ఆధారపడి ఉండదు. వాళ్లు కృతజ్ఞత చూపించకపోయినా, ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఎలా?

16. ఇతరులకు ఇచ్చేటప్పుడు ఎవరిలా ఉండడానికి మనం ప్రయత్నించాలి?

16 యెహోవాలా ఉండడానికి ప్రయత్నించండి. ప్రజలు కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా ఆయన వాళ్లకు మంచివాటిని ఇస్తూనే ఉన్నాడు. (మత్త. 5:43-48) మనం కూడా “తిరిగి ఏమీ ఆశించకుండా” ఇస్తే, మనకు “గొప్ప ప్రతిఫలం” ఉంటుందని యెహోవా మాటిస్తున్నాడు. (లూకా 6:35) “ఏమీ” అన్నప్పుడు థ్యాంక్స్‌ని కూడా మనం ఆశించకూడదు. అవతలి వ్యక్తి మనకు కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా మనం ఇతరులకు సహాయపడుతూ మంచి చేసినప్పుడు, సంతోషంగా ఇచ్చినప్పుడు యెహోవా మనకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు.—సామె. 19:17; 2 కొరిం. 9:7.

17. ఇతరులకు ఇచ్చేటప్పుడు యెహోవాలా ఉండడానికి ఏం చేయవచ్చు? (లూకా 14:12-14)

17 ఇతరులకు ఇచ్చేటప్పుడు యెహోవాలా ఉండడానికి మనం చేయగలిగే ఇంకొక పని లూకా 14:12-14లో ఉంది. (చదవండి.) మనకు తిరిగి ఇవ్వగలిగే వాళ్లను భోజనానికి పిలవడం, వాళ్లకు సహాయం చేయడం తప్పుకాదు. కానీ ఏదోకటి తిరిగి పొందాలనే ఆశతో మనం ఇతరులకు ఇస్తున్నామా? అలాగైతే యేసు చెప్పింది చేయడానికి ప్రయత్నించాలి. మనకు తిరిగి ఆతిథ్యం ఇవ్వలేని వ్యక్తికి మనం ఆతిథ్యం ఇవ్వచ్చు. అప్పుడు యెహోవాలా ఉంటున్నందుకు సంతోషంగా ఉంటాం. అలా తిరిగి ఆశించకుండా ఇస్తే ఎదుటి వ్యక్తి కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా మనం ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని సొంతం చేసుకుంటాం.

18. బ్రదర్స్‌-సిస్టర్స్‌ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

18 ఇతరులకు కృతజ్ఞత లేదు అనే ముగింపుకు రాకండి. (1 కొరిం. 13:7) అవతలి వ్యక్తి కృతజ్ఞత చూపించకపోతే మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘వాళ్లకు నిజంగా కృతజ్ఞత లేదా? లేక థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోయారా?’ మనం ఆశించినట్టు వాళ్లు కృతజ్ఞత చూపించకపోవడానికి బహుశా వేరే కారణాలు కూడా ఉండి ఉంటాయేమో. కొంతమందికి మనసులో చాలా కృతజ్ఞత ఉంటుంది కానీ బయటికి చెప్పడం కష్టంగా అనిపిస్తుంది. ఇంకొంతమందికి వేరేవాళ్ల సహాయం తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే గతంలో వాళ్లే ఇతరులకు ఇవ్వడంలో ముందున్నారు. ఏదేమైనా క్రీస్తులాంటి ప్రేమ చూపిస్తే మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ని మనం తప్పుగా అర్థం చేసుకోకుండా, సంతోషంగా ఇస్తూ ఉంటాం.—ఎఫె. 4:2.

19-20. ఇచ్చే విషయంలో ఓర్పు చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? (చిత్రం కూడా చూడండి.)

19 ఓర్పు చూపించండి. పెద్ద మనసుతో ఇవ్వడం గురించి తెలివిగల రాజైన సొలొమోను ఇలా రాశాడు: “నీ ఆహారం నీళ్ల మీద వేయి, చాలా రోజుల తర్వాత అది మళ్లీ నీకు దొరుకుతుంది.” (ప్రసం. 11:1) ఈ మాటలు చెప్తున్నట్టు, కొంతమంది మనం చేసినదానికి “చాలా రోజుల తర్వాత” కృతజ్ఞత చూపించవచ్చు. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక అనుభవాన్ని గమనించండి.

20 చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రాంతీయ పర్వవేక్షకుని భార్య, కొత్తగా బాప్తిస్మం తీసుకున్న ఒక సిస్టర్‌కి ఉత్తరం రాస్తూ యెహోవాకు నమ్మకంగా ఉండమని ప్రోత్సహించింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆమెకు జవాబు వచ్చింది. ఆ సిస్టర్‌ ప్రాంతీయ పర్వవేక్షకుని భార్యకు ఇలా రాసింది: “గడిచిన సంవత్సరాల్లో మీకు తెలీకుండానే మీరు ఎంత సహాయం చేశారో చెప్పాలి అనిపించింది. మీ ఉత్తరంలో ఉన్న ప్రతీ మాటలో ప్రేమ కనిపించింది, కానీ మీరు రాసిన లేఖనం మాత్రం నా మనసును తాకింది. నేను దాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు.” a తను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పాక ఆమె ఇంకా ఇలా రాసింది: “కొన్నిసార్లు నాకు అన్నీ వదిలేసి సత్యం నుండి వెళ్లిపోవాలని అనిపించేది. కానీ మీరు రాసిన ఆ లేఖనం నా మనసును తడుతూ ఉంది. పట్టుదలగా ముందుకు వెళ్లడానికి నాకు సహాయం చేసింది. గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో దేన్నుండి పొందనంత ప్రోత్సాహం మీ ఉత్తరం నుండి, మీరు చూపించిన లేఖనం నుండి నేను పొందాను.” తన ఉత్తరానికి “చాలా రోజుల తర్వాత” జవాబు పొందిన ఆ ప్రాంతీయ పర్యవేక్షకుని భార్యకు ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో కదా. మనం కూడా ఎవరికైనా మంచి చేసిన “చాలా రోజుల తర్వాత” కృతజ్ఞతను పొందవచ్చు.

మనం చేసినదానికి “చాలా రోజుల తర్వాత” కృతజ్ఞత పొందవచ్చు (20వ పేరా చూడండి) b


21. యెహోవాలా సంతోషంగా, ఉదారంగా ఇవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

21 ముందు చెప్పినట్టు, యెహోవా మనల్ని ఒక ప్రత్యేకమైన సామర్థ్యంతో సృష్టించాడు. మనం తీసుకోవడంలో ఆనందం పొందినా, ఇవ్వడంలో అంతకన్నా గొప్ప ఆనందాన్ని పొందుతాం. మన బ్రదర్స్‌-సిస్టర్స్‌కి సహాయం చేయగలుగుతున్నందుకు సంతోషంగా అనిపిస్తుంది. వాళ్లు కృతజ్ఞత చూపిస్తే ఆనందంగా ఉంటుంది. కానీ వాళ్లు కృతజ్ఞత చూపించినా, చూపించకపోయినా మనం మాత్రం సరైనది చేసినందుకు సంతోషంగా ఉండవచ్చు. మనం ఎంత ఇచ్చినా మనకు “యెహోవా అంతకన్నా ఎక్కువే ఇవ్వగలడు” అని ఎప్పుడూ మర్చిపోకండి. (2 దిన. 25:9) అవును, యెహోవా మీకు ఇచ్చిన దానికన్నా మించి మీరు వేరేవాళ్లకు ఇవ్వలేరు! అంతేకాదు యెహోవాయే ప్రతిఫలం ఇచ్చినప్పుడు అంతకుమించిన సంతోషం ఇంకోటి ఉండదు. కాబట్టి మనం ఉదారంగా, సంతోషంగా ఇచ్చే మన పరలోక తండ్రిలా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుందాం.

పాట 17 “నాకు ఇష్టమే”

a ప్రాంతీయ పర్యవేక్షకుని భార్య రాసిన లేఖనం 2 యోహాను 8. అక్కడ ఇలా ఉంది: “మేము కష్టపడి సాధించినవాటిని మీరు పోగొట్టుకోకుండా ఉండేలా, పూర్తి బహుమతి పొందేలా జాగ్రత్తగా ఉండండి.”

b చిత్రాల వివరణ : ఈ పునర్నటనలో, ప్రాంతీయ పర్యవేక్షకుని భార్య ప్రోత్సాహాన్నిచ్చే ఒక ఉత్తరం రాసింది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి తిరిగి కృతజ్ఞత పొందింది.