కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 37

పాట 118 ‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’

చివరివరకు నమ్మకంగా సహించడానికి సహాయం చేసే ఉత్తరం

చివరివరకు నమ్మకంగా సహించడానికి సహాయం చేసే ఉత్తరం

‘మొదట్లో మనకున్న నమ్మకాన్ని చివరి వరకు దృఢంగా ఉంచుకుందాం.’హెబ్రీ. 3:14.

ముఖ్యాంశం

ఈ వ్యవస్థ ముగింపు వరకు నమ్మకంగా సహించడానికి సహాయం చేసే సలహాల్ని, హెబ్రీయులకు రాసిన ఉత్తరం నుండి నేర్చుకుంటాం.

1-2. (ఎ) అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు ఉత్తరం రాసినప్పుడు, యూదయలో పరిస్థితి ఎలా ఉంది? (బి) ఆ ఉత్తరం సరైన సమయానికే వచ్చిందని ఎందుకు చెప్పవచ్చు?

 యేసు చనిపోయిన తర్వాతి సంవత్సరాల్లో యెరూషలేములో, యూదయలో ఉంటున్న హెబ్రీ క్రైస్తవులకు అడుగడుగునా కష్టాలే. క్రైస్తవ సంఘం ఏర్పడిన వెంటనే హింసలు ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. (అపొ. 8:1) దాదాపు 20 ఏళ్ల తర్వాత దేశంలో కరువు రావడంతో క్రీస్తు అనుచరులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. (అపొ. 11:27-30) రాబోయే సంవత్సరాల్లో హింసలు ఇంకాఇంకా పెరిగిపోతాయి. కానీ దాదాపు క్రీ.శ. 61 సమయంలో క్రైస్తవులు కాస్త ప్రశాంతతను ఆనందించారు. ఆ సమయంలో వాళ్లు అపొస్తలుడైన పౌలు నుండి ఒక ఉత్తరాన్ని అందుకున్నారు. చెప్పాలంటే, ఆ ఉత్తరం సరైన సమయానికి వచ్చింది.

2 క్రైస్తవులు ఆనందిస్తున్న ఆ ప్రశాంతత ఎక్కువకాలం ఉండదు కాబట్టి, ఆ ఉత్తరం సరైన సమయానికి వచ్చిందని చెప్పవచ్చు. రాబోయే శ్రమల్ని సహించడానికి సహాయం చేసే మంచి సలహాల్ని పౌలు అక్కడున్న క్రైస్తవులకు ఇచ్చాడు. యేసు ముందే చెప్పిన యెరూషలేము నాశనం దగ్గరపడింది. (లూకా 21:20) అయితే ఆ నాశనం ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుందో పౌలుకు, యూదయలో ఉన్న క్రైస్తవులకు తెలీదు. కానీ మిగిలివున్న సమయాన్ని ఉపయోగించుకుంటూ విశ్వాసం, సహనం లాంటి లక్షణాల్ని పెంచుకుని వాళ్లు సిద్ధంగా ఉండవచ్చు.—హెబ్రీ. 10:25; 12:1, 2.

3. నేడున్న క్రైస్తవులు హెబ్రీయులకు రాసిన ఉత్తరాన్ని ఎందుకు జాగ్రత్తగా పరిశీలించాలి?

3 హెబ్రీ క్రైస్తవులు ఎదుర్కొన్న శ్రమలకంటే ఇంకా గొప్ప శ్రమలు మన ముందున్నాయి. (మత్త. 24:21; ప్రక. 16:14, 16) యెహోవా అప్పట్లో క్రైస్తవులకు ఇచ్చిన సలహాల నుండి మనం కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి వాటిలో కొన్ని సలహాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

‘పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోండి’

4. యూదా క్రైస్తవులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? (చిత్రం కూడా చూడండి.)

4 అక్కడి క్రైస్తవులు ఒకప్పుడు యూదులుగా ఉన్నారు. వాళ్లు క్రైస్తవులుగా మారినప్పుడు చేసుకున్న మార్పులు అంతాఇంత కాదు. ఇదివరకు, యూదులే యెహోవా ఎంచుకున్న ప్రజలు. ఎన్నో ఏళ్లపాటు యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన నగరంగా ఉంది. అక్కడి నుండి పరిపాలించిన రాజులు యెహోవాకు ప్రతినిధిగా ఉండేవాళ్లు. అంతేకాదు అక్కడున్న ఆలయం స్వచ్ఛారాధనకు కేంద్రం. నమ్మకమైన యూదులందరూ మోషే ధర్మశాస్త్రాన్ని, తమ మతనాయకులు బోధించిన నియమాల్ని తూ.చా. తప్పకుండా పాటించేవాళ్లు. ఆహారం, సున్నతి, అన్యులతో స్నేహం . . . ఇలా ప్రతీ విషయంలో వాళ్లకు నియమాలు ఉండేవి. కానీ యేసు మరణం తర్వాత యెహోవా యూదులు అర్పించిన బలుల్ని అంగీకరించడం ఆపేశాడు. ధర్మశాస్త్రాన్ని పాటించే ఆ యూదా క్రైస్తవులకు అదొక పెద్ద సవాలు. (హెబ్రీ. 10:1, 4, 10) అపొస్తలుడైన పేతురు లాంటి పరిణతి సాధించిన క్రైస్తవులకు కూడా ఆ మార్పులకు అలవాటు పడడం కష్టమైంది. (అపొ. 10:9-14; గల. 2:11-14) అంతేకాదు వాళ్ల నమ్మకాల్లో వచ్చిన ఈ మార్పుల వల్ల ఆ క్రైస్తవులు యూదా మతనాయకుల చేతుల్లో ఎన్నో హింసల్ని ఎదుర్కొన్నారు.

వ్యతిరేకతను, యూదుల అబద్ధ బోధల్ని పట్టించుకోకుండా, క్రైస్తవులు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి (4-5 పేరాలు చూడండి)


5. క్రైస్తవులకు ఎవరెవరి నుండి వ్యతిరేకత ఎదురైంది?

5 ఆ హెబ్రీ క్రైస్తవులు రెండు వైపుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఒకవైపు, యూదా మతనాయకులు వాళ్లను మతభ్రష్టుల్లా చూశారు. మరోవైపు క్రైస్తవులుగా మారిన యూదుల్లో కొంతమంది, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ఆచారాల్ని ఇంకా పాటించాల్సిందే అని పట్టుబట్టారు. బహుశా హింసను తప్పించుకోవడానికి వాళ్లు అలా చేసుంటారు. (గల. 6:12) మరైతే నమ్మకమైన క్రైస్తవులకు సత్యాన్ని విడిచిపెట్టకుండా ఉండడానికి ఏం సహాయం చేస్తుంది?

6. తోటి క్రైస్తవుల్ని ఏం చేయమని పౌలు ప్రోత్సహించాడు? (హెబ్రీయులు 5:14–6:1)

6 హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో అపొస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని బాగా చదివి, అధ్యయనం చేయమని తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (హెబ్రీయులు 5:14–6:1 చదవండి.) యూదులు ఆరాధించే విధానం కన్నా, క్రైస్తవులు ఆరాధించే విధానమే మెరుగైందని పౌలు లేఖనాలు ఉపయోగించి తన సహోదరులకు వివరించాడు. a అవును, లేఖనాల్లో ఉన్న సత్యాన్ని క్రైస్తవులు బాగా అర్థం చేసుకుంటేనే అబద్ధ బోధల్ని గుర్తించి, వాటికి దూరంగా ఉండగలరని పౌలుకు తెలుసు.

7. నేడు మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం?

7 ఆ క్రైస్తవుల్లాగే నేడు మనం కూడా, యెహోవా నీతి ప్రమాణాలకు పూర్తి విరుద్ధంగా ఉన్న ఆలోచనలు, అభిప్రాయాల మధ్య జీవిస్తున్నాం. నైతిక విషయాల్లో బైబిలు ఆధారంగా ఉన్న మన నమ్మకాల్ని వ్యతిరేకులు తప్పుబడుతూ మనం క్రూరంగా, కఠినంగా ఉంటామని నిందలు వేస్తుంటారు. లోకంలోని వాళ్ల ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు భూమికి-ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. (సామె. 17:15) మన ధైర్యాన్ని నీరుగార్చడానికి, తప్పుదారి పట్టించడానికి వ్యతిరేకులు రకరకాల ఆలోచనల్ని ఉపయోగిస్తారు. కాబట్టి వాటిని పసిగట్టే సామర్థ్యాన్ని పెంచుకోవాలి, వాటికి దూరంగా ఉండాలి.—హెబ్రీ. 13:9.

8. పరిణతి సాధించే దిశగా ముందుకు వెళ్లడానికి మనకేది సహాయం చేస్తుంది?

8 పరిణతి సాధించే దిశగా సాగిపోతూ ఉండమని పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఇచ్చిన సలహాను మనం కూడా పాటించాలి. దానికోసం సత్యంలో ఉన్న లోతైన విషయాల్ని తెలుసుకోవాలి, యెహోవాలా ఆలోచించడం నేర్చుకోవాలి. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా అలా చేస్తూనే ఉండాలి. మనం సత్యంలో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నా, ప్రతీఒక్కరం దేవుని వాక్యాన్ని క్రమంగా చదివి, అధ్యయనం చేయాలి. (కీర్త. 1:2) అలా వ్యక్తిగత అధ్యయనాన్ని చక్కగా చేస్తే, పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో పదేపదే చెప్పిన లక్షణాన్ని మనం పెంచుకుంటాం: అదే, విశ్వాసం.—హెబ్రీ. 11:1, 6.

‘ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వాసం చూపించండి’

9. హెబ్రీ క్రైస్తవులకు బలమైన విశ్వాసం ఎందుకు అవసరం?

9 యూదయలో శ్రమలు వచ్చినప్పుడు ప్రాణాలతో తప్పించుకోవాలంటే, హెబ్రీ క్రైస్తవులకు బలమైన విశ్వాసం అవసరం. (హెబ్రీ. 10:37-39) యెరూషలేమును సైన్యాలు చుట్టుముట్టినప్పుడు, తన అనుచరులు కొండలకు పారిపోవాలని యేసు ముందే చెప్పాడు. క్రైస్తవులు పెద్దపెద్ద గోడలున్న యెరూషలేము నగరంలో ఉంటున్నా లేక బయట గ్రామాల్లో ఉంటున్నా ఆయన ఇచ్చిన సలహాను పాటించాలి. (లూకా 21:20-24) మాములుగా ఆ కాలంలో సైన్యం దాడిచేసినప్పుడు, ప్రజలు పెద్దపెద్ద గోడలున్న నగరాల్లో దాక్కునేవాళ్లు. కాబట్టి యెరూషలేము నగరంలో ఉండే బదులు, కొండలకు పారిపోవడం అనేది చాలా తెలివితక్కువ పనిలా అనిపించి ఉంటుంది. అందుకే, యేసు చెప్పింది చేయడానికి వాళ్లకు బలమైన విశ్వాసం అవసరం.

10. బలమైన విశ్వాసం ఉంటే క్రైస్తవులు ఏం చేస్తారు? (హెబ్రీయులు 13:17)

10 సంఘాన్ని నడిపించడానికి యేసు ఉపయోగిస్తున్న వాళ్లమీద హెబ్రీ క్రైస్తవులు నమ్మకం చూపించాలి. యేసు ఇచ్చిన సలహాకు తగ్గట్టు ఎప్పుడు పారిపోవాలి, ఎలా పారిపోవాలి అనే విషయాల్లో పెద్దలు సంఘంలో ఉన్న ప్రతీఒక్కరికి నిర్దేశాలు ఇచ్చివుంటారు. (హెబ్రీయులు 13:17 చదవండి.) హెబ్రీయులు 13:17 లో “విధేయత చూపిస్తూ” అని అనువదించబడిన గ్రీకు పదానికి, నిర్దేశం ఇస్తున్న వ్యక్తి మీద నమ్మకంతో వాళ్ల మాట వినడం అనే అర్థం ఉంది. అంటే పెద్దలకు అధికారం ఉంది కాబట్టి వాళ్ల మాట ఊరికే వినడం కాదుగానీ, వాళ్లమీద పూర్తి నమ్మకంతో వాళ్ల మాట వినాలి. అందుకే శ్రమలు రాకముందే, ఆ హెబ్రీ క్రైస్తవులు విశ్వాసం చూపిస్తూ పెద్దల మీద తమకున్న నమ్మకాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు పెద్దల మాటల్ని వింటే, సమస్యలు వచ్చినప్పుడు వినడం ఇంకా తేలికౌతుంది.

11. నేడు క్రైస్తవులకు బలమైన విశ్వాసం ఎందుకు అవసరం?

11 హెబ్రీ క్రైస్తవుల్లాగే నేడు మనకు కూడా బలమైన విశ్వాసం అవసరం. ఈ వ్యవస్థ ముగింపుకు సంబంధించి బైబిలు ఇస్తున్న హెచ్చరికను నేడు చాలామంది ఎగతాళి చేస్తారు, దాన్ని అస్సలు నమ్మరు. (2 పేతు. 3:3, 4) అంతేకాదు మహాశ్రమ సమయంలో ఏమేం జరుగుతాయో బైబిల్లో చాలా వివరాలు ఉన్నాయి, కానీ మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అంతం సరైన సమయానికి వస్తుంది, యెహోవా మనల్ని శ్రద్ధగా చూసుకుంటాడు అనే బలమైన విశ్వాసం మనకు అవసరం.—హబ. 2:3.

12. మహాశ్రమను దాటాలంటే మనం ఏం చేయాలి?

12 నేడు మనల్ని నడిపించడానికి యెహోవా ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి’ ఉపయోగిస్తున్నాడు. (మత్త. 24:45) ఆ దాసుని మీద మనకున్న విశ్వాసాన్ని కూడా పెంచుకోవాలి. రోమన్లు వచ్చినప్పుడు హెబ్రీ క్రైస్తవులు తమ ప్రాణాలు కాపాడుకునే నిర్దేశాల్ని పొందినట్టే, మహాశ్రమ మొదలైనప్పుడు మనకు కూడా కొన్ని నిర్దేశాలు రావచ్చు. కాబట్టి యెహోవా సంస్థలో నాయకత్వం వహిస్తున్న వాళ్లు ఇచ్చే నిర్దేశం మీద మనకున్న నమ్మకాన్ని పెంచుకోవాల్సిన సమయం ఇదే. వాళ్లిచ్చే ఉపదేశాల్ని పాటించడం మనకు ఇప్పుడే కష్టమైతే, మహాశ్రమ సమయంలో మనం దాన్ని తేలిగ్గా పాటించగలం అంటారా?

13. హెబ్రీయులు 13:5 లో ఉన్న సలహా సరైనదే అని ఎందుకు చెప్పవచ్చు?

13 పారిపోవాలి అనే సూచన కోసం ఎదురుచూస్తున్నప్పుడు, హెబ్రీ క్రైస్తవులు ‘డబ్బును ప్రేమించకుండా’ సాదాసీదాగా కూడా జీవించాలి. (హెబ్రీయులు 13:5 చదవండి.) వాళ్లలో కొంతమంది కరువును ఎదుర్కొన్నారు, పేదరికాన్ని అనుభవించారు. (హెబ్రీ. 10:32-34) మంచివార్త కోసం కష్టాల్ని ఎదుర్కోవడానికి వాళ్లు వెనకాడలేదు. అయితే భవిష్యత్తులో అలాంటి సమస్యల్ని తప్పించుకోవడానికి, డబ్బును కూడబెట్టుకోవడం ప్రాముఖ్యం అని కొంతమంది అనుకుని ఉంటారు. కానీ ఎంత డబ్బున్నా రాబోయే నాశనం నుండి అది వాళ్లను కాపాడలేదు. (యాకో. 5:3) డబ్బును, వస్తువుల్ని ప్రేమించిన వాళ్లకు తమ ఇళ్లను, ఆస్తిపాస్తుల్ని వదిలేసి పారిపోవడం చాలా కష్టమైవుంటుంది.

14. మనకు బలమైన విశ్వాసం ఉంటే డబ్బు, వస్తువులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం?

14 ఈ వ్యవస్థ ముగింపు చాలా దగ్గర్లో ఉంది అనే బలమైన విశ్వాసం ఉంటే డబ్బును గానీ, వస్తువుల్ని గానీ ప్రేమించం. ప్రజలు త్వరలో “తమ వెండిని వీధుల్లో పడేస్తారు.” ఎందుకంటే “యెహోవా ఉగ్రత రోజున వాళ్ల వెండి గానీ, బంగారం గానీ వాళ్లను రక్షించలేదు” అని వాళ్లకు అర్థమైపోతుంది. (యెహె. 7:19) వీలైనంత ఎక్కువ డబ్బును కూడబెట్టుకోవడం మీద మనసుపెట్టే బదులు, సాదాసీదాగా జీవిస్తూ దేవుని సేవలో ముందుకు సాగేలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే అనవసరమైన అప్పులు చేయకూడదు, ఎక్కువ వస్తువుల్ని కొనుక్కుని మన టైం అంతా వాటికే పెట్టేయకూడదు. అంతేకాదు ఆస్తిపాస్తుల మీద, వస్తువుల మీద ఇష్టం పెంచుకోకూడదు. (మత్త. 6:19, 24) ఎందుకంటే, అంతం దగ్గరపడేకొద్దీ యెహోవా మీద నమ్మకం ఉంచుతామా? లేక డబ్బులు-వస్తువులు మీద నమ్మకం ఉంచుతామా? అనే విషయంలో మన విశ్వాసానికి పరీక్షలు ఎదురవ్వవచ్చు.

“మీకు సహనం అవసరం”

15. హెబ్రీ క్రైస్తవులకు సహనం ఎందుకు అవసరమైంది?

15 యూదయలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారౌతుండగా హెబ్రీ క్రైస్తవులు తమ విశ్వాసానికి సంబంధించి పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. (హెబ్రీ. 10:36) నిజమే, కొంతమంది అప్పటికే పెద్దపెద్ద కెరటాల్లాంటి హింసల్ని ఎదుర్కొన్నారు. కానీ వాళ్లలో చాలామంది, కాస్త ప్రశాంతంగా ఉన్న సమయంలోనే క్రైస్తవులుగా మారారు. వాళ్లు విశ్వాసానికి సంబంధించి కొన్ని కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పటికీ, యేసులా బాధలుపడుతూ చనిపోయేంత పరిస్థితినైతే ఎదుర్కోలేదు అని పౌలు చెప్పాడు. (హెబ్రీ. 12:4) ఎక్కువమంది యూదులు క్రైస్తవులుగా మారడంతో, వాళ్లను వ్యతిరేకిస్తున్న యూదులకు పీకలదాకా కోపం వచ్చింది. కొన్నేళ్ల ముందు, పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు యూదులు ఒక గుంపుగా అతని మీద దాడి చేశారు. 40 కన్నా ఎక్కువమంది యూదులు “అతన్ని చంపేంతవరకు తాము ఏమైనా తిన్నా, తాగినా తమ మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నారు.” (అపొ. 22:22; 23:12-14) ఇలా మతపిచ్చి, ద్వేషంతో రగిలిపోతున్న యూదుల మధ్య క్రైస్తవులు ఆరాధన కోసం కలుసుకోవాలి, మంచివార్త ప్రకటించాలి, విశ్వాసంలో తమనుతాము బలంగా ఉంచుకోవాలి.

16. హింసల్ని సరైన దృష్టితో చూడడానికి హెబ్రీయులకు రాసిన ఉత్తరం మనకు ఎలా సహాయం చేస్తుంది? (హెబ్రీయులు 12:7)

16 వ్యతిరేకతను సహించడానికి ఆ హెబ్రీ క్రైస్తవులకు ఏది సహాయం చేస్తుంది? వాళ్లు శ్రమల్ని సరైన దృష్టితో చూడడం ప్రాముఖ్యమని పౌలుకు తెలుసు. అందుకే, దేవుడు విశ్వాస పరీక్షల్ని ఉపయోగించి వాళ్లకు అవసరమైన క్రమశిక్షణను (ట్రైనింగ్‌) ఇస్తున్నాడని వివరించాడు. (హెబ్రీయులు 12:7 చదవండి.) అలాంటి క్రమశిక్షణ వల్ల క్రైస్తవులు తమకు ఉండాల్సిన లక్షణాల్ని ఇంకా మెరుగుపర్చుకోవచ్చు. కాబట్టి శ్రమల వల్ల వచ్చే మంచి ఫలితాల మీద మనసుపెడితే, ఆ హెబ్రీ క్రైస్తవులు ఇంకా ఈజీగా సహించగలుగుతారు.—హెబ్రీ. 12:11.

17. హింసల్ని సహించడం గురించి పౌలుకు ఏం తెలుసు?

17 శ్రమలు వచ్చినప్పుడు చేతులు ఎత్తేయకుండా, ధైర్యంగా సహించమని పౌలు హెబ్రీ క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. ఈ విషయంలో సలహా ఇవ్వడానికి కావాల్సినంత అనుభవం ఆయన దగ్గర ఉంది. ఒకప్పుడు క్రైస్తవుల్ని వ్యతిరేకించాడు కాబట్టి, వాళ్లకు వచ్చే హింసలు ఆయనకు బాగా తెలుసు. హింసల్ని ఎలా సహించాలో కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే, ఆయన క్రైస్తవునిగా మారిన తర్వాత ఒకట్రెండు కాదు, ఎన్నో రకాల హింసల్ని ఎదుర్కొన్నాడు. (2 కొరిం. 11:23-25) కాబట్టి సహించడానికి ఏం అవసరమో పౌలు బాగా చెప్పగలిగాడు. శ్రమల్ని ఎదుర్కొనేటప్పుడు సొంత శక్తి మీద ఆధారపడకూడదు గానీ యెహోవా మీద ఆధారపడాలని గుర్తుచేశాడు. అందుకే పౌలు ధైర్యంగా ఇలా అన్నాడు: “నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను.”—హెబ్రీ. 13:6.

18. మనలో ప్రతీఒక్కరికి రాబోయే రోజుల్లో ఏం వస్తాయి? మనం ఏం చేయాలి?

18 మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ కొంతమంది ఇప్పుడు హింసల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్లకోసం ప్రార్థన చేయడం ద్వారా, వీలైతే అవసరమైన సహాయం చేయడం ద్వారా వాళ్లకు మనం మద్దతు ఇవ్వవచ్చు. (హెబ్రీ. 10:33) బైబిలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది: “క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.” (2 తిమో. 3:12) కాబట్టి మనలో ప్రతీఒక్కరం రాబోయే కష్టాల కోసం సిద్ధపడాలి. ఎలాంటి శ్రమ వచ్చినా యెహోవా మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని పూర్తి నమ్మకంతో ఉందాం. శ్రమల్లో తనను నమ్మకంగా సేవించే వాళ్లందర్నీ సరైన సమయంలో ఆయన విడుదల చేస్తాడు.—2 థెస్స. 1:7, 8.

19. మహాశ్రమ కోసం సిద్ధపడడానికి మనం ఏమేం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

19 పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరం, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని రాబోయే శ్రమలు ఎదుర్కోవడానికి సిద్ధం చేసింది అనడంలో సందేహమే లేదు. లేఖనాల్ని ఇంకా బాగా అధ్యయనం చేసి, వాటిని చక్కగా అర్థం చేసుకోమని పౌలు సహోదరుల్ని ప్రోత్సహించాడు. అలా చేస్తే తమ విశ్వాసాన్ని నీరుగార్చే బోధల్ని వాళ్లు గుర్తించగలుగుతారు, వాటికి దూరంగా ఉండగలుగుతారు. అంతేకాదు యేసు, సంఘపెద్దలు ఇచ్చే నిర్దేశాల్ని వెంటనే పాటించగలిగేలా వాళ్లకున్న విశ్వాసాన్ని బలపర్చుకోమని కూడా పౌలు ప్రోత్సహించాడు. శ్రమలు వచ్చినప్పుడు వాటిని సరైన దృష్టితో చూడమని అంటే వాటిని తమ ప్రేమగల తండ్రి ఇచ్చే క్రమశిక్షణలా చూడమని చెప్పాడు. ఆ విధంగా వాళ్లు తమ సహనాన్ని పెంచుకునేలా ఆయన సహాయం చేశాడు. బైబిల్లో ఉన్న ఈ మంచి సలహాల్ని మనం కూడా పాటిద్దాం. అప్పుడు మనం కూడా చివరిదాకా నమ్మకంగా సహిస్తాం.—హెబ్రీ. 3:14.

నమ్మకంగా సహించినందుకు క్రైస్తవులు దీవెనలు పొందారు. యూదయ నుండి పారిపోయిన తర్వాత కూడా వాళ్లు ఆరాధన కోసం కలుసుకున్నారు. దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? (19వ పేరా చూడండి)

పాట 126 మెలకువగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి

a యూదులు ఆరాధించే విధానం కన్నా, క్రైస్తవులు ఆరాధించే విధానమే మెరుగైందని నిరూపించడానికి పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరం మొదటి అధ్యాయంలోనే హీబ్రూ లేఖనాల్ని కనీసం ఏడుసార్లు ఎత్తి చూపించాడు.—హెబ్రీ. 1:5-13.