కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 36

పాట 89 వినండి, లోబడండి, దీవెనలు పొందండి

దేవుని వాక్యాన్ని “పాటించేవాళ్లుగా ఉండండి”

దేవుని వాక్యాన్ని “పాటించేవాళ్లుగా ఉండండి”

“వాక్యాన్ని వినేవాళ్లుగా మాత్రమే ఉండకండి, దాన్ని పాటించేవాళ్లుగా ఉండండి.”యాకో. 1:22.

ముఖ్యాంశం

దేవుని వాక్యాన్ని ప్రతీరోజు చదవడం మాత్రమే కాదు చదివినవాటి గురించి ఆలోచించి, మన జీవితంలో పాటించాలి అనే కోరికను పెంచుకోవడానికి కూడా ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

1-2. దేవుని సేవకులు ఎందుకు సంతోషంగా ఉంటారు? (యాకోబు 1:22-25)

 యెహోవా, ఆయన కుమారుడైన యేసు మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. కీర్తన 119:2 లో కీర్తనకర్త ఇలా రాశాడు: “ఆయన జ్ఞాపికల్ని పాటించేవాళ్లు, నిండు హృదయంతో ఆయన్ని వెతికేవాళ్లు ధన్యులు.” యేసు కూడా దీన్ని నొక్కిచెప్తూ ఇలా అన్నాడు: ‘దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు!’—లూకా 11:28.

2 దేవుని సేవకులుగా మనం సంతోషంగా ఉంటాం. ఎందుకు? దానికి చాలా కారణాలున్నాయి. కానీ ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే: మనం ప్రతీరోజు బైబిల్ని చదువుతాం, అలాగే నేర్చుకున్నవాటిని పాటించడానికి చేయగలిగినదంతా చేస్తాం.—యాకోబు 1:22-25 చదవండి.

3. దేవుని వాక్యంలో చదివినవాటిని పాటించినప్పుడు మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

3 ‘వాక్యాన్ని పాటించేవాళ్లుగా’ ఉంటే మనం ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. ఒకటి, నేర్చుకున్నవాటిని మనం పాటించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. అది మనకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. (ప్రసం. 12:13) దేవుని వాక్యంలో చదివినవాటిని పాటించినప్పుడు, మన ఇల్లు సంతోషానికి చిరునామాలా మారుతుంది. అంతేకాదు మన బ్రదర్స్‌-సిస్టర్స్‌తో మంచి స్నేహాల్ని పెంచుకోగలుగుతాం. మీరు కూడా ఈ విషయాన్ని మీ జీవితంలో రుచిచూసే ఉంటారు. యెహోవా ఆజ్ఞలకు లోబడనివాళ్లు కొనితెచ్చుకునే ఎన్నో సమస్యలకు మనం దూరంగా ఉంటాం. అవును, మనం రాజైన దావీదు అన్న మాటలతో ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఆయన ఒక కీర్తనలో యెహోవా ఇచ్చే ఆజ్ఞలు, ఆదేశాలు, తీర్పుల గురించి చెప్పాక చివర్లో ఈ మాట అన్నాడు: “వాటిని పాటించడం వల్ల గొప్ప ప్రతిఫలం కలుగుతుంది.”—కీర్త. 19:7-11.

4. వాక్యాన్ని పాటించేవాళ్లుగా ఉండడం కొన్నిసార్లు మనకు ఎందుకు అంత ఈజీ కాదు?

4 నిజం చెప్పాలంటే, వాక్యాన్ని పాటించేవాళ్లుగా ఉండడం కొన్నిసార్లు మనకు అంత ఈజీ కాదు. మనం చాలా బిజీగా ఉంటాం. అయినా, బైబిల్ని చదివి అధ్యయనం చేయడానికి సమయం తీసుకుంటేనే యెహోవా మన నుండి ఏం కోరుతున్నాడో అర్థమౌతుంది. కాబట్టి ప్రతీరోజు బైబిలు చదవడానికి ఉపయోగపడే కొన్ని సలహాల్ని ఇప్పుడు పరిశీలిస్తాం. అలాగే చదివినవాటి గురించి ఆలోచించడానికి, వాటిని మన జీవితంలో పాటించడానికి ఏం సహాయం చేస్తుందో కూడా చూస్తాం.

దేవుని వాక్యాన్ని చదవడానికి ఒక టైం పెట్టుకోండి

5. ఏ పనులు మనల్ని బాగా బిజీగా ఉంచుతాయి?

5 యెహోవా ప్రజలుగా మనం చాలా బిజీగా ఉంటాం. మనకు సంఘంలో, కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఉద్యోగం చేసి మనకోసం, మన కుటుంబం కోసం అవసరమైనవాటిని సమకూర్చుకుంటున్నాం. (1 తిమో. 5:8) మనలో చాలామంది, ఒంట్లో బాలేని లేదా వయసుపైబడిన కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసుకుంటున్నారు. అంతేకాదు మనలో ప్రతీఒక్కరం మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి, దానికి కూడా టైం అవసరం. ఇంకా మనకు సంఘంలో కూడా పనులు ఉంటాయి. మనం చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఉత్సాహంగా ప్రకటించడం. ‘ఇన్ని బాధ్యతల మధ్య బైబిల్ని క్రమంగా చదవడానికి, చదివినవాటి గురించి ధ్యానించడానికి, వాటిని పాటించడానికి టైం ఎక్కడ దొరుకుతుంది?’ అని మీకు అనిపించవచ్చు.

6. బైబిలు చదవడానికి మొదటిస్థానం ఇవ్వాలంటే ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

6 బైబిలు చదవడం అనేది “ఎక్కువ ప్రాముఖ్యమైన” పనుల్లో ఒకటి, క్రైస్తవులుగా మనం దానికి ఖచ్చితంగా మొదటిస్థానం ఇవ్వాలి. (ఫిలి. 1:10) సంతోషంగా ఉండే వ్యక్తి గురించి మొట్టమొదటి కీర్తనలో ఇలా ఉంది: “అతను యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, పగలూ రాత్రీ దాన్ని ధ్యానిస్తాడు.” (కీర్త. 1:1, 2) కాబట్టి బైబిలు చదవడానికి ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి. అయితే దాన్ని చదవడానికి అన్నిటికన్నా బెస్ట్‌ టైం ఏంటి? ఆ ప్రశ్నకు ఒక్కొక్కరికి ఒక్కో జవాబు ఉంటుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎంచుకునే టైం క్రమంగా బైబిలు చదవడానికి అనుకూలంగా ఉండాలి. విక్టర్‌ అనే బ్రదర్‌ ఇలా చెప్తున్నాడు: “నేను పొద్దున్నే బైబిలు చదువుతాను. నిజం చెప్పాలంటే, నాకు పొద్దున లేవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఆ సమయంలో, మన ధ్యాసను పక్కకు మళ్లించే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. నేను అలర్ట్‌గా ఉంటాను, అలాగే మనసుపెట్టి చదవగలుగుతాను.” మీ పరిస్థితి కూడా బ్రదర్‌ విక్టర్‌ లాంటిదే అయ్యుండవచ్చు. ఇలా ప్రశ్నించుకోండి: ‘బైబిలు చదవడానికి ఏది నాకు అన్నిటికన్నా బెస్ట్‌ టైం?’

ప్రతీరోజు బైబిలు చదవగలిగేలా రోజంతట్లో మీకు ఏ సమయమైతే బాగుంటుంది? (6వ పేరా చూడండి)


చదువుతున్న వాటి గురించి ఆలోచించండి

7-8. చదివిన దాన్నుండి పూర్తిగా ప్రయోజనం పొందాలంటే మనం ఏం చేయకూడదు? ఉదాహరణతో చెప్పండి.

7 బైబిలు చదవడానికి ఒక టైం పెట్టుకున్నా, మనం జాగ్రత్తగా ఉండాల్సిన మరో విషయం ఉంది. మీరు ఏదైనా చదివిన కాసేపటికే, ‘అసలు ఇప్పటివరకు నేను ఏం చదివాను?’ అని ఎప్పుడైనా అనుకున్నారా? మనందరికీ అలా జరుగుతూ ఉంటుంది. బహుశా మనం ప్రతీరోజు బైబిల్లో ఇన్ని అధ్యాయాలు చదవాలని లక్ష్యం పెట్టుకుని ఉంటాం. అది మంచి విషయమే. మనం లక్ష్యాల్ని పెట్టుకోవాలి, వాటిని చేరుకోవడానికి కష్టపడాలి. (1 కొరిం. 9:26) అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే: బైబిలు చదవడం అనేది మనం వేసే తొలి అడుగు మాత్రమే. అది ముఖ్యమే, కానీ గమ్యం చేరుకోవడానికి అదొక్కటే సరిపోదు. బైబిలు చదవడం నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, మనం ఇంకా ఎక్కువే చేయాలి.

8 ఈ పోలిక గురించి ఆలోచించండి: నీళ్లు, ముఖ్యంగా వర్షం నీళ్లు చెట్లకు, పంటలకు చాలా అవసరం. కానీ తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు, నేలంతా బురదబురదౌతుంది. అదే ఒకవేళ వర్షం మెల్లగా పడితే, నీళ్లు నేలలోకి ఇంకిపోవడానికి సమయం ఉంటుంది. దానివల్ల పంటలు చక్కగా పండుతాయి. అదేవిధంగా బైబిలు చదివేటప్పుడు, చదివిన దానిగురించి ఆలోచించేంత టైం కూడా లేకుండా గబగబా చదివేయకూడదు.—యాకో. 1:24.

వర్షం నీళ్లు నేలలోకి ఇంకడానికి సమయం పట్టినట్టే, బైబిల్ని చదివి అందులో ఉన్న విషయాల్ని ఆలోచించడానికి, వాటిని పాటించడానికి మనకు సమయం పడుతుంది. (8వ పేరా చూడండి)


9. బైబిల్ని గబగబా చదివే అలవాటు మనకుంటే ఏం చేయాలి?

9 మీరు ఎప్పుడైనా బైబిల్ని చదివేటప్పుడు, గబగబా చదివేస్తున్నట్లు అనిపించిందా? అయితే మీరేం చేయాలి? నిదానంగా చదవండి. చదువుతున్న దానిగురించి ఆలోచించగలిగేలా, మెల్లగా చదవండి. లేదా చదవడం అయిపోయిన తర్వాత దానిగురించి ఆలోచించడానికి సమయం తీసుకోండి. ఇదంత కష్టమైన విషయమేం కాదు. ఆలోచించడానికి సమయం పెట్టుకోవాలంటే, అధ్యయనం చేసే సమయాన్ని పెంచుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే: కొన్ని వచనాలే చదివి, మిగిలిన సమయంలో చదివిన దానిగురించి ఆలోచించవచ్చు. ముందు చెప్పిన విక్టర్‌ ఇలా అంటున్నాడు: “నేను ఒకేసారి ఎక్కువ చదవను. కొన్నిసార్లు ఒక అధ్యాయం మాత్రమే చదువుతాను. అయితే పొద్దున్నే లేచి బైబిలు చదువుతాను కాబట్టి చదివిన వాటిగురించి రోజంతా ఆలోచించగలుగుతాను.” మీరు ఏ పద్ధతిలో చదివినా, చదివిన దానిగురించి ఆలోచించడానికి సమయం ఉండేలా, మెల్లగా చదవడం ప్రాముఖ్యం.—కీర్త. 119:97; “ మనం ఆలోచించాల్సిన కొన్ని ప్రశ్నలు” అనే బాక్సు చూడండి.

10. నేర్చుకున్నవాటిని ఎలా పాటించవచ్చో, ఒక ఉదాహరణతో చెప్పండి. (1 థెస్సలొనీకయులు 5:17, 18)

10 బైబిల్ని ఎప్పుడు, ఎంతసేపు చదువుతున్నాం అనేది ప్రాముఖ్యమే అయినా, చదువుతున్న దాన్ని పాటిస్తున్నామా లేదా అని చూసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. బైబిల్లో కొన్ని వచనాలు చదివిన తర్వాత ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను చదివిన దాన్ని ఇప్పుడు లేదా రాబోయే రోజుల్లో ఎలా పాటించాలి?’ ఉదాహరణకు మీరు 1 థెస్సలొనీకయులు 5:17, 18 చదివారు అనుకుందాం. (చదవండి.) ఆ రెండు వచనాలు చదివాక కాస్త ఆగి మీరు ఎంత తరచుగా, ఎంత బాగా ప్రార్థిస్తున్నారో ఆలోచించుకోవచ్చు. తర్వాత మీరు వేటి గురించి యెహోవాకు థాంక్స్‌ (కృతజ్ఞతలు) చెప్పవచ్చో ఆలోచించండి. కనీసం ఓ మూడు విషయాల గురించి యెహోవాకు థాంక్స్‌ చెప్పాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఇలా కొన్ని నిమిషాలైనా, మనసుపెట్టి ఆలోచించినప్పుడు మీరు దేవుని వాక్యాన్ని వినేవాళ్లుగానే కాదు, దాన్ని పాటించేవాళ్లుగా కూడా అవుతారు. ఇలా ప్రతీరోజు చదివిన దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తే, మీరు ఎంత ప్రయోజనం పొందుతారో ఆలోచించండి. అవును, దేవుని వాక్యాన్ని పాటించేవాళ్లుగా మీరు ఎదుగుతారు. కానీ ఒకవేళ మీరు మార్చుకోవాల్సింది ఒకట్రెండు కాదు, చాలా విషయాలు ఉన్నాయని మీకు అనిపిస్తే?

చేరుకోగల లక్ష్యాలు పెట్టుకోండి

11. మీకు అప్పుడప్పుడు నిరుత్సాహంగా ఎందుకు అనిపించవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

11 బైబిల్లో చదివినవాటిని పాటించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు నిరుత్సాహంగా అనిపిస్తుంది. ఎందుకో ఈ ఉదాహరణను పరిశీలించి తెలుసుకుందాం. ఈరోజు మీరు బైబిలు చదువుతున్నప్పుడు పక్షపాతం చూపించకూడదు అనే సలహా చదివారనుకోండి. (యాకో. 2:1-8) ఈ విషయంలో మీరు మార్పులు చేసుకోవాలని అనుకుని, అందరితో ఒకేలా ఉండాలి అనే లక్ష్యం పెట్టుకున్నారు. అది చాలా మంచి విషయం. తర్వాతి రోజు మీరు బైబిల్లో, నాలుకను అదుపులో ఉంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో చదివారు. (యాకో. 3:1-12) కొన్నిసార్లు మీరు ఇతరుల్ని నొప్పించేలా మాట్లాడుతున్నారని మీకు అనిపించి, ఇంకా ప్రోత్సాహకరంగా మాట్లాడాలనే మరో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆ తర్వాతి రోజేమో, లోకానికి స్నేహితులుగా ఉండకూడదు అనే హెచ్చరిక గురించి బైబిల్లో చదివారు. (యాకో. 4:4-12) వినోదాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి అనుకుని అప్పుడు మీరు ఇంకో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. నాలుగో రోజు వచ్చేసరికి, ‘నేను మార్చుకోవాల్సినవి ఇన్ని ఉన్నాయా?’ అని మీకు నిరుత్సాహంగా అనిపించవచ్చు.

12. బైబిలు చదువుతున్నప్పుడు మార్పులు చేసుకోవాలని మీకు అనిపిస్తే, ఎందుకు డీలాపడిపోకూడదు? (అధస్సూచి కూడా చూడండి.)

12 మీరు మార్పులు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయని మీకు అనిపిస్తే, డీలాపడిపోకండి. మీరు అలా ఆలోచిస్తున్నారు అంటేనే మీకు మంచి మనసు, వినయం ఉన్నాయని అర్థం. వినయంగా, నిజాయితీగా ఉన్నవాళ్లు మార్పులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే బైబిల్ని చదువుతారు. a ఇంకో విషయం గుర్తుంచుకోండి: “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకోవడం అనేది ఒక్కరోజులో అయ్యే పనికాదు, దాన్ని మనం చేస్తూనే ఉండాలి. (కొలొ. 3:10) మరైతే దేవుని వాక్యాన్ని పాటించేవాళ్లుగా ఉండడానికి మీకేది సహాయం చేస్తుంది?

13. మీరు నేర్చుకున్నవాటిని పాటించడానికి సహాయం చేసే ఒక మంచి పద్ధతి ఏంటి? (చిత్రం కూడా చూడండి.)

13 చదివిన ప్రతీది ఒకేసారి పాటించే బదులు, ముందు ఒకట్రెండు లక్ష్యాలు మాత్రమే పెట్టుకోండి. (సామె. 11:2) ఇలా చేసి చూడండి: మీరు ఏమేం మార్పులు చేసుకోవాలి అనుకుంటున్నారో ఒక లిస్టు రాసుకోండి. తర్వాత అందులో ఒకటి లేదా రెండు విషయాల్ని ఎంచుకుని, వాటిపై పనిచేయండి. మిగతావాటిని తర్వాత పాటించడానికి ప్లాన్‌ చేసుకోండి. అయితే, ముందు మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు.

బైబిల్లో చదివిన ప్రతీదాని మీద ఒకేసారి పనిచేసే బదులు, చేరుకోగల లక్ష్యాలు పెట్టుకోవడానికి చూడండి. బహుశా మీరు ముందు ఒకటి లేదా రెండు విషయాల మీద పనిచేయవచ్చు (13-14 పేరాలు చూడండి)


14. మీరు ఎలాంటి లక్ష్యాలతో మొదలుపెట్టవచ్చు?

14 చేరుకోవడానికి కాస్త తేలిగ్గా ఉన్న ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకుని, దాంతో మొదలుపెట్టండి. లేదా ఫలానా విషయంలో ఎక్కువ మార్పులు చేసుకోవాలని మీకు అనిపిస్తే, దాంతో మొదలుపెట్టండి. ఏ లక్ష్యంపై పనిచేయాలో నిర్ణయించుకున్నాక మన ప్రచురణల్లో పరిశోధన చేయండి. దానికోసం మీరు కావాలనుకుంటే వాచ్‌ టవర్‌ పబ్లికేషన్‌ ఇండెక్స్‌ (ఇంగ్లీష్‌) గానీ, యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం గానీ ఉపయోగించవచ్చు. మీ లక్ష్యం గురించి ప్రార్థించండి. దాన్ని చేరుకోవాలనే “కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని” ఇవ్వమని యెహోవాను అడగండి. (ఫిలి. 2:13) తర్వాత, నేర్చుకున్నవాటిని పాటించడానికి ప్రయత్నించండి. మీరిలా ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, ఇంకో లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రోత్సాహాన్ని పొందుతారు. నిజానికి ఒక క్రైస్తవ లక్షణాన్ని పెంచుకుంటే, వేరే లక్షణాల్ని పెంచుకోవడం ఇంకా తేలికౌతుంది.

దేవుని వాక్యం మీపై “గొప్ప ప్రభావం” చూపించనివ్వండి

15. యెహోవా ప్రజలకు, బైబిలు చదివే చాలామందికి తేడా ఏంటి? (1 థెస్సలొనీకయులు 2:13)

15 లోకంలో కొంతమంది బైబిల్ని చాలాసార్లు చదివామని చెప్తుంటారు. కానీ నిజంగా వాళ్లకు బైబిలు మీద నమ్మకం ఉందా? చదివినవాటిని పాటించి, అవసరమైన మార్పులు చేసుకుంటున్నారా? లేదు. కానీ యెహోవా ప్రజలు అలా కాదు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే మనం కూడా బైబిల్ని ‘నిజంగా దేవుని వాక్యంలా’ స్వీకరిస్తాం, దాన్ని పాటించడానికి శాయశక్తులా కృషిచేస్తాం.—1 థెస్సలొనీకయులు 2:13 చదవండి.

16. దేవుని వాక్యాన్ని పాటించేవాళ్లుగా ఉండడానికి మనకు ఏం సహాయం చేస్తుంది?

16 దేవుని వాక్యాన్ని చదివి పాటించడం ప్రతీసారి అంత ఈజీ కాదు. దాన్ని చదవడానికి టైం పెట్టడం కోసం మనం నానాతంటాలు పడుతుంటాం. లేదా గబగబా చదివేసి, చదివిన వాటిగురించి ఆలోచించకుండా ఉంటాం. లేదా మనం చేసుకోవాల్సిన మార్పులు, పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని నిరుత్సాహపడుతుంటాం. మీకు వచ్చే సవాళ్లు ఏవైనా అవి దాటలేనంత పెద్దవేమీ కాదు. యెహోవా సహాయంతో మీరు వాటిని దాటగలరు. కాబట్టి ఆయన సహాయం తీసుకుని దేవుని వాక్యాన్ని విని మర్చిపోయేవాళ్లుగా కాకుండా, దాన్ని పాటించేవాళ్లుగా ఉండాలని నిశ్చయించుకుందాం. అవును, మనం దేవుని వాక్యాన్ని ఎంతెక్కువ చదివి పాటిస్తే, అంతెక్కువ సంతోషంగా ఉంటాం.—యాకో. 1:25.

పాట 94 దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత

a jw.org వెబ్‌సైట్‌లో మీ వయసువాళ్లు ఏమంటున్నారు?—బైబిలు చదవడం వీడియో చూడండి.