అధ్యయన ఆర్టికల్ 38
పాట 25 దేవుని ప్రత్యేక సొత్తు
మీరు హెచ్చరికల్ని పట్టించుకుంటున్నారా?
“ఒకరు తీసుకెళ్లబడతారు, ఇంకొకరు వదిలేయబడతారు.”—మత్త. 24:40.
ముఖ్యాంశం
యేసు చెప్పిన మూడు ఉదాహరణల్ని పరిశీలిస్తాం. అలాగే వాటికి, అంతం వచ్చినప్పుడు జరిగే తీర్పుకు ఉన్న సంబంధాన్ని చర్చిస్తాం.
1. త్వరలో యేసు ఏం చేస్తాడు?
పెను మార్పులు చోటు చేసుకోబోయే సమయంలో మనం జీవిస్తున్నాం. త్వరలో భూమ్మీదున్న ప్రతీఒక్కరికి యేసు తీర్పు తీరుస్తాడు. అయితే తీర్పు తీర్చేముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తన శిష్యులకు వివరిస్తూ తన “ప్రత్యక్షతకు, ఈ వ్యవస్థ ముగింపుకు సూచన” ఆయన ఇచ్చాడు. (మత్త. 24:3) దానిగురించి మత్తయి 24-25 అధ్యాయాల్లో, మార్కు 13వ అధ్యాయంలో అలాగే లూకా 21వ అధ్యాయంలో చదవచ్చు.
2. ఈ ఆర్టికల్‌లో మనం ఏం తెలుసుకుంటాం? అవి మనకు ఎలా సహాయం చేస్తాయి?
2 మనం సిద్ధంగా ఉండడానికి సహాయం చేసే మూడు ఉదాహరణల్ని యేసు చెప్పాడు. అవి మనకు హెచ్చరికల్లాంటివి. ఆ ఉదాహరణల్లో మొదటిది గొర్రెలకు, మేకలకు సంబంధించినది; రెండవది బుద్ధిగల కన్యలకు, బుద్ధిలేని కన్యలకు సంబంధించినది; మూడవది తలాంతులకు సంబంధించినది. మన పనుల్ని బట్టి యేసు మనకు తీర్పు తీరుస్తాడని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు సహాయం చేస్తాయి. వీటిని పరిశీలిస్తుండగా మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో, వాటిని ఎలా పాటించవచ్చో తెలుసుకుందాం. ముందుగా గొర్రెలకు, మేకలకు సంబంధించిన ఉదాహరణ చూద్దాం.
గొర్రెలు, మేకలు
3. యేసు ప్రజలకు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు?
3 ప్రజలు మంచివార్తకు ఎలా స్పందిస్తారు, తన అభిషిక్త సహోదరులకు ఎలా మద్దతిస్తారు అనే విషయాల్ని బట్టి యేసు తీర్పు తీరుస్తాడని గొర్రెలకు, మేకలకు సంబంధించిన ఉదాహరణ వివరిస్తుంది. (మత్త. 25:31-46) “మహాశ్రమ” సమయంలో, హార్‌మెగిద్దోన్‌కు కాస్త ముందు ఈ తీర్పు జరుగుతుంది. (మత్త. 24:21) ఒక కాపరి గొర్రెల్ని, మేకల్ని వేరు చేసినట్టే యేసు కూడా తన అభిషిక్త సహోదరులకు నమ్మకంగా మద్దతు ఇచ్చేవాళ్లను, మద్దతు ఇవ్వనివాళ్లను వేరుచేస్తాడు.
4. యెషయా 11:3, 4 ప్రకారం, యేసు ప్రజల్ని న్యాయంగా తీర్పు తీరుస్తాడని ఎందుకు నమ్మవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
4 యెహోవా నియమించిన న్యాయాధిపతిగా యేసు తీర్పు తీర్చేటప్పుడు నీతిగా, న్యాయంగా ఉంటాడని బైబిలు ముందే చెప్పింది. (యెషయా 11:3, 4 చదవండి.) ప్రజల పనుల్ని, ఆలోచనల్ని, మాటల్ని ఆయన గమనిస్తాడు. దాంతోపాటు వాళ్లు తన అభిషిక్త సహోదరులతో ఎలా ఉన్నారో కూడా చూస్తాడు. (మత్త. 12:36, 37; 25:40) తన అభిషిక్త సహోదరులకు, వాళ్లు చేసే పనికి ఎవరెవరు మద్దతిచ్చారో యేసుకు తెలుసు. a గొర్రెల్లాంటివాళ్లు క్రీస్తు సహోదరులకు మద్దతిచ్చే ఒక ప్రాముఖ్యమైన విధానం, ప్రకటనా పనిలో చేయి అందించడమే. అలా సహాయం చేసేవాళ్లు “నీతిమంతులు” అని తీర్పు తీర్చబడతారు. ఈ భూమ్మీద “శాశ్వత జీవితాన్ని” సొంతం చేసుకునే అవకాశం పొందుతారు. (మత్త. 25:46; ప్రక. 7:16, 17) తమ యథార్థతను కాపాడుకునేవాళ్లకు ఇది ఎంతటి బంగారు కానుకో కదా! మహాశ్రమ సమయంలో, అలాగే ఆ తర్వాత కూడా నమ్మకంగా ఉండేవాళ్ల పేర్లు “జీవగ్రంథంలో” ఉంటాయి.—ప్రక. 20:15.
5. గొర్రెలకు, మేకలకు సంబంధించిన ఉదాహరణలో మనకు ఏ పాఠం ఉంది? దాన్ని ఎవరెవరు పట్టించుకోవాలి?
5 మీరు నమ్మకంగా, విశ్వసనీయంగా ఉన్నారని నిరూపించుకోండి. యేసు చెప్పిన గొర్రెల, మేకల ఉదాహరణ ముఖ్యంగా భూనిరీక్షణ ఉన్నవాళ్లకు సంబంధించింది. వాళ్లు క్రీస్తు సహోదరులకు ప్రకటనా పనిలో మద్దతివ్వడం ద్వారా మాత్రమే కాదు, యేసు ఎంచుకున్న నమ్మకమైన బుద్ధిగల దాసుడు ఇచ్చే నిర్దేశాలకు అంటిపెట్టుకుని ఉండడం ద్వారా కూడా తమ విశ్వాసాన్ని చూపిస్తారు. (మత్త. 24:45) అయితే ఈ ఉదాహరణలో ఉన్న హెచ్చరిక పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లు కూడా పట్టించుకోవాలి. ఎందుకు? ఎందుకంటే యేసు వాళ్ల పనుల్ని, ఆలోచనల్ని, మాటల్ని గమనిస్తాడు. కాబట్టి వాళ్లు కూడా నమ్మకంగా ఉన్నారని నిరూపించుకోవాలి. నిజానికి యేసు చెప్పిన మరో రెండు ఉదాహరణల్లో, ప్రత్యేకించి అభిషిక్తులకు కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఆ ఉదాహరణల్ని మత్తయి 25వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఇప్పుడు బుద్ధిగల కన్యలు, బుద్ధిలేని కన్యలు గురించిన ఉదాహరణ చర్చిద్దాం.
బుద్ధిగల కన్యలు, బుద్ధిలేని కన్యలు
6. ఐదుగురు కన్యలు బుద్ధిగలవాళ్లమని ఎలా నిరూపించుకున్నారు? (మత్తయి 25:6-10)
6 కన్యల ఉదాహరణలో, పెళ్లి కుమారున్ని కలుసుకోవడానికి వెళ్లిన పదిమంది కన్యల గురించి యేసు మాట్లాడాడు. (మత్త. 25:1-4) వాళ్లు పెళ్లి కుమారునితో కలిసి పెళ్లి విందుకు వెళ్లాలని అనుకున్నారు. వాళ్లలో ఐదుగురిని “బుద్ధిగల” కన్యలని, మరో ఐదుగురిని “బుద్ధిలేని” కన్యలని యేసు పిలిచాడు. అయితే బుద్ధిగల కన్యలు సిద్ధంగా, అలాగే అలర్ట్‌గా (అప్రమత్తంగా) ఉన్నారు. వాళ్లు పెళ్లి కుమారుడు కోసం ఎంతసేపైనా వేచివుండడానికి, చివరికి ఆయన ఏ అర్ధరాత్రి వచ్చినా సిద్ధంగా ఉండాలనుకున్నారు. అందుకే వాళ్లు దీపాల్నే కాదు, అదనంగా బుడ్డిలో నూనె కూడా తెచ్చుకున్నారు. అలా వాళ్లు తమ దీపాలు ఆరిపోకుండా ప్లాన్ చేసుకున్నారు. (మత్తయి 25:6-10 చదవండి.) పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధిగల కన్యలు ఆయనతోపాటు పెళ్లి విందు జరుపుకోవడానికి లోపలికి వెళ్లారు. అదేవిధంగా అభిషిక్త క్రైస్తవులు, క్రీస్తు వచ్చేంతవరకు నమ్మకంగా, అలర్ట్‌గా ఉండడం ద్వారా పెళ్లి కుమారుడైన యేసుతోపాటు పరలోక రాజ్యంలో ఉండే బహుమానం పొందుతారు. b (ప్రక. 7:1-3) మరి బుద్ధిలేని ఐదుగురు కన్యల సంగతేంటి?
7. ఐదుగురు బుద్ధిలేని కన్యలకు ఏం జరిగింది? ఎందుకు?
7 ఐదుగురు బుద్ధిలేని కన్యలు మాత్రం పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి సిద్ధంగా లేరు. ఒకపక్క వాళ్ల చేతిలో ఉన్న దీపాలు ఆరిపోతున్నాయి, ఇంకోపక్క వాళ్ల దగ్గర అదనపు నూనె కూడా లేదు. పెళ్లి కుమారుడు ఇంకాసేపట్లో వస్తాడని వాళ్లు తెలుసుకున్నప్పుడు, నూనె కొనుక్కోవడానికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్లు అక్కడ లేరు. కానీ “సిద్ధంగా ఉన్న కన్యలు అతనితో కలిసి పెళ్లి విందు కోసం లోపలికి వెళ్లారు, తర్వాత తలుపులు మూయబడ్డాయి.” (మత్త. 25:10) బుద్ధిలేని కన్యలు తిరిగొచ్చి లోపలికి వెళ్లాలి అనుకున్నప్పుడు పెళ్లి కుమారుడు వాళ్లతో “మీరెవరో నాకు తెలీదు” అన్నాడు. (మత్త. 25:11, 12) ఆ కన్యలు పెళ్లి కుమారుడు వచ్చేంతవరకు, ఎంతసేపైనా సరే వేచివుండడానికి సిద్ధంగా లేరు. దీన్నుండి అభిషిక్త క్రైస్తవులు ఏం నేర్చుకోవచ్చు?
8-9. కన్యల ఉదాహరణ నుండి అభిషిక్తులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
8 మీరు సిద్ధంగా, అలర్ట్‌గా ఉన్నారని నిరూపించుకోండి. అభిషిక్త క్రైస్తవుల్లో రెండు గుంపులు ఉంటాయని, ఒక గుంపు అంతం వరకు వేచివుండడానికి సిద్ధంగా ఉంటుందని, ఇంకొక గుంపు సిద్ధంగా ఉండదని యేసు చెప్పట్లేదు. కానీ ఒకవేళ వాళ్లు అంతం వరకు నమ్మకంగా సహించడానికి సిద్ధంగా లేకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అలా సిద్ధపడకపోతే వాళ్లు తమ బహుమానాన్ని ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. (యోహా. 14:3, 4) అది ఎంత పెద్ద నష్టమో కదా! మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా ఈ ఉదాహరణల్లోని హెచ్చరికల్ని మన కళ్లముందు ఎప్పుడూ ఉంచుకోవాలి. మనలో ప్రతీఒక్కరం సిద్ధంగా, అలర్ట్‌గా ఉండాలి; అలాగే అంతం వరకు సహించడానికి రెడీగా ఉండాలి.—మత్త. 24:13.
9 సిద్ధంగా, అలర్ట్‌గా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కన్యల ఉదాహరణలో చెప్పిన తర్వాత, యేసు తలాంతుల ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ కష్టపడి పని చేయడం ఎందుకు అవసరమో గుర్తుచేస్తుంది.
తలాంతులు
10. ఇద్దరు దాసులు నమ్మకమైనవాళ్లని ఎలా చూపించుకున్నారు? (మత్తయి 25:19-23)
10 తలాంతుల ఉదాహరణలో నమ్మకంగా ఉన్న ఇద్దరు దాసుల గురించి, అలాగే నమ్మకంగాలేని ఒక దాసుని గురించి యేసు మాట్లాడాడు. (మత్త. 25:14-18) ఇద్దరు దాసులు తమ యజమాని కోసం కష్టపడి పనిచేసి, ఎక్కువ డబ్బు సంపాదించి నమ్మకమైనవాళ్లని చూపించుకున్నారు. యజమాని దూర దేశానికి ప్రయాణించే ముందు, వాళ్లకు తలాంతులు ఇచ్చి వెళ్లాడు. అది చాలా ఎక్కువ డబ్బు. ఇద్దరు దాసులేమో కష్టపడి పనిచేసి ఆ డబ్బును తెలివిగా ఉపయోగించారు. ఫలితంగా, యజమాని తిరిగొచ్చేసరికి ఇచ్చిన డబ్బును రెండింతలు చేసి చూపించారు. ఆయన వాళ్లను చాలా మెచ్చుకున్నాడు, వాళ్లు ‘[తమ] యజమానితో కలిసి సంతోషించారు.’ (మత్తయి 25:19-23 చదవండి.) మరి మూడో దాసుని సంగతేంటి? యజమాని తనకిచ్చిన డబ్బుతో అతను ఏం చేశాడు?
11. సోమరిగా ఉన్న దాసునికి ఏం జరిగింది? ఎందుకు?
11 ఒక్క తలాంతు పొందిన మూడో దాసుడు ‘సోమరివాడు.’ అతను ఆ తలాంతును తెలివిగా ఉపయోగిస్తాడని యజమాని అనుకున్నాడు. కానీ అతనేమో దాన్ని నేలలో పాతిపెట్టేశాడు. యజమాని వచ్చేసరికి అతని దగ్గర, ఆ ఒక్క తలాంతు తప్ప తిరిగి ఇవ్వడానికి ఏమీ లేదు. నిజంగా ఆ దాసుడు చెడ్డవాడు. కష్టపడనందుకు క్షమాపణ అడగాల్సిందిపోయి, కొంచెం కూడా భయం లేకుండా తన యజమానిని “నువ్వు చాలా కఠినుడివి” అన్నాడు. అతను చేసిన పనికి యజమాని ఆ దాసున్ని మెచ్చుకోలేదు. ఆ తలాంతును కూడా తీసేసుకుని తన ఇంటి నుండి దాసున్ని గెంటేశాడు.—మత్త. 25:24, 26-30.
12. నేడు ఆ ఇద్దరు నమ్మకమైన దాసులు ఎవర్ని సూచిస్తున్నారు?
12 ఈ ఇద్దరు నమ్మకమైన దాసులు, నమ్మకమైన అభిషిక్త క్రైస్తవుల్ని సూచిస్తున్నారు. యజమానియైన యేసు ‘[తనతో] కలిసి సంతోషించమని’ వాళ్లను ఆహ్వానిస్తాడు. వాళ్లు పరలోక బహుమానాన్ని అంటే మొదటి పునరుత్థానాన్ని పొందుతారు. (మత్త. 25:21, 23; ప్రక. 20:5బి) అయితే సోమరిగా ఉన్న చెడ్డ దాసుని నుండి అభిషిక్త క్రైస్తవులకు ఒక హెచ్చరిక ఉంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు?
13-14. తలాంతుల ఉదాహరణలో అభిషిక్తుల కోసం ఏ పాఠం ఉంది? (చిత్రం కూడా చూడండి.)
13 మీరు కష్టపడి పని చేసేవాళ్లని నిరూపించుకోండి. కన్యల ఉదాహరణలాగే, తలాంతుల ఉదాహరణలో కూడా అభిషిక్తుల్లో కొంతమంది సోమరివాళ్లు అవుతారని యేసు చెప్పట్లేదు. కానీ వాళ్లు తమ ఉత్సాహాన్ని కోల్పోతే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. నిజానికి పరలోక రాజ్యంలో ఉండడానికి “దేవుడు [వాళ్లను] పిలిచాడు, ఎంచుకున్నాడు.” ఒకవేళ వాళ్లు సోమరులుగా ఉంటే ఆ అర్హతను కోల్పోతారు.—2 పేతు. 1:10.
14 కన్యల ఉదాహరణ, తలాంతుల ఉదాహరణ ద్వారా అభిషిక్త క్రైస్తవులందరూ సిద్ధంగా, అలర్ట్‌గా ఉండాలి, కష్టపడి పని చేయాలి అని యేసు స్పష్టం చేశాడు. కానీ ఆయన మాటల్లో అభిషిక్తుల కోసం ఇంకా ఏదైనా హెచ్చరిక ఉందా? ఉందనే చెప్పాలి. మత్తయి 24:40, 41 లో ఆ హెచ్చరిక కనిపిస్తుంది.
ఎవరు “తీసుకెళ్లబడతారు”?
15-16. అభిషిక్తులు మెలకువగా ఉండాల్సిన అవసరత గురించి మత్తయి 24:40, 41 వచనాలు ఎలా చూపిస్తున్నాయి?
15 ఈ మూడు ఉదాహరణల్ని చెప్పేముందు, యేసు అభిషిక్తులకు జరిగే చివరి తీర్పు గురించి చెప్పాడు. దేవుని ఆమోదం ఎవరికి ఉందో ఆ తీర్పులో తేలిపోతుంది. యేసు, పొలంలో పని చేస్తున్న ఇద్దరు మనుషుల గురించి, అలాగే తిరగలి విసురుతూ ఉన్న ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడాడు. ఆ ఇద్దరు మనుషులు, అలాగే ఇద్దరు స్త్రీలు ఒకేలాంటి పని చేస్తున్నట్లు అనిపించింది. కానీ వాళ్లలో “ఒకరు తీసుకెళ్లబడతారు, ఇంకొకరు వదిలేయబడతారు” అని యేసు చెప్పాడు. (మత్తయి 24:40, 41 చదవండి.) తర్వాత తన అనుచరుల్ని ఆయన ఇలా ప్రోత్సహించాడు: “కాబట్టి అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే మీ ప్రభువు ఏ రోజు వస్తున్నాడో మీకు తెలీదు.” (మత్త. 24:42) కన్యల ఉదాహరణ గురించి చెప్పిన తర్వాత కూడా యేసు దాదాపు ఇలాంటి మాటలే అన్నాడు. (మత్త. 25:13) ఈ రెండిటికి ఏదైనా సంబంధం ఉందా? ఉందనే అనిపిస్తుంది. కేవలం నిజమైన, నమ్మకమైన అభిషిక్తుల్ని మాత్రమే యేసు తన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు.—యోహా. 14:3.
16 మీరు మెలకువగా ఉన్నారని నిరూపించుకోండి. అభిషిక్తుల్లో ఎవరైనా ఆధ్యాత్మికంగా అలర్ట్‌గా లేకపోతే వాళ్లు ‘ఎంచుకోబడినవాళ్లతో’ సమకూర్చబడరు. (మత్త. 24:31) వాళ్లేకాదు దేవుని ప్రజలందరూ, ఎలాంటి నిరీక్షణ ఉన్నాసరే యేసు మాటల్లో ఉన్న హెచ్చరికను పట్టించుకుంటూ మెలకువగా ఉండాలి, నమ్మకంగా కొనసాగాలి.
17. యెహోవా మనకాలంలో కొంతమందిని అభిషిక్తులుగా ఎంచుకుంటే, మనం ఎందుకు కంగారుపడాల్సిన అవసరంలేదు?
17 మనకు యెహోవా గురించి బాగా తెలుసు. అందుకే ఆయన తీర్పులు ఎప్పుడూ న్యాయంగా ఉంటాయని పూర్తిగా నమ్ముతాం. కాబట్టి ఆయన మనకాలంలో కొంతమందిని అభిషిక్తులుగా ఎంచుకుంటే, మనం కంగారుపడాల్సిన అవసరంలేదు. c ద్రాక్షతోట ఉదాహరణలో ఐదింటికి పని చేయడానికి వచ్చినవాళ్ల గురించి యేసు ఏమన్నాడో గుర్తుచేసుకోండి. (మత్త. 20:1-16) సాయంత్రం వచ్చి పని చేసినవాళ్లకు, పొద్దున్నుండి కష్టపడి పని చేసినవాళ్లకు ఒకేలాంటి జీతం వచ్చింది. అదేవిధంగా అభిషిక్తులు ఏ సమయంలో ఎంచుకోబడినా, నమ్మకమైన వాళ్లని తీర్పు తీర్చబడితే చాలు పరలోక బహుమానాన్ని పొందుతారు.
హెచ్చరికల్ని పట్టించుకోండి
18-19. మనం ఇప్పటివరకు ఏ పాఠాల్ని, హెచ్చరికల్ని చూశాం?
18 ఇప్పటిదాకా మనం ఏమేం చూశాం? భూనిరీక్షణ ఉన్నవాళ్లు గొర్రెల, మేకల ఉదాహరణ నుండి చాలా నేర్చుకోవచ్చు. వాళ్లు ఇప్పుడు, అలాగే రాబోయే మహాశ్రమల సమయంలో యెహోవాకు నమ్మకంగా, విశ్వసనీయంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. యేసు ఆ సమయంలో, నమ్మకంగా ఉన్నవాళ్లను “శాశ్వత జీవితం” అనే బహుమానాన్ని పొందడానికి అర్హులని తీర్పు తీరుస్తాడు.—మత్త. 25:46.
19 అభిషిక్తులకు హెచ్చరికలు ఉన్న రెండు ఉదాహరణల్ని కూడా మనం చూశాం. యేసు చెప్పిన బుద్ధిగల కన్యలు, బుద్ధిలేని కన్యల ఉదాహరణలో ఐదుగురు కన్యలు తెలివిగలవాళ్లమని నిరూపించుకున్నారు. వాళ్లు సిద్ధంగా, అలర్ట్‌గా ఉంటూ పెళ్లి కుమారుడి కోసం ఎంతసేపైనా వేచివుండడానికి రెడీగా ఉన్నారు. కానీ బుద్ధిలేని కన్యలు సిద్ధంగాలేరు. అందుకే పెళ్లి కుమారుడు కూడా వాళ్లను తన పెళ్లి విందుకు పిలవడానికి ఇష్టపడలేదు. యేసు ఈ లోక వ్యవస్థకు ముగింపు పలకడానికి, ఎంత సమయం పట్టినా మనం కూడా వేచివుండడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత తలాంతుల ఉదాహరణలో కష్టపడి, నమ్మకంగా పని చేసిన ఇద్దరు దాసుల గురించి చూశాం. వాళ్లు తమ యజమాని కోసం కష్టపడ్డారు, ఆయన ఆమోదాన్ని పొందారు. కానీ సోమరివాడైన దాసుడు ఆయన ఆమోదాన్ని కోల్పోయాడు. మనకేంటి పాఠం? చివరివరకు మనం యెహోవా సేవలో బిజీగా ఉండాలి. అంతేకాదు, అభిషిక్తులు మెలకువగా ఉంటేనే యేసు వాళ్లను పరలోకానికి తీసుకెళ్తాడని చూశాం. పరలోకంలో యేసు దగ్గరికి ‘సమకూర్చబడాలని’ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హార్‌మెగిద్దోన్ యుద్ధం తర్వాత గొర్రెపిల్ల పెళ్లిలో యేసుకు పెళ్లి కుమార్తెగా అభిషిక్తులు ఉంటారు.—2 థెస్స. 2:1; ప్రక. 19:9.
20. హెచ్చరికల్ని పట్టించుకునే వాళ్ల కోసం యెహోవా ఏం చేస్తాడు?
20 తీర్పు తీర్చే రోజు చాలా దగ్గర్లో ఉందని మనం భయపడాల్సిన అవసరంలేదు. మనం నమ్మకంగా ఉంటే మన ప్రేమగల పరలోక తండ్రి మనకు ‘అసాధారణ శక్తిని ఇచ్చి,’ “మానవ కుమారుడి ముందు నిలబడగలిగేలా” సహాయం చేస్తాడు. (2 కొరిం. 4:7; లూకా 21:36) మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా యేసు చెప్పిన ఉదాహరణలో ఉన్న హెచ్చరికల్ని పట్టించుకుంటే మన తండ్రిని సంతోషపెడతాం. యెహోవా చూపించే అపారదయ వల్ల మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి.—దాని. 12:1; ప్రక. 3:5.
పాట 26 మీరు నా కోసం చేశారు
a 2024, మే కావలికోటలో వచ్చిన “భవిష్యత్తులో యెహోవా తీర్పులు” అనే ఆర్టికల్ చూడండి.
b ఎక్కువ తెలుసుకోవడానికి 2015, మార్చి 15 కావలికోట సంచికలో “మీరు ‘మెలకువగా’ ఉంటారా?” అనే ఆర్టికల్ చూడండి.
d చిత్రాల వివరణ: ప్రీచింగ్‌లో కలిసిన ఒక అమ్మాయికి ఒక అభిషిక్త సహోదరి స్టడీ ఇస్తుంది.