కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 44

మీ పిల్లలు పెద్దయ్యాక దేవున్ని సేవిస్తారా?

మీ పిల్లలు పెద్దయ్యాక దేవున్ని సేవిస్తారా?

“యేసు పెరిగి పెద్దవాడౌతూ, ఇంకా తెలివిగలవాడిగా తయారౌతున్నాడు; అంతకంతకూ దేవుని దయను, మనుషుల దయను పొందుతూ ఉన్నాడు.”—లూకా 2:52.

పాట 134 పిల్లలు యెహోవా ఇచ్చిన బాధ్యత

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మనం తీసుకోగల శ్రేష్ఠమైన నిర్ణయం ఏంటి?

తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు తరచూ పిల్లల మీద చాలాకాలం పాటు ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ తల్లిదండ్రులు చెడు నిర్ణయాలు తీసుకుంటే పిల్లలకు సమస్యలు రావచ్చు. కానీ వాళ్లు తెలివైన నిర్ణయాలు తీసుకుంటే, తమ పిల్లలు సంతోషంగా జీవించేలా సహాయం చేసినవాళ్లు అవుతారు. అయితే, పిల్లలు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మన ప్రేమగల పరలోక తండ్రైన యెహోవాను సేవించాలనుకోవడమే ఒకవ్యక్తి తీసుకోగల నిర్ణయాల్లో అత్యంత శ్రేష్ఠమైనది.—కీర్త. 73:28.

2. యేసు, ఆయన తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?

2 తమ పిల్లలు యెహోవాను సేవించేలా సహాయం చేయాలని యేసు తల్లిదండ్రులైన యోసేపు మరియలు నిర్ణయించుకున్నారు. యెహోవాను సేవించడమే తమ జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమని వాళ్లు తీసుకున్న నిర్ణయాలు చూపించాయి. (లూకా 2:40, 41, 52) అదేవిధంగా యేసు కూడా యెహోవా ఇష్టాన్ని నెరవేర్చడానికి సహాయపడే నిర్ణయాలు తీసుకున్నాడు. (మత్త. 4:1-10) పెద్దవాడౌతుండగా యేసు దయ, విశ్వసనీయత, ధైర్యం వంటి లక్షణాల్ని అలవర్చుకున్నాడు. దైవభయం గల ఏ తల్లిదండ్రులైనా అలాంటి కొడుకును చూసి సంతోషిస్తారు, గర్వపడతారు.

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 ఈ ఆర్టికల్‌లో వీటికి జవాబులు తెలుసుకుంటాం: యేసు విషయంలో యెహోవా ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు? యేసు తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాల నుండి క్రైస్తవ తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు? యేసు తీసుకున్న నిర్ణయాల నుండి క్రైస్తవ పిల్లలు ఏం నేర్చుకోవచ్చు?

యెహోవా నుండి నేర్చుకోండి

4. తన కుమారుడి విషయంలో యెహోవా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు?

4 యేసు కోసం యెహోవా మంచి తల్లిదండ్రుల్ని ఎంచుకున్నాడు. (మత్త. 1:18-23; లూకా 1:26-38) మరియ మనస్ఫూర్తిగా చెప్పిన మాటల్ని బైబిల్లో చదివినప్పుడు యెహోవా మీద, ఆయన వాక్యం మీద ఆమెకు ఎంత ప్రేముందో తెలుస్తుంది. (లూకా 1:46-55) యెహోవా నిర్దేశానికి యోసేపు స్పందించిన తీరు చూస్తే, ఆయనకు దైవభయం, దేవున్ని సంతోషపెట్టాలనే కోరిక ఉన్నాయని అర్థమౌతుంది.—మత్త. 1:24.

5-6. యెహోవా తన కుమారుణ్ణి ఎలాంటి సమస్యల నుండి కాపాడలేదు?

5 యెహోవా యేసు కోసం బాగా డబ్బున్న తల్లిదండ్రుల్ని ఎంచుకోలేదని గమనించండి. యేసు పుట్టిన తర్వాత యోసేపు మరియలు అర్పించిన అర్పణను బట్టి వాళ్లు పేదవాళ్లని తెలుస్తుంది. (లూకా 2:24) బహుశా నజరేతులో తన ఇంటి పక్కనే ఉన్న కొద్దిపాటి స్థలంలో యోసేపు వడ్రంగి పని చేసేవాడు. అంతేకాదు వాళ్లది కనీసం ఏడుగురు పిల్లలున్న పెద్ద కుటుంబం. కాబట్టి వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండివుంటుంది.—మత్త. 13:55, 56.

6 యెహోవా యేసును కొన్ని ప్రమాదాల నుండి కాపాడాడు, కానీ అన్ని సమస్యల నుండి కాపాడలేదు. (మత్త. 2:13-15) ఉదాహరణకు, తన కుటుంబ సభ్యుల్లో కొంతమంది తన మీద విశ్వాసం ఉంచకపోవడం చూసి యేసు ఎంతో నిరుత్సాహపడి ఉంటాడు. వాళ్లు మొదట్లో ఆయన్ని మెస్సీయగా అంగీకరించలేదు. (మార్కు 3:21; యోహా. 7:5) తనను పెంచిన తండ్రైన యోసేపు చనిపోయినప్పుడు, ఆ బాధను కూడా బహుశా యేసు తట్టుకోవాల్సి వచ్చింది. దాంతో పెద్ద కొడుకుగా యేసు తన కుటుంబ వ్యాపారాన్ని చూసుకుని ఉంటాడు. (మార్కు 6:3) యేసు పెరిగి పెద్దవాడౌతున్నప్పుడు కుటుంబ బాధ్యతల్ని చూసుకోవడం నేర్చుకున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన కష్టపడి పనిచేసి ఉంటాడు. కాబట్టి రోజంతా పనిచేసి అలసిపోవడం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు.

తల్లిదండ్రులారా, సలహాల కోసం బైబిలు మీద ఎలా ఆధారపడాలో నేర్పించడం ద్వారా, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మీ పిల్లల్ని సిద్ధం చేయండి (7వ పేరా చూడండి) *

7. (ఎ) పిల్లల్ని పెంచే విషయంలో దంపతులు ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి? (బి) పిల్లలకు శిక్షణ ఇచ్చే విషయంలో సామెతలు 2:1-6 వచనాలు తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తాయి?

7 పిల్లలు కావాలని కోరుకుంటున్న దంపతులు ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘మేము యెహోవాను, ఆయన వాక్యాన్ని ప్రేమించే వినయంగల దంపతులమా? అమూల్యమైన ఒక కొత్త జీవాన్ని చూసుకోవడానికి యెహోవా ఎంచుకునే విధంగా మేము ఉన్నామా?’ (కీర్త. 127:3, 4) మీకు ఇప్పటికే పిల్లలు ఉంటే ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘మా పిల్లలకు కష్టపడి పని చేయడం నేర్పిస్తున్నానా?’ (ప్రసం. 3:12, 13) ‘సాతాను లోకంలో ఎదురవ్వగల భౌతిక, నైతిక ప్రమాదాల నుండి మా పిల్లల్ని కాపాడడానికి శాయశక్తులా కృషిచేస్తున్నానా?’ (సామె. 22:3) మీ పిల్లలకు ఎదురయ్యే ప్రతీ సమస్య నుండి మీరు వాళ్లను కాపాడలేరు. అది అసాధ్యం. అయితే సలహాల కోసం బైబిలు మీద ఎలా ఆధారపడాలో ప్రేమగా నేర్పిస్తుండడం ద్వారా, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మీరు వాళ్లను సిద్ధం చేయవచ్చు. (సామెతలు 2:1-6 చదవండి.) ఉదాహరణకు మీ బంధువుల్లో ఒకరు యెహోవాను సేవించడం ఆపేస్తే, యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో బైబిలు నుండి మీ పిల్లలకు నేర్పించండి. (కీర్త. 31:23) లేదా మీకు ఇష్టమైన వాళ్లెవరైనా చనిపోతే, ఆ బాధను తట్టుకుని మనశ్శాంతిగా ఉండడానికి సహాయం చేసే లేఖనాల్ని మీ పిల్లలకు చూపించండి.—2 కొరిం. 1:3, 4; 2 తిమో. 3:16.

యోసేపు మరియల నుండి నేర్చుకోండి

8. ద్వితీయోపదేశకాండం 6:6, 7 లో ఉన్న ఏ నిర్దేశాన్ని యోసేపు మరియలు పాటించారు?

8 యేసు పెరిగి పెద్దవాడౌతూ దేవుని ఆమోదాన్ని పొందేలా యోసేపు మరియలు ఆయన్ని పెంచారు. తల్లిదండ్రుల కోసం యెహోవా ఇచ్చిన నిర్దేశాల్ని వాళ్లు పాటించారు. (ద్వితీయోపదేశకాండం 6:6, 7 చదవండి.) వాళ్లకు యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమ ఉంది, తమ పిల్లలు కూడా అలాంటి ప్రేమను పెంచుకోవాలనే లక్ష్యంతో వాళ్లు పనిచేశారు.

9. యోసేపు మరియలు ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు?

9 యోసేపు మరియలు తమ పిల్లలతో కలిసి యెహోవాను క్రమంగా ఆరాధించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ప్రతీవారం నజరేతులోని సమాజమందిరానికి, అలాగే ప్రతీ సంవత్సరం పస్కా పండుగ కోసం యెరూషలేముకు వెళ్లేవాళ్లు. (లూకా 2:41; 4:16) ఆ ప్రయాణంలో వాళ్లు యేసుకు, ఆయన తోబుట్టువులకు యెహోవా ప్రజల చరిత్రను వివరించి ఉంటారు, అంతేకాదు లేఖనాల్లో ప్రస్తావించిన ప్రదేశాలను చూపించి ఉంటారు. ఎక్కువమంది పిల్లలు పుట్టిన తర్వాత యెహోవాను క్రమంగా ఆరాధించడం యోసేపు మరియలకు కష్టమైవుంటుంది. కానీ వాళ్లు ఎన్నో ఆశీర్వాదాలు పొందారు. యెహోవా ఆరాధనకు మొదటి స్థానం ఇవ్వడం వల్ల వాళ్ల కుటుంబం ఎప్పుడూ యెహోవాకు దగ్గరగా ఉంది.

10. యోసేపు మరియల నుండి క్రైస్తవ తల్లిదండ్రులు ఏం నేర్చుకోవచ్చు?

10 దైవభయం గల తల్లిదండ్రులు యోసేపు మరియల నుండి ఏం నేర్చుకోవచ్చు? తల్లిదండ్రులారా, అన్నిటికన్నా ముఖ్యంగా మీకు యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమ ఉందని మీ మాటల ద్వారా, చేతల ద్వారా పిల్లలకు నేర్పించండి. యెహోవాను ప్రేమించేలా సహాయం చేయడమే మీరు వాళ్లకు ఇవ్వగల అత్యంత గొప్ప బహుమతని గుర్తుంచుకోండి. ప్రాముఖ్యమైన విషయాల్ని అంటే క్రమంగా బైబిల్ని అధ్యయనం చేయడం, ప్రార్థించడం, మీటింగ్స్‌కి వెళ్లడం, పరిచర్య చేయడం మీ పిల్లలకు నేర్పించండి. (1 తిమో. 6:6) నిజమే, మీ పిల్లలకు అవసరమైన వాటిని సమకూర్చాల్సిన బాధ్యత కూడా మీకుంది. (1 తిమో. 5:8) కానీ ఒక విషయం గుర్తుంచుకోండి: మీ పిల్లలు ఈ వ్యవస్థ అంతాన్ని తప్పించుకుని, కొత్త లోకంలోకి ప్రవేశించేలా సహాయం చేసేది ఆస్తిపాస్తులు కాదుగానీ యెహోవాతో వాళ్లకున్న దగ్గరి సంబంధమే.—యెహె. 7:19; 1 తిమో. 4:8.

తమ పిల్లల్ని యెహోవాకు దగ్గరచేసే మంచి నిర్ణయాల్ని తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. అది నిజంగా మనకు సంతోషాన్నిస్తుంది (11వ పేరా చూడండి) *

11. (ఎ) మొదటి తిమోతి 6:17-19 లో ఉన్న సలహా, నిర్ణయాలు తీసుకునే విషయంలో తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తుంది? (బి) మీ కుటుంబం ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు? దానివల్ల ఎలాంటి దీవెనలు వస్తాయి? (“ మీ లక్ష్యాలేంటి?” బాక్సు చూడండి.)

11 తమ పిల్లల్ని యెహోవాకు దగ్గరచేసే మంచి నిర్ణయాల్ని ఎంతోమంది తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. అది నిజంగా మనకు సంతోషాన్నిస్తుంది. ఆ తల్లిదండ్రులు తమ కుటుంబమంతటితో కలిసి యెహోవాను క్రమంగా ఆరాధిస్తున్నారు. వాళ్లు మీటింగ్స్‌కి, సమావేశాలకు హాజరౌతున్నారు, పరిచర్యలో పాల్గొంటున్నారు. కొన్ని కుటుంబాలు తమకు సమయం దొరికినప్పుడు, అంతగా ప్రకటించబడని ప్రాంతాలకు వెళ్లి పరిచర్య చేస్తున్నాయి. ఇంకొన్ని కుటుంబాలు బెతెల్‌ చూడడానికి లేదా నిర్మాణ పనుల్లో సహాయం చేయడానికి వెళ్తున్నాయి. వీటన్నిటి కోసం వాళ్లు డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ యెహోవా వాళ్లను మెండుగా దీవిస్తాడు. (1 తిమోతి 6:17-19 చదవండి.) తరచూ అలాంటి కుటుంబాల్లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఆ మంచి పనుల్ని కొనసాగిస్తారు, తమ తల్లిదండ్రులు తమను అలా పెంచినందుకు సంతోషిస్తారు! *సామె. 10:22.

యేసు నుండి నేర్చుకోండి

12. యేసు పెరిగి పెద్దవాడౌతుండగా ఏం చేయాలి?

12 యేసు పరలోక తండ్రి ఎప్పుడూ మంచి నిర్ణయాలే తీసుకుంటాడు, యోసేపు మరియలు కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే యేసు పెరిగి పెద్దవాడౌతుండగా తన నిర్ణయాలు తానే తీసుకోవాలి. (గల. 6:5) మనందరిలాగే ఆయనకు కూడా సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. కావాలనుకుంటే ఆయన తన సొంత ఇష్టాలకు ప్రాముఖ్యత ఇవ్వవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు, యెహోవాతో మంచి సంబంధం కలిగివుండాలని నిర్ణయించుకున్నాడు. (యోహా. 8:29) యేసు నుండి పిల్లలు ఏం నేర్చుకోవచ్చు?

పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఇచ్చే నిర్దేశాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకండి (13వ పేరా చూడండి) *

13. చిన్నప్పుడే యేసు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు?

13 చిన్నప్పుడే యేసు తన తల్లిదండ్రులకు లోబడివుండాలని నిర్ణయించుకున్నాడు. వాళ్లకన్నా తనకే ఎక్కువ తెలుసని, తల్లిదండ్రుల సలహాలు తనకు అక్కర్లేదని అనుకోలేదు. బదులుగా ఆయన “అన్నివేళలా వాళ్లకు లోబడివున్నాడు.” (లూకా 2:51) పెద్ద కొడుకుగా తనకున్న బాధ్యతను యేసు చాలా ప్రాముఖ్యంగా ఎంచాడు. కుటుంబం కోసం కష్టపడుతున్న యోసేపుకు సహాయంగా యేసు కూడా వడ్రంగి పనిని నేర్చుకున్నాడు.

14. యేసు దేవుని వాక్యాన్ని చక్కగా అధ్యయనం చేసేవాడని మనకెలా తెలుసు?

14 యేసు అద్భుతరీతిలో పుట్టిన సంగతిని, ఆయన గురించి దేవదూతలు చెప్పిన విషయాల్ని బహుశా యోసేపు మరియలు ఆయనకు చెప్పివుంటారు. (లూకా 2:8-19, 25-38) కేవలం తాను విన్న విషయాలతో యేసు సరిపెట్టుకోలేదు గానీ, లేఖనాల్ని సొంతగా అధ్యయనం చేశాడు. యేసు దేవుని వాక్యాన్ని చక్కగా అధ్యయనం చేసేవాడని మనకెలా తెలుసు? ఆయనకు 12 ఏళ్లు ఉన్నప్పుడే యెరూషలేములో బోధకులు “ఆయన అవగాహనను, ఆయన చెప్తున్న జవాబుల్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు.” (లూకా 2:46, 47) ఆ వయసులోనే యెహోవా తన తండ్రి అని యేసు స్పష్టంగా అర్థంచేసుకున్నాడు.—లూకా 2:42, 43, 49.

15. యెహోవా ఇష్టాన్ని చేయాలని నిర్ణయించుకున్నట్లు యేసు ఎలా చూపించాడు?

15 తన విషయంలో యెహోవా ఇష్టం ఏంటో తెలుసుకున్నాక, దాన్ని చేయాలని యేసు నిర్ణయించుకున్నాడు. (యోహా. 6:38) తనను చాలామంది ద్వేషిస్తారని యేసుకు తెలుసు, ఆ ఆలోచన ఆయన్ని ఎంతగానో కలవరపెట్టి ఉంటుంది. అయినప్పటికీ యెహోవాను సేవించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. క్రీ.శ. 29 లో యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, యెహోవా ఇష్టాన్ని చేయడమే తన జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయమని స్పష్టం చేశాడు. (హెబ్రీ. 10:5-7) ఆఖరికి హింసాకొయ్య మీద చనిపోతున్నప్పుడు కూడా యేసు తన తండ్రి ఇష్టాన్ని చేయడం మానలేదు.—యోహా. 19:30.

16. పిల్లలు యేసు నుండి నేర్చుకోగల ఒక పాఠం ఏంటి?

16 మీ తల్లిదండ్రులకు లోబడండి. యోసేపు మరియల్లాగే మీ తల్లిదండ్రులు కూడా అపరిపూర్ణులు. అయితే మిమ్మల్ని సంరక్షించే, మీకు శిక్షణనిచ్చే, నిర్దేశమిచ్చే బాధ్యతను యెహోవా వాళ్లకు అప్పగించాడు. కాబట్టి మీరు వాళ్ల సలహా విని, వాళ్ల అధికారాన్ని గౌరవించినప్పుడు మీ “జీవితం బాగుంటుంది.”—ఎఫె. 6:1-4.

17. యెహోషువ 24:15 ప్రకారం, పిల్లలు ఏ నిర్ణయాన్ని సొంతగా తీసుకోవాలి?

17 మీరు ఎవర్ని సేవిస్తారో నిర్ణయించుకోండి. యెహోవా ఎవరో, ఆయన ఇష్టం ఏంటో, దాన్ని మీరెలా చేయవచ్చో పరీక్షించి తెలుసుకోవాలి. (రోమా. 12:2) అప్పుడు మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని, అంటే యెహోవాను సేవించాలనే నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. (యెహోషువ 24:15 చదవండి; ప్రసం. 12:1) మీరు క్రమంగా బైబిలు చదివి, అధ్యయనం చేస్తే యెహోవా మీద మీకున్న ప్రేమ, విశ్వాసం అంతకంతకు బలపడతాయి.

18. పిల్లలు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటి? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?

18 మీ జీవితంలో యెహోవా ఇష్టానికి మొదటి స్థానం ఇవ్వాలని నిర్ణయించుకోండి. మీ సామర్థ్యాల్ని మీ ప్రయోజనం కోసం ఉపయోగిస్తే సంతోషంగా ఉంటారని సాతాను లోకం చెప్తుంది. కానీ ఆస్తిపాస్తుల వెంట పరుగెత్తేవాళ్లు ‘ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకుంటారు’ అని బైబిలు చెప్తుంది. (1 తిమో. 6:9, 10) మీరు యెహోవా మాట విని, మీ జీవితంలో ఆయన ఇష్టానికి మొదటి స్థానం ఇవ్వాలని నిర్ణయించుకుంటే విజయం సాధిస్తారు, ‘తెలివిగా నడుచుకుంటారు.’—యెహో. 1:8.

మీరేం చేయాలని నిర్ణయించుకుంటారు?

19. తల్లిదండ్రులు ఏం గుర్తుంచుకోవాలి?

19 తల్లిదండ్రులారా, మీ పిల్లలు యెహోవాను సేవించేలా సహాయం చేయడానికి శాయశక్తులా కృషిచేయండి. యెహోవా మీద ఆధారపడండి, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. (సామె. 3:5, 6) మీ మాటల కన్నా మీ పనులే పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి మీ పిల్లలు యెహోవా ఆమోదాన్ని పొందడానికి సహాయం చేసే నిర్ణయాలు తీసుకోండి.

20. పిల్లలు యెహోవాను సేవించాలని నిర్ణయించుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు?

20 పిల్లలారా, మీరు మంచి నిర్ణయాలు తీసుకునేలా మీ తల్లిదండ్రులు సహాయం చేయగలరు. కానీ దేవున్ని సంతోషపెట్టేలా నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరే. కాబట్టి యేసులాగే మీరు కూడా ప్రేమగల మీ పరలోక తండ్రిని సేవించాలని నిర్ణయించుకోండి. అలాచేస్తే ఇప్పుడు మీ జీవితం అర్థవంతంగా, సంతోషంగా, బిజీగా ఉంటుంది. (1 తిమో. 4:16) భవిష్యత్తులో మీరు ఇంకా సంతోషమైన జీవితాన్ని పొందుతారు!

పాట 133 యౌవనకాలంలో యెహోవాను ఆరాధించండి

^ పేరా 5 తమ పిల్లలు సంతోషంగా ఉండాలని, వాళ్లు పెద్దయ్యాక యెహోవాను సేవించాలని క్రైస్తవ తల్లిదండ్రులు కోరుకుంటారు. తమ పిల్లలు యెహోవాను సేవించేలా సహాయం చేయడానికి తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? జీవితంలో విజయం సాధించాలంటే పిల్లలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం.

^ పేరా 11 పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి? బ్రోషురు 20వ పేజీలోని “ఇంతకన్నా మంచి తల్లిదండ్రులు ఉండరేమో!” అనే బాక్సు చూడండి. అలాగే తేజరిల్లు! ఏప్రిల్‌ 8, 1999, 25వ పేజీలోని “తమ తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక లేఖ” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 65 చిత్రాల వివరణ: యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమ పెంచుకునేలా పిల్లవాడైన యేసుకు మరియ సహాయం చేసి ఉంటుంది. నేడు కూడా తల్లులు యెహోవా మీద ప్రేమ పెంచుకునేలా పిల్లలకు సహాయం చేయవచ్చు.

^ పేరా 67 చిత్రాల వివరణ: యోసేపు తన కుటుంబమంతటినీ తీసుకుని సమాజమందిరానికి వెళ్లడాన్ని ప్రాముఖ్యంగా ఎంచి ఉంటాడు. నేడు కూడా తండ్రులు, తమ కుటుంబమంతటినీ తీసుకుని మీటింగ్స్‌కి వెళ్లడాన్ని ప్రాముఖ్యంగా ఎంచవచ్చు.

^ పేరా 69 చిత్రాల వివరణ: యేసు తన తండ్రి దగ్గర పని నేర్చుకున్నాడు. నేడు కూడా పిల్లలు తమ తండ్రుల దగ్గర పని నేర్చుకోవచ్చు.