కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 43

యెహోవా తన సంస్థను నడిపిస్తున్నాడు

యెహోవా తన సంస్థను నడిపిస్తున్నాడు

“‘సైన్యాల వల్లో, మనుషుల శక్తి వల్లో కాదుగానీ నా పవిత్రశక్తి వల్లే ఇదంతా జరుగుతుంది’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.”—జెక. 4:6.

పాట 40 మనం ఎవరి పక్షం?

ఈ ఆర్టికల్‌లో . . . *

1. బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు ఏం చేస్తూ ఉండాలి?

మీరు బాప్తిస్మం తీసుకున్నారా? అయితే, యెహోవా మీద మీకున్న విశ్వాసాన్ని, ఆయన సంస్థతో * కలిసి పనిచేయాలన్న కోరికను మీరు బహిరంగంగా తెలియజేశారు. అయినప్పటికీ యెహోవా మీద మీకున్న విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండాలి. అంతేకాదు, నేడు యెహోవా తన సంస్థను ఉపయోగించుకుంటున్నాడనే మీ నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండాలి.

2-3. నేడు యెహోవా తన సంస్థను ఎలా నడిపిస్తున్నాడు? ఆయన నడిపించే తీరులో ఏ మూడు లక్షణాలు కనిపిస్తున్నాయి?

2 నేడు యెహోవా తన వ్యక్తిత్వానికి, ఉద్దేశానికి, ప్రమాణాలకు తగ్గట్టుగా సంస్థను నడిపిస్తున్నాడు. తన సంస్థను నడిపించే తీరులో యెహోవాకున్న మూడు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

3 మొదటిది, “దేవునికి పక్షపాతం లేదు.” (అపొ. 10:34) ప్రేమతో యెహోవా తన కుమారుణ్ణి ‘అందరి కోసం విమోచన క్రయధనంగా’ ఇచ్చాడు. (1 తిమో. 2:6; యోహా. 3:16) వినే వాళ్లందరికీ మంచివార్తను ప్రకటించేలా యెహోవా తన ప్రజల్ని ఉపయోగిస్తున్నాడు. వీలైనంత ఎక్కువమంది విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందాలన్నది ఆయన కోరిక. రెండవది, “దేవుడు శాంతికి మూలం, ఆయన అన్నీ క్రమపద్ధతిలో చేస్తాడు.” (1 కొరిం. 14:33, 40) కాబట్టి ఆయన ప్రజలందరూ శాంతిగా, క్రమపద్ధతిలో ఆరాధిస్తారని మీరు నమ్మవచ్చు. మూడవది, యెహోవా “మహాగొప్ప ఉపదేశకుడు.” (యెష. 30:20, 21) అందుకే ఆయన సంస్థ అటు సంఘంలో, ఇటు బహిరంగ పరిచర్యలో దేవుని వాక్యమైన బైబిలు నుండి బోధించడానికి కృషిచేస్తోంది. మొదటి శతాబ్దపు సంఘాన్ని నడిపించిన తీరులో ఆ మూడు లక్షణాలు ఎలా కనిపించాయి? ఆ లక్షణాలు మనకాలంలో ఎలా కనిపిస్తున్నాయి? నేడు యెహోవా సంస్థతో కలిసి పనిచేస్తుండగా పవిత్రశక్తి మీకెలా సహాయం చేయగలదు?

దేవునికి పక్షపాతం లేదు

4. అపొస్తలుల కార్యాలు 1:8 ప్రకారం, యేసు తన అనుచరులకు ఏమని ఆజ్ఞాపించాడు? వాళ్లకు ఏ సహాయం ఉంటుంది?

4 మొదటి శతాబ్దంలో. యేసు ప్రకటించిన సందేశం మనుషులందరికీ నిరీక్షణ ఇచ్చింది. (లూకా 4:43) తాను మొదలుపెట్టిన పనిని కొనసాగించమని, “భూమంతటా” సాక్ష్యమివ్వమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (అపొస్తలుల కార్యాలు 1:8 చదవండి.) అయితే, వాళ్లు ఆ పనిని తమ సొంత శక్తితో చేయలేరు. వాళ్లకు యేసు వాగ్దానం చేసిన “సహాయకుడు,” అంటే పవిత్రశక్తి అవసరం.—యోహా. 14:26; జెక. 4:6.

5-6. పవిత్రశక్తి ఏయే విధాలుగా యేసు అనుచరులకు సహాయం చేసింది?

5 క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున యేసు అనుచరులు పవిత్రశక్తిని పొందారు. ఆ పవిత్రశక్తి సహాయంతో వాళ్లు వెంటనే ప్రకటించడం మొదలుపెట్టారు, కొద్ది సమయంలోనే వేలమంది మంచివార్తను అంగీకరించారు. (అపొ. 2:41; 4:4) వ్యతిరేకత ఎదురైనప్పుడు శిష్యులు భయపడిపోలేదు కానీ సహాయం కోసం దేవుని వైపు చూశారు. వాళ్లు ఇలా ప్రార్థించారు: “నీ దాసులు నీ వాక్యాన్ని పూర్తి ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయి.” అప్పుడు వాళ్లు “పవిత్రశక్తితో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు.”—అపొ. 4:18-20, 29, 31.

6 యేసు శిష్యులు వేరే సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఉదాహరణకు, అప్పట్లో లేఖనాల ప్రతులు కొద్ది సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు మనకున్నట్టు లేఖనాలను వివరించే పుస్తకాలు కూడా ఆ కాలంలో లేవు. పైగా వాళ్లు వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలకు ప్రకటించాలి. అన్ని సవాళ్లు ఉన్నా, ఉత్సాహవంతులైన ఆ శిష్యులు అసాధ్యం అనిపించినదాన్ని చేశారు: దాదాపు 30 సంవత్సరాల్లోనే వాళ్లు “ఆకాశం కింద ఉన్న సృష్టంతటికీ” మంచివార్త ప్రకటించారు.—కొలొ. 1:6, 23, అధస్సూచి.

7. వంద కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, తాము దేనికోసం పిలవబడ్డామని యెహోవా సేవకులు గ్రహించారు? అప్పుడు వాళ్లు ఏం చేశారు?

7 ఆధునిక కాలంలో. యెహోవా మనకాలంలో కూడా తన ప్రజల్ని నిర్దేశిస్తున్నాడు, తన ఇష్టాన్ని చేయడానికి కావల్సిన బలాన్ని ఇస్తున్నాడు. చాలావరకు, తన పవిత్రశక్తి ప్రేరణతో రాయబడిన బైబిలు ద్వారా నిర్దేశం ఇస్తున్నాడు. యేసు చేసిన పరిచర్య గురించి, ఆయన మొదలుపెట్టిన పనిని కొనసాగించమని శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ గురించి బైబిల్లో చదువుతాం. (మత్త. 28:19, 20) జూలై 1881 లోనే ఈ పత్రిక ఇలా చెప్పింది: “మనం ఘనత పొందడానికి, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికి కాదుగానీ, మనకున్న వాటన్నిటినీ ధారపోసి మంచివార్త ప్రకటించడానికే పిలవబడ్డాం లేదా అభిషేకించబడ్డాం.” 1919 లో ప్రచురించబడిన ఆ పని ఎవరికి అప్పగించబడింది (ఇంగ్లీషు) అనే చిన్నపుస్తకం ఇలా చెప్పింది: “మన శక్తికి మించిన పని మన ముందుంది, అయితే ఇది ప్రభువు పని, దాన్ని చేయడానికి కావల్సిన బలాన్ని ఆయనే ఇస్తాడు.” అవును, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే ఆధునిక కాలంలోని సహోదరులు కూడా ప్రకటనా పనిలో ఎంతో కష్టపడ్డారు. అన్నిరకాల ప్రజలకు ప్రకటించడానికి పవిత్రశక్తి సహాయం చేస్తుందనే నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగారు. నేడు మనం కూడా అదే నమ్మకంతో ఉన్నాం.

యెహోవా సంస్థ మంచివార్త ప్రకటించడానికి అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన పనిముట్లను ఉపయోగించింది (8-9 పేరాలు చూడండి)

8-9. ప్రకటనా పనిని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి యెహోవా సంస్థ ఏ పద్ధతుల్ని ఉపయోగించింది?

8 యెహోవా సంస్థ మంచివార్త ప్రకటించడానికి అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన పనిముట్లను ఉపయోగించింది. అందులో ముద్రిత ప్రచురణలు, “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌,” ఫోనోగ్రాఫ్‌లు, సౌండ్‌ కార్లు, రేడియో ప్రసారాలు, అలాగే ఈమధ్య కాలంలోని డిజిటల్‌ టెక్నాలజీ ఉన్నాయి. అంతేకాదు, యెహోవా సంస్థ ముందెన్నడూ లేనంతగా ఎన్నో భాషల్లోకి సమాచారాన్ని అనువదిస్తోంది! ఎందుకు? అన్నిరకాల ప్రజలు తమ మాతృభాషలో మంచివార్త వినాలనే ఉద్దేశంతో అలా చేస్తోంది. యెహోవాకు పక్షపాతం లేదు; “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు” మంచివార్త ప్రకటించబడుతుందని ఆయన ముందే చెప్పాడు. (ప్రక. 14:6, 7) రాజ్య సందేశాన్ని వినే అవకాశం అందరికీ దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు.

9 కొంతమంది ప్రజల్ని, ఉదాహరణకు భద్రత ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లలో నివసించే వాళ్లను చేరుకోవడం కష్టంగా ఉండవచ్చు. మరి రాజ్య సందేశం వాళ్లకు ఎలా ప్రకటించబడుతుంది? అలాంటి వాళ్లను చేరుకోవడానికి, యెహోవా సంస్థ వేర్వేరు పద్ధతుల్లో బహిరంగ సాక్ష్యం ఇవ్వడం గురించి ఆలోచించింది. ఉదాహరణకు, 2001 లో పరిపాలక సభ ఫ్రాన్స్‌లో లిటరేచర్‌ కార్టులను, టేబుళ్లను ఉపయోగించి సాక్ష్యమివ్వడానికి అనుమతి ఇచ్చింది. తర్వాత వేరే దేశాల్లో కూడా ఈ పద్ధతిని ఉపయోగించారు. దానికి మంచి ఫలితాలు వచ్చాయి. 2011 లో అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో, రద్దీగా ఉండే ఒక ప్రాంతంలో ఒక కొత్త కార్యక్రమం మొదలైంది. మొదటి సంవత్సరంలోనే 1,02,129 పుస్తకాలు, 68,911 పత్రికలు అందించారు. అంతేకాదు 4,701 మంది బైబిలు స్టడీ కావాలని అడిగారు! పవిత్రశక్తి సహాయంతోనే ఈ పనంతా జరిగిందని స్పష్టమైంది. దాంతో పరిపాలక సభ లిటరేచర్‌ కార్టులను, టేబుళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది.

10. పరిచర్యను మరింత మెరుగ్గా చేయడానికి మనమేం చేయవచ్చు?

10 మీరేం చేయవచ్చు? మీటింగ్స్‌లో యెహోవా ఇస్తున్న శిక్షణ నుండి పూర్తి ప్రయోజనం పొందండి. మీ క్షేత్ర సేవా గుంపుతో కలిసి క్రమంగా పరిచర్య చేయండి. అక్కడ మీకు అవసరమైన సహాయం పొందవచ్చు, ఇతరుల మంచి ఆదర్శం నుండి ప్రోత్సాహం పొందవచ్చు. పరిచర్యలో ఓపిగ్గా కొనసాగండి. ఈ ఆర్టికల్‌ ముఖ్య వచనం చెప్తున్నట్టు, మన సొంత శక్తి వల్ల కాదుగానీ పవిత్రశక్తి వల్లే దేవుని ఇష్టాన్ని చేస్తాం. (జెక. 4:6) ఎంతైనా మనం చేస్తున్నది దేవుని పని.

దేవుడు శాంతికి మూలం, ఆయన అన్నీ క్రమపద్ధతిలో చేస్తాడు

11. దేవుని ప్రజల మధ్య క్రమపద్ధతిని కాపాడడానికి మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ ఎలా ఐక్యంగా పనిచేసింది?

11 మొదటి శతాబ్దంలో. దేవుని ప్రజల మధ్య శాంతిని, క్రమపద్ధతిని కాపాడడానికి యెరూషలేములోని పరిపాలక సభ ఐక్యంగా పనిచేసింది. (అపొ. 2:42) ఉదాహరణకు, దాదాపు క్రీ.శ. 49 లో సున్నతి గురించిన సమస్య తీవ్రమైనప్పుడు, పవిత్రశక్తి నిర్దేశం కింద పరిపాలక సభ ఆ విషయాన్ని పరిశీలించింది. ఒకవేళ ఈ విషయంలో క్రైస్తవ సంఘం ఐక్యంగా లేకపోయుంటే, ప్రకటనా పని కుంటుపడేది. పరిపాలక సభలో ఉన్న అపొస్తలులు, మిగతా పెద్దలు యూదులే అయినప్పటికీ వాళ్లు యూదా సంప్రదాయ ప్రభావానికి గానీ, దాన్ని బలంగా సమర్థించిన వాళ్ల ప్రభావానికి గానీ లొంగిపోలేదు. బదులుగా వాళ్లు నిర్దేశం కోసం దేవుని వాక్యం మీద, పవిత్రశక్తి మీద ఆధారపడ్డారు. (అపొ. 15:1, 2, 5-20, 28) ఫలితంగా యెహోవా వాళ్ల నిర్ణయాన్ని ఆశీర్వదించాడు, శాంతి-ఐక్యత వర్ధిల్లాయి, ప్రకటనా పని మరింత విస్తృతంగా జరిగింది.—అపొ. 15:30, 31; 16:4, 5.

12. నేడు యెహోవా సంస్థలో శాంతి, క్రమపద్ధతి ఉన్నాయని ఎలా చెప్పవచ్చు?

12 ఆధునిక కాలంలో. దేవుని ప్రజల మధ్య శాంతిని, క్రమపద్ధతిని కాపాడడానికి యెహోవా సంస్థ కృషిచేసింది. 1895, జాయన్స్‌ వాచ్‌ టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెసెన్స్‌ నవంబరు 15 సంచికలో “మర్యాదగా, పద్ధతి ప్రకారం” అనే ఆర్టికల్‌ వచ్చింది. అది 1 కొరింథీయులు 14:40 ఆధారంగా తయారుచేయబడింది. ఆ ఆర్టికల్‌ ఇలా చెప్పింది: “క్రమపద్ధతి గురించి అపొస్తలులు తొలి సంఘానికి ఎన్నో విషయాలు రాశారు. . . . ‘పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి’ కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా పాటించడం ఇప్పటికీ ప్రాముఖ్యం.” (రోమా. 15:4) అవును శాంతిని, క్రమపద్ధతిని కాపాడడానికి మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎంతగా కృషిచేశారో, నేటి యెహోవా సంస్థ కూడా అంతే కృషిచేస్తోంది. ఉదాహరణకు మీరు వేరే సంఘంలో లేదా వేరే దేశంలో కావలికోట అధ్యయనానికి హాజరవ్వాల్సి వస్తే, అక్కడ ఏ ఆర్టికల్‌ని అధ్యయనం చేస్తారో, ఎలా అధ్యయనం చేస్తారో మీకు తెలుసు. కాబట్టి మీకు మీ సంఘంలో ఉన్నట్టే అనిపిస్తుంది! పవిత్రశక్తి వల్లే మన మధ్య ఇంత గొప్ప ఐక్యత సాధ్యమైంది.—జెఫ. 3:9.

13. యాకోబు 3:17 ప్రకారం, మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

13 మీరేం చేయవచ్చు? తన ప్రజలు “శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను” కాపాడుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (ఎఫె. 4:1-3) కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను సంఘంలో శాంతి, ఐక్యత నెలకొనేలా నడుచుకుంటున్నానా? నాయకత్వం వహిస్తున్నవాళ్లకు లోబడుతున్నానా? ఆధారపడదగిన వ్యక్తిగా ఉంటున్నానా? మరిముఖ్యంగా, సంఘంలో నాకు బాధ్యతలు ఉన్నప్పుడు అలా ఉంటున్నానా? నేను సమయాన్ని పాటిస్తానా, ఇతరులకు సహాయం చేస్తానా, సేవచేయడానికి ముందుంటానా?’ (యాకోబు 3:17 చదవండి.) ఏ విషయంలోనైనా మార్పు అవసరమని గుర్తిస్తే, పవిత్రశక్తి కోసం ప్రార్థించండి. మీ వ్యక్తిత్వాన్ని మలచడానికి, మీ పనుల్ని నిర్దేశించడానికి పవిత్రశక్తిని ఎంత ఎక్కువగా అనుమతిస్తే, అంత ఎక్కువగా సహోదర సహోదరీలు మిమ్మల్ని ప్రేమిస్తారు, విలువైనవాళ్లుగా చూస్తారు.

యెహోవా మనకు ఉపదేశిస్తాడు,మనకు కావల్సినవి ఇస్తాడు

14. కొలొస్సయులు 1:9, 10 ప్రకారం యెహోవా మొదటి శతాబ్దంలోని తన ప్రజలకు ఎలా ఉపదేశం ఇచ్చాడు?

14 మొదటి శతాబ్దంలో. తన ప్రజలకు ఉపదేశించడం అంటే యెహోవాకు చాలా ఇష్టం. (కీర్త. 32:8) వాళ్లు తనను తెలుసుకోవాలని, ప్రేమించాలని, శాశ్వతకాలం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉపదేశం ఇవ్వకపోతే అవేవీ సాధ్యం కావు. (యోహా. 17:3) మొదటి శతాబ్దంలో తన ప్రజలకు ఉపదేశం ఇవ్వడానికి ఆయన క్రైస్తవ సంఘాన్ని ఉపయోగించుకున్నాడు. (కొలొస్సయులు 1:9, 10 చదవండి.) యేసు వాగ్దానం చేసిన ‘సహాయకుడు,’ అంటే పవిత్రశక్తి కూడా వాళ్లకు చాలా సహాయం చేసింది. (యోహా. 14:16) దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి; యేసు చెప్పిన, చేసిన వాటన్నిటినీ గుర్తు తెచ్చుకోవడానికి; తర్వాత వాటిని సువార్త పుస్తకాల్లో రాయడానికి పవిత్రశక్తి శిష్యులకు సహాయం చేసింది. దానివల్ల తొలి క్రైస్తవుల విశ్వాసం పెరిగింది, అలాగే దేవుని మీద, ఆయన కుమారుని మీద, తోటి సహోదరుల మీద ఉన్న ప్రేమ బలపడింది.

15. యెషయా 2:2, 3 లో ఉన్న వాగ్దానం ఏయే విధాలుగా నెరవేరడం మీరు చూస్తున్నారు?

15 ఆధునిక కాలంలో. “రోజుల చివర్లో” అన్నిదేశాల ప్రజలు తన మార్గాల గురించి నేర్చుకోవడానికి తన మందిర పర్వతం మీదికి ప్రవాహంలా వస్తారని యెహోవా ముందే చెప్పాడు. (యెషయా 2:2, 3 చదవండి.) ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరడం మనం చూస్తున్నాం. ఏ రకమైన అబద్ధ ఆరాధన కన్నా సత్యారాధన ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంది. అంతేకాదు, యెహోవా తన ప్రజలకు గొప్ప ఆధ్యాత్మిక విందును ఏర్పాటు చేస్తున్నాడు. (యెష. 25:6) “నమ్మకమైన, బుద్ధిగల” దాసుని ద్వారా రకరకాల ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. ఆర్టికల్స్‌, ప్రసంగాలు, కార్టూన్లు, వీడియోలు ఇలా ఎన్నో రకాలుగా దాన్ని అందిస్తున్నాడు. (మత్త. 24:45) యోబు స్నేహితుడైన ఎలీహులాగే మనకు కూడా ఇలా అనాలనిపిస్తుంది: “ఆయన [దేవుని] లాంటి ఉపదేశకుడు ఎవరు?”—యోబు 36:22.

ఇదే సత్యమని నమ్మకం కుదుర్చుకుని, దాన్ని మీ జీవితంలో పాటించండి (16వ పేరా చూడండి) *

16. యెహోవా ఇచ్చే ఉపదేశం నుండి ప్రయోజనం పొందడానికి మీరేం చేయవచ్చు?

16 మీరేం చేయవచ్చు? బైబిల్లో మీరు చదివిన వాటిని, అధ్యయనం చేసిన వాటిని పాటించేలా పవిత్రశక్తి మీకు సహాయం చేస్తుంది. కీర్తనకర్తలాగే మీరూ ఇలా ప్రార్థించండి: “యెహోవా, నీ మార్గాన్ని నాకు బోధించు. నేను నీ సత్యంలో నడుస్తాను. నీ పేరుకు భయపడేలా నాకు ఏక హృదయం దయచేయి.” (కీర్త. 86:11) యెహోవా తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా ఇస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. అయితే కేవలం జ్ఞానాన్ని పెంచుకోవాలన్నది మీ ఉద్దేశం కాదు. ఇదే సత్యమని నమ్మకం కుదుర్చుకుని, దాన్ని మీ జీవితంలో పాటించాలని మీరు కోరుకుంటారు. అలా చేయడానికి పవిత్రశక్తి మీకు సహాయం చేయగలదు. అంతేకాదు మీ సహోదర సహోదరీల్ని ప్రోత్సహించాలని కూడా మీరు కోరుకుంటారు. (హెబ్రీ. 10:24, 25) ఎందుకు? ఎందుకంటే వాళ్లు మీ కుటుంబం. మీటింగ్స్‌లో మనస్ఫూర్తిగా కామెంట్స్‌ చెప్పడానికి, మీకు నియమించిన భాగాల్ని చక్కగా చేయడానికి పవిత్రశక్తి సహాయం కోసం ప్రార్థించండి. మీరు ఇవన్నీ చేయడం ద్వారా యెహోవాకు, యేసుక్రీస్తుకు చెందిన అమూల్యమైన “గొర్రెల్ని” ప్రేమిస్తున్నారని చూపిస్తారు.—యోహా. 21:15-17.

17. యెహోవా సంస్థకు నమ్మకంగా మద్దతిస్తున్నారని మీరు ఏయే విధాలుగా చూపించవచ్చు?

17 అతిత్వరలో, దేవుని పవిత్రశక్తితో నడిపించబడుతున్న సంస్థ మాత్రమే ఈ భూమ్మీద మిగిలివుంటుంది. కాబట్టి ఆ సంస్థతో కలిసి ఉత్సాహంగా పనిచేయండి. మీరు కలిసే ప్రతీఒక్కరికి మంచివార్త ప్రకటించడం ద్వారా దేవునిలాగే మీకు కూడా పక్షపాతం లేదని చూపించండి. సంఘంలో ఐక్యతను నెలకొల్పడం ద్వారా దేవునిలాగే శాంతిని, క్రమపద్ధతిని ప్రేమిస్తున్నారని చూపించండి. యెహోవా ఏర్పాటు చేస్తున్న ఆధ్యాత్మిక విందు నుండి పూర్తి ప్రయోజనం పొందడం ద్వారా మీ మహాగొప్ప ఉపదేశకుడు చెప్పేది వినండి. అలాచేస్తే, ఈ సాతాను లోకం అంతానికి చేరుకున్నప్పుడు, మీరు ఏమాత్రం భయపడకుండా యెహోవా సంస్థతో కలిసి నమ్మకంగా, ధైర్యంగా సేవచేస్తూ ఉంటారు.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

^ పేరా 5 నేడు యెహోవా తన సంస్థను నడిపిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? యెహోవా మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘాన్ని ఎలా నడిపించాడో, నేడు తన ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 1 పదాల వివరణ: యెహోవా విశ్వవ్యాప్త సంస్థలో పరలోక భాగం, భూభాగం రెండూ ఉన్నాయి. ఈ ఆర్టికల్‌లో “సంస్థ” అనే పదం, భూభాగాన్ని సూచిస్తోంది.

^ పేరా 52 చిత్రాల వివరణ: వీడియోలు చూసి అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేస్తున్న వాళ్ల గురించి తెలుసుకున్నాక, ఒక పయినీరు సహోదరి వాళ్లలాగే సేవచేయాలని కోరుకుంటోంది. తర్వాత ఆమె తన లక్ష్యాన్ని చేరుకుని, అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేస్తోంది.