కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 42

విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 2వ భాగం

విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 2వ భాగం

“నీ మీద, నీ బోధ మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టు.”—1 తిమో. 4:16.

పాట 77 చీకటి లోకంలో వెలుగు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. శిష్యుల్ని చేసే పని ప్రజల ప్రాణాల్ని కాపాడుతుందని ఎలా చెప్పవచ్చు?

శిష్యుల్ని చేసే పని ప్రజల ప్రాణాల్ని కాపాడుతుంది! అలాగని ఎలా చెప్పవచ్చు? మత్తయి 28:19, 20 లో యేసు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “మీరు వెళ్లి . . . శిష్యుల్ని చేయండి; . . .  వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి.” బాప్తిస్మం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యం అంటే, రక్షణ పొందడానికి అది తప్పనిసరి. యేసు మనకోసం చనిపోయి, పునరుత్థానం అవ్వడం వల్లే రక్షణ సాధ్యమైందని బాప్తిస్మం తీసుకోవాలనుకునే వ్యక్తి నమ్మాలి. అందుకే అపొస్తలుడైన పేతురు తోటి క్రైస్తవులతో ఇలా అన్నాడు: “బాప్తిస్మం . . . యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది.” (1 పేతు. 3:21) కాబట్టి ఒకవ్యక్తి బాప్తిస్మం తీసుకుని యేసుకు శిష్యుడైనప్పుడు, అతను రక్షణ మార్గంలోకి అడుగుపెడతాడు.

2. రెండో తిమోతి 4:1, 2 నుండి బోధకులమైన మనం ఏం నేర్చుకోవచ్చు?

2 శిష్యుల్ని చేసే పని కోసం మనం ‘బోధనాకళను’ అలవర్చుకోవాలి. (2 తిమోతి 4:1, 2 చదవండి.) ఎందుకు? యేసు ఇలా ఆజ్ఞాపించాడు: ‘మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి; వాళ్లకు నేర్పించండి [లేదా, బోధించండి].’ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “నీ బోధ మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టు. . . . పట్టుదల చూపించు, అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ వినేవాళ్లను కూడా రక్షిస్తావు.” (1 తిమో. 4:16) శిష్యుల్ని చేసే పనికి, బోధనా పనికి సంబంధం ఉంది కాబట్టి మన బోధనా నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవాలని కోరుకుంటాం.

3. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 మనం ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటిమందితో బైబిలు స్టడీ చేస్తున్నాం. అయితే వాళ్లలో ఎక్కువమంది బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు శిష్యులవ్వాలంటే, మనం ఏయే విషయాల మీద దృష్టిపెట్టాలో ముందటి ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయడానికి ప్రతీ బోధకుడు చేయాల్సిన ఇంకో ఐదు పనుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

బైబిల్నే మాట్లాడనివ్వండి

బైబిల్నే మాట్లాడనిచ్చేలా స్టడీ చేయడానికి మీకు సహాయం చేయమని అనుభవంగల బోధకుల్ని అడగండి (4-6 పేరాలు చూడండి) *

4. స్టడీ చేస్తున్నప్పుడు బోధకుడు ఆత్మనిగ్రహం ఎందుకు చూపించాలి? (అధస్సూచి కూడా చూడండి.)

4 మనం బోధించే బైబిలు విషయాల్ని ఎంతో ప్రేమిస్తాం. కాబట్టి వాటి గురించి ఎక్కువగా మాట్లాడేస్తుంటాం. అయితే కావలికోట అధ్యయనం గానీ, సంఘ బైబిలు అధ్యయనం గానీ, బైబిలు స్టడీ గానీ చేస్తున్నప్పుడు బోధకులు ఎక్కువగా మాట్లాడకూడదు. బైబిల్నే మాట్లాడనివ్వాలంటే బోధకుడు ఆత్మనిగ్రహం చూపించాలి, బైబిల్లో ఫలానా వచనం లేదా విషయం గురించి తనకు తెలిసిన ప్రతీది వివరించడానికి ప్రయత్నించకూడదు. * (యోహా. 16:12) ఇప్పుడు మీకున్న బైబిలు జ్ఞానాన్ని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఉన్న బైబిలు జ్ఞానంతో పోల్చుకోండి. బహుశా అప్పుడు మీకు బైబిల్లోని ప్రాథమిక విషయాలు మాత్రమే తెలిసుంటాయి. (హెబ్రీ. 6:1) ఇప్పుడున్న బైబిలు జ్ఞానాన్ని సంపాదించడానికి మీకు కొన్ని సంవత్సరాలు పట్టివుంటుంది. కాబట్టి విద్యార్థికి అన్నీ ఒకేసారి చెప్పేయడానికి ప్రయత్నించకండి.

5. (ఎ) మొదటి థెస్సలొనీకయులు 2:13 ప్రకారం, విద్యార్థి ఏం గ్రహించాలన్నది మన కోరిక? (బి) నేర్చుకుంటున్న విషయాల గురించి మీతో మాట్లాడేలా విద్యార్థిని ఎలా ప్రోత్సహించవచ్చు?

5 తను నేర్చుకుంటున్న విషయాలన్నీ దేవుని వాక్యంలోనివే అని విద్యార్థి గ్రహించాలన్నది మన కోరిక. (1 థెస్సలొనీకయులు 2:13 చదవండి.) అందుకోసం మీరు ఏం చేయవచ్చు? తను నేర్చుకుంటున్న విషయాల గురించి మీతో మాట్లాడమని విద్యార్థిని ప్రోత్సహించండి. ప్రతీసారి బైబిలు వచనాల్ని మీరే వివరించే బదులు, కొన్ని వచనాల్ని వివరించమని విద్యార్థిని అడగండి. దేవుని వాక్యంలోని విషయాలు తనకెలా వర్తిస్తాయో ఆలోచించుకునేలా విద్యార్థికి సహాయం చేయండి. చదివిన వచనాల గురించి అతని అభిప్రాయం ఏంటో, అతను ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడగండి. (లూకా 10:25-28) ఉదాహరణకు ఈ ప్రశ్నలు అడగవచ్చు: “ఈ వచనంలో యెహోవాకున్న ఏ లక్షణాన్ని మీరు గమనించారు? ఈ బైబిలు సూత్రం మీకెలా ఉపయోగపడుతుంది? నేర్చుకున్న ఈ విషయాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది?” (సామె. 20:5) విద్యార్థి ఎంత తెలుసుకున్నాడన్నది ముఖ్యం కాదుగానీ తెలుసుకున్న వాటిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా పాటిస్తున్నాడు అన్నదే ముఖ్యం.

6. స్టడీకి మనతోపాటు అనుభవంగల బోధకుల్ని తీసుకెళ్లడం ఎందుకు మంచిది?

6 మీ బైబిలు స్టడీకి అనుభవంగల బోధకుల్ని ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఒకవేళ తీసుకెళ్తే, మీరు స్టడీ సరిగ్గా చేస్తున్నారో లేదో, బైబిల్నే మాట్లాడనిస్తున్నారో లేదో చెప్పమని వాళ్లను అడగండి. మీ బోధనా నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవాలంటే మీరు వినయంగా వాళ్ల సహాయం తీసుకోవాలి. (అపొస్తలుల కార్యాలు 18:24-26 తో పోల్చండి.) తర్వాత, విద్యార్థి సత్యాన్ని గ్రహిస్తున్నట్టు అనిపించిందో లేదో ఆ అనుభవంగల బోధకుల్ని అడగండి. అంతేకాదు మీరు ఎప్పుడైనా ఒకట్రెండు వారాలు వేరే ఊరికి వెళ్తే, బైబిలు స్టడీ చేయమని ఆ అనుభవంగల బోధకున్నే అడగండి. దానివల్ల స్టడీ ఒక్కవారం కూడా ఆగకుండా కొనసాగుతుంది, స్టడీ ఎంత ప్రాముఖ్యమైనదో విద్యార్థికి అర్థమౌతుంది. ‘ఇది నా స్టడీ, నేను తప్ప ఇంకెవ్వరూ చేయకూడదు’ అని అనుకోకండి. నిజానికి, విద్యార్థి సత్యాన్ని ఇంకా ఎక్కువగా నేర్చుకుంటూ ఉండేలా అతనికి ఏది మంచిదో అదే చేయాలని మీరు కోరుకుంటారు.

ఉత్సాహంతో, బలమైన నమ్మకంతో బోధించండి

బైబిలు సూత్రాలు పాటించడం ఎంత తెలివైనదో గ్రహించేలా మీ విద్యార్థికి నిజ జీవిత అనుభవాలు చెప్పండి (7-9 పేరాలు చూడండి) *

7. నేర్చుకుంటున్న విషయాల్ని విద్యార్థి ప్రేమించాలంటే మనం ఏం చేయాలి?

7 మీ ఉత్సాహం, బైబిలు సత్యాల పట్ల మీకున్న బలమైన నమ్మకం విద్యార్థికి కనిపించాలి. (1 థెస్స. 1:5) అప్పుడు, అతను నేర్చుకుంటున్న విషయాల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతాడు. బైబిలు సూత్రాల ప్రకారం జీవించడం వల్ల మీరెలాంటి ప్రయోజనాలు పొందారో విద్యార్థికి చెప్పవచ్చు. దానివల్ల, బైబిల్లో ఉన్న సలహాల్ని పాటిస్తే తన జీవితం కూడా మెరుగౌతుందని విద్యార్థి అర్థంచేసుకుంటాడు.

8. మీ విద్యార్థికి సహాయం చేయడానికి మీరు ఇంకా ఏం చేయవచ్చు? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?

8 స్టడీ చేస్తున్నప్పుడు, విద్యార్థికి ఉన్న లాంటి సమస్యల్నే ఎదుర్కొని వాటిని అధిగమించిన సహోదర సహోదరీల అనుభవాలు చెప్పండి. మీ సంఘంలో ఎవరి ఆదర్శం నుండి విద్యార్థి ప్రయోజనం పొందే అవకాశం ఉందో, అలాంటి వాళ్లను మీతోపాటు తీసుకెళ్లవచ్చు. లేదా jw.org వెబ్‌సైట్‌లో “బైబిలు జీవితాల్ని మారుస్తుంది * కింద ఉన్న ప్రోత్సాహకరమైన అనుభవాల్ని చెప్పవచ్చు. బైబిలు సూత్రాలు పాటించడం ఎంత తెలివైనదో గ్రహించడానికి ఆ ఆర్టికల్స్‌, వీడియోలు మీ విద్యార్థికి సహాయం చేస్తాయి.

9. నేర్చుకుంటున్న విషయాల్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోమని విద్యార్థిని ఎలా ప్రోత్సహించవచ్చు?

9 విద్యార్థికి పెళ్లయి, భార్యాభర్తల్లో ఒక్కరు మాత్రమే స్టడీ తీసుకుంటుంటే, వాళ్ల వివాహజతను కూడా స్టడీలో కూర్చోమని ఆహ్వానించండి. నేర్చుకుంటున్న విషయాల్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోమని విద్యార్థిని ప్రోత్సహించండి. (యోహా. 1:40-45) ఎలా ప్రోత్సహించవచ్చు? బహుశా మీరు విద్యార్థిని ఈ ప్రశ్నలు అడగవచ్చు: “ఈ సత్యాన్ని మీ కుటుంబ సభ్యులకు ఎలా వివరిస్తారు? ఈ విషయాన్ని నిరూపించడానికి మీ స్నేహితులకు ఏ లేఖనం చూపిస్తారు?” అలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా బోధకులయ్యేలా మీ విద్యార్థికి శిక్షణ ఇవ్వవచ్చు. తర్వాత అతను అర్హత సాధించినప్పుడు, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా పరిచర్య చేయడం మొదలుపెట్టవచ్చు. అంతేకాదు, అతనికి తెలిసిన వాళ్లెవరికైనా బైబిలు విషయాల పట్ల ఆసక్తి ఉందేమో అడిగి తెలుసుకోండి. వాళ్లను వెంటనే కలిసి బైబిలు స్టడీ గురించి వివరించండి, బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? * వీడియో చూపించండి.

సంఘంలో స్నేహితుల్ని సంపాదించుకోమని విద్యార్థిని ప్రోత్సహించండి

సంఘంలోని సహోదర సహోదరీలతో స్నేహం చేయమని విద్యార్థిని ప్రోత్సహించండి (10-11 పేరాలు చూడండి) *

10. మొదటి థెస్సలొనీకయులు 2:7, 8 చెప్తున్నట్టు, బోధకులు పౌలు ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు?

10 బోధకులు తమ విద్యార్థుల పట్ల నిజమైన శ్రద్ధ చూపించాలి. వాళ్లను కాబోయే ఆధ్యాత్మిక సహోదర సహోదరీల్లా చూడాలి. (1 థెస్సలొనీకయులు 2:7, 8 చదవండి.) లోకంలో ఉన్న స్నేహితుల్ని విడిచిపెట్టడం, యెహోవాను సేవించడానికి కావల్సిన మార్పులన్నీ చేసుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి వాళ్లకు సంఘంలో నిజమైన స్నేహితులు దొరికేలా మనం సహాయం చేయాలి. స్టడీ అప్పుడే కాకుండా మిగతా సందర్భాల్లో కూడా మీ విద్యార్థితో సమయం గడపడం ద్వారా అతనికి ఒక స్నేహితునిగా ఉండండి. ఫోన్‌ చేయడం, మెసేజ్‌ చేయడం లేదా అప్పుడప్పుడు వెళ్లి పలకరించడం ద్వారా మీకు వాళ్లంటే నిజంగా శ్రద్ధ ఉందని చూపించండి.

11. సంఘం ద్వారా విద్యార్థి ఏం పొందాలని మనం కోరుకుంటాం? ఎందుకు?

11 సాధారణంగా ఒక పిల్లవాడు పెరిగి ప్రయోజకుడు అవ్వాలంటే, తల్లిదండ్రులతో పాటు చుట్టూ ఉన్న సమాజం కూడా అతని మీద మంచి ప్రభావం చూపించాలి. అదేవిధంగా ఒక విద్యార్థి శిష్యుడు అవ్వాలంటే, స్టడీ ఇచ్చిన వ్యక్తితోపాటు సంఘమంతా అతని మీద శ్రద్ధ చూపించాలి. అందుకే సమర్థవంతమైన బోధకులు తమ విద్యార్థిపై మంచి ప్రభావం చూపించగల ప్రచారకుల్ని అతనికి పరిచయం చేస్తారు. దానివల్ల సహోదర సహోదరీలతో సహవసించే అవకాశం విద్యార్థికి దొరుకుతుంది. యెహోవాతో ఉన్న స్నేహాన్ని బలపర్చుకునేలా, సమస్యల్ని అధిగమించేలా వాళ్లు విద్యార్థికి సహాయం చేస్తారు. సంఘంలో, మన ఆధ్యాత్మిక కుటుంబంలో తాను కూడా ఒక భాగమని ప్రతీ విద్యార్థి గుర్తించాలన్నది మన కోరిక. విద్యార్థి ప్రేమగల మన సహోదర సహోదరీలకు దగ్గరవ్వాలని మనం కోరుకుంటాం. అప్పుడు లోకంలోని స్నేహితుల్ని, అంటే యెహోవాను ప్రేమించడానికి ఏమాత్రం సహాయపడని స్నేహితుల్ని విడిచిపెట్టడం అతనికి తేలికౌతుంది. (సామె. 13:20) ఇంతకాలం ఉన్న స్నేహితులు దూరమైనా, తనకు యెహోవా సంస్థలో నిజమైన స్నేహితులు దొరుకుతారని అతనికి తెలుసు.—మార్కు 10:29, 30; 1 పేతు. 4:4.

సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం గురించి ఎప్పుడూ మాట్లాడండి

బైబిలు విద్యార్థి ఒక్కో అడుగు వేస్తూ, బాప్తిస్మం తీసుకోవాలనే తన లక్ష్యాన్ని చేరుకోవచ్చు! (12-13 పేరాలు చూడండి)

12. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం గురించి విద్యార్థితో తరచూ ఎందుకు మాట్లాడాలి?

12 సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో విద్యార్థికి తరచూ చెప్తూ ఉండండి. ఎందుకంటే మనం స్టడీ చేయడానికి గల ఉద్దేశమే, విద్యార్థి బాప్తిస్మం తీసుకుని క్రీస్తు శిష్యుడయ్యేలా సహాయం చేయడం. స్టడీ ప్రారంభించిన కొన్ని నెలలకు, ముఖ్యంగా విద్యార్థి మీటింగ్స్‌కి రావడం మొదలుపెట్టాక స్టడీ ఉద్దేశం ఏంటో అతను గ్రహించాలి.

13. బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకోవాలనే తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడు?

13 బైబిలు విద్యార్థి ఒక్కో అడుగు వేస్తూ, బాప్తిస్మం తీసుకోవాలనే తన లక్ష్యాన్ని చేరుకోవచ్చు! మొదటిగా, విద్యార్థి యెహోవాను తెలుసుకుని, ఆయన్ని ప్రేమించి, ఆయన మీద విశ్వాసం ఉంచుతాడు. (యోహా. 3:16; 17:3) తర్వాత యెహోవాకు, సంఘంలోని సహోదర సహోదరీలకు స్నేహితుడౌతాడు. (హెబ్రీ. 10:24, 25; యాకో. 4:8) ఆ తర్వాత చెడు అలవాట్లను మానుకుని, తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడతాడు. (అపొ. 3:19) అంతేకాదు తాను నమ్ముతున్న వాటిని ఇతరులకు చెప్తాడు. (2 కొరిం. 4:13) చివరిగా తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, దానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకుంటాడు. (1 పేతు. 3:21; 4:2) అది అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చే రోజు! విద్యార్థి బాప్తిస్మం వైపు ఒక్కో అడుగు వేస్తుండగా అతన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ ఉండండి, అతను చేస్తున్న కృషిని కొనసాగించమని ప్రోత్సహిస్తూ ఉండండి.

ఎప్పటికప్పుడు విద్యార్థి ప్రగతిని పరిశీలిస్తూ ఉండండి

14. విద్యార్థి ప్రగతి సాధిస్తున్నాడో లేదో మనం ఎలా తెలుసుకోవచ్చు?

14 సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా విద్యార్థికి సహాయం చేస్తున్నప్పుడు మనం ఓపిక చూపించాలి. అయితే, అసలు యెహోవా దేవున్ని సేవించాలనే కోరిక అతనికి ఉందో లేదో కూడా మనం గమనించాలి. యేసు ఆజ్ఞలకు లోబడడానికి అతను ప్రయత్నిస్తున్నట్టు మీరు గుర్తించారా? లేదా అతను కేవలం బైబిలు జ్ఞానం పెంచుకోవాలనుకుంటున్నాడా?

15. విద్యార్థి ఎంతవరకు ప్రగతి సాధించాడో తెలుసుకోవడానికి ఏయే విషయాలు గమనించాలి?

15 విద్యార్థి ఎంతవరకు ప్రగతి సాధించాడో క్రమంగా పరిశీలిస్తూ ఉండండి. ఉదాహరణకు, అతను యెహోవా మీద తనకున్న ప్రేమను తెలియజేస్తున్నాడా? యెహోవాకు ప్రార్థిస్తున్నాడా? (కీర్త. 116:1, 2) బైబిలు చదవడాన్ని ఆనందిస్తున్నాడా? (కీర్త. 119:97) మీటింగ్స్‌కి క్రమంగా వస్తున్నాడా? (కీర్త. 22:22) తన జీవితంలో అవసరమైన మార్పులు చేసుకుంటున్నాడా? (కీర్త. 119:112) నేర్చుకుంటున్న విషయాల్ని తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకుంటున్నాడా? (కీర్త. 9:1) అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాసాక్షి అవ్వాలని కోరుకుంటున్నాడా? (కీర్త. 40:8) వీటిలో ఏ విషయంలోనైనా విద్యార్థి ప్రగతి సాధించకపోతుంటే, అందుకు కారణమేంటో తెలుసుకోవడానికి నేర్పుగా ప్రయత్నించండి. తర్వాత దాని గురించి అతనితో దయగా, నిర్మొహమాటంగా మాట్లాడండి. *

16. విద్యార్థితో బైబిలు స్టడీ కొనసాగించాలో వద్దో ఎలా నిర్ణయించుకోవచ్చు?

16 విద్యార్థితో బైబిలు స్టడీ కొనసాగించాలా వద్దా అనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి. విద్యార్థి స్టడీకి సిద్ధపడట్లేదా? మీటింగ్స్‌కి రావడానికి ఇష్టపడట్లేదా? చెడు అలవాట్లు మానుకోవట్లేదా? అబద్ధమతాన్ని ఇంకా విడిచిపెట్టలేదా? అయితే ఆ స్టడీని కొనసాగించడం అనేది, అసలు నీళ్లలోకి దిగడమే ఇష్టంలేని వ్యక్తికి ఈత నేర్పిస్తున్నట్టుగా ఉంటుంది. విద్యార్థి నేర్చుకుంటున్న విషయాల్ని నిజంగా ప్రేమించనప్పుడు, మార్పులు చేసుకోవడానికి ఇష్టపడనప్పుడు ఆ స్టడీ కొనసాగించడంలో అర్థంలేదు.

17. మొదటి తిమోతి 4:16 ప్రకారం, బైబిలు బోధకులందరూ ఏం చేయాలి?

17 శిష్యుల్ని చేసే పనిని మనం చాలా ప్రాముఖ్యమైన బాధ్యతగా ఎంచుతాం. మన బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయాలనుకుంటాం. అందుకే మనం బైబిల్నే మాట్లాడనిస్తాం, ఉత్సాహంతో-బలమైన నమ్మకంతో బోధిస్తాం. సంఘంలో ఉన్న సహోదర సహోదరీలతో స్నేహం చేయమని విద్యార్థిని ప్రోత్సహిస్తాం. అంతేకాదు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం గురించి తరచూ మాట్లాడతాం, విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాం. (“ బాప్తిస్మం తీసుకునేలా విద్యార్థికి సహాయం చేయాలంటే బోధకులు ఏం చేయాలి?” బాక్సు చూడండి.) ప్రాణాల్ని కాపాడే ఈ పనిలో పాల్గొనే అవకాశం దొరికినందుకు మనం ఎంతో సంతోషిస్తాం! కాబట్టి, మన విద్యార్థులు ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీలు చేయడానికి శాయశక్తులా కృషిచేద్దాం.

పాట 79 వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

^ పేరా 5 బైబిలు స్టడీలు చేస్తున్నప్పుడు, యెహోవా కోరుకుంటున్న విధంగా ఆలోచించేలా, భావించేలా, ప్రవర్తించేలా విద్యార్థులకు నేర్పించే గొప్ప అవకాశం మనకు ఉంటుంది. మన బోధనా నైపుణ్యాల్ని ఇంకా ఎలా మెరుగుపర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 4 సెప్టెంబరు 2016 మీటింగ్‌ వర్క్‌బుక్‌లో వచ్చిన “బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయకండి” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 8 మా గురించి > యెహోవాసాక్షుల అనుభవాలు కింద చూడండి.

^ పేరా 9 JW లైబ్రరీలో మీడియా > మా కూటాలు, పరిచర్య > పరిచర్య కోసం పనిముట్లు కింద చూడండి.

^ పేరా 77 చిత్రాల వివరణ: స్టడీ అయిపోయాక అనుభవంగల సహోదరి తనను స్టడీకి తీసుకెళ్లిన సహోదరికి, తనే ఎక్కువగా మాట్లాడకుండా ఎలా బోధించవచ్చో చెప్తోంది.

^ పేరా 79 చిత్రాల వివరణ: ఒక మంచి భార్యగా ఎలా ఉండవచ్చో విద్యార్థి స్టడీలో నేర్చుకుంటోంది. తర్వాత, నేర్చుకున్న విషయాల్ని భర్తతో పంచుకుంటోంది.

^ పేరా 81 చిత్రాల వివరణ: రాజ్యమందిరంలో పరిచయమైన ఒక సహోదరి ఇంట్లో, విద్యార్థి అలాగే ఆమె భర్త సంతోషంగా సమయం గడుపుతున్నారు.