కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యూరప్‌ పర్యటనలో సహోదరుడు జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌, ఇతర సహోదరులు

1920​— వంద సంవత్సరాల క్రితం

1920​— వంద సంవత్సరాల క్రితం

1920 మొదలుకొని, యెహోవా ప్రజలు తమ ముందున్న పనిని ఉత్సాహంగా చేయడానికి సిద్ధమయ్యారు. 1920 సంవత్సరం కోసం వాళ్లు ఎంచుకున్న వార్షిక వచనం: “ప్రభువే నా బలం, నా గానం.”—కీర్త. 118:14, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌.

ఉత్సాహవంతులైన ఆ ప్రచారకుల్ని యెహోవా బలపర్చాడు. ఆ సంవత్సరంలో కల్‌పోర్చర్ల (పయినీర్ల) సంఖ్య 225 నుండి 350కి పెరిగింది. అంతేకాదు, ముందెన్నడూ లేని విధంగా 8,000 కన్నా ఎక్కువమంది క్లాస్‌ వర్కర్లు (ప్రచారకులు) తమ క్షేత్ర సేవను ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేశారు. యెహోవా వాళ్ల ప్రయత్నాల్ని మెండుగా ఆశీర్వదించాడు.

సాటిలేని ఉత్సాహం చూపించడం

ఆ కాలంలో బైబిలు విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్న జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ 1920, మార్చి 21న “ఇప్పుడు జీవిస్తున్న లక్షలమంది ఇక ఎన్నడూ మరణించరు” అనే అంశం మీద ప్రసంగించాడు. ఆ ప్రసంగానికి ఆసక్తిపరులను ఆహ్వానించడం కోసం బైబిలు విద్యార్థులు శాయశక్తులా కృషిచేశారు. వాళ్లు న్యూయార్క్‌ నగరంలో ఒక పెద్ద థియేటర్‌ను అద్దెకు తీసుకున్నారు, దాదాపు 3,20,000 ఆహ్వాన ప్రతుల్ని పంచిపెట్టారు.

“ఇప్పుడు జీవిస్తున్న లక్షలమంది ఇక ఎన్నడూ మరణించరు” అనే ప్రసంగం గురించి వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన

దానికి ప్రజల నుండి ఊహించని స్పందన వచ్చింది. 5,000 కన్నా ఎక్కువమందితో ఆ థియేటర్‌ కిక్కిరిసిపోయింది, ఇంకో 7,000 మంది ఖాళీ లేక వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. “అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు నిర్వహించిన అత్యంత విజయవంతమైన కూటాల్లో ఇదొకటి” అని ద వాచ్‌ టవర్‌ పత్రిక చెప్పింది.

“ఇప్పుడు జీవిస్తున్న లక్షలమంది ఇక ఎన్నడూ మరణించరు” అని ప్రచారం చేయడంలో బైబిలు విద్యార్థులు బాగా పేరుగాంచారు. రాజ్య సందేశం మరింత విస్తృతంగా ప్రకటించబడాల్సి ఉందని అప్పటికింకా వాళ్లకు తెలీదు. అయినప్పటికీ వాళ్లు సాటిలేని ఉత్సాహం చూపించారు. 1902 లో కూటాలకు హాజరవ్వడం మొదలుపెట్టిన ఇడ ఓల్మ్‌స్టెడ్‌ అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంది: “మనుషులందరి కోసం గొప్ప దీవెనలు వేచివున్నాయని మాకు తెలుసు, పరిచర్యలో కలిసిన వాళ్లందరికీ మేము దాని గురించి ప్రకటించాం.”

ప్రచురణల్ని సొంతగా ముద్రించడం

ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి బెతెల్‌లోని సహోదరులు కొన్ని ప్రచురణల్ని సొంతగా ముద్రించడం మొదలుపెట్టారు. వాళ్లు అందుకు కావల్సిన పరికరాల్ని కొని, 35 మార్టల్‌ ఎవెన్యూలోని అద్దె భవనంలో బిగించారు. అది న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బెతెల్‌కి కొన్ని అడుగుల దూరంలో ఉంది.

లియో పెల్‌, వాల్టర్‌ కెస్లర్‌ అనే ఇద్దరు సహోదరులు 1920 జనవరిలో బెతెల్‌లో సేవచేయడానికి వచ్చారు. వాల్టర్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు: “మేము రాగానే ప్రింటరీ ఓవర్‌సీర్‌ మా వైపు చూసి, ‘లంచ్‌కి ఇంకా గంటన్నర ఉంది, ఈలోపు బేస్‌మెంట్‌ నుండి కొన్ని పుస్తకాల బాక్సుల్ని తీసుకురండి’ అని చెప్పాడు.”

ఆ తర్వాతి రోజు ఏమైందో లియో చెప్పాడు: “భవనం మొదటి అంతస్తు గోడల్ని శుభ్రం చేసే పనిని మాకు అప్పగించారు. అంత మురికి పని నేనెప్పుడూ చేయలేదు. కానీ అది దేవుని పని కాబట్టి చాలా విలువైనది.”

ద వాచ్‌ టవర్‌ పత్రికను ముద్రించడానికి ఉపయోగించిన యంత్రం

కొన్ని వారాల్లోనే ఉత్సాహవంతులైన స్వచ్ఛంద సేవకులు ద వాచ్‌ టవర్‌ పత్రికను ముద్రించడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 1, 1920 ద వాచ్‌ టవర్‌ సంచిక అరవై వేల కాపీల్ని రెండవ అంతస్తులో ఉన్న యంత్రం మీద ముద్రించారు. ఈలోపు సహోదరులు బేస్‌మెంట్‌లో కూడా ఒక ముద్రణా యంత్రాన్ని ఏర్పాటు చేశారు, వాళ్లు దానికి యుద్ధనౌక అని పేరుపెట్టారు. ఏప్రిల్‌ 14, 1920 సంచిక నుండి ద గోల్డెన్‌ ఏజ్‌ పత్రికను కూడా అక్కడ ముద్రించడం మొదలుపెట్టారు. ఆ స్వచ్ఛంద సేవకుల కృషిని యెహోవా ఎంతగానో దీవించాడు.

“అది దేవుని పని కాబట్టి చాలా విలువైనది”

“శాంతిగా కలిసిమెలిసి ఉందాం”

యెహోవా నమ్మకమైన ప్రజలు కొత్త ఉత్సాహంతో సేవ చేస్తున్నారు, సహవాసాన్ని ఆనందిస్తున్నారు. కానీ కొంతమంది బైబిలు విద్యార్థులు 1917-1919 మధ్య ఉన్న కష్టకాలంలో సంస్థను విడిచిపెట్టి వెళ్లారు. మరి వాళ్లకెలా సహాయం అందింది?

ఏప్రిల్‌ 1, 1920 ద వాచ్‌ టవర్‌ సంచికలో “శాంతిగా కలిసిమెలిసి ఉందాం” అనే ఆర్టికల్‌ వచ్చింది. ఆ ఆర్టికల్‌ ప్రేమగా ఇలా ప్రోత్సహించింది: “దేవునికి లోబడాలని కోరుకునే వాళ్లందరూ తాము చేసిన తప్పుల్ని మర్చిపోయి, దేవుని ప్రజలతో కలిసి ఐక్యంగా పని చేస్తారని మేము నమ్ముతున్నాం.”

దయగల ఆ మాటలకు చాలామంది స్పందించారు. ఒక జంట ఇలా రాసింది: “మిగతా వాళ్లంతా ప్రకటనా పనిలో బిజీగా ఉంటే మేము మాత్రం సంవత్సరం కన్నా ఎక్కువకాలం పాటు ఖాళీగా కూర్చున్నాం. అది తప్పని మేము గ్రహించాం. . . . మళ్లీ ఎప్పుడూ ఇలా దేవుని ప్రజలకు దూరం కాకూడదని నిశ్చయించుకున్నాం.” తమ పనిని తిరిగి మొదలుపెట్టిన ఈ సేవకులు చేయాల్సింది చాలా ఉంది.

“ZG”ని పంచిపెట్టడం

1920, జూన్‌ 21న బైబిలు విద్యార్థులు “ZG”ని పంచిపెట్టడానికి ఒక పెద్ద ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. “ZG” అంటే ద ఫినిష్డ్‌ మిస్టరీ పుస్తకపు కాగితం అట్ట ఎడిషన్‌. * 1918 లో ఆ పుస్తకం నిషేధించబడినప్పుడు సహోదరులు దాని కాపీల్ని పెద్ద సంఖ్యలో దాచిపెట్టారు.

కల్‌పోర్చర్లే కాదు క్లాస్‌ వర్కర్లు అందరూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించబడ్డారు. “ప్రతీ సంఘంలో బాప్తిస్మం తీసుకున్న ప్రతీ వ్యక్తి ఇందులో సంతోషంగా పాల్గొనవచ్చు. మనందరి కర్తవ్యం ఇదే: ‘ZGని పంచిపెట్టడం.’” చాలామంది మొట్టమొదటిసారిగా ఇంటింటి పరిచర్యలో పాల్గొన్నది ఈ ప్రచార కార్యక్రమంలోనే అని ఎడ్మండ్‌ హూపర్‌ గుర్తుచేసుకున్నాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “ఈ పని మేము ఊహించిన దాని కన్నా చాలా విస్తృతంగా జరగబోతుందని మాకు అర్థమైంది.”

యూరప్‌లో పనిని తిరిగి వ్యవస్థీకరించడం

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వేరే దేశాల్లోని బైబిలు విద్యార్థులతో సంప్రదింపులు జరపడం కష్టంగా మారింది. వాళ్లను ప్రోత్సహించాలని, ప్రకటనా పనిని తిరిగి వ్యవస్థీకరించాలని సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ కోరుకున్నాడు. కాబట్టి 1920, ఆగస్టు 12న రూథర్‌ఫర్డ్‌ అలాగే ఇంకో నలుగురు సహోదరులు బ్రిటన్‌, యూరప్‌, మధ్య ప్రాచ్య దేశాల్లో విస్తృతంగా పర్యటించడానికి వెళ్లారు.

ఈజిప్టులో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌

సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ బ్రిటన్‌కు వెళ్లినప్పుడు, అక్కడి బైబిలు విద్యార్థులు మూడు సమావేశాల్ని, 12 బహిరంగ కూటాల్ని ఏర్పాటు చేశారు. వాటికి మొత్తం 50,000 మంది హాజరయ్యారని అంచనా. ఆ పర్యటన గురించి ద వాచ్‌ టవర్‌ పత్రిక ఇలా చెప్పింది: “సహోదర సహోదరీలు సేదదీర్పును, ప్రోత్సాహాన్ని పొందారు. వాళ్లు ఒకరితోఒకరు సహవసించడం వల్ల, కలిసి పనిచేయడం వల్ల సంతోషించారు.” ప్యారిస్‌లో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ “ఇప్పుడు జీవిస్తున్న లక్షలమంది ఇక ఎన్నడూ మరణించరు” అనే అంశం మీద మళ్లీ ప్రసంగించాడు. ప్రసంగం మొదలయ్యే సమయానికి హాలు కిక్కిరిసిపోయింది. 300 మంది ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు.

లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాలులో ఇవ్వబోయే ప్రసంగానికి సంబంధించిన పోస్టర్‌

ఆ తర్వాతి వారాల్లో కొంతమంది సహోదరులు ఏథెన్స్‌, కైరో, యెరూషలేముల్ని సందర్శించారు. ఆ ప్రాంతాల్లోని ఆసక్తిపరుల కోసం సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ యెరూషలేము దగ్గరున్న రామాలా అనే పట్టణంలో సాహిత్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత యూరప్‌కు తిరిగెళ్లి సెంట్రల్‌ యూరోపియన్‌ బ్రాంచి కార్యాలయాన్ని స్థాపించి, ప్రచురణలు ముద్రించబడేందుకు ఏర్పాటు చేశాడు.

అన్యాయాన్ని బట్టబయలు చేయడం

1920, సెప్టెంబరులో బైబిలు విద్యార్థులు ద గోల్డెన్‌ ఏజ్‌ No. 27 ప్రత్యేక సంచికను విడుదల చేశారు. 1918 లో బైబిలు విద్యార్థులు ఎదుర్కొన్న హింసను ఆ సంచిక వెల్లడిచేసింది. సహోదరులు రాత్రింబగళ్లు పనిచేసి, ముందు పేర్కొన్న యుద్ధనౌక అనే యంత్రం మీద ఆ సంచిక నలభై లక్షల కాపీల్ని ముద్రించారు.

పోలీసు ఫైల్‌లోని ఎమ్మా మార్టిన్‌ ఫోటో

ఆ పత్రిక వల్ల సహోదరి ఎమ్మా మార్టిన్‌ కేసు గురించి పాఠకులు తెలుసుకోగలిగారు. సహోదరి మార్టిన్‌ కాలిఫోర్నియాలోని శాన్‌ బెర్నార్డినోలో కల్‌పోర్చర్‌గా సేవచేసింది. 1918, మార్చి 17న ఆమె అలాగే ఇ. హామ్‌, ఇ. జె. సోనెన్‌బర్గ్‌, ఇ. ఎ. స్టీవెన్స్‌ అనే ముగ్గురు సహోదరులు బైబిలు విద్యార్థుల ఒక చిన్న కూటానికి హాజరయ్యారు.

కానీ ఆ కూటానికి హాజరైన వాళ్లలో ఒకవ్యక్తి మాత్రం బైబిలు గురించి నేర్చుకోవడానికి రాలేదు. అతను ఆ తర్వాత ఇలా చెప్పాడు: “కోర్టు కేసులకు సంబంధించిన ఒక ప్రభుత్వ కార్యాలయం నిర్దేశం మేరకు, సాక్ష్యాధారాలు సేకరించడం కోసం నేను ఆ కూటానికి వెళ్లాను.” అతను వెతుకుతున్న “సాక్ష్యాధారం” దొరికింది, అదే ద ఫినిష్డ్‌ మిస్టరీ పుస్తకం. కొన్ని రోజుల తర్వాత సహోదరి మార్టిన్‌ను, ఆ ముగ్గురు సహోదరుల్ని అరెస్టు చేశారు. నిషేధించబడిన పుస్తకాన్ని పంచిపెడుతూ ప్రభుత్వ చట్టాన్ని మీరారని వాళ్లమీద నేరారోపణ చేశారు.

కోర్టు సహోదరి మార్టిన్‌ను, ఆ ముగ్గురు సహోదరుల్ని దోషులుగా తీర్పు తీర్చి, మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎన్నిసార్లు అప్పీలు చేసుకున్నా తీర్పు మారకపోవడంతో 1920, మే 17న వాళ్ల జైలు శిక్ష మొదలైంది. అయితే కొన్ని రోజుల తర్వాత మంచి మార్పు వచ్చింది.

1920, జూన్‌ 20న సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఆ అనుభవాన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక సమావేశంలో చెప్పాడు. అది తెలుసుకున్న ప్రేక్షకులు ఎంతో కలవరపడి, అమెరికా ప్రెసిడెంట్‌కు ఒక టెలిగ్రామ్‌ పంపారు. అందులో ఇలా రాశారు: ‘గూఢచర్యం చట్టం కింద శ్రీమతి మార్టిన్‌ను దోషిగా తీర్పు తీర్చడం అన్యాయం. అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి, శ్రీమతి మార్టిన్‌ను ఒక పథకం ప్రకారం ఉచ్చులోకి లాగారు. ఆమె మీద అన్యాయంగా కేసు నమోదు చేసి, జైలు శిక్ష పడేలా చేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం.’

ఆ తర్వాతి రోజే అమెరికా ప్రెసిడెంట్‌ ఉడ్రో విల్సన్‌ సహోదరి మార్టిన్‌కు, హామ్‌, సోనెన్‌బర్గ్‌, స్టీవెన్స్‌ అనే ముగ్గురు సహోదరులకు క్షమాభిక్ష పెట్టాడు. దాంతో అన్యాయంగా వాళ్లకు విధించిన జైలు శిక్ష ముగిసింది.

1920 ముగింపుకు వచ్చేసరికి, బైబిలు విద్యార్థులు జరిగిన వాటన్నిటిని బట్టి ఎంతో సంతోషించారు. ప్రధాన కార్యాలయంలో పని మరింత విస్తృతంగా జరిగింది, మనుషుల సమస్యలకు పరిష్కారం దేవుని రాజ్యమేనని బైబిలు విద్యార్థులు ముందెన్నడూ లేనంత చురుగ్గా ప్రకటించారు. (మత్త. 24:14) తర్వాతి సంవత్సరంలో, అంటే 1921 లో రాజ్య సత్యం మరింత విస్తృతంగా ప్రకటించబడబోతోంది.

^ పేరా 18 ద ఫినిష్డ్‌ మిస్టరీ అనేది స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ పుస్తకాల్లో ఏడవ సంపుటి. కాగితం అట్టతో ముద్రించబడిన “ZG,” మార్చి 1, 1918 ద వాచ్‌ టవర్‌ సంచికగా విడుదలైంది. “Z” అనే అక్షరం జాయన్స్‌ వాచ్‌ టవర్‌ను, “G” అనేది ఇంగ్లీషు అక్షరాల్లో ఏడవది కాబట్టి ఏడవ సంపుటిని సూచిస్తుంది.