కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 42

ఇదే సత్యం అని నమ్మి, దాన్ని గట్టిగా పట్టుకోండి

ఇదే సత్యం అని నమ్మి, దాన్ని గట్టిగా పట్టుకోండి

“అన్నిటినీ పరీక్షించి, ఏది మంచిదో నిర్ధారించుకోండి, దాన్ని గట్టిగా పట్టుకోండి.”—1 థెస్స. 5:21.

పాట 142 మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. చాలామందికి ఏ సందేహం వస్తోంది? ఎందుకు?

 క్రైస్తవులమని చెప్పుకునే మతాలు నేడు వేల సంఖ్యలో ఉన్నాయి, అవన్నీ దేవుణ్ణి సరైన పద్ధతిలో ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నాయి. దానివల్ల చాలామందికి, “నిజమైన మతం ఒక్కటే ఉందా లేక అన్ని మతాలూ సరైనవేనా?” అనే సందేహం వస్తోంది. మరి మన సంగతేంటి? యెహోవాసాక్షులు ఆరాధిస్తున్న పద్ధతి సరైనదని, వాళ్లు బోధిస్తున్నది సత్యమని మనం బలంగా నమ్ముతున్నామా? అలా నమ్మడానికి ఏవైనా రుజువులు ఉన్నాయా? ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం.

2. మొదటి థెస్సలొనీకయులు 1:5 ప్రకారం, పౌలు తాను బోధిస్తున్నది సత్యం అని ఎందుకు బలంగా నమ్మాడు?

2 తాను బోధిస్తున్నది సత్యం అని అపొస్తలుడైన పౌలు బలంగా నమ్మాడు. (1 థెస్సలొనీకయులు 1:5 చదవండి.) కేవలం తనకు నచ్చినందుకు ఆయన దాన్ని నమ్మలేదు గానీ, ఆయన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేశాడు. “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు” అని ఆయన నమ్మాడు. (2 తిమో. 3:16) ఆయన లేఖనాల్ని అధ్యయనం చేసి ఏం తెలుసుకున్నాడు? యేసే మెస్సీయ అనడానికి తిరుగులేని రుజువుల్ని ఆయన లేఖనాల్లో చూశాడు. యూదా మత నాయకులు కావాలనే ఆ రుజువుల్ని పట్టించుకోలేదు. అంతేకాదు, వేషధారులైన ఆ మత నాయకులు దేవుని గురించి సత్యాన్ని బోధిస్తున్నామని చెప్పుకున్నారు కానీ, దాన్ని పాటించలేదు. (తీతు 1:16) పౌలు మాత్రం దేవుని వాక్యంలో తనకు నచ్చినవాటిని నమ్మి, నచ్చనివాటిని వదిలేయలేదు. ఆయన దేవుని వాక్యం ‘అంతటినీ’ బోధించడానికి, పాటించడానికి సిద్ధంగా ఉన్నాడు.—అపొ. 20:27.

3. ఇదే సత్యం అని బలంగా నమ్మాలంటే, అన్ని ప్రశ్నలకు జవాబులు తెలిసుండాలా? (‘ యెహోవా పనులు, ఆలోచనలు లెక్కించలేనన్ని ఉంటాయి’ అనే బాక్సు కూడా చూడండి.)

3 నిజమైన మతం మన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇవ్వాలని, చివరికి బైబిలు సూటిగా చెప్పనివాటికి కూడా జవాబులు ఇవ్వాలని కొంతమంది అనుకుంటారు. అలా అనుకోవడం సరైనదేనా? పౌలు ఉదాహరణ పరిశీలించండి. “అన్నిటినీ పరీక్షించి, ఏది మంచిదో నిర్ధారించుకోండి” అని ఆయన తోటి విశ్వాసుల్ని ప్రోత్సహించాడు, అయితే తనకు కూడా అర్థంకానివి చాలా ఉన్నాయని ఆయన ఒప్పుకున్నాడు. (1 థెస్స. 5:21) ఆయన ఇలా రాశాడు: “మన జ్ఞానం అసంపూర్ణం . . . మనం లోహపు అద్దంలో చూసినట్టు మసకమసకగా చూస్తున్నాం.” (1 కొరిం. 13:9, 12) పౌలుకు అన్నీ తెలియవు, కానీ యెహోవా గురించి, ఆయన ఉద్దేశాల గురించి ముఖ్యమైన విషయాలు మాత్రం తెలుసు. తన దగ్గర ఉన్నది సత్యం అని నమ్మడానికి పౌలుకు అవి సరిపోయాయి. మన విషయంలో కూడా అంతే.

4. మన దగ్గర ఉన్నది సత్యం అనే నమ్మకాన్ని బలపర్చుకోవడానికి ఏం చేయవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

4 నిజమైన ఆరాధన ఎలా ఉండాలని యేసు చూపించాడో, నేడు యెహోవాసాక్షులు ఎలా ఆరాధిస్తున్నారో పోల్చి చూడడం ద్వారా మన దగ్గర ఉన్నది సత్యం అనే నమ్మకాన్ని బలపర్చుకోవచ్చు. నిజ క్రైస్తవులు చేసే నాలుగు పనుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం: వాళ్లు (1) విగ్రహారాధనకు దూరంగా ఉంటారు, (2) యెహోవా పేరును గౌరవిస్తారు, (3) సత్యాన్ని ప్రేమిస్తారు, (4) ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపిస్తారు.

మనం విగ్రహారాధనకు దూరంగా ఉంటాం

5. దేవుణ్ణి ఆరాధించాల్సిన సరైన పద్ధతిని యేసు ఎలా చూపించాడు? ఆ పద్ధతిని మనం ఎలా పాటించవచ్చు?

5 యేసు యెహోవాను ఎంతో ప్రేమించాడు, కాబట్టి పరలోకంలో ఉన్నప్పుడు అలాగే భూమ్మీదికి వచ్చినప్పుడు యెహోవాను మాత్రమే ఆరాధించాడు. (లూకా 4:8) తన శిష్యుల్ని కూడా అలాగే చేయమని చెప్పాడు. యేసు ఎన్నడూ విగ్రహాల్ని ఆరాధించలేదు, ఆయన నమ్మకమైన శిష్యులు కూడా ఎప్పుడూ అలా చేయలేదు. దేవుడు మన కంటికి కనిపించడు, కాబట్టి ఆయనలాంటి రూపాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు! (యెష. 46:5) అయితే, పవిత్రులు లేదా సెయింట్లు అని పిలవబడేవాళ్ల విగ్రహాల్ని తయారుచేయడం, వాళ్లకు ప్రార్థించడం సంగతేంటి? పది ఆజ్ఞల్లోని రెండో ఆజ్ఞలో యెహోవా ఇలా చెప్పాడు: “పైన ఆకాశంలో, కింద భూమ్మీద . . . ఉండే దేని పోలికలోనైనా నువ్వు విగ్రహాన్ని గానీ, రూపాన్ని గానీ చేసుకోకూడదు. వాటికి వంగి నమస్కారం చేయకూడదు.” (నిర్గ. 20:4, 5) దేవునికి నచ్చినట్టు ఆరాధించాలని కోరుకునేవాళ్లకు ఈ విషయం బాగా తెలుసు.

6. నేడు యెహోవాసాక్షులు ఏ ఆరాధనా పద్ధతిని పాటిస్తున్నారు?

6 తొలి క్రైస్తవులు దేవుణ్ణి మాత్రమే ఆరాధించారని చరిత్రకారులు చెప్తున్నారు. ఉదాహరణకు, ఆరాధనా స్థలాల్లో విగ్రహాల్ని ఉపయోగించడం అనే ఆలోచనను తొలి క్రైస్తవులు “ఖచ్చితంగా అసహ్యించుకుని ఉండేవాళ్లు” అని ఒక చరిత్ర పుస్తకం చెప్తుంది. నేడు యెహోవాసాక్షులు మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల పద్ధతినే పాటిస్తున్నారు. సెయింట్ల విగ్రహాలకు లేదా దేవదూతలకు మనం ప్రార్థించం, చివరికి యేసుకు కూడా ప్రార్థించం. అంతేకాదు మనం జెండా వందనం చేయం, దేశాన్ని ఆరాధిస్తున్నామని చూపించే ఏ పనీ చేయం. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా, మనం యేసు అన్న ఈ మాటలకు లోబడతాం: “నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి.”—మత్త. 4:10.

7. యెహోవాసాక్షులకు, వేరే మతాలకు ఉన్న తేడాలు ఏంటి?

7 నేడు ప్రజలు బాగా పేరున్న మత నాయకులు చెప్పేది వినడానికి ఇష్టపడతారు. వాళ్లను ఎంతగా అభిమానిస్తారంటే దాదాపు వాళ్లను ఆరాధించేస్తారు. ప్రజలు వాళ్ల చర్చీలకు వెళ్తారు, వాళ్ల పుస్తకాల్ని కొంటారు, వాళ్ల సంస్థలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తారు. కొంతమంది ప్రజలు వాళ్లు చెప్పే ప్రతీమాట నమ్ముతారు. స్వయంగా యేసే వచ్చి చెప్పినా నమ్ముతారో లేదో గానీ, ఈ మత నాయకులు చెప్పేది మాత్రం నమ్ముతారు! అయితే, యెహోవాసాక్షుల్లో నాయకులు ఉండరు. సంస్థలో మనల్ని ముందుండి నడిపించే వాళ్లను మనం గౌరవిస్తాం, కానీ “మీరంతా సహోదరులు” అని యేసు స్పష్టంగా చెప్పిన మాటను మనం పాటిస్తాం. (మత్త. 23:8-10) మత నాయకుల్ని గానీ రాజకీయ నాయకుల్ని గానీ ఎవ్వర్నీ మనం ఆరాధించం. వాళ్లు చేసే మతపరమైన, రాజకీయపరమైన పనులకు మద్దతివ్వం. మనం తటస్థంగా ఉంటాం, లోకానికి వేరుగా ఉంటాం. ఈ విషయాలన్నిటిలో, క్రైస్తవులమని చెప్పుకునే మతాలకు మనం పూర్తి భిన్నంగా ఉంటాం.—యోహా. 18:36.

మనం యెహోవా పేరును గౌరవిస్తాం

నిజ క్రైస్తవులు యెహోవా గురించి ఇతరులకు చెప్తున్నందుకు గర్వపడతారు (8-10 పేరాలు చూడండి) *

8. మనం తన పేరును మహిమపర్చాలి, దాన్ని అందరికీ చెప్పాలి అన్నది యెహోవా కోరిక అని మనకెలా తెలుసు?

8 ఒకసారి యేసు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నీ పేరును మహిమపర్చు.” అప్పుడు పరలోకం నుండి స్వయంగా యెహోవా ఒక పెద్ద స్వరంతో, ‘నేను దాన్ని మహిమపరుస్తాను’ అని జవాబిచ్చాడు. (యోహా. 12:28) యేసు తన పరిచర్య అంతట్లో తన తండ్రి పేరును మహిమపర్చాడు. (యోహా. 17:26) నిజ క్రైస్తవులు కూడా దేవుని పేరును ఉపయోగిస్తున్నందుకు, దాన్ని ఇతరులకు చెప్తున్నందుకు గర్వపడతారు.

9. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు దేవుని పేరును గౌరవిస్తున్నామని ఎలా చూపించారు?

9 క్రైస్తవ సంఘం ఏర్పడిన కొంతకాలానికే, యెహోవా ‘తన పేరు కోసం ప్రజల్ని ఎంచుకోవడం’ మొదలుపెట్టాడు. (అపొ. 15:14) మొదటి శతాబ్దంలోని ఆ క్రైస్తవులు దేవుని పేరును ఉపయోగిస్తూ, దాన్ని ఇతరులకు చెప్పే అవకాశం దొరికినందుకు గర్వపడ్డారు. అంతేకాదు పరిచర్యలో, వాళ్లు రాసిన బైబిలు పుస్తకాల్లో తరచూ దేవుని పేరును ఉపయోగించారు. * అలా తాము దేవుని పేరు కోసం ఎంచుకోబడిన ప్రజలమని వాళ్లు చూపించారు.—అపొ. 2:14, 21.

10. యెహోవాసాక్షులు యెహోవా పేరు కోసం ఎంచుకోబడిన ప్రజలు అనడానికి ఏ రుజువులు ఉన్నాయి?

10 యెహోవాసాక్షులు యెహోవా పేరు కోసం ఎంచుకోబడిన ప్రజలా? ఈ రుజువులు పరిశీలించండి. నేడు చాలామంది మత నాయకులు తమ అధికారాన్ని ఉపయోగించి, దేవునికి ఒక పేరు ఉందనే వాస్తవాన్ని కప్పిపెట్టేశారు. వాళ్లు తమ బైబిలు అనువాదాల నుండి ఆయన పేరును తీసేశారు, కొందరైతే తమ చర్చీల్లో ఆ పేరు ఉపయోగించడాన్ని నిషేధించారు. * దేవుని పేరుకు ఇవ్వాల్సిన ఘనతను, గౌరవాన్ని ఇస్తున్నది యెహోవాసాక్షులు మాత్రమే. దీన్ని ఎవరైనా కాదనగలరా? వేరే ఏ మత గుంపు కన్నా మనం దేవుని పేరును ఎక్కువగా తెలియజేస్తున్నాం! అలా, యెహోవాసాక్షులు అనే మన పేరుకు తగ్గట్టుగా జీవించడానికి ఎంతో కృషి చేస్తున్నాం. (యెష. 43:10-12) మనం కొత్త లోక అనువాదం బైబిల్ని 24 కోట్ల కన్నా ఎక్కువ కాపీలు ముద్రించాం. వేరే బైబిలు అనువాదకులు బైబిల్లో యెహోవా పేరును తీసేసిన ప్రతీచోట, మనం దాన్ని తిరిగి చేర్చాం. అంతేకాదు, యెహోవా పేరును తెలియజేసే బైబిలు ప్రచురణల్ని 1,000 కన్నా ఎక్కువ భాషల్లో తయారు చేస్తున్నాం!

మనం సత్యాన్ని ప్రేమిస్తాం

11. తొలి క్రైస్తవులు సత్యాన్ని ప్రేమిస్తున్నామని ఎలా చూపించారు?

11 సత్యాన్ని అంటే దేవుని గురించిన, ఆయన ఉద్దేశాల గురించిన సత్యాన్ని యేసు ప్రేమించాడు. ఆయన ఆ సత్యానికి తగ్గట్టు జీవించాడు, ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేశాడు. (యోహా. 18:37) తొలి క్రైస్తవులు కూడా సత్యాన్ని ఎంతో ప్రేమించారు. (యోహా. 4:23, 24) నిజానికి, అపొస్తలుడైన పేతురు క్రైస్తవ మతాన్ని “సత్యమార్గం” అని అన్నాడు. (2 పేతు. 2:2) తొలి క్రైస్తవులు సత్యాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి సత్యానికి విరుద్ధమైన మత బోధల్ని, సంప్రదాయాల్ని, మనుషుల అభిప్రాయాల్ని వ్యతిరేకించారు. (కొలొ. 2:8) అదేవిధంగా, నేడు నిజ క్రైస్తవులు ‘సత్యంలో నడుస్తూ’ ఉండడానికి కృషి చేస్తారు. వాళ్ల నమ్మకాలు, జీవన విధానం పూర్తిగా దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటాయి.—3 యోహా. 3, 4.

12. మన అవగాహనలో మార్పు అవసరమని గుర్తించినప్పుడు పరిపాలక సభ ఏం చేస్తుంది? ఎందుకు?

12 తమకు సత్యం గురించి పూర్తి జ్ఞానం ఉందని యెహోవాసాక్షులు ఎప్పుడూ చెప్పరు. కొన్ని బైబిలు బోధల్ని, సంస్థాపరమైన ఏర్పాట్లను వాళ్లు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. దానికి మనం ఆశ్చర్యపోవాలా? లేదు. ఎందుకంటే, సమయం గడిచేకొద్దీ సరైన జ్ఞానం ఎక్కువౌతుందని బైబిలు చెప్తుంది. (కొలొ. 1:9, 10) సత్యాన్ని యెహోవా క్రమక్రమంగా తెలియజేస్తాడు, కాబట్టి సత్యపు వెలుగు అంతకంతకూ ఎక్కువయ్యే వరకు మనం ఓపిగ్గా వేచి ఉండాలి. (సామె. 4:18) సత్యానికి సంబంధించి మన అవగాహనలో ఏదైనా మార్పు అవసరమని పరిపాలక సభ గుర్తించినప్పుడు, మార్పు చేయడానికి వెనుకాడదు. చాలా చర్చీలు తమ సభ్యుల్ని సంతోషపెట్టడానికో, లోకంతో స్నేహం చేయడానికో తమ బోధల్లో మార్పులు చేస్తుంటాయి. కానీ యెహోవా సంస్థ మాత్రం ప్రజల్ని దేవునికి దగ్గర చేయడానికి, యేసు చూపించిన పద్ధతిని పాటించడానికి మార్పులు చేస్తుంది. (యాకో. 4:4) లోకంలోని ప్రజల అభిప్రాయాల్లో మార్పులు వచ్చినందుకు కాదుగానీ, సత్యం విషయంలో మన అవగాహన మెరుగైనందుకే మనం మార్పులు చేస్తాం. ఎందుకంటే, మనం సత్యాన్ని ప్రేమిస్తాం!—1 థెస్స. 2:3, 4.

మనం ఒకరినొకరం ప్రగాఢంగా ప్రేమిస్తాం

13. నిజ క్రైస్తవులు చూపించే ముఖ్యమైన లక్షణం ఏంటి? నేడు యెహోవాసాక్షుల మధ్య అదెలా స్పష్టంగా కనిపిస్తుంది?

13 తొలి క్రైస్తవులు ఎన్నో మంచి లక్షణాల్ని చూపించారు, వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమ. యేసు ఇలా అన్నాడు: “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహా. 13:34, 35) నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల మధ్య నిజమైన ప్రేమ, ఐక్యత కనిపిస్తాయి. మనం వేర్వేరు దేశాలు, సంస్కృతుల నుండి వచ్చినా ఒకే కుటుంబంలా ఉంటాం. వేరే ఏ మతాల్లోనూ అలా ఉండదు. మన మధ్య ఉన్న ప్రేమ కూటాల్లో, సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మనం యెహోవాకు నచ్చిన విధంగా ఆరాధిస్తున్నామని బలంగా నమ్మడానికి ఇది ఇంకొక రుజువు.

14. కొలొస్సయులు 3:12-14 ప్రకారం, ప్రగాఢమైన ప్రేమ చూపించే ఒక ముఖ్యమైన విధానం ఏంటి?

14 “ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ కలిగివుండండి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 పేతు. 4:8) అలాంటి ప్రేమ చూపించే ఒక విధానం ఏంటంటే, ఎదుటివాళ్లను క్షమించడం, వాళ్ల బలహీనతల్ని సహించడం. అంతేకాదు సంఘంలోని వాళ్లందరికీ, చివరికి మనల్ని బాధపెట్టిన వాళ్లకు కూడా సహాయం చేయడం ద్వారా, ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మనం ప్రేమ చూపిస్తాం. (కొలొస్సయులు 3:12-14 చదవండి.) అలాంటి ప్రేమ చూపించడం ద్వారా మనం నిజ క్రైసవులమని నిరూపించుకుంటాం.

“సరైన మార్గం ఒక్కటే”

15. మనం ఇంకా ఏ విషయాల్లో తొలి క్రైస్తవుల ఆరాధనా పద్ధతిని పాటిస్తాం?

15 వేరే విషయాల్లో కూడా మనం తొలి క్రైస్తవుల ఆరాధనా పద్ధతిని పాటిస్తాం. ఉదాహరణకు, మొదటి శతాబ్దంలో ప్రయాణ పర్యవేక్షకులు, పెద్దలు, సంఘ పరిచారకులు ఉండేవాళ్లు. నేడు మన సంస్థలో కూడా ఆ ఏర్పాటు ఉంది. (ఫిలి. 1:1; తీతు 1:5) అంతేకాదు, మనం మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే పెళ్లి-లైంగిక సంబంధాల విషయంలో యెహోవా నియమాల్ని గౌరవిస్తాం, రక్తాన్ని పవిత్రంగా చూస్తాం, పశ్చాత్తాపపడని పాపుల్ని బహిష్కరించడం ద్వారా సంఘాన్ని కాపాడతాం.—అపొ. 15:28, 29; 1 కొరిం. 5:11-13; 6:9, 10; హెబ్రీ. 13:4.

16. ఎఫెసీయులు 4:4-6 లో ఉన్న మాటల నుండి మనం ఏం నేర్చుకుంటాం?

16 చాలామంది తన శిష్యులమని చెప్పుకుంటారు కానీ అందరూ నిజమైన శిష్యులు కాదని యేసు అన్నాడు. (మత్త. 7:21-23) అంతేకాదు చివరి రోజుల్లో చాలామంది, “పైకి దైవభక్తి ఉన్నట్టు” కనిపిస్తారని బైబిలు ముందే చెప్పింది. (2 తిమో. 3:1, 5) అయితే, దేవుని ఆమోదం ఉన్న “సరైన మార్గం ఒక్కటే” అని కూడా బైబిలు స్పష్టంగా చెప్తుంది.—ఎఫెసీయులు 4:4-6, అధస్సూచి చదవండి.

17. నేడు యేసు ఆదర్శాన్ని పాటిస్తూ సరైన మార్గాన్ని అనుసరిస్తున్నది ఎవరు?

17 నేడు సరైన మార్గాన్ని అనుసరిస్తున్నది ఎవరు? ఇప్పటివరకు మనం రుజువుల్ని చూశాం. దేవుణ్ణి ఆరాధించాల్సిన సరైన పద్ధతిని యేసు ఎలా చూపించాడో, తొలి క్రైస్తవులు దాన్ని ఎలా పాటించారో పరిశీలించాం. కాబట్టి ఆ ప్రశ్నకు ఒకే ఒక్క జవాబు, యెహోవాసాక్షులు. యెహోవా ప్రజల్లో ఒకరిగా ఉండడం, యెహోవా గురించిన-ఆయన ఉద్దేశాల గురించిన సత్యాన్ని తెలుసుకోవడం నిజంగా మనకు దొరికిన గొప్ప గౌరవం! కాబట్టి ఇదే సత్యం అని బలంగా నమ్ముతూ, దాన్ని గట్టిగా పట్టుకొని ఉందాం.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

^ పేరా 5 దేవుణ్ణి ఆరాధించాల్సిన సరైన పద్ధతిని యేసు ఎలా చూపించాడో, తొలి క్రైస్తవులు ఆ పద్ధతిని ఎలా పాటించారో, నేడు యెహోవాసాక్షులు దాన్ని అనుసరిస్తున్నారు అనడానికి ఏ రుజువులు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 9 కావలికోట, జనవరి-మార్చి 2011 పత్రిక, 18వ పేజీలో ఉన్న “తొలి క్రైస్తవులు దేవుని పేరు ఉపయోగించారా?” అనే బాక్సు చూడండి.

^ పేరా 10 ఉదాహరణకు 2008లో, పోప్‌ బెనడిక్ట్‌-16 క్యాథలిక్‌ చర్చి ఆరాధనల్లో, పాటల్లో, ప్రార్థనల్లో దేవుని పేరును “ఉపయోగించకూడదు, కనీసం పలకకూడదు” అని ఆజ్ఞాపించాడు.

^ పేరా 63 చిత్రాల వివరణ: యెహోవా సంస్థ కొత్త లోక అనువాదం బైబిల్ని 200 కన్నా ఎక్కువ భాషల్లో విడుదల చేసింది. దానివల్ల ప్రజలు దేవుని పేరున్న బైబిల్ని తమ సొంత భాషలో చదవగలుగుతున్నారు.