కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 40

నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి?

నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి?

“నేను . . . పశ్చాత్తాపపడమని పాపుల్ని పిలవడానికే వచ్చాను.”—లూకా 5:32.

పాట 36 మన హృదయాల్ని కాపాడుకుందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. అహాబుకు, మనష్షేకు ఉన్న తేడా ఏంటి? మనం ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?

 పూర్వ కాలంలో జీవించిన ఇద్దరి రాజుల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకరేమో పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించారు, ఇంకొకరేమో రెండు గోత్రాల యూదా రాజ్యాన్ని పరిపాలించారు. వాళ్లు వేర్వేరు కాలాల్లో జీవించినప్పటికీ వాళ్లిద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ యెహోవాకు ఎదురుతిరిగారు, ఆయన ప్రజల్ని తప్పుదారి పట్టించారు, అబద్ధ దేవుళ్లను పూజించారు, హత్యలు చేశారు. కానీ వీళ్లిద్దరికి ఒక తేడా ఉంది. అదేంటంటే, ఒకరు జీవితాంతం చెడ్డ పనులు చేస్తూనే ఉన్నారు, ఇంకొకరు ఘోరమైన తప్పులు చేసినందుకు పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ పొందారు. ఇంతకీ వాళ్లెవరు?

2 వాళ్లెవరంటే ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన మనష్షే. వాళ్లిద్దరికి ఉన్న తేడా ఏంటో పరిశీలిస్తే, పశ్చాత్తాపం అనే ముఖ్యమైన అంశం గురించి మనమెంతో నేర్చుకోవచ్చు. (అపొ. 17:30; రోమా. 3:23) ఇంతకీ పశ్చాత్తాపం అంటే ఏంటి? ఒక వ్యక్తి పశ్చాత్తాపపడుతున్నాడని ఎలా చూపిస్తాడు? యెహోవా మన పాపాల్ని క్షమించాలని మనం కోరుకుంటాం, కాబట్టి ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి. ఆ ఇద్దరు రాజులు ఏం చేశారో, వాళ్ల నుండి మనమేం నేర్చుకోవచ్చో పరిశీలిస్తూ వాటికి జవాబులు తెలుసుకుందాం. అలాగే పశ్చాత్తాపం గురించి యేసు ఏం చెప్పాడో కూడా చూద్దాం.

అహాబు రాజు ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు?

3. అహాబు ఎలాంటి రాజు?

3 పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో అహాబు ఏడోవాడు. అతను సీదోను రాజు కూతురైన యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. సీదోను ఇశ్రాయేలుకు ఉత్తరాన ఉన్న సంపన్న దేశం. ఆ పెళ్లి వల్ల ఇశ్రాయేలీయులకు సంపద వచ్చి ఉండొచ్చేమో కానీ, వాళ్లకు యెహోవాతో ఉన్న సంబంధం మాత్రం ఇంకా పాడైంది. యెజెబెలు బయలును ఆరాధించేది. బయలు ఆరాధనా స్థలాల్లో వ్యభిచారం, చిన్నపిల్లల్ని బలి ఇవ్వడం వంటివి జరిగేవి. యెజెబెలు వల్ల అహాబు కూడా ఆ నీచమైన ఆరాధనను ప్రోత్సహించాడు. యెజెబెలు అధికారంలో ఉన్నంత కాలం యెహోవా ప్రవక్తల్లో ఏ ఒక్కరూ సురక్షితంగా లేరు. ఆమె వాళ్లలో చాలామందిని చంపించింది. (1 రాజు. 18:13) అహాబు, “తనకు ముందున్న వాళ్లందరికన్నా యెహోవా దృష్టికి ఘోరంగా ప్రవర్తించాడు.” (1 రాజు. 16:30) అహాబు, యెజెబెలు చేస్తున్న ప్రతీ పనిని యెహోవా చూశాడు. యెహోవా కరుణతో ఏలీయా ప్రవక్తను పంపించి, ఆలస్యం కాకముందే తమ ప్రవర్తన మార్చుకోమని వాళ్లను, ప్రజల్ని హెచ్చరించాడు. కానీ అహాబు, యెజెబెలు ఆ హెచ్చరికల్ని పట్టించుకోలేదు.

4. ఏలీయా అహాబు మీద ఏ తీర్పు ప్రకటించాడు? అప్పుడు అహాబు ఏం చేశాడు?

4 చివరికి యెహోవా ఓపిక నశించింది. ఆయన అహాబు మీద, యెజెబెలు మీద తీర్పు ప్రకటించడానికి ఏలీయాను పంపించాడు. అతని కుటుంబం పూర్తిగా నాశనమౌతుందని ఏలీయా చెప్పాడు. ఆ మాటలు వినగానే, అహాబు చాలా బాధపడ్డాడు. ఆశ్చర్యకరంగా, ఆ అహంకారి “తనను తాను తగ్గించుకున్నాడు.”—1 రాజు. 21:19-29.

దేవుని ప్రవక్తను చెరసాలలో వేయడం ద్వారా అహాబు రాజు తాను నిజంగా పశ్చాత్తాపపడలేదని చూపించాడు (5-6 పేరాలు చూడండి) *

5-6. అహాబు నిజమైన పశ్చాత్తాపం చూపించలేదని దేన్నిబట్టి చెప్పవచ్చు?

5 అహాబు ఆ సమయంలో తనను తాను తగ్గించుకున్నా, తర్వాత అతను చేసిన పనులు చూస్తే అతను నిజంగా పశ్చాత్తాపపడలేదని తెలుస్తుంది. అతను తన రాజ్యం నుండి బయలు ఆరాధనను తీసేయడానికి ప్రయత్నించలేదు. అంతేకాదు అతను యెహోవా ఆరాధనను ప్రోత్సహించలేదు. అహాబు చేసిన వేరే పనులు కూడా అతను నిజంగా పశ్చాత్తాపపడలేదని చూపించాయి.

6 తర్వాత ఒక సందర్భంలో అహాబు సిరియన్ల మీదికి యుద్ధానికి వెళ్తూ, యూదా రాజైన యెహోషాపాతును కూడా తనతో రమ్మన్నాడు. యెహోషాపాతు మంచి రాజు. అతను ముందుగా యెహోవా ప్రవక్త దగ్గర విచారణ చేద్దామని చెప్పాడు. మొదట అహాబు దానికి ఒప్పుకోకుండా ఇలా అన్నాడు: “ఒకతను ఉన్నాడు, మనం అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కానీ అతనంటే నాకు అసహ్యం, ఎందుకంటే అతను నా విషయంలో చెడునే తప్ప మంచిని ఎప్పుడూ ప్రవచించడు.” మొదట అలా అన్నా గానీ, తర్వాత వాళ్లు మీకాయా ప్రవక్త దగ్గర విచారణ చేశారు. అహాబు అనుకున్నట్టే, ఆ ప్రవక్త విపత్తు వస్తుందని ప్రకటించాడు. అప్పుడు దుష్టుడైన అహాబు పశ్చాత్తాపపడి యెహోవా క్షమాపణను వేడుకునే బదులు, మీకాయా ప్రవక్తను చెరసాలలో వేయించాడు. (1 రాజు. 22:7-9, 23, 27) రాజు దేవుని ప్రవక్తనైతే చెరసాలలో వేయించగలిగాడు కానీ, అతను చెప్పిన ప్రవచనం నిజమవ్వకుండా అడ్డుకోలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అహాబు చనిపోయాడు.—1 రాజు. 22:34-38.

7. అహాబు చనిపోయిన తర్వాత యెహోవా అతని గురించి ఏమన్నాడు?

7 అహాబు చనిపోయిన తర్వాత అతని గురించి తాను ఏమనుకుంటున్నాడో యెహోవా తెలియజేశాడు. మంచి రాజైన యెహోషాపాతు ఇంటికి సురక్షితంగా తిరిగొచ్చిన తర్వాత, యెహోవా అతని దగ్గరికి యెహూ ప్రవక్తను పంపించి, అహాబుతో పొత్తు పెట్టుకున్నందుకు అతన్ని గద్దించాడు. ప్రవక్త అతనితో ఇలా అన్నాడు: “నువ్వు దుష్టులకు సహాయం చేయడం, యెహోవాను ద్వేషించేవాళ్లను ప్రేమించడం సరైనదేనా?” (2 దిన. 19:1, 2) ఒక్కసారి ఆలోచించండి: ఒకవేళ అహాబు నిజమైన పశ్చాత్తాపం చూపించి ఉంటే, ప్రవక్త అతన్ని యెహోవాను ద్వేషించే దుష్టుడితో పోల్చి ఉండేవాడు కాదు. కాబట్టి, అహాబు తప్పు చేసినందుకు కొంత బాధపడినా, అతను నిజంగా పశ్చాత్తాపపడలేదని స్పష్టమౌతుంది.

8. పశ్చాత్తాపం గురించి అహాబు ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు?

8 అహాబు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? తన కుటుంబమంతా నాశనం అవుతుందని ఏలీయా చెప్పగానే అహాబు తనను తాను తగ్గించుకున్నాడు. అది మంచిదే. కానీ తర్వాత అతను చేసిన పనులు చూస్తే, అతను నిజంగా పశ్చాత్తాపపడలేదని తెలుస్తుంది. కాబట్టి పశ్చాత్తాపం అంటే, తప్పు చేసినందుకు బాధపడుతున్నామని అప్పటికప్పుడు చెప్పడం కాదు. మరి నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం.

మనష్షే రాజు ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు?

9. మనష్షే ఎలాంటి రాజు?

9 దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత, మనష్షే యూదాకు రాజు అయ్యాడు. అతను బహుశా అహాబు కంటే ఘోరమైన తప్పులు చేసి ఉండవచ్చు. అతని గురించి బైబిలు ఇలా చెప్తుంది: “అతను యెహోవా దృష్టిలో విపరీతంగా చెడ్డపనులు చేసి ఆయనకు కోపం తెప్పించాడు.” (2 దిన. 33:1-9) మనష్షే అబద్ధ దేవుళ్లకు బలిపీఠాలు కట్టించాడు, పూజా కర్రను చేయించి దాన్ని ఏకంగా యెహోవా ఆలయంలోనే పెట్టించాడు! బహుశా అది సంతాన దేవత విగ్రహం కావచ్చు. అతను ఇంద్రజాలం చేశాడు, శకునాలు చూశాడు, క్షుద్ర విద్య అభ్యసించాడు. అంతేకాదు, ‘పెద్ద ఎత్తున అమాయకుల రక్తాన్ని చిందించాడు.’ అతను క్రూరంగా చంపినవాళ్లలో తన సొంత కుమారులు కూడా ఉన్నారు. అతను ‘తన సొంత కుమారుల్ని అగ్నిలో వేసి కాల్చి,’ అబద్ధ దేవుళ్లకు బలి ఇచ్చాడు.—2 రాజు. 21:6, 7, 10, 11, 16.

10. యెహోవా మనష్షేకు ఎలా క్రమశిక్షణ ఇచ్చాడు? అప్పుడు మనష్షే ఏం చేశాడు?

10 అహాబులాగే మనష్షే కూడా యెహోవా తన ప్రవక్తల ద్వారా ఇస్తున్న హెచ్చరికల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి “యెహోవా వాళ్లమీదికి [యూదా మీదికి] అష్షూరు రాజు సైన్యాధిపతుల్ని రప్పించాడు; వాళ్లు మనష్షేను కొక్కేలతో పట్టుకొని, రెండు రాగి సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు.” అక్కడ అంటే పరాయి దేశంలో బందీగా ఉన్నప్పుడు, మనష్షే బహుశా తన తప్పు గురించి లోతుగా ఆలోచించి ఉంటాడు. అతను “తన పూర్వీకుల దేవుని ఎదుట తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు.” మనష్షే ఇంకో పని కూడా చేశాడు. అతను “అనుగ్రహం కోసం తన దేవుడైన యెహోవాను బ్రతిమాలాడు, . . . దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు.” దుష్టుడైన మనష్షేలో మార్పు రావడం మొదలైంది. అతను యెహోవాను ‘తన దేవునిగా’ చూడడం మొదలుపెట్టి, ఆయనకు పట్టుదలగా ప్రార్థించాడు.—2 దిన. 33:10-13.

అబద్ధ ఆరాధనను తీసేయడానికి ప్రయత్నించడం ద్వారా మనష్షే రాజు తాను నిజంగా పశ్చాత్తాపపడ్డానని చూపించాడు (11వ పేరా చూడండి) *

11. రెండో దినవృత్తాంతాలు 33:15, 16 ప్రకారం, తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నాను అని మనష్షే ఎలా చూపించాడు?

11 కొంతకాలానికి మనష్షే ప్రార్థనల్ని యెహోవా విన్నాడు. మనష్షే ప్రార్థించినట్టుగానే అతని హృదయంలో నిజంగా మార్పు వచ్చిందని యెహోవా గమనించాడు. మనష్షే చేసిన విన్నపాన్ని బట్టి యెహోవా కదిలించబడి, అతన్ని మళ్లీ రాజుగా చేశాడు. మనష్షే ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని, తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నాను అని చూపించాడు. అతను అహాబులా కాకుండా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. అతను అబద్ధ ఆరాధనను తీసేయడానికి ప్రయత్నించాడు, సత్యారాధనను ప్రోత్సహించాడు. (2 దినవృత్తాంతాలు 33:15, 16 చదవండి.) అలా చేయాలంటే ఎంతో ధైర్యం, విశ్వాసం కావాలి. ఎందుకంటే మనష్షే చాలా సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులకు, ప్రముఖులకు, ప్రజలకు చెడ్డ ఉదాహరణగా ఉన్నాడు. కానీ చివరి దశలో, మనష్షే తన వల్ల కలిగిన నష్టంలో కొంతైనా సరిచేయడానికి ప్రయత్నించాడు. బహుశా అతను తన మనవడికి, అంటే బాలుడైన యోషీయాకు మంచి ఆదర్శం ఉంచాడు. దానివల్ల ఆ పిల్లవాడు చాలా మంచి రాజు అయ్యాడు.—2 రాజు. 22:1, 2.

12. పశ్చాత్తాపం గురించి మనష్షే ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు?

12 మనష్షే ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనష్షే తనను తాను తగ్గించుకోవడంతో పాటు యెహోవాకు ప్రార్థించాడు, కరుణ చూపించమని బ్రతిమాలాడు. అంతేకాదు అతను తన ప్రవర్తన మార్చుకున్నాడు. తన వల్ల కలిగిన నష్టంలో కొంతైనా సరిచేయడానికి ప్రయత్నించాడు. అతను యెహోవాను ఆరాధిస్తూ, ఇతరులు కూడా అలా చేసేలా ప్రోత్సహించాడు. ఘోరమైన తప్పులు చేసిన వాళ్లలో కూడా మనష్షే ఉదాహరణ ఆశను నింపుతుంది. యెహోవా దేవుడు ‘మంచివాడని, క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని’ మనష్షే ఉదాహరణ చూపిస్తుంది. (కీర్త. 86:5) అవును, నిజంగా పశ్చాత్తాపపడిన వాళ్లను యెహోవా క్షమిస్తాడు.

13. పశ్చాత్తాపం గురించి ఒక ఉదాహరణతో వివరించండి.

13 మనష్షే తన తప్పుల గురించి బాధపడడం కంటే ఎక్కువే చేశాడు. అది పశ్చాత్తాపం గురించి మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. ఈ ఉదాహరణ పరిశీలించండి: మీరు పాలకోవ కొందామని ఒక స్వీట్‌ షాపుకు వెళ్లారనుకుందాం. మీరు పాలకోవ అడిగితే వాళ్లు మీకు పాలు ఇచ్చారు. అది సరిపోతుందా? లేదు కదా! పాలకోవ తయారీలో పాలు ముఖ్యమైన పదార్థం కాబట్టి పాలు ఇచ్చామని వాళ్లు చెప్పారు. అప్పుడు మీరు ఆ పాలు తీసుకుని వెళ్లిపోతారా? లేదు కదా! అదేవిధంగా, యెహోవా పాపుల నుండి అడుగుతుంది పశ్చాత్తాపాన్ని. ఒకవేళ పాపి తన తప్పుల గురించి బాధపడుతుంటే అది మంచిదే. అలా బాధపడడం అనేది పశ్చాత్తాపంలో ముఖ్యమైన భాగం, కానీ అది ఒక్కటే సరిపోదు. మరి ఇంకా ఏం కావాలి? దాని గురించి తెలుసుకోవడానికి యేసు చెప్పిన ఒక చక్కని ఉదాహరణ పరిశీలిద్దాం.

నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి?

తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చిన తర్వాత, అతను ఇంటికి తిరిగి వెళ్లడానికి చాలా దూరం ప్రయాణించాడు (14-15 పేరాలు చూడండి) *

14. యేసు ఉదాహరణలోని తప్పిపోయిన కుమారునిలో పశ్చాత్తాపం మొదలైందని ఎలా చెప్పవచ్చు?

14 యేసు తప్పిపోయిన కుమారుడి గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. మనసుకు హత్తుకునే ఆ ఉదాహరణ లూకా 15:11-32 లో ఉంది. ఒక యువకుడు వాళ్ల నాన్నకు ఎదురుతిరిగి, ఇల్లు వదిలి “దూర దేశానికి” వెళ్లిపోయాడు. అక్కడ అతను విచ్చలవిడిగా జీవించాడు. కష్టాలు రాగానే అతను తన తప్పు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తాను వాళ్ల నాన్న ఇంట్లో ఉండుంటే తన జీవితం ఎంత బాగుండేదో అతనికి తెలిసొచ్చింది. యేసు చెప్పినట్టుగా ఆ యువకుడికి ‘బుద్ధి వచ్చింది.’ అతను ఇంటికి తిరిగి వెళ్లిపోయి వాళ్ల నాన్నను క్షమాపణ అడగాలని నిర్ణయించుకున్నాడు. ఆ అబ్బాయి తాను ఎంత పెద్ద తప్పు చేశాడో గుర్తించడం ప్రాముఖ్యమే. కానీ అది సరిపోతుందా? సరిపోదు. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలి!

15. తప్పిపోయిన కుమారుడు తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నాను అని ఎలా చూపించాడు?

15 తప్పిపోయిన కుమారుడు నిజమైన పశ్చాత్తాపం చూపించాడు. అతను చాలా దూరం ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. తర్వాత వాళ్ల నాన్నను కలిసి ఇలా అన్నాడు: “నాన్నా, నేను దేవునికీ నీకూ విరుద్ధంగా పాపం చేశాను. ఇక నీ కుమారుణ్ణని అనిపించుకునే అర్హత నాకు లేదు.” (లూకా 15:21) ఆ యువకుడు మనస్ఫూర్తిగా తన తప్పు ఒప్పుకున్నాడు. అతనికి యెహోవాతో తిరిగి మంచి సంబంధం కలిగి ఉండాలనే కోరిక ఉందని అది తెలియజేసింది. అంతేకాదు, తన పనులు వాళ్ల నాన్నను ఎంతగా బాధపెట్టాయో కూడా అతను గుర్తించాడు. వాళ్ల నాన్న అనుగ్రహం పొందడం కోసం అతను కష్టపడడానికి, ఆఖరికి వాళ్ల నాన్న దగ్గర పనివాడిగా చేరడానికి కూడా సిద్ధమయ్యాడు! (లూకా 15:19) ఈ ఉదాహరణ కేవలం మనసుకు హత్తుకునే ఒక కథ మాత్రమే కాదు, అది చాలా ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది. ఘోరమైన పాపం చేసిన తోటివిశ్వాసి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడో లేదో పరిశీలిస్తున్నప్పుడు, సంఘ పెద్దలు ఏ విషయాల్ని మనసులో ఉంచుకోవాలో ఆ ఉదాహరణ నేర్పిస్తుంది.

16. ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడో లేదో గుర్తించడం పెద్దలకు ఎందుకు కష్టం కావచ్చు?

16 ఘోరమైన పాపం చేసిన వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడో లేదో గుర్తించడం సంఘ పెద్దలకు అంత తేలిక కాదు. ఎందుకు? ఎందుకంటే పెద్దలు హృదయాన్ని చదవలేరు. కాబట్టి, చేసిన తప్పు గురించి ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నాడా లేదా అనేది, బయటికి కనిపించే రుజువుల్ని బట్టే పెద్దలు చెప్పగలరు. అయితే, కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎంత ఘోరంగా తప్పు చేయవచ్చు అంటే, అతనితో మాట్లాడే పెద్దలకు అతను నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడని నమ్మకం కుదరకపోవచ్చు.

17. (ఎ) నిజమైన పశ్చాత్తాపం అంటే, తప్పు చేసినందుకు బాధపడుతున్నామని చెప్పడం మాత్రమే కాదని ఒక ఉదాహరణతో వివరించండి. (బి) 2 కొరింథీయులు 7:11 ప్రకారం, నిజంగా పశ్చాత్తాపపడిన వ్యక్తి ఏం చేయాలి?

17 ఒక ఉదాహరణ పరిశీలించండి. ఒక సహోదరుడు చాలా సంవత్సరాలుగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు. అతను తప్పు ఒప్పుకుని సహాయం తీసుకునే బదులు తన భార్యకు, స్నేహితులకు, సంఘ పెద్దలకు చెప్పకుండా దాన్ని దాచిపెట్టాడు. కానీ చివరికది బయటపడింది. అతను తప్పు చేశాడు అనడానికి ఆధారాలు ఉన్నాయని సంఘ పెద్దలు చెప్పినప్పుడు, అతను దాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు, అలా చేసినందుకు తాను ఎంతో బాధపడుతున్నట్టుగా మాట్లాడాడు. అతను పశ్చాత్తాపపడుతున్నాడని చెప్పడానికి అది సరిపోతుందా? సంఘ పెద్దలు అతనిలో బాధ ఒక్కటే కాదు, ఇంకా వేరే విషయాల్ని కూడా చూడాలి. అతను అనుకోకుండా ఒక్కసారి తప్పు చేయలేదు కానీ, చాలా సంవత్సరాలుగా తప్పు చేస్తూ ఉన్నాడు. అతను తనంతట తాను వచ్చి తప్పు ఒప్పుకోలేదు కానీ, అది బయటపడ్డాకే ఒప్పుకున్నాడు. కాబట్టి అతని ఆలోచనల్లో, భావాల్లో, ప్రవర్తనలో నిజంగా మార్పు వచ్చిందో లేదో సంఘ పెద్దలు గమనించాలి. (2 కొరింథీయులు 7:11 చదవండి.) అతను అవసరమైన మార్పులు చేసుకుని, నిజంగా పశ్చాత్తాపపడుతున్నాను అని చూపించడానికి చాలా సమయం పట్టవచ్చు. కాబట్టి ఆ వ్యక్తిని క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించాలని పెద్దలు నిర్ణయించవచ్చు.—1 కొరిం. 5:11-13; 6:9, 10.

18. బహిష్కరించబడిన వ్యక్తి ఎలా నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించవచ్చు? అలా చూపించినప్పుడు ఏమౌతుంది?

18 సంఘం నుండి బహిష్కరించబడిన వ్యక్తి తాను నిజంగా పశ్చాత్తాపపడుతున్నాను అని చూపించడానికి క్రమంగా మీటింగ్స్‌కి వెళ్తాడు. సంఘ పెద్దల సలహా పాటిస్తూ క్రమంగా ప్రార్థిస్తాడు, వ్యక్తిగత అధ్యయనం చేస్తాడు. అంతేకాదు అతను జాగ్రత్తగా ఉంటూ, తప్పు చేయాలనిపించే పరిస్థితులకు దూరంగా ఉంటాడు. అతను దేవునితో మళ్లీ మంచి సంబంధం కలిగి ఉండడానికి కృషిచేస్తే యెహోవా తనను పూర్తిగా క్షమిస్తాడనే, తాను సంఘంలోకి తిరిగి చేర్చుకోబడతాననే నమ్మకంతో ఉండవచ్చు. నిజమే, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి సంఘ పెద్దలు తప్పు చేసినవాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు, వాళ్లవాళ్ల పరిస్థితుల్ని బట్టి తీర్పు తీరుస్తారే తప్ప కఠినంగా తీర్పు తీర్చరు.

19. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి? (యెహెజ్కేలు 33:14-16)

19 ఇప్పటివరకు మనం చూసినట్టుగా, నిజమైన పశ్చాత్తాపం అంటే తప్పు చేసినందుకు బాధపడుతున్నామని చెప్పడం మాత్రమే కాదు. నిజంగా ఆ వ్యక్తి మనసులో, హృదయంలో మార్పు రావాలి, దానికి తగ్గట్టు చర్య తీసుకోవాలి. అంటే తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టి తిరిగి యెహోవా మార్గాల్లో నడవాలి. (యెహెజ్కేలు 33:14-16 చదవండి.) అన్నిటికంటే ముఖ్యంగా, ఆ వ్యక్తికి యెహోవాతో మళ్లీ మంచి సంబంధం కలిగి ఉండాలనే బలమైన కోరిక ఉండాలి.

పశ్చాత్తాపపడేలా పాపులకు సహాయం చేయడం

20-21. ఘోరమైన పాపం చేసిన వ్యక్తికి మనం ఎలా సహాయం చేయవచ్చు?

20 యేసు తన పరిచర్యలోని ఒక ప్రాముఖ్యమైన పని గురించి ఇలా అన్నాడు: “నేను . . . పశ్చాత్తాపపడమని పాపుల్ని పిలవడానికే వచ్చాను.” (లూకా 5:32) మన కోరిక కూడా అదే అయ్యుండాలి. ఒకవేళ మన దగ్గరి స్నేహితుల్లో ఎవరైనా ఘోరమైన పాపం చేశారని తెలిస్తే, మనం ఏం చేయాలి?

21 మన స్నేహితుడు చేసిన తప్పును కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తే, మనం అతనికి హాని చేసిన వాళ్లమౌతాం. అలా కప్పిపెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే, యెహోవా అన్నీ చూస్తున్నాడు. (సామె. 5:21, 22; 28:13) పెద్దలు తనకు సహాయం చేస్తారని చెప్పడం ద్వారా మీరు మీ స్నేహితునికి మేలు చేయవచ్చు. ఒకవేళ మీ స్నేహితుడు పెద్దల దగ్గర తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే, మీరే ఆ విషయాన్ని పెద్దలకు చెప్పాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా మీరు నిజంగా తనకు మేలు చేయాలనుకుంటున్నారని చూపిస్తారు. ఎందుకంటే, యెహోవాతో అతనికి ఉన్న సంబంధం ప్రమాదంలో ఉంది!

22. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

22 ఎంతోకాలంగా చాలా ఘోరమైన తప్పు చేస్తున్న వ్యక్తిని బహిష్కరించాలని పెద్దలు నిర్ణయిస్తే, అప్పుడేంటి? వాళ్లు అతని మీద కరుణ చూపించలేదని దానర్థమా? తప్పు చేసినవాళ్లకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు యెహోవా ఎలా కరుణ చూపిస్తాడు? ఆయనలాగే మనం ఎలా కరుణ చూపించవచ్చు? వాటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

^ పేరా 5 నిజమైన పశ్చాత్తాపం అంటే తప్పు చేసినందుకు బాధపడుతున్నామని చెప్పడం మాత్రమే కాదు. ఈ ఆర్టికల్‌లో అహాబు రాజు గురించి, మనష్షే రాజు గురించి, యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ గురించి పరిశీలిస్తూ, నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసుకుంటాం. అంతేకాదు ఘోరమైన పాపం చేసిన తోటివిశ్వాసి నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడో లేదో పరిశీలిస్తున్నప్పుడు, సంఘ పెద్దలు ఏ విషయాల్ని గమనించాలో కూడా చర్చిస్తాం.

^ పేరా 60 చిత్రాల వివరణ: దేవుని ప్రవక్త అయిన మీకాయాను చెరసాలలో వేయమని అహాబు రాజు కోపంగా తన భటులకు చెప్తున్నాడు.

^ పేరా 62 చిత్రాల వివరణ: ఆలయంలో తాను నిలబెట్టించిన విగ్రహాల్ని పగలగొట్టమని మనష్షే రాజు పనివాళ్లకు చెప్తున్నాడు.

^ పేరా 64 చిత్రాల వివరణ: తప్పిపోయిన కుమారుడు చాలా దూరం ప్రయాణించి అలసిపోయి, దూరంలో తన ఇల్లు కనిపించేసరికి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు.