కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1921—వంద సంవత్సరాల క్రితం

1921—వంద సంవత్సరాల క్రితం

“ఈ సంవత్సరం మనం చేయాల్సిన పని ఏంటి?” అని జనవరి 1, 1921 వాచ్‌ టవర్‌ పత్రిక బైబిలు విద్యార్థుల్ని (అప్పట్లో యెహోవాసాక్షుల్ని అలా పిలిచేవాళ్లు) అడిగింది. ఆ ప్రశ్నకు జవాబిస్తూ యెషయా 61:1, 2 ఉపయోగించింది. ప్రకటించాల్సిన బాధ్యతను ఆ వచనాలు వాళ్లకు గుర్తుచేశాయి: “సాత్వికులకు మంచివార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. . . . యెహోవా అనుగ్రహ సంవత్సరం గురించి, మన దేవుని ప్రతీకార రోజు గురించి ప్రకటించడానికి . . . ఆయన నన్ను పంపాడు.”

ధైర్యం గల ప్రచారకులు

ప్రకటనా పనిలో కొనసాగడానికి బైబిలు విద్యార్థులకు ధైర్యం అవసరమైంది. ఎందుకంటే వాళ్లు సాత్వికులకు “మంచివార్త” ప్రకటించడంతో పాటు, చెడ్డవాళ్లకు “దేవుని ప్రతీకార రోజు” గురించి ప్రకటించాల్సి ఉంది.

కెనడాలో నివసించిన సహోదరుడు జె. హెచ్‌. హాస్కిన్‌, వ్యతిరేకత ఎదురైనా ధైర్యంగా ప్రకటించాడు. ఆయన 1921లో ఒక చర్చి పాస్టరును కలిశాడు. సహోదరుడు హాస్కిన్‌ అతనితో చర్చ మొదలుపెట్టే ముందే ఇలా అన్నాడు: “మనం ప్రశాంతంగా బైబిలు గురించి మాట్లాడుకుందాం. వేటి గురించైనా మన అభిప్రాయాలు కలవకపోతే, శాంతంగా, స్నేహపూర్వకంగా చర్చను ఆపేయవచ్చు.” కానీ అలా జరగలేదు. సహోదరుడు హాస్కిన్‌ ఇలా గుర్తు చేసుకున్నాడు: “మా చర్చ మొదలైన కొన్ని నిమిషాలకే ఆ పాస్టరు తలుపును గట్టిగా కొట్టాడు. ఎంత గట్టిగా అంటే, ఆ తలుపుకున్న అద్దం పగిలిపోతుందేమో అని నేను భయపడ్డాను.”

“మీరు నాకు చెప్పే బదులు క్రైస్తవులుకాని వాళ్లకు వెళ్లి చెప్పండి” అని ఆ పాస్టరు గట్టిగా అరిచాడు. సహోదరుడు హాస్కిన్‌ మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోతూ, ‘నేను ఇప్పటిదాకా మాట్లాడింది కూడా క్రైస్తవుడితో కాదు!’ అని తనలో తాను అనుకున్నాడు.

ఆ పాస్టరు తర్వాతి రోజు చర్చిలో సహోదరుడి గురించి చెడుగా మాట్లాడాడు. హాస్కిన్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు: “అతను నన్ను నిందిస్తూ నేను ఆ పట్టణంలో అడుగుపెట్టిన అతిపెద్ద మోసగాడినని, నన్ను చంపేయాలని తన చర్చి వాళ్లకు చెప్పాడు.” అయినా హాస్కిన్‌ ఏమాత్రం భయపడకుండా, ఆ పట్టణంలో చాలామందికి ప్రకటించాడు. ఆయన ఇలా అన్నాడు: “ఆ పట్టణంలో ప్రకటించడం నాకు చాలా నచ్చింది. కొంతమంది, ‘నువ్వు దేవుని సేవకుడివని మాకు తెలుసు. నీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పు మేము సహాయం చేస్తాం’ అని కూడా అన్నారు.”

వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ అధ్యయనం

ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ద గోల్డెన్‌ ఏజ్‌ పత్రిక, * బైబిలు పఠనానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్‌ ప్రచురించింది. ఆ ఆర్టికల్స్‌లో, తల్లిదండ్రులు పిల్లలతో చర్చించడానికి ప్రశ్నలు ఉండేవి. తల్లిదండ్రులు పిల్లల్ని ఆ ప్రశ్నలు అడిగి, వాటికి జవాబుల్ని బైబిల్లో వెతికేలా సహాయం చేసేవాళ్లు. “బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?” లాంటి ప్రశ్నలు, పిల్లలకు ముఖ్యమైన సత్యాల్ని నేర్పించేవి. “నిజ క్రైస్తవులందరికీ హింసలు వస్తాయా?” లాంటి ప్రశ్నలేమో, ధైర్యం గల ప్రచారకులుగా తయారవడానికి పిల్లలకు సహాయం చేసేవి.

ఆ పత్రిక, పిల్లల కోసమే కాకుండా పెద్దవాళ్ల కోసం కూడా కొన్ని ఆర్టికల్స్‌ ప్రచురించింది. వాటిలో, స్డడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ మొదటి సంపుటి ఆధారంగా తయారుచేసిన ప్రశ్నలు, వాటికి జవాబులు ఉండేవి. ఎన్నో వేలమంది పాఠకులు ఆ ఆర్టికల్స్‌ నుండి ప్రయోజనం పొందారు. అయితే, ఇకమీదట ఆ రెండు రకాల ఆర్టికల్స్‌ ప్రచురించము అని డిసెంబరు 21, 1921, ద గోల్డెన్‌ ఏజ్‌ పత్రిక చెప్పింది. ఎందుకు?

ఒక కొత్త పుస్తకం!

దేవుని వీణ పుస్తకం

పుస్తకంలో ఏ పేజీలు చదవాలో చెప్పే కార్డు

ప్రశ్నలు ఉన్న కార్డులు

ముఖ్యమైన బైబిలు సత్యాల్ని కొత్తవాళ్లకు ఒక పద్ధతి ప్రకారం నేర్పించాల్సిన అవసరం ఉందని నాయకత్వం వహిస్తున్న సహోదరులు గుర్తించారు. అందుకోసం వాళ్లు 1921, నవంబరులో దేవుని వీణ (ఇంగ్లీషు) అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకం తీసుకున్న ఆసక్తిపరులు, తాము సొంతగా అధ్యయనం చేసుకోగల స్టడీ కోర్సులో కూడా చేరేవాళ్లు. “మనుషులకు శాశ్వత జీవితాన్ని ఇవ్వాలన్న దేవుని ఉద్దేశాన్ని” అర్థం చేసుకునేలా ఆ కోర్సు వాళ్లకు సహాయం చేసింది. ఆ కోర్సు ఎలా ఉండేది?

పుస్తకం కావాలని అడిగిన వ్యక్తికి పుస్తకంతో పాటు, అందులో ఏ పేజీలు చదవాలో చెప్పే ఒక చిన్న కార్డు పంపేవాళ్లు. అప్పుడు అతను ఆ పేజీల్లోని సమాచారం చదివేవాడు. తర్వాతి వారం, ఆ సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్న ఇంకో కార్డు అతనికి పంపేవాళ్లు. ఆ కార్డు చివర్లో, తర్వాతి వారం ఏ పేజీలు చదవాలో ఉండేది.

అలా 12 వారాల పాటు, ప్రతీవారం స్థానిక తరగతి లేదా సంఘం నుండి ఒక కార్డు వచ్చేది. తరచూ ఆ కార్డుల్ని సంఘంలోని వృద్ధులు, ఇంటింటి పరిచర్య చేయలేనివాళ్లు పంపేవాళ్లు. ఉదాహరణకు, అమెరికాకు చెందిన సహోదరి ఆన కె. గార్డ్‌నర్‌ ఇలా గుర్తు చేసుకుంది: “దేవుని వీణ పుస్తకం విడుదలైనప్పుడు, చక్రాల కుర్చీకే పరిమితమైన మా అక్క థేల్‌కు చేతినిండా పని దొరికింది. ఆమె ప్రతీవారం, ప్రశ్నలు ఉండే కార్డుల్ని పంపించేది.” ఆ కోర్సు పూర్తయిన తర్వాత, సంఘం నుండి ఎవరైనా వెళ్లి విద్యార్థికి బైబిలు గురించి ఇంకా ఎక్కువ విషయాల్ని నేర్పించేవాళ్లు.

చక్రాల కుర్చీలో ఉన్న థేల్‌ గార్డ్‌నర్‌

చేయాల్సిన పని చాలా ఉంది

1921 చివర్లో, సహోదరుడు జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ అన్ని తరగతులకు లేదా సంఘాలకు ఒక ఉత్తరం పంపించాడు. ఆయన ఆ ఉత్తరంలో ఇలా రాశాడు: “ముందటి సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం, రాజ్యం గురించి మరింత ఎక్కువగా, సమర్థవంతంగా సాక్ష్యం ఇవ్వగలిగాం.” తర్వాత ఆయన ఇలా అన్నాడు: “చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. కాబట్టి మనతో కలిసి ఈ అద్భుతమైన పనిలో పాల్గొనమని ఇతరుల్ని ప్రోత్సహించండి.” బైబిలు విద్యార్థులు ఆ సలహాను పాటించారని స్పష్టమైంది. 1922లో వాళ్లు ధైర్యంగా ప్రకటించారు, ఇంకా ఎక్కువగా ప్రకటించారు.

^ పేరా 9 ఆ పత్రిక పేరును 1937లో కన్సోలేషన్‌ అని, 1946లో అవేక్‌! అని మార్చారు.