కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 33

పునరుత్థానం దేవుని ప్రేమను, తెలివిని, ఓర్పును తెలియజేస్తుంది

పునరుత్థానం దేవుని ప్రేమను, తెలివిని, ఓర్పును తెలియజేస్తుంది

“దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.”—అపొ. 24:15.

పాట 151 ఆయన పిలుస్తాడు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా జీవాన్ని ఇతరులతో ఎందుకు పంచుకున్నాడు?

ఒకానొక సమయంలో యెహోవా ఒక్కడే ఉన్నాడు. అలా ఒక్కడే ఉండడం వల్ల ఆయన బాధపడలేదు. సంతోషంగా ఉండాలంటే ఆయనకు ఇంకొకరి తోడు అవసరం లేదు. అయినప్పటికీ జీవాన్ని ఇతరులతో పంచుకోవాలని, వాళ్లు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ప్రేమ వల్లే యెహోవా సృష్టిని చేయడం మొదలుపెట్టాడు.—కీర్త. 36:9; 1 యోహా. 4:19.

2. యెహోవా సృష్టిని చేసినప్పుడు యేసుకు, దేవదూతలకు ఎలా అనిపించింది?

2 యెహోవా ముందుగా తన కుమారుడైన యేసును సృష్టించాడు. తర్వాత ఆ మొదటి కుమారుని ద్వారా కోట్లాది దేవదూతలతో సహా “మిగతా వాటన్నిటినీ” సృష్టించాడు. (కొలొ. 1:16) తన తండ్రితో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు యేసు సంతోషించాడు. (సామె. 8:30) యెహోవా తన ప్రధానశిల్పి అయిన యేసుతో కలిసి భూమ్యాకాశాల్ని సృష్టించడం దేవుని కుమారులైన దేవదూతలు చూశారు. అప్పుడు వాళ్లకు ఎలా అనిపించింది? భూమిని సృష్టించినప్పుడు వాళ్లు ‘సంతోషంతో స్తుతిగీతాలు పాడారు.’ యెహోవా మిగతా వాటన్నిటినీ, ముఖ్యంగా మనుషుల్ని చేసినప్పుడు కూడా వాళ్లు ఖచ్చితంగా స్తుతిగీతాలు పాడి ఉంటారు. (యోబు 38:7; సామె. 8:31, అధస్సూచి) యెహోవా సృష్టించిన ప్రతీదానిలో ఆయన ప్రేమ, తెలివి కనిపిస్తాయి.—కీర్త. 104:24; రోమా. 1:20.

3. మొదటి కొరింథీయులు 15:21, 22 చెప్తున్నట్టు, విమోచన క్రయధనం వల్ల ఏం సాధ్యమైంది?

3 తను సృష్టించిన అందమైన భూమ్మీద మనుషులు శాశ్వతకాలం జీవించాలని యెహోవా కోరుకున్నాడు. కానీ ఆదాముహవ్వలు తమ ప్రేమగల తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు పాపం, మరణం లోకంలోకి ప్రవేశించాయి. (రోమా. 5:12) అప్పుడు యెహోవా ఏం చేశాడు? వెంటనే, మనుషుల్ని కాపాడడానికి తను ఏం చేయబోతున్నాడో చెప్పాడు. (ఆది. 3:15) ఆదాముహవ్వల పిల్లల్ని పాపమరణాల నుండి విడిపించడానికి విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయాలని యెహోవా నిర్ణయించుకున్నాడు. ఆ ఏర్పాటు వల్ల, యెహోవాను సేవించాలని నిర్ణయించుకునే ప్రతీఒక్కరు శాశ్వత జీవితం పొందడం సాధ్యమైంది.—యోహా. 3:16; రోమా. 6:23; 1 కొరింథీయులు 15:21, 22 చదవండి.

4. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

4 పునరుత్థానం చేస్తానని దేవుడిచ్చిన మాటను విన్నప్పుడు మనకు చాలా ప్రశ్నలు రావచ్చు. ఉదాహరణకు, పునరుత్థానం బహుశా ఎలా జరుగుతుంది? మనకు ఇష్టమైనవాళ్లు తిరిగి బ్రతికినప్పుడు మనం వాళ్లను గుర్తుపట్టగలమా? పునరుత్థానం ఏయే విధాలుగా మనకు ఆనందాన్ని ఇస్తుంది? పునరుత్థానం గురించి ధ్యానించడం వల్ల యెహోవా ప్రేమ, తెలివి, ఓర్పు పట్ల మన కృతజ్ఞత ఎలా పెరుగుతుంది? ఈ ప్రశ్నల్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

పునరుత్థానం బహుశా ఎలా జరుగుతుంది?

5. అందరూ ఒకేసారి పునరుత్థానం అవ్వరని ఎందుకు చెప్పవచ్చు?

5 యెహోవా తన కుమారుని ద్వారా కోట్లమందిని పునరుత్థానం చేసేటప్పుడు, వాళ్లందర్నీ ఒకేసారి పునరుత్థానం చేయడని మనం చెప్పవచ్చు. ఎందుకు? ఎందుకంటే, భూమ్మీద జనాభా ఉన్నట్టుండి పెరిగిపోతే గందరగోళం ఏర్పడవచ్చు. కానీ యెహోవా చేసే ఏ పనీ గజిబిజిగా, గందరగోళంగా ఉండదు. అన్నీ శాంతిగా, సజావుగా సాగాలంటే క్రమపద్ధతి అవసరమని ఆయనకు తెలుసు. (1 కొరిం. 14:33) యెహోవా యేసుతో కలిసి ఈ భూమిని మనుషుల కోసం సిద్ధం చేసినప్పుడు తెలివిని, ఓర్పును చూపించాడు. వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో యేసు కూడా, హార్‌మెగిద్దోనును తప్పించుకున్న వాళ్లతో కలిసి ఈ భూమిని పునరుత్థానమయ్యే వాళ్లకోసం సిద్ధం చేసేటప్పుడు తెలివిని, ఓర్పును చూపిస్తాడు.

హార్‌మెగిద్దోనును తప్పించుకున్నవాళ్లు పునరుత్థానమైన వాళ్లకు దేవుని రాజ్యం గురించి, యెహోవా ప్రమాణాల గురించి నేర్పిస్తారు (6వ పేరా చూడండి) *

6. అపొస్తలుల కార్యాలు 24:15 ప్రకారం, ఎవరెవరు పునరుత్థానం అవుతారు?

6 అన్నిటికన్నా ముఖ్యంగా, హార్‌మెగిద్దోనును తప్పించుకునేవాళ్లు పునరుత్థానమయ్యే వాళ్లకు దేవుని రాజ్యం గురించి, యెహోవా ప్రమాణాల గురించి నేర్పించాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే పునరుత్థానమయ్యే వాళ్లలో ఎక్కువశాతం మంది ‘అనీతిమంతులు’ ఉంటారు. (అపొస్తలుల కార్యాలు 24:15 చదవండి.) వాళ్లు క్రీస్తు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందాలంటే ఎన్నో మార్పులు చేసుకోవాలి. యెహోవా గురించి ఏమాత్రం తెలియని కోట్లమంది ప్రజలకు సత్యం నేర్పించడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం చేస్తున్న బైబిలు స్టడీల్లాగే అప్పుడు కూడా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా సత్యాన్ని బోధిస్తామా? పునరుత్థానమైన వాళ్లు వేర్వేరు సంఘాలకు నియమించబడి, తమ తర్వాత పునరుత్థానమయ్యే వాళ్లకు బోధించడం కోసం శిక్షణ పొందుతారా? ఏమో మనం వేచి చూడాల్సిందే. అయితే మనకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు: క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన చివరికల్లా “భూమి యెహోవా గురించిన జ్ఞానంతో నిండిపోతుంది.” (యెష. 11:9) ఆ వెయ్యేళ్ల కాలంలో మనం సంతోషంగా, బిజీగా పని చేస్తుంటాం.

7. పునరుత్థానమైన వాళ్లకు బోధించేటప్పుడు దేవుని ప్రజలు ఎందుకు సహానుభూతి చూపిస్తారు?

7 వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో, యెహోవా ప్రజలందరూ ఆయన్ని సంతోషపెట్టడానికి మార్పులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్లందరూ సహానుభూతి చూపిస్తూ పాపపు స్వభావంతో పోరాడేలా, యెహోవా ప్రమాణాలకు తగ్గట్టు జీవించేలా పునరుత్థానమైన వాళ్లకు సహాయం చేస్తారు. (1 పేతు. 3:8) పునరుత్థానమైన వాళ్లు కూడా యెహోవా ప్రజలు వినయస్థులని, ఆయన్ని సంతోషపెట్టడానికి వాళ్లు ఇంకా మార్పులు చేసుకుంటూ ఉన్నారని గ్రహించి, వాళ్లతో కలిసి ఆయన్ని ఆరాధించాలని కోరుకుంటారు.—ఫిలి. 2:12.

పునరుత్థానమైన వాళ్లను మనం గుర్తుపట్టగలమా?

8. పునరుత్థానమైన మనవాళ్లను గుర్తుపట్టగలం అని ఎలా చెప్పవచ్చు?

8 మనకు ఇష్టమైనవాళ్లు పునరుత్థానమైనప్పుడు మనం వాళ్లను గుర్తుపట్టగలమని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, చనిపోబోయే ముందు వాళ్ల రూపం, మాటలు, ఆలోచనలు ఎలా ఉండేవో యెహోవా వాళ్లను తిరిగి బ్రతికించినప్పుడు కూడా అవి అలాగే ఉంటాయని ఇప్పటికే జరిగిన పునరుత్థానాల్ని బట్టి తెలుస్తోంది. యేసు మరణాన్ని నిద్రతో, పునరుత్థానాన్ని నిద్ర లేవడంతో పోల్చాడని గుర్తుంచుకోండి. (మత్త. 9:18, 24; యోహా. 11:11-13) సాధారణంగా మనం నిద్ర లేచినప్పుడు మన రూపం, మాటలు, జ్ఞాపకాలు నిద్రపోకముందు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. లాజరు ఉదాహరణ పరిశీలించండి. లాజరు చనిపోయి నాలుగు రోజులైంది కాబట్టి అతని శరీరం కుళ్లిపోవడం మొదలైంది. అయినప్పటికీ యేసు లాజరును తిరిగి బ్రతికించినప్పుడు అతని సహోదరీలు అతన్ని గుర్తుపట్టారు, అతను కూడా వాళ్లను ఖచ్చితంగా గుర్తుపట్టేవుంటాడు.—యోహా. 11:38-44; 12:1, 2.

9. పునరుత్థానమైన వాళ్లు వెంటనే పరిపూర్ణులు అవ్వరని ఎలా చెప్పవచ్చు?

9 క్రీస్తు పరిపాలన కింద జీవించే వాళ్లెవ్వరూ, “నాకు ఒంట్లో బాలేదు” అని అనరని యెహోవా మాటిచ్చాడు. (యెష. 33:24; రోమా. 6:7) కాబట్టి పునరుత్థానమయ్యే వాళ్లు ఆరోగ్యవంతమైన శరీరంతో తిరిగి బ్రతికించబడతారు. అయితే, వాళ్లు వెంటనే పరిపూర్ణులు అవ్వరు. వాళ్లు వెంటనే పరిపూర్ణులైతే వాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు వాళ్లను గుర్తుపట్టలేకపోవచ్చు. క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో మనుషులందరూ క్రమక్రమంగా పరిపూర్ణతకు చేరుకుంటారని తెలుస్తోంది. వెయ్యేళ్ల పరిపాలన ముగింపు కల్లా, దేవుని రాజ్యం మనుషుల్ని పరిపూర్ణులుగా చేయడంతో పాటు యెహోవా అప్పగించిన పని అంతటినీ పూర్తి చేస్తుంది. అప్పుడు యేసు తన తండ్రికి రాజ్యాన్ని తిరిగి అప్పగిస్తాడు.—1 కొరిం. 15:24-28; ప్రక. 20:1-3.

పునరుత్థానం ఏయే విధాలుగా మనకు ఆనందాన్ని ఇస్తుంది?

10. పునరుత్థానమైన మీ వాళ్లను కలిసినప్పుడు మీకెలా అనిపిస్తుంది?

10 మీకు ఇష్టమైనవాళ్లు పునరుత్థానమైనప్పుడు వాళ్లను కలవడం ఎలా ఉంటుందో ఊహించండి. మీరు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతారా లేదా ఆనందం పట్టలేక ఏడ్చేస్తారా? సంతోషంతో యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడతారా? ఒక విషయం మాత్రం ఖచ్చితం: పునరుత్థానం అనే అద్భుతమైన బహుమతి ఇచ్చినందుకు శ్రద్ధగల మీ తండ్రి పట్ల, ఆయన ప్రియ కుమారుడి పట్ల మీ ప్రేమ ఎక్కువౌతుంది.

11. యోహాను 5:28, 29⁠లోని యేసు మాటల్ని బట్టి, దేవుని నీతి ప్రమాణాలకు తగ్గట్టు జీవించేవాళ్లు ఏం పొందుతారు?

11 పునరుత్థానమైన వాళ్లు తమ పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి, దేవుని నీతి ప్రమాణాలకు తగ్గట్టు జీవిస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో ఆలోచించండి. అలా మార్పులు చేసుకున్నవాళ్లు పరదైసులో శాశ్వతకాలం జీవించే అవకాశం పొందుతారు. అయితే మారడానికి ఇష్టపడని వాళ్లను యెహోవా పరదైసులో ఉండనివ్వడు, అక్కడి శాంతిని పాడుచేయనివ్వడు.—యెష. 65:20; యోహాను 5:28, 29 చదవండి.

12. భూమ్మీదున్న వాళ్లందర్నీ యెహోవా ఏయే విధాలుగా ఆశీర్వదిస్తాడు?

12 రాజ్య పరిపాలనలో దేవుని ప్రజలందరూ సామెతలు 10:22⁠లోని మాటలు ఎంత నిజమో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అక్కడిలా ఉంది: “యెహోవా ఆశీర్వాదమే ఒక వ్యక్తిని ధనవంతుణ్ణి చేస్తుంది.” యెహోవా పవిత్రశక్తి సహాయంతో దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా ధనవంతులౌతారు, అంటే క్రీస్తులాంటి వ్యక్తిత్వాన్ని ఇంకా ఎక్కువగా అలవర్చుకుంటారు, క్రమక్రమంగా పరిపూర్ణతకు చేరుకుంటారు. (యోహా. 13:15-17; ఎఫె. 4:23, 24) రోజురోజుకీ వాళ్లు బలంగా, మంచి వ్యక్తులుగా తయారౌతారు. అప్పుడు జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! (యోబు 33:25) అయితే, పునరుత్థానం గురించి ధ్యానించడం వల్ల మనం ఇప్పుడెలా ప్రయోజనం పొందవచ్చు?

పునరుత్థానం యెహోవా ప్రేమను తెలియజేస్తుంది

13. కీర్తన 139:1-4 ప్రకారం, యెహోవాకు మన గురించి ఎంత బాగా తెలుసు? పునరుత్థానం దాన్నెలా రుజువుచేస్తుంది?

13 మనం పై పేరాల్లో పరిశీలించినట్టు చనిపోకముందు ప్రజలకు ఏ జ్ఞాపకాలు, ఏ లక్షణాలు ఉండేవో వాటితోనే యెహోవా వాళ్లను తిరిగి బ్రతికిస్తాడు. అందుకోసం యెహోవా ఏమేం చేయాల్సి ఉంటుందో ఆలోచించండి. యెహోవాకు మీమీద ఎంత ప్రేమ ఉందంటే ఆయన మీ ఆలోచనల్ని, భావాల్ని, మాటల్ని, పనుల్ని అన్నిటినీ గమనిస్తాడు, గుర్తుంచుకుంటాడు. కాబట్టి మిమ్మల్ని పునరుత్థానం చేసేటప్పుడు యెహోవా మీ జ్ఞాపకాల్ని, స్వభావాన్ని, లక్షణాల్ని తిరిగి మీకు ఇవ్వగలుగుతాడు. మనలో ప్రతీఒక్కరి మీద యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో దావీదు రాజు గుర్తించాడు. (కీర్తన 139:1-4 చదవండి.) యెహోవాకు మన గురించి ఎంతగా తెలుసో అర్థం చేసుకున్నప్పుడు మనకెలా అనిపిస్తుంది?

14. యెహోవాకు మన గురించి ఎంత బాగా తెలుసో ఆలోచించినప్పుడు మనకెలా అనిపిస్తుంది?

14 యెహోవాకు మన గురించి ఎంత బాగా తెలుసో అర్థం చేసుకున్నప్పుడు మనం ఆందోళనపడం. ఎందుకు? యెహోవాకు మన మీద ఎంతో శ్రద్ధ ఉంది. మనలో ప్రతీఒక్కర్ని ఆయన విలువైన వాళ్లుగా చూస్తాడు. జీవితంలో మనకు ఎదురైన అనుభవాల్ని, అవి మనపై చూపిన ప్రభావాన్ని ఆయన గమనిస్తాడు. అది మనకు ఎంత ఓదార్పునిస్తుందో కదా! మనం ఒంటరివాళ్లమని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రతీరోజు, ప్రతీక్షణం యెహోవా మన పక్కనే ఉండి, మనకు సహాయం చేసే అవకాశాల కోసం చూస్తుంటాడు.—2 దిన. 16:9.

పునరుత్థానం యెహోవా తెలివిని తెలియజేస్తుంది

15. పునరుత్థాన నిరీక్షణ యెహోవా తెలివైనవాడని ఎలా నిరూపిస్తుంది?

15 సాతాను అధీనంలో ఉన్నవాళ్లు మరణ భయాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంలా ఉపయోగిస్తూ, తమ స్నేహితులకు ద్రోహం చేయమని, తప్పుడు పనులు చేయమని ప్రజల్ని ఒత్తిడి చేస్తుంటారు. అయితే ఆ ఆయుధం మన దగ్గర పనిచేయదు. శత్రువులు మనల్ని చంపేసినా యెహోవా పునరుత్థానం చేస్తాడని మనకు తెలుసు. (ప్రక. 2:10) వాళ్లు ఎంత ప్రయత్నించినా, యెహోవా నుండి మనల్ని వేరు చేయలేరని మనకు బాగా తెలుసు. (రోమా. 8:35-39) పునరుత్థాన నిరీక్షణ యెహోవా ఎంత తెలివైనవాడో నిరూపిస్తుంది. ఆ నిరీక్షణ ద్వారా సాతాను ఉపయోగిస్తున్న శక్తివంతమైన ఆయుధాన్ని యెహోవా పనికిరాకుండా చేస్తాడు, అంతేకాదు మనలో ధైర్యం నింపుతాడు.

మన అవసరాల్ని తీరుస్తానని యెహోవా ఇచ్చిన మాటను నమ్ముతున్నట్లు మన నిర్ణయాలు చూపిస్తున్నాయా? (16వ పేరా చూడండి) *

16. మీరు ఏ ప్రశ్నలు వేసుకోవాలి? వాటికి మీరిచ్చే జవాబులు మీకు యెహోవా మీద ఎంత నమ్మకం ఉందో ఎలా తెలియజేస్తాయి?

16 ఒకవేళ శత్రువులు మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తే, యెహోవా మిమ్మల్ని పునరుత్థానం చేస్తాడనే నమ్మకంతో ఉంటారా? మీకు అంత బలమైన నమ్మకం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు వేసుకోండి: ప్రతీరోజు నేను తీసుకునే చిన్నచిన్న నిర్ణయాలు నాకు యెహోవా మీద నమ్మకం ఉందని చూపిస్తున్నాయా? (లూకా 16:10) రాజ్యానికి మొదటిస్థానం ఇస్తే యెహోవా నా అవసరాల్ని తీరుస్తాడని నేను నమ్ముతున్నట్లు నా జీవన విధానం చూపిస్తోందా? (మత్త. 6:31-33) ఆ ప్రశ్నలకు మీ జవాబు అవును అయితే, యెహోవా మీద మీకు నిజంగా నమ్మకం ఉన్నట్టే, రాబోయే రోజుల్లో వచ్చే ఎలాంటి పరీక్షకైనా మీరు సిద్ధంగా ఉన్నట్టే.—సామె. 3:5, 6.

పునరుత్థానం యెహోవా ఓర్పును తెలియజేస్తుంది

17. (ఎ) పునరుత్థానం యెహోవా ఓర్పును ఎలా తెలియజేస్తుంది? (బి) యెహోవా ఓర్పు పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

17 ఈ పాత వ్యవస్థను ఏ రోజున, ఏ గంటలో నాశనం చేయాలో యెహోవా నిర్ణయించేశాడు. (మత్త. 24:36) ఆయన సహనం కోల్పోయి ఆ సమయం కన్నా ముందే దాన్ని నాశనం చేయడు. చనిపోయిన వాళ్లను పునరుత్థానం చేయాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు, కానీ ఆయన ఓర్పు చూపిస్తున్నాడు. (యోబు 14:14, 15) వాళ్లను తిరిగి బ్రతికించే సరైన సమయం వచ్చేంత వరకు ఆయన ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు. (యోహా. 5:28) యెహోవా ఓర్పు చూపిస్తున్నందుకు మనం ఎంతో కృతజ్ఞులం. ఎందుకు? ఒకసారి ఆలోచించండి: యెహోవా ఓర్పు చూపించడం వల్లే మనకు, ఇంకా చాలామందికి “పశ్చాత్తాపపడే అవకాశం” దొరికింది. (2 పేతు. 3:9) శాశ్వత జీవితాన్ని పొందే అవకాశం వీలైనంత ఎక్కువమందికి దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఓర్పు పట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపిద్దాం. ఎలా? “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్ల కోసం పట్టుదలగా వెదకడం ద్వారా; యెహోవాను ప్రేమించేలా, ఆరాధించేలా వాళ్లకు సహాయం చేయడం ద్వారా ఆ కృతజ్ఞతను చూపిద్దాం. (అపొ. 13:48) అప్పుడు వాళ్లు కూడా మనలాగే యెహోవా ఓర్పు నుండి ప్రయోజనం పొందుతారు.

18. మనం ఇతరులతో ఎందుకు ఓపిగ్గా ఉండాలి?

18 వెయ్యేళ్ల పరిపాలన చివర్లో మనం పరిపూర్ణులం అయ్యే వరకు యెహోవా ఓర్పు చూపిస్తూ ఉంటాడు. అప్పటివరకు మన పాపాల్ని క్షమించడానికి యెహోవా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం కూడా ఇతరుల్లో ఉన్న మంచిని చూస్తూ, వాళ్లతో ఓపిగ్గా ఉండాలి. ఒక సహోదరి అనుభవం పరిశీలించండి. ఆమె భర్త తీవ్రమైన ఆందోళనతో బాధపడుతున్నాడు, మీటింగ్స్‌కు రావడం మానేశాడు. ఆమె ఇలా చెప్తోంది: “నాకు చాలా కష్టంగా అనిపించింది. మా జీవితం, మా ప్రణాళికలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.” అయినా, ఆమె తన భర్త పట్ల ప్రేమతో ఓపిక చూపిస్తూనే ఉంది. ఆమె ఆశ వదులుకోకుండా యెహోవా మీద ఆధారపడింది. యెహోవాలా ఆమె తన భర్తలోని మంచి విషయాల మీద మనసుపెట్టింది. ఆమె ఇంకా ఇలా చెప్తోంది: “నా భర్తలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, ఆందోళన నుండి బయటపడడానికి ఆయన మెల్లమెల్లగా కృషిచేస్తున్నాడు.” సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నిస్తున్న మన కుటుంబ సభ్యులతో, సంఘంలోని వాళ్లతో ఓపిగ్గా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!

19. మనం ఏమని నిర్ణయించుకోవాలి?

19 మొదట్లో యెహోవా భూమిని సృష్టించినప్పుడు యేసు, దేవదూతలు సంతోషించారు. భవిష్యత్తులో యెహోవాను ప్రేమించే, సేవించే పరిపూర్ణ మనుషులతో భూమి నిండడాన్ని చూసినప్పుడు వాళ్లు ఇంకెంత సంతోషిస్తారో ఊహించండి. పరలోకానికి వెళ్లినవాళ్లు తమ పరిపాలన వల్ల భూమ్మీది ప్రజలు ప్రయోజనం పొందడాన్ని చూసి ఎంత సంతోషిస్తారో ఊహించండి. (ప్రక. 4:4, 9-11; 5:9, 10) దుఃఖానికి బదులు ఆనంద బాష్పాలు ఉండే జీవితాన్ని, అనారోగ్యం, బాధ, మరణం ఇక ఎప్పటికీ ఉండని కాలాన్ని ఊహించండి. (ప్రక. 21:4) అప్పటివరకు మన పరలోక తండ్రిలా ప్రేమ, తెలివి, ఓర్పు చూపించాలని నిర్ణయించుకోండి. అలాచేస్తే ఎలాంటి కష్టాలు ఎదురైనా మీరు సంతోషంగా ఉంటారు. (యాకో. 1:2-4) “దేవుడు తిరిగి బ్రతికిస్తాడు” అనే వాగ్దానాన్ని బట్టి మనం యెహోవాకు ఎంత కృతజ్ఞులమో కదా!—అపొ. 24:15.

పాట 141 జీవం ఒక అద్భుతం

^ పేరా 5 యెహోవా ప్రేమ, తెలివి, ఓర్పు గల తండ్రి. ఈ లక్షణాలు సృష్టి అంతటిలో, చనిపోయిన వాళ్లను తిరిగి బ్రతికిస్తానని ఆయన చేసిన వాగ్దానంలో కనిపిస్తాయి. పునరుత్థానానికి సంబంధించి మనకు వచ్చే కొన్ని ప్రశ్నల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. యెహోవా ప్రేమ, తెలివి, ఓర్పు పట్ల మనమెలా కృతజ్ఞత చూపించవచ్చో కూడా తెలుసుకుంటాం.

^ పేరా 59 చిత్రాల వివరణ: వందల సంవత్సరాల క్రితం చనిపోయిన ఒకవ్యక్తి, క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో పునరుత్థానం అయ్యాడు. హార్‌మెగిద్దోనును తప్పించుకున్న ఒక సహోదరుడు, క్రీస్తు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలో అతనికి సంతోషంగా బోధిస్తున్నాడు.

^ పేరా 61 చిత్రాల వివరణ: వారంలో కొన్ని రోజులు ఓవర్‌టైం చేయలేనని, ఆ రోజుల్లో సాయంత్రం సమయాన్ని యెహోవా ఆరాధన కోసం ఉపయోగిస్తానని ఒక సహోదరుడు తన యజమానికి చెప్తున్నాడు. అయితే, మిగతా రోజుల్లో అత్యవసరమైన పని పడినప్పుడు ఓవర్‌టైం చేయడానికి సహోదరుడు సిద్ధంగా ఉన్నాడు.