కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 34

యెహోవా సంఘంలో మీరు విలువైన వాళ్లు

యెహోవా సంఘంలో మీరు విలువైన వాళ్లు

“శరీరం ఒక్కటే అయినా అవయవాలు చాలా ఉంటాయి; అలాగే అవయవాలు చాలా ఉన్నా శరీరం ఒక్కటే. క్రీస్తు శరీరం కూడా అంతే.”—1 కొరిం. 12:12.

పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మనకు దొరికిన గొప్ప గౌరవం ఏంటి?

యెహోవా సంఘంలో ఒకరిగా ఉండడం మనకు దొరికిన గొప్ప గౌరవం! శాంతిగా, సంతోషంగా ఉండే ప్రజలతో కలిసి మనం ఒక ఆధ్యాత్మిక పరదైసులో జీవిస్తున్నాం. అయితే, సంఘంలో మీ స్థానం ఏంటి?

2. అపొస్తలుడైన పౌలు తాను రాసిన కొన్ని ఉత్తరాల్లో ఏ ఉదాహరణ ఉపయోగించాడు?

2 అపొస్తలుడైన పౌలు దైవప్రేరణతో రాసిన ఉత్తరాల్లో ఒక ఉదాహరణను చాలాసార్లు ఉపయోగించాడు. అది సంఘంలో మన స్థానాన్ని గుర్తించడానికి ఎంతో సహాయం చేస్తుంది. పౌలు ఆ ఉత్తరాల్లో సంఘాన్ని మనిషి శరీరంతో, సంఘంలోని వాళ్లను శరీరంలోని అవయవాలతో పోల్చాడు.—రోమా. 12:4-8; 1 కొరిం. 12:12-27; ఎఫె. 4:16.

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏ మూడు పాఠాలు నేర్చుకుంటాం?

3 పౌలు ఉపయోగించిన ఉదాహరణ నుండి మూడు ముఖ్యమైన పాఠాల్ని మనం ఇప్పుడు నేర్చుకుంటాం. మొదటిగా, సంఘంలో ప్రతీఒక్కరికి విలువైన స్థానం * ఉందని నేర్చుకుంటాం. రెండవదిగా, సంఘంలో మనకున్న స్థానాన్ని మనం గుర్తించలేకపోతుంటే ఏం చేయవచ్చో తెలుసుకుంటాం. మూడవదిగా, సంఘంలో యెహోవా మనకు అప్పగించిన పనిని చేయడంలో బిజీగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో పరిశీలిస్తాం.

యెహోవా సంఘంలో ప్రతీఒక్కరికి విలువైన స్థానం ఉంది

4. రోమీయులు 12:4, 5 వచనాలు మనకు ఏం బోధిస్తున్నాయి?

4 పౌలు ఉపయోగించిన ఉదాహరణ నుండి మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే, యెహోవా కుటుంబంలో ప్రతీఒక్కరికి విలువైన స్థానం ఉంది. పౌలు తన ఉదాహరణను ఈ మాటలతో మొదలుపెట్టాడు: “ఒకే శరీరంలో చాలా అవయవాలు ఉన్నా, అన్నీ ఒకే పని చేయవు. అలాగే మనం కూడా చాలామందిమి ఉన్నా, క్రీస్తులో ఒకే శరీరంగా ఉన్నాం; మనం ఒకదానికొకటి జతచేయబడిన అవయవాలం.” (రోమా. 12:4, 5) పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర ఉంటుంది, కానీ అందరూ విలువైన వాళ్లే.

సంఘంలో మనకు వేర్వేరు పాత్రలు ఉండవచ్చు, కానీ అందరమూ విలువైన వాళ్లమే (5-12 పేరాలు చూడండి) *

5. యెహోవా తన సంఘానికి ఏ ‘వరాల్ని’ ఇచ్చాడు?

5 సంఘంలో ఒక స్థానం ఉన్నవాళ్లు అనగానే, సంఘంలో నాయకత్వం వహించేవాళ్లు మీకు గుర్తుకురావచ్చు. (1 థెస్స. 5:12; హెబ్రీ. 13:17) క్రీస్తు ద్వారా యెహోవా తన సంఘానికి “మనుషుల్లో వరాల్ని” ఇచ్చాడు. (ఎఫె. 4:8) ఆ వరాల్లో పరిపాలక సభ సభ్యులు, పరిపాలక సభ సహాయకులు, బ్రాంచి కమిటీ సభ్యులు, ప్రాంతీయ పర్యవేక్షకులు, బైబిలు పాఠశాలల ఉపదేశకులు, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు ఉన్నారు. ఈ సహోదరులందరూ అమూల్యమైన యెహోవా గొర్రెల్ని శ్రద్ధగా చూసుకోవడానికి, సంఘాన్ని బలపర్చడానికి పవిత్రశక్తితో నియమించబడ్డారు.—1 పేతు. 5:2, 3.

6. మొదటి థెస్సలొనీకయులు 2:6-8 ప్రకారం, పవిత్రశక్తితో నియమించబడిన సహోదరులు ఏం చేస్తారు?

6 పవిత్రశక్తితో నియమించబడిన సహోదరులు వేర్వేరు బాధ్యతల్లో సేవ చేస్తారు. శరీరంలోని చేతులు, పాదాలు లాంటి వేర్వేరు అవయవాలు కష్టపడి పనిచేయడం వల్ల శరీరమంతా ప్రయోజనం పొందుతుంది. అదేవిధంగా పవిత్రశక్తితో నియమించబడిన సహోదరులు కష్టపడి పనిచేయడం వల్ల సంఘమంతా ప్రయోజనం పొందుతుంది. వాళ్లు సొంత ఘనత కోసం ప్రాకులాడరు, బదులుగా తమ సహోదర సహోదరీల్ని బలపర్చడానికి కృషి చేస్తారు. (1 థెస్సలొనీకయులు 2:6-8 చదవండి.) లేఖన అర్హతలు, నిస్వార్థ స్ఫూర్తి గల అలాంటి సహోదరుల్ని ఇచ్చినందుకు యెహోవాకు మనమెంతో కృతజ్ఞులం!

7. పూర్తికాల సేవలో ఉన్న చాలామంది ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు?

7 సంఘంలో కొంతమంది మిషనరీలుగా, ప్రత్యేక పయినీర్లుగా, క్రమ పయినీర్లుగా సేవ చేయడానికి నియమించబడవచ్చు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా చాలామంది సహోదర సహోదరీలు ప్రకటనా పనికి, శిష్యుల్ని చేసే పనికి ప్రాముఖ్యత ఇస్తూ పూర్తికాల సేవలో అడుగుపెట్టారు. క్రీస్తుయేసు శిష్యులయ్యేలా వాళ్లు చాలామందికి సహాయం చేశారు. సాధారణంగా ఈ పూర్తికాల సువార్తికులకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ యెహోవా వాళ్లను ఎన్నో విధాలుగా ఆశీర్వదించాడు. (మార్కు 10:29, 30) ఈ ప్రియ సహోదర సహోదరీల్ని మనం ఎంతో ప్రేమిస్తాం, వాళ్లు మన సంఘంలో ఉన్నందుకు చాలా సంతోషిస్తాం!

8. మంచివార్త ప్రకటించే ప్రతీఒక్కరు యెహోవాకు ఎందుకు విలువైన వాళ్లు?

8 పవిత్రశక్తితో నియమించబడిన సహోదరులకు, పూర్తికాల సేవకులకు మాత్రమే సంఘంలో ఒక స్థానం ఉందా? కానేకాదు! మంచివార్త ప్రకటించే ప్రతీఒక్కరు దేవునికి, సంఘానికి చాలా విలువైన వాళ్లు. (రోమా. 10:15; 1 కొరిం. 3:6-9) ఎందుకంటే, సంఘం చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన పనుల్లో ఒకటి, శిష్యుల్ని చేసే పని. (మత్త. 28:19, 20; 1 తిమో. 2:4) సంఘంతో కలిసి ప్రకటించే ప్రచారకులందరూ అంటే బాప్తిస్మం తీసుకున్నవాళ్లు, తీసుకోనివాళ్లు ఆ పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి కృషిచేస్తారు.—మత్త. 24:14.

9. క్రైస్తవ సహోదరీల్ని మనం ఎందుకు విలువైన వాళ్లుగా చూస్తాం?

9 యెహోవా క్రైస్తవ సహోదరీలకు సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇస్తున్నాడు. క్రైస్తవ సంఘంలో ఉన్న భార్యలు, తల్లులు, విధవరాళ్లు, ఒంటరి సహోదరీలు ఆయన్ని నమ్మకంగా సేవిస్తున్నారు. వాళ్లందర్నీ యెహోవా విలువైన వాళ్లుగా చూస్తున్నాడు. దేవున్ని సంతోషపెట్టిన చాలామంది ఆదర్శవంతులైన స్త్రీల గురించి బైబిల్లో ఉంది. వాళ్లు చూపించిన తెలివి, విశ్వాసం, ఉత్సాహం, ధైర్యం, ఉదారత వంటి లక్షణాల్ని బట్టి, వాళ్లు చేసిన మంచి పనుల్ని బట్టి బైబిలు వాళ్లను మెచ్చుకుంటోంది. (లూకా 8:2, 3; అపొ. 16:14, 15; రోమా. 16:3, 6; ఫిలి. 4:3; హెబ్రీ. 11:11, 31, 35) సంఘంలో ఇలాంటి అందమైన లక్షణాలు గల స్త్రీలు ఉన్నందుకు మనం యెహోవాకు ఎంతో కృతజ్ఞులం!

10. మనం వృద్ధ సహోదర సహోదరీల్ని ఎందుకు విలువైన వాళ్లుగా చూస్తాం?

10 సంఘంలో ఉన్న వృద్ధుల్ని బట్టి కూడా మనం ఎంతో సంతోషిస్తాం. కొన్ని సంఘాల్లో, ఎంతోకాలంగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్న వృద్ధ సహోదర సహోదరీలు ఉన్నారు. ఇంకొంతమంది వృద్ధులు ఈమధ్యే సత్యంలోకి వచ్చారు. ఏదేమైనా, ఈ సహోదర సహోదరీల్లో చాలామంది వయసు పైబడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆ సమస్యల వల్ల వాళ్లు సంఘ పనుల్లో, పరిచర్యలో ఎక్కువగా పాల్గొనలేకపోతుండవచ్చు. అయినా వాళ్లు పరిచర్యలో చేయగలిగినదంతా చేస్తున్నారు; ఇతరుల్ని ప్రోత్సహించడానికి, శిక్షణ ఇవ్వడానికి తమ శక్తిని ధారపోస్తున్నారు! వాళ్ల అనుభవం నుండి మనం ఎంతో ప్రయోజనం పొందుతున్నాం. వాళ్లు యెహోవా దృష్టిలో, మన దృష్టిలో చాలా అందమైనవాళ్లు.—సామె. 16:31.

11-12. సంఘంలోని యౌవనుల నుండి, పిల్లల నుండి మీరెలాంటి ప్రోత్సాహం పొందారు?

11 సంఘంలోని యౌవనుల గురించి, పిల్లల గురించి కూడా ఆలోచించండి. అపవాదియైన సాతాను వల్ల, అతని చెడ్డ ఆలోచనల వల్ల ఈ లోకం బాగా చెడిపోయింది. అలాంటి లోకంలో పెరుగుతున్న మన యౌవనులు, పిల్లలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. (1 యోహా. 5:19) అయినా వాళ్లు మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్తున్నారు, పరిచర్యలో పాల్గొంటున్నారు, తమ నమ్మకాల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. వాళ్లను చూసినప్పుడు మనందరికీ ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. అవును యెహోవా సంఘంలో యౌవనులకు, పిల్లలకు కూడా విలువైన స్థానం ఉంది!—కీర్త. 8:2.

12 అయితే, కొంతమంది సహోదర సహోదరీలు సంఘంలో తాము కూడా విలువైన వాళ్లమే అని గుర్తించలేకపోతున్నారు. మనలో ప్రతీఒక్కరికి సంఘంలో విలువైన స్థానం ఉందని గుర్తించడానికి ఏది సహాయం చేస్తుంది? దాని గురించి ఇప్పుడు చూద్దాం.

సంఘంలో మీకూ ఒక విలువైన స్థానం ఉందని గుర్తించండి

13-14. సంఘంలో తాము కూడా విలువైన వాళ్లమే అనే విషయాన్ని కొంతమంది ఎందుకు గుర్తించలేకపోవచ్చు?

13 పౌలు ఉపయోగించిన ఉదాహరణ నుండి మనం నేర్చుకునే రెండో పాఠం ఏంటి? నేడు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య గురించి పౌలు మాట్లాడాడు; సంఘంలో తాము కూడా విలువైన వాళ్లమే అనే విషయాన్ని వాళ్లు గుర్తించలేకపోతున్నారు. పౌలు ఇలా రాశాడు: “పాదం, ‘నేను చెయ్యిని కాదు కాబట్టి శరీరంలో భాగం కాను’ అని అన్నంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. అలాగే చెవి, ‘నేను కన్నును కాదు కాబట్టి శరీరంలో భాగం కాను’ అని అన్నంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.” (1 కొరిం. 12:15, 16) పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు?

14 సంఘంలోని ఇతరులతో మిమ్మల్ని పోల్చుకుంటే, మీరెంత విలువైన వాళ్లో మీరు గుర్తించలేకపోవచ్చు. సంఘంలో కొంతమంది నైపుణ్యవంతంగా బోధిస్తుండవచ్చు; అన్ని పనులు చక్కగా, పద్ధతిగా చేస్తుండవచ్చు; లేదా ఇతరుల్ని బాగా ప్రోత్సహిస్తుండవచ్చు, ఓదారుస్తుండవచ్చు. మీరు వాళ్లంత బాగా చేయట్లేదని మీకు అనిపించవచ్చు. అలా అనిపిస్తుందంటే మీరు వినయం, అణకువ గలవాళ్లని అర్థం. (ఫిలి. 2:3) అయితే జాగ్రత్త! మంచి సామర్థ్యాలున్న ఇతరులతో మిమ్మల్ని అదేపనిగా పోల్చుకుంటూ ఉంటే, మీరు నిరుత్సాహపడతారు. పౌలు చెప్పినట్టుగా, ‘సంఘంలో నేను భాగం కాను’ అని అనుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి ఆలోచనల నుండి బయటపడడానికి మీకేది సహాయం చేస్తుంది?

15. మొదటి కొరింథీయులు 12:4-11 ప్రకారం, మన దగ్గర ఎలాంటి వరం ఉన్నా ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

15 ఈ వాస్తవాన్ని పరిశీలించండి: యెహోవా మొదటి శతాబ్దంలోని కొంతమంది క్రైస్తవులకు అద్భుతమైన పవిత్రశక్తి వరాల్ని ఇచ్చాడు. కానీ వాళ్లందరికీ ఒకేలాంటి వరాలు ఇవ్వలేదు. (1 కొరింథీయులు 12:4-11 చదవండి.) యెహోవా వాళ్లకు వేర్వేరు వరాల్ని, సామర్థ్యాల్ని ఇచ్చినప్పటికీ వాళ్లలో ప్రతీఒక్కరు విలువైన వాళ్లే. నేడు మనం అద్భుతమైన పవిత్రశక్తి వరాల్ని పొందట్లేదు. కానీ అందులోని సూత్రం మనకు కూడా వర్తిస్తుంది. అదేంటంటే, మనందరికీ ఒకేలాంటి నైపుణ్యాలు ఉండకపోవచ్చు, అయినా మనలో ప్రతీఒక్కరం యెహోవాకు విలువైన వాళ్లమే.

16. పౌలు ఇచ్చిన ఏ సలహాను మనం పాటించాలి?

16 సంఘంలోని ఇతరులతో మనల్ని పోల్చుకునే బదులు, పౌలు దైవప్రేరణతో ఇచ్చిన ఈ సలహాను మనం పాటించాలి: “ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి, అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.”—గల. 6:4.

17. పౌలు ఇచ్చిన సలహాను పాటిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

17 పౌలు ఇచ్చిన సలహా ప్రకారం మనం చేసే పనుల్ని పరిశీలించుకుంటే, వేరేవాళ్లకు లేని సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయని గుర్తించవచ్చు. ఉదాహరణకు, ఒక సంఘ పెద్ద మంచి ప్రసంగాలు ఇవ్వలేకపోవచ్చు కానీ శిష్యుల్ని చేసే పనిని చాలా సమర్థవంతంగా చేస్తుండవచ్చు. లేదా వేరేవాళ్లలా అతను అన్ని పనులు చక్కగా, పద్ధతిగా చేయలేకపోతుండవచ్చు కానీ ప్రేమగల కాపరి అనే మంచి పేరు అతనికి ఉండవచ్చు; ప్రచారకులు అతని దగ్గరికి వెళ్లడానికి, లేఖనాల నుండి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడుతుండవచ్చు. లేదా మంచి ఆతిథ్య స్ఫూర్తిని చూపిస్తాడనే పేరు అతనికి ఉండవచ్చు. (హెబ్రీ. 13:2, 16) మనకున్న సామర్థ్యాల్ని, వరాల్ని స్పష్టంగా గుర్తించినప్పుడు, సంఘం కోసం మనం కూడా ఏదోకటి చేయగలమని అనిపిస్తుంది. అంతేకాదు మనకు లేని సామర్థ్యాలు, వరాలు ఉన్న సహోదరుల్ని చూసి ఈర్ష్య పడకుండా ఉంటాం.

18. మన సామర్థ్యాల్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు?

18 సంఘంలో మనకు ఏ స్థానం ఉన్నా మన సేవను, సామర్థ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి ప్రతీఒక్కరం కృషిచేయాలి. అందుకోసం యెహోవా తన సంస్థ ద్వారా మనకు మంచి శిక్షణ ఇస్తున్నాడు. ఉదాహరణకు, వారం మధ్యలో జరిగే కూటాల్లో పరిచర్యను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన నిర్దేశాల్ని పొందుతున్నాం. వాటిని పాటించడానికి మీరు ప్రయత్నిస్తున్నారా?

19. రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లాలనే లక్ష్యాన్ని మీరెలా చేరుకోవచ్చు?

19 రాజ్య సువార్తికుల కోసం పాఠశాల కూడా మంచి శిక్షణ ఇస్తుంది. 23-65 ఏళ్ల మధ్య వయసున్న పూర్తికాల సేవకులు దానికి హాజరవ్వవచ్చు. బహుశా ఆ పాఠశాలకు ఎప్పటికీ వెళ్లలేమని మీరు అనుకుంటుండవచ్చు. కానీ ఆ పాఠశాలకు మీరు ఎందుకు వెళ్లలేరో ఆలోచించే బదులు, మీరు ఎందుకు వెళ్లాలని కోరుకుంటున్నారో తెలిపే కారణాల్ని లిస్టు రాయండి. తర్వాత దానికి హాజరవ్వడానికి తగిన అర్హతల్ని సంపాదించేందుకు ఒక ప్రణాళిక వేసుకోండి. యెహోవా సహాయం వల్ల, మీ కృషి వల్ల అసాధ్యం అనిపించిన దాన్ని మీరు సాధించవచ్చు.

మీ వరాల్ని సంఘాన్ని బలపర్చడానికి ఉపయోగించండి

20. రోమీయులు 12:6-8 వచనాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

20 పౌలు ఉపయోగించిన ఉదాహరణ నుండి మనం నేర్చుకోగల మూడో పాఠం రోమీయులు 12:6-8 వచనాల్లో ఉంది. (చదవండి.) సంఘంలోని వాళ్లకు వేర్వేరు వరాలు ఉంటాయని పౌలు మరోసారి చెప్పాడు. అయితే ఈ సందర్భంలో మాత్రం, మన దగ్గర ఏ వరం ఉన్నా సంఘాన్ని బలపర్చడం కోసం దాన్ని ఉపయోగించాలని నొక్కిచెప్పాడు.

21-22. రాబర్ట్‌, ఫెలిస్‌ అనే సహోదరుల అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

21 రాబర్ట్‌ * అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. వేరే దేశంలో సేవచేస్తున్న ఆ సహోదరుని నియామకంలో మార్పు వచ్చింది, ఆయన్ని తన సొంత దేశంలోని బెతెల్‌లో సేవ చేయడానికి నియమించారు. ముందటి నియామకంలో ఆయన సరిగ్గా చేయలేదు కాబట్టే ఆ మార్పు జరిగిందని అనుకోవద్దని సహోదరులు ఆయనకు వివరించారు. అయినా రాబర్ట్‌ ఇలా చెప్పాడు: “నేను నా పాత నియామకాన్ని సరిగ్గా చేయలేదని అనుకుంటూ చాలా నెలలు బాధపడ్డాను. కొన్నిసార్లు బెతెల్‌ సేవ ఆపేయాలని కూడా అనుకున్నాను.” మరి ఆయన బెతెల్‌ సేవలో సంతోషంగా ఎలా కొనసాగాడు? ఒక తోటి పెద్ద ఆయనకు ఈ విషయాన్ని గుర్తుచేశాడు: “ముందటి నియామకాల్లో యెహోవా ఇచ్చిన శిక్షణ, ప్రస్తుత నియామకంలో ఎంతో ఉపయోగపడుతుంది.” దాంతో రాబర్ట్‌ గతం వైపు చూడడం మానేసి, ప్రస్తుతం ఆయన చేయగల దానిమీద మనసుపెట్టాడు.

22 సహోదరుడు ఫెలిస్‌ ఎపిస్కొపో కూడా అలాంటి సవాలునే ఎదుర్కొన్నాడు. ఆయన, ఆయన భార్య 1956⁠లో గిలియడ్‌ పాఠశాల పూర్తి చేసుకుని, బొలీవియాలో ప్రాంతీయ సేవ మొదలుపెట్టారు. 1964⁠లో వాళ్లకు ఒక బాబు పుట్టాడు. ఫెలిస్‌ ఇలా అన్నాడు: “మేమెంతో ప్రేమించిన నియామకాన్ని విడిచిపెట్టడం చాలా బాధగా అనిపించింది. నేను దాదాపు ఒక సంవత్సరం పాటు నిరుత్సాహంలో ఉండిపోయాను. కానీ యెహోవా సహాయంతో నా ఆలోచనా తీరును మార్చుకుని, తండ్రిగా నాకు దొరికిన కొత్త నియామకం మీద మనసుపెట్టాను.” మీకూ ఆ ఇద్దరు సహోదరుల్లాగే అనిపించిందా? గతంలో మీకున్న సేవా నియామకాలు ఇప్పుడు లేనందుకు బాధపడుతున్నారా? మీరు గతం గురించి ఆలోచించడం ఆపేసి, యెహోవా కోసం, సహోదరుల కోసం ప్రస్తుతం మీరు చేయగల వాటిమీద దృష్టిపెడితే సంతోషంగా ఉంటారు. మీకున్న సామర్థ్యాల్ని, వరాల్ని ఇతరుల కోసం ఉపయోగించే పనిలో బిజీగా ఉండండి. సంఘాన్ని బలపర్చడానికి మీరు చేసే కృషి వల్ల ఎంతో సంతోషాన్ని పొందుతారు.

23. మనం దేని గురించి సమయం తీసుకుని ఆలోచించాలి? తర్వాతి ఆర్టికల్‌లో ఏం తెలుసుకుంటాం?

23 మనలో ప్రతీఒక్కరం యెహోవాకు విలువైన వాళ్లమే. మనం తన కుటుంబంలో ఒకరిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం సమయం తీసుకుని సహోదర సహోదరీల్ని బలపర్చడానికి ఏం చేయగలం అనేదాని గురించి ఆలోచించాలి, అలా చేయడానికి కృషిచేయాలి. అప్పుడు సంఘంలో మనం విలువైన వాళ్లం కాదనే ఆలోచన మనలో తగ్గిపోతుంది! అయితే, సంఘంలోని ఇతరుల్ని చూసే విషయంలో మన అభిప్రాయం ఎలా ఉంది? మనం వాళ్లను ప్రేమిస్తున్నామని, గౌరవిస్తున్నామని ఎలా చూపించవచ్చు? ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబుల్ని తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

పాట 24 యెహోవా పర్వతానికి రండి

^ పేరా 5 యెహోవా దృష్టిలో విలువైన వాళ్లుగా ఉండాలని మనందరం కోరుకుంటాం. అయితే, కొన్నిసార్లు సంఘంలో మనం అంత విలువైన వాళ్లం కాదేమో అని అనుకుంటుండవచ్చు. మనలో ప్రతీఒక్కరికి సంఘంలో విలువైన స్థానం ఉందని అర్థం చేసుకునేలా ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

^ పేరా 3 పదాల వివరణ: యెహోవా సంఘంలో మనకున్న స్థానం అంటే సంఘాన్ని బలపర్చడంలో మనం పోషించే పాత్ర. దానికి మన జాతి, తెగ, కులం, సంస్కృతి, చదువు, ఆర్థిక స్థితి వంటివాటితో సంబంధం లేదు.

^ పేరా 21 కొన్ని అసలు పేర్లు కావు.

^ పేరా 63 చిత్రాల వివరణ: ఈ మూడు చిత్రాలు మీటింగ్‌కి ముందు, మీటింగ్‌ సమయంలో, మీటింగ్‌ తర్వాత జరుగుతున్న వాటిని తెలియజేస్తున్నాయి. 1వ చిత్రం: మీటింగ్‌కి కొత్తగా వచ్చిన వ్యక్తిని ఒక పెద్ద ప్రేమగా పలకరిస్తున్నాడు, ఒక యువ సహోదరుడు సౌండ్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పనులు చేస్తున్నాడు, ఒక సహోదరి వృద్ధ సహోదరితో మాట్లాడుతోంది. 2వ చిత్రం: కావలికోట అధ్యయనం జరుగుతున్నప్పుడు పెద్దవాళ్లు, పిల్లలు కామెంట్స్‌ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 3వ చిత్రం: ఒక జంట రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తోంది. విరాళాల పెట్టెలో డబ్బులు వేయడానికి ఒక తల్లి తన కూతురికి సహాయం చేస్తోంది. ఒక యువ సహోదరుడు లిటరేచర్‌ చూసుకుంటున్నాడు, ఒక సహోదరుడు వృద్ధ సహోదరిని ప్రోత్సహిస్తున్నాడు.