కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 32

పిల్లలారా, యౌవనులారా బాప్తిస్మం తర్వాత ప్రగతి సాధిస్తూ ఉండండి

పిల్లలారా, యౌవనులారా బాప్తిస్మం తర్వాత ప్రగతి సాధిస్తూ ఉండండి

“ప్రేమతో పురికొల్పబడి . . . అన్ని విషయాల్లో పరిణతి సాధించేవరకు ఎదుగుతూ ఉందాం.”ఎఫె. 4:15.

పాట 56 సత్య మార్గంలో నడవండి

ఈ ఆర్టికల్‌లో. . . *

1. చాలామంది పిల్లలు, యౌవనులు ఇప్పటికే ఏం సాధించారు?

 ప్రతీ సంవత్సరం వేలమంది పిల్లలు, యౌవనులు బాప్తిస్మం తీసుకుంటున్నారు. మీరు కూడా బాప్తిస్మం తీసుకున్నారా? అయితే మిమ్మల్ని చూసి సహోదర సహోదరీలు, యెహోవా దేవుడు సంతోషిస్తున్నారు. (సామె. 27:11) మీరు ఇప్పటివరకు ఏం సాధించారో ఒకసారి ఆలోచించండి. బహుశా మీరు చాలా సంవత్సరాలు బైబిల్ని శ్రద్ధగా అధ్యయనం చేశారు. దానివల్ల బైబిలు దేవుని వాక్యమని మీకు నమ్మకం కలిగింది. అంతకన్నా ముఖ్యంగా, బైబిల్ని రాయించిన యెహోవాను తెలుసుకుని, ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. మీరు ఆయన్ని ఎంతగా ప్రేమించారంటే, సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నారు. మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు!

2. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

 2 బాప్తిస్మం తీసుకోకముందు, యెహోవాకు నమ్మకంగా ఉండే విషయంలో మీరు పరీక్షల్ని ఎదుర్కొన్నారు. అయితే ముందుముందు మీకు కొత్త పరీక్షలు ఎదురౌతాయి. యెహోవా మీద మీ ప్రేమను తగ్గించేలా, మిమ్మల్ని ఆయన నుండి దూరం చేసేలా సాతాను ప్రయత్నిస్తాడు. (ఎఫె. 4:14) అలా జరగకుండా మీరు జాగ్రత్తపడాలి. యెహోవాకు నమ్మకంగా ఉండాలంటే, సమర్పించుకున్నప్పుడు ఆయనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలి? మీరు ప్రగతి సాధిస్తూ ఉండాలి, అంటే క్రైస్తవులుగా ‘పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోవాలి.’ (హెబ్రీ. 6:1) మరి మీరు దాన్ని ఎలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

ఒక క్రైస్తవునిగా మీరెలా ప్రగతి సాధించవచ్చు?

3. బాప్తిస్మం తర్వాత క్రైస్తవులందరూ ఏం చేయాలి?

3 బాప్తిస్మం తర్వాత మనందరం, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ క్రైస్తవులకు ఇచ్చిన సలహాను పాటించాలి. అతను వాళ్లను క్రైస్తవులుగా “పూర్తిస్థాయిలో పరిణతి” సాధించమని ప్రోత్సహించాడు. (ఎఫె. 4:13) ఆ మాటకు, ‘ప్రగతి సాధిస్తూ ఉండాలి’ అని అర్థం. పౌలు, క్రైస్తవులు ప్రగతి సాధించడాన్ని ఒక పిల్లవాడు ఎదగడంతో పోల్చాడు. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. అయితే వాళ్లు పిల్లల్లాగే ఉండిపోవాలని తల్లిదండ్రులు కోరుకోరు. సమయం గడుస్తున్నకొద్దీ, వాళ్లు పెద్దవాళ్లు అయ్యి “పిల్లచేష్టలు” మానుకోవాలి. (1 కొరిం. 13:11) క్రైస్తవులుగా మనం కూడా అంతే. బాప్తిస్మం తర్వాత మనం ప్రగతి సాధిస్తూ ఉండాలి. అందుకు సహాయం చేసే కొన్ని సలహాల్ని ఇప్పుడు చూద్దాం.

4. మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే ఏం చేయాలి? వివరించండి. (ఫిలిప్పీయులు 1:9)

4 యెహోవా మీద మీకున్న ప్రేమను పెంచుకుంటూ ఉండండి. మీరు ఇప్పటికే యెహోవాను చాలా ప్రేమిస్తున్నారు. అయితే ఆయన మీదున్న ప్రేమను మీరు ఇంకా పెంచుకోవచ్చు. అలా చేయడానికి సహాయంచేసే ఒక మార్గాన్ని, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులు 1:9 లో చెప్పాడు. (చదవండి.) ఫిలిప్పీలోని క్రైస్తవుల ప్రేమ “అంతకంతకూ పెరగాలని” పౌలు ప్రార్థించాడు. కాబట్టి మనం కూడా యెహోవా మీద మనకున్న ప్రేమను పెంచుకోవచ్చు. దానికోసం మనం ‘సరైన జ్ఞానాన్ని, మంచి వివేచనను’ సంపాదించాలి. మనం యెహోవా గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఆయన్ని అంత ఎక్కువ ప్రేమించగలుగుతాం. అలాగే ఆయన లక్షణాలు, పనులు ఎంత గొప్పవో అర్థంచేసుకోగలుగుతాం. అప్పుడు ఆయన్ని సంతోషపెట్టాలని, ఆయన్ని బాధపెట్టే ఏ పనీ చేయకూడదని ఇంకా బలంగా కోరుకుంటాం. అంతేకాదు మన విషయంలో ఆయన ఇష్టం ఏంటో తెలుసుకుని, దానికి తగ్గట్టు జీవించడానికి కృషిచేస్తాం.

5-6. మనం యెహోవా మీద ప్రేమను ఎలా పెంచుకోవచ్చు? వివరించండి.

5 యేసు తన తండ్రి లక్షణాల్ని చాలా బాగా చూపించాడు. కాబట్టి మనం యేసు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, యెహోవా మీద మన ప్రేమ అంత ఎక్కువ పెరుగుతుంది. (హెబ్రీ. 1:3) యేసు గురించి బాగా తెలుసుకోవడానికి నాలుగు సువార్త పుస్తకాల్ని చదవచ్చు. మీకు రోజూ బైబిలు చదివే అలవాటు ఉందా? లేకపోతే, ఇప్పుడు అలవాటు చేసుకోండి. వీలైతే, ఈ సువార్త పుస్తకాలతో మొదలుపెట్టండి. యేసు గురించి చదువుతుండగా, ఆయన చూపించిన లక్షణాల గురించి ముఖ్యంగా ఆలోచించండి. ప్రజలు ఆయనతో ఉండడానికి, మాట్లాడడానికి ఇష్టపడేవాళ్లు. చిన్నపిల్లల్ని కూడా ఆయన ప్రేమతో దగ్గరికి తీసుకునేవాడు. (మార్కు 10:13-16) యేసు శిష్యులు ఆయనతో ఏ భయంలేకుండా అన్నీ చెప్పేవాళ్లు. ఎందుకంటే ఆయన వాళ్లతో ఒక స్నేహితుడిలా, చాలా ప్రేమగా ఉండేవాడు. (మత్త. 16:22) యేసు తన తండ్రి లక్షణాల్నే చూపించాడు. కాబట్టి యెహోవా కూడా ఒక స్నేహితుడిలా, ప్రేమగా ఉంటాడని అర్థమౌతుంది. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు, మన మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్పవచ్చు. ఆయన మనల్ని తప్పుపడతాడేమో అని భయపడాల్సిన అవసరంలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, పట్టించుకుంటాడు.—1 పేతు. 5:7.

6 యేసు ప్రజలమీద కనికరం చూపించాడు. అపొస్తలుడైన మత్తయి ఇలా రాశాడు: “ఆయన ప్రజల్ని చూసినప్పుడు వాళ్లమీద జాలిపడ్డాడు, ఎందుకంటే వాళ్లు కాపరిలేని గొర్రెల్లా అణచివేయబడి, నిర్లక్ష్యం చేయబడ్డారని ఆయన గమనించాడు.” (మత్త. 9:36) మరి ప్రజల గురించి యెహోవాకు ఎలా అనిపిస్తుంది? యేసు ఇలా అన్నాడు: “ఈ చిన్నవాళ్లలో ఒక్కరు కూడా నాశనమవ్వడం పరలోకంలో ఉన్న నా తండ్రికి ఇష్టంలేదు.” (మత్త. 18:14) ఈ మాటలు యెహోవా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేస్తున్నాయి. అది తెలుసుకోవడం ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా! కాబట్టి యేసు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, యెహోవా మీద మన ప్రేమ అంత ఎక్కువ అవుతుంది.

7. పరిణతి గల క్రైస్తవులతో సమయం గడపడం ఎందుకు మంచిది?

7 మీ సంఘంలోని పరిణతి గల క్రైస్తవులతో సమయం గడపడం ద్వారా కూడా మీరు యెహోవా మీద ప్రేమను పెంచుకోవచ్చు, ప్రగతి సాధించవచ్చు. ఆ క్రైస్తవులు ఎంత సంతోషంగా ఉన్నారో గమనించండి. యెహోవా సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు వాళ్లు అస్సలు బాధపడట్లేదు. యెహోవా సేవలో వాళ్లకున్న అనుభవాలను చెప్పమని అడగండి. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, వాళ్లను సలహాలు అడగండి. ఎందుకంటే, “సలహాదారులు ఎక్కువమంది ఉంటే విజయం లభిస్తుంది.”—సామె. 11:14.

స్కూల్లో ఎవల్యూషన్‌ గురించి చెప్తే, మీ నమ్మకాల్ని ధైర్యంగా వివరించడానికి మీరు ముందే ఏం చేయవచ్చు? (8-9 పేరాలు చూడండి)

8. బైబిలు చెప్పేవాటి గురించి మీకు ఎప్పుడైనా సందేహాలు వస్తే, ఏం చేయవచ్చు?

8 సందేహాల్ని తీసేసుకోండి. మనం  రెండో పేరాలో చూసినట్టు, మీరు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించకుండా చేయాలని సాతాను ప్రయత్నిస్తాడు. బైబిలు చెప్పేవాటి విషయంలో, మీ మనసులో సందేహాలు నాటడానికి అతను ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, దేవుడు మనుషుల్ని సృష్టించలేదని, పరిణామం లేదా ఎవల్యూషన్‌ వల్లే మనుషులు వచ్చారని కొంతమంది చెప్తారు. చిన్నప్పుడు మీకు దాని గురించి తెలియకపోయినా, ఇప్పుడు స్కూల్లో దాని గురించి చదువుతుండవచ్చు. మీ టీచర్లు చెప్పేవన్నీ సరిగ్గానే ఉన్నట్టు మీకు అనిపించవచ్చు. అయితే సృష్టికర్త ఉన్నాడా లేదా అనే విషయం గురించి, బహుశా వాళ్లు ఎప్పుడూ మనసుపెట్టి ఆలోచించి ఉండరు. సామెతలు 18:17 లో ఉన్న ఈ మాటల్ని గుర్తుచేసుకోండి: “వ్యాజ్యంలో మొదట మాట్లాడే వ్యక్తి చెప్పేది సరైనదిగా కనిపిస్తుంది, అయితే రెండో వ్యక్తి వచ్చి అతన్ని ప్రశ్నించినప్పుడు నిజాలు బయటికొస్తాయి.” స్కూల్లో చెప్పే విషయాలే కరెక్ట్‌ అని గుడ్డిగా నమ్మే బదులు, దేవుని వాక్యం చెప్పేవాటిని జాగ్రత్తగా పరిశీలించండి. మన ప్రచురణల్లో పరిశోధన చేయండి. ఒకప్పుడు ఎవల్యూషన్‌ను నమ్మిన సహోదర సహోదరీలతో మాట్లాడండి. * మనల్ని ప్రేమించే సృష్టికర్త ఉన్నాడని, వాళ్లకు ఎందుకు నమ్మకం కుదిరిందో అడగండి. అలా మాట్లాడడం వల్ల, సృష్టికర్త ఉన్నాడు అనడానికి గల రుజువుల్ని మీరు తెలుసుకుంటారు.

9. మెలిస్సా అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

9 మెలిస్సా * అనే సహోదరి, సృష్టికర్త ఉన్నాడా అనే విషయం గురించి పరిశోధన చేయడం వల్ల చాలా ప్రయోజనం పొందింది. ఆమె ఇలా అంటుంది: “ఎవల్యూషనే కరెక్ట్‌ అని స్కూల్లో చెప్తారు. మొదట్లో, నేను పరిశోధన చేయడానికి వెనకాడాను. ఎందుకంటే, ఎవల్యూషనే కరెక్ట్‌ అని తేలుతుందేమో అని భయపడ్డాను. కానీ, యెహోవా తనను గుడ్డిగా నమ్మాలని కోరుకోవట్లేదని నేను గుర్తించాను. కాబట్టి పరిశోధన చేయడం మొదలుపెట్టాను. మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఇంగ్లీష్‌) అనే పుస్తకాన్ని, అలాగే జీవం సృష్టించబడిందా? (ఇంగ్లీష్‌), జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఇంగ్లీష్‌) అనే బ్రోషుర్లను చదివాను. నాకున్న ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరికాయి. ఈ పని ముందే చేయాల్సిందని అనిపించింది.”

10-11. మీరు ఎలా పవిత్రంగా ఉండవచ్చు? (1 థెస్సలొనీకయులు 4:3, 4)

10 తప్పుడు ప్రవర్తనకు దూరంగా ఉండండి. పిల్లలారా మీరు ఎదుగుతున్నప్పుడు, సెక్స్‌ చేయాలనే కోరిక మీలో ఎక్కువ అవ్వవచ్చు, లేదా సెక్స్‌ చేయమని వేరేవాళ్లు మిమ్మల్ని బాగా ఒత్తిడి చేయవచ్చు. మీరు తప్పుడు కోరికలకు లొంగిపోవాలని సాతాను కోరుకుంటున్నాడు. మరి, మీరు ఎలా పవిత్రంగా ఉండవచ్చు? (1 థెస్సలొనీకయులు 4:3, 4 చదవండి.) యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు, మీకు నిజంగా ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఒత్తిడిని ఎదిరించడానికి, తప్పుడు కోరికల్ని తీసేసుకోవడానికి సహాయం చేయమని అడగండి. (మత్త. 6:13) మిమ్మల్ని తప్పుపట్టాలన్నది కాదుగానీ, మీకు సహాయం చేయాలన్నదే యెహోవా కోరిక అని గుర్తుంచుకోండి. (కీర్త. 103:13, 14) బైబిలు కూడా మీకు సహాయం చేస్తుంది. ముందు చెప్పిన మెలిస్సాకు, తప్పుడు కోరికలు తీసేసుకోవడం కష్టమైంది. ఆమె ఇలా అంటుంది: “ప్రతీరోజు బైబిలు చదవడం వల్ల, నేను తప్పుడు కోరికల్ని తీసేసుకోగలిగాను. అంతేకాదు నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నానని, ఆయన స్నేహం నాకు ఎంతో అవసరమని గుర్తుచేసుకోగలిగాను.”—కీర్త. 119:9.

11 ఇలాంటి విషయాల నుండి, మీ అంతట మీరే బయటపడగలరని అనుకోకండి. దాని గురించి మీ అమ్మానాన్నలతో మాట్లాడండి. నిజానికి అది అంత ఈజీ కాదు, కానీ అలా మాట్లాడడం మంచిది. మెలిస్సా ఇలా అంటుంది: “నేను ధైర్యం కోసం ప్రార్థించి, నా సమస్య గురించి మా నాన్నతో మాట్లాడాను. ఆ తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, యెహోవా కూడా నన్ను చూసి గర్వపడుతున్నాడని నాకు అర్థమైంది.”

12. మీరు మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?

12 బైబిలు సూత్రాల ప్రకారం నడుచుకోండి. మీరు ఇంకా ఎదిగే కొద్దీ, మీ అమ్మానాన్నలు సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను మీకు ఇస్తారు. కానీ మీకు ఎక్కువ అనుభవం లేదు. కాబట్టి యెహోవాతో మీ స్నేహాన్ని పాడుచేసే ఏ తప్పూ చేయకుండా ఉండడానికి మీకు ఏది సహాయం చేస్తుంది? (సామె. 22:3) క్యారి అనే సహోదరి, పరిణతి గల క్రైస్తవులకు జీవితంలో ప్రతీదానికి రూల్స్‌ అవసరం లేదని గుర్తించింది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తనకు ఏది సహాయం చేసిందో ఆమె ఇలా చెప్తుంది: “నేను రూల్స్‌ని మాత్రమే కాదు, బైబిలు సూత్రాల్ని అంటే, యెహోవా ఆలోచనల్ని అర్థంచేసుకోవాలని గుర్తించాను.” బైబిలు చదువుతున్నప్పుడు మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘నేను చదివిన ఈ లేఖనాలు యెహోవా ఆలోచన గురించి ఏం చెప్తున్నాయి? సరైనది చేయడానికి సహాయం చేసే ఏ సూత్రాలు ఇందులో ఉన్నాయి? నేను ఈ సూత్రాల్ని పాటిస్తే, ఎలాంటి ప్రయోజనం పొందుతాను?’ (కీర్త. 19:7; యెష. 48:17, 18) బైబిల్ని చదివి, అందులో ఉన్న సూత్రాల గురించి బాగా ఆలోచించినప్పుడు యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడం తేలికౌతుంది. మీరు ప్రగతి సాధిస్తున్న కొద్దీ యెహోవా ఆలోచనల్ని అర్థంచేసుకుంటారు, కాబట్టి మీకు ప్రతీదానికి రూల్స్‌ అవసరంలేదు.

ఒక యువ సహోదరి ఎలాంటి వాళ్లతో స్నేహం చేసింది? (13వ పేరా చూడండి)

13. మంచి స్నేహితులు మీకెలా సహాయం చేస్తారు? (సామెతలు 13:20)

13 యెహోవాను ప్రేమించేవాళ్లతో స్నేహం చేయండి. ఏడో పేరాలో చెప్పినట్టు, మంచి స్నేహితులు మీరు పరిణతి గల క్రైస్తవులు అవ్వడానికి సహాయం చేస్తారు. (సామెతలు 13:20 చదవండి.) శారా అనే సహోదరి, యెహోవా సేవలో ఆనందం తగ్గిపోతున్నప్పుడు తనకు ఏది సహాయం చేసిందో ఇలా చెప్తుంది: “సరిగ్గా ఆ సమయంలోనే నాకు మంచి స్నేహితులు దొరికారు. నేను, ఒక యువ సహోదరి కలిసి ప్రతీవారం కావలికోట అధ్యయనానికి ప్రిపేర్‌ అయ్యేవాళ్లం. ఇంకో సహోదరి, మీటింగ్స్‌లో కామెంట్స్‌ చెప్పడానికి నాకు సహాయం చేసింది. వ్యక్తిగత అధ్యయనాన్ని, ప్రార్థనను ఇంకా బాగా చేసేలా స్నేహితులు నాకు సహాయం చేశారు. దాంతో నేను యెహోవాకు ఇంకా దగ్గరయ్యాను, ఆయన సేవలో ఆనందాన్ని తిరిగిపొందాను.”

14. జూలియన్‌ ఎలా మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాడు?

14 మీరు మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవచ్చు? ఇప్పుడు సంఘ పెద్దగా సేవచేస్తున్న జూలియన్‌ ఇలా అంటున్నాడు: “నేను యువకుడిగా ఉన్నప్పుడు పరిచర్యలో మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాను. వాళ్లు ఉత్సాహంగా పరిచర్య చేసేవాళ్లు. పరిచర్యలో ఎంత ఆనందం ఉందో వాళ్లను చూసి నేర్చుకున్నాను. అలాగే పూర్తికాల సేవచేయాలనే లక్ష్యం పెట్టుకున్నాను. నేను ఇదివరకు నా వయసు వాళ్లతోనే స్నేహం చేసేవాణ్ణి. కానీ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, పెద్దవయసు వాళ్లు కూడా మంచి స్నేహితులుగా ఉంటారు. నేను బెతెల్‌కి వెళ్లాక కూడా మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నాను. వాళ్లను చూసి, నేను మంచి వినోదాన్ని ఎంచుకోగలిగాను, దానివల్ల యెహోవాకు ఇంకా దగ్గరయ్యాను.”

15. పౌలు తిమోతికి ఏ జాగ్రత్తలు చెప్పాడు? (2 తిమోతి 2:20-22)

15 సంఘంలో కొందరి వల్ల, యెహోవాతో మీకున్న స్నేహం తగ్గిపోయే ప్రమాదం ఉందని గుర్తిస్తే ఏం చేయాలి? సంఘంలో కొందరు క్రైస్తవుల్లా ఆలోచించరని, ప్రవర్తించరని పౌలుకు తెలుసు. అందుకే అలాంటి వాళ్లకు దూరంగా ఉండమని, ఆయన తిమోతికి జాగ్రత్తలు చెప్పాడు. (2 తిమోతి 2:20-22 చదవండి.) యెహోవాతో మనకున్న స్నేహం వెలకట్టలేనిది. ఆ స్నేహాన్ని సంపాదించుకోవడానికి మనం ఎంతో కష్టపడ్డాం. కాబట్టి, దాన్ని పాడుచేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు.—కీర్త. 26:4.

ప్రగతి సాధించడానికి లక్ష్యాలు మీకెలా సహాయం చేస్తాయి?

16. మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు?

16 మంచి లక్ష్యాల్ని పెట్టుకోండి. మీ విశ్వాసాన్ని బలపర్చి, మరింత పరిణతి సాధించడానికి సహాయం చేసే లక్ష్యాల్ని పెట్టుకోండి. (ఎఫె. 3:16) ఉదాహరణకు రోజూ బైబిలు చదవాలి, క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయాలి అనే లక్ష్యాల్ని పెట్టుకోవచ్చు. (కీర్త. 1:2, 3) లేదా ఎక్కువసార్లు ప్రార్థించాలి, మనస్ఫూర్తిగా ప్రార్థించాలి అనే లక్ష్యాల్ని పెట్టుకోవచ్చు. లేదా వినోదాన్ని ఎంచుకునే విషయంలో, మీ సమయాన్ని ఉపయోగించుకునే విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని అనుకోవచ్చు. (ఎఫె. 5:15, 16) ప్రగతి సాధిస్తూ ఉండడానికి మీరు పడే కష్టాన్ని చూసి యెహోవా సంతోషిస్తాడు.

ఆ యువ సహోదరి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకుంది? (17వ పేరా చూడండి)

17. వేరేవాళ్లకు సహాయం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?

17 వేరేవాళ్లకు సహాయం చేసినప్పుడు, మీరు క్రైస్తవులుగా మరింత పరిణతి సాధిస్తారు. యేసు ఇలా చెప్పాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొ. 20:35) వేరేవాళ్లకు సహాయం చేయడానికి మీ సమయాన్ని, శక్తిని ఉపయోగించినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు మీ సంఘంలో వృద్ధులకు, అనారోగ్యంగా ఉన్నవాళ్లకు సహాయం చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. మీరు వాళ్లకు సరుకులు కొనుక్కునే విషయంలో, ఫోన్‌ లేదా కంప్యూటర్‌ వాడే విషయంలో సహాయం చేయవచ్చు. సహోదరులైతే, సంఘంలోని వాళ్లకు సహాయం చేయడానికి సంఘ పరిచారకుడు అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. (ఫిలి. 2:4) మంచివార్తను ప్రకటించడం ద్వారా కూడా మీరు ప్రజల మీద ప్రేమ చూపించవచ్చు. (మత్త. 9:36, 37) వీలైతే, ఏదోక రకమైన పూర్తికాల సేవచేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.

18. ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి పూర్తికాల సేవ మీకు ఎలా సహాయం చేస్తుంది?

18 ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి, పూర్తికాల సేవ మీకు ఎన్నో అవకాశాల్ని ఇస్తుంది. మీరు పయినీరు సేవ మొదలుపెడితే, భవిష్యత్తులో రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లవచ్చు. మీరు బెతెల్‌ సేవలో అడుగుపెట్టవచ్చు లేదా నిర్మాణ పనిలో పాల్గొనవచ్చు. కేట్లిన్‌ అనే యువ పయినీరు సహోదరి ఇలా అంటుంది: “బాప్తిస్మం తర్వాత, ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి నాకు బాగా సహాయం చేసింది ఏంటంటే, అనుభవం గల సహోదర సహోదరీలతో కలిసి పరిచర్య చేయడం. నేను వాళ్లను చూసి బైబిల్ని ఇంకా లోతుగా అధ్యయనం చేయడం, చక్కగా బోధించడం నేర్చుకున్నాను.”

19. ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ ఉండగా మీరు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు?

19 మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ ఉండగా, ఎన్నో ఆశీర్వాదాల్ని పొందుతారు. మీ యౌవనాన్ని పనికిరాని విషయాల కోసం వృథా చేసుకోరు. (1 యోహా. 2:17) తప్పుడు నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత బాధపడే పరిస్థితి మీకు రాదు. బదులుగా, మీరు సరైన నిర్ణయాలు తీసుకుని సంతోషంగా ఉంటారు. (సామె. 16:3) మిమ్మల్ని చూసి, మీ తోటి సహోదర సహోదరీలందరూ ప్రోత్సాహం పొందుతారు. (1 తిమో. 4:12) అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాను సంతోషపెడుతున్నాం, ఆయనతో దగ్గరి స్నేహాన్ని కలిగివున్నాం అనే సంతృప్తి, మనశ్శాంతి మీకు ఉంటుంది.—సామె. 23:15, 16.

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

^ పిల్లలు, యౌవనులు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా సేవకులందరూ సంతోషిస్తారు. అయితే బాప్తిస్మం తర్వాత వాళ్లు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ ఉండాలి. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న పిల్లలు, యౌవనులు క్రైస్తవులుగా ఎలా పరిణతి సాధించవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

^ మీరు jw.orgలో “జీవారంభం గురించి అభిప్రాయాలు” కింద ఉన్న ఆర్టికల్స్‌, వీడియోలు కూడా చూడవచ్చు.

^ కొన్ని అసలు పేర్లు కావు.