అధ్యయన ఆర్టికల్ 33
యెహోవా తన ప్రజల్ని శ్రద్ధగా చూసుకుంటాడు
“యెహోవా కళ్లు తన పట్ల భయభక్తులుగల వాళ్లను . . . గమనిస్తాయి.”—కీర్త. 33:18.
పాట 4 “యెహోవా నా కాపరి”
ఈ ఆర్టికల్‌లో. . . a
1. తన శిష్యుల్ని కాపాడమని యేసు యెహోవాను ఎందుకు వేడుకున్నాడు?
యేసు తాను చనిపోవడానికి ముందు రాత్రి, తన పరలోక తండ్రిని ఒక ప్రత్యేకమైన విషయం గురించి అడిగాడు. తన శిష్యుల్ని కాపాడమని ఆయన యెహోవాను వేడుకున్నాడు. (యోహా. 17:15, 20) నిజమే యెహోవా తన ప్రజల్ని ఎప్పుడూ కాపాడాడు, వాళ్లను గమనిస్తూ శ్రద్ధగా చూసుకున్నాడు. అయితే సాతాను తన శిష్యుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడని యేసుకు తెలుసు. సాతాను దాడుల్ని తట్టుకోవాలంటే వాళ్లకు యెహోవా సహాయం అవసరమని కూడా ఆయనకు తెలుసు.
2. కీర్తన 33:18-20 ప్రకారం, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎందుకు భయపడాల్సిన అవసరంలేదు?
2 నేడు సాతాను లోకం, క్రైస్తవులమైన మనకు తీవ్రమైన కష్టాల్ని తీసుకొస్తుంది. ఆ కష్టాల వల్ల మనం నిరుత్సాహపడవచ్చు, యెహోవాకు నమ్మకంగా ఉండడం మనకు కష్టం అవ్వవచ్చు. కానీ మనం భయపడాల్సిన అవసరంలేదని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. యెహోవా మనల్ని గమనిస్తున్నాడు, అంటే మనం ఎదుర్కొంటున్న కష్టాల్ని చూస్తున్నాడు. మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. “తన పట్ల భయభక్తులుగల వాళ్లను” యెహోవా ఎలా గమనిస్తాడో లేదా శ్రద్ధగా చూసుకుంటాడో తెలియజేసే రెండు బైబిలు ఉదాహరణల్ని ఇప్పుడు చూద్దాం.—కీర్తన 33:18-20 చదవండి.
ఒంటరిగా అనిపించినప్పుడు
3. మనకు ఎప్పుడు ఒంటరిగా అనిపించవచ్చు?
3 సంఘంలో చాలామంది సహోదర సహోదరీలు ఉన్నా, అప్పుడప్పుడు మనకు ఒంటరిగా అనిపించవచ్చు. ఉదాహరణకు, స్కూల్లో తోటి విద్యార్థులకు తమ నమ్మకాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు లేదా కొత్త సంఘానికి మారినప్పుడు యౌవనులకు ఒంటరిగా అనిపించవచ్చు. ఒంటరితనం నుండి మనంతట మనమే బయటపడాలని, ఎవ్వరూ మనకు సహాయం చేయలేరని కొంతమంది బాధపడవచ్చు లేదా నిరుత్సాహపడవచ్చు. వేరేవాళ్లు మనల్ని అర్థం చేసుకుంటారో లేదో అని ఆలోచిస్తూ, వాళ్లతో మాట్లాడడానికి వెనకాడుతుండవచ్చు. కొన్నిసార్లయితే అసలు మనల్ని పట్టించుకునేవాళ్లు ఎవరైనా ఉన్నారా అని అనిపించవచ్చు. కారణం ఏదైనాసరే, ఒంటరితనం వల్ల కంగారుగా-ఆందోళనగా అనిపించవచ్చు. అయితే, మనం ఒంటరివాళ్లమని అనుకోవడం యెహోవాకు ఇష్టంలేదు. అలాగని ఎలా చెప్పవచ్చు?
4. “నేను ఒక్కడినే మిగిలాను” అని ఏలీయా ఎందుకు అన్నాడు?
4 యెహోవా సేవకుడైన ఏలీయా గురించి ఆలోచించండి. యెజెబెలు రాణి ఆయన్ని చంపాలనుకుంది. అప్పుడు ఏలీయా తన ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని, 40 రోజులుగా పారిపోతూ ఉన్నాడు. (1 రాజు. 19:1-9) తర్వాత ఒక గుహలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “[ప్రవక్తల్లో] నేను ఒక్కడినే మిగిలాను.” (1 రాజు. 19:10) నిజానికి, ఇశ్రాయేలులో ఇంకా వేరే ప్రవక్తలు కూడా ఉన్నారు. ఉదాహరణకు, యెజెబెలు చేతిలో చనిపోకుండా ఓబద్యా వందమంది ప్రవక్తల్ని కాపాడాడు. (1 రాజు. 18:7, 13) మరైతే, ఏలీయాకు ఎందుకంత ఒంటరిగా అనిపించింది? ఓబద్యా కాపాడిన ప్రవక్తలందరూ ఇప్పటికే చనిపోయి ఉంటారని ఆయన అనుకున్నాడా? కర్మెలు పర్వతం దగ్గర తానే సత్యదేవుడినని యెహోవా నిరూపించుకున్న తర్వాత కూడా, ఎవ్వరూ ఆయన్ని ఆరాధించట్లేదని ఏలీయా నిరుత్సాహపడి ఉంటాడా? లేదా తనను చంపడానికి శత్రువులు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అసలు ఎవరికైనా తెలుసా, ఎవరైనా అసలు తనను పట్టించుకుంటున్నారా అని ఆయన అనుకునివుంటాడా? ఏలీయాకు ఎలా అనిపించిందో బైబిలు పూర్తిగా చెప్పట్లేదు. కానీ మనం ఖచ్చితంగా ఒక విషయం చెప్పవచ్చు: ఏలీయాకు ఎందుకు ఒంటరిగా అనిపించిందో యెహోవా అర్థంచేసుకున్నాడు, ఆయనకు ఎలా సహాయం చేయాలో కూడా యెహోవాకు పూర్తిగా తెలుసు.
5. ఏలీయా ఒంటరివాడు కాదని యెహోవా ఎలా భరోసా ఇచ్చాడు?
5 ఏలీయాకు సహాయం చేయడానికి యెహోవా ఎన్నో పనులు చేశాడు. ముందుగా, ఏలీయాను మాట్లాడమని ఆయన ప్రోత్సహించాడు. ఆయన ఏలీయాను రెండుసార్లు ఇలా అడిగాడు: “నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?” (1 రాజు. 19:9, 13) అలా అడిగిన ప్రతీసారి, ఏలీయా తన మనసులో ఉన్నదంతా చెప్పాడు. ఆయన చెప్పిందంతా యెహోవా ఓపిగ్గా విన్నాడు. తర్వాత, తాను ఆయనకు తోడుగా ఉన్నానని, తనకు చాలా శక్తి ఉందని యెహోవా చూపించాడు. అంతేకాదు, చాలామంది ఇశ్రాయేలీయులు తనను ఇంకా ఆరాధిస్తున్నారని ఏలీయాకు భరోసా ఇచ్చాడు. (1 రాజు. 19:11, 12, 18) తన మనసులో ఉన్నదంతా చెప్పుకున్న తర్వాత, యెహోవా ఇచ్చిన జవాబులు విన్న తర్వాత ఏలీయాకు ఖచ్చితంగా ప్రశాంతంగా అనిపించి ఉంటుంది. యెహోవా ఏలీయాకు కొన్ని ముఖ్యమైన పనులు కూడా అప్పగించాడు. సిరియా మీద రాజుగా హజాయేలును, ఇశ్రాయేలు మీద రాజుగా యెహూను నియమించమని, అలాగే ఎలీషాను ప్రవక్తగా నియమించమని యెహోవా ఏలీయాకు చెప్పాడు. (1 రాజు. 19:15, 16) ఏలీయాకు ఈ పనులు అప్పగించడం ద్వారా ఆయన మంచి విషయాల మీదే మనసుపెట్టేలా యెహోవా సహాయం చేశాడు. అంతేకాదు ఏలీయాకు ఎప్పుడూ తోడు ఉండేలా ఎలీషాను ఇచ్చాడు. మరి మీకు ఒంటరిగా అనిపించినప్పుడు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?
6. ఒంటరిగా అనిపించినప్పుడు మీరు ఏ విషయాల గురించి ప్రార్థించవచ్చు? (కీర్తన 62:8)
6 తనకు ప్రార్థించమని యెహోవా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. మీరు ఎదుర్కొంటున్న కష్టాల్ని చూస్తున్నానని, మీరు ఏ సమయంలో ప్రార్థించినా వింటానని యెహోవా భరోసా ఇస్తున్నాడు. (1 థెస్స. 5:17) తన సేవకులు చెప్పేవి వినడమంటే ఆయనకు చాలా ఇష్టం. (సామె. 15:8) మీకు ఒంటరిగా అనిపించినప్పుడు ఏ విషయాల గురించి ప్రార్థించవచ్చు? ఏలీయాలాగే ప్రార్థనలో మీ మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్పండి. (కీర్తన 62:8 చదవండి.) మీరు వేటి గురించి ఆందోళన పడుతున్నారో, మీకు ఎలా అనిపిస్తుందో ఆయనకు చెప్పండి. ఒంటరితనం నుండి, బాధ నుండి బయటపడాలంటే ఏం చేయాలో యెహోవాను అడగండి. స్కూల్లో ఎవరైనా మీ నమ్మకాల గురించి ప్రశ్నించినప్పుడు మీకు భయమేస్తుందా? ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే మీ నమ్మకాల్ని నేర్పుగా చెప్పడానికి కావల్సిన తెలివిని, ధైర్యాన్ని ఇవ్వమని అడగండి. (లూకా 21:14, 15) లేదా మీకు నిరుత్సాహంగా అనిపిస్తుందా? అయితే పరిణతిగల క్రైస్తవులతో దాని గురించి మాట్లాడేలా, వాళ్లు మిమ్మల్ని అర్థంచేసుకునేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. ప్రార్థనలో యెహోవా ముందు మీ హృదయాన్ని కుమ్మరించండి. మీ ప్రార్థనలకు ఆయన ఎలా జవాబిస్తున్నాడో చూడండి, వేరేవాళ్ల సహాయం తీసుకోండి. అప్పుడు ఒంటరివాళ్లమనే బాధ తగ్గుతుంది.
7. మహేష్ అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?
7 యెహోవా మనందరికీ చేయడానికి మంచి పనిని ఇచ్చాడు. సంఘంలో, పరిచర్యలో మీరు చేయగలిగినదంతా చేయడానికి పడుతున్న కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, దాన్ని విలువైనదిగా ఎంచుతున్నాడు. (కీర్త. 110:3) యెహోవా ఇచ్చిన పనిలో బిజీగా ఉండడం ద్వారా ఒంటరితనం నుండి మీరెలా బయటపడవచ్చు? మహేష్ b అనే యువ సహోదరుడి అనుభవం పరిశీలించండి. మహేష్ బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికే, ఆయన ఎంతో ప్రేమించే స్నేహితుడు సత్యాన్ని మెల్లమెల్లగా విడిచిపెట్టేశాడు. మహేష్ ఇలా అంటున్నాడు: “నా స్నేహితుడు యెహోవాను వదిలేసి వెళ్లినప్పుడు, నేను కూడా అలా చేస్తానేమో అని భయపడ్డాను. సమర్పించుకున్నప్పుడు యెహోవాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలనా? ఆయన కుటుంబంలో కొనసాగగలనా? అనే ప్రశ్నలు నాలో మొదలయ్యాయి. నాకు ఒంటరిగా అనిపించింది. నా పరిస్థితిని ఎవ్వరూ అర్థంచేసుకోలేరని అనుకున్నాను.” మరి ఆయన ఒంటరితనం నుండి ఎలా బయటపడ్డాడు? మహేష్ ఇలా అంటున్నాడు: “నేను ఎక్కువసేపు పరిచర్య చేశాను. నా పరిస్థితి గురించి ఎక్కువ ఆలోచించకుండా, నా బాధలో నుండి బయటపడేలా అది నాకు సహాయం చేసింది. వేరేవాళ్లతో కలిసి పరిచర్య చేసినప్పుడు నాకు సంతోషంగా అనిపించింది, నా ఒంటరితనం తగ్గిపోయింది.” సహోదర సహోదరీలతో నేరుగా కలిసి పరిచర్య చేయలేని పరిస్థితుల్లో కూడా ఉత్తరాల ద్వారా, టెలిఫోన్ ద్వారా సాక్ష్యమిస్తూ ప్రోత్సాహం పొందవచ్చు. ఒంటరితనం నుండి బయటపడడానికి ఇంకా ఏది సహాయం చేసిందో ఆయన ఇలా చెప్తున్నాడు: “నేను సంఘ పనుల్లో కూడా బిజీగా ఉంటూ, మీటింగ్స్‌లో విద్యార్థి నియామకాలు వచ్చినప్పుడు మనసుపెట్టి చక్కగా సిద్ధపడేవాణ్ణి. వాటిని చేసినప్పుడు సహోదర సహోదరీలు నన్ను మెచ్చుకునేవాళ్లు. యెహోవా కూడా నన్ను చూసి సంతోషిస్తున్నాడని అర్థం చేసుకున్నాను.”
పెద్దపెద్ద కష్టాల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు
8. పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పుడు మనకెలా అనిపిస్తుంది?
8 ఈ చివరి రోజుల్లో మనందరికీ కష్టాలు వస్తాయి. (2 తిమో. 3:1) అయితే అనుకోని సమయంలో, ఊహించని కష్టాలు మనకు వస్తాయి. ఉన్నట్టుండి ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉందని తెలియవచ్చు లేదా మనకు బాగా ఇష్టమైనవాళ్లు చనిపోవచ్చు. అలాంటప్పుడు మనం నిరుత్సాహపడి ఉక్కిరిబిక్కిరి అయిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కష్టాలు వరుసగా, ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు లేదా కష్టాలన్నీ ఒకేసారి వచ్చినప్పుడు మనకు అలా అనిపించవచ్చు. అయితే యెహోవా మిమ్మల్ని గమనిస్తున్నాడని, ఆయన సహాయంతో ఎలాంటి కష్టాన్నైనా మీరు తట్టుకోగలరని గుర్తుంచుకోండి.
9. యోబుకు ఏ కష్టాలు వచ్చాయో వివరించండి.
9 తన సేవకుడైన యోబుకు యెహోవా ఎలా సహాయం చేశాడో ఆలోచించండి. కొంత సమయంలోనే యోబుకు పెద్దపెద్ద కష్టాలు వచ్చాయి. ఒక్కరోజులోనే ఆయన జీవితం మొత్తం తలకిందులైపోయింది. ఆయన పశువుల్లో కొన్ని దొంగిలించబడ్డాయి, కొన్ని చనిపోయాయి, ఆయన సేవకులు కూడా చనిపోయారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఆయన పిల్లలందరూ చనిపోయారు. (యోబు 1:13-19) యోబు ఇంకా దుఃఖంలో మునిగి ఉండగానే, చాలా బాధాకరమైన జబ్బు ఒకటి ఆయనకు వచ్చింది. (యోబు 2:7) యోబు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆయన ఇలా అన్నాడు: “నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది; ఇక బ్రతకాలని లేదు.”—యోబు 7:16.
10. పెద్దపెద్ద కష్టాల్ని తట్టుకునేలా యెహోవా యోబుకు ఎలా సహాయం చేశాడు? (కవర్ పేజీ మీదున్న చిత్రం చూడండి.)
10 యోబుకు వచ్చిన కష్టాలన్నిటినీ యెహోవా గమనించాడు. యెహోవా యోబును ప్రేమించాడు కాబట్టి, ఆ కష్టాల్ని తట్టుకోవడానికి ఆయనకు ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. యెహోవా యోబుతో మాట్లాడుతూ తనకున్న అంతులేని తెలివిని, సృష్టిలోని ప్రాణుల మీద తనకున్న శ్రద్ధను గుర్తుచేశాడు. యెహోవా ఎన్నో పెద్దపెద్ద ప్రాణుల గురించి చెప్పాడు. (యోబు 38:1, 2; 39:9, 13, 19, 27; 40:15; 41:1, 2) అంతేకాదు యెహోవా యువకుడైన ఎలీహు ద్వారా యోబును బలపర్చాడు, ఓదార్చాడు. సహనం చూపించినందుకు యెహోవా ఎప్పుడూ తన సేవకుల్ని దీవిస్తాడని ఎలీహు యోబుకు గుర్తుచేశాడు. యెహోవా ఎలీహు ద్వారా ఒక విషయంలో యోబును ప్రేమతో సరిదిద్దాడు. యోబు తన గురించి తాను అతిగా ఆలోచించకుండా ఉండేలా, విశ్వాన్ని సృష్టించిన యెహోవా ముందు తాను ఎంత చిన్నవాడో గుర్తించేలా ఎలీహు సహాయం చేశాడు. (యోబు 37:14) అలాగే యెహోవా యోబుకు ఒక పని కూడా అప్పగించాడు. తన ముగ్గురి స్నేహితుల తరఫున ప్రార్థించమని ఆయనకు చెప్పాడు. (యోబు 42:8-10) మరి నేడు పెద్దపెద్ద కష్టాలు ఎదుర్కొంటున్న మనకు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?
11. కష్టాల్ని తట్టుకోవడానికి బైబిలు మనకెలా సహాయం చేస్తుంది?
11 యెహోవా యోబుతో మాట్లాడినట్టు, నేడు మనతో నేరుగా మాట్లాడడు. కానీ ఆయన తన వాక్యమైన బైబిలు ద్వారా మనతో మాట్లాడతాడు. (రోమా. 15:4) కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోడానికి సహాయం చేసే ఎన్నో మాటల్ని ఆయన బైబిల్లో రాయించాడు. ఉదాహరణకు, పెద్దపెద్ద కష్టాలతో సహా ఏదీ “[తన] ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేవని” యెహోవా బైబిలు ద్వారా మనకు భరోసా ఇస్తున్నాడు. (రోమా. 8:38, 39) “తనకు మొరపెట్టే వాళ్లందరికీ” దగ్గరగా ఉంటానని ఆయన మాటిస్తున్నాడు. (కీర్త. 145:18) తన మీద ఆధారపడితే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలమని, ఆ కష్టాల్లో కూడా సంతోషంగా ఉండగలమని యెహోవా చెప్తున్నాడు. (1 కొరిం. 10:13; యాకో. 1:2, 12) యెహోవా ఇచ్చే శాశ్వత దీవెనలతో పోలిస్తే ఇప్పుడున్న కష్టాలు చాలా చిన్నవని, అవి కొంతకాలమే ఉంటాయని బైబిలు చెప్తుంది. (2 కొరిం. 4:16-18) అంతేకాదు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ముఖ్య కారణమైన సాతానును, సాతానులాంటి చెడ్డవాళ్లను పూర్తిగా నాశనం చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (కీర్త. 37:10) ఓదార్పును, బలాన్నిచ్చే లేఖనాల్ని గుర్తుంచుకుంటే మనం రాబోయే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. మరి అలాంటి కొన్ని లేఖనాల్ని మీరు కంఠస్తం చేశారా?
12. బైబిలు నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?
12 ప్రతీరోజు మనం కొంత సమయం తీసుకుని బైబిలు చదవాలని, చదివిన దాని గురించి లోతుగా ఆలోచించాలని యెహోవా కోరుకుంటున్నాడు. నేర్చుకున్నవాటిని పాటించినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, మన పరలోక తండ్రికి ఇంకా దగ్గరౌతాం. దానివల్ల, కష్టాల్ని తట్టుకోవడానికి కావల్సిన బలాన్ని పొందుతాం. తన వాక్యం మీద ఆధారపడేవాళ్లకు యెహోవా తన పవిత్రశక్తిని కూడా ఇస్తాడు. దాని ద్వారా మన కష్టాల్ని తట్టుకోవడానికి కావల్సిన “అసాధారణ శక్తి” పొందుతాం.—2 కొరిం. 4:7-10.
13. కష్టాల్ని తట్టుకోవడానికి “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం ఎలా సహాయం చేస్తుంది?
13 యెహోవా సహాయంతో “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” ఎన్నో ఆర్టికల్స్‌ని, వీడియోల్ని, సంగీతాన్ని తయారు చేస్తున్నాడు. విశ్వాసంలో బలంగా ఉండడానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి అవి మనకు సహాయం చేస్తాయి. (మత్త. 24:45) యెహోవా ఇచ్చే వీటన్నిటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. అమెరికాలో ఉన్న ఒక సహోదరి ఇవన్నీ తనకు ఎంత విలువైనవో చెప్తూ ఇలా అంది: “నేను 40 సంవత్సరాలుగా యెహోవాను ఆరాధిస్తున్నాను. యథార్థత విషయంలో నేను ఎన్నో పెద్దపెద్ద పరీక్షల్ని ఎదుర్కొన్నాను.” ఆ సహోదరి తాతగారు ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆమె తల్లిదండ్రులు కూడా తీవ్రమైన అనారోగ్యం వల్ల చనిపోయారు. ఆ సహోదరికి కూడా రెండుసార్లు క్యాన్సర్ వచ్చింది. మరి వాటన్నిటిని ఆమె ఎలా తట్టుకుంది? ఆమె ఇలా వివరించింది: “యెహోవా ఎప్పుడూ నన్ను శ్రద్ధగా చూసుకున్నాడు. నమ్మకమైన, బుద్ధిగల దాసుని ద్వారా ఆయన ఇచ్చిన ఆధ్యాత్మిక ఆహారం, కష్టాల్ని సహించేలా నాకు సహాయం చేసింది. దానివల్ల నేను కూడా యోబులాగే, ‘చనిపోయేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను!’ అని చెప్పగలుగుతున్నాను.”—యోబు 27:5.
14. కష్టాల్ని తట్టుకునేలా, యెహోవా సహోదర సహోదరీల ద్వారా మనకెలా సహాయం చేస్తాడు? (1 థెస్సలొనీకయులు 4:9)
14 కష్టాల్లో ఉన్నవాళ్లను ఎలా ప్రేమించాలో, ఎలా ఓదార్చాలో యెహోవా తన ప్రజలకు నేర్పించాడు. (2 కొరిం. 1:3, 4; 1 థెస్సలొనీకయులు 4:9 చదవండి.) ఎలీహులాగే మన సహోదర సహోదరీలు, మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవునికి నమ్మకంగా ఉండేలా సహాయం చేయడానికి ముందుకొస్తారు. (అపొ. 14:22) ఉదాహరణకు డయానా అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె భర్తకు తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు, ఆధ్యాత్మికంగా బలంగా ఉండేలా సంఘంలోనివాళ్లు ఆమెకు సహాయం చేశారు. దాని గురించి ఆమె ఇలా చెప్తుంది: “అది చాలా కష్టమైన సమయం. కానీ యెహోవా మమ్మల్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని బలపర్చినట్టు మాకు అనిపించింది. సంఘంలోనివాళ్లు మాకెంతో సహాయం చేశారు. వాళ్లు సమయం తీసుకుని మమ్మల్ని కలిశారు, మాతో ఫోన్‌లో మాట్లాడారు, మమ్మల్ని హత్తుకున్నారు. వాళ్ల సహాయంతో మేము ఆ కష్టాన్ని తట్టుకోగలిగాం. నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి సహోదర సహోదరీలు నన్ను మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి తీసుకెళ్లేవాళ్లు.” అలా ప్రేమ చూపించే సహోదర సహోదరీలు సంఘంలో ఉండడం నిజంగా ఒక గొప్ప దీవెన!
యెహోవా చూపిస్తున్న శ్రద్ధను బట్టి కృతజ్ఞతతో ఉందాం
15. మనం కష్టాల్ని తట్టుకోగలమనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు?
15 మనందరికీ ఏదోక రకమైన కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం ఒంటరివాళ్లం కాదని ఈ ఆర్టికల్‌లో నేర్చుకున్నాం. యెహోవా ప్రేమగల తండ్రిలా మనల్ని ఎప్పుడూ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆయన మన పక్కనే ఉంటూ మన ప్రార్థనల్ని వినడానికి, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. (యెష. 43:2) యెహోవా మనకు సహాయం చేయడానికి ప్రార్థించే వరాన్ని, బైబిల్ని, ఆధ్యాత్మిక ఆహారాన్ని, మనల్ని ఎంతో ప్రేమించే సహోదర సహోదరీల్ని ఇచ్చాడు. కాబట్టి ఎలాంటి కష్టాన్నైనా మనం ధైర్యంగా ఎదుర్కోగలమనే నమ్మకంతో ఉండవచ్చు.
16. యెహోవా మనల్ని శ్రద్ధగా చూసుకోవాలంటే మనమేం చేయాలి?
16 మనల్ని ప్రేమగా చూసుకునే పరలోక తండ్రి ఉన్నందుకు మనం ఎంతో కృతజ్ఞతతో ఉంటాం. “ఆయన్ని బట్టి మన హృదయాలు ఉల్లసిస్తున్నాయి.” (కీర్త. 33:21) ప్రేమతో ఆయన మనకిచ్చిన వాటన్నిటినీ పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా ఆయన మీద కృతజ్ఞత చూపించవచ్చు. అలాగే మనం యెహోవాకు లోబడడానికి, ఆయన దృష్టిలో సరైనది చేయడానికి కృషిచేస్తూ ఉంటే, ఆయన మనల్ని ఎల్లప్పుడూ గమనిస్తూ, శ్రద్ధగా చూసుకుంటాడు.—1 పేతు. 3:12.
పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు