కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 18

“పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తండి”

“పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తండి”

“నేను . . . పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తాను.”—2 తిమో. 4:7.

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మనందరం ఏం చేయాలి?

కష్టమైన పరుగుపందెంలో పరుగెత్తడానికి, అది కూడా అనారోగ్యంగా లేదా అలసటగా ఉన్నప్పుడు పరుగెత్తడానికి మీరు ఇష్టపడతారా? బహుశా ఇష్టపడకపోవచ్చు. నిజ క్రైస్తవులందరూ ఒక పరుగుపందెంలో ఉన్నారని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (హెబ్రీ. 12:1) మనం యౌవనులమైనా లేదా వృద్ధులమైనా, బలంగా ఉన్నా లేదా బలహీనంగా ఉన్నా యెహోవా ఇచ్చే బహుమతిని గెలవాలంటే చివరిదాకా ఓపిగ్గా పరుగెత్తాలి.—మత్త. 24:13.

2. రెండో తిమోతి 4:7, 8 ప్రకారం, పౌలు క్రైస్తవుల్ని ఎందుకు ధైర్యంగా ప్రోత్సహించగలిగాడు?

2 పౌలు ‘పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తాడు’ కాబట్టే దానిగురించి ధైర్యంగా క్రైస్తవులందర్నీ ప్రోత్సహించగలిగాడు. (2 తిమోతి 4:7, 8 చదవండి.) ఇంతకీ పౌలు చెప్తున్న పరుగుపందెం ఏంటి?

ఆ పరుగుపందెం ఏంటి?

3. పౌలు ఏ పందెం గురించి మాట్లాడుతున్నాడు?

3 కొన్ని సందర్భాల్లో పౌలు ముఖ్యమైన పాఠాలు బోధించడానికి ప్రాచీన గ్రీసులో జరిగే ఆటలకు సంబంధించిన విషయాలను ఉపయోగించాడు. (1 కొరిం. 9:25-27; 2 తిమో. 2:5) ఆయన చాలా సందర్భాల్లో, క్రైస్తవ జీవితాన్ని పరుగుపందెంతో పోల్చాడు. (1 కొరిం. 9:24; గల. 5:7; ఫిలి. 2:16) ఒక వ్యక్తి యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ పరుగుపందెంలో అడుగుపెడతాడు. (1 పేతు. 3:21) యెహోవా ఇచ్చే శాశ్వత జీవితమనే బహుమతిని గెల్చుకున్నప్పుడు తన పరుగును పూర్తిచేస్తాడు.—మత్త. 25:31-34, 46; 2 తిమో. 4:8.

4. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

4 మారథాన్‌ లాంటి సుదూర పరుగుపందేనికి, క్రైస్తవ జీవితానికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. వాటిలో మూడింటిని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మొదటిది, మనం సరైన దారిలో పరుగెత్తాలి; రెండోది, మన దృష్టి గమ్యం మీద ఉండాలి; మూడోది, దారిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలి.

సరైన దారిలో పరుగెత్తండి

మనందరం జీవపు పరుగుపందెంలో పరుగెత్తాలి (5-7 పేరాలు చూడండి) *

5. మనం ఏ దారిలో పరుగెత్తాలి? ఎందుకు?

5 క్రీడాకారులు పరుగుపందెంలో గెలవాలంటే, వాళ్లకు నియమించిన దారిలో మాత్రమే పరుగెత్తాలి. అదేవిధంగా, మనం శాశ్వత జీవితం అనే బహుమతిని గెలవాలంటే క్రైస్తవులకు తగిన దారిలో మాత్రమే పరుగెత్తాలి. (అపొ. 20:24; 1 పేతు. 2:21) కానీ మనం ఆ దారిలో వెళ్లడం సాతానుకు, అతన్ని అనుసరించేవాళ్లకు ఇష్టంలేదు; మనం వాళ్లతో “కలిసి చెడ్డపనులు” చేయాలని వాళ్లు కోరుకుంటున్నారు. (1 పేతు. 4:4) వాళ్లు మన జీవిత విధానాన్ని ఎగతాళి చేస్తారు; వాళ్లు వెళ్తున్న దారి మాత్రమే సరైనదని, అందులోనే స్వేచ్ఛ ఉంటుందని అంటారు. కానీ అది పచ్చి అబద్ధం.—2 పేతు. 2:19.

6. బ్రయన్‌ అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

6 సాతాను లోకంతో కలిసి పరుగెత్తాలని నిర్ణయించుకునేవాళ్లు, తాము ఎంచుకున్న మార్గం స్వేచ్ఛను ఇవ్వదని త్వరగానే తెలుసుకుంటారు. నిజానికి అలాంటివాళ్లు సాతానుకు, తమ సొంత కోరికలకు బానిసలౌతారు. (రోమా. 6:16) బ్రయన్‌ అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. ఒక మంచి క్రైస్తవునిగా జీవించమని అతని అమ్మానాన్నలు ప్రోత్సహించారు. కానీ బ్రయన్‌ టీనేజీ వయసుకు వచ్చాక, అసలు తాను ఎంచుకున్న జీవితం నిజంగా సంతోషాన్ని ఇస్తుందా అని సందేహపడ్డాడు. సాతాను లోకంలోని ప్రజలతో చేతులు కలిపాడు. బ్రయన్‌ ఇలా చెప్తున్నాడు: “నేను కోరుకున్న స్వేచ్ఛ నన్ను ఎన్నో వ్యసనాలకు బానిస చేస్తుందని నేను ఊహించలేదు. . . . రానురాను మత్తుమందులు తీసుకోవడం, తాగడం, చెడు తిరుగుళ్లు తిరగడం ఇదే నా జీవితం అయిపోయింది. కొన్ని సంవత్సరాలకు, మరింత ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను వాడి చూశాను. వాటిల్లో చాలావాటికి బానిసైపోయాను. ఎంతగా అంటే, వాటిని కొనడానికి మత్తుమందుల అమ్మకం కూడా మొదలుపెట్టాను.” చివరికి, బ్రయన్‌ యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత చెడు అలవాట్లు మానేసి సరైన దారిలో జీవిస్తూ, 2001 లో బాప్తిస్మం తీసుకున్నాడు. క్రైస్తవులకు తగిన దారిలో పరుగెత్తుతున్నందుకు ఇప్పుడు బ్రయన్‌ ఎంతో సంతోషిస్తున్నాడు. *

7. మత్తయి 7:13, 14 ప్రకారం మన ముందున్న రెండు దారులు ఏంటి?

7 సరైన దారిని ఎంచుకుని దానిలో నడవడం ఎంత ప్రాముఖ్యమో కదా! మనందరం “జీవానికి నడిపించే” ఇరుకు దారి నుండి పక్కకు వచ్చి, విశాలమైన దారిలో పరుగెత్తాలనేది సాతాను కోరిక. లోకంలోని చాలామంది ఆ దారినే ఎంచుకున్నారు, పైగా అందులో పరుగెత్తడం తేలిక కూడా. కానీ ఆ దారి ‘నాశనానికి నడిపిస్తుంది.’ (మత్తయి 7:13, 14 చదవండి.) కాబట్టి మనం పక్కకు మళ్లకుండా సరైన దారిలో పరుగెత్తుతూ ఉండాలంటే యెహోవా మీద నమ్మకం ఉంచాలి, ఆయన చెప్పింది వినాలి.

దృష్టి గమ్యం మీద ఉంచండి, తడబడకండి

మన దృష్టి గమ్యం మీద ఉండాలి, మనం ఇతరులకు అడ్డంకిగా మారకూడదు (8-12 పేరాలు చూడండి) *

8. ఒక క్రీడాకారుడు తడబడితే ఏం చేస్తాడు?

8 మారథాన్‌ లాంటి సుదూర పరుగుపందెంలో పాల్గొనే క్రీడాకారులు తడబడి పడిపోకుండా ఉండేందుకు, తమ ముందున్న దారిని చూస్తూ పరిగెడతారు. అయినాసరే అప్పుడప్పుడు, తోటి క్రీడాకారుని గుద్దుకునో లేదా చిన్న గుంటలో కాలుపెట్టో తడబడతారు. ఒకవేళ కింద పడిపోతే మళ్లీ లేచి పరుగును కొనసాగిస్తారు. ఆ క్రీడాకారులు తమకు ఎదురైన అడ్డంకి మీద మనసు నిలపరు. వాళ్ల దృష్టంతా గమ్యం మీద, గెలవాల్సిన బహుమతి మీద ఉంటుంది.

9. ఒకవేళ మనం తడబడి పడిపోతే ఏం చేయాలి?

9 జీవపు పరుగుపందెంలో ఉన్న మనం కూడా చాలాసార్లు తడబడవచ్చు. అంటే మన మాటల్లో, పనుల్లో పొరపాట్లు దొర్లవచ్చు. లేదా మనతో పరుగెత్తుతున్న తోటి విశ్వాసులు మనల్ని బాధపెట్టే పనులు చేయవచ్చు. అలా జరిగితే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనందరం అపరిపూర్ణులం, పైగా మనం పరుగెత్తుతున్న జీవానికి నడిపించే దారి ఇరుకుగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు తోటివాళ్ల వల్ల మనకు ఇబ్బందులు ఎదురవ్వడం సహజం. ఇతరుల మీద ‘ఫిర్యాదు చేసే’ సందర్భాలు మనకు ఎదురౌతాయని పౌలు కూడా చెప్పాడు. (కొలొ. 3:13) అయితే మనకు ఎదురైన అడ్డంకి మీద కాకుండా, మన ముందున్న బహుమతి మీద దృష్టి నిలుపుదాం. ఒకవేళ ఎప్పుడైనా తడబడి పడిపోతే, మళ్లీ లేచి మన పరుగును కొనసాగిద్దాం. అలాకాకుండా నొచ్చుకుని, కృంగిపోయి యెహోవాను ఆరాధించడం మానేస్తే గమ్యాన్ని చేరుకోలేం, బహుమతిని గెల్చుకోలేం. అంతేకాదు, ఇరుకు దారిలో పరుగెత్తడానికి కృషిచేస్తున్న ఇతరులకు మనమే ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

10. మనతో కలిసి పరుగెత్తుతున్న వాళ్లకు అడ్డంకిగా మారకూడదంటే మనం ఏం చేయవచ్చు?

10 మనతో కలిసి పరుగెత్తుతున్న వాళ్లకు మనం అడ్డంకిగా మారకూడదంటే, ఎప్పుడూ మనకు నచ్చినట్టే జరగాలని పట్టుబట్టకూడదు. వీలైనప్పుడల్లా తోటివాళ్ల ఇష్టాలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. (రోమా. 14:13, 19-21; 1 కొరిం. 8:9, 13) కానీ క్రీడాకారులు అలా చేయరు. ప్రతీ క్రీడాకారుడు తన తోటివాళ్లతో పోటీపడతాడు, బహుమతి తనకే దక్కాలని కోరుకుంటాడు, పందెంలో గెలవడం గురించే ఆలోచిస్తాడు. అందుకే కొందరు క్రీడాకారులు వేరేవాళ్లను తోసుకుంటూ అందరికన్నా ముందు ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ మనం తోటి క్రైస్తవులతో పోటీపడట్లేదు. (గల. 5:26; 6:4) మనతోపాటు గమ్యాన్ని చేరుకునేలా, జీవమనే బహుమతిని గెల్చుకునేలా సాధ్యమైనంత ఎక్కువమందికి సహాయం చేయడమే మన లక్ష్యం. కాబట్టి, “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి” అని పౌలు పవిత్రశక్తి ప్రేరణతో ఇచ్చిన సలహాను పాటించడానికి కృషిచేస్తాం.—ఫిలి. 2:4.

11. క్రీడాకారులు దేని మీద దృష్టిపెడతారు? ఎందుకు?

11 క్రీడాకారులు తమ ముందున్న దారిని చూస్తూనే, తాము చేరుకోవాల్సిన గమ్యం మీద కూడా దృష్టిపెడతారు. ఆ గమ్యం కంటికి కనిపించేంత దూరంలో లేకపోయినా దాన్ని చేరుకున్నట్టు, బహుమతిని సొంతం చేసుకున్నట్టు ఊహించుకుంటారు. బహుమతిని మనసులో ఉంచుకోవడం వల్ల ఎలాగైనా పందెంలో గెలవాలనే ప్రోత్సాహం వాళ్లలో కలుగుతుంది.

12. యెహోవా మనకు ఏమని మాటిచ్చాడు?

12 జీవపు పరుగుపందెంలో గెలిచేవాళ్లకు శాశ్వత జీవితం అనే బహుమతి ఇస్తానని యెహోవా మాటిచ్చాడు. అది పరదైసు భూమ్మీద కావచ్చు లేదా పరలోకంలో కావచ్చు. దాన్ని సొంతం చేసుకున్నాక జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోవడానికి లేఖనాలు సహాయం చేస్తాయి. మన దృష్టిని ఆ బహుమతి మీదే ఉంచితే ఓపిగ్గా పరుగెత్తుతూ ఉంటాం.

సవాళ్లు ఎదురైనా పరుగు ఆపకండి

సవాళ్లు ఎదురైనా ఓపిగ్గా పరుగెత్తుతూ ఉండాలి (13-20 పేరాలు చూడండి) *

13. క్రీడాకారులకు లేని ఒక అవకాశం మనకుంది, అదేంటి?

13 ప్రాచీన గ్రీకు ఆటల్లో పాల్గొనే క్రీడాకారులు అలసట, నొప్పి లాంటి సవాళ్లను ఎదుర్కొనేవాళ్లు. వాటిని అధిగమించడం కోసం వాళ్లు పొందిన శిక్షణ మీద, సొంత శక్తి మీద ఆధారపడేవాళ్లు. మనం కూడా పందెంలో ఎలా పరుగెత్తాలనే విషయంలో శిక్షణ పొందుతున్నాం. అయితే క్రీడాకారులకు లేని ఒక అవకాశం మనందరికీ ఉంది. మనం శక్తి కోసం యెహోవా మీద ఆధారపడవచ్చు, ఆయనిచ్చే శక్తికి పరిమితులు లేవు. మనం తన మీద ఆధారపడితే శిక్షణతోపాటు, బలాన్ని కూడా ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు.—1 పేతు. 5:10.

14. సవాళ్లను ఎదుర్కొనే విషయంలో 2 కొరింథీయులు 12:9, 10 మనకెలా సహాయం చేస్తుంది?

14 పౌలు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. ఆయన ఎగతాళికి గురయ్యాడు, హింసల్ని అనుభవించాడు. దానికితోడు కొన్నిసార్లు బలహీనపడ్డాడు, ‘శరీరంలో ముల్లు’ లాంటి ఒక సమస్యతో బాధపడ్డాడు. (2 కొరిం. 12:7) కానీ ఆయన వాటిని సాకుగా ఉపయోగించుకుని యెహోవా సేవను ఆపేయలేదు. బదులుగా వాటిని యెహోవా మీద ఆధారపడడానికి ఒక అవకాశంగా చూశాడు. (2 కొరింథీయులు 12:9, 10 చదవండి.) పౌలు ఆ విధంగా ఆలోచించాడు కాబట్టే, కష్టాలన్నిటిలో యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు.

15. మనం పౌలును అనుకరిస్తే ఏం రుచిచూస్తాం?

15 మన విశ్వాసం కారణంగా మనకు కూడా ఎగతాళి, హింస ఎదురవ్వవచ్చు. అనారోగ్యం లేదా అలసట వంటివి అనుభవించాల్సి రావచ్చు. కానీ పౌలులాగే మనం కూడా ఆ సవాళ్లను యెహోవా మీద ఆధారపడడానికి అవకాశాలుగా చూడాలి. అలా చూస్తే, ప్రేమతో యెహోవా ఇచ్చే మద్దతును రుచిచూస్తాం.

16. ఆరోగ్యం బాలేకపోయినా మీరేం చేయగలరు?

16 మీరు మంచం నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నారా? లేదా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారా? మీరు తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మీ కంటిచూపు తగ్గిపోయిందా? మరి ఆరోగ్యంగా, బలంగా ఉన్న యౌవనులతో కలిసి మీరు పరుగెత్తగలరా? పరుగెత్తగలరు! చాలామంది వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లు జీవపు పరుగుపందెంలో పరుగెత్తుతున్నారు. వాళ్లు తమ సొంత శక్తితో కాదుగానీ యెహోవా ఇచ్చే శక్తితోనే అలా చేయగలుగుతున్నారు. ఫోన్‌ ద్వారా లేదా స్ట్రీమింగ్‌ ద్వారా కూటాలు వింటూ యెహోవా నుండి ఆ శక్తిని పొందుతున్నారు. వాళ్లు డాక్టర్లకు, నర్సులకు, బంధువులకు ప్రకటిస్తూ శిష్యుల్ని చేసే పనిలో పాల్గొంటున్నారు.

17. అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లను యెహోవా ఎలా చూస్తాడు?

17 యెహోవా సేవలో మీరు చేయాలనుకున్నవన్నీ చేయలేకపోతుంటే నిరుత్సాహపడకండి. ఈ వ్యవస్థ ముగిసేవరకు ఓపిగ్గా పరుగెత్తలేమని అనుకోకండి. మీకు తన మీదున్న విశ్వాసాన్ని బట్టి, ఇన్నేళ్లు మీరు చేసిన సేవను బట్టి యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం ఇంతకుముందుకన్నా ఇప్పుడే మీకు ఎక్కువ అవసరం, ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయడు. (కీర్త. 9:10) ఆయన మీకు మరింత దగ్గరగా ఉంటాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక సహోదరి చెప్పిన ఈ మాటల్ని గమనించండి: “నా అనారోగ్య సమస్యలు ఎక్కువౌతున్నాయి కాబట్టి ఎక్కువమందికి ప్రకటించలేకపోతున్నాను. కానీ యెహోవా గురించి చెప్పడానికి నేను చేసే చిన్నచిన్న ప్రయత్నాలు సైతం ఆయనకు సంతోషాన్నిస్తాయని నాకు తెలుసు. ఆ విషయం నాకు ఆనందాన్నిస్తుంది.” మీకు నిరుత్సాహంగా అనిపించినప్పుడు, మీరు ఒంటరివాళ్లు కాదని గుర్తుంచుకోండి. పౌలు ఉంచిన ఆదర్శాన్ని, ప్రోత్సాహాన్ని నింపే ఆయన మాటల్ని గుర్తు తెచ్చుకోండి: “నా బలహీనతల విషయంలో . . . సంతోషిస్తాను. ఎందుకంటే, నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి.”—2 కొరిం. 12:10.

18. కొంతమంది ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?

18 జీవపు పరుగుపందెంలో పరుగెత్తుతున్న కొంతమంది మరొక రకమైన సవాలు ఎదుర్కొంటున్నారు. పైకి కనిపించని, ఇతరులు అర్థంచేసుకోలేని వ్యక్తిగత సమస్యలతో వాళ్లు పోరాడుతుండవచ్చు. ఉదాహరణకు వాళ్లు డిప్రెషన్‌తో (కృంగుదలతో) లేదా ఆందోళనతో సతమతమౌతుండవచ్చు. యెహోవా సేవకుల్లో కొంతమంది ఎదుర్కొనే ఇలాంటి సమస్యలు చాలా పెద్దవని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, ఒక వ్యక్తి చేయి గానీ, కాలు గానీ విరిగినప్పుడు అతను పడే బాధ అందరికీ కనిపిస్తుంది; కాబట్టి ఎవరోఒకరు అతనికి సహాయం చేయడానికి ముందుకొస్తారు. భావోద్వేగపరమైన లేదా మానసికపరమైన సమస్యలతో పోరాడుతున్న వాళ్ల బాధ పైకి కనిపించకపోవచ్చు. కానీ చేయి లేదా కాలు విరిగిన వ్యక్తి ఎలాంటి వేదన అనుభవిస్తాడో వీళ్లు కూడా అలాంటి వేదనే అనుభవిస్తారు. అయితే అది పైకి కనిపించదు కాబట్టి, వాళ్లకు అవసరమైన ప్రేమ, శ్రద్ధ ఇతరుల నుండి దొరకకపోవచ్చు.

19. మెఫీబోషెతు ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు?

19 ఒకవేళ మీరు అంగవైకల్యంతో బాధపడుతుంటే, ఇతరులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటే మెఫీబోషెతు ఉదాహరణ మీకు ప్రోత్సాహాన్నిస్తుంది. (2 సమూ. 4:4) మెఫీబోషెతు తన తప్పేమీ లేకుండానే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆయన చిన్నతనంలోనే కుంటివాడయ్యాడు, దానికితోడు ఒక సందర్భంలో రాజైన దావీదు ఆయన్ని అపార్థం చేసుకున్నాడు. అయితే ఆయన నిరుత్సాహంలో కూరుకుపోలేదు, తన జీవితంలో జరిగిన మంచి విషయాల్ని బట్టి సంతోషంగా జీవించాడు. అంతేకాదు గతంలో దావీదు తనమీద చూపించిన దయకు కృతజ్ఞత కలిగివున్నాడు. (2 సమూ. 9:6-10) కాబట్టి తనను దావీదు అపార్థం చేసుకున్నప్పుడు, దానికిగల కారణాల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాడు. అంతేగానీ దావీదు మీద కోపం పెంచుకోలేదు, యెహోవాను నిందించలేదు. యెహోవా నియమించిన రాజుకు మద్దతివ్వడానికి ఏం చేయాలనే దానిమీదే ఆయన మనసుపెట్టాడు. (2 సమూ. 16:1-4; 19:24-30) యెహోవా మన ప్రయోజనం కోసమే మెఫీబోషెతు ఉదాహరణను బైబిల్లో రాయించాడు.—రోమా. 15:4.

20. ఆందోళనతో పోరాడేవాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? కానీ వాళ్లు ఏ నమ్మకంతో ఉండవచ్చు?

20 తీవ్రమైన ఆందోళనతో పోరాడే సహోదరసహోదరీలు అందరి మధ్య ఉన్నప్పుడు భయంభయంగా ఉంటారు, తమ గురించి ఎవరు ఏమి అనుకుంటారో అని కంగారుపడతారు. వాళ్లకు పదిమందిలో ఉండడం ఇబ్బందిగా అనిపించినా కూటాలకు, సమావేశాలకు హాజరౌతున్నారు. అంతేకాదు కొత్తవాళ్లతో మాట్లాడడం కష్టంగా అనిపించినా పరిచర్యలో కలిసే ప్రజలతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మీది కూడా అలాంటి పరిస్థితే అయితే, మీరు ఒంటరివాళ్లు కాదనే నమ్మకంతో ఉండండి. మీలాంటి సమస్యల్ని చాలామంది ఎదుర్కొంటున్నారు. మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ చూసి యెహోవా సంతోషిస్తున్నాడని గుర్తుంచుకోండి. నిజానికి ఆయన మిమ్మల్ని దీవిస్తూ, మీకు అవసరమైన బలాన్ని ఇస్తున్నాడు కాబట్టే మీరు ఓపిగ్గా పరుగెత్తగలుగుతున్నారు. * (ఫిలి. 4:6, 7; 1 పేతు. 5:7) మీకు శారీరకంగా, భావోద్వేగపరంగా సమస్యలున్నా తన సేవలో మీరు చేస్తున్న కృషిని చూసి యెహోవా సంతోషిస్తున్నాడనే నమ్మకంతో ఉండండి.

21. యెహోవా సహాయంతో మనందరం ఏం చేయగలుగుతాం?

21 సంతోషకరమైన విషయమేంటంటే, క్రీడాకారులు పాల్గొనే పరుగుపందేనికి, పౌలు మాట్లాడుతున్న పరుగుపందేనికి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. బైబిలు కాలాల్లోని పరుగుపందెంలో బహుమతి ఒక్కరికే దక్కేది. కానీ జీవపు పరుగుపందెంలో ఓపిగ్గా పరుగెత్తే క్రైస్తవులందరికీ శాశ్వత జీవితం అనే బహుమతి దొరుకుతుంది. (యోహా. 3:16) పరుగుపందెంలో పాల్గొనే క్రీడాకారులందరూ శారీరకంగా బలంగా ఉండాలి, లేకపోతే వాళ్లు గెలవలేరు. కానీ మనలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నా ఓపిగ్గా పరుగెత్తుతున్నారు. (2 కొరిం. 4:16) యెహోవా సహాయంతో మనందరం చివరిదాకా పరుగెత్తి బహుమతి గెల్చుకుంటాం!

పాట 144 మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!

^ పేరా 5 నేడు యెహోవా సేవకుల్లో చాలామంది వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు, అనారోగ్యం వల్ల బలహీనపడుతున్నారు. వాళ్లేకాదు కొన్నిసార్లు మనందరం కూడా జీవితంలో అలసిపోతాం. కాబట్టి మన పరుగును కొనసాగించడం కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ అపొస్తలుడైన పౌలు చెప్పిన జీవపు పరుగు పందెంలో మనం ఓపిగ్గా పరుగెత్తుతూ, బహుమతిని ఎలా గెలవవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 6 2013, జనవరి 1 కావలికోట సంచికలో వచ్చిన “బైబిలు జీవితాలను మారుస్తుంది” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 20 ఆందోళనను ఎలా తట్టుకోవాలనే విషయంలో మరిన్ని సలహాల కోసం, వాటిని తట్టుకున్న వాళ్ల అనుభవాల కోసం మే 2019 JW బ్రాడ్‌కాస్టింగ్‌ (ఇంగ్లీషు) కార్యక్రమాన్ని jw.org® వెబ్‌సైట్‌లో LIBRARY > JW BROADCASTING® కింద చూడండి.

^ పేరా 63 చిత్రాల వివరణ: ఈ వృద్ధ సహోదరుడు, పరిచర్యలో ఎక్కువ సమయం గడుపుతూ జీవపు పరుగుపందెంలో పరుగెత్తుతున్నాడు.

^ పేరా 65 చిత్రాల వివరణ: అతిగా తాగమని ఇతరుల్ని బలవంతపెట్టడం లేదా మనం అతిగా తాగడం ఇతరులకు అడ్డంకిగా మారవచ్చు.

^ పేరా 67 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్నా, వైద్య సిబ్బందికి ప్రకటించడం ద్వారా తన పరుగును కొనసాగిస్తున్నాడు.