కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 15

మీరు ప్రజల్ని ఎలా చూస్తున్నారు?

మీరు ప్రజల్ని ఎలా చూస్తున్నారు?

“మీ తలలెత్తి పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి.”—యోహా. 4:35.

పాట 64 సంతోషంగా కోతపని చేద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. యోహాను 4:35, 36 లో ఉన్న యేసు మాటలకు అర్థం ఏంటి?

యేసుక్రీస్తు బార్లీ పొలాల గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు, అప్పటికింకా పంట పూర్తిగా ఎదిగి ఉండకపోవచ్చు. (యోహా. 4:3-6) అది కోతకు రావడానికి ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కానీ యేసు మాత్రం, “మీ తలలెత్తి పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి” అన్నాడు. కాబట్టి అక్కడున్న వాళ్లకు ఆయన మాటలు వింతగా అనిపించి ఉంటాయి. (యోహాను 4:35, 36 చదవండి.) మరి యేసు మాటలకు అర్థమేంటి?

2 నిజానికి యేసు ఇక్కడ బార్లీ పంట గురించి కాదుగానీ, ప్రజల్ని సమకూర్చడం గురించి మాట్లాడుతున్నాడు. కాసేపటి క్రితం ఏం జరిగిందో పరిశీలించండి. సాధారణంగా యూదులు సమరయులతో మాట్లాడేవాళ్లు కాదు. కానీ యేసు ఒక సమరయ స్త్రీకి ప్రకటించాడు, ఆమె ఆయన మాటల్ని వింది! నిజానికి ‘పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి’ అని యేసు చెప్పే సమయానికి, సమరయ స్త్రీ ద్వారా యేసు గురించి తెలుసుకున్న చాలామంది సమరయులు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. (యోహా. 4:9, 39-42) ఒక పండితుడు ఈ వృత్తాంతం గురించి ఇలా రాశాడు: “ప్రజలు చూపించిన ఆసక్తిని బట్టి . . . వాళ్లు కోతకు సిద్ధంగా ఉన్న పంటలా ఉన్నారని చెప్పవచ్చు.”

‘పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి’ అని మనకు అనిపిస్తే ఏం చేయాలి? (3వ పేరా చూడండి)

3. మీరు ప్రజల్ని యేసు చూసినట్టే చూస్తే ఏ ప్రయోజనాలు ఉంటాయి?

3 మీరు ప్రకటించే ప్రాంతంలోని ప్రజల సంగతేంటి? వాళ్లను కోతకు సిద్ధంగా ఉన్న పంటలా చూస్తున్నారా? అలా చూస్తే మూడు ప్రయోజనాలు ఉంటాయి. మొదటిగా మీరు అత్యవసర భావంతో ప్రకటిస్తారు. కోత కాలం కొన్నిరోజులే ఉంటుంది, కాబట్టి సమయాన్ని వృథా చేయకూడదు. రెండవదిగా, ప్రజలు మంచివార్తను వినడం చూసి మీరు సంతోషిస్తారు. బైబిలు ఇలా చెప్తుంది: ‘ప్రజలు కోతకాలంలో సంతోషిస్తారు.’ (యెష. 9:3) మూడవదిగా, మీరు కలిసే ప్రతీ ఒక్కరు యేసు శిష్యులు అవ్వగలరని అర్థం చేసుకుంటారు. అంతేకాదు, వాళ్లకు వేటిమీద ఆసక్తి ఉందో తెలుసుకుని, దానికి తగ్గట్టు మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటారు.

4. అపొస్తలుడైన పౌలు నుండి మనం ఏ మూడు విషయాలు నేర్చుకోవచ్చు?

4 సమరయులు ఎప్పటికీ యేసు శిష్యులు కాలేరని ఆయన అనుచరులు కొంతమంది అనుకుని ఉంటారు. కానీ యేసు అలా అనుకోలేదు, వాళ్లు తన శిష్యులు అవ్వగలరని యేసు అనుకున్నాడు. మనం కూడా మన ప్రాంతంలోని ప్రజల్ని కాబోయే క్రీస్తు శిష్యుల్లా చూడాలి. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు మనకు మంచి ఆదర్శం ఉంచాడు. ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ ఆర్టికల్‌లో పౌలు గురించిన ఈ మూడు విషయాల్ని చర్చిస్తాం: (1) ప్రజల నమ్మకాల గురించి ఆయన ఎలా తెలుసుకున్నాడు? (2) వాళ్లకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో ఎలా గ్రహించాడు? (3) వాళ్లను కాబోయే క్రీస్తు శిష్యుల్లా ఎలా చూడగలిగాడు?

ప్రజల నమ్మకాలు తెలుసుకోండి

5. సమాజమందిరానికి వచ్చేవాళ్లను పౌలు ఎందుకు అర్థం చేసుకోగలిగాడు?

5 పౌలు ఎక్కువగా యూదుల సమాజమందిరాల్లో ప్రకటించాడు. ఉదాహరణకు థెస్సలొనీకలోని సమాజమందిరంలో, “మూడు వారాలపాటు ప్రతీ విశ్రాంతి రోజున, లేఖనాలు అర్థంచేసుకునేలా [యూదులకు] సహాయం చేయడానికి ప్రయత్నించాడు.” (అపొ. 17:1, 2) సమాజమందిరంలో ప్రకటించడం పౌలుకు బహుశా సులువుగా అనిపించి ఉంటుంది. ఎందుకంటే, ఆయన పుట్టుకతోనే యూదుడు. (అపొ. 26:4, 5) పౌలుకు యూదుల నమ్మకాల గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్లకు ధైర్యంగా ప్రకటించగలిగాడు.—ఫిలి. 3:4, 5.

6. సమాజమందిరంలోని ప్రజలకు, ఏథెన్సు సంతలోని ప్రజలకు మధ్య తేడా ఏంటి?

6 థెస్సలొనీకలో, ఆ తర్వాత బెరయలో వ్యతిరేకత ఎదురవ్వడం వల్ల పౌలు ఆ ప్రాంతాలను విడిచిపెట్టి ఏథెన్సుకు వెళ్లాడు. ఆయన అక్కడ కూడా, ‘లేఖనాల్ని అర్థంచేసుకునేలా సమాజమందిరంలో యూదులకు, దైవభక్తిగల ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు.’ (అపొ. 17:17) అయితే ఆయన సంతలో మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు తత్వవేత్తలు, ఇతర అన్యులు కూడా ఉన్నారు. వాళ్లకు పౌలు చెప్పిన సందేశం ఒక ‘కొత్త బోధలా’ అనిపించింది. వాళ్లు ఆయనతో ఇలా అన్నారు, “మేము ఇప్పటివరకు వినని విషయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు.”—అపొ. 17:18-20.

7. అపొస్తలుల కార్యాలు 17:22, 23 ప్రకారం పౌలు మాట్లాడే విధానాన్ని ఎలా మార్చుకున్నాడు?

7 అపొస్తలుల కార్యాలు 17:22, 23 చదవండి. పౌలు సమాజమందిరంలోని యూదులకు, ఏథెన్సులోని అన్యులకు ఒకేలా ప్రకటించలేదు. ఆయన ఏథెన్సులోని ప్రజలకు ప్రకటిస్తున్నప్పుడు, వాళ్ల నమ్మకాలు ఏమై ఉంటాయని ఆలోచించి ఉంటాడు. పౌలు చుట్టూ ఉన్న పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ, ప్రజల మతాచారాల గురించి తెలుసుకున్నాడు. తర్వాత వాళ్లు అప్పటికే నమ్ముతున్న విషయాల్ని ఉపయోగించుకుని లేఖన సత్యాల్ని వివరించాడు. ఒక బైబిలు వ్యాఖ్యాత ఇలా అన్నాడు, “యూదులూ, క్రైస్తవులూ నమ్మే ‘సత్య’ దేవుణ్ణి, అన్యులైన గ్రీసు దేశస్థులు ఆరాధించరని ఒకప్పుడు యూదునిగా ఉన్న పౌలుకు తెలుసు. అయితే తాను ప్రకటిస్తున్న దేవుని గురించి ఏథెన్సు ప్రజలకు అప్పటికే తెలుసని పౌలు చూపించాలనుకున్నాడు.” కాబట్టి పౌలు తాను మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలనుకున్నాడు. తాను ప్రకటిస్తున్న సందేశం, ఏథెన్సు ప్రజలు ఆరాధిస్తున్న ‘తెలియని దేవుని’ నుండే వచ్చిందని పౌలు వాళ్లతో చెప్పాడు. అన్యులకు లేఖనాల్లో ఏముందో తెలియదు కాబట్టి, వాళ్లు ఎప్పటికీ క్రైస్తవులు కాలేరని పౌలు అనుకోలేదు. బదులుగా, వాళ్లను కోతకు సిద్ధంగా ఉన్న పంటలా చూశాడు, వాళ్లకు తగ్గట్టు మాట్లాడే విధానాన్ని మార్చుకున్నాడు.

పౌలులా చుట్టూ ఉన్నవాటిని గమనించండి, మాట్లాడే విధానాన్ని మార్చుకోండి, ప్రజల్ని కాబోయే క్రీస్తు శిష్యుల్లా చూడండి (8, 12, 18 పేరాలు చూడండి) *

8. (ఎ) మీరు ప్రకటిస్తున్న ప్రాంతంలోని ప్రజల మత నమ్మకాల్ని మీరెలా తెలుసుకోవచ్చు? (బి) తమ మతాన్ని తప్ప వేరే మతాన్ని ఇష్టపడమని ఎవరైనా చెప్తే మీరెలా మాట్లాడవచ్చు?

8 పౌలులా, చుట్టూ ఉన్నవాటిని గమనించండి. మీరు ప్రకటిస్తున్న ప్రాంతంలోని ప్రజల నమ్మకాలు ఏంటో గుర్తించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ఇంటివాళ్లు తమ ఇంటిని లేదా బండిని ఎలా అలంకరించుకున్నారు? వాళ్ల పేరు, బట్టలు, కనిపించే తీరు, ఉపయోగించే మాటలు బట్టి వాళ్లు ఏ మతానికి చెందినవాళ్లో మీరు అర్థం చేసుకోగలరా? ఒకవేళ వాళ్లు, ‘మా మతాన్ని తప్ప వేరే మతాన్ని ఇష్టపడం’ అని ముఖం మీదే చెప్తే ఏం చేస్తారు? ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న ఒక సహోదరి, తనకు అలాంటి అనుభవం ఎదురైతే ఏం చేస్తుందో వివరిస్తూ ఇలా చెప్పింది: “నేను మీ నమ్మకాల్ని మార్చుకోమని చెప్పడానికి రాలేదు, మీతో కేవలం ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే . . . ”

9. ఎలాంటి విషయాల్లో మీకు, ఇంటివ్యక్తికి ఒకే అభిప్రాయం ఉండవచ్చు?

9 తమ మతాన్ని తప్ప వేరే మతాన్ని ఇష్టపడనివాళ్లతో మీరు ఎలాంటి విషయాలు మాట్లాడవచ్చు? మీరు, అలాగే ఇంటివ్యక్తి అంగీకరించే విషయాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ఇంటివ్యక్తి కూడా మనలానే ఒక్క దేవుణ్ణే ఆరాధిస్తుండవచ్చు లేదా మనుషులందర్నీ రక్షించేది యేసే అని నమ్ముతుండవచ్చు లేదా ఇప్పుడున్న చెడ్డ పరిస్థితులు మారి త్వరలోనే మంచి రోజులు వస్తాయని నమ్ముతుండవచ్చు. కాబట్టి మీరిద్దరూ అంగీకరించే విషయాల్ని ఆధారం చేసుకొని, బైబిలు సందేశాన్ని అతనికి ఆసక్తి కలిగించేలా చెప్పండి.

10. మనం ఏం చేయడానికి ప్రయత్నించాలి? ఎందుకు?

10 తమ మతం బోధించే కొన్ని విషయాల్ని ప్రజలు నమ్మకపోవచ్చని గుర్తుంచుకోండి. కాబట్టి ఇంటివ్యక్తి ఏ మతానికి చెందినవాడో గుర్తించాక, అతను వ్యక్తిగతంగా ఏం నమ్ముతున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అల్బేనియాలో ఉంటున్న డోనాల్టా అనే సహోదరి ఇలా చెప్తుంది: “మేము కలిసే కొంతమంది, వాళ్లది ఫలానా మతం అని చెప్తారు. నిజానికి వాళ్లకు దేవుడంటే నమ్మకం లేదని ఆ తర్వాత వాళ్ల మాటల్లో తెలుస్తుంది.” అర్జెంటీనాలో మిషనరీగా సేవచేస్తున్న ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే, ‘కొంతమంది త్రిత్వాన్ని నమ్ముతామని చెప్తారు గానీ తండ్రి, కుమారుడు, పవిత్రశక్తి ఒక్కరేనని వాళ్లు నమ్మకపోవచ్చు. ఇలాంటివి తెలుసుకున్నప్పుడు, అసలు వాళ్లు వ్యక్తిగతంగా ఎలాంటి విషయాలు నమ్ముతున్నారో అర్థంచేసుకోవడం తేలికౌతుంది.’ కాబట్టి ప్రజలు నిజంగా ఏం నమ్ముతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు, పౌలులాగే మీరు కూడా “అన్నిరకాల ప్రజలకు సహాయం చేయడానికి శాయశక్తులా” కృషిచేసిన వాళ్లౌతారు.—1 కొరిం. 9:19-23.

ప్రజలకు వేటిమీద ఆసక్తి ఉందో తెలుసుకోండి

11. అపొస్తలుల కార్యాలు 14:14-17 ప్రకారం, పౌలు లుస్త్రలోని ప్రజలతో ఎలాంటి విషయాల గురించి మాట్లాడాడు?

11 అపొస్తలుల కార్యాలు 14:14-17 చదవండి. పౌలు ప్రజలకు వేటిమీద ఆసక్తి ఉందో గ్రహించి, దాన్నిబట్టి మాట్లాడే విధానాన్ని కూడా మార్చుకున్నాడు. ఉదాహరణకు, ఆయన లుస్త్రలో ప్రకటించిన గుంపుకు లేఖనాల గురించి కొంచెం కూడా తెలియదు. కాబట్టి వాళ్లకు అర్థమయ్యే విషయాల గురించే ఆయన మాట్లాడాడు. అంటే, పుష్కలంగా పండే పంటల గురించి, జీవితాన్ని ఆనందించగలిగే మనిషి సామర్థ్యం గురించి మాట్లాడాడు. వినేవాళ్లు వెంటనే అర్థం చేసుకోగలిగే పదాల్ని, ఉదాహరణల్ని ఆయన ఉపయోగించాడు.

12. ఇంటివ్యక్తికి వేటిమీద ఆసక్తి ఉందో ఎలా తెలుసుకోవచ్చు? దానికి తగ్గట్టు మాట్లాడే విధానాన్ని ఎలా మార్చుకోవచ్చు?

12 మీరు ప్రకటించే ప్రాంతంలోని ప్రజలకు వేటిమీద ఆసక్తి ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి; మాట్లాడే విధానాన్ని దానికి తగ్గట్టు మార్చుకోండి. మీరు మాట్లాడాలనుకుంటున్న వ్యక్తిని చూసి లేదా అతని ఇంటిని చూసి అతనికి వేటిమీద ఆసక్తి ఉందో ఎలా తెలుసుకోవచ్చు? చుట్టూ ఉన్నవాటిని గమనించండి. ఇంటివ్యక్తి తోటపని చేస్తుండవచ్చు, ఏదైనా పుస్తకం చదువుతుండవచ్చు, బండి రిపేర్‌ చేస్తుండవచ్చు, లేదా ఇంకేదైనా చేస్తుండవచ్చు. వీలైతే అతను చేస్తున్న పని గురించి మాట్లాడుతూ సంభాషణ మొదలుపెట్టగలరా? (యోహా. 4:7) నిజానికి, ఇంటివ్యక్తి వేసుకున్న బట్టల్ని చూసి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు అతను ఏ దేశస్థుడో, ఎలాంటి ఉద్యోగం చేస్తాడో, అతనికి ఇష్టమైన స్పోర్ట్స్‌ టీమ్‌ ఏంటో తెలుసుకోవచ్చు. గూస్తావో అనే ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నేను 19 ఏళ్లున్న ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు, అతని టీషర్ట్‌ మీద పేరుగాంచిన గాయకుని బొమ్మ ఉండడం గమనించాను. దాని గురించి ఆ అబ్బాయిని అడిగినప్పుడు, ఆ గాయకుడంటే తనకెందుకు ఇష్టమో చెప్పాడు. ఆ సంభాషణ, అతను బైబిలు స్టడీ తీసుకోవడానికి నడిపించింది. ఇప్పుడు అతను ఒక సహోదరుడు అయ్యాడు.”

13. మీరు ఎవరికైనా బైబిలు స్టడీ గురించి చెప్తున్నప్పుడు వాళ్లకు దానిమీద ఆసక్తి కలిగేలా ఎలా మాట్లాడవచ్చు?

13 మీరు ఎవరికైనా బైబిలు స్టడీ గురించి చెప్తున్నప్పుడు, వాళ్లకు ఆసక్తి కలిగేలా మాట్లాడండి. అది వాళ్లకెలా సహాయం చేస్తుందో చెప్పండి. (యోహా. 4:13-15) ఈ అనుభవం పరిశీలించండి. మన సహోదరిని ఒక స్త్రీ ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు, గోడ మీదున్న సర్టిఫికెట్‌ను సహోదరి గమనించింది. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆ స్త్రీ విద్య అనే అంశం మీద పరిశోధన చేసిందని సహోదరి అర్థం చేసుకుంది. తాము కూడా బైబిలు స్టడీ ద్వారా, కూటాల ద్వారా ప్రజలకు బైబిలు విద్య అందిస్తున్నామని సహోదరి ఆ స్త్రీకి అర్థమయ్యేలా చెప్పింది. దాంతో ఆమె స్టడీ తీసుకోవడానికి ఒప్పుకుంది, తర్వాతి రోజు జరిగే కూటానికి హాజరైంది, ఆ తర్వాత కొన్నిరోజులకు జరిగిన ప్రాంతీయ సమావేశానికి వచ్చింది. సంవత్సరం తర్వాత బాప్తిస్మం తీసుకుంది. దీన్నుండి మీరేం నేర్చుకోవచ్చు? మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను రిటన్‌ విజిట్‌ చేసేవాళ్లకు వేటిమీద ఆసక్తి ఉంది? బైబిలు స్టడీ గురించి చెప్తున్నప్పుడు, వాళ్లకు ఆసక్తి కలిగేలా మాట్లాడగలనా?’

14. ఒక్కో విద్యార్థికి తగ్గట్టు బైబిలు స్టడీకి ఎలా సిద్ధపడాలి?

14 బైబిలు స్టడీ మొదలుపెట్టాక, స్టడీకి వెళ్లే ప్రతీసారి ముందుగానే సిద్ధపడండి. విద్యార్థి కుటుంబ పరిస్థితుల్ని, అతని చదువును, జీవితంలో అతనికి ఎదురైన అనుభవాల్ని, అతను ఇష్టపడే విషయాల్ని మనసులో పెట్టుకుని సిద్ధపడండి. ఏ లేఖనాల్ని చదవాలో, ఏ వీడియోలు చూపించాలో, బైబిలు సత్యాల్ని వివరించడానికి ఏ ఉదాహరణలు ఉపయోగించాలో స్టడీకి సిద్ధపడుతున్నప్పుడే ఆలోచించండి. ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ విద్యార్థికి నచ్చేలా, అతని హృదయాన్ని తాకేలా బోధించాలంటే ఏం చేయాలి?’ (సామె. 16:23) అల్బేనియాలో ఫ్లోర అనే పయినీరు సహోదరి ఒకామెకు స్టడీ ఇచ్చింది. ఆమె మన సహోదరితో, ‘పునరుత్థానం నిజంగా జరుగుతుందని నేను నమ్మలేను’ అని అంది. అయితే దాన్ని నమ్మమని మన సహోదరి ఆమెను బలవంతపెట్టలేదు. ఆ సహోదరి ఇలా చెప్తుంది: “ముందు ఆమె, పునరుత్థానం చేస్తానని మాటిచ్చిన దేవుని గురించి తెలుసుకోవాలని నాకనిపించింది.” అప్పటినుండి ఆమెకు స్టడీ చేస్తున్న ప్రతీసారి యెహోవాకున్న ప్రేమ, తెలివి, శక్తి గురించి నొక్కిచెప్పింది. కొంతకాలానికి పునరుత్థానం మీద ఆమెకు నమ్మకం కలిగింది. ఇప్పుడు ఆమె యెహోవాసాక్షి అయ్యి, ఉత్సాహంగా ప్రకటిస్తోంది.

ప్రజల్ని కాబోయే క్రీస్తు శిష్యుల్లా చూడండి

15. అపొస్తలుల కార్యాలు 17:16-18 ప్రకారం, పౌలు హృదయం ఎందుకు రగిలిపోయింది? అయినా పౌలు వాళ్లకు ప్రకటించడం ఎందుకు ఆపలేదు?

15 అపొస్తలుల కార్యాలు 17:16-18 చదవండి. ఏథెన్సు నగరంలోని ప్రజలు విగ్రహారాధన, లైంగిక పాపాలు చేసేవాళ్లు, తత్త్వజ్ఞానాన్ని నమ్మేవాళ్లు. అంతేకాదు వాళ్లు పౌలును అవమానించారు. అయినాసరే ఆయన వాళ్లకు ప్రకటించడం ఆపలేదు. పౌలు ఒకప్పుడు ‘దైవదూషణ చేసేవాడు, హింసించేవాడు, తలబిరుసుగా ప్రవర్తించేవాడు,’ కానీ ఆ తర్వాత క్రైస్తవునిగా మారాడు. (1 తిమో. 1:13) పౌలు తన శిష్యుడు అవ్వగలడని యేసు నమ్మాడు. పౌలు కూడా ఏథెన్సు ప్రజలు క్రీస్తు శిష్యులు అవ్వగలరని నమ్మాడు. ఆయన నమ్మినట్టే ఏథెన్సు ప్రజల్లో కొంతమంది క్రైస్తవులుగా మారారు.—అపొ. 9:13-15; 17:34.

16-17. అన్ని నేపథ్యాల ప్రజలు క్రీస్తు శిష్యులు అవ్వగలరని ఎలా చెప్పవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

16 మొదటి శతాబ్దంలో, అన్ని నేపథ్యాల ప్రజలు యేసు శిష్యులు అయ్యారు. గ్రీసు నగరమైన కొరింథు సంఘంలోని కొంతమంది, ఒకప్పుడు నేరస్తులని, లైంగిక పాపాలు చేశారని పౌలు తన ఉత్తరంలో రాశాడు. తర్వాత ఆయన ఇలా అన్నాడు: ‘మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే. కానీ దేవుడు మిమ్మల్ని శుభ్రం చేశాడు.’ (1 కొరిం. 6:9-11) మీరైతే ఆ ప్రజలు మారగలరని, క్రీస్తు శిష్యులు అవ్వగలరని నమ్మేవాళ్లా?

17 మనకాలంలోని చాలామంది కూడా క్రీస్తు శిష్యులు అవ్వాలనే కోరికతో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న యూకీన అనే సహోదరి, అన్ని నేపథ్యాల ప్రజలు బైబిలు సందేశానికి స్పందిస్తారని తెలుసుకుంది. ఒకరోజు ఆ సహోదరికి రియల్‌ ఎస్టేట్‌ ఆఫీస్‌లో, ఒంటి నిండా టాటూలు ఉన్న ఓ యువతి కనిపించింది. యూకీన ఇలా చెప్తుంది: “ఆమెతో మాట్లాడడానికి మొదట్లో కాస్త వెనకాడాను గానీ, కాసేపటి తర్వాత వెళ్లి మాట్లాడాను. ఆ యువతికి బైబిలు పట్ల చాలా ఆసక్తి ఉంది. నిజానికి, ఆమె ఒంటి మీదున్న టాటూలు చాలావరకు కీర్తనల్లోని వచనాలని నేను గుర్తించాను.” ఆ యువతి స్టడీ తీసుకోవడానికి ఒప్పుకుని, మీటింగ్స్‌కు రావడం మొదలుపెట్టింది. *

18. ప్రజల గురించి ముందే ఒక అభిప్రాయానికి ఎందుకు రాకూడదు?

18 తనను చాలామంది అనుసరిస్తారని యేసు అనుకున్నాడా? అందుకే పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయని చెప్పాడా? కానేకాదు. చాలా తక్కువమంది ఆయన మీద విశ్వాసం ఉంచుతారని లేఖనాలు ముందే చెప్పాయి. (యోహా. 12:37, 38) పైగా యేసుకు మనుషుల హృదయాల్ని చదివే అద్భుతమైన సామర్థ్యం ఉంది. (మత్త. 9:4) అయినప్పటికీ, తనపై విశ్వాసం ఉంచబోయే ఆ కొంతమంది మీద ఆయన మనసుపెట్టాడు, అందరికీ ఉత్సాహంగా ప్రకటించాడు. మరి హృదయాల్ని చదివే సామర్థ్యం లేని మనం, ఫలానా ప్రాంతంలోని ప్రజలు లేదా ఫలానా వాళ్లు ఎప్పటికీ క్రీస్తు శిష్యులు కాలేరనే ముగింపుకు రాకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! మనం ప్రజల్ని కాబోయే క్రీస్తు శిష్యుల్లా చూడాలి. బుర్కీన ఫాసోలో మిషనరీగా సేవచేస్తున్న మార్క్‌ ఇలా చెప్తున్నాడు: “వీళ్లు ప్రగతి సాధిస్తారు అని నేను అనుకున్న చాలామంది స్టడీ తీసుకోవడం ఆపేస్తుంటారు. వీళ్లు ఎక్కువకాలం స్టడీ తీసుకోరు అని నేను అనుకున్న వాళ్లు చక్కగా ప్రగతి సాధిస్తుంటారు. కాబట్టి నా సొంత ఆలోచన మీద ఆధారపడకుండా, పవిత్రశక్తి నిర్దేశానికి లోబడడం మంచిదని నేను తెలుసుకున్నాను.”

19. మనం ప్రకటించే ప్రాంతంలోని ప్రజల్ని ఎలా చూడాలి?

19 మనం ప్రకటించే ప్రాంతంలోని చాలామందికి మంచివార్త మీద ఆసక్తి లేదని మొదట్లో మనకు అనిపించవచ్చు. కానీ పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయని యేసు తన శిష్యులకు చెప్పిన మాటలను గుర్తుంచుకోండి. మనుషులు మారగలరు, క్రీస్తు శిష్యులు అవ్వగలరు. కాబోయే ఈ క్రీస్తు శిష్యులు యెహోవాకు విలువైనవాళ్లు. (హగ్గ. 2:7) మనం ప్రజల్ని యెహోవా, యేసు చూసినట్టే చూస్తే, వాళ్ల నమ్మకాలు ఏంటో, వాళ్లకు వేటిమీద ఆసక్తి ఉందో తెలుసుకుంటాం. వాళ్లను కాబోయే మన సహోదర సహోదరీల్లా చూస్తాం.

పాట 57 అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం

^ పేరా 5 మనం ప్రజల్ని చూసే విధానం మనం ప్రకటించే తీరుపై, బోధించే తీరుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? యేసు, అపొస్తలుడైన పౌలు ప్రజల్ని ఎలా చూశారో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మనం ప్రకటించే ప్రజల నమ్మకాలు ఏంటో, వాళ్లకు వేటిమీద ఆసక్తి ఉందో పట్టించుకోవడం ద్వారా, అలాగే వాళ్లను కాబోయే క్రీస్తు శిష్యుల్లా చూడడం ద్వారా మనం యేసును, పౌలును ఎలా అనుకరించవచ్చో కూడా పరిశీలిస్తాం.

^ పేరా 17 ప్రజలు మారగలరని చెప్పే మరిన్ని ఉదాహరణల్ని “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” అనే ఆర్టికల్స్‌లో చూడవచ్చు. ఈ ఆర్టికల్స్‌ 2017 వరకు కావలికోట పత్రికలో వచ్చాయి. ఇప్పుడు అవి jw.org® వెబ్‌సైట్‌లో వస్తున్నాయి. మా గురించి > యెహోవాసాక్షుల అనుభవాలు కింద చూడండి.

^ పేరా 57 చిత్రాల వివరణ: ఇంటింటి పరిచర్య చేస్తున్న ఒక జంట వీటిని గమనించారు: (1) ఒక ఇల్లు శుభ్రంగా, పువ్వులతో అలంకరించబడి ఉంది; (2) ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు; (3) ఒక ఇల్లు అపరిశుభ్రంగా ఉంది; (4) ఒక ఇంట్లోవాళ్లు క్రైస్తవ మతానికి చెందినవాళ్లు. ఈ నాలుగు ఇళ్లలో క్రీస్తు శిష్యులయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది?