కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 16

వినండి, తెలుసుకోండి, కనికరం చూపించండి

వినండి, తెలుసుకోండి, కనికరం చూపించండి

“పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి, న్యాయంగా తీర్పు తీర్చండి.”—యోహా. 7:24.

పాట 101 ఐకమత్యంతో పనిచేద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా గురించి బైబిలు చెప్తున్న ఏ సత్యం మనకు ఓదార్పును ఇస్తుంది?

మీ రంగు, రూపం, ఆకారం చూసి ఇతరులు మీ గురించి ఒక అభిప్రాయానికి వస్తే మీరు ఇష్టపడతారా? బహుశా ఇష్టపడకపోవచ్చు. కానీ యెహోవా, కేవలం పైకి కనిపించేదాన్ని బట్టి మన గురించి ఒక అభిప్రాయానికి రాడని తెలుసుకోవడం ఎంతో ఓదార్పును ఇస్తుంది! ఈ ఉదాహరణ గమనించండి. యెష్షయి కుమారుల్ని సమూయేలు చూసిన విధానానికి, యెహోవా చూసిన విధానానికి తేడా ఉంది. యెష్షయి కుమారుల్లో ఒకరు ఇశ్రాయేలుకు రాజు అవుతారని యెహోవా సమూయేలుకు చెప్పాడు. కానీ వాళ్లలో ఎవరు రాజు అవుతారో చెప్పలేదు. సమూయేలు యెష్షయి పెద్ద కుమారుడైన ఏలీయాబును చూసినప్పుడు, “యెహోవా అభిషేకించిన వ్యక్తి ఖచ్చితంగా ఇతనే” అన్నాడు. సమూయేలు కంటికి ఏలీయాబు ఒక రాజులా కనిపించాడు. “కానీ యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: ‘అతని రూపాన్ని గానీ, ఎత్తును గానీ పట్టించుకోకు. నేను అతన్ని తిరస్కరించాను.’” యెహోవా ఏ పాఠం నేర్పిస్తున్నాడు? యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “మనిషి, కంటికి కనిపించేదాన్నే చూస్తాడు; కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు.”—1 సమూ. 16:1, 6, 7.

2. యోహాను 7:24 చెప్తున్నట్టు, మనం పైకి కనిపించేవాటిని బట్టి ఇతరుల గురించి ఒక అభిప్రాయానికి ఎందుకు రాకూడదు? ఉదాహరణ చెప్పండి.

2 మనం అపరిపూర్ణులం కాబట్టి, పైకి కనిపించేదాన్ని బట్టి ఇతరుల గురించి త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటాం. (యోహాను 7:24 చదవండి.) అలా పైకి కనిపించేవాటిని మాత్రమే చూస్తే, ఒక వ్యక్తి గురించి ఎక్కువ తెలుసుకోలేం. ఉదాహరణకు ఎంతో తెలివి, అనుభవం ఉన్న డాక్టరు కూడా రోగిని చూడగానే అతని సమస్య ఏంటో చెప్పలేడు. బదులుగా ఆ రోగి చెప్పేది జాగ్రత్తగా వింటేనే అతనికి గతంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయో, అతనికి ఎలా అనిపిస్తుందో, అతనికున్న వ్యాధి లక్షణాలు ఏంటో ఆ డాక్టరు అర్థం చేసుకోగలుగుతాడు. కొన్నిసార్లు రోగి శరీరం లోపల ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎక్స్‌రే తీయించమని కూడా డాక్టరు చెప్పవచ్చు. ఇవన్నీ చేయకపోతే, ఆ రోగికున్న జబ్బును డాక్టరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. అదేవిధంగా సహోదర సహోదరీల విషయంలో కూడా, మనం కేవలం పైకి కనిపించేవాటినే చూస్తే వాళ్లను పూర్తిగా అర్థం చేసుకోలేం. కాబట్టి కనిపించని దాన్ని, అంటే వాళ్ల హృదయాన్ని చూడడానికి ప్రయత్నించాలి. నిజమే మనం హృదయాల్ని చదవలేం, యెహోవా అర్థం చేసుకున్నంత బాగా ఇతరుల్ని అర్థం చేసుకోలేం. కానీ, మనం యెహోవాను అనుకరించడానికి చేయగలినదంతా చేయవచ్చు. ఎలా?

3. ఈ ఆర్టికల్‌లో చర్చించే బైబిలు వృత్తాంతాలు, మనం ఏయే విషయాల్లో యెహోవాను అనుకరించడానికి సహాయం చేస్తాయి?

3 యెహోవా తన ఆరాధకులతో ఎలా వ్యవహరిస్తాడు? వాళ్లు చెప్పేది వింటాడు. వాళ్ల నేపథ్యాన్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాడు. వాళ్లమీద కనికరం చూపిస్తాడు. యోనా, ఏలీయా, హాగరు, లోతు అనే నలుగురి విషయంలో యెహోవా ఈ మూడు పనులు ఎలా చేశాడో ఇప్పుడు పరిశీలిద్దాం. మనం సహోదర సహోదరీలతో వ్యవహరిస్తున్నప్పుడు ఈ విషయాల్లో యెహోవాను ఎలా అనుకరించవచ్చో తెలుసుకుందాం.

జాగ్రత్తగా వినండి

4. మనం యోనా గురించి ఎందుకు తప్పుగా అనుకునే అవకాశం ఉంది?

4 యోనా పరిస్థితి గురించి మనకు అన్ని విషయాలు తెలియవు కాబట్టి ఆయన నమ్మదగినవాడు కాదని, ఆయనకు విశ్వసనీయత లేదని మనం అనుకునే అవకాశం ఉంది. నీనెవెకు వెళ్లి తీర్పు సందేశాన్ని ప్రకటించమని స్వయంగా యెహోవాయే యోనాకు ఆజ్ఞాపించాడు. కానీ యోనా ఆ ఆజ్ఞకు లోబడకుండా, “యెహోవాకు దూరంగా” పారిపోవాలని వేరే వైపు వెళ్లే పడవ ఎక్కాడు. (యోనా 1:1-3) మీరైతే యోనాకు ఇంకో అవకాశం ఇచ్చేవాళ్లా? బహుశా ఇవ్వకపోవచ్చు. కానీ కొన్ని కారణాల్ని బట్టి యెహోవా యోనాకు మరో అవకాశం ఇచ్చాడు.—యోనా 3:1, 2.

5. యోనా 2:1, 2, 9 వచనాల నుండి యోనా గురించి మీరేం తెలుసుకున్నారు?

5 యోనా చేసిన ఒక ప్రార్థన ఆయన నిజంగా ఎలాంటివాడో తెలియజేస్తుంది. (యోనా 2:1, 2, 9 చదవండి.) యోనా తన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేసినప్పటికీ, చేప కడుపులో నుండి చేసిన ప్రార్థన మాత్రం ఆయన నిజంగా ఎలాంటి వ్యక్తో తెలియజేస్తుంది. తన నియామకం నుండి పారిపోయిన యోనా నిజానికి వినయస్థుడని, కృతజ్ఞత గలవాడని, యెహోవాకు లోబడాలని తీర్మానించుకున్న వ్యక్తని ఆ ప్రార్థన రుజువు చేస్తుంది. కాబట్టి యెహోవా సరైన కారణంతోనే యోనా చేసిన తప్పు మీద మనసుపెట్టలేదు. బదులుగా ఆయన ప్రార్థనకు జవాబిచ్చి, ఆయన్ని తన ప్రవక్తగా కొనసాగనిచ్చాడు.

వాస్తవాల్ని తెలుసుకుంటే మరింత సహానుభూతి చూపించగలుగుతాం (6వ పేరా చూడండి) *

6. జాగ్రత్తగా వినడానికి కృషిచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

6 ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వినాలంటే, మనకు వినయం, ఓపిక అవసరం. అలా జాగ్రత్తగా వినడానికి కృషిచేస్తే కనీసం మూడు ప్రయోజనాలు ఉంటాయి. మొదటిగా, ఇతరుల గురించి వెంటనే ఒక తప్పుడు అభిప్రాయానికి రాకుండా ఉంటాం. రెండవదిగా, మన సహోదర సహోదరీల భావాల్ని-ఉద్దేశాల్ని అర్థం చేసుకోగలుగుతాం, మరింత సహానుభూతి చూపించగలుగుతాం. మూడవదిగా, మనం వాళ్లను మాట్లాడనిచ్చినప్పుడు, వాళ్ల గురించి వాళ్లు తెలుసుకోవడానికి సహాయం చేయగలుగుతాం. కొన్నిసార్లు ఒక వ్యక్తి తన భావాల్ని తాను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, మనసువిప్పి వాటిని మాటల్లో చెప్పాలి. (సామె. 20:5) ఆసియాలో ఉండే ఒక సంఘపెద్ద ఇలా ఒప్పుకుంటున్నాడు: “నేను ఒకసారి వాస్తవాలన్నీ తెలుసుకోకుండా మాట్లాడేశాను. ఒక సహోదరితో, తను కామెంట్స్‌ బాగా చెప్పడం నేర్చుకోవాలని అన్నాను. కానీ ఆ సహోదరికి చదవడం చాలా కష్టమని, ఆమె కామెంట్స్‌ చెప్పడానికి ఇప్పటికే ఎంతో కృషి చేస్తుందని నాకు తర్వాత తెలిసింది.” కాబట్టి సంఘ పెద్దలు ఏదైనా సలహా ఇచ్చేముందు ‘వాస్తవాల్ని వినడం’ ఎంత ప్రాముఖ్యమో కదా!—సామె. 18:13.

7. యెహోవా ఏలీయాతో వ్యవహరించిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

7 కొంతమంది సహోదర సహోదరీలకు తమ భావాల్ని మాటల్లో చెప్పడం కష్టంగా ఉండవచ్చు. వాళ్ల సంస్కృతి, వ్యక్తిత్వం లేదా గతంలో వాళ్లకు ఎదురైన కొన్ని అనుభవాలు దానికి కారణం కావచ్చు. అలాంటివాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు? యెజెబెలు రాణికి భయపడి పారిపోయిన ఏలీయాతో యెహోవా ఎలా వ్యవహరించాడో గుర్తుచేసుకోండి. తనకు నిజంగా ఎలా అనిపిస్తుందో తన పరలోక తండ్రికి చెప్పడానికి ఏలీయాకు చాలారోజులు పట్టింది. ఆయన తన మనసులో ఉన్నది చెప్పినప్పుడు యెహోవా జాగ్రత్తగా విన్నాడు. తర్వాత ఏలీయాను ప్రోత్సహించి, ఒక ప్రాముఖ్యమైన పని అప్పగించాడు. (1 రాజు. 19:1-18) సహోదర సహోదరీలు మనతో మనసువిప్పి మాట్లాడడానికి సమయం పట్టవచ్చు. అయితే వాళ్లు అలా మాట్లాడినప్పుడే వాళ్ల భావాల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం యెహోవాలా ఓర్పు చూపిస్తే, మనమీద వాళ్లకు నమ్మకం కలుగుతుంది, అప్పుడు వాళ్లు మనతో మనసువిప్పి మాట్లాడతారు. అలా మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి.

సహోదర సహోదరీల గురించి తెలుసుకోండి

8. ఆదికాండం 16:7-13 వచనాలు చెప్తున్నట్టు, యెహోవా హాగరుకు ఎలా సహాయం చేశాడు?

8 శారయి సేవకురాలైన హాగరు అబ్రాముకు భార్య అయిన తర్వాత తెలివితక్కువగా ప్రవర్తించింది. హాగరు గర్భవతి అయిన తర్వాత పిల్లలులేని శారయిని హీనంగా చూడడం మొదలుపెట్టింది. అప్పుడు శారయి హాగరును అవమానించడంతో, హాగరు పారిపోయింది. (ఆది. 16:4-6) హాగరు గర్వంగా ప్రవర్తించింది కాబట్టి ఆమెకు తగిన శాస్తే జరిగిందని అపరిపూర్ణులమైన మనకు అనిపించవచ్చు. కానీ యెహోవా హాగరు గురించి మనలా ఆలోచించలేదు. ఆయన ఒక దేవదూతను ఆమె దగ్గరికి పంపించాడు. హాగరు తన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకోవడానికి ఆ దేవదూత సహాయం చేశాడు, ఆమెను దీవించాడు. దాంతో యెహోవా మొదటినుండి తనను చూస్తున్నాడని, తన పరిస్థితి మొత్తం ఆయనకు తెలుసని హాగరుకు అర్థమైంది. ఆమె యెహోవాను స్తుతిస్తూ ఇలా అంది: ‘నువ్వు చూసే దేవుడివి. నన్ను చూసే వ్యక్తివి.’—ఆదికాండం 16:7-13 చదవండి.

9. యెహోవా హాగరుతో వ్యవహరిస్తున్నప్పుడు ఏ విషయాల్ని అర్థం చేసుకున్నాడు?

9 హాగరుకు సంబంధించి యెహోవా ఏ విషయాల్ని అర్థం చేసుకున్నాడు? హాగరు గతం గురించి, ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి యెహోవాకు పూర్తిగా తెలుసు. (సామె. 15:3) ఐగుప్తీయురాలైన హాగరు హెబ్రీయుల ఇంట్లో నివసిస్తోంది. కాబట్టి వాళ్ల మధ్య తాను ఒంటరిదాన్నని ఆమెకు అనిపించి ఉంటుందా? ఆమెకు తన కుటుంబం, సొంత దేశం గుర్తొచ్చి ఉంటాయా? పైగా, అబ్రాముకు ఆమె ఒక్కతే భార్య కాదు. కొంతకాలం పాటు, నమ్మకమైన కొంతమంది పురుషులకు ఒకరి కంటే ఎక్కువమంది భార్యలు ఉన్నారు. కానీ అది యెహోవా చేసిన ఏర్పాటు కాదు. (మత్త. 19:4-6) కాబట్టి ఎక్కువమంది భార్యలు ఉన్న కుటుంబాల్లో ఈర్ష్య, ద్వేషం కనబడడం సాధారణమే. హాగరు శారయితో అమర్యాదగా ప్రవర్తించడం తప్పని యెహోవాకు తెలుసు. కానీ ఆమె భావాల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకుని యెహోవా ఆమెతో దయగా వ్యవహరించాడు.

సహోదర సహోదరీల గురించి ఎక్కువ తెలుసుకోండి (10-12 పేరాలు చూడండి) *

10. మన సహోదర సహోదరీల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఏమేం చేయవచ్చు?

10 సహోదర సహోదరీల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మనం యెహోవాను అనుకరించవచ్చు. సహోదర సహోదరీల గురించి ఎక్కువగా తెలుసుకోండి. మీటింగ్‌కి ముందు, మీటింగ్‌కి తర్వాత వాళ్లతో మాట్లాడండి, కలిసి పరిచర్య చేయండి, వీలైతే మీ ఇంటికి భోజనానికి పిలవండి. అలా చేసినప్పుడు, ఎవరితోనూ కలవదని మీరు అనుకున్న ఒక సహోదరి నిజానికి బిడియస్థురాలని మీకు అర్థమవ్వవచ్చు; ధనవంతుడైన ఒక సహోదరునికి డబ్బు మీద ప్రేమ లేదని, నిజానికి అతను ఉదార స్వభావం గలవాడని మీరు గుర్తించవచ్చు; మీటింగ్స్‌కి తరచూ ఆలస్యంగా వస్తున్న ఒక కుటుంబం నిజానికి వ్యతిరేకతను ఎదుర్కొంటోందని మీరు గ్రహించవచ్చు. (యోబు 6:29) నిజమే, మనం ‘ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.’ (1 తిమో. 5:13) అయితే మన సహోదర సహోదరీల గురించి, వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకోవడం మంచిది. దానివల్ల మనం వాళ్లను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం.

11. పెద్దలు సంఘంలోని సహోదర సహోదరీల గురించి బాగా తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

11 ముఖ్యంగా పెద్దలు, సంఘంలో ఉన్న సహోదర సహోదరీల నేపథ్యం గురించి తెలుసుకోవాలి. ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేసిన ఆర్టర్‌ అనే సహోదరుని ఉదాహరణ పరిశీలించండి. ఆయన, ఒక సంఘ పెద్దతో కలిసి బిడియస్థురాలిలా అనిపించిన ఒక సహోదరితో మాట్లాడడానికి వెళ్లాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “పెళ్లయిన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడని మాకు తెలిసింది. ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, తన ఇద్దరు కూతుళ్లకు యెహోవాను ప్రేమించడం నేర్పించింది. దాంతో వాళ్లు యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె కంటి చూపు తగ్గిపోతోంది, డిప్రెషన్‌తో బాధపడుతోంది. అయినప్పటికీ యెహోవా మీద ఆమె ప్రేమ, విశ్వాసం తగ్గలేదు. ఆ సహోదరి చక్కని ఆదర్శం నుండి ఎంతో నేర్చుకోవచ్చని మాకు అనిపించింది.” (ఫిలి. 2:3) ఈ ఉదాహరణలోని ప్రాంతీయ పర్యవేక్షకుడు ఏం చేశాడు? తన నమ్మకమైన సేవకుల గురించి, వాళ్లు అనుభవిస్తున్న బాధల గురించి తెలిసిన యెహోవాను అనుకరించాడు. (నిర్గ. 3:7) పెద్దలు తమ సంఘంలోని సహోదర సహోదరీల గురించి బాగా తెలుసుకున్నప్పుడే వాళ్లకు చక్కగా సహాయం చేయగలుగుతారు.

12. తోటి సహోదరి నేపథ్యం తెలుసుకోవడం వల్ల ఒక సహోదరి ఎలాంటి ప్రయోజనం పొందింది?

12 మీకు చిరాకు తెప్పించే తోటి క్రైస్తవుని నేపథ్యం తెలుసుకున్నప్పుడు, మీరు అతని పట్ల సహానుభూతి చూపించగలుగుతారు. ఆసియాలో నివసిస్తున్న ఒక సహోదరి ఉదాహరణ గమనించండి. ఆమె ఇలా చెప్తుంది: “మా సంఘంలో ఒక సహోదరి చాలా గట్టిగా మాట్లాడేది. ఆమెకు మర్యాద తెలీదని నేను అనుకున్నాను. కానీ ఆమెతో కలిసి పరిచర్య చేయడం వల్ల కొన్ని విషయాల్ని అర్థం చేసుకున్నాను. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి మార్కెట్లో చేపలు అమ్మేదని, జనాల్ని పిలవడానికి గట్టిగా అరవాల్సి వచ్చేదని నాకు తెలిసింది. సహోదర సహోదరీలను అర్థం చేసుకోవాలంటే వాళ్ల నేపథ్యం గురించి తెలుసుకోవాలని అప్పుడు నేను గ్రహించాను.” అవును, సహోదర సహోదరీల గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే కృషి అవసరం. అయినా, ‘హృదయాల్ని విశాలం చేసుకోమని’ బైబిలు ఇస్తున్న సలహాను పాటించినప్పుడు, ‘అన్నిరకాల ప్రజల్ని’ ప్రేమించే యెహోవాను అనుకరించిన వాళ్లమౌతాం.—1 తిమో. 2:3, 4; 2 కొరిం. 6:11-13.

కనికరం చూపించండి

13. ఆదికాండం 19:15, 16 చెప్తున్నట్టు, లోతు ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు దేవదూతలు ఏం చేశారు? ఎందుకు?

13 ఒకసారి, యెహోవా నిర్దేశాలకు లోబడే విషయంలో లోతు ఆలస్యం చేశాడు. తన కుటుంబాన్ని తీసుకొని సొదొమ నుండి బయటికి వెళ్లిపొమ్మని ఇద్దరు దేవదూతలు లోతుకు చెప్పారు. ఎందుకు? ఎందుకంటే, “మేము ఈ నగరాన్ని నాశనం చేయబోతున్నాం” అని ఆ దేవదూతలు అన్నారు. (ఆది. 19:12, 13) కానీ మరుసటి రోజు తెల్లవారాక కూడా లోతు, అతని కుటుంబం ఇంకా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు ఆ దేవదూతలు లోతును మళ్లీ హెచ్చరించారు. అయినా, ‘లోతు ఆలస్యం చేస్తూ వచ్చాడు.’ ఈ సందర్భంలో, లోతు యెహోవా మాటను లెక్కచేయలేదని, ఆయనకు లోబడలేదని మనం అనుకోవచ్చు. అయితే యెహోవా మాత్రం లోతును రక్షించే ప్రయత్నం ఆపలేదు. “అతని మీద యెహోవాకు ఉన్న కనికరం వల్ల” దేవదూతలు అతన్ని, అతని భార్యాపిల్లల్ని చెయ్యి పట్టుకుని ఆ నగరం బయటికి తీసుకెళ్లారు.—ఆదికాండం 19:15, 16 చదవండి.

14. యెహోవా లోతు మీద ఎందుకు కనికరం చూపించివుంటాడు?

14 యెహోవా లోతు మీద కనికరం చూపించడానికి చాలా కారణాలు ఉండివుంటాయి. అతను నగరం బయట ఉన్న ప్రజలకు భయపడి ఆలస్యం చేసివుంటాడు. అంతేకాదు, ఆ దగ్గర్లోని లోయలో ఉన్న తారు గుంటల్లో ఇద్దరు రాజులు పడిపోవడం గురించి అతనికి తెలిసేవుంటుంది. (ఆది. 14:8-12) తన కుటుంబానికి ఏ ప్రమాదం ఎదురౌతుందోనని ఒక భర్తగా, తండ్రిగా లోతు ఆందోళనపడి ఉంటాడు. పైగా లోతు ధనవంతుడు కాబట్టి అతనికి సొదొమలో మంచి ఇల్లు కూడా ఉండివుంటుంది. (ఆది. 13:5, 6) నిజమే, లోతు యెహోవాకు వెంటనే లోబడకపోవడానికి ఇవేవీ సరైన కారణాలు కావు. అయినప్పటికీ యెహోవా లోతు చేసిన పొరపాటు మీద మనసుపెట్టకుండా, అతన్ని ‘నీతిమంతునిగా’ చూశాడు.—2 పేతు. 2:7, 8.

ఇతరులు చెప్పేది విన్నప్పుడు, వాళ్ల మీద కనికరం ఎలా చూపించాలో మనకు అర్థం అవ్వవచ్చు (15-16 పేరాలు చూడండి) *

15. ఒకవ్యక్తి ప్రవర్తనను తప్పుబట్టే బదులు మనం ఏం చేయాలి?

15 ఇతరుల ప్రవర్తనను తప్పుబట్టే బదులు, వాళ్ల భావాల్ని అర్థంచేసుకోవడానికి చేయగలిగినదంతా చేయండి. యూరప్‌లో ఉన్న వెరోనిక అనే సహోదరి అలానే చేసింది. ఆమె ఇలా చెప్తుంది: “ఒక సహోదరి ఎప్పుడూ చిరాకుగా ఉన్నట్టు కనిపించేది. ఆమె ఎవ్వరితో కలిసేది కాదు. కొన్నిసార్లు ఆమెతో మాట్లాడాలంటే నాకు భయమేసేది. కానీ కాస్త ఆలోచించాక, ‘ఒకవేళ నేనే ఆమె పరిస్థితిలో ఉంటే, నాకొక స్నేహితురాలు ఉండాలని కోరుకుంటాను కదా’ అనుకున్నాను. కాబట్టి ఆమె ఎందుకు అలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆమెతో మాట్లాడాను. అప్పుడు ఆమె మనసువిప్పి మాట్లాడడం మొదలుపెట్టింది! ఇప్పుడు నేను ఆమెను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను.”

16. సహానుభూతి చూపించడానికి సహాయం చేయమని మనం ఎందుకు ప్రార్థించాలి?

16 యెహోవా మాత్రమే మనల్ని పూర్తిగా అర్థం చేసుకోగలడు. (సామె. 15:11) కాబట్టి ఇతరుల్ని ఆయన చూసినట్టే చూసేలా, వాళ్ల మీద కనికరం ఎలా చూపించాలో అర్థం చేసుకునేలా సహాయం చేయమని ప్రార్థించండి. ఏంజిలా అనే సహోదరి అనుభవం పరిశీలించండి. ఇతరుల మీద మరింత సహానుభూతి చూపించేలా ప్రార్థన ఆమెకు సహాయం చేసింది. ఆమె సంఘంలో ఒక సహోదరి ఎవరితోనూ కలిసేది కాదు. ఏంజిలా ఇలా చెప్తుంది: “నేను జాగ్రత్తగా లేకపోయుంటే ఆ సహోదరిని విమర్శించి, ఆమెకు దూరంగా ఉండేదాన్ని. కానీ నేను యెహోవాకు ప్రార్థించి ఆమెను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అడిగాను.” ఏంజిలా ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడా? ఆమె ఇలా అంది: “మేము కలిసి పరిచర్య చేశాం, ఆ తర్వాత కొన్ని గంటలపాటు మాట్లాడుకున్నాం. నేను ఆమె చెప్పిందంతా ఓపిగ్గా విన్నాను. ఇప్పుడు నేను ఆమెను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను.”

17. మనం ఏమని నిశ్చయించుకోవాలి?

17 ఫలానా సహోదర సహోదరీలు మాత్రమే మన కనికరానికి అర్హులు అని మనం అనుకోకూడదు. యోనా, ఏలీయా, హాగరు, లోతులాగే మన సహోదర సహోదరీలందరూ కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో ఆ నలుగురు వాళ్లంతట వాళ్లే కష్టాల్ని కొనితెచ్చుకున్నారు. నిజానికి మనలో ప్రతీ ఒక్కరం ఎప్పుడోకప్పుడు కష్టాలు కొనితెచ్చుకుని ఉంటాం. కాబట్టి ఇతరుల మీద సహానుభూతి చూపించమని యెహోవా మనకు చెప్పడం సరైనదే. (1 పేతు. 3:8) మన ప్రపంచవ్యాప్త సహోదర బృందంలో అన్ని దేశాలకు, నేపథ్యాలకు చెందిన ప్రజలు ఉన్నారు. మనం యెహోవాకు లోబడినప్పుడు మన మధ్య ఉన్న ఐక్యత ఇంకా ఎక్కువౌతుంది. కాబట్టి మనం సహోదర సహోదరీలు చెప్పేది వినాలని, వాళ్ల గురించి తెలుసుకోవాలని, వాళ్ల మీద కనికరం చూపించాలని నిశ్చయించుకుందాం.

పాట 87 రండి, సేదదీర్పు పొందండి!

^ పేరా 5 మనం అపరిపూర్ణులం కాబట్టి మనుషుల గురించి, వాళ్ల ఉద్దేశాల గురించి వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటాం. కానీ “యెహోవా హృదయాన్ని చూస్తాడు.” (1 సమూ. 16:7) యోనా, ఏలీయా, హాగరు, లోతు అనే నలుగురితో యెహోవా ఎలా ప్రేమగా వ్యవహరించాడో మనం ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అలాగే మన సహోదర సహోదరీలతో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవాను ఎలా అనుకరించాలో తెలుసుకుంటాం.

^ పేరా 52 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు మీటింగ్‌కి ఆలస్యంగా రావడం చూసి ఒక పెద్ద వయసు సహోదరుడు చిరాకు పడుతున్నాడు. కానీ కారు ఆక్సిడెంట్‌ వల్ల ఆ సహోదరుడు ఆలస్యంగా వచ్చాడని తర్వాత తెలుసుకున్నాడు.

^ పేరా 54 చిత్రాల వివరణ: ఒక సహోదరి ఎవరితోనూ కలవట్లేదని గ్రూప్‌ పర్యవేక్షకుడు మొదట అనుకున్నాడు. కానీ ఆమె బిడియస్థురాలని, అంతగా పరిచయం లేనివాళ్ల మధ్య ఉండడం ఆమెకు ఇబ్బందిగా ఉంటుందని తర్వాత అర్థం చేసుకున్నాడు.

^ పేరా 56 చిత్రాల వివరణ: ఒక సహోదరి రాజ్యమందిరానికి వచ్చినప్పుడు చిరాగ్గా ఉంటుందని, ఎవర్నీ పట్టించుకోదని మరో సహోదరి మొదట్లో అనుకుంది. కానీ ఆమెతో సమయం గడిపి, ఆమె గురించి తెలుసుకున్న తర్వాత తన అభిప్రాయం తప్పని అర్థం చేసుకుంది.