అధ్యయన ఆర్టికల్ 4
వాత్సల్యాన్ని అలవర్చుకుంటూ ఉండండి
“సహోదర ప్రేమను, ఆ ప్రేమలో వాత్సల్యాన్ని చూపించండి.”—రోమా. 12:10.
పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి
ఈ ఆర్టికల్‌లో . . . *
1. చాలా కుటుంబాల్లో ప్రేమ కరువైపోయిందని ఎలా చెప్పవచ్చు?
చివరి రోజుల్లో “మమకారం లేనివాళ్లు” ఉంటారని బైబిలు ముందే చెప్పింది. (2 తిమో. 3:1, 3) ఆ ప్రవచనం నెరవేరడం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉదాహరణకు, లక్షల కుటుంబాలు విడాకుల వల్ల విచ్ఛిన్నం అవుతున్నాయి. దానివల్ల భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు, పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్నారు. అయితే, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న కుటుంబ సభ్యులు కూడా అసలు ఒకరితో ఒకరికి సంబంధమే లేనట్టు ఉంటున్నారు. కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చే ఒక సలహాదారుడు ఇలా అంటున్నాడు: “ఇంట్లో అమ్మ, నాన్న, పిల్లలు అందరూ ఒకరి నుండి ఒకరు విడిపోయి కంప్యూటర్లకు, ట్యాబ్లెట్‌లకు, స్మార్ట్‌ఫోన్‌లకు, లేదా వీడియో గేములకు అతుక్కుపోతున్నారు. వాళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారన్న మాటే గానీ, ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదు.”
2-3. (ఎ) రోమీయులు 12:10 ప్రకారం, మనం ఎవరి మీద వాత్సల్యం చూపించాలి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
2 మనం ఈ వ్యవస్థ వల్ల మలచబడి ప్రేమలేని వాళ్లలా తయారవ్వకూడదు. (రోమా. 12:2) బదులుగా మనం కుటుంబ సభ్యుల మీద, అలాగే తోటి విశ్వాసుల మీద వాత్సల్యాన్ని వృద్ధి చేసుకోవాలి. (రోమీయులు 12:10 చదవండి.) వాత్సల్యం అంటే ఏంటి? ఆ మాట, ముఖ్యంగా సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాన్ని వర్ణిస్తుంది. మన ఆధ్యాత్మిక కుటుంబం మీద, అంటే మన క్రైస్తవ సహోదర సహోదరీల మీద అలాంటి ప్రేమనే వృద్ధి చేసుకోవాలి. వాత్సల్యం చూపించినప్పుడు మనందరం యెహోవాను ఐక్యంగా ఆరాధించగలుగుతాం.—మీకా 2:12.
3 వాత్సల్యాన్ని అలవర్చుకోవడానికి, దాన్ని చూపించడానికి బైబిలు ఉదాహరణలు ఎలా సహాయం చేస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
యెహోవా “ఎంతో వాత్సల్యం గలవాడు”
4. యెహోవా మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడానికి యాకోబు 5:11 ఎలా సహాయం చేస్తుంది?
4 యెహోవాకున్న అద్భుతమైన లక్షణాల్ని బైబిలు తెలియజేస్తుంది. ఉదాహరణకు, “దేవుడు ప్రేమ” అని బైబిలు చెప్తుంది. (1 యోహా. 4:8) మనం దేవునికి దగ్గరవ్వడానికి ఆ ఒక్క మాట చాలు. అయితే, “యెహోవా ఎంతో వాత్సల్యం గలవాడు” అని కూడా బైబిలు చెప్తుంది. (యాకోబు 5:11 చదవండి.) యెహోవాకు మన మీదున్న ప్రేమ ఎంత ప్రగాఢమైనదో అది చక్కగా వర్ణిస్తుంది!
5. యెహోవా ఎలా కరుణ చూపిస్తున్నాడు? మనం ఆయన్ని ఎలా అనుకరించవచ్చు?
5 యాకోబు 5:11లో, యెహోవాకున్న వాత్సల్యం మరో చక్కని లక్షణమైన కరుణతో ముడిపెట్టబడింది. (నిర్గ. 34:6) యెహోవా మన మీద కరుణ చూపించే ఒక మార్గం, మన పొరపాట్లను క్షమించడం. (కీర్త. 51:1) బైబిల్లో, కరుణ అంటే కేవలం తప్పుల్ని క్షమించడం మాత్రమే కాదు. కరుణ అంటే, కష్టంలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మన హృదయంలో కలిగే లోతైన భావం. అది, ఆ వ్యక్తికి సహాయం చేసేలా మనల్ని కదిలిస్తుంది. చంటిబిడ్డకు సహాయం చేయాలని ఒక తల్లి ఎంతగా ఆరాటపడుతుందో, అంతకన్నా ఎక్కువగా యెహోవా మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. (యెష. 49:15) కష్టంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేలా కరుణ ఆయన్ని కదిలిస్తుంది. (కీర్త. 37:39; 1 కొరిం. 10:13) సహోదర సహోదరీలు మనల్ని బాధపెట్టినప్పుడు క్షమించడం ద్వారా, పగ పెట్టుకోకుండా ఉండడం ద్వారా వాళ్ల మీద కరుణ చూపించవచ్చు. (ఎఫె. 4:32) అయితే కరుణ చూపించే ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే, మన సహోదర సహోదరీలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల వెన్నంటే ఉండడం. మనం ఇతరుల మీద ప్రేమ, కరుణ చూపించినప్పుడు ఎంతో వాత్సల్యంగల యెహోవాను అనుకరిస్తాం.—ఎఫె. 5:1.
యోనాతాను, దావీదు “దగ్గరి స్నేహితులయ్యారు”
6. యోనాతాను దావీదులు ఎలా ఒకరి పట్ల ఒకరు వాత్సల్యం చూపించుకున్నారు?
6 వాత్సల్యం చూపించిన అపరిపూర్ణ మనుషుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. యోనాతాను దావీదుల ఉదాహరణ పరిశీలించండి. బైబిలు ఇలా 1 సమూ. 18:1) సౌలు తర్వాతి రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు. తర్వాత, సౌలు దావీదు మీద అసూయపడి ఆయన్ని చంపడానికి ప్రయత్నించాడు. కానీ దావీదును చంపే కుట్రలో యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో చేతులు కలపలేదు. యోనాతాను దావీదులు ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని, ఒకరికొకరం మద్దతు ఇచ్చుకుంటామని ప్రమాణం చేసుకున్నారు.—1 సమూ. 20:42.
చెప్తుంది: “యోనాతాను, దావీదులు దగ్గరి స్నేహితులయ్యారు. యోనాతాను దావీదును ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాడు.” (7. యోనాతాను దావీదులు స్నేహితులవ్వకుండా అడ్డుకోగల ఒక విషయం ఏంటి?
7 యోనాతాను దావీదులు స్నేహితులవ్వకుండా కొన్ని విషయాలు అడ్డుకోగలిగేవి. వాటిని పరిశీలిస్తే, వాళ్ల మధ్య ఉన్న వాత్సల్యం ఎందుకంత ప్రత్యేకమైనదో మనకు అర్థమౌతుంది. ఉదాహరణకు, దావీదు కన్నా యోనాతాను దాదాపు 30 సంవత్సరాలు పెద్దవాడు. కాబట్టి అనుభవంలేని ఈ యువకుడితో నాకు పోలికేంటి అని యోనాతాను అనుకోవచ్చు. కానీ ఆయన అలా అనుకోలేదు, దావీదును తనకంటే తక్కువవాడిగా చూడలేదు.
8. యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడని మీకెందుకు అనిపిస్తుంది?
8 యోనాతాను దావీదు మీద అసూయపడి ఉండేవాడే. తాను సౌలు రాజు కుమారుడు కాబట్టి సింహాసనం న్యాయంగా తనకే దక్కాలని యోనాతాను పట్టుబట్టవచ్చు. (1 సమూ. 20:31) కానీ యోనాతాను వినయం చూపించాడు, యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నాడు. అందుకే, సౌలు తర్వాతి రాజుగా దావీదు ఎంచుకోబడ్డాడని తెలిసినప్పుడు, యోనాతాను దానికి పూర్తి మద్దతిచ్చాడు. ఆయన యెహోవాకే కాదు దావీదుకు కూడా విశ్వసనీయంగా ఉన్నాడు. దానివల్ల తన తండ్రి అయిన సౌలుకు కోపం వచ్చినా ఆయన దావీదును అంటిపెట్టుకుని ఉన్నాడు.—1 సమూ. 20:32-34.
9. యోనాతాను దావీదు మీద అసూయపడ్డాడా? వివరించండి.
9 యోనాతానుకు దావీదు మీద వాత్సల్యం ఉంది కాబట్టి ఆయన మీద అసూయపడలేదు. యోనాతాను నైపుణ్యం గల విలుకాడు, ధైర్యవంతుడైన యోధుడు. ఆయనకు, ఆయన తండ్రి అయిన సౌలుకు “గద్దలకన్నా వేగం గలవాళ్లు, సింహాలకన్నా బలం గలవాళ్లు” అనే పేరుంది. (2 సమూ. 1:22, 23) కాబట్టి యోనాతాను తన ధైర్య-సాహసాల గురించి గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ యోనాతాను పోటీతత్వం చూపించలేదు, దావీదు మీద అసూయపడలేదు. బదులుగా ధైర్యం చూపించినందుకు, యెహోవా మీద ఆధారపడినందుకు యోనాతాను దావీదును మెచ్చుకున్నాడు. నిజానికి, దావీదు గొల్యాతును చంపిన తర్వాతే యోనాతాను ఆయన్ని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. మన సహోదర సహోదరీల మీద అలాంటి వాత్సల్యాన్ని మనమెలా చూపించవచ్చు?
మనమెలా వాత్సల్యం చూపించవచ్చు?
10. “మనస్ఫూర్తిగా ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ” చూపించుకోవడం అంటే ఏంటి?
10 “మనస్ఫూర్తిగా ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి” అని బైబిలు చెప్తుంది. (1 పేతు. 1:22) ఈ విషయంలో యెహోవా మనకు చక్కని ఆదర్శం. యెహోవాకు మనమీద ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉందంటే, మనం ఆయనకు నమ్మకంగా ఉన్నంతకాలం ఏదీ ఆయన ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేదు. (రోమా. 8:38, 39) “ప్రగాఢమైన” అని అనువదించబడిన గ్రీకు పదం ప్రేమ చూపించడానికి గట్టిగా కృషిచేయడాన్ని, ఎంత దూరమైనా వెళ్లడాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు మన సహోదర సహోదరీల మీద ప్రేమ చూపించడం అంత తేలిక కాదు. అయినప్పటికీ ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు “ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూ” ఉండాలి. (ఎఫె. 4:1-3) శాంతిని, ఐక్యతను కాపాడడానికి కృషి చేసినప్పుడు మనం సహోదరుల లోపాల మీద మనసుపెట్టే బదులు, వాళ్లను యెహోవా చూసినట్లే చూడడానికి కృషిచేస్తాం.—1 సమూ. 16:7; కీర్త. 130:3.
11. వాత్సల్యం చూపించడం కొన్నిసార్లు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?
11 మన సహోదర సహోదరీల మీద వాత్సల్యం చూపించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, మరిముఖ్యంగా వాళ్ల లోపాలు తెలిసినప్పుడు అది ఇంకా కష్టంగా ఉంటుంది. మొదటి శతాబ్దంలో కొంతమంది క్రైస్తవులకు అలాంటి సమస్యే ఎదురై ఉంటుంది. ఉదాహరణకు యువొదియ, సుంటుకేలకు పౌలుతో కలిసి మంచివార్త కోసం ప్రయాసపడడంలో ఏ సమస్యా లేదు. కానీ ఏదోక కారణం వల్ల వాళ్లు ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండలేకపోయారు. కాబట్టి, “ప్రభువు సేవలో ఒకే ఆలోచనతో ఉండమని” పౌలు వాళ్లను ప్రోత్సహించాడు.—12. సహోదర సహోదరీల పట్ల వాత్సల్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవచ్చు?
12 నేడు మన సహోదర సహోదరీల పట్ల వాత్సల్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవచ్చు? వాళ్ల గురించి బాగా తెలుసుకున్నప్పుడు వాళ్లను అర్థం చేసుకోవడం, వాత్సల్యాన్ని వృద్ధి చేసుకోవడం మనకు తేలికౌతుంది. వయసు, నేపథ్యం అందుకు అడ్డు రావు. యోనాతాను దావీదు కన్నా దాదాపు 30 సంవత్సరాలు పెద్దవాడైనా, దావీదుకు దగ్గరి స్నేహితుడయ్యాడని గుర్తుంచుకోండి. మీకన్నా పెద్దవాళ్లతో లేదా మీకన్నా చిన్నవాళ్లతో మీరు స్నేహం చేయగలరా? అలాచేస్తే, “ప్రపంచవ్యాప్త సహోదర బృందాన్ని” ప్రేమిస్తున్నారని మీరు చూపిస్తారు.—1 పేతు. 2:17.
13. సంఘంలో ప్రతీఒక్కరికి మనం ఎందుకు దగ్గరి స్నేహితులం అవ్వలేకపోవచ్చు?
13 తోటి విశ్వాసుల మీద వాత్సల్యాన్ని వృద్ధి చేసుకోవడం అంటే, సంఘంలోని వాళ్లందరితో ఒకేలాంటి స్నేహాన్ని వృద్ధి చేసుకోవడమా? కాదు, అది అసాధ్యం. మనలాంటి ఇష్టాలు ఉన్నవాళ్లకు కాస్త ఎక్కువగా దగ్గరవ్వడం తప్పేమీ కాదు. యేసు అపొస్తలులందర్నీ “స్నేహితులని” పిలిచినా, యోహాను మీద ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. (యోహా. 13:23; 15:15; 20:2) అయితే, యేసు పక్షపాతం చూపిస్తూ మిగతావాళ్ల కన్నా యోహానుకు ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వలేదు. ఉదాహరణకు యోహాను, ఆయన సహోదరుడైన యాకోబు దేవుని రాజ్యంలో ప్రముఖ స్థానాల కోసం అడిగినప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నా కుడివైపు గానీ, నా ఎడమవైపు గానీ కూర్చోబెట్టుకోవడం నా చేతుల్లో లేదు.” (మార్కు 10:35-40) మనం కూడా యేసులాగే మన దగ్గరి స్నేహితుల్ని ఎక్కువగా, మిగతావాళ్లను తక్కువగా చూడకూడదు. (యాకో. 2:3, 4) పక్షపాతం చూపిస్తే సంఘంలో విభజనలు సృష్టించినట్లు అవుతుంది, క్రైస్తవ సంఘంలో వాటికి చోటులేదు.—యూదా 17-19.
14. ఫిలిప్పీయులు 2:3 ప్రకారం, పోటీతత్వానికి దూరంగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
14 మనం ఒకరి పట్ల ఒకరం వాత్సల్యం చూపించినప్పుడు పోటీతత్వం వృద్ధి అవ్వకుండా సంఘాన్ని కాపాడతాం. యోనాతాను దావీదును సింహాసనం కోసం పోటీపడుతున్న ప్రత్యర్థిలా చూడలేదు, ఆయన మీద అసూయపడలేదు. మనందరం యోనాతాను ఆదర్శాన్ని అనుకరించవచ్చు. సామర్థ్యాలు ఉన్న మీ సహోదర సహోదరీల్ని పోటీదారుల్లా చూడకుండా, వినయంతో వాళ్లను “మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి.” (ఫిలిప్పీయులు 2:3 చదవండి.) ప్రతీ వ్యక్తి సంఘం కోసం ఏదోకటి చేయగలడని గుర్తుంచుకోండి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మన సహోదర సహోదరీల్లో మంచిని చూస్తాం, వాళ్ల నమ్మకమైన ఆదర్శం నుండి ప్రయోజనం పొందుతాం.—1 కొరిం. 12:21-25.
15. తాన్యాకు, ఆమె కుటుంబానికి ఎదురైన అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?
15 ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు మన సహోదర సహోదరీలు చూపించే వాత్సల్యం ద్వారా, వాళ్లు చేసే సహాయం ద్వారా యెహోవా మనల్ని ఓదారుస్తాడు. తాన్యాకు, ఆమె ముగ్గురు పిల్లలకు ఏం జరిగిందో గమనించండి. వాళ్లు అమెరికాలో, 2019 “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది!” అనే అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. శనివారం కార్యక్రమం అయిపోయాక తిరిగి హోటల్‌కు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో తాన్యా చెప్తుంది: “మేము హోటల్‌కు వెళ్తున్నప్పుడు, ఒక వాహనం అదుపు తప్పి మా లైన్‌లోకి వచ్చి మా కారును గుద్దింది. మాలో ఎవ్వరికీ గాయాలు అవ్వలేదు, కానీ
మేము షాక్‌కు గురయ్యాం. కారు దిగి రోడ్డు మీదే నిలబడ్డాం. అప్పుడు ఒకాయన తన కారు ఆపి, కాసేపు అందులో కూర్చోమని చెయ్యి ఊపుతూ మాకు సైగ చేశాడు. ఆయన మన సహోదరుడే, ఆయన కూడా సమావేశం నుండి తిరిగెళ్తున్నాడు. అయితే మా కోసం ఆగింది ఆయనొక్కడే కాదు. సమావేశం కోసం స్వీడన్ నుండి వచ్చిన ఐదుగురు సహోదర సహోదరీలు కూడా ఆగారు. ఆ సహోదరీలు నన్ను, నా కూతుర్ని ప్రేమగా హత్తుకున్నారు, ఆ సమయంలో మాకు కావల్సింది అదే! ‘ఫర్లేదు మీరు వెళ్లండి’ అని చెప్పినా వాళ్లు మాతోపాటే ఉన్నారు. వైద్య సహాయం అందాక కూడా వాళ్లు మాతోనే ఉండి, మాకు కావల్సినవన్నీ చూసుకున్నారు. ఈ కష్ట సమయంలో మేము అడుగడుగునా యెహోవా ప్రేమను రుచిచూశాం. దానివల్ల సహోదర సహోదరీల మీద మా ప్రేమ పెరిగింది, యెహోవా మీద కూడా ప్రేమ-కృతజ్ఞత పెరిగాయి.” అవసరంలో ఉన్నప్పుడు తోటి విశ్వాసి ఎవరైనా మీ పట్ల వాత్సల్యం చూపించిన సందర్భాన్ని మీరు గుర్తుచేసుకోగలరా?16. మనం ఒకరి మీద ఒకరం వాత్సల్యం చూపించడానికి ఏ కారణాలు ఉన్నాయి?
16 ఒకరి మీద ఒకరం వాత్సల్యం చూపిస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఆలోచించండి. మనం అవసరంలో ఉన్న మన సహోదర సహోదరీలకు ఊరటనిస్తాం. దేవుని ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాం. మనం యేసు శిష్యులమని అందరూ గుర్తిస్తారు, దానివల్ల మంచి మనసున్న వాళ్లు సత్యారాధనకు ఆకర్షితులౌతారు. అన్నిటికన్నా ముఖ్యంగా, “ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు” అయిన యెహోవాను మహిమపరుస్తాం. (2 కొరిం. 1:3) మనందరం వాత్సల్యాన్ని వృద్ధి చేసుకుంటూ, దాన్ని చూపిస్తూ ఉందాం!
పాట 130 క్షమిస్తూ ఉండండి
^ పేరా 5 ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమను బట్టే తన శిష్యులు గుర్తించబడతారని యేసు చెప్పాడు. మనందరం అలాంటి ప్రేమ చూపించడానికి కృషి చేస్తాం. మనం వాత్సల్యాన్ని అలవర్చుకోవడం ద్వారా మన సహోదరుల పట్ల ప్రేమ పెంచుకోవచ్చు. వాత్సల్యం అంటే సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. వాత్సల్యాన్ని అలవర్చుకోవడానికి, తోటి విశ్వాసుల మీద దాన్ని ఇంకా ఎక్కువగా చూపించడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
^ పేరా 55 చిత్రాల వివరణ: యువకుడైన ఒక సంఘపెద్ద, వయసుపైబడిన సంఘపెద్ద అనుభవం నుండి ప్రయోజనం పొందుతున్నాడు. వయసుపైబడిన సంఘపెద్ద ఆ యువ సహోదరుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాడు. వాళ్లు, వాళ్ల భార్యలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ-ఉదారత చూపిస్తున్నారు.