అధ్యయన ఆర్టికల్ 3
వేరే గొర్రెలకు చెందిన గొప్పసమూహం దేవుణ్ణి, క్రీస్తును స్తుతిస్తుంది
“సింహాసనం మీద కూర్చున్న మన దేవుని నుండి, గొర్రెపిల్ల నుండి మా రక్షణ వస్తుంది.”—ప్రక. 7:10.
పాట 14 కొత్త భూరాజును స్తుతిద్దాం
ఈ ఆర్టికల్లో . . . *
1. ఒక సమావేశంలో ఇచ్చిన ప్రసంగం ఒక యువకుడి మీద ఎలాంటి ప్రభావం చూపించింది?
ఆ యువకుడు 1926 లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు అతనికి 18 ఏళ్లు. అతని తల్లిదండ్రులు బైబిలు విద్యార్థులు, యెహోవాసాక్షుల్ని అప్పట్లో అలా పిలిచేవాళ్లు. వాళ్లు తమ ముగ్గురు కొడుకుల్ని, ఇద్దరు కూతుళ్లను యెహోవా దేవుణ్ణి సేవించేలా, యేసుక్రీస్తును అనుకరించేలా పెంచారు. అప్పట్లో బైబిలు విద్యార్థులందరిలాగే ఈ నమ్మకమైన యువకుడు కూడా ప్రతీ సంవత్సరం ప్రభువు రాత్రి భోజనంలో రొట్టె-ద్రాక్షారసం తీసుకునేవాడు. అయితే, “గొప్పసమూహం” అనే చారిత్రాత్మక ప్రసంగం విన్నాక అతని నిరీక్షణ పూర్తిగా మారిపోయింది. 1935 లో అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో జరిగిన ఒక సమావేశంలో జె. ఎఫ్. రూథర్ఫర్డ్ ఆ ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆ సమావేశంలో ఏ సత్యం వెల్లడైంది?
2. సహోదరుడు రూథర్ఫర్డ్ ఇచ్చిన ప్రసంగంలో ఏ ఆసక్తికరమైన సత్యం వెల్లడైంది?
2 ఆ ప్రసంగంలో సహోదరుడు రూథర్ఫర్డ్ ప్రకటన 7:9 లో ఉన్న “గొప్పసమూహం” ఎవరో వివరించాడు. అప్పటివరకు, గొప్పసమూహం అంటే పరలోకానికి వెళ్లేవాళ్ల రెండో తరగతి అని, వాళ్లు అభిషిక్తుల కన్నా కాస్త తక్కువ నమ్మకంగా ఉంటారని బైబిలు విద్యార్థులు అనుకునేవాళ్లు. గొప్పసమూహం పరలోకంలో జీవించడానికి ఎంచుకోబడలేదని, బదులుగా వాళ్లు క్రీస్తు “వేరే గొర్రెలు” * అని, వాళ్లు “మహాశ్రమ” దాటి భూమ్మీద శాశ్వతకాలం జీవిస్తారని సహోదరుడు రూథర్ఫర్డ్ లేఖనాల ద్వారా వివరించాడు. (ప్రక. 7:14) యేసు ఇలా మాటిచ్చాడు: “ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు నాకు ఉన్నాయి; వాటిని కూడా నేను తీసుకొని రావాలి, అవి నా స్వరాన్ని వింటాయి. అప్పుడు గొర్రెలన్నీ ఒకే కాపరి కింద ఒకే మంద అవుతాయి.” (యోహా. 10:16) గొర్రెల్లాంటి ఈ ప్రజలు ఎవరంటే, పరదైసు భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉన్న నమ్మకమైన యెహోవాసాక్షులు. (మత్త. 25:31-33, 46) ఈ కొత్త అవగాహన, ఆ 18 ఏళ్ల యువకుడితో పాటు ఎంతోమంది యెహోవా ప్రజల జీవితాల్ని ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం.—కీర్త. 97:11; సామె. 4:18.
ఒక కొత్త అవగాహన వేలమంది జీవితాల్ని మార్చేసింది
3-4. వేలమంది ప్రజలు 1935 సమావేశంలో తమ నిరీక్షణ గురించి ఏం గుర్తించారు? ఎందుకు?
3 ఆ సమావేశంలో, ప్రసంగీకుడు “భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణగల వాళ్లంతా దయచేసి నిలబడతారా?” అని అడిగినప్పుడు ప్రేక్షకులందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆ సమావేశానికి హాజరైన ఒక సహోదరుడు చెప్తున్నట్టు, అక్కడున్న 20,000 మందిలో సగం కంటే ఎక్కువమంది లేచి నిలబడ్డారు. అప్పుడు సహోదరుడు రూథర్ఫర్డ్, “చూడండి! గొప్పసమూహం!” అన్నాడు. హాజరైన వాళ్లందరూ ఆనందంతో గట్టిగా అరిచారు. లేచి నిలబడినవాళ్లు దేవుడు తమను పరలోక జీవితం కోసం ఎంచుకోలేదని, పవిత్రశక్తితో అభిషేకించలేదని గుర్తించారు. సమావేశంలో ఆ తర్వాతి రోజు 840 మంది బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లలో చాలామంది వేరే గొర్రెలకు చెందినవాళ్లే.
4 ఆ ప్రసంగం తర్వాత, పై పేరాల్లో ప్రస్తావించిన యువకుడు, వేలమంది ఇతరులు ప్రభువు రాత్రి భోజనంలో రొట్టె-ద్రాక్షారసం తీసుకోవడం ఆపేశారు. ఒక సహోదరుడు వినయంగా ఇలా చెప్పాడు: “నేను చివరిసారిగా రొట్టె-ద్రాక్షారసం తీసుకుంది 1935 జ్ఞాపకార్థ ఆచరణలోనే. యెహోవా తన పవిత్రశక్తి ద్వారా నాలో పరలోక నిరీక్షణ కలిగించలేదని గుర్తించాను; బదులుగా భూమ్మీద జీవిస్తూ దాన్ని పరదైసుగా మార్చే నిరీక్షణ నాకు ఉందని అర్థం చేసుకున్నాను.” చాలామంది ఆ సహోదరుడిలాగే భావించారు. (రోమా. 8:16, 17; 2 కొరిం. 1:21, 22) అప్పటినుండి గొప్పసమూహం వాళ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది, వాళ్లు అభిషిక్త శేషంతో * కలిసి పనిచేస్తూ ఉన్నారు.
5. రొట్టె-ద్రాక్షారసం తీసుకోవడం ఆపేసిన వాళ్లను యెహోవా ఎలా చూస్తాడు?
5 అప్పటివరకు రొట్టె-ద్రాక్షారసం తీసుకుని, 1935 నుండి దాన్ని ఆపేసిన వాళ్లను యెహోవా ఎలా చూశాడు? మన కాలంలో బాప్తిస్మం తీసుకున్న ఒక సహోదరుడు లేదా సహోదరి మనస్ఫూర్తిగా ప్రభువు రాత్రి భోజనంలో రొట్టె-ద్రాక్షారసం తీసుకుని, తర్వాత తాను నిజంగా అభిషేకించబడలేదని గుర్తిస్తే అప్పుడేంటి? (1 కొరిం. 11:28) కొంతమంది తమ నిరీక్షణ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల రొట్టె-ద్రాక్షారసం తీసుకున్నారు. కానీ వాళ్లు తప్పు తెలుసుకుని, రొట్టె-ద్రాక్షారసం తీసుకోవడం ఆపేసి, యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగితే ఆయన వాళ్లను వేరే గొర్రెల్లానే చూస్తాడు. వాళ్లు రొట్టె-ద్రాక్షారసం తీసుకోకపోయినా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతారు. ఎందుకంటే యెహోవా, యేసు తమ కోసం చేసినవాటి పట్ల వాళ్లకెంతో కృతజ్ఞత ఉంది.
ఒక అద్భుతమైన అవకాశం
6. యేసు దేవదూతలకు ఏమని ఆజ్ఞాపించాడు?
6 అతిత్వరలో మహాశ్రమ రాబోతుంది కాబట్టి అభిషిక్త క్రైస్తవుల గురించి, వేరే గొర్రెలకు చెందిన ప్రకటన 7వ అధ్యాయం ఇంకా ఏం చెప్తుందో పరిశీలించడం మంచిది. నాశనం అనే నాలుగు గాలుల్ని గట్టిగా పట్టుకుని ఉండమని యేసు దేవదూతలకు ఆజ్ఞాపించాడు. అభిషిక్త క్రైస్తవులందరూ చివరి ముద్రను, అంటే యెహోవా చివరి ఆమోదాన్ని పొందేవరకు దేవదూతలు ఆ గాలుల్ని భూమ్మీదికి విడిచిపెట్టకూడదు. (ప్రక. 7:1-4) నమ్మకంగా ఉన్నందుకు క్రీస్తు అభిషిక్త సహోదరులు ప్రతిఫలం పొందుతారు. అంటే పరలోకంలో ఆయనతో కలిసి రాజులుగా, యాజకులుగా సేవ చేస్తారు. (ప్రక. 20:6) 1,44,000 మంది అభిషిక్తులు తమ పరలోక బహుమానాన్ని పొందినప్పుడు, దేవుని పరలోక కుటుంబమంతా చాలా సంతోషిస్తుంది.
గొప్పసమూహం గురించి7. ప్రకటన 7:9, 10 ప్రకారం, దర్శనంలో యోహాను ఎవర్ని చూశాడు? వాళ్లు ఏం చేస్తున్నారు? (ముఖచిత్రం చూడండి.)
7 రాజులుగా, యాజకులుగా సేవచేసే ఆ 1,44,000 మంది గురించి చెప్పిన తర్వాత యోహాను ఒక ఆసక్తికరమైన సంఘటన చూశాడు. ఆయన హార్మెగిద్దోనును తప్పించుకునే ఒక “గొప్పసమూహం” చూశాడు. ఈ రెండో గుంపు వాళ్లు మొదటి గుంపులా కాకుండా చాలా పెద్ద సంఖ్యలో, లెక్కపెట్టలేనంత మంది ఉన్నారు. (ప్రకటన 7:9, 10 చదవండి.) వాళ్లు “తెల్లని వస్త్రాలు” వేసుకున్నారు. అంటే ఈ సాతాను లోక “మలినం” తమకు అంటకుండా, దేవునికి-క్రీస్తుకు నమ్మకంగా ఉన్నారు. (యాకో. 1:27) యెహోవా, అలాగే గొర్రెపిల్ల అయిన యేసు వల్లే రక్షణ పొందామని ఈ గొప్పసమూహం వాళ్లు పెద్ద స్వరంతో కేకలు వేస్తున్నారు. అంతేకాదు వాళ్లు ఖర్జూర మట్టలు కూడా పట్టుకుని ఉన్నారు. అంటే, యేసును యెహోవా నియమించిన రాజుగా సంతోషంగా అంగీకరిస్తున్నామని వాళ్లు చూపిస్తున్నారు.—యోహాను 12:12, 13 తో పోల్చండి.
8. యెహోవా పరలోక కుటుంబం గురించి ప్రకటన 7:11, 12 ఏం చెప్తుంది?
8 ప్రకటన 7:11, 12 చదవండి. గొప్పసమూహాన్ని చూసినప్పుడు పరలోకంలో ఉన్న వాళ్లు ఎలా స్పందించారు? దేవుని పరలోక కుటుంబమంతా ఆనందంతో నిండిపోయి యెహోవాను స్తుతించడం యోహాను చూశాడు. ఈ దర్శనం నెరవేరినప్పుడు, అంటే గొప్పసమూహం మహాశ్రమను సజీవంగా దాటినప్పుడు యెహోవా పరలోక కుటుంబం ఎంతో సంతోషిస్తుంది.
9. ప్రకటన 7:13-15 ప్రకారం, గొప్పసమూహం వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు?
9 ప్రకటన 7:13-15 చదవండి. గొప్పసమూహం వాళ్లు “గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెల్లగా చేసుకున్నారు” అని యోహాను చెప్పాడు. అంటే, వాళ్లు స్వచ్ఛమైన మనస్సాక్షితో యెహోవా ముందు నీతిమంతులుగా ఉన్నారు. (యెష. 1:18) వాళ్లు దేవునికి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నారు, విమోచన క్రయధనం మీద బలమైన విశ్వాసం ఉంచారు, యెహోవాతో మంచి సంబంధం కలిగి ఉన్నారు. (యోహా. 3:36; 1 పేతు. 3:21) కాబట్టి దేవుని సింహాసనం ముందు నిలబడి, ఆధ్యాత్మిక ఆలయంలోని భూఆవరణలో “రాత్రింబగళ్లు ఆయనకు పవిత్రసేవ” చేసే అర్హత వాళ్లకు ఉంది. ఇప్పుడు కూడా వాళ్లు దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇస్తూ ఉత్సాహంగా సేవ చేస్తున్నారు. ప్రకటించే, శిష్యుల్ని చేసే పనిని ఎక్కువగా చేస్తున్నది వీళ్లే.—మత్త. 6:33; 24:14; 28:19, 20.
10. గొప్పసమూహం వాళ్లు ఏ నమ్మకంతో ఉంటారు? ఏ వాగ్దానం నెరవేరడం వాళ్లు చూస్తారు?
10 మహాశ్రమను దాటే గొప్పసమూహం వాళ్లు, ఆ తర్వాత కూడా దేవుడు తమమీద శ్రద్ధ చూపిస్తూనే ఉంటాడని నమ్ముతారు. ఎందుకంటే “సింహాసనం మీద కూర్చున్న దేవుడు వాళ్లమీద తన డేరా కప్పుతాడు.” వేరే గొర్రెలు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ వాగ్దానం పూర్తిగా నెరవేరుతుంది: “వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన [దేవుడు] తుడిచేస్తాడు. మరణం ప్రక. 21:3, 4.
ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—11-12. (ఎ) ప్రకటన 7:16, 17 ప్రకారం గొప్పసమూహం వాళ్లు ఏ దీవెనలు పొందుతారు? (బి) జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు వేరే గొర్రెలు ఏం చేస్తారు? ఎందుకు?
11 ప్రకటన 7:16, 17 చదవండి. ప్రస్తుతం కొంతమంది యెహోవా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, అల్లర్లు, యుద్ధాల వల్ల ఆకలితో బాధపడుతున్నారు. ఇంకొంతమంది తమ విశ్వాసం వల్ల జైలు పాలౌతున్నారు. అయితే ఈ దుష్టలోకం నాశనమైన తర్వాత భౌతిక, ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా పొందుతామని గొప్పసమూహం వాళ్లకు తెలుసు. సాతాను లోకం నాశనం అయ్యేటప్పుడు, దేశాల మీద కుమ్మరించబడే దేవుని కోపం అనే “వడగాలి” నుండి వాళ్లు తప్పించుకుంటారు. మహాశ్రమ దాటివచ్చిన వాళ్లను యేసు “జీవజలాల ఊటల దగ్గరికి నడిపిస్తాడు.” ఒకసారి ఆలోచించండి: గొప్పసమూహం వాళ్లకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అదేంటంటే, ఈ భూమ్మీద ఎన్నో కోట్లమంది జీవించి చనిపోయారు, కానీ వీళ్లు బహుశా ఎప్పటికీ చనిపోరు.—యోహా. 11:26.
12 ఆ అద్భుతమైన అవకాశాన్ని బట్టి వేరే గొర్రెలు యెహోవాకు, యేసుకు కృతజ్ఞులై ఉంటారు! దేవుడు వాళ్లను పరలోక జీవితానికి ఎంచుకోనంత మాత్రాన వాళ్లు తక్కువ విలువైనవాళ్లు కాదు. రెండు గుంపుల వాళ్లు అంటే అభిషిక్తులు, వేరే గొర్రెలు కృతజ్ఞతతో దేవుణ్ణి, క్రీస్తును స్తుతిస్తారు. ముఖ్యంగా ప్రభువు రాత్రి భోజనానికి హాజరైనప్పుడు వాళ్లు అలా చేస్తారు.
జ్ఞాపకార్థ ఆచరణలో నిండు హృదయంతో స్తుతించండి
13-14. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు ప్రతీఒక్కరు ఎందుకు హాజరవ్వాలి?
13 ఈమధ్య కాలంలో, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే ప్రతీ వెయ్యి మందిలో, రొట్టె-ద్రాక్షారసం తీసుకునే వాళ్ల సంఖ్య ఒకటి కన్నా తక్కువే ఉంటోంది. అంటే చాలా సంఘాల్లో రొట్టె-ద్రాక్షారసం తీసుకునే వాళ్లెవ్వరూ ఉండట్లేదు. ఆ ఆచరణకు హాజరయ్యే వాళ్లలో ఎక్కువశాతం మంది భూనిరీక్షణ గలవాళ్లే. మరి వాళ్లు ప్రభువు రాత్రి భోజనానికి ఎందుకు హాజరౌతారు? సాధారణంగా మన స్నేహితుని పెళ్లికి ఎందుకు వెళ్తాం? పెళ్లి చేసుకోబోతున్న వాళ్లను మనం ప్రేమిస్తాం, వాళ్లకు మద్దతివ్వాలని కోరుకుంటాం, అందుకే ఆ పెళ్లికి హాజరౌతాం. అదేవిధంగా వేరే గొర్రెలు క్రీస్తు మీద, అభిషిక్తుల మీద ప్రేమతో వాళ్లకు మద్దతుగా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతారు. అంతేకాదు, ఆ ఆచరణ
గుర్తుచేసే విమోచన క్రయధనం మీద కృతజ్ఞతతో దానికి హాజరౌతారు. ఎందుకంటే, ఆ విమోచన క్రయధనం వల్లే వాళ్లు భూమ్మీద శాశ్వతకాలం జీవించడం సాధ్యమౌతుంది.14 వేరే గొర్రెలు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి మరో ముఖ్యమైన కారణం, యేసు ఆజ్ఞను పాటించాలని కోరుకోవడం. యేసు తన నమ్మకమైన అపొస్తలులతో ఈ ప్రత్యేకమైన ఆచరణను ప్రారంభించినప్పుడు, “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి” అన్నాడు. (1 కొరిం. 11:23-26) కాబట్టి, ఈ భూమ్మీద అభిషిక్త క్రైస్తవులు బ్రతికున్నంత కాలం వేరే గొర్రెలు ప్రభువు రాత్రి భోజనానికి హాజరౌతూనే ఉంటారు. నిజానికి, తమతో కలిసి దానికి హాజరవ్వమని వేరే గొర్రెలు అందర్నీ ఆహ్వానిస్తారు.
15. జ్ఞాపకార్థ ఆచరణలో మనం దేవుణ్ణి, క్రీస్తును ఎలా స్తుతించవచ్చు?
15 జ్ఞాపకార్థ ఆచరణలో పాట ద్వారా, ప్రార్థన ద్వారా దేవుణ్ణి స్తుతించే అవకాశం మనకు ఉంటుంది. ఈ సంవత్సరం ఇచ్చే జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగ అంశం: “యెహోవా, క్రీస్తు మీకోసం చేసిన దానిపట్ల కృతజ్ఞత చూపించండి!” ఆ ప్రసంగం యెహోవా మీద, క్రీస్తు మీద మన కృతజ్ఞత పెంచుతుంది. రొట్టె-ద్రాక్షారసాన్ని అందిస్తున్నప్పుడు, అవి యేసు శరీరాన్ని-రక్తాన్ని సూచిస్తున్నాయనీ, మనం ప్రాణాలతో ఉండడం కోసం యెహోవా తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడనీ గుర్తుచేసుకుంటాం. (మత్త. 20:28) మన పరలోక తండ్రిని, ఆయన కుమారుణ్ణి ప్రేమించే ప్రతీఒక్కరు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వాలని కోరుకుంటారు.
యెహోవా మీకు ఇచ్చిన నిరీక్షణను బట్టి కృతజ్ఞతలు చెప్పండి
16. ఏ విషయాల్లో అభిషిక్తులు, వేరే గొర్రెలు ఒకేలా ఉన్నారు?
16 అభిషిక్త క్రైస్తవులు, వేరే గొర్రెలు ఇద్దరూ యెహోవాకు విలువైనవాళ్లే. వాళ్లలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఆయన వాళ్లిద్దర్ని ఒకే ఖరీదు పెట్టి, అంటే తన ప్రియ కుమారుని ప్రాణాన్ని పెట్టి కొన్నాడు. ఆ రెండు గుంపుల నిరీక్షణలు మాత్రమే వేరు. కానీ ఆ రెండు గుంపుల వాళ్లు దేవునికి, క్రీస్తుకు విశ్వసనీయంగా ఉండాలి. (కీర్త. 31:23) అంతేకాదు అభిషిక్తులకైనా, వేరే గొర్రెలకైనా దేవుడు ప్రతీఒక్కరికి వాళ్లవాళ్ల అవసరాల్ని బట్టి పవిత్రశక్తిని ఇస్తాడు.
17. భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు దేనికోసం ఎదురుచూస్తారు?
17 అభిషిక్త క్రైస్తవులకు పుట్టుకతోనే పరలోక నిరీక్షణ రాదు. ఆ నిరీక్షణను దేవుడే వాళ్ల హృదయంలో కలిగిస్తాడు. వాళ్లు తమ నిరీక్షణ గురించి ఆలోచిస్తారు, ప్రార్థిస్తారు, తమ పరలోక బహుమానాన్ని పొందాలని ఎంతగానో ఎదురుచూస్తారు. వాళ్లు పరలోక సంబంధమైన శరీరంతో బ్రతికించబడినప్పుడు ఎలా ఉంటారనేది వాళ్ల ఊహకు కూడా అందదు. (ఫిలి. 3:20, 21; 1 యోహా. 3:2) అయితే వాళ్లు యెహోవాను, దేవదూతల్ని, మిగతా అభిషిక్తుల్ని కలుసుకునే రోజు కోసం; పరలోక రాజ్యంలో వాళ్లతో కలిసి ఉండే రోజు కోసం ఎదురుచూస్తారు.
18. వేరే గొర్రెలు దేనికోసం ఎదురుచూస్తారు?
18 వేరే గొర్రెలకు మనుషులందరిలో సహజంగా ఉండే నిరీక్షణ, అంటే భూమ్మీద శాశ్వతకాలం జీవించాలనే నిరీక్షణ ఉంటుంది. (ప్రసం. 3:11) ఈ భూమంతటినీ పరదైసుగా మార్చే రోజు కోసం వాళ్లు ఎదురుచూస్తారు. అంతేకాదు ఇళ్లు కట్టుకుని, తోటలు నాటుకుని, పిల్లల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా పెంచే రోజు కోసం వాళ్లు నిరీక్షిస్తారు. (యెష. 65:21-23) వాళ్లు కొత్తలోకంలో ఈ భూమిని, అందులో ఉన్న పర్వతాల్ని, అడవుల్ని, సముద్రాల్ని, విస్తారంగా ఉన్న యెహోవా సృష్టిని పరిశీలిస్తూ ఆనందంగా జీవిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాతో వాళ్లకున్న సంబంధం మరింత బలపడుతుంది, అదే వాళ్లకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.
19. జ్ఞాపకార్థ ఆచరణలో ప్రతీఒక్కరికి ఏ అవకాశం ఉంటుంది? అది ఈ సంవత్సరం ఎప్పుడు జరుగుతుంది?
19 యెహోవా తన సమర్పిత సేవకుల్లో ప్రతీఒక్కరికి ఒక అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాడు. (యిర్మీ. 29:11) మనం శాశ్వతకాలం జీవించడం కోసం దేవుడు, క్రీస్తు ఎన్నో చేశారు. వాటన్నిటిని బట్టి వాళ్లను స్తుతించే గొప్ప అవకాశం జ్ఞాపకార్థ ఆచరణలో ప్రతీఒక్కరికి ఉంటుంది. నిజ క్రైస్తవులు జరుపుకునే మీటింగ్స్ అన్నిట్లో జ్ఞాపకార్థ ఆచరణ అత్యంత ప్రాముఖ్యమైనది. అది ఈ సంవత్సరం మార్చి 27, శనివారం సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. ఈ ప్రాముఖ్యమైన ఆచరణకు హాజరయ్యే స్వేచ్ఛ ఉన్నా లేకపోయినా, వ్యతిరేకత ఎదురైనా, ఆఖరికి జైల్లో ఉన్నా యెహోవా ప్రజలు దీన్ని జరుపుకుంటారు. యెహోవా, యేసు, దేవుని పరలోక కుటుంబం చూస్తుండగా ప్రతీ సంఘం, ప్రతీ గుంపు, ప్రతీ వ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణను ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం!
పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి
^ పేరా 5 యెహోవాసాక్షులమైన మనకు 2021, మార్చి 27 చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు సాయంత్రం మనం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటాం. ఆ ఆచరణకు హాజరయ్యే వాళ్లలో ఎక్కువశాతం మంది, యేసు చెప్పిన ‘వేరే గొర్రెలకు’ చెందినవాళ్లే. 1935 లో వాళ్లకు సంబంధించి ఏ ఆసక్తికరమైన సత్యం వెల్లడైంది? మహాశ్రమ తర్వాత గొప్పసమూహం దేనికోసం ఎదురుచూడవచ్చు? జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనప్పుడు వేరే గొర్రెలు దేవుణ్ణి, క్రీస్తును ఎలా స్తుతించవచ్చు?
^ పేరా 2 పదాల వివరణ: వేరే గొర్రెలు అంటే భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉన్న క్రీస్తు అనుచరులు. వాళ్లలో కొంతమంది ఈ చివరి రోజుల్లో యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టారు. గొప్పసమూహం అంటే మహాశ్రమ కాలంలో క్రీస్తు మనుషులందరికీ తీర్పు తీర్చినప్పుడు జీవించే వేరే గొర్రెలు. వాళ్లు మహాశ్రమను దాటి సజీవంగా కొత్తలోకంలోకి అడుగుపెడతారు.
^ పేరా 4 పదాల వివరణ: “అభిషిక్త శేషం” అనే మాట ప్రస్తుతం భూమ్మీద జీవిస్తూ, ప్రభువు రాత్రి భోజనంలో రొట్టె-ద్రాక్షారసం తీసుకునే అభిషిక్త క్రైస్తవుల్ని సూచిస్తుంది.