కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 2

ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి

ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి

“మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. అలా మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోగలుగుతారు.”రోమా. 12:2.

పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి

ఈ ఆర్టికల్‌లో . . . a

1-2. బాప్తిస్మం తర్వాత కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? వివరించండి.

 మీరు మీ ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారా? మీరు మీ ఇంట్లోకి మొదటిసారి వచ్చినప్పుడు, ఇల్లంతా చాలా జాగ్రత్తగా శుభ్రం చేసివుంటారు. కానీ ఆ తర్వాత, ఇంటిని శుభ్రం చేయడం మానేస్తే ఏమౌతుంది? ఇల్లంతా దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. ఇల్లు చూడ్డానికి చక్కగా ఉండాలంటే, దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

2 అదేవిధంగా మన ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడానికి కృషిచేస్తూ ఉండాలి. బాప్తిస్మానికి ముందు మనందరం “శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రం” చేసుకున్నాం. (2 కొరిం. 7:1) అయితే ఇప్పుడు మనం, “కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండండి” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను పాటించాలి. (ఎఫె. 4:23) మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే దుమ్ము, ధూళి లాంటి చెడు విషయాలు తేలిగ్గా మన మనసులో, ఆలోచనల్లో పేరుకుపోయే ప్రమాదముంది. అలా జరగకుండా, యెహోవా ముందు పవిత్రంగా ఉండాలంటే మన ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని, కోరికల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి.

‘మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ ఉండండి’

3. ఆలోచనాతీరులో మార్పులు చేసుకోవడం అంటే ఏంటి? (రోమీయులు 12:2)

3 మన ఆలోచనాతీరులో మార్పులు చేసుకోవాలంటే ఏం చేయాలి? (రోమీయులు 12:2 చదవండి.) ఆలోచనాతీరును మార్చుకోవడం అంటే, ఏవో కొన్ని మంచిపనులు చేస్తూ పైపైన మార్పులు చేసుకోవడం కాదు. మనం నిజంగా ఎలాంటి వాళ్లమో లోతుగా పరిశీలించుకోవాలి. యెహోవా ప్రమాణాల్ని వీలైనంత ఎక్కువగా పాటించడానికి, అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక్కసారి కాదు ఎప్పటికప్పుడు ఇలా మార్పులు చేసుకుంటూ ఉండాలి.

చదువు, ఉద్యోగం విషయంలో మీ నిర్ణయాలు మీరు రాజ్యానికి మొదటిస్థానం ఇస్తున్నారని చూపిస్తున్నాయా? (4-5 పేరాలు చూడండి) c

4. ఈ లోక ప్రభావం మన మీద పడకూడదంటే ఏం చేయాలి?

4 పరిపూర్ణులం అయ్యాక, మనం చేసే ప్రతీ పనిలో ఎప్పుడూ యెహోవాను సంతోషపెట్టగలుగుతాం. కానీ ప్రస్తుతం మనం అపరిపూర్ణులం కాబట్టి, యెహోవాను సంతోషపెట్టడానికి గట్టిగా కృషిచేస్తూ ఉండాలి. అపొస్తలుడైన పౌలు రోమీయులు 12:2 లో ఆలోచనాతీరులో మార్పులు చేసుకోవడానికి, దేవుని ఇష్టాన్ని పరిశీలించి తెలుసుకోవడానికి మధ్య సంబంధం ఉందని చెప్పడం మీరు గమనించారా? ఈ లోక చెడు ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్తపడాలంటే ముందుగా మన లక్ష్యాలు, నిర్ణయాలు దేవుని ఆలోచనలకు తగ్గట్టు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి.

5. మనం యెహోవా రోజును మనసులో ఉంచుకుని జీవిస్తున్నామో లేదో ఎలా పరిశీలించుకోవచ్చు? (చిత్రం చూడండి.)

5 ఉదాహరణకు, మనం ‘యెహోవా రోజును ఎప్పుడూ మనసులో ఉంచుకుని జీవించాలి’ అని దేవుడు కోరుకుంటున్నాడు. (2 పేతు. 3:12) కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ లోకాంతం దగ్గరపడిందని నేను నమ్ముతున్నట్టు నా జీవన విధానం చూపిస్తుందా? చదువు, ఉద్యోగం విషయంలో నా నిర్ణయాలు నేను యెహోవా సేవకే మొదటిస్థానం ఇస్తున్నాను అని చూపిస్తున్నాయా? నా అవసరాల్ని, నా కుటుంబ అవసరాల్ని యెహోవా తీరుస్తాడని నేను నమ్ముతున్నానా లేక వాటిగురించి అతిగా ఆందోళనపడుతున్నానా?’ మనం అన్ని విషయాల్లో దేవుని ఇష్టానికి తగ్గట్టు జీవించడానికి ప్రయత్నిస్తే, యెహోవా ఎంతో సంతోషిస్తాడు.—మత్త. 6:25-27, 33; ఫిలి. 4:12, 13.

6. మనం ఏం చేస్తూ ఉండాలి?

6 మనం ఎప్పటికప్పుడు మన ఆలోచనల్ని పరిశీలించుకుంటూ, అవసరమైన మార్పులు చేసుకోవాలి. పౌలు కొరింథీయులకు ఇలా చెప్పాడు: “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి; మీరేమిటో రుజువు చేసుకుంటూ ఉండండి.” (2 కొరిం. 13:5) ‘విశ్వాసంలో ఉండడం’ అంటే మీటింగ్స్‌కు వెళ్లడం, పరిచర్యలో పాల్గొనడం మాత్రమే కాదు. మన ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు కూడా మనం విశ్వాసంలో ఉన్నామని చూపించాలి. కాబట్టి మన ఆలోచనాతీరులో మార్పులు చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ఆయన ఆలోచనల్ని తెలుసుకోవాలి, ఆయన్ని సంతోషపెట్టడానికి కృషిచేయాలి.—1 కొరిం. 2:14-16.

‘కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోండి’

7. ఎఫెసీయులు 4:31, 32 ప్రకారం మనం ఇంకా ఏం చేయాలి? దానికి కృషి ఎందుకు అవసరం?

7 ఎఫెసీయులు 4:31, 32 చదవండి. మనం ఆలోచనాతీరులో మార్పులు చేసుకోవడంతో పాటు, “కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలి.” (ఎఫె. 4:24) అందుకోసం మనం బాగా కృషిచేయాలి. ద్వేషం, కోపం, ఆగ్రహం లాంటివి తీసేసుకోవాలంటే ఎంతో కృషి అవసరం. ఎందుకు? ఎందుకంటే అలాంటి చెడు లక్షణాలు మనలో బలంగా పాతుకుపోయి ఉండవచ్చు. ఉదాహరణకు కొంతమంది “కోపిష్ఠిలా,” “ముక్కోపిలా” ఉంటారని బైబిలు చెప్తుంది. (సామె. 29:22) కొన్ని చెడు లక్షణాలు ఎంత బలంగా పాతుకుపోయి ఉంటాయంటే, బాప్తిస్మం తర్వాత కూడా వాటిని తీసేసుకోవడానికి కృషిచేస్తూ ఉండాలి. దానిగురించి ఒక అనుభవాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

8-9. పాత వ్యక్తిత్వాన్ని తీసేసుకోవడానికి కృషిచేస్తూ ఉండడం అవసరమని స్టీవెన్‌ ఉదాహరణ ఎలా చూపిస్తుంది?

8 స్టీవెన్‌ అనే సహోదరునికి కోపాన్ని అణచుకోవడం చాలా కష్టంగా అనిపించింది. ఆయన ఇలా చెప్పాడు: “బాప్తిస్మం తర్వాత కూడా నేను నా కోపాన్ని తగ్గించుకోవడానికి కృషిచేయాల్సి వచ్చింది. ఒకసారి నేను ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు ఒక దొంగ నా కారులో నుండి రేడియో దొంగిలించాడని అతన్ని తరుముకుంటూ వెళ్లాను. నేను దగ్గరికి వచ్చేసరికి అతను రేడియో అక్కడే పడేసి పారిపోయాడు. జరిగిన దానిగురించి నాతో ఉన్నవాళ్లకు చెప్పినప్పుడు, ఒక పెద్ద ఇలా అడిగాడు: ‘స్టీవెన్‌, ఆ దొంగ నీ చేతికి చిక్కితే ఏం చేసేవాడివి?’ ఆ ప్రశ్న నన్ను ఆలోచింపజేసింది, శాంతిగా ఉండడానికి కృషి చేస్తూనే ఉండేలా కదిలించింది.” b

9 స్టీవెన్‌ అనుభవం చూపిస్తున్నట్టు, పాత వ్యక్తిత్వంలోని చెడు లక్షణాల్ని తీసేసుకున్నామని మనకు అనిపించినా, అవి అనుకోకుండా ఉన్నట్టుండి బయటికి రావచ్చు. మీ విషయంలో కూడా అలా జరిగితే నిరుత్సాహపడకండి, మీరు చెడ్డవాళ్లని అనుకోకండి. అపొస్తలుడైన పౌలు కూడా ఇలా ఒప్పుకున్నాడు: “నేను సరైనది చేయాలనుకున్నప్పుడు, చెడు చేయడం వైపే మొగ్గుచూపుతున్నాను.” (రోమా. 7:21-23) శుభ్రం చేసిన ఇంట్లోకి మళ్లీ దుమ్ము, ధూళి వచ్చినట్టు; మనం అపరిపూర్ణులం కాబట్టి చెడు లక్షణాలు మళ్లీ మనలో మొదలవ్వవచ్చు. పవిత్రంగా ఉండడానికి మనం కృషిచేస్తూ ఉండాలి. అదెలా చేయవచ్చు?

10. చెడు లక్షణాలతో మనం ఎలా పోరాడవచ్చు? (1 యోహాను 5:14, 15)

10 ఏ లక్షణాన్ని తీసేసుకోవడానికి మీరు కృషి చేస్తున్నారో, దానిగురించి యెహోవాకు ప్రార్థించండి. ఆయన మీ ప్రార్థన వింటాడు, సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉండండి. (1 యోహాను 5:14, 15 చదవండి.) యెహోవా అద్భుతరీతిలో ఆ లక్షణాన్ని మీలో నుండి తీసేయడు కానీ, దాంతో పోరాడడానికి కావల్సిన బలాన్ని ఇస్తాడు. (1 పేతు. 5:10) మీరు కూడా మీ ప్రార్థనలకు తగ్గట్టు కృషిచేయండి. ఆ లక్షణాన్ని పెంచి పోషించే వాటికి దూరంగా ఉండండి. ఉదాహరణకు ఆ చెడు లక్షణాన్ని గొప్పగా చూపించే సినిమాల్ని, టీవీ కార్యక్రమాల్ని చూడకండి, అలాంటి కథల్ని చదవకండి. అలాగే చెడు కోరికల్లో మునిగిపోకుండా జాగ్రత్తపడండి.—ఫిలి. 4:8; కొలొ. 3:2.

11. కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటూ ఉండడానికి మనం ఏం చేయవచ్చు?

11 పాత వ్యక్తిత్వాన్ని తీసేసుకోవడంతో పాటు, కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం కూడా ప్రాముఖ్యం. దాన్నెలా చేయవచ్చు? యెహోవా లక్షణాల్ని తెలుసుకుంటూ వాటిని మీరు కూడా చూపించాలనే లక్ష్యం పెట్టుకోండి. (ఎఫె. 5:1, 2) ఉదాహరణకు యెహోవాకు ఉన్న క్షమించే గుణం గురించి బైబిల్లో చదివినప్పుడు, ‘నేను ఇతరుల్ని క్షమిస్తున్నానా?’ అని ఆలోచించుకోండి. పేదవాళ్ల పట్ల యెహోవాకు ఉన్న కనికరం గురించి చదివినప్పుడు, ‘అవసరంలో ఉన్న సహోదర సహోదరీల గురించి నేను ఆలోచిస్తున్నానా, వాళ్లకు సహాయం చేస్తున్నానా?’ అని ప్రశ్నించుకోండి. కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకుంటూ, మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ ఉండండి. దానికి సమయం పడుతుంది కాబట్టి, ఓపిగ్గా ప్రయత్నిస్తూ ఉండండి.

12. బైబిలుకున్న మార్చే శక్తిని స్టీవెన్‌ ఎలా రుచి చూశాడు?

12 ముందటి పేరాలో చూసిన స్టీవెన్‌ మెల్లమెల్లగా కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోగలిగాడు. ఆయన ఇలా చెప్పాడు: “బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి, నాకు దౌర్జన్యంగా నడుచుకునే ఎన్నో సందర్భాలు ఎదురయ్యాయి. అలాంటి సందర్భాల్లో నన్ను రెచ్చగొట్టే వాళ్ల నుండి దూరంగా వెళ్లిపోయేవాణ్ణి లేదా పరిస్థితి సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించేవాణ్ణి. అలా చేసినప్పుడు నా భార్యతోపాటు చాలామంది నన్ను మెచ్చుకునేవాళ్లు. నా తీరు చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోయేవాణ్ణి! నా వ్యక్తిత్వంలో వచ్చిన ఈ మంచి మార్పుకు కారణం నేను కాదు. బైబిలుకు ఉన్న మార్చే శక్తికి అదొక రుజువని నేను నమ్ముతున్నాను.”

చెడు కోరికలతో పోరాడుతూ ఉండండి

13. సరైన కోరికల్ని పెంచుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (గలతీయులు 5:16)

13 గలతీయులు 5:16 చదవండి. చెడు కోరికలతో పోరాడుతూ, సరైన కోరికల్ని పెంచుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు. అందుకోసం ఆయన తన పవిత్రశక్తిని ధారాళంగా ఇస్తాడు. మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసినప్పుడు పవిత్రశక్తి మనమీద పనిచేసేలా అనుమతిస్తాం. మీటింగ్స్‌లో కూడా మనకు యెహోవా పవిత్రశక్తి దొరుకుతుంది. మనలాగే సరైనది చేయడానికి కృషిచేస్తున్న ఎంతోమంది సహోదర సహోదరీలతో మనం అక్కడ సమయం గడుపుతాం. అది మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. (హెబ్రీ. 10:24, 25; 13:7) మనం యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మన బలహీనతలతో పోరాడడానికి సహాయం అడిగినప్పుడు, పవిత్రశక్తి ద్వారా మనకు కావల్సిన బలాన్ని ఇస్తాడు. మనలో చెడు కోరికలు రాకుండా ఈ పనులు ఆపలేకపోవచ్చు, కానీ వాటితో పోరాడడానికి సహాయం చేస్తాయి. గలతీయులు 5:16 చెప్తున్నట్టు పవిత్రశక్తి ప్రకారం నడుచుకునేవాళ్లు “శరీర కోరికల ప్రకారం ప్రవర్తించరు.”

14. సరైన కోరికల్ని పెంచుకోవడానికి కృషిచేస్తూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

14 యెహోవాతో స్నేహాన్ని సంపాదించుకోవడానికి మనం మొదలుపెట్టిన పనుల్ని ఎప్పుడూ ఆపేయకూడదు. వాటిని కొనసాగిస్తూనే ఉండాలి. అలాగే సరైన కోరికల్ని పెంచుకోవడానికి కృషిచేస్తూ ఉండాలి. ఎందుకు? ఎందుకంటే, చెడు కోరికలు ఒక శత్రువులా ఎప్పుడూ మనతో పోరాడుతూనే ఉంటాయి. బాప్తిస్మం తర్వాత కూడా కొన్ని చెడు కోరికల వైపు, పనుల వైపు మన హృదయం మొగ్గుచూపే ప్రమాదముంది. ఉదాహరణకు జూదం ఆడడం, మద్యం అతిగా తాగడం, అశ్లీల చిత్రాలు చూడడం లాంటివి. (ఎఫె. 5:3, 4) ఒక యౌవన సహోదరుడు ఇలా ఒప్పుకుంటున్నాడు: “నేను పోరాడిన చెడు కోరికల్లో నాకు బాగా కష్టంగా అనిపించింది, అబ్బాయిల్ని ఇష్టపడడం. ఆ చెడు ఆలోచనలు కొంతకాలమే ఉంటాయి, ఆ తర్వాత వెళ్లిపోతాయి అనుకున్నాను. కానీ అవి ఇప్పటికి నాలో వస్తూనే ఉన్నాయి.” ఏదైనా చెడు కోరికతో మీరు బలంగా పోరాడాల్సి వస్తే మీకు ఏది సహాయం చేస్తుంది?

ఏదైనా చెడు కోరికతో పోరాడడం మీకు కష్టంగా అనిపిస్తే నిరుత్సాహపడకండి. ఎంతోమంది వాటితో పోరాడి, జయించారు (15-16 పేరాలు చూడండి)

15. చెడు కోరికలు సాధారణంగా మనుషులందరికీ వస్తాయని తెలుసుకోవడం ఎందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది? (చిత్రం చూడండి.)

15 ఏదైనా చెడు కోరికతో మీరు తీవ్రంగా పోరాడుతూ ఉంటే, అలా పోరాడుతున్నది మీరు ఒక్కరే కాదని గుర్తుంచుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “మనుషులకు సాధారణంగా వచ్చే పరీక్షలు తప్ప కొత్తవేమీ మీకు రాలేదు.” (1 కొరిం. 10:13ఎ) అపొస్తలుడైన పౌలు ఆ మాటల్ని కొరింథులోని సహోదర సహోదరీలకు చెప్పాడు. వాళ్లలో కొంతమంది ఇదివరకు వ్యభిచారులు, స్వలింగ సంపర్కులు, తాగుబోతులు. (1 కొరిం. 6:9-11) మీరేమంటారు? బాప్తిస్మం తర్వాత చెడు కోరికలతో పోరాడాల్సిన అవసరం వాళ్లకు ఎన్నడూ రాలేదా? అలాగని చెప్పలేం. నిజమే వాళ్లందరూ అభిషిక్త క్రైస్తవులు, కానీ అప్పటికి వాళ్లింకా అపరిపూర్ణులే. అప్పుడప్పుడు వాళ్లు కూడా చెడు కోరికలతో పోరాడి ఉంటారు. ఆ మాట నిజంగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది కదా. ఎందుకు? ఎందుకంటే, మీరు ఏ చెడు కోరికతో అయితే పోరాడుతున్నారో, దాన్ని ఇదివరకే కొంతమంది జయించారు. కాబట్టి మీరు కూడా దాన్ని జయించగలరు! అవును, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండవచ్చు. “ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సహోదరులందరూ ఇలాంటి బాధలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు.”—1 పేతు. 5:9.

16. మనం ఏం అనుకోకూడదు? అది ఎందుకు ప్రమాదం?

16 మీ బలహీనతల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు అని అనుకోకండి. ఎందుకంటే దానివల్ల మీ సమస్యకు ఇక పరిష్కారం లేదని, మీరు ఇక చెడు కోరికలతో పోరాడలేరని అనుకునే ప్రమాదముంది. బైబిలు ఏమని భరోసా ఇస్తుందో గమనించండి: “దేవుడు నమ్మకమైనవాడు, మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని పరీక్షకు గురికానివ్వడు; ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, దాన్నుండి తప్పించుకునే మార్గం కలగజేస్తాడు, సహించడానికి సహాయం చేస్తాడు.” (1 కొరిం. 10:13బి) కాబట్టి ఏదైనా చెడు కోరికతో తీవ్రంగా పోరాడాల్సి వచ్చినా మీరు దానికి లొంగిపోకుండా యెహోవాకు నమ్మకంగా ఉండగలరు. యెహోవా సహాయంతో మీరు చెడు కోరికల ప్రకారం ప్రవర్తించకుండా ఉండగలరు.

17. మనం చెడు కోరికలు రాకుండా ఆపలేకపోయినా, ఏం చేయగలం?

17 మనం ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి: మనం అపరిపూర్ణులం కాబట్టి చెడు కోరికలు అనేవి రాకుండా ఉండవు. కానీ అవి వచ్చినప్పుడు వాటిని మనం ఎదిరించగలం. పోతీఫరు భార్య నుండి యోసేపు దూరంగా పారిపోయినట్టు, మనం కూడా వెంటనే చెడు కోరికలకు దూరంగా పారిపోవచ్చు. (ఆది. 39:12) చెడు కోరికలు వచ్చినంత మాత్రాన, మనం వాటి ప్రకారం ప్రవర్తించాల్సిన అవసరంలేదు.

కృషిచేస్తూనే ఉండండి

18-19. ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు?

18 ఆలోచనాతీరులో మార్పులు చేసుకోవడం అంటే, మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మన ఆలోచనలు, పనులు యెహోవా ఇష్టానికి తగ్గట్టు ఉండేలా చూసుకోవడం. కాబట్టి తరచూ ఇలా ప్రశ్నించుకోండి: ‘అంతం దగ్గర్లో ఉందని నేను నమ్ముతున్నట్టు నా పనులు చూపిస్తున్నాయా? కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకునే విషయంలో నేను ప్రగతి సాధిస్తున్నానా? చెడు కోరికలతో పోరాడుతూ పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకుంటున్నానా?’

19 అలా పరిశీలించుకుంటూ ఉన్నప్పుడు, మీరు ప్రగతి సాధిస్తున్నారో లేదో గమనించండి. కానీ మీ నుండి మీరు పరిపూర్ణతను ఆశించకండి. మీరు ఇంకా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తే నిరుత్సాహపడకండి. బదులుగా ఫిలిప్పీయులు 3:16 లో ఉన్న ఈ సలహాను పాటించండి. “ఏదేమైనా, మనం ప్రగతి సాధించినమేరకు ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం.” మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదిస్తాడు అనే నమ్మకంతో ఉండండి.

పాట 36 మన హృదయాల్ని కాపాడుకుందాం

a అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు, ‘ఈ లోకం మిమ్మల్ని మలచనివ్వకుండా చూసుకోండి’ అని చెప్పాడు. ఆ సలహా నేడు మనకు కూడా చాలా అవసరం. ఈ లోకపు చెడు ప్రభావం మన మీద కొంచెం కూడా పడకుండా జాగ్రత్తపడాలి. మన ఆలోచనలు దేవుని ఇష్టానికి తగ్గట్టు లేవని గుర్తించినప్పుడల్లా, అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండాలి. అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

b jw.orgలో బైబిలు జీవితాల్ని మారుస్తుంది కింద “ఒకప్పుడు నేను క్రూరంగా ఉండేవాడిని” అనే ఆర్టికల్‌ చూడండి.

c చిత్రాల వివరణ: ఒక యువ సహోదరుడు, పెద్ద చదువులు చదవాలా లేక పయినీరు సేవ మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నాడు.