అధ్యయన ఆర్టికల్ 3
కష్టాల్లో యెహోవా మీకు తోడుంటాడు
“యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు. దానివల్ల, యోసేపు తాను చేసిన ప్రతీ పనిలో సఫలుడయ్యాడు.”—ఆది. 39:2.
పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు
ఈ ఆర్టికల్లో . . . a
1-2. (ఎ) కష్టాల్ని చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోం? (బి) ఈ ఆర్టికల్లో ఏం చూస్తాం?
యెహోవా ప్రజలమైన మనం కష్టాల్ని చూసి ఆశ్చర్యపోం. ఎందుకంటే, “ఎన్నో శ్రమల్ని ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి” అని బైబిలు చెప్తుందని మనకు తెలుసు. (అపొ. 14:22) ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కొన్ని కష్టాలు, కొత్తలోకం వచ్చాక మాత్రమే పూర్తిగా పోతాయని మనకు తెలుసు. అప్పుడు “మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రక. 21:4.
2 యెహోవా మనకు కష్టాలు రాకుండా చేయడు, కానీ వాటిని సహించేలా సహాయం చేస్తాడు. అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులతో ఏమన్నాడో ఒకసారి గమనించండి. ఆయన, అలాగే తోటి సహోదరులు ఎదుర్కొంటున్న రకరకాల కష్టాలు, శ్రమల గురించి మాట్లాడిన తర్వాత పౌలు ఇలా రాశాడు: “మనల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా మనం వాటన్నిట్లో పూర్తి విజయం సాధిస్తున్నాం.” (రోమా. 8:35-37) అంటే కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు కూడా మనం విజయం సాధించేలా లేదా సఫలమయ్యేలా యెహోవా సహాయం చేస్తాడని అర్థమౌతుంది. విజయం సాధించేలా యెహోవా యోసేపుకు ఎలా సహాయం చేశాడో, మీకు కూడా ఎలా సహాయం చేస్తాడో ఈ ఆర్టికల్లో చూస్తాం.
పరిస్థితులు ఉన్నట్టుండి మారిపోయినప్పుడు
3. యోసేపు జీవితం ఉన్నట్టుండి ఎలా మారిపోయింది?
3 యాకోబు తన కొడుకులందరి కన్నా యోసేపునే ఎక్కువగా ప్రేమించాడు. (ఆది. 37:3, 4) అది చూసి యోసేపు అన్నలు ఆయన మీద ఈర్ష్య పడ్డారు. అవకాశం దొరికినప్పుడు యోసేపు అన్నలు ఆయన్ని మిద్యాను వర్తకులకు అమ్మేశారు. ఈ వర్తకులేమో ఆయన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐగుప్తుకు తీసుకెళ్లి, పోతీఫరుకు అమ్మేశారు. ఈ పోతీఫరు, ఫరో దగ్గర రాజ సంరక్షకుల అధిపతి. ఉన్నట్టుండి యోసేపు పరిస్థితి ఎలా మారిపోయిందో కదా. తండ్రి ముద్దుల కొడుకుగా ఉన్న యోసేపు, ఇప్పుడు ఐగుప్తులో ఒక బానిసగా మారిపోయాడు.—ఆది. 39:1.
4. మనం ఎలాంటి కష్టాలు ఎదుర్కోవచ్చు?
4 “ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి” అని బైబిలు చెప్తుంది. (ప్రసం. 9:11 పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) “మనుషులకు సాధారణంగా వచ్చే శ్రమలు” కొన్నిసార్లు మనకు కూడా వస్తాయి. (1 కొరిం. 10:13, అధస్సూచి) అలాగే, క్రీస్తు శిష్యులుగా ఉన్నందుకు మనం కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రజలు మనల్ని ఎగతాళి చేయవచ్చు, వ్యతిరేకించవచ్చు, హింసించవచ్చు. (2 తిమో. 3:12) ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంటున్నా, విజయం సాధించేలా లేదా మనం చేసేవి సఫలం అయ్యేలా యెహోవా సహాయం చేస్తాడు. మరి ఆయన యోసేపుకు ఎలా సహాయం చేశాడు?
5. పోతీఫరు ఏం గుర్తించాడు? (ఆదికాండం 39:2-6)
5 ఆదికాండం 39:2-6 చదవండి. యువకుడైన యోసేపు తెలివైనవాడని, కష్టపడి పనిచేసేవాడని పోతీఫరు గమనించాడు. దానికి గల కారణమేంటో కూడా అతనికి తెలుసు. “[యోసేపు] చేసే ప్రతీ పనిని యెహోవా సఫలం చేస్తున్నాడని” పోతీఫరు గుర్తించాడు. b కొంతకాలానికి పోతీఫరు యోసేపును తన ముఖ్య సేవకునిగా, తన ఇంటిమీద అధికారిగా నియమించాడు. దానివల్ల ఏం జరిగింది? పోతీఫరు ఎంతో ధనవంతుడయ్యాడు.
6. మారిన పరిస్థితుల్ని బట్టి యోసేపుకు ఎలా అనిపించి ఉంటుంది?
6 అయితే మారిన పరిస్థితుల్ని బట్టి యోసేపుకు ఎలా అనిపించి ఉంటుంది? ఆ సమయంలో ఆయన ముఖ్యంగా ఏం కోరుకుని ఉంటాడు? పోతీఫరు ఇంట్లో అధికారి అవ్వాలనా? లేదు. దాసత్వం నుండి విడుదలై, తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్లాలని ఆయన కోరుకుని ఉంటాడు. యోసేపు పోతీఫరుకు ముఖ్య సేవకుడు, అతని ఇంటిమీద అధికారి అయినా, ఇంకా ఒక దాసుడే. అందులోనూ ఆయన యజమాని అయిన పోతీఫరు యెహోవా ఆరాధకుడు కాదు. పోతీఫరు యోసేపును దాసత్వం నుండి విడిపించేలా యెహోవా చేయలేదు. కొంతకాలం తర్వాత యోసేపు పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది.
పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారైనప్పుడు
7. యోసేపు పరిస్థితి ఇంకా ఘోరంగా ఎలా తయారైంది? (ఆదికాండం 39:14, 15)
7 ఆదికాండం 39వ అధ్యాయం చెప్తున్నట్టు, పోతీఫరు భార్య యోసేపు మీద కన్నేసి, “నాతో పడుకో” అని ఆయన్ని చాలాసార్లు అడిగింది. కానీ యోసేపు దానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. దాంతో చివరికి ఆమెకు కోపం వచ్చి, యోసేపు తనను పాడుచేయబోయాడని నింద వేసింది. (ఆదికాండం 39:14, 15 చదవండి.) అది వినగానే, పోతీఫరు యోసేపును చెరసాలలో వేయించాడు. కొన్ని సంవత్సరాల పాటు యోసేపు అక్కడే ఉన్నాడు. (ఆది. 39:19, 20) ఆ చెరసాల ఎలా ఉండేది? ఈ సందర్భంలో, “చెరసాల” అని అనువదించిన హీబ్రూ పదానికి, “బావి” లేదా “గుంట” అనే అర్థాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడంతా చీకటిగా, నిరాశగా ఉండేదని తెలుస్తోంది. (ఆది. 40:15, అధస్సూచి) అంతేకాదు కొంతకాలం పాటు యోసేపు కాళ్లకు సంకెళ్లు, మెడకు ఇనుప గొలుసులు వేశారని బైబిలు చెప్తుంది. (కీర్త. 105:17, 18) యోసేపు పరిస్థితి ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారైంది. అప్పటివరకు తన యజమానికి నమ్మకమైన దాసునిగా ఉన్న యోసేపు, ఇప్పుడు ఏ ఆశా లేని ఖైదీగా మారిపోయాడు.
8. కష్టాలు ఎక్కువైనా, మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
8 మీరు ఎంత పట్టుదలగా ప్రార్థిస్తున్నా కష్టాలు ఇంకా ఎక్కువైపోయి, మీ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు అలా జరగవచ్చు. ఈ సాతాను లోకంలో మనకు కష్టాలు రాకుండా యెహోవా ఆపడు. (1 యోహా. 5:19) అయితే మీ పరిస్థితి అంతా యెహోవాకు తెలుసు, ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడు అనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. (మత్త. 10:29-31; 1 పేతు. 5:6, 7) ఆయన ఇలా మాటిచ్చాడు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” (హెబ్రీ. 13:5) కష్టాల్లో మునిగిపోయి, ఇక ఏ ఆశా లేదని అనిపించినప్పుడు కూడా సహించేలా యెహోవా మీకు సహాయం చేయగలడు. ఆయన యోసేపుకు ఎలా సహాయం చేశాడో ఇప్పుడు చూద్దాం.
9. చెరసాలలో యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడని ఎందుకు చెప్పవచ్చు? (ఆదికాండం 39:21-23)
9 ఆదికాండం 39:21-23 చదవండి. అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా యోసేపు విజయం సాధించేలా, ఆయన చేసేవన్నీ సఫలమయ్యేలా యెహోవా సహాయం చేశాడు. ఎలా? యోసేపు మళ్లీ పోతీఫరు ఇంట్లోలాగే, ఇక్కడ చెరసాల ముఖ్య అధికారి నమ్మకాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్నాడు. కొంతకాలం తర్వాత, చెరసాల ముఖ్య అధికారి యోసేపును ఖైదీలందరి మీద నాయకునిగా పెట్టాడు. నిజానికి, “ఆ చెరసాల ముఖ్య అధికారి యోసేపుకు అప్పగించిన వాటిలో దేని గురించీ లెక్క అడిగేవాడు కాదు” అని బైబిలు చెప్తుంది. నిరాశలో మునిగిపోయే బదులు, బిజీగా ఉండడానికి యోసేపుకు మంచి పని దొరికింది. నిజంగా అది ఊహించని మార్పు. ఫరో ఆస్థాన అధికారి భార్యను పాడుచేయబోయాడు అనే నిందతో చెరసాలకు వచ్చిన ఖైదీ, ఇలా ఒక నమ్మదగిన స్థాయికి ఎలా చేరుకున్నాడు? ఆ ప్రశ్నకు ఒకేఒక్క జవాబు ఉంది. ఆదికాండం 39:23 ఇలా చెప్తుంది: “యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు, అతను ఏ పని చేసినా యెహోవా దాన్ని సఫలం చేశాడు.”
10. యోసేపుకు తాను చేసేవన్నీ సఫలమౌతున్నట్టు అనిపించి ఉంటుందా? వివరించండి.
10 మళ్లీ ఈ సందర్భంలో యోసేపుకు ఎలా అనిపించి ఉంటుంది? తప్పుడు నిందపడి చెరసాలకు వెళ్లాక తాను చేసేవన్నీ సఫలమౌతున్నట్టు యోసేపుకు అనిపించి ఉంటుందా? ఈ సమయంలో యోసేపు అన్నిటికన్నా ముఖ్యంగా ఏం కోరుకుని ఉంటాడు? చెరసాల ముఖ్య అధికారి దగ్గర మంచి పేరు సంపాదించాలనా? లేదు. యోసేపు, తన మీద పడ్డ నిందలు అబద్ధమని నిరూపించబడి, చెరసాల నుండి విడుదలవ్వాలని కోరుకుని ఉంటాడు. నిజానికి చెరసాల నుండి విడుదలౌతున్న ఒక ఖైదీతో యోసేపు దానిగురించి మాట్లాడాడు. చీకటి నిండిన ఈ చెరసాల నుండి విడిపించబడేలా, తన తరఫున ఫరోతో మాట్లాడమని యోసేపు అతన్ని కోరాడు. (ఆది. 40:14) కానీ అతను దానిగురించి మర్చిపోయాడు. యోసేపు ఇంకో రెండు సంవత్సరాలపాటు చెరసాలలోనే ఉండాల్సి వచ్చింది. (ఆది. 40:23; 41:1, 14) అయినా యోసేపు చేసేవన్నీ సఫలమయ్యేలా యెహోవా చేశాడు. ఎలా?
11. యెహోవా యోసేపుకు ఎలా సహాయం చేశాడు? యెహోవా సంకల్పం నెరవేరే విషయంలో యోసేపు ఏం చేయగలిగాడు?
11 యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, ఫరోకు రెండు కలలు వచ్చేలా యెహోవా చేశాడు. ఫరో ఎంతో కలవరపడి వాటి అర్థాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు. యోసేపు కలల అర్థాన్ని చెప్పగలడని ఫరోకు తెలిసినప్పుడు, ఆయన యోసేపును పిలిపించాడు. యెహోవా సహాయంతో యోసేపు ఆ కలల అర్థాన్ని ఫరోకు తెలియజేశాడు. యోసేపు ఇచ్చిన సలహాలు ఫరోకు ఎంతో నచ్చాయి. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడని గమనించి, ఫరో ఆయన్ని ఐగుప్తు ధాన్యమంతటి మీద అధికారిగా నియమించాడు. (ఆది. 41:38, 41-44) తర్వాత ఐగుప్తుతోపాటు కనాను దేశమంతటా ఒక పెద్ద కరువు వచ్చింది. ఆ సమయంలో యోసేపు కుటుంబం కనానులో ఉంది. ఇప్పుడు యోసేపు తన కుటుంబాన్ని, ఒకవిధంగా చెప్పాలంటే మెస్సీయ వచ్చే వంశాన్ని కాపాడే స్థానంలో ఉన్నాడు.
12. యెహోవా ఏ విధంగా యోసేపు చేసేవన్నీ సఫలమయ్యేలా చేశాడు?
12 యోసేపు జీవితంలో జరిగిన అసాధారణ విషయాల గురించి ఒకసారి ఆలోచించండి. దాసునిగా ఉన్న యోసేపును పోతీఫరు గమనించేలా చేసింది ఎవరు? ఖైదీగా ఉన్న యోసేపు, చెరసాల ముఖ్య అధికారి నమ్మకాన్ని, గౌరవాన్ని సంపాదించుకునేలా చేసింది ఎవరు? ఫరోకు కలవరపెట్టే కలలు రప్పించి, యోసేపు వాటి అర్థాన్ని తెలియజేసేలా చేసింది ఎవరు? ఫరో యోసేపును ఐగుప్తు ధాన్యమంతటి మీద అధికారిగా నియమించేలా చేసింది ఎవరు? (ఆది. 45:5) యోసేపు చేసేవన్నీ సఫలమయ్యేలా చేసింది ఇంకెవరో కాదు, యెహోవాయే అని స్పష్టంగా అర్థమౌతుంది. యోసేపు అన్నలు ఆయన్ని చంపాలని చూసినా, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసి, తన సంకల్పం నెరవేర్చడానికి యెహోవా యోసేపును ఉపయోగించుకున్నాడు.
యెహోవా మీకు కూడా సహాయం చేస్తాడు
13. మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ పరిస్థితిలో యెహోవా జోక్యం చేసుకుంటాడా? వివరించండి.
13 మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ పరిస్థితిలో యెహోవా జోక్యం చేసుకుంటాడా? మన జీవితంలో ఏం జరిగినా అది మన మంచికే జరిగేలా యెహోవా చేస్తాడా? లేదు, బైబిలు అలా చెప్పట్లేదు. మరి యోసేపు ఉదాహరణ మనకు ఏం నేర్పిస్తుంది? (ప్రసం. 8:9; 9:11) మనం కష్టాల్ని ఎదుర్కొంటున్నప్పుడు, మన పరిస్థితి యెహోవాకు పూర్తిగా తెలుసని, ఆయన మన ప్రార్థనల్ని వింటాడని నేర్పిస్తుంది. (కీర్త. 34:15; 55:22; యెష. 59:1) అంతేకాదు, కష్టాల్ని విజయవంతంగా సహించేలా యెహోవా సహాయం చేస్తాడు. ఎలా?
14. కష్టాల్లో యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?
14 యెహోవా మనకు సహాయం చేసే ఒక విధానం ఏంటంటే, సరైన సమయంలో మనకు కావల్సిన ఓదార్పును, ప్రోత్సాహాన్ని ఇవ్వడం. (2 కొరిం. 1:3, 4) టర్క్మెనిస్తాన్లోని ఏజీస్ అనే సహోదరుడి విషయంలో అదే జరిగింది. తన విశ్వాసం కారణంగా ఆయనకు రెండేళ్ల జైలు శిక్షపడింది. ఆయన ఇలా చెప్పాడు: “కోర్టులో నా కేసు విచారణకు వచ్చిన రోజు ఉదయం, ఒక సహోదరుడు నాకు యెషయా 30:15 లేఖనం చూపించాడు. అందులో ఇలా ఉంది: ‘కంగారుపడకుండా, నమ్మకం చూపిస్తే అదే మీకు బలం.’ ప్రశాంతంగా ఉంటూ, ప్రతీ విషయంలో యెహోవా మీద ఆధారపడేలా ఆ లేఖనం ఎప్పుడూ నాకు సహాయం చేసింది. జైల్లో ఉన్నంతకాలం నేను ఆ లేఖనాన్ని ధ్యానించాను. అది నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.” మీ జీవితంలో కూడా అలా జరిగిందా? సరిగ్గా అవసరమైన సమయంలో యెహోవా మీకు ఓదార్పును, ప్రోత్సాహాన్ని ఇచ్చిన సందర్భాన్ని మీరు గుర్తుచేసుకోగలరా?
15-16. టారీ అనే సహోదరి అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
15 కొన్నిసార్లు, కష్టాల్లో యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో మనకు అర్థంకాకపోవచ్చు. కానీ ఆ కష్టం తీరిపోయాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఆ కష్టమంతటిలో యెహోవా మనకు ఎలా సహాయం చేశాడో స్పష్టంగా అర్థమౌతుంది. టారీ అనే సహోదరి కూడా ఆ మాట నిజమని చెప్తుంది. ఆమె కొడుకు మేసన్ ఆరేళ్లు క్యాన్సర్తో పోరాడి చనిపోయాడు. టారీ ఎంత గుండెకోతకు గురైవుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆమె ఇలా అంటుంది: ‘తమ కళ్లముందే తమ పిల్లలు వేదన పడుతుంటే ఏ తల్లిదండ్రులూ చూసి తట్టుకోలేరు, పిల్లలకు బదులు ఆ కష్టం తమకే వస్తే బాగుండని అనుకుంటారు.’
16 తన కొడుకు పడుతున్న బాధను చూసి టారీ తల్లడిల్లిపోయినా, దాన్ని తట్టుకునేలా యెహోవా తనకు ఎలా సహాయం చేశాడో ఆమె తర్వాత అర్థం చేసుకుంది. ఆమె ఇలా అంది: “ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు, ఆ సమయమంతటిలో యెహోవా మాకు ఎలా సహాయం చేశాడో నేను అర్థం చేసుకున్నాను. జబ్బు వల్ల మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు, చాలామంది సహోదరులు రెండు గంటలపాటు ప్రయాణం చేసి హాస్పిటల్కు వచ్చేవాళ్లు. మేసన్ను కలిసే అవకాశం లేనప్పుడు కూడా వాళ్లు వచ్చేవాళ్లు. మాకు సహాయం చేయడానికి ఎప్పుడూ సహోదర సహోదరీల్లో ఎవరో ఒకరు హాస్పిటల్లో ఉండేవాళ్లు. అలాగే, సహోదరులు మా అవసరాలన్నీ చూసుకున్నారు. తీవ్రమైన పరిస్థితిలో కూడా మాకు ఏదీ తక్కువ కాలేదు.” ఆ కష్టాల్ని సహించడానికి యెహోవా టారీకి, వాళ్ల అబ్బాయికి సహాయం చేశాడు.—‘ యెహోవా మాకు అవసరమైనవి సరైన సమయంలో ఇచ్చాడు’ అనే బాక్సు చూడండి.
యెహోవా మీకు ఎలా సహాయం చేస్తున్నాడో గుర్తించండి
17-18. కష్టాల్లో యెహోవా సహాయాన్ని గుర్తించడానికి, దానిపట్ల కృతజ్ఞత పెంచుకోవడానికి మనం ఏం చేయవచ్చు? (కీర్తన 40:5)
17 కీర్తన 40:5 చదవండి. పర్వతాన్ని ఎక్కే వాళ్ల లక్ష్యం, శిఖరాన్ని చేరుకోవడం. అయితే వాళ్లు మధ్యలో వేర్వేరు చోట్ల ఆగుతూ, చుట్టూ ఉన్న అందమైన దృశ్యాల్ని చూసి ఆనందిస్తుంటారు. అదేవిధంగా మీరు కూడా అప్పుడప్పుడు సమయం తీసుకుని, కష్టాల్లో యెహోవా మీకు ఎలా సహాయం చేస్తున్నాడో ఆలోచించండి. రోజూ మీ పనులన్నీ ముగిశాక ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘ఈ రోజు యెహోవా నన్ను ఎలా ఆశీర్వదించాడు? నా కష్టం తీరకపోయినా, దాన్ని సహించేలా యెహోవా నాకు ఎలా సహాయం చేశాడు?’ మీకు సహాయం చేయడానికి యెహోవా చేసిన కనీసం ఒక్క పనినైనా గుర్తించడానికి ప్రయత్నించండి.
18 మీ కష్టాలు తీరిపోవాలని మీరు ప్రార్థిస్తుండవచ్చు. అందులో తప్పేమీ లేదు. (ఫిలి. 4:6) అయితే ఆ కష్టాల్లో కూడా యెహోవా మనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. మనల్ని బలపరుస్తానని, సహించేలా సహాయం చేస్తానని యెహోవా మాటిచ్చాడు. కాబట్టి యెహోవా మీకు చేస్తున్న సహాయం పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. అప్పుడే, యోసేపుకు సహాయం చేసినట్టు కష్టాల్లో యెహోవా మీకు కూడా సహాయం చేస్తున్నాడని గుర్తించగలుగుతారు.—ఆది. 41:51, 52.
పాట 32 యెహోవా పక్షాన ఉండండి!
a కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా మనకు సహాయం చేస్తున్నాడని కొన్నిసార్లు గుర్తించం. కానీ కష్టాల్లో కూడా యెహోవా మనకు తోడుంటాడని, మన పనుల్ని సఫలం చేస్తాడని మీకు తెలుసా? యోసేపు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన చేసేవన్నీ సఫలమయ్యేలా యెహోవా సహాయం చేశాడు. ఆయన మీకు కూడా సహాయం చేస్తాడు. దానిగురించి ఈ ఆర్టికల్లో చూస్తాం.
b దాసునిగా యోసేపు పరిస్థితిలో వచ్చిన ఈ మార్పుల గురించి బైబిలు కేవలం కొన్ని వచనాల్లో వివరిస్తుంది. కానీ ఈ మార్పులు జరగడానికి బహుశా కొన్ని సంవత్సరాలు పట్టుండవచ్చు.