అధ్యయన ఆర్టికల్ 5
“క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది”
‘క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది. కాబట్టి బ్రతికున్నవాళ్లు ఇకమీదట తమకోసం జీవించకూడదు.’ —2 కొరిం. 5:14, 15.
పాట 13 క్రీస్తు మన ఆదర్శం
ఈ ఆర్టికల్‌లో . . . a
1-2. (ఎ) యేసు జీవితం, పరిచర్య గురించి ఆలోచించినప్పుడు మనకు ఏం అనిపిస్తుంది? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
మనకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోతే చాలా బాధేస్తుంది. వాళ్లు చనిపోవడానికి ముందు జరిగిన సంఘటనల్ని, వాళ్లు అనుభవించిన బాధను గుర్తుచేసుకున్నప్పుడు ఎంతో దుఃఖం కలుగుతుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల మాటల్ని, పనుల్ని గుర్తుచేసుకుంటే, ఆ జ్ఞాపకాలు మనకు సంతోషాన్ని ఇస్తాయి.
2 అదేవిధంగా యేసు అనుభవించిన బాధలు, ఆయన మరణం గురించి చదివినప్పుడు దుఃఖం కలుగుతుంది. జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో మనం ముఖ్యంగా, యేసు అర్పించిన బలి ఎంత విలువైనదో ఆలోచిస్తాం. (1 కొరిం. 11:24, 25) భూమ్మీద ఉన్నప్పుడు యేసు చెప్పిన మాటల గురించి, చేసిన పనుల గురించి ఆలోచించినప్పుడు మనకు సంతోషంగా అనిపిస్తుంది. అలాగే యేసు ఇప్పుడు చేస్తున్న వాటిగురించి, భవిష్యత్తులో చేయబోయే వాటిగురించి ఆలోచించినప్పుడు మనం ఎంతో ప్రోత్సాహం పొందుతాం. ఇవన్నీ, అలాగే యేసు మన మీద చూపించిన ప్రేమ గురించి ఆలోచించినప్పుడు, మన కృతజ్ఞతను మన పనుల్లో చూపించాలని కోరుకుంటాం. అదెలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
యేసును అనుసరించేలా కృతజ్ఞత పురికొల్పుతుంది
3. విమోచన క్రయధనాన్ని మనం ఎందుకు విలువైనదిగా చూస్తాం?
3 యేసు జీవితం, మరణం గురించి ఆలోచించినప్పుడు మనలో కృతజ్ఞత పెరుగుతుంది. యేసు భూమ్మీద ఉన్నప్పుడు, దేవుని రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి చెప్పాడు. ఆ రాజ్య సత్యాల్ని మనం అమూల్యంగా చూస్తాం. విమోచన క్రయధనం వల్ల యెహోవాతో, యేసుతో స్నేహం చేసే అవకాశం మనకు దొరికింది. కాబట్టి మనం దాన్ని ఎంతో విలువైనదిగా చూస్తాం. యేసు మీద విశ్వాసం చూపించేవాళ్లు శాశ్వత జీవితాన్ని పొందుతారు. అలాగే చనిపోయిన తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మళ్లీ బ్రతకడాన్ని చూస్తారు. (యోహా. 5:28, 29; రోమా. 6:23) నిజానికి ఈ ఆశీర్వాదాలు పొందడానికి మనం అర్హులం కాము. యెహోవాకు, యేసుక్రీస్తుకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. (రోమా. 5:8, 20, 21) కాబట్టి మనకు ఎంత కృతజ్ఞత ఉందో మన పనుల్లో చూపించాలని కోరుకుంటాం. దాన్నెలా చేయవచ్చు?
4. మగ్దలేనే మరియ యేసు మీద ఎలా కృతజ్ఞత చూపించింది? (చిత్రం చూడండి.)
4 యూదురాలైన మగ్దలేనే మరియ ఉదాహరణ గురించి ఆలోచించండి. ఏడుగురు చెడ్డ దూతలు పట్టడంతో ఆమె పరిస్థితి దారుణంగా ఉంది, ఎంతో బాధపడింది. ఇక తనకు సహాయం చేసేవాళ్లు ఎవరూ లేరని అనుకుంది. అయితే యేసు ఆ చెడ్డ దూతల్ని వెళ్లగొట్టినప్పుడు ఆమెకు ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో కదా! ఆమె కృతజ్ఞతతో యేసు శిష్యురాలైంది. తన సమయాన్ని, శక్తిని, తనకున్న వాటన్నిటిని ఉపయోగించి పరిచర్యలో ఆయనకు మద్దతిచ్చింది. (లూకా 8:1-3) అయితే యేసు త్వరలో తన కోసం గొప్ప త్యాగం చేయబోతున్నాడని ఆమెకు తెలీదు. యేసు తన మీద “విశ్వాసం ఉంచే” వాళ్లందరూ శాశ్వత జీవితం పొందేలా తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. (యోహా. 3:16) ఆ విషయం తెలియకపోయినా, మరియ యేసును నమ్మకంగా అంటిపెట్టుకుని ఉంది. యేసు హింసాకొయ్య మీద బాధలు అనుభవిస్తున్నప్పుడు, ఆయన్ని బలపర్చాలనే కోరికతో ఆమె ఆయన దగ్గర్లోనే ఉంది. అలాగే అక్కడికి వచ్చిన ఇతరుల్ని ఓదార్చి ఉంటుంది. (యోహా. 19:25) యేసు చనిపోయినప్పుడు మరియ, ఇంకో ఇద్దరు స్త్రీలు ఆయన శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. (మార్కు 16:1, 2) చివరివరకు యేసును నమ్మకంగా అంటిపెట్టుకుని ఉన్నందుకు యెహోవా మరియకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. పునరుత్థానమైన యేసును కలిసి, ఆయనతో మాట్లాడే అవకాశం ఆమెకు దొరికింది. శిష్యుల్లో కేవలం కొంతమందికి మాత్రమే ఆ ఆశీర్వాదం దొరికింది.—యోహా. 20:11-18.
5. యెహోవా, యేసు మనకోసం చేసిన వాటన్నిటి పట్ల ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?
5 మనం కూడా రాజ్యసంబంధ పనుల కోసం మన సమయాన్ని, శక్తిని, డబ్బును ఉపయోగించడం ద్వారా యెహోవా, యేసు మనకోసం చేసిన వాటన్నిటి పట్ల కృతజ్ఞత చూపించవచ్చు. ఉదాహరణకు మన ఆరాధనకు సంబంధించిన భవనాల్ని కట్టడంలో, రిపేరు చేయడంలో, శుభ్రం చేయడంలో సహాయం చేయవచ్చు.
ఇతరుల్ని ప్రేమించేలా యెహోవా, యేసు మీద ఉన్న ప్రేమ పురికొల్పుతుంది
6. యేసు వ్యక్తిగతంగా మీకోసం చనిపోయాడని ఎందుకు చెప్పవచ్చు?
6 యెహోవాకు, యేసుకు మన మీద ఎంత ప్రేముందో ఆలోచించినప్పుడు మనం కూడా వాళ్లమీద ప్రేమ చూపించాలని అనుకుంటాం. (1 యోహా. 4:10, 19) యేసు వ్యక్తిగతంగా మీకోసం చనిపోయాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమ ఇంకా ఎక్కువౌతుంది. అపొస్తలుడైన పౌలు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే గలతీయులకు రాసిన ఉత్తరంలో, దేవుని కుమారుడు “నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అప్పగించుకున్నాడు” అని రాశాడు. (గల. 2:20) విమోచన క్రయధనం ఆధారంగానే తనకు స్నేహితులయ్యేలా యెహోవా మనల్ని ఆకర్షించాడు. (యోహా. 6:44) యెహోవా మీలో ఏదో మంచిని చూసి, మిమ్మల్ని తన స్నేహితుల్ని చేసుకోవడానికి గొప్ప మూల్యం చెల్లించాడని తెలుసుకున్నప్పుడు మీ హృదయం ఎంతో ఉప్పొంగిపోయి ఉంటుంది. యెహోవా మీద, యేసు మీద మీకున్న ప్రేమ కూడా పెరిగి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రశ్న గురించి ఆలోచించవచ్చు: ‘ఆ ప్రేమ ఏం చేసేలా నన్ను బలంగా పురికొల్పుతుంది?’
7. చిత్రంలో ఉన్నట్టు, మనలో ప్రతీ ఒక్కరం యెహోవా మీద, యేసు మీద మనకు ఉన్న ప్రేమను ఎలా చూపించవచ్చు? (2 కొరింథీయులు 5:14, 15; 6:1, 2)
7 దేవుని మీద, యేసు మీద ఉన్న ప్రేమ ఇతరుల్ని ప్రేమించేలా మనల్ని పురికొల్పుతుంది. (2 కొరింథీయులు 5:14, 15; 6:1, 2 చదవండి.) ఆ ప్రేమను చూపించే ఒక మార్గం ఏంటంటే, ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొనడం. దేశం, జాతి, కులం, మతం, పేద, ధనిక అనే తేడా లేకుండా మనం ప్రతీ ఒక్కరికి ప్రకటిస్తాం. “అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలి” అనే దేవుని ఇష్టానికి తగ్గట్టు మనం నడుచుకుంటాం.—1 తిమో. 2:4.
8. సహోదర సహోదరీల మీద ప్రేమ ఉందని ఎలా చూపించవచ్చు?
8 సహోదర సహోదరీల మీద ప్రేమ చూపించడం ద్వారా కూడా యెహోవా మీద, యేసు మీద మనకు ప్రేమ ఉందని నిరూపించుకోవచ్చు. (1 యోహా. 4:21) మనం వాళ్లను పట్టించుకుంటాం, కష్టాల్లో వాళ్లకు తోడుంటాం. వాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు చనిపోయినప్పుడు ఓదారుస్తాం. వాళ్లకు ఆరోగ్యం బాలేనప్పుడు వెళ్లి కలుస్తాం. వాళ్లు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ప్రోత్సహిస్తాం. (2 కొరిం. 1:3-7; 1 థెస్స. 5:11, 14) “నీతిమంతుడు పట్టుదలగా చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది” కాబట్టి వాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉంటాం.—యాకో. 5:16.
9. సహోదర సహోదరీల మీద ప్రేమను ఇంకా ఎలా చూపించవచ్చు?
9 సహోదర సహోదరీలతో శాంతిగా ఉండడానికి కృషిచేయడం ద్వారా కూడా మనం ప్రేమ చూపించవచ్చు. మనం యెహోవాలాగే, మన తోటివాళ్లను క్షమించాలని అనుకుంటాం. మన పాపాల్ని క్షమించడానికి యెహోవా ఎంతో పెద్ద త్యాగం చేశాడు, మన కోసం చనిపోయేలా తన కుమారుణ్ణి పంపించాడు. మరి సహోదర సహోదరీలు మనల్ని బాధపెట్టినప్పుడు, మనం వాళ్లను వెంటనే క్షమిస్తున్నామా? యేసు ఒక ఉదాహరణలో చెప్పిన చెడ్డ దాసునిలా, మనం ఉండాలనుకోం. ఆ దాసుడు పెద్ద మొత్తంలో చేసిన అప్పును రాజు రద్దుచేశాడు. అయినా అతను, తోటి దాసుడు తన దగ్గర చేసిన కొద్దిపాటి అప్పును రద్దు చేయలేదు. (మత్త. 18:23-35) సంఘంలో మీకు ఎవరితోనైనా మనస్పర్థలు ఉన్నాయా? అయితే ఈ జ్ఞాపకార్థ ఆచరణలోపే మీరు చొరవ తీసుకుని వాళ్లతో సమాధానపడగలరా? (మత్త. 5:23, 24) అలా చేయడం ద్వారా యెహోవా మీద, యేసు మీద మీకు ఎంత ప్రేమ ఉందో చూపించవచ్చు.
10-11. యెహోవా మీద, యేసు మీద ఉన్న ప్రేమను పెద్దలు ఎలా చూపించవచ్చు? (1 పేతురు 5:1, 2)
10 యెహోవా మీద, యేసు మీద ప్రేమ ఉందని పెద్దలు ఎలా చూపించవచ్చు? దానికోసం ముఖ్యంగా వాళ్లు యేసు గొర్రెల్ని బాగా చూసుకోవాలి. (1 పేతురు 5:1, 2 చదవండి.) ఒకసారి యేసు ఆ విషయాన్ని అపొస్తలుడైన పేతురుకు చాలా స్పష్టంగా చెప్పాడు. యేసు ఎవరో తెలీదని పేతురు మూడుసార్లు అన్నాడు. ఆ తర్వాత, యేసు మీద తనకున్న ప్రేమను నిరూపించుకోవాలని పేతురు బలంగా కోరుకుని ఉంటాడు. పునరుత్థానమైన యేసు పేతురును ఇలా అడిగాడు: “యోహాను కుమారుడివైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” ఆ సమయంలో పేతురు, యేసు మీదున్న ప్రేమను నిరూపించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండివుంటాడు. యేసు పేతురుతో, “నా చిన్న గొర్రెల్ని మేపు” అన్నాడు. (యోహా. 21:15-17) పేతురు జీవితాంతం తన ప్రభువు గొర్రెల్ని చాలా శ్రద్ధగా చూసుకుంటూ, ఆయన మీద ఉన్న ప్రేమను నిరూపించుకున్నాడు.
11 పెద్దలారా మీరు కూడా యేసు గొర్రెల్ని శ్రద్ధగా చూసుకుంటున్నారని జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో ఎలా చూపించవచ్చు? సహోదర సహోదరీల్ని క్రమంగా ప్రోత్సహించడం ద్వారా, నిష్క్రియులు యెహోవా దగ్గరికి తిరిగొచ్చేలా చేయగలిగినదంతా చేయడం ద్వారా యెహోవా మీద, యేసు మీద మీకు ఎంత ప్రేమ ఉందో చూపించవచ్చు. (యెహె. 34:11, 12) అలాగే జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన బైబిలు విద్యార్థుల్ని, కొత్తవాళ్లను మీరు ప్రోత్సహించవచ్చు. మనం వాళ్లను కాబోయే క్రీస్తు శిష్యుల్లా చూస్తాం కాబట్టి, వాళ్లు కూడా మనలో ఒకరే అన్నట్టుగా ప్రేమ చూపిస్తాం.
ధైర్యం చూపించేలా యేసు మీద ఉన్న ప్రేమ పురికొల్పుతుంది
12. చనిపోవడానికి ముందు రాత్రి యేసు అన్న మాటలు మనకు ఎందుకు ధైర్యాన్ని ఇస్తాయి? (యోహాను 16:32, 33)
12 చనిపోవడానికి ముందు రాత్రి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయితే ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను.” (యోహాను 16:32, 33 చదవండి.) శత్రువులు బెదిరించినా, ధైర్యం చూపిస్తూ చనిపోయేవరకు యేసు ఎలా నమ్మకంగా ఉండగలిగాడు? ఆయన యెహోవా మీద ఆధారపడ్డాడు. తన శిష్యులకు తీవ్రమైన పరిస్థితులు వస్తాయని తెలిసి, యేసు వాళ్లను కాపాడమని యెహోవాకు ప్రార్థించాడు. (యోహా. 17:11) ఆ విషయం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన శత్రువులందరి కన్నా యెహోవా బలవంతుడు. (1 యోహా. 4:4) యెహోవా అన్నీ చూస్తున్నాడు. మనం ఆయన మీద ఆధారపడితే, మన భయాల్ని తీసేసుకుని ధైర్యం చూపించవచ్చు.
13. అరిమతయియకు చెందిన యోసేపు ఎలా ధైర్యం చూపించాడు?
13 అరిమతయియకు చెందిన యోసేపు ఉదాహరణ గురించి ఆలోచించండి. ఆయనకు యూదుల్లో మంచి పేరు, హోదా ఉంది. ఆయన యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహాసభ సభ్యుడు. అయితే యేసు పరిచర్య కాలంలో ఆయన ధైర్యం చూపించలేదు. అపొస్తలుడైన యోహాను ఆయన గురించి ఇలా రాశాడు: “ఈ యోసేపు యేసు శిష్యుడు, కానీ యూదులకు భయపడి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.” (యోహా. 19:38) యోసేపుకు రాజ్య సందేశం మీద ఆసక్తి ఉన్నా, తాను యేసును నమ్ముతున్నాను అని ఇతరులకు చెప్పలేదు. యూదుల్లో తనకున్న పేరు పాడైపోతుందేమో అని ఆయన భయపడి ఉంటాడు. కానీ యేసు చనిపోయిన తర్వాత యోసేపు “ధైర్యం తెచ్చుకొని పిలాతు దగ్గరికి వెళ్లి యేసు శరీరాన్ని ఇవ్వమని అడిగాడు.” (మార్కు 15:42, 43) తాను యేసు శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి యోసేపు ఇక ఏ మాత్రం వెనకాడలేదు.
14. వేరేవాళ్లు ఏమనుకుంటారో అని మీరు భయపడుతుంటే ఏం చేయవచ్చు?
14 యోసేపులాగే మీరు కూడా ఎప్పుడైనా భయపడ్డారా? స్కూల్లో గానీ, ఉద్యోగ స్థలంలో గానీ మీరు యెహోవాసాక్షి అని చెప్పుకోవడానికి వెనకాడారా? వేరేవాళ్లు ఏమనుకుంటారో అని ప్రచారకులు అవ్వడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారా? అలాంటి కారణాలవల్ల సరైనది చేయడానికి వెనకాడకండి. యెహోవాకు పట్టుదలగా ప్రార్థించండి. తన ఇష్టాన్ని చేయడానికి కావల్సిన ధైర్యాన్ని ఇవ్వమని అడగండి. మీ ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిస్తున్నాడో చూసినప్పుడు మీ విశ్వాసం బలపడుతుంది. మీరింకా ధైర్యంగా తయారౌతారు.—యెష. 41:10, 13.
యెహోవా సేవలో కొనసాగేలా సంతోషం పురికొల్పుతుంది
15. పునరుత్థానమైన యేసు కనిపించిన తర్వాత, శిష్యులు సంతోషంతో ఏం చేశారు? (లూకా 24:52, 53)
15 యేసు చనిపోయినప్పుడు శిష్యులు ఎంతో బాధపడ్డారు. వాళ్లకు ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి. వాళ్లు మంచి స్నేహితుణ్ణి కోల్పోయారు, ముందుముందు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. (లూకా 24:17-21) కానీ పునరుత్థానమైన యేసు, బైబిలు ప్రవచనాల్ని తాను ఎలా నెరవేర్చాడో వాళ్లకు వివరించాడు. అంతేకాదు వాళ్లకు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు. (లూకా 24:26, 27, 45-48) నలభై రోజుల తర్వాత, యేసు పరలోకానికి వెళ్లిపోయే సమయానికి వాళ్ల బాధ సంతోషంగా మారిపోయింది. వాళ్ల ప్రభువు బ్రతికే ఉన్నాడని, తమకు అప్పగించిన కొత్త పనిని చేయడంలో సహాయం చేస్తాడని తెలుసుకున్నప్పుడు వాళ్లు ఎంతో సంతోషించారు. ఆ సంతోషంతో వాళ్లు మానకుండా యెహోవా సేవలో కొనసాగారు.—లూకా 24:52, 53 చదవండి; అపొ. 5:42.
16. యేసు శిష్యుల్లానే మనం ఏం చేయవచ్చు?
16 యేసు శిష్యుల్లానే మనం ఏం చేయవచ్చు? జ్ఞాపకార్థ ఆచరణ సమయంలోనే కాదు, సంవత్సరమంతా యెహోవా సేవలో ఆనందించవచ్చు. అందుకోసం దేవుని రాజ్యానికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి. కొంతమంది పరిచర్యలో పాల్గొనడానికి, మీటింగ్స్‌కి హాజరవ్వడానికి, కుటుంబ ఆరాధనను క్రమంగా చేసుకోవడానికి తమ పని విషయంలో సర్దుబాట్లు చేసుకున్నారు. ఇంకొంతమందైతే సంఘంలో ఎక్కువ పనులు చేయడానికి, లేదా అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లడానికి ఆస్తిపాస్తుల మీద మనసు పెట్టకుండా సాదాసీదాగా జీవించడం నేర్చుకున్నారు. నిజమే యెహోవా సేవలో కొనసాగుతూ ఉండాలంటే, మనకు సహనం అవసరం. అయితే రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడానికి మనం చేసే ప్రయత్నాలన్నిటినీ మెండుగా దీవిస్తానని యెహోవా మాటిస్తున్నాడు.—సామె. 10:22; మత్త. 6:32, 33.
17. జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో మీరేం చేయాలి అనుకుంటున్నారు? (చిత్రం చూడండి.)
17 ఏప్రిల్ 4, మంగళవారం రోజున జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవాలని మనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. యేసు జీవితం, మరణం గురించి; అలాగే యెహోవా, యేసు చూపించిన ప్రేమ గురించి ఇప్పటి నుండే మీరు ఆలోచించవచ్చు. జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో ఆ విషయాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, కొత్త లోక అనువాదం బైబిలు, అనుబంధం B12 లో ఉన్న “యేసు భూజీవితంలో చివరి వారం” అనే చార్టు చూడండి. అందులోని విషయాల్ని చదివి, ధ్యానించడానికి సమయం తీసుకోండి. అలా చదువుతున్నప్పుడు మీ కృతజ్ఞతను, ప్రేమను, ధైర్యాన్ని, సంతోషాన్ని పెంచే వచనాల్ని లోతుగా ధ్యానించండి. మీ కృతజ్ఞతను ఏయే విధాలుగా చూపించవచ్చో ఆలోచించండి. జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో యేసును గుర్తుచేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ ఆయన ఎంతో విలువైనదిగా చూస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—ప్రక. 2:19.
పాట 17 “నాకు ఇష్టమే”
a జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో మనం యేసు జీవితం, మరణం గురించి; అలాగే యెహోవా, యేసు మన మీద చూపించిన ప్రేమ గురించి లోతుగా ఆలోచిస్తాం, మన కృతజ్ఞతను మన పనుల్లో చూపించాలని కోరుకుంటాం. విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞతను; యెహోవా మీద, యేసు మీద మనకున్న ప్రేమను ఎలా చూపించవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాదు సహోదర సహోదరీల మీద ప్రేమను ఎలా పెంచుకోవచ్చో, ధైర్యాన్ని ఎలా చూపించవచ్చో, యెహోవా సేవలో సంతోషాన్ని ఎలా పొందవచ్చో కూడా చూస్తాం.