కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 4

జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడానికి చేసే ప్రయత్నాల్ని యెహోవా దీవిస్తాడు

జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడానికి చేసే ప్రయత్నాల్ని యెహోవా దీవిస్తాడు

“నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.”లూకా 22:19.

పాట 19 ప్రభువు రాత్రి భోజనం

ఈ ఆర్టికల్‌లో . . . a

1-2. మనం ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణను ఎందుకు జరుపుకుంటాం?

 దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసు తన ప్రాణాన్ని ఇచ్చి, శాశ్వత జీవితం పొందడానికి మనకు మార్గం తెరిచాడు. తానెంతో ప్రేమతో చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఒక ఆచరణ జరుపుకోమని, చనిపోకముందు రాత్రి యేసు తన శిష్యులకు చెప్పాడు. దాన్ని జరుపుకోవడానికి కేవలం రొట్టె, ద్రాక్షారసం ఉంటే చాలు.—1 కొరిం. 11:23-26.

2 మనం యేసును ఎంతో ప్రేమిస్తాం కాబట్టి ఆయన చెప్పినట్టే ఆ ఆచరణను జరుపుకుంటాం. (యోహా. 14:15) ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో, మనం యేసు బలిపట్ల కృతజ్ఞత చూపిస్తాం. సమయం తీసుకుని, ఆయన చేసిన త్యాగం ఎంత విలువైనదో ఆలోచిస్తాం. అలాగే పరిచర్యలో ఎక్కువగా పాల్గొంటాం, వీలైనంత ఎక్కువమందిని ఆ ఆచరణకు ఆహ్వానిస్తాం. ఎన్ని సవాళ్లున్నా ఆ ఆచరణకు తప్పకుండా హాజరౌతాం.

3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?

3 యేసు మరణాన్ని గుర్తుచేసుకోవడానికి యెహోవా ప్రజలు చేసే మూడు ప్రయత్నాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం: (1) యేసు చెప్పిన పద్ధతిలోనే జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడం, (2) ఇతరుల్ని ఆహ్వానించడం, (3) ఎన్ని సవాళ్లున్నా దానికి హాజరవ్వడం.

యేసు చెప్పిన పద్ధతిలోనే జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడం

4. ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణప్పుడు ఏ సత్యాల్ని మనం గుర్తుచేసుకుంటాం? ఆ సత్యాలు ఎంత విలువైనవో మనం ఎందుకు మర్చిపోకూడదు? (లూకా 22:19, 20)

4 ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణలో ఒక బైబిలు ప్రసంగాన్ని వింటాం. అందులో ఎన్నో ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం. మనుషులకు విడుదల ఎందుకు అవసరమో, ఒక్క మనిషి మరణం అందరి పాపాల్ని ఎలా కొట్టివేస్తుందో తెలుసుకుంటాం. రొట్టె, ద్రాక్షారసం దేన్ని సూచిస్తున్నాయో, వాటిని ఎవరు తీసుకోవచ్చో తెలుసుకుంటాం. (లూకా 22:19, 20 చదవండి.) భూమ్మీద శాశ్వత జీవితం పొందేవాళ్లు ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తారో ధ్యానిస్తాం. (యెష. 35:5, 6; 65:17, 21-23) ఈ సత్యాలు ఎంత విలువైనవో మనం మర్చిపోకూడదు. కోట్లమందికి ఈ సత్యాల గురించి తెలీదు, యేసు బలి ఎంత విలువైనదో వాళ్లు గుర్తించట్లేదు. అంతేకాదు వాళ్లు యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణను ఆయన చెప్పిన పద్ధతిలో జరుపుకోవట్లేదు. ఎందుకు?

5. అపొస్తలుల్లో చాలామంది చనిపోయిన తర్వాత, ప్రజలు యేసు మరణాన్ని ఎలా గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు?

5 యేసు అపొస్తలుల్లో చాలామంది చనిపోయిన కొంతకాలానికే, సంఘంలోకి అబద్ధ క్రైస్తవులు చొరబడ్డారు. (మత్త. 13:24-27, 37-39) వాళ్లు “శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకెళ్లాలని తప్పుడు బోధలు” బోధించారు. (అపొ. 20:29, 30) యేసు “అనేకుల పాపాల్ని భరించడానికి ఒక్కసారే అర్పించబడ్డాడు” అని బైబిలు చెప్తుంటే, వాళ్లేమో యేసు బలి పదేపదే అర్పించబడాలనే ‘తప్పుడు బోధను’ చెప్పడం మొదలుపెట్టారు. (హెబ్రీ. 9:27, 28) నేడు చాలామంది ఆ అబద్ధ బోధనే నమ్ముతున్నారు. వాళ్లు తమ చర్చీల్లో ప్రతీవారం, కొన్నిసార్లయితే ప్రతీరోజు రొట్టె-ద్రాక్షారసం తీసుకునే ఆచరణలో పాల్గొంటారు. ఆ సమయంలో, రొట్టె-ద్రాక్షారసం నిజంగా యేసు శరీరంలా-రక్తంలా మారిపోతాయని వాళ్లు నమ్ముతారు. తాము ఈ ఆచరణలో పాల్గొన్న ప్రతీసారి యేసు శరీరం, రక్తం అర్పించబడతాయని వాళ్లు అనుకుంటారు. ఇంకొంతమందేమో యేసు మరణాన్ని గుర్తుచేసుకునే ఆచరణను అంత తరచుగా జరుపుకోరు. యేసు బలికి ఉన్న విలువ గురించి వాళ్లకు పెద్దగా తెలీదు. మరికొంతమందేమో, ‘యేసు మరణం వల్ల నా పాపాలు నిజంగా క్షమించబడతాయా?’ అని సందేహిస్తుంటారు. యేసు మరణం వల్ల మన పాపాలు క్షమించబడవని కొంతమంది చెప్పే మాటల్ని బట్టి వాళ్లు అలా సందేహిస్తుంటారు. మరి నిజక్రైస్తవుల సంగతేంటి?

6. 1872 కల్లా కొంతమంది బైబిలు విద్యార్థులు ఏం అర్థం చేసుకున్నారు?

6 1870 లో ఛార్లెస్‌ టేజ్‌ రస్సెల్‌, అలాగే ఇంకొంతమంది బైబిలు విద్యార్థులు కలిసి లేఖనాల్ని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. యేసు బలికి ఉన్న విలువ, ఆయన మరణాన్ని గుర్తు చేసుకునే విధానం గురించిన సత్యాల్ని వాళ్లు తెలుసుకోవాలి అనుకున్నారు. వాళ్లు అలా అధ్యయనం చేసి, యేసు బలి మనుషులందర్నీ పాపమరణాల నుండి విడిపిస్తుందని 1872 కల్లా అర్థం చేసుకున్నారు. వాళ్లు తెలుసుకున్న విషయాల్ని అందరికీ చెప్పాలనుకున్నారు. పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు, పత్రికల ద్వారా వాళ్లు ఆ విషయాల్ని పంచుకున్నారు. కొంతకాలానికే వాళ్లు మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే, సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడం మొదలుపెట్టారు.

7. 1870 నాటి బైబిలు విద్యార్థులు చేసిన అధ్యయనం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతున్నాం?

7 ఎన్నో సంవత్సరాల క్రితం ఆ క్రైస్తవులు చేసిన అధ్యయనం వల్ల, నేడు మనం కూడా ప్రయోజనం పొందుతున్నాం. ఎలా? యెహోవా సహాయంతో మనం యేసు బలికి ఉన్న విలువను, దానివల్ల వచ్చే ప్రయోజనాల్ని అర్థం చేసుకున్నాం. (1 యోహా. 2:1, 2) దేవునికి నచ్చినట్టు జీవించే వాళ్లకు రెండు నిరీక్షణలు ఉన్నాయని కూడా తెలుసుకున్నాం. కొంతమంది పరలోకంలో శాశ్వతకాలం జీవిస్తారు. అయితే కోట్లమంది ఇదే భూమ్మీద శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని పొందుతారు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, యేసు బలివల్ల మనం వ్యక్తిగతంగా ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నామో ఆలోచించినప్పుడు యెహోవాకు మరింత దగ్గరౌతాం. (1 పేతు. 3:18; 1 యోహా. 4:9) కాబట్టి 1870 నాటి ఆ బైబిలు విద్యార్థుల్లాగే, మనం కూడా యేసు చెప్పిన పద్ధతిలోనే జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకుంటున్నాం, దానికి ఇతరుల్ని ఆహ్వానిస్తున్నాం.

జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరుల్ని ఆహ్వానించడం

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమంలో మీరు వీలైనంత ఎక్కువగా ఎలా పాల్గొనవచ్చు? (8-10 పేరాలు చూడండి) c

8. ఇతరుల్ని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడానికి యెహోవా ప్రజలు ఏం చేశారు? (చిత్రం చూడండి.)

8 ఎన్నో సంవత్సరాలుగా యెహోవా ప్రజలు ఇతరుల్ని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్నారు. 1881 లో కావలికోట పత్రిక, పెన్సిల్వేనియాలోని ఆలిగెనీలో ఒక సహోదరుడి ఇంట్లో జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు రమ్మని అమెరికాలో ఉన్న బైబిలు విద్యార్థుల్ని ఆహ్వానించింది. తర్వాత సంఘాలుగా జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడం మొదలుపెట్టారు. 1940 మార్చిలో, తమ ప్రాంతంలోని ఆసక్తిపరుల్ని కార్యక్రమానికి ఆహ్వానించవచ్చని సంస్థ తెలియజేసింది. 1960 లో మొట్టమొదటిసారిగా బెతెల్‌, జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాల్ని సంఘాలకు పంపించింది. అప్పటినుండి మనం ఎన్నో వందలకోట్ల జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాల్ని పంచిపెట్టాం. ఇతరుల్ని ఆహ్వానించడానికి మనం ఎందుకు ఇంత సమయం పెడుతున్నాం, ఇంత కృషిచేస్తున్నాం?

9-10. జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరుల్ని ఆహ్వానించడానికి మనం చేసే కృషి వల్ల ఎవరెవరు ప్రయోజనం పొందుతారు? (యోహాను 3:16)

9 మనం జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరుల్ని ఆహ్వానించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే: జ్ఞాపకార్థ ఆచరణకు మొదటిసారి హాజరయ్యేవాళ్లు యెహోవా, యేసు మనందరి కోసం ఏం చేశారో తెలుసుకోగలుగుతారు. (యోహాను 3:16 చదవండి.) అక్కడ వినే ప్రసంగాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకుని, వాళ్లు ముందుముందు యెహోవా సేవకులు అవ్వాలని మనం కోరుకుంటాం. అయితే కొత్తవాళ్లనే కాదు, ఇంకా వేరేవాళ్లను కూడా మనం ఆహ్వానిస్తాం.

10 చాలాకాలంగా యెహోవాను సేవించని వాళ్లను కూడా మనం ఆహ్వానిస్తాం. యెహోవా దేవుడు వాళ్లను ఇంకా ప్రేమిస్తున్నాడని గుర్తుచేయడానికి మనం అలా చేస్తాం. వాళ్లు వచ్చినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. ఆ ఆచరణకు రావడం వల్ల, ఇంతకుముందు యెహోవా సేవలో ఎంత ఆనందం పొందారో వాళ్లకు గుర్తుకురావచ్చు. మోనిక అనే సహోదరి ఉదాహరణను పరిశీలించండి. b ఎన్నో సంవత్సరాల తర్వాత, ఆమె కోవిడ్‌ సమయంలో మళ్లీ ప్రకటించడం మొదలుపెట్టింది. 2021 లో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే: “ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ నాకు చాలా ప్రత్యేకమైనది. 20 సంవత్సరాల తర్వాత నేను మళ్లీ ప్రకటనా పనిలో పాల్గొన్నాను, ప్రజల్ని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించాను. యెహోవా, యేసు నాకోసం చేసినదాని పట్ల కృతజ్ఞతతో ప్రజల్ని ఆహ్వానించడానికి నేను చేయగలిగినదంతా చేశాను.” (కీర్త. 103:1-4) ప్రజలు స్పందించినా, స్పందించకపోయినా మనం మాత్రం ఉత్సాహంగా ఆహ్వానిస్తాం, యెహోవా మన ప్రయత్నాల్ని దీవిస్తాడని గుర్తుంచుకుంటాం.

11. జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరుల్ని ఆహ్వానించడానికి మనం చేసిన ప్రయత్నాల్ని యెహోవా ఎలా దీవించాడు? (హగ్గయి 2:7)

11 జ్ఞాపకార్థ ఆచరణకు ప్రజల్ని ఆహ్వానించడానికి మనం చేసిన ప్రయత్నాల్ని యెహోవా మెండుగా దీవించాడు. కోవిడ్‌ వల్ల ఇబ్బందులు ఎదురైనా, 2021 లో ముందెన్నడూ లేనంతగా 2,13,67,603 మంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఖ్యకు దాదాపు రెండున్నర రెట్లు. నిజమే యెహోవాకు సంఖ్యలు ముఖ్యం కాదు, హాజరైనవాళ్లు ముఖ్యం. (లూకా 15:7; 1 తిమో. 2:3, 4) నిజాయితీ గల వాళ్లను కనుగొనడానికి, యెహోవా ఈ ఆహ్వాన పనిని ఉపయోగిస్తున్నాడు అనడంలో ఏ సందేహం లేదు.—హగ్గయి 2:7 చదవండి.

ఎన్ని సవాళ్లున్నా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం

జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్ని యెహోవా దీవిస్తాడు (12వ పేరా చూడండి) d

12. ఎలాంటి పరిస్థితుల వల్ల జ్ఞాపకార్థ ఆచరణ చేసుకోవడం మనకు కష్టమవ్వవచ్చు? (చిత్రం చూడండి.)

12 చివరిరోజుల్లో కుటుంబ వ్యతిరేకత, హింస, యుద్ధాలు, పెద్దపెద్ద అంటువ్యాధులు, ఇంకా ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటామని యేసు చెప్పాడు. (మత్త. 10:36; మార్కు 13:9; లూకా 21:10, 11) ఈ పరిస్థితుల వల్ల కొన్నిసార్లు మనకు యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడం కష్టమవ్వవచ్చు. మరైతే మన సహోదర సహోదరీలు అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారు? యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడు?

13. జైల్లో ఉన్నా జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవడానికి ధైర్యంగా ప్రయత్నించినందుకు, యెహోవా ఒక సహోదరుని కృషిని ఎలా దీవించాడు?

13 జైల్లో ఉన్నప్పుడు. తమ విశ్వాసం కారణంగా జైల్లో ఉన్న మన సహోదరులు యేసు మరణాన్ని గుర్తు చేసుకోవడానికి చేయగలిగినదంతా చేస్తారు. ఆర్టెమ్‌ అనే సహోదరుని ఉదాహరణ గురించి గమనించండి. 2020 జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన జైలు గదిలో, ఆయనతోపాటు ఇంకో నలుగురు ఖైదీలు కూడా ఉండేవాళ్లు. జైల్లో ఉన్నా, జ్ఞాపకార్థ ఆచరణ చిహ్నాల్ని ఎలాగోలా ఆయన ఏర్పాటు చేసుకోగలిగాడు. ఆయనే ప్రసంగం ఇచ్చి, జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకోవాలి అనుకున్నాడు. అయితే ఆయన తోటి ఖైదీలు పొగ తాగేవాళ్లు, బాగా బూతులు మాట్లాడేవాళ్లు. మరి ఆయన ఏం చేశాడు? కేవలం ఒక గంట పాటు పొగ తాగకుండా, బూతులు మాట్లాడకుండా ఉండగలరా అని ఆయన వాళ్లను అడిగాడు. వాళ్లు దానికి ఒప్పుకోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. జ్ఞాపకార్థ ఆచరణ గురించి ఆయన వాళ్లకు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, వాళ్లు పట్టించుకోలేదు. కానీ ఆయన దాన్ని ఆచరించడం చూసిన తర్వాత దానిగురించి ప్రశ్నలు అడిగారు.

14. కోవిడ్‌ సమయంలో యెహోవా ప్రజలు జ్ఞాపకార్థ ఆచరణను ఎలా జరుపుకున్నారు?

14 కోవిడ్‌ ఉన్నప్పుడు. కోవిడ్‌-19 సమయంలో యెహోవా ప్రజలు జ్ఞాపకార్థ ఆచరణను నేరుగా కలుసుకుని జరుపుకోలేకపోయారు. దానివల్ల వాళ్లు జ్ఞాపకార్థ ఆచరణను చేసుకోకుండా ఉన్నారా? లేదు. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న సంఘాలు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఆ ఆచరణను చేసుకున్నారు. మరి ఇంటర్నెట్‌ అందుబాటులోలేని వాళ్ల సంగతేంటి? అలాంటి కొన్ని దేశాల్లో కార్యక్రమాన్ని టీవీ లేదా రేడియో ద్వారా ప్రసారం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న సహోదరులు కూడా జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకునేలా బ్రాంచి కార్యాలయాలు ప్రసంగాన్ని 500 కన్నా ఎక్కువ భాషల్లో రికార్డు చేశాయి. కొంతమంది సహోదరులు ఇష్టపూర్వకంగా ముందుకొచ్చి, ఆ రికార్డింగ్‌లను అవసరంలో ఉన్నవాళ్లకు అందజేశారు.

15. సుమ అనే బైబిలు విద్యార్థి అనుభవం నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

15 కుటుంబ వ్యతిరేకత ఉన్నప్పుడు. జ్ఞాపకార్థ ఆచరణ చేసుకోవడానికి కొంతమందికి పెద్ద సవాలు, కుటుంబ వ్యతిరేకత. సుమ అనే బైబిలు విద్యార్థి ఉదాహరణ గమనించండి. 2021 లో జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు ఒక్కరోజు ముందు, ‘ఇంట్లోవాళ్లు ఒప్పుకోవట్లేదు కాబట్టి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వలేను’ అని సుమ తనకు బైబిలు స్టడీ ఇచ్చే సహోదరికి చెప్పింది. అప్పుడు ఆ సహోదరి ఆమెకు లూకా 22:44 చూపించింది. కష్టమైన పరిస్థితుల్లో మనం యేసులాగే, యెహోవాకు ప్రార్థన చేస్తూ ఆయన మీద పూర్తి నమ్మకాన్ని ఉంచాలని చెప్పింది. తర్వాతి రోజు, సుమ జ్ఞాపకార్థ ఆచరణ చిహ్నాల్ని తయారు చేసుకుంది. అలాగే jw.orgలో వచ్చే ప్రత్యేక ఉదయకాల ఆరాధనను చూసింది. తర్వాత సాయంత్రం ఆమె తన గదిలో ఒక్కతే ఫోన్‌ ద్వారా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైంది. సుమ తనకు బైబిలు స్టడీ ఇచ్చే సహోదరికి ఇలా చెప్పింది: “మీరు నిన్న నాకెంతో ధైర్యం చెప్పారు. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి నేను చేయగలిగినదంతా చేశాను. మిగతాదంతా యెహోవా చూసుకున్నాడు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను.” మీకూ అలాంటి పరిస్థితి వస్తే యెహోవా సహాయం చేస్తాడా?

16. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి మనం చేసే కృషిని యెహోవా దీవిస్తాడని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు? (రోమీయులు 8:31, 32)

16 యేసు మరణాన్ని గుర్తు చేసుకోవడానికి మనం చేసే కృషిని యెహోవా ఎంతో విలువైనదిగా చూస్తాడు. యెహోవా మనకోసం చేసిన వాటిపట్ల కృతజ్ఞత చూపించినప్పుడు, ఆయన మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. (రోమీయులు 8:31, 32 చదవండి.) కాబట్టి ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వాలని నిర్ణయించుకుందాం, యెహోవా సేవలో చేయగలిగినదంతా చేద్దాం!

పాట 18 విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత

a 2023, ఏప్రిల్‌ 4, మంగళవారం రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలమంది క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటారు. చాలామంది ఈ ఆచరణకు మొదటిసారి వస్తుండవచ్చు. ఇంకొంతమంది యెహోవాను సేవించడం ఆపేసిన చాలా సంవత్సరాల తర్వాత, మళ్లీ ఈ ఆచరణకు వస్తుండవచ్చు. కొంతమంది సవాళ్లు ఉన్నా ఈ ఆచరణకు హాజరౌతారు. మీ పరిస్థితి ఎలా ఉన్నాసరే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికి మీరు చేసే కృషిని చూసి, యెహోవా సంతోషిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

b కొన్ని అసలు పేర్లు కావు.

c చిత్రాల వివరణ: 1960 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాల్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడవి ఎలక్ట్రానిక్‌ రూపంలో కూడా ఉన్నాయి.

d చిత్రాల వివరణ: పునర్నటన—దేశంలో అల్లర్లు చెలరేగినప్పుడు సహోదర సహోదరీలు జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటున్నారు.