అధ్యయన ఆర్టికల్ 28
దేవునికి భయపడండి, ప్రయోజనం పొందండి
“నిజాయితీగా నడుచుకునేవాడు యెహోవాకు భయపడుతున్నాడు.”—సామె. 14:2.
పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!
ఈ ఆర్టికల్‌లో . . . a
1-2. లోతు కాలంలోలాగే మన చుట్టూ కూడా ఎలాంటి ప్రజలున్నారు?
లోకంలో నైతికంగా దిగజారిపోయిన వాళ్లను చూసినప్పుడు, లోతులాగే మనకు అనిపిస్తుంది. ఆయన, ‘దుష్టుల లెక్కలేనితనాన్ని చూసి చాలా బాధపడ్డాడు.’ ఎందుకంటే, మన పరలోక తండ్రి అలాంటివాళ్లను చూసి అసహ్యించుకుంటాడని ఆయనకు తెలుసు. (2 పేతు. 2:7, 8) దేవుని మీద భయం, ప్రేమ వల్ల నైతికంగా దిగజారిపోయిన ప్రజల్ని లోతు అసహ్యించుకున్నాడు. మనం కూడా యెహోవా ప్రమాణాల్ని ఏమాత్రం లెక్కచేయని ప్రజల మధ్య బ్రతుకుతున్నాం. అయినాసరే దేవుని మీద ప్రేమను కాపాడుకుంటూ, ఆయన మీద భయాన్ని పెంచుకుంటే నైతికంగా పవిత్రంగా ఉండగలుగుతాం.—సామె. 14:2.
2 ఈ విషయంలో మనందరికి కావల్సిన సహాయాన్ని, ప్రోత్సాహాన్ని యెహోవా సామెతలు పుస్తకంలో రాసిపెట్టాడు. పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా, ముసలివాళ్లయినా, క్రైస్తవులందరూ ఆ పుస్తకంలో ఉన్న తెలివైన సలహాల నుండి వెలకట్టలేని ప్రయోజనాల్ని పొందవచ్చు.
దేవుని మీద భయం మన చుట్టూ కంచె వేస్తుంది
3. సామెతలు 17:3 ప్రకారం, మన హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి? (చిత్రం కూడా చూడండి.)
3 మన హృదయాన్ని కాపాడుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, యెహోవా హృదయాన్ని పరిశీలిస్తాడు. దానర్థం ఎదుటివ్యక్తికి కనిపించేది కాకుండా, యెహోవా మనం లోపల ఎలా ఉన్నాం అనేది చూస్తాడు. (సామెతలు 17:3 చదవండి.) శాశ్వతకాలం ఉండే ఆయన జ్ఞానంతో మన మనసును నింపుకుంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. (యోహా. 4:14) అప్పుడు సాతాను, అతని లోకం నైతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో ఇచ్చే విషాన్ని మనం ఎక్కనివ్వం. (1 యోహా. 5:18, 19) యెహోవాకు మనం దగ్గరౌతుండగా ఆయన మీద ప్రేమ, గౌరవం రోజురోజుకూ పెరుగుతాయి. మనం మన తండ్రిని బాధపెట్టాలని అనుకోం కాబట్టి పాపం చేయాలనే ఆలోచనను కూడా అసహ్యించుకుంటాం. అందుకే, ఎప్పుడైన తప్పుచేయాలనే కోరిక కలిగినప్పుడు, ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా మీద అంత ప్రేమ చూపించిన యెహోవాకు తెలిసితెలిసి నేను ఎలా ద్రోహం చేయగలను?’—1 యోహా. 4:9, 10.
4. యెహోవా మీద ఉన్న భయం ఒక సిస్టర్‌ని తప్పు చేయకుండా ఎలా కాపాడింది?
4 క్రోషియాలో ఉంటున్న మార్త అనే సిస్టర్‌కి లైంగిక పాపం చేసే పరిస్థితి వచ్చింది. ఆమె ఇలా అంది: “ఆ తప్పు చేయాలనే కోరికను అణచుకోవడం చాలా కష్టమైంది. అప్పుడు నేను ఏదీ సరిగ్గా ఆలోచించలేకపోయాను. కానీ, యెహోవా మీద భయం నన్ను కాపాడింది.” b అదెలా? ఆ పని చేయడంవల్ల ఎలాంటి నష్టం వస్తుందో మార్త ఆలోచించింది. మనమూ అదే చేయవచ్చు. అలాంటి పనిచేస్తే అన్నిటికన్నా జరిగే పెద్ద నష్టం ఏంటంటే, యెహోవా హృదయాన్ని బాధపెడతాం. ఎప్పటికీ ఆయన్ని ఆరాధించే అవకాశాన్ని చేజార్చుకుంటాం.—ఆది. 6:5, 6.
5. బ్రదర్ లియో అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
5 యెహోవా మీద భయం ఉంటే చెడ్డ స్నేహాలు చేయకుండా ఉంటాం. కాంగోలో ఉంటున్న లియో అనే బ్రదర్ ఆ పాఠం నేర్చుకున్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్న నాలుగు సంవత్సరాలకే చెడు తిరుగుళ్లు తిరగడం మొదలుపెట్టాడు. తన స్నేహితులు చేసేలాంటి చెడ్డ పనులు చేయనంతవరకు, యెహోవాకు విరుద్ధంగా ఏ పాపం చేయట్లేదని ఆయన అనుకున్నాడు. కానీ ఆ స్నేహితులవల్ల ఆయన మద్యం మత్తులో తూగి, లైంగిక పాపానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత, తన అమ్మానాన్నలు నేర్పించిన విషయాలు, తను కోల్పోయిన సంతోషం ఒక్కసారిగా ఆయన కళ్లముందు కదలాడాయి. దానివల్ల వెంటనే ఆయన తన తప్పు తెలుసుకున్నాడు, సంఘపెద్దల సహాయం తీసుకుని యెహోవా దగ్గరికి తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆయన ఒక సంఘపెద్దగా, ప్రత్యేక పయినీరుగా సంతోషంగా సేవచేస్తున్నాడు.
6. ఏ ఇద్దరు స్త్రీల గురించి ఇప్పుడు పరిశీలిస్తాం?
6 ఇప్పుడు సామెతలు 9వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. అందులో తెలివికి అలాగే మూర్ఖత్వానికి సూచనగా ఉన్న ఇద్దరు స్త్రీల గురించి చదువుతాం. (రోమీయులు 5:14; గలతీయులు 4:24 పోల్చండి.) వాటిగురించి పరిశీలిస్తున్నప్పుడు, సాతాను లోకం దిగజారిపోయిన అనైతిక పనుల్లో అలాగే అశ్లీల చిత్రాల మైకంలో ఉందని గుర్తుంచుకుందాం. (ఎఫె. 4:19) కాబట్టి, దేవుని మీద భయాన్ని పెంచుకుంటూ చెడును అసహ్యించుకోవడం చాలా ప్రాముఖ్యం. (సామె. 16:6) మనందరం అంటే, పురుషులైనా స్త్రీలైనా ఈ అధ్యాయం చదవడంవల్ల ఎంతో ప్రయోజనం పొందుతాం. ఇందులో ఉన్న ఇద్దరు స్త్రీలు, అనుభవం లేనివాళ్లకు లేదా ‘వివేచన లేనివాళ్లకు’ ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ఆ ఇద్దరు ఇలా అంటున్నారు: ‘రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి.’ (సామె. 9:1, 5, 6, 13, 16, 17) ఇద్దరూ ఇచ్చే ఆహ్వానం ఒకటే, కానీ వెళ్తే వచ్చే ఫలితాలు మాత్రం చాలా వేరు.
మూర్ఖురాలు ఇచ్చే ఆహ్వానాన్ని తీసుకోకండి
7. సామెతలు 9:13-18 ప్రకారం, మూర్ఖురాలు ఇంటికి వెళ్తే ఏం అవుతుంది? (చిత్రం కూడా చూడండి.)
7 “మూర్ఖురాలు” ఇచ్చిన ఆహ్వానాన్ని ఒకసారి పరిశీలించండి. (సామెతలు 9:13-18 చదవండి.) ఆమె సిగ్గులేకుండా వివేచన లేనివాళ్లను, తన ఇంటికి వచ్చి భోజనాన్ని ఆస్వాదించమని ఆహ్వానిస్తుంది. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? ‘ఆమె ఇల్లు చనిపోయినవాళ్లతో నిండివుంది’. బహుశా, సామెతలు పుస్తకంలో ఉన్న ముందటి అధ్యాయాల్లో కూడా ఇలాంటి ఒక పోలిక గురించే మీరు చదివుంటారు. అక్కడ “దిగజారిన . . . అనైతిక స్త్రీ” గురించి హెచ్చరిస్తుంది. “ఆమె ఇంటికి వెళ్లడం మరణం దగ్గరికి వెళ్లడమే” అని ఉంది. (సామె. 2:11-19) సామెతలు 5:3-10 వచనాల్లో ఇంకో “దిగజారిన” స్త్రీ గురించి చూస్తాం. “ఆమె పాదాలు మరణానికి దారితీస్తాయి” అనే హెచ్చరిక ఉంది.
8. మనకు ఏ ఆహ్వానం రావచ్చు?
8 “మూర్ఖురాలు” ఇచ్చే ఆహ్వానాన్ని అందుకున్నవాళ్లు, దాన్ని అంగీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. మనకు కూడా అలాంటి పరిస్థితే రావచ్చు. మీడియా అలాగే ఇంటర్నెట్ ద్వారా అశ్లీల చిత్రాలు చూడమని లేదా లైంగిక పాపం చేయమని ఆహ్వానం వచ్చినప్పుడు, మనం దేన్ని ఎంచుకుంటాం?
9-10. లైంగిక అనైతిక పనులకు దూరంగా ఉండడానికి కొన్ని కారణాలు ఏంటి?
9 లైంగిక అనైతిక పనుల్ని చేయకపోవడానికి మనకు మంచి కారణాలే ఉన్నాయి. “మూర్ఖురాలు … దొంగిలించిన నీళ్లు తీపి” అని చెప్తుంది. ఇంతకీ, “దొంగిలించిన నీళ్లు” అంటే ఏంటి? భార్యాభర్తల మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని, సొంత బావిలో ఊరే నీళ్లతో బైబిలు పోలుస్తుంది. (సామె. 5:15-18) అంటే, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మాత్రమే లైంగిక సంబంధాన్ని ఆనందించాలి. దీనికీ, ‘దొంగిలించిన నీళ్లకూ’ ఎంత తేడానో కదా! “దొంగిలించిన నీళ్లు” అనైతికమైన లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది. అలాంటి పనులు సాధారణంగా రహస్యంగా జరుగుతాయి. అందరి కళ్లు కప్పి దొంగలా అలాంటి పనులు చేసేవాళ్లకు ఆ నీళ్లు ఇంకా తియ్యగా అనిపించవచ్చు. అవి చేసేవాళ్లు, మేము చేసే పనులు ఎవరికీ తెలీదని అనుకుంటారు. కానీ అది వాళ్లను వాళ్లు మోసం చేసుకున్నట్టే! ఎందుకంటే, యెహోవాకు అన్నీ తేటతెల్లంగా కనిపిస్తాయి. కాబట్టి, అందులో “తీపి” ఏమీ లేదు. యెహోవా ఆమోదాన్ని కోల్పోవడం కంటే చేదు ఇంకేమైనా ఉంటుందా? (1 కొరిం. 6:9, 10) అయితే, అలాంటి పనులు చేయడంవల్ల ఇంకా ఎలాంటి చేదు మిగులుతుంది?
10 లైంగిక పాపం చేయడం వల్ల తల ఎత్తుకోలేని పరిస్థితి రావచ్చు, మనమీద మనకే అసహ్యం కలగవచ్చు, పెళ్లికాకముందే గర్భం రావచ్చు, కుటుంబాలు చీలిపోవచ్చు. అందుకే మూర్ఖురాలు “ఇంటిని,” ఆమె వంటని వద్దనుకోవడమే తెలివైన పని. అంతేకాదు లైంగిక పాపం చేసేవాళ్లు ఆధ్యాత్మికంగా చనిపోవడమే కాదు, ఎన్నో రోగాలపాలై నిజంగా కూడా చనిపోతారు. (సామె. 7:23, 26) సామెతలు 9వ అధ్యాయం, 18వ వచనం ఈ మాటలతో ముగుస్తుంది: ‘ఆమె అతిథులు సమాధి లోతుల్లో ఉన్నారు.’ మరి, చాలామంది ఎందుకు తెలిసితెలిసి ఆమె గడప తొక్కుతున్నారు?—సామె. 9:13-18.
11. అశ్లీల చిత్రాలు చూడడం ఎందుకు చాలా ప్రమాదకరం?
11 దానికి ఒక కారణం ఏంటంటే అశ్లీల చిత్రాలు చూడడం. అశ్లీల చిత్రాలు చూడడంవల్ల ఎలాంటి ప్రమాదం లేదని కొంతమంది అనుకుంటారు. కానీ అవి చూడడం చాలా ప్రమాదకరం. అవి మనల్ని దిగజారుస్తాయి, వాటికి బానిసను చేసుకుంటాయి. ఆ అశ్లీల చిత్రాలు మన మెదడులో గూడు కట్టుకుని ఉంటాయి, వాటిని అంత ఈజీగా మర్చిపోలేం. అంతేకాదు, అశ్లీల చిత్రాలు తప్పుడు కోరికల్ని అణిచివేయవు; వాటిని ఇంకా ఎక్కువ రగిలిస్తాయి. (కొలొ. 3:5; యాకో. 1:14, 15) అవును, అశ్లీల చిత్రాలు చూసే చాలామంది అనైతిక పనులు చేస్తారు.
12. లైంగిక కోరికల్ని రేకెత్తించే చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉన్నామని మనం ఎలా చూపిస్తాం?
12 క్రైస్తవులుగా మనకు అశ్లీల చిత్రాలు కంటపడితే ఏం చేయాలి? వెంటనే తల తిప్పేసుకోవాలి. అలా చేయాలంటే, యెహోవాతో మనకున్న సంబంధం చాలా విలువైనదని మనం గుర్తు తెచ్చుకోవాలి. అయితే, మనం చూసేవి అశ్లీల చిత్రాలు కాకపోయినా అవి మనలో లైంగిక కోరికల్ని రేపుతుంటే, వాటిని కూడా చూడకపోవడం మంచిది. ఎందుకు? ఎందుకంటే, మనం హృదయంలో కూడా లైంగిక పాపం చేయాలని అనుకోం. (మత్త. 5:28, 29) థాయ్‌లాండ్‌లో ఉంటున్న డేవిడ్ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “నేను చూసేవి అశ్లీల చిత్రాలు కాకపోయినా, ఇవి చూస్తే యెహోవా ఇష్టపడతాడా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అలా నేను తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగాను.”
13. మనం తెలివిగా నడుచుకోవాలంటే ఏం చేయాలి?
13 దేవున్ని బాధపెడతామేమో అనే సరైన భయం పెంచుకుంటే తెలివిగా నడుచుకుంటాం. “యెహోవా మీదుండే భయమే తెలివికి ఆరంభం.” (సామె. 9:10) ఈ విషయమే, సామెతలు 9వ అధ్యాయం మొదట్లో ఉంది. అక్కడ, ‘నిజమైన తెలివిని’ సూచించే ఇంకో స్త్రీ గురించి చూస్తాం.
“తెలివిగల” స్త్రీ ఇచ్చే ఆహ్వానాన్ని తీసుకోండి
14. సామెతలు 9:1-6 లో ఏ ఆహ్వానం ఉంది?
14 సామెతలు 9:1-6 చదవండి. ఈ లేఖనాల్లో మనం ఒక ఆహ్వానం గురించి చదువుతాం. అది నిజమైన తెలివికి మూలమైన యెహోవా నుండి వస్తుంది. (సామె. 2:6; రోమా. 16:27) ఆ లేఖనాల్లో, ఏడు స్తంభాలు ఉన్న ఒక పెద్ద ఇంటి గురించిన ఉదాహరణ ఉంది. దాన్నిబట్టి యెహోవాకు ఎంత పెద్ద మనసు ఉందంటే, ఎవరైతే తమ జీవితంలో ఆయన ఇచ్చే తెలివిని పాటించాలని కోరుకుంటున్నారో వాళ్లందర్నీ ఆ ఇంటికి ఆహ్వానిస్తున్నాడు.
15. మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?
15 యెహోవాకు చాలా పెద్ద మనసు ఉంది. ఆయన ఏది ఇచ్చినా పొంగిపొర్లిపోయేలా ఇస్తాడు. ఈ లక్షణాలే సామెతలు 9వ అధ్యాయంలో ‘నిజమైన తెలివికి’ సూచనగా ఉన్న స్త్రీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అక్కడ ఆ స్త్రీ మాంసాన్ని, ద్రాక్షారసాన్ని సిద్ధం చేసి, భోజన ఏర్పాట్లన్నీ చేసింది. (సామె. 9:2) ఆ తర్వాత 4, 5 వచనాలు చెప్తున్నట్లు, “వివేచన లేనివాళ్లతో ఆమె ఇలా చెప్పింది: ‘రండి, నేను సిద్ధం చేసిన రొట్టె తినండి.’” మనం ఎందుకు ఆమె ఇంటికి వెళ్లి ఆ భోజనం తినాలి? ఎందుకంటే, యెహోవా తన పిల్లలందరూ తెలివిగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల నుండి పాఠాలు నేర్చుకోవాలని గానీ, తప్పుచేసి బాధపడుతూ ఉండాలని గానీ ఆయన కోరుకోవట్లేదు. అందుకే, “ఆయన తన ఖజానాలో నుండి నిజాయితీపరులకు ఆచరణాత్మక తెలివిని దయచేస్తాడు.” (సామె. 2:7, అధస్సూచి) మనకు యెహోవా మీద సరైన భయం ఉంటే, ఆయన్ని సంతోషపెట్టాలని అనుకుంటాం. కాబట్టి ఆయన ఇచ్చే తెలివైన సలహాల్ని విని, వాటిని సంతోషంగా పాటిస్తాం.—యాకో. 1:25.
16. దేవుని మీద భయం ఉండడంవల్ల ఆలెన్ ఏం చేశాడు, దాని ఫలితం ఏంటి?
16 దేవుని మీద భయం ఉండడంవల్ల ఆలెన్ అనే బ్రదర్ ఎలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడో చూడండి. ఆయన ఒక సంఘపెద్ద అలాగే స్కూలు టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “నాతోపాటు పనిచేసేవాళ్లు, అవగాహన కోసమే అశ్లీల చిత్రాలు చూస్తామని చెప్పారు.” కానీ వాళ్ల మాయ మాటలకు ఆలెన్ పడిపోలేదు. ఆయన ఇలా అన్నాడు: “దేవుని మీద భయం ఉండడంవల్ల, నేను వాటిని అస్సలు చూడనని ఖరాకండిగా చెప్పేశాను. నేను అలా ఎందుకు చూడనో కూడా వాళ్లకు కారణాలు చెప్పాను.” ఆయన, “నిజమైన తెలివి” నుండి వచ్చే సలహాను పాటించాడు, ‘అవగాహనా మార్గంలో ముందుకు సాగాడు.’ (సామె. 9:6) ఆలెన్ చేసిన పని కొంతమంది టీచర్లకు నచ్చి ఇప్పుడు బైబిలు స్టడీ తీసుకుంటున్నారు, క్రమంగా మీటింగ్స్‌కి వస్తున్నారు.
17-18. “నిజమైన తెలివి” ఇచ్చే ఆహ్వానాన్ని తీసుకున్నవాళ్లు ఎలాంటి దీవెనలు పొందుతున్నారు? వాళ్లు దేనికోసం ఎదురుచూడవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
17 మన భవిష్యత్తు ఎలా సుఖ సంతోషాలతో నిండివుండాలో చెప్పడానికి, యెహోవా ఇద్దరు స్త్రీల ఉదాహరణను ఉపయోగించాడు. పెద్దగా అరుస్తున్న “మూర్ఖురాలు” ఇచ్చే ఆహ్వానాన్ని తీసుకున్నవాళ్లు, అనైతిక విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. నిజానికి వాళ్లు క్షణికానందం కోసం భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. వాళ్లు చేసే పనులు, వాళ్లను ‘సమాధి లోతుల్లోకి’ నెట్టేస్తున్నాయి.—సామె. 9:13, 17, 18.
18 “నిజమైన తెలివి” ఇచ్చే ఆహ్వానాన్ని తీసుకున్నవాళ్ల భవిష్యత్తు చాలా వేరుగా ఉంటుంది. వాళ్లు రుచికరమైన, పసందైన విందును ఆస్వాదిస్తూ యెహోవాకు దగ్గరగా ఉంటారు. (యెష. 65:13) యెషయా ప్రవక్త ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మంచి ఆహారాన్ని తినండి, అప్పుడు మీరు నిజంగా పుష్టికరమైన వాటిని తిని ఎంతో సంతోషిస్తారు.” (యెష. 55:1, 2) మనం యెహోవా ప్రేమించే వాటిని ప్రేమిస్తూ, అసహ్యించుకునే వాటిని అసహ్యించుకోవడం నేర్చుకుంటున్నాం. (కీర్త. 97:10) అంతేకాదు, “నిజమైన తెలివి” నుండి ప్రయోజనం పొందమని వేరేవాళ్లను కూడా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మనం ఒక విధంగా, “ఎత్తైన స్థలాల్లో” నిలబడి చాటించే సేవకుల్లా ఇలా చెప్తున్నాం: “అనుభవంలేని వాళ్లంతా ఇక్కడికి రావాలి.” ఆ ఆహ్వానాన్ని తీసుకుని స్పందించే వాళ్లకు అలాగే మనకు, ఇప్పుడే కాదు ఎప్పటికీ ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు, “అవగాహనా మార్గంలో ముందుకు” సాగుతుండగా శాశ్వతకాలం జీవించే అవకాశం దొరుకుతుంది.—సామె. 9:3, 4, 6.
19. ప్రసంగి 12:13, 14 ప్రకారం, మనం ఏం చేయడానికి కదిలించబడతాం? (“ దేవుని మీద భయం మనకు మంచి చేస్తుంది” అనే బాక్స్ చూడండి.)
19 ప్రసంగి 12:13, 14 చదవండి. రోజురోజుకు దిగజారిపోతున్న ఈ చివరిరోజుల్లో, మన హృదయాన్ని కాపాడుకోవడానికి మనం నైతికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండడానికి దేవుని మీదున్న భయం సహాయం చేస్తుంది. అంతేకాదు ‘నిజమైన తెలివిని’ తీసుకొని, ప్రయోజనం పొందమని వీలైనంత ఎక్కువమందిని ఆహ్వానించేలా దేవుని మీదున్న సరైన భయం మనల్ని కదిలిస్తుంది.
పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి
a మనందరం దేవుని మీద సరైన భయాన్ని పెంచుకోవాలి అనుకుంటాం. ఆ భయం మన హృదయానికి ఒక కంచె వేస్తుంది. అలాగే లైంగిక పాపం చేయకుండా, అశ్లీల చిత్రాల జోలికి వెళ్లకుండా ఉంటాం. ఈ ఆర్టికల్‌లో సామెతలు 9వ అధ్యాయాన్ని పరిశీలిస్తాం. దాంట్లో ఇద్దరు సూచనార్థక స్త్రీల గురించి ఉంది. ఒకరేమో తెలివికి, ఇంకొకరేమో మూర్ఖత్వానికి సూచనగా ఉన్నారు. ఈ అధ్యాయాన్ని పరిశీలించడం వల్ల ఇప్పుడే కాదు, కలకాలం ఉండే ప్రయోజనాలు పొందుతాం.
b కొన్ని అసలు పేర్లు కావు.