కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 25

పెద్దలారా—గిద్యోనులా ఉండండి

పెద్దలారా—గిద్యోనులా ఉండండి

“గిద్యోను, . . . గురించి చెప్పుకుంటూపోతే సమయం చాలదు.”హెబ్రీ. 11:32.

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

ఈ ఆర్టికల్‌లో . . . a

1. పెద్దలకు ఏ బాధ్యత ఉందని, 1 పేతురు 5:2 చెప్తుంది?

 తను అపురూపంగా చూసుకునే గొర్రెల్ని యెహోవా సంఘపెద్దల చేతుల్లో పెట్టాడు. బ్రదర్స్‌, సిస్టర్స్‌కి సేవచేసే ఆ అవకాశం తమకు ఇచ్చినందుకు పెద్దలు యెహోవాకు ఎంతో కృతజ్ఞతతో ఉంటారు. మనల్ని ‘నిజంగా సంరక్షించే కాపరులుగా’ ఉండడానికి వాళ్లు చాలా కష్టపడి పని చేస్తారు. (యిర్మీ. 23:4; 1 పేతురు 5:2 చదవండి.) అలాంటి వాళ్లు సంఘంలో ఉన్నందుకు మనం ఎంత సంతోషిస్తామో కదా!

2. కొంతమంది సంఘపెద్దలకు ఎలాంటి సవాళ్లు ఎదురవ్వవచ్చు?

2 సంఘపెద్దలు తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదురవ్వవచ్చు. నిజమే, సంఘాన్ని చూసుకోవడం చిన్న విషయం కాదు, దానికోసం చాలా కష్టపడాలి. అమెరికాలో ఉంటున్న, టోని అనే సంఘపెద్ద తను ఏ పనులు చేయగలడో, ఏ పనులు చేయలేడో అర్థం చేసుకోవాల్సి వచ్చేది. ఆయన ఇలా చెప్తున్నాడు: “కోవిడ్‌ మొదలైన కొత్తలో మీటింగ్స్‌ని, ప్రీచింగ్‌ని ఏర్పాటు చేయడానికి తలకుమించి పనులు పెట్టుకున్నాను. నేను ఎంత చేసినా తరగని పని ఉండేది. చివరికి బైబిలు చదవడానికి, వ్యక్తిగత అధ్యయనం చేయడానికి, ప్రార్థన చేయడానికి సమయమే ఉండేది కాదు.” కొసోవోలో ఉంటున్న, ఈలీర్‌ అనే సంఘపెద్దకు ఇంకో రకమైన సవాలు వచ్చింది. యుద్ధం జరిగే ప్రాంతంలో ఉన్నప్పుడు, సంస్థ ఇచ్చిన నిర్దేశానికి లోబడడం ఆయనకు కష్టంగా అనిపించింది. ఆయనిలా చెప్తున్నాడు: “ప్రమాదకరమైన ప్రాంతంలో ఉన్న బ్రదర్స్‌, సిస్టర్స్‌కి సహాయం చేయడానికి బ్రాంచి ఆఫీస్‌ నన్ను నియమించింది. అప్పుడు, నా గుండె జారినంత పనైంది. బ్రదర్స్‌ ఇచ్చిన నిర్దేశం సరైనది కాదని అనిపించింది.” ఆసియాలో మిషనరీగా సేవచేస్తున్న టిమ్‌ అనే బ్రదర్‌, ప్రతీరోజు ఆయన చేయాల్సిన పనులతో సతమతమయ్యేవాడు. ఆయన ఇలా చెప్తున్నాడు: “కొన్నిసార్లు బ్రదర్స్‌, సిస్టర్స్‌కి సహాయం చేయడానికి నా దగ్గర రవ్వంత ఓపిక కూడా ఉండేదికాదు.” అయితే, ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న సంఘపెద్దలకు ఏది సహాయం చేస్తుంది?

3. న్యాయాధిపతైన గిద్యోను నుండి మనందరం ఏం నేర్చుకోవచ్చు?

3 సంఘపెద్దలు న్యాయాధిపతైన గిద్యోను నుండి ఎంతో నేర్చుకోవచ్చు. (హెబ్రీ. 6:12; 11:32) ఆయన దేవుని ప్రజల్ని రక్షించాడు, సంరక్షించాడు. (న్యాయా. 2:16; 1 దిన. 17:6) అల్లకల్లోలంగా ఉన్న ఈ లోకంలో, తన ప్రజల్ని గిద్యోనులా చూసుకోవడానికి దేవుడు సంఘపెద్దల్ని నియమించాడు. (అపొ. 20:28; 2 తిమో. 3:1) గిద్యోను తన నియామకాన్ని చేస్తున్నప్పుడు చూపించిన అణకువ, వినయం, విధేయత, ఓర్పు నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మనం సంఘపెద్దలుగా సేవ చేస్తున్నా, చేయకపోయినా పెద్దల మీద కృతజ్ఞతతో మన హృదయాలు ఉప్పొంగాలి. వాళ్లు సంఘాన్ని చూసుకోవడానికి కష్టపడి పని చేస్తున్నప్పుడు మనవంతు చేయూతను మనం అందించాలి.—హెబ్రీ. 13:17.

మీ అణకువకు, వినయానికి పరీక్ష

4. గిద్యోను అణకువకు, వినయానికి మారుపేరని ఎలా చెప్పవచ్చు?

4 గిద్యోను అణకువకు, వినయానికి మారుపేరు. b తన ప్రజల్ని కండబలం ఉన్న మిద్యానీయుల నుండి రక్షించడానికి యెహోవా గిద్యోనును ఎంచుకున్నాడు. ఆ విషయం దేవదూత గిద్యోనుకు చెప్పినప్పుడు, ఆయన ఇలా అన్నాడు: “నా కుటుంబం మనష్షే గోత్రంలో అన్నిటికన్నా తక్కువది, నేను నా తండ్రి ఇంటి వాళ్లందరిలో ఏమాత్రం ప్రాముఖ్యత లేనివాణ్ణి.” ఎంత వినయమో కదా! (న్యాయా. 6:15) ఇచ్చిన నియామకాన్ని చేసే అర్హత తనకు లేదని గిద్యోను అనుకున్నాడు. కానీ యెహోవా ఇంకోలా ఆలోచించాడు. యెహోవా సహాయంతో గిద్యోను తన నియామకాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు.

5. సంఘపెద్దల అణకువకు, వినయానికి ఎలాంటి పరీక్ష ఎదురవ్వవచ్చు?

5 వాళ్లు చేసే ప్రతీ పనిలో అణకువను, వినయాన్ని చూపించడానికి సంఘపెద్దలు శతవిధాలా ప్రయత్నిస్తారు. (మీకా 6:8; అపొ. 20:18, 19) తమకు ఉన్న సామర్థ్యాన్నిబట్టి లేదా సాధించిన వాటినిబట్టి గొప్పలు చెప్పుకోరు. అలాగని వాళ్లు ఏదైనా పొరపాట్లు చేస్తే, చేతకానివాళ్లం అని అనుకోరు. అయినా, సంఘపెద్దలకు అణకువ, వినయానికి సంబంధించిన పరీక్షలు కూడా ఎదురౌతాయి. ఉదాహరణకు, ఒక సంఘపెద్ద చాలా నియామకాలు చేస్తానని ఒప్పుకుని అవి చేయడానికి కిందామీదా పడుతుండవచ్చు. లేదా కొన్ని నియామకాలు చేస్తున్నప్పుడు కొంతమంది తప్పుపట్టవచ్చు, కొంతమంది మెచ్చుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, సంఘపెద్దలు గిద్యోను నుండి ఏం నేర్చుకోవచ్చు?

గిద్యోనులా అణకువ ఉన్న సంఘపెద్ద, కార్ట్‌ని సిద్ధం చేయడం లాంటి పనుల్లో వేరేవాళ్ల సహాయం అడుగుతున్నాడు (6వ పేరా చూడండి)

6. అణకువ చూపించే విషయంలో గిద్యోను నుండి సంఘపెద్దలు ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

6 సహాయం అడగండి. ఒక వ్యక్తికి అణకువ ఉంటే అతను ఏం చేయగలడో, ఏం చేయలేడో తెలుసుకుంటాడు. గిద్యోనుకు అణకువ ఉంది కాబట్టి, వేరేవాళ్ల సహాయం అడిగాడు. (న్యాయా. 6:27, 35; 7:24) అణకువ ఉన్న సంఘపెద్దలు కూడా అదే చేస్తారు. పై పేరాల్లో చెప్పుకున్న టోని అనే బ్రదర్‌ ఇలా అంటున్నాడు: “నేను పుట్టిపెరిగిన పరిస్థితుల్ని బట్టి, నేను చేయగలిగే వాటికన్నా ఎక్కువ పనులు ఒప్పుకోవడం నాకు అలవాటైంది. కానీ, కుటుంబ ఆరాధనలో అణకువ గురించి చర్చించుకున్నాం. నేను అణకువ చూపిస్తున్నానో లేదో చెప్పమని నా భార్యని అడిగాను. అలాగే jw.orgలో ఉన్న యేసులా ఇతరులకు శిక్షణ ఇవ్వండి, వాళ్లను నమ్మండి, అధికారం ఇవ్వండి అనే వీడియోను చూశాను.” ఆ తర్వాత నుండి టోని, సంఘ పనుల్లో వేరేవాళ్ల సహాయం అడగడం మొదలుపెట్టాడు. దాని ఫలితం ఏంటి? ఆయనే ఇలా చెప్తున్నాడు: “వేరేవాళ్ల సహాయం అడగడం వల్ల, సంఘ పనులు ముందుకు వెళ్తున్నాయి అలాగే యెహోవాతో నాకున్న స్నేహాన్ని బలపర్చుకోవడానికి నాకు ఎక్కువ టైం మిగులుతుంది.”

7. ఎవరైనా తప్పుపట్టినప్పుడు, సంఘపెద్దలు గిద్యోనును ఎలా అనుకరించవచ్చు? (యాకోబు 3:13)

7 తప్పుపట్టినప్పుడు కోప్పడకండి. ఎవరైనా తప్పుపడితే పెద్దలకు అదొక పరీక్షలా ఉంటుంది. అయితే, ఈ విషయంలో కూడా వాళ్లు గిద్యోనును అనుకరించవచ్చు. ఎఫ్రాయిమువాళ్లు గిద్యోనును తప్పుపట్టినప్పుడు, ఆయన తన పరిమితుల్ని అర్థంచేసుకుని వాళ్లమీద కోప్పడలేదు. (న్యాయా. 8:1-3) బదులుగా వాళ్లు చెప్తున్నప్పుడు విని, వాళ్లతో దయగా మాట్లాడడం ద్వారా గిద్యోను వినయం ఉందని చూపించాడు. అలా, కోపంతో రగిలిపోతున్న వాళ్లను శాంతపర్చాడు. అదేవిధంగా, వినయం ఉన్న సంఘపెద్దలు గిద్యోనును అనుకరిస్తూ ఎవరైనా తమను తప్పుపట్టినప్పుడు శ్రద్ధగా విని, దయగా మాట్లాడతారు. (యాకోబు 3:13 చదవండి.) ఫలితంగా, సంఘమంతా శాంతిగా ఉంటుంది.

8. ఎవరైనా పొగడ్తలతో ముంచెత్తినప్పుడు సంఘపెద్దలు ఏం చేయాలి? ఒక ఉదాహరణ చెప్పండి.

8 ఘనతంతా యెహోవాకు ఇవ్వండి. మిద్యానీయులపై గెలిచిన తర్వాత ప్రజలు గిద్యోనును పొగడ్తలతో ముంచెత్తారు. కానీ, ఆయన ఆ ఘనతంతా యెహోవాకు ఇచ్చాడు. (న్యాయా. 8:22, 23) సంఘపెద్దలు గిద్యోనును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? వాళ్లు సాధించిన వాటికి యెహోవాకు ఘనత ఇవ్వడం ద్వారా గిద్యోనును అనుకరించవచ్చు. (1 కొరిం. 4:6, 7) ఉదాహరణకు, ఒక సంఘపెద్ద మంచి ప్రసంగం ఇచ్చినప్పుడు ప్రజల దృష్టి దేవుని వాక్యం వైపు, సంస్థ ఇస్తున్న శిక్షణ వైపు మళ్లేలా చూసుకోవచ్చు. ఇతరుల దృష్టి అనవసరంగా తమ మీదికి మళ్లుతుందా అని సంఘపెద్దలు ఎప్పటికప్పుడు ఆలోచించుకోవడం మంచిది. తిమోతి అనే సంఘపెద్ద ఉదాహరణను గమనించండి. ఆయన సంఘపెద్దగా నియమించబడిన కొత్తలో బహిరంగ ప్రసంగాల్ని ఇవ్వడాన్ని బాగా ఇష్టపడ్డాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను టాక్‌ ఇచ్చేటప్పుడు పెద్ద ఉపోద్ఘాతాల్ని, కష్టమైన ఉదాహరణల్ని ఉపయోగించేవాడిని. దానివల్ల ప్రేక్షకులు నన్ను పొగడ్తలతో ముంచెత్తేవాళ్లు. కానీ వాళ్ల దృష్టంతా బైబిలు మీద, యెహోవా మీద కాకుండా నావైపు మళ్లేది.” కొంతకాలానికి, తాను టాక్స్‌ ఇచ్చే విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరముందని తిమోతి గుర్తించాడు. (సామె. 27:21) దాని ఫలితం ఏంటి? ఆయన ఇలా అంటున్నాడు: “ఇప్పుడు బ్రదర్స్‌ సిస్టర్స్‌ వచ్చి, వాళ్లకు ఎదురైన సమస్యను లేదా పరీక్షను తట్టుకోవడానికి నా టాక్‌ సహాయం చేసిందని, వాళ్లను యెహోవాకు ఇంకా దగ్గర చేసిందని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్లు నన్ను మెచ్చుకున్న దానికంటే, ఇప్పుడు వాళ్లు చెప్తున్న ఆ మాటలు నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నాయి.”

మీ విధేయతకు లేదా ధైర్యానికి పరీక్ష

గిద్యోను యెహోవా చెప్పింది చెప్పినట్టు చేస్తూ తన సైన్యాన్ని తగ్గించాడు. చురుకైన 300 మంది పురుషుల్ని ఆయన ఎంచుకున్నాడు (9వ పేరా చూడండి)

9. గిద్యోను విధేయతకు, ధైర్యానికి ఎలాంటి పరీక్ష ఎదురైంది? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.)

9 గిద్యోను న్యాయాధిపతిగా నియమించబడిన తర్వాత తన విధేయతకు, ధైర్యానికి ఒక పరీక్ష ఎదురైంది. తన తండ్రికి చెందిన బయలు బలిపీఠాన్ని పడగొట్టే ప్రమాదకరమైన పనిని చేయమని యెహోవా గిద్యోనుకు చెప్పాడు. (న్యాయా. 6:25, 26) ఆ తర్వాత, శత్రు దేశాలతో యుద్ధం చేయడానికి గిద్యోను ఒక పెద్ద సైన్యాన్ని పోగుచేశాడు. కానీ, ఆ సైన్యంలో ఉన్నవాళ్ల సంఖ్యను తగ్గించుకుంటూ వెళ్లమని యెహోవా చెప్పాడు. (న్యాయా. 7:2-7) చివరికి, కటిక చీకటిలో శత్రువుల పైన దాడి చేయమని ఆయన చెప్పాడు.—న్యాయా. 7:9-11.

10. పెద్దల విధేయతకు ఎలాంటి పరీక్ష ఎదురవ్వవచ్చు?

10 సంఘపెద్దలు “లోబడడానికి సిద్ధంగా” ఉండాలి. (యాకో. 3:17) విధేయత చూపించే సంఘపెద్దలు లేఖనాలు చెప్పేవాటికి, సంస్థ ఇచ్చే నిర్దేశాలకు వెంటనే లోబడతారు. అలా వాళ్లు ఇతరులకు మంచి ఆదర్శాన్ని ఉంచుతారు. అయినా, వాళ్ల విధేయతకు పరీక్ష ఎదురవ్వవచ్చు. ఉదాహరణకు, సంస్థ ఎప్పటికప్పుడు ఇచ్చే నిర్దేశాల్ని పాటించడం వాళ్లకు కష్టమవ్వవచ్చు. కొన్ని సందర్భాల్లో సంస్థ ఇచ్చే నిర్దేశం పనికిరాదని లేదా అంత తెలివైనది కాదని అనిపించవచ్చు. లేదా ఇచ్చిన నియామకాన్ని చేస్తున్నప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. మరి ఇలాంటి సందర్భాల్లో, సంఘపెద్దలు గిద్యోనులా విధేయత ఎలా చూపించవచ్చు?

11. నిర్దేశాలకు లోబడుతున్నారని సంఘపెద్దలు ఎలా చూపించవచ్చు?

11 నిర్దేశాల్ని శ్రద్ధగా వినండి, పాటించండి. వాళ్ల నాన్న బలిపీఠాన్ని ఎలా పడగొట్టాలో, యెహోవా కోసం కొత్త బలిపీఠాన్ని ఎక్కడ కట్టాలో, దాని మీద ఏ జంతువును బలి ఇవ్వాలో యెహోవా గిద్యోనుకు చెప్పాడు. గిద్యోను రెండో ఆలోచన లేకుండా యెహోవా చెప్పింది చెప్పినట్టు చేశాడు. నేడు కూడా సంఘపెద్దలకు ఉత్తరాల ద్వారా, ప్రకటనల ద్వారా, ఇంకా వేరేవాటి ద్వారా సంస్థ ఎన్నో నిర్దేశాల్ని ఇస్తుంది. అవి యెహోవాతో మన స్నేహాన్ని కాపాడుకోవడానికి, మన బాగోగులు చూసుకోవడానికి సహాయం చేస్తాయి. వాటన్నిటిని నమ్మకంగా పాటించే సంఘపెద్దల్ని మనం ఇష్టపడతాం. అలా పాటించడం వల్ల సంఘం కలకలలాడుతుంది.—కీర్త. 119:112.

12. సంస్థ ఇచ్చిన నిర్దేశంలో ఏవైనా మార్పులు వచ్చినప్పుడు, దాన్ని పాటించడానికి హెబ్రీయులు 13:17 పెద్దలకు ఎలా సహాయం చేస్తుంది?

12 అవసరమైన మార్పులు చేసుకోవడానికి ముందుండి. గిద్యోను తన సైన్యాన్ని 99 కన్నా ఎక్కువ శాతం తగ్గించేయాలని యెహోవా చెప్పాడని గుర్తుచేసుకోండి. (న్యాయా. 7:8) అప్పుడు గిద్యోనుకు ఇలా అనిపించి ఉండవచ్చు: ‘ఈ మార్పు చేయడం నిజంగా అంత అవసరమా? ఇంత తక్కువమందితో కలిసి నేను యుద్ధం ఎలా చేయగలను?’ అయినా, గిద్యోను యెహోవా చెప్పిందే చేశాడు. ఈ రోజుల్లో, పెద్దలు కూడా గిద్యోను చేసినట్టే చేయవచ్చు. సంస్థ ఇచ్చే నిర్దేశాల్లో ఏవైనా మార్పులు వచ్చినప్పుడు, వాళ్లు వాటిని వెంటనే పాటించడానికి ముందుండవచ్చు. (హెబ్రీయులు 13:17 చదవండి.) ఉదాహరణకు రాజ్యమందిరాల్ని, అసెంబ్లీ హాళ్లను కట్టడానికి అవసరమయ్యే ఖర్చుల విషయంలో 2014 లో పరిపాలక సభ ఒక మార్పు తీసుకొచ్చింది. (2 కొరిం. 8:12-14) గతంలో, కట్టడానికి అవసరమయ్యే డబ్బుల్ని సంస్థ లోనుగా ఇచ్చేది, తర్వాత సంఘాలు ఆ డబ్బుల్ని తిరిగి సంస్థకు ఇచ్చేవి. అయితే ఇకనుంచి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విరాళాల్ని ఉపయోగించి అవసరమైన చోట రాజ్యమందిరాల్ని, అసెంబ్లీ హాళ్లను నిర్మించాలని సంస్థ నిర్ణయించింది. అలా స్థానిక సంఘం, చాలా కొద్ది మొత్తంలో డబ్బును విరాళంగా ఇచ్చినాసరే ఆ నిర్మాణ పని ముందుకెళ్తుంది. ఈ మార్పు గురించి తెలుసుకున్నప్పుడు, జోస్‌ అనే సంఘపెద్దకు ఏమనిపించిందో ఇలా చెప్తున్నాడు: ‘ఇలాగైతే ఒక్క రాజ్యమందిరాన్ని కూడా కట్టలేము. సంస్థ ఇచ్చిన నిర్దేశం అస్సలు పనికిరాదు.’ మరి, సంస్థ ఇచ్చిన నిర్దేశానికి లోబడడానికి జోస్‌కి ఏం సహాయం చేసింది? ఆయన ఇలా అంటున్నాడు: “యెహోవా మీద నమ్మకం ఉంచాలని సామెతలు 3:5, 6 లోని మాటలు నన్ను తట్టిలేపాయి. సంస్థ మార్పు చేసిన తర్వాత వచ్చిన ఫలితాల్ని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను! మేము చాలా రాజ్యమందిరాల్ని కట్టడమే కాదు, వేర్వేరు విధానాల్లో విరాళం ఇవ్వడం నేర్చుకున్నాం. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల అవసరాలు తీరుతున్నాయి.”

మన పనిపై నిషేధం ఉన్నాసరే ప్రకటించడానికి మనం ధైర్యంగా ముందడుగు వేస్తాం (13వ పేరా చూడండి)

13. (ఎ) గిద్యోను ఎలా ధైర్యంగా అడుగేశాడు? (బి) పెద్దలు గిద్యోనులా ఎలా ఉండవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

13 యెహోవా చెప్పింది చేయడానికి ధైర్యంగా అడుగేయండి. యెహోవా చెప్పింది చేయడానికి గిద్యోనుకు భయమేసినా, తన ప్రాణం ప్రమాదంలో పడుతుందని తెలిసినా యెహోవా మాట విన్నాడు. (న్యాయా. 9:17) అయితే, యెహోవా తన వెన్నంటే ఉంటాడని భరోసా ఇచ్చిన తర్వాత, గిద్యోను దేవుని ప్రజల్ని కాపాడే పనిలో ధైర్యంగా అడుగేశాడు. మన పనిపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో ఉంటున్న పెద్దలు కూడా గిద్యోను చేసినట్టే చేస్తారు. మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి ఏర్పాట్లు చేస్తే అరెస్టు చేస్తారేమో, విచారణ చేస్తారేమో, ఉద్యోగం పోతుందేమో లేదా హింస వస్తుందేమో అనే భయాలు ఉన్నా, ఆ పనుల్ని చేయడానికి వాళ్లు ధైర్యంగా అడుగేస్తారు. c మహాశ్రమ సమయంలో సంస్థ నుండి వేరే నిర్దేశాలు రావచ్చు. ఉదాహరణకు వాటిలో తీర్పు సందేశాన్ని ఎలా ప్రకటించాలో, మాగోగువాడైన గోగు చేసే దాడి నుండి ఎలా తప్పించుకోవాలో ఉండవచ్చు. ప్రమాదం ఎదురౌతుందని తెలిసినా ఆ నిర్దేశాల్ని పాటించడానికి పెద్దలకు ధైర్యం అవసరం.—యెహె. 38:18; ప్రక. 16:21.

మీ ఓర్పుకు పరీక్ష

14. గిద్యోను ఓర్పుకు ఎలా పరీక్ష ఎదురైంది?

14 న్యాయాధిపతిగా గిద్యోనుకు ఉన్న నియామకం చాలా కష్టంతో నిండిన పని. యుద్ధం జరిగిన రాత్రి మిద్యానీయులు పారిపోయారు. అప్పుడు గిద్యోను యెజ్రెయేలు లోయ నుండి యొర్దాను నది వరకు వాళ్లను తరుముతూ వెళ్లాడు. బహుశా ఆ ప్రాంతమంతా గుబురుగా ఉన్న చెట్లతో నిండిపోయి ఉంటుంది. (న్యాయా. 7:22) మరి, యొర్దాను దాకా వెళ్లి గిద్యోను ఆగిపోయాడా? లేదు. అలసిపోయినా సరే, ఆయన అలాగే ఆయనతో ఉన్న 300 మంది ఆ నది దాటి, వాళ్లను తరుముతూ ఉన్నారు. చివరికి మిద్యానీయుల్ని పట్టుకుని, వాళ్లను ఓడించారు.—న్యాయా. 8:4-12.

15. పెద్దల ఓర్పుకు ఎప్పుడు పరీక్ష ఎదురవ్వవచ్చు?

15 పెద్దలు ఇటు తమ కుటుంబాన్ని, అటు సంఘాన్ని చూసుకోవడం వల్ల కొన్నిసార్లు అలసిపోవచ్చు, డీలాపడిపోవచ్చు, నిరాశానిస్పృహల్లో మునిగిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పెద్దలు గిద్యోనును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

సహాయం అవసరమైనవాళ్లను బలపర్చడానికి ప్రేమగల పెద్దలు ముందుంటారు (16-17 పేరాలు చూడండి)

16-17. ఓర్పు చూపించడానికి గిద్యోనుకు ఏం సహాయం చేసింది? పెద్దలు ఏ నమ్మకంతో ఉండవచ్చు? (యెషయా 40:28-31) (చిత్రం కూడా చూడండి.)

16 యెహోవా మీకు బలాన్ని, శక్తిని ఇస్తాడని నమ్మండి. యెహోవా తనకు బలాన్ని ఇస్తాడని గిద్యోను నమ్మాడు. యెహోవా కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. (న్యాయా. 6:14, 34) ఒకసారైతే, ఇద్దరు మిద్యాను రాజులు బహుశా ఒంటెల మీద పారిపోతుంటే గిద్యోను, ఆయన మనుషులు మాత్రం పరుగెత్తుతూ వాళ్లను తరిమారు. (న్యాయా. 8:12, 21) అయినా యెహోవా ఇచ్చిన బలంతో ఇశ్రాయేలీయులు వాళ్లను పట్టుకుని, వాళ్లపై విజయం సాధించారు. పెద్దలు కూడా ‘ఎప్పుడూ సొమ్మసిల్లని, అలసిపోని’ యెహోవా మీద ఆధారపడాలి. అవసరమైనప్పుడల్లా వాళ్లకు యెహోవా బలాన్ని ఇస్తాడు.—యెషయా 40:28-31 చదవండి.

17 ఆసుపత్రి అనుసంధాన కమిటీలో పనిచేస్తున్న మ్యాథ్యూ అనే బ్రదర్‌ ఉదాహరణను గమనించండి. ఓర్పు చూపిస్తూ ముందుకెళ్లడానికి ఆయనకు ఏం సహాయం చేసింది? మ్యాథ్యూ ఇలా అంటున్నాడు: “ఫిలిప్పీయులు 4:13​లో చెప్పినట్టు, యెహోవా ఇచ్చే శక్తిని నేను పొందాను. నాలో రవ్వంత శక్తి కూడా లేదు, ఇక నేను దీన్ని చేయలేను అని అనిపించిన ఎన్నోసార్లు, బ్రదర్స్‌కి సహాయం చేయడానికి కావాల్సినంత శక్తిని ఇవ్వమని యెహోవాను అడిగాను. అలాంటి సమయాల్లో, యెహోవా తన పవిత్రశక్తితో నాలో బలాన్ని నింపాడు. దాంతో ఓర్పు చూపిస్తూ నేను ముందుకెళ్లగలిగాను.” గిద్యోనులా, ఎన్ని అడ్డంకులున్నా వాటన్నిటిని దాటుకుంటూ యెహోవా ప్రజల్ని చూసుకోవడానికి సంఘపెద్దలు బాగా కష్టపడతారు. అయితే, పెద్దలు అణుకువను చూపిస్తూ, ప్రతీసారి వాళ్లు అనుకున్నవన్నీ చేయలేరని గుర్తించాలి. ఏదేమైనా, బలం కోసం యెహోవాకు వాళ్లు పెట్టే మొరను ఆయన వింటాడని, వాళ్లకు కావలసినంత బలాన్ని ఇస్తాడని వాళ్లు నమ్మకంతో ఉండవచ్చు.—కీర్త. 116:1; ఫిలి. 2:13.

18. పెద్దలు గిద్యోను నుండి ఏయే విషయాలు నేర్చుకోవచ్చు?

18 పెద్దలు గిద్యోను నుండి ఎంతో నేర్చుకోవచ్చు. నియామకాల్ని ఒప్పుకునేటప్పుడు, వేరేవాళ్లు తప్పుపట్టినప్పుడు లేదా పొగిడినప్పుడు అణకువను, వినయాన్ని చూపించాలి. ఈ దుష్టలోక అంతం దగ్గరపడుతుండగా వాళ్లు విధేయతను, ధైర్యాన్ని చూపించాలి. అంతేకాదు, ఎన్ని ఎత్తుపల్లాలున్నా యెహోవా వాళ్లకు బలాన్నిస్తాడని నమ్మాలి. కాబట్టి, ఎంతో కష్టపడి పనిచేసే అలాంటి కాపరుల పట్ల మనం కృతజ్ఞతను చూపిస్తాం, వాళ్లను “విలువైనవాళ్లుగా” చూస్తాం.—ఫిలి. 2:29.

పాట 120 క్రీస్తులా సౌమ్యంగా ఉండండి

a ఇశ్రాయేలు దేశం, చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు తన ప్రజల్ని నడిపించడానికి, వాళ్లను కాపాడడానికి యెహోవా గిద్యోనును నియమించాడు. గిద్యోను తనకు అప్పగించిన పనిని దాదాపు 40 సంవత్సరాలపాటు చాలా నమ్మకంగా చేశాడు. అయితే, ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడున్న సంఘపెద్దలు గిద్యోను నుండి ఏం నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

b అణకువ, వినయం ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్న లక్షణాలు. మన గురించి మనం ఎక్కువ అంచనా వేసుకోకుండా, మన పరిమితులు తెలుసుకుని ఉండడమే అణకువ. మనల్ని మనం తగ్గించుకుని ఉండడం వినయం. (ఫిలి. 2:3) సాధారణంగా, ఒక వ్యక్తిలో అణకువ ఉందంటే అతనిలో వినయం కూడా ఉన్నట్టే.