కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 27

మనం యెహోవాకు ఎందుకు భయపడాలి?

మనం యెహోవాకు ఎందుకు భయపడాలి?

“యెహోవాకు భయపడేవాళ్లు ఆయనతో దగ్గరి స్నేహాన్ని అనుభవిస్తారు.”కీర్త. 25:14.

పాట 8 యెహోవా మనకు ఆశ్రయం

ఈ ఆర్టికల్‌లో . . . a

1-2. కీర్తన 25:14 ప్రకారం, యెహోవాతో మనకు దగ్గరి స్నేహం కావాలంటే ఏం చేయాలి?

 ఎవరితోనైనా మంచి స్నేహం కావాలంటే ఏ లక్షణాలు ఉండాలని మీకు అనిపిస్తుంది? మంచి స్నేహితుల మధ్య ప్రేమ ఉండాలని అలాగే వాళ్లు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలని మీకు అనిపించవచ్చు. అయితే, మంచి స్నేహితుల మధ్య భయం అనే లక్షణాన్ని బహుశా మీరు అస్సలు ఊహించలేరు. కానీ ఈ ఆర్టికల్‌ ముఖ్య లేఖనం చెప్తున్నట్టు, యెహోవాతో దగ్గరి స్నేహం కావాలంటే మనం ‘ఆయనకు భయపడాలి.’కీర్తన 25:14 చదవండి.

2 మనం చాలాకాలంగా యెహోవా సేవ చేస్తున్నా, ఆయన పట్ల సరైన భయాన్ని కాపాడుకోవాలి. ఇంతకీ దేవునికి భయపడడం అంటే ఏంటి? యెహోవాకు భయపడడం మనం ఎలా నేర్చుకోవచ్చు? దేవునికి భయపడడం గురించి గృహనిర్వాహకుడైన ఓబద్యా, ప్రధానయాజకుడైన యెహోయాదా, రాజైన యెహోయాషు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

దేవునికి భయపడడం అంటే ఏంటి?

3. భయం మనల్ని ఎలా కాపాడుతుంది? వివరించండి.

3 మనకు ఏదైనా హాని జరుగుతుందని తెలిస్తే మనం భయపడతాం. అలాంటి భయం మంచిదే. ఎందుకంటే, దానివల్ల మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఉదాహరణకు కిందపడిపోతాం అనే భయం ఉంటే, కొండ అంచుల్లో నడవకుండా ఉంటాం. గాయం అవుతుందనే భయం ఉంటే, ప్రమాదకరమైన పరిస్థితులకు దూరంగా ఉంటాం. మనకు ఇష్టమైనవాళ్లతో స్నేహం పాడౌతుందనే భయం ఉంటే, వాళ్లను బాధపెట్టే మాటలు మాట్లాడం లేదా వాళ్లను బాధపెట్టే పనులు చేయం.

4. ప్రజలు యెహోవా గురించి ఎలా అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు?

4 ప్రజలు యెహోవా అంటే గజగజ వణకాలని సాతాను కోరుకుంటున్నాడు. కానీ అలాంటి భయం సరైనదికాదు. యెహోవా క్రూరుడని, కోపిష్ఠి అని, ఆయన్ని సంతోషపెట్టడం అసాధ్యం అని ఎలీఫజు చెప్పినలాంటి మాటల్నే సాతాను ప్రచారం చేస్తున్నాడు. (యోబు 4:18, 19) ఆ మాటల్ని నమ్మి, మనం యెహోవా సేవను ఆపేయాలని అతను కోరుకుంటున్నాడు. కానీ మనం సాతాను మాయమాటల్ని నమ్మకూడదంటే, యెహోవాపట్ల సరైన భయాన్ని, గౌరవాన్ని పెంచుకోవాలి.

5. దేవునికి భయపడడం అంటే ఏంటి?

5 ఒక వ్యక్తికి యెహోవా మీద సరైన భయం ఉంటే ఆయన్ని ప్రేమిస్తాడు, ఆయనతో తన స్నేహాన్ని పాడుచేసే ఏ పనీ చేయకుండా ఉంటాడు. యేసుకు సరిగ్గా అలాంటి ‘దైవభయమే’ ఉంది. (హెబ్రీ. 5:7) ఆయనకు యెహోవా అంటే వణికిపోయే భయం లేదు. (యెష. 11:2, 3) బదులుగా, యెహోవాపట్ల ఆయనకు అపారమైన ప్రేమ ఉంది కాబట్టే, ఆయనకు లోబడాలని కోరుకున్నాడు. (యోహా. 14:21, 31) మనకు కూడా యేసులాగే యెహోవా మీద ప్రగాఢ గౌరవం, భక్తిపూర్వక భయం ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రేమ, తెలివి, న్యాయం, శక్తిగల దేవుడు. అంతేకాదు యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు. అలాగే, ఆయన ఇచ్చే నిర్దేశాలకు మనం లోబడుతున్నామా లేదా అని చూస్తాడు. మనం ఆయన మాట వింటే సంతోషిస్తాడు, మాట వినకపోతే బాధపడతాడు.—కీర్త. 78:41; సామె. 27:11.

యెహోవాకు భయపడడం ఎలా నేర్చుకోవచ్చు?

6. దేవునికి భయపడడం నేర్చుకునే ఒక విధానం ఏంటి? (కీర్తన 34:11)

6 మనకు పుట్టుకతోనే యెహోవా మీద భయం ఉండదు, దాన్ని మనమే పెంచుకోవాలి. (కీర్తన 34:11 చదవండి.) అలా పెంచుకునే ఒక విధానం ఏంటంటే, సృష్టిని గమనించడం. యెహోవా తెలివి, శక్తి, ప్రేమ ‘ఆయన చేసినవాటిలో’ కనిపిస్తున్నాయి. వాటిని మనం ఎంతెక్కువ గమనిస్తే, ఆయన మీద మనకున్న ప్రేమ, గౌరవం అంతెక్కువ పెరుగుతాయి. (రోమా. 1:20) ఆండ్రియాన అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “సృష్టిలో యెహోవా తెలివిని గమనించినప్పుడు అది నన్నెంతో అబ్బురపర్చింది. అలాగే, నాకు ఏది మంచిదో యెహోవాకు బాగా తెలుసని నేను గుర్తించగలిగాను.” అలా ధ్యానించిన తర్వాత ఆమె ఇలా అనగలిగింది: “ప్రాణం ఇచ్చిన యెహోవాకూ, నాకూ మధ్య అడ్డుగోడ ఏర్పడే ఎలాంటి పనీ నేను చేయను.” సృష్టిలో ఉన్న దేనిగురించైనా ఆలోచించడానికి ఈ వారం మీరు కాస్త టైం పెట్టగలరా? అలా చేస్తే యెహోవా మీద ప్రేమ, గౌరవం పెరుగుతాయి.—కీర్త. 111:2, 3.

7. యెహోవా మీద సరైన భయాన్ని పెంచుకోవడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

7 మనం దేవుని మీద భయాన్ని పెంచుకునే ఇంకో విధానం ఏంటంటే, ప్రతీరోజు ప్రార్థించడం. మనం ఎంతెక్కువ ప్రార్థిస్తే, యెహోవా నిజమైన వ్యక్తి అని అంతెక్కువ నమ్ముతాం. ఏదైనా ఒక కష్టాన్ని తట్టుకోవడానికి బలం కోసం యెహోవాను అడిగిన ప్రతీసారి, ఆయనకున్న శక్తి మనకు గుర్తొస్తుంది. తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చినందుకు థ్యాంక్స్‌ చెప్పిన ప్రతీసారి, ఆయనకు మన మీదున్న ప్రేమ గుర్తొస్తుంది. సమస్యను పరిష్కరించుకోవడానికి సహాయం చేయమని యెహోవాను అడిగిన ప్రతీసారి, ఆయనకున్న తెలివి గుర్తొస్తుంది. మనం ఇలా ప్రార్థించినప్పుడు, యెహోవా మీద గౌరవం పెరుగుతుంది. అలాగే, ఆయనతో మన స్నేహాన్ని పాడుచేసే ఎలాంటి పనీ చేయకూడదనే మన నిర్ణయం బలపడుతుంది.

8. దేవుని మీద భయాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?

8 మనం దేవుని మీద భయాన్ని కాపాడుకోవాలంటే, బైబిల్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేస్తున్నప్పుడు దానిలోవున్న మంచి ఉదాహరణల నుండి, చెడ్డ ఉదాహరణల నుండి మనం నేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకోవచ్చు. యెహోవాను నమ్మకంగా సేవించిన ఇద్దరి గురించి, అంటే రాజైన అహాబు ఇంట్లో గృహనిర్వాహకుడిగా పనిచేసిన ఓబద్యా, అలాగే ప్రధానయాజకుడైన యెహోయాదా గురించి ఇప్పుడు మనం చూస్తాం. అంతేకాదు, మొదట్లో యెహోవాను సేవించి, ఆ తర్వాత విడిచిపెట్టేసిన యూదా రాజైన యెహోయాషు గురించి చూస్తాం.

ఓబద్యాలా ధైర్యంగా ఉండండి

9. యెహోవా మీద భయభక్తులు ఉండడం ఓబద్యాకు ఎలా సహాయం చేసింది? (1 రాజులు 18:3, 12)

9 బైబిలు ఓబద్యాను b ఈ మాటలతో పరిచయం చేస్తుంది: “ఓబద్యా యెహోవా పట్ల ఎంతో భయభక్తులు గలవాడు.” (1 రాజులు 18:3, 12 చదవండి.) అలాంటి భయభక్తులు ఉండడం ఓబద్యాకు ఎలా సహాయం చేసింది? ఒకటి, ఆయన నిజాయితీగలవాడిగా, నమ్మకస్థుడిగా ఉండేలా సహాయం చేసింది. అందుకే రాజభవనం మొత్తాన్ని, రాజు ఆయన చేతుల్లో పెట్టాడు. (నెహెమ్యా 7:2 తో పోల్చండి.) రెండు, ఓబద్యా అసాధారణమైన గుండె ధైర్యాన్ని చూపించేలా సహాయం చేసింది. అది ఆయనకు ఎంతో అవసరమైంది. ఎందుకంటే ఆయన, చెడ్డ రాజైన అహాబు పరిపాలనలో జీవించాడు. అహాబు రాజు, “తనకు ముందున్న వాళ్లందరికన్నా యెహోవా దృష్టికి ఘోరంగా ప్రవర్తించాడు.” (1 రాజు. 16:30) అంతేకాదు, అహాబు భార్య యెజెబెలు బయలును ఆరాధించేది. ఆమె యెహోవాను ఎంతగా అసహ్యించుకుందంటే, ఉత్తర రాజ్యంలో సత్యారాధనను తుడిచిపెట్టేయడానికి ప్రయత్నించింది. దానికోసం, చివరికి దేవుని ప్రవక్తల్లో చాలామందిని ఆమె చంపించింది. (1 రాజు. 18:4) ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా, ఓబద్యా యెహోవాను నమ్మకంగా ఆరాధించాడని అనడంలో సందేహమే లేదు!

10. ఓబద్యా అసాధారణ గుండె ధైర్యాన్ని ఎలా చూపించాడు?

10 ఓబద్యా అసాధారణ గుండె ధైర్యాన్ని ఎలా చూపించాడు? దేవుని ప్రవక్తలు కనిపిస్తే చాలు చంపేయాలనే కసితో ఉన్న యెజెబెలు కళ్లు కప్పి, ఓబద్యా 100 మంది ప్రవక్తల్ని “ఒక్కో గుహలో 50 మంది చొప్పున” దాచిపెట్టాడు. గుట్టుచప్పుడు కాకుండా వాళ్లకు “ఆహారం, నీళ్లు అందిస్తూ” వచ్చాడు. (1 రాజు. 18:13, 14) ఒకవేళ పట్టుబడితే, ధైర్యవంతుడైన ఓబద్యా ప్రాణం మీద ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే, యెజెబెలు ఆయన్ని ఖచ్చితంగా చంపేసేది. ఓబద్యా కూడా మనలాంటి మామూలు మనిషే, ఆయనకు చనిపోవాలని ఉండదు. కానీ తన సొంత ప్రాణం కన్నా ఓబద్యా యెహోవాను, ఆయన ఆరాధకుల్ని ఎక్కువ ప్రేమించాడు.

మన పనిపై నిషేధం ఉన్నా, ఒక బ్రదర్‌ తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌కి ధైర్యంగా ప్రచురణలు ఇస్తున్నాడు (11వ పేరా చూడండి) d

11. ప్రస్తుతం యెహోవా సేవకులు ఓబద్యాలా ఎలా ఉన్నారు? (చిత్రం కూడా చూడండి.)

11 ఈరోజుల్లో కూడా చాలామంది యెహోవా సేవకులు మన పనిపై నిషేధం ఉన్న దేశాల్లో ఉంటున్నారు. వాళ్లు అధికారులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూనే, ఓబద్యాలా యెహోవాకు ఇవ్వాల్సింది కూడా ఇస్తున్నారు, అంటే సంపూర్ణ భక్తిని చూపిస్తున్నారు. (మత్త. 22:21) వాళ్లు మనుషులకు కాకుండా యెహోవాకు లోబడుతూ, దేవుని మీద భయాన్ని చూపిస్తున్నారు. (అపొ. 5:29) అదెలాగంటే, వాళ్లు ఆపకుండా మంచివార్తను ప్రకటిస్తున్నారు, రహస్యంగా మీటింగ్స్‌ జరుపుకుంటున్నారు. (మత్త. 10:16, 28) అంతేకాదు తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌కి అవసరమైన ప్రచురణల్ని కూడా అందేలా చూసుకుంటున్నారు. ఆఫ్రికాలో ఉంటున్న హెన్రీ అనే బ్రదర్‌ గురించి ఆలోచించండి. ఆయన ఉన్న దేశంలో ఒకప్పుడు మన పనిపై నిషేధం ఉండేది. ఆ సమయంలో తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌కి ప్రచురణల్ని అందించడానికి హెన్రీ ముందుకొచ్చాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. కానీ, యెహోవా మీద భయం లేదా గౌరవం ఉండడం వల్ల నాకు గుండె ధైర్యం వచ్చిందని నేను గుర్తించాను.” మీకు కూడా హెన్రీ లాంటి గుండె ధైర్యం కావాలా? అలాగైతే దేవుని మీద సరైన భయాన్ని పెంచుకోండి.

ప్రధానయాజకుడైన యెహోయాదాలా నమ్మకంగా ఉండండి

12. ప్రధానయాజకుడైన యెహోయాదా, ఆయన భార్య యెహోవాకు నమ్మకంగా ఉన్నారని ఎలా చూపించారు?

12 ప్రధానయాజకుడైన యెహోయాదాకు యెహోవా మీద భయం ఉంది. ఆ భయం వల్లే యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు, సత్యారాధనకు మద్దతిచ్చాడు. ఆయన నమ్మకంగా ఉన్న ఒక సందర్భాన్ని ఇప్పుడు చూద్దాం. యెజెబెలు కూతురైన అతల్యా, అన్యాయంగా యూదా సింహాసనాన్ని చేజిక్కించుకొని రాణిగా పరిపాలించడం మొదలుపెట్టింది. ప్రజలు కూడా అతల్యా అంటే గజగజ వణికేవాళ్లు. ఎందుకంటే ఆమెకు అసలు దయాదాక్షిణ్యాలు లేవు, ఆమెకు అధికార దాహం కూడా ఎక్కువే. ఆ అధికార దాహం వల్ల ఆమె ఎంతకు తెగించిందంటే, తన సొంత మనవళ్లు అని కూడా చూడకుండా వాళ్లందర్నీ చంపించేసింది. (2 దిన. 22:10, 11) అయితే, వాళ్లల్లో ఒక పిల్లవాడైన యెహోయాషును మాత్రం, యెహోయాదా భార్య యెహోషబతు కాపాడింది. ఆమె, ఆమె భర్త ఆ పిల్లవాడిని దాచిపెట్టి, పెంచారు. ఆ విధంగా వాళ్లిద్దరు దావీదు రాజవంశాన్ని కాపాడారు. యెహోయాదా అతల్యాకు ఏమాత్రం భయపడకుండా యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు.—సామె. 29:25.

13. యెహోయాషుకు ఏడేళ్లున్నప్పుడు, యెహోయాదా మళ్లీ యెహోవాపట్ల తన నమ్మకాన్ని ఎలా చూపించాడు?

13 యెహోయాషుకు ఏడేళ్లున్నప్పుడు, యెహోయాదా మళ్లీ యెహోవాపట్ల తన నమ్మకాన్ని చూపించాడు. ఆయన ఒక పథకాన్ని వేశాడు. అది సఫలమైతే, దావీదు వంశస్థుడైన యెహోయాషు రాజు అవుతాడు. ఒకవేళ అది విఫలమైతే, యెహోయాదా తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. కానీ యెహోవా దీవెనలతో ఆ పథకం సఫలమైంది. యెహోయాదా, ఆయనకు మద్దతిచ్చిన శతాధిపతులతో, లేవీయులతో కలిసి యెహోయాషును రాజును చేశాడు, అతల్యాను చంపించాడు. (2 దిన. 23:1-5, 11, 12, 15; 24:1) ఆ తర్వాత యెహోయాదా, “యెహోవా ప్రజలుగా కొనసాగుతామని యెహోవాకు, రాజుకు, ప్రజలకు మధ్య ఒక ఒప్పందం చేయించాడు.” (2 రాజు. 11:17) “అంతేకాదు, ఏవిధంగానైనా అపవిత్రులైనవాళ్లు యెహోవా మందిరంలోకి ప్రవేశించకుండా దాని ద్వారాల దగ్గర ద్వారపాలకుల్ని కూడా ఉంచాడు.”—2 దిన. 23:19.

14. యెహోవాను ఘనపర్చినందుకు యెహోయాదాకు ఎలా ఘనత దక్కింది?

14 గతంలో యెహోవా ఇలా చెప్పాడు: “నన్ను ఘనపర్చేవాళ్లను నేను ఘనపరుస్తాను.” అందుకే యెహోవా, యెహోయాదాను ఘనపర్చాడు. (1 సమూ. 2:30) ఉదాహరణకు, ప్రధానయాజకుడైన యెహోయాదా చేసిన మంచి పనుల్ని మన కోసం యెహోవా బైబిల్లో రాయించాడు. (రోమా. 15:4) అలాగే యెహోయాదా చనిపోయినప్పుడు, ఎవ్వరికి దొరకని గౌరవాన్ని ఆయనకు ఇచ్చాడు. అదేంటంటే, “అతను సత్యదేవునికి, ఆయన మందిరానికి సంబంధించి ఇశ్రాయేలులో మంచిపనులు చేశాడు కాబట్టి అతన్ని దావీదు నగరంలో రాజులతోపాటు పాతిపెట్టారు.”—2 దిన. 24:15, 16.

ప్రధానయాజకుడైన యెహోయాదాలా మనకు దేవుని మీద భయం ఉంటే, మన బ్రదర్స్‌కి నమ్మకంగా మద్దతిస్తాం (15వ పేరా చూడండి) e

15. యెహోయాదా ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

15 దేవుని మీద భయాన్ని పెంచుకోవడానికి యెహోయాదా ఉదాహరణ మనందరికి సహాయం చేస్తుంది. పర్యవేక్షకులు, యెహోయాదాలా అప్రమత్తంగా ఉండి దేవుని మందను కాపాడవచ్చు. (అపొ. 20:28) వృద్ధులు కూడా యెహోయాదా నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు. వాళ్లు యెహోవాకు భయపడుతూ నమ్మకంగా ఉంటే, వాళ్ల వయసును బట్టి యెహోవా వాళ్లను పక్కనపెట్టేయడు గానీ, తన ఇష్టాన్ని నెరవేర్చడానికి వాళ్లను ఉపయోగించుకుంటాడు. యెహోయాదాను ఘనపర్చిన యెహోవాను చూస్తూ, యౌవనులు కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఎంతోకాలంగా నమ్మకంగా యెహోవా సేవచేస్తున్న వృద్ధులకు ఇవ్వాల్సిన గౌరవమర్యాదల్ని యౌవనులు ఇవ్వచ్చు. (సామె. 16:31) చివరిగా, మనందరం శతాధిపతులు, లేవీయులు నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. వాళ్లు నమ్మకంగా యెహోయాదాకు మద్దతిచ్చినట్టే, మనం కూడా “నాయకత్వం వహిస్తున్నవాళ్లకు” లోబడుతూ, నమ్మకంగా మద్దతిద్దాం.—హెబ్రీ. 13:17.

రాజైన యెహోయాషులా ఉండకండి

16. యెహోయాదా చనిపోయిన తర్వాత రాజైన యెహోయాషు ఎంతకు దిగజారాడు?

16 యెహోయాదా పెంపకంలో, యెహోయాషు రాజు బాగానే పెరిగాడు. (2 రాజు. 12:2) దానివల్ల, ఆయన రాజైనప్పుడు యెహోవాను సంతోషపెట్టాలి అనుకున్నాడు. కానీ యెహోయాదా చనిపోయిన తర్వాత, యెహోయాషు మతభ్రష్టులైన యూదా అధిపతుల మాట విన్నాడు. దాని ఫలితంగా ఆయన, ఆయన ప్రజలు “పూజా కర్రల్ని, విగ్రహాల్ని పూజించడం మొదలుపెట్టారు.” (2 దిన. 24:4, 17, 18) దానికి యెహోవా చాలా బాధపడి, ‘వాళ్లను మళ్లీ తన దగ్గరికి తీసుకురావడానికి ప్రవక్తల్ని పంపిస్తూ ఉన్నాడు, కానీ వాళ్లు వినడానికి ఇష్టపడలేదు.’ ఆఖరికి, వాళ్లు యెహోయాదా కొడుకైన జెకర్యా c మాట కూడా వినలేదు. జెకర్యా యెహోవా ప్రవక్త మాత్రమే కాదు యాజకుడు కూడా. అలాగే యెహోయాషుకు దగ్గరి బంధువు. వాళ్లిద్దరు బావ బావమరుదులు అవుతారు. నిజానికి ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలు కాపాడిన కుటుంబానికి రుణపడే బదులు, కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా రాజైన యెహోయాషు జెకర్యాను చంపించాడు.—2 దిన. 22:11; 24:19-22.

17. యెహోయాషు జీవితం ఎంత దారుణంగా మారింది?

17 యెహోవా మీద సరైన భయాన్ని యెహోయాషు కాపాడుకోలేదు. అందుకే ఆయన జీవితం దారుణంగా మారింది. యెహోవా ముందే ఇలా చెప్పాడు: “నన్ను అవమానించేవాళ్లు అవమానించబడతారు.” (1 సమూ. 2:30) చిన్న సిరియా సైన్యం, యెహోయాషు “పెద్ద సైన్యాన్ని” చిత్తుచిత్తుగా ఓడించింది. అలాగే, వాళ్లు యెహోయాషును “తీవ్రంగా గాయపర్చారు.” సిరియా సైన్యం వెళ్లిపోయిన తర్వాత, జెకర్యాను చంపినందుకు యెహోయాషు సేవకులే ఆయన మీద కుట్రపన్ని, చంపేశారు. యెహోయాషు ఎంత చెడ్డ రాజుగా మారాడంటే, ఆయనకు ‘రాజుల సమాధుల్లో పాతిపెట్టబడే’ అర్హతలేదని, ప్రజలు ఆయన్ని వేరేచోట పాతిపెట్టారు.—2 దిన. 24:23-25.

18. యిర్మీయా 17:7, 8 ప్రకారం, యెహోయాషులా ఉండకూడదంటే మనం ఏం చేయాలి?

18 యెహోయాషు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యెహోయాషు ఒక కర్ర సహాయంతో మాత్రమే నిలబడివున్న బలహీనమైన చెట్టులా ఉన్నాడు. యెహోయాదా అనే ఆ కర్ర పోయిన తర్వాత, మతభ్రష్టత్వం అనే గాలులు వచ్చినప్పుడు ఆయన నేలకు ఒరిగాడు. దేవుని మీద భయం, కేవలం తోటి క్రైస్తవుల లేదా కుటుంబ సభ్యుల మంచి ఆదర్శం మీద మాత్రమే ఆధారపడి ఉండకూడదని చెప్పడానికి ఇదెంత శక్తివంతమైన ఉదాహరణో కదా! మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే, మనంతట మనమే దేవుని మీద భయభక్తుల్ని పెంచుకోవాలి. దానికోసం, క్రమంగా అధ్యయనం చేయాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి.—యిర్మీయా 17:7, 8 చదవండి; కొలొ. 2:6, 7.

19. యెహోవా మన నుండి ఏం కోరుతున్నాడు?

19 యెహోవా మన నుండి మరీ ఎక్కువ ఆశించట్లేదు. ఆయన మన నుండి ఏం కోరుతున్నాడో ప్రసంగి 12:13 లో ఇలా ఉంది: “సత్యదేవునికి భయపడి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి; మనుషులు చేయాల్సిందల్లా ఇదే.” మనం దేవునికి భయపడితే, భవిష్యత్తులో వచ్చే ఏ పరీక్షనైనా ఎదుర్కోగలుగుతాం. అలాగే ఓబద్యాలా, యెహోయాదాలా యెహోవాకు నమ్మకంగా ఉండగలుగుతాం. యెహోవాతో ఉన్న మన స్నేహబంధాన్ని ఏదీ తెంచేయలేదు.

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

a బైబిల్లో, “భయం” అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి. సందర్భాన్నిబట్టి అది గాబరాపడడం, గౌరవం చూపించడం లేదా ఆశ్చర్యపోవడాన్ని సూచిస్తుండవచ్చు. యెహోవా సేవలో ధైర్యంగా, నమ్మకంగా కొనసాగడానికి కావల్సిన భయాన్ని పెంచుకునేలా ఈ ఆర్టికల్‌ మనకు సహాయం చేస్తుంది.

b ఈ ఓబద్యా, ప్రవక్త అయిన ఓబద్యా ఒకటి కాదు. ఓబద్యా ప్రవక్త ఈయన కన్నా వందల సంవత్సరాల తర్వాత జీవించాడు; అలాగే, తన పేరు మీద ఒక పుస్తకాన్ని రాశాడు.

c మత్తయి 23:35 లో జెకర్యా “బరకీయ కుమారుడు” అని ఉంది. బైబిల్లో కొంతమందికి ఉన్నట్టు, యెహోయాదాకు రెండు పేర్లు ఉండివుండవచ్చు (మత్త 9:9 ని మార్కు 2:14 తో పోల్చండి). లేదా బరకీయ జెకర్యా వాళ్ల తాత గానీ, అంతకుముందు జీవించిన పూర్వీకుడు గానీ అయ్యిండవచ్చు.

d చిత్రాల వివరణ: ఫోటో కోసం నటించిన చిత్రంలో, ఒక బ్రదర్‌ నిషేధం ఉన్న ప్రాంతంలో ప్రచురణలు ఇస్తున్నాడు.

e చిత్రాల వివరణ: టెలిఫోను సాక్ష్యం ఎలా చేయాలో ఒక వృద్ధ సహోదరి దగ్గర ఒక యౌవన సహోదరి నేర్చుకుంటుంది. ధైర్యంగా బహిరంగ సాక్ష్యమిస్తూ మంచి ఆదర్శాన్ని ఉంచుతున్న ఒక వృద్ధ సహోదరుడు; అనుభవం ఉన్న బ్రదర్‌, రాజ్యమందిరంలో మరమ్మతు పనులు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నాడు.