కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 26

యెహోవా రోజు కోసం మీరు సిద్ధంగా ఉన్నారా?

యెహోవా రోజు కోసం మీరు సిద్ధంగా ఉన్నారా?

“యెహోవా రోజు రాత్రిపూట దొంగ వచ్చినట్టు వస్తుంది.”1 థెస్స. 5:2.

పాట 143 పనిచేస్తూ, కనిపెట్టుకుంటూ, ఎదురుచూస్తూ ఉండండి

ఈ ఆర్టికల్‌లో . . . a

1. యెహోవా రోజును తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి?

 బైబిలు ప్రకారం, “యెహోవా రోజు” అంటే ఆయన తన శత్రువుల్ని నాశనం చేసి, తన ప్రజల్ని రక్షించే సమయాన్ని సూచిస్తుంది. గతంలో కూడా యెహోవా కొంతమందికి తీర్పు తీర్చి, వాళ్లను శిక్షించాడు. (యెష. 13:1, 6; యెహె. 13:5; జెఫ. 1:8) మనకాలంలో “యెహోవా రోజు” మహాబబులోను నాశనంతో మొదలై, హార్‌మెగిద్దోన్‌ యుద్ధంతో ముగుస్తుంది. ఆ ‘రోజును’ తప్పించుకోవాలంటే, మనం ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. నిజానికి, మనం కేవలం ఒక్కసారి సిద్ధంగా ఉంటే సరిపోదు. ఎందుకంటే, “మహాశ్రమ” కోసం “ఎప్పుడూ సిద్ధంగా ఉండండి” అని యేసు చెప్పాడు.—మత్త. 24:21; లూకా 12:40.

2. మొదటి థెస్సలొనీకయుల్లో, పౌలు రాసిన ఏ విషయాల్ని ఇప్పుడు మనం పరిశీలిస్తాం?

2 థెస్సలోనిక సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసిన మొట్టమొదటి ప్రేరేపిత ఉత్తరంలో, యెహోవా తీర్పు తీర్చే మహా రోజు కోసం క్రైస్తవులు ఎలా సిద్ధంగా ఉండాలో చెప్పాడు. అలా చెప్పడానికి ఆయన కొన్ని పోలికల్ని ఉపయోగించాడు. అప్పటికప్పుడు యెహోవా రోజు రాదని పౌలుకు తెలుసు. (2 థెస్స. 2:1-3) కానీ, అది రేపే వస్తున్నట్టు సిద్ధంగా ఉండమని ఆయన ప్రోత్సహించాడు. ఆ సలహా మనం కూడా పాటించవచ్చు. అయితే, యెహోవా రోజు ఎలా వస్తుంది? దాన్ని ఎవరు తప్పించుకోరు? దానికోసం మనం ఎలా సిద్ధంగా ఉండవచ్చు? ఈ విషయాల గురించి పౌలు ఏం చెప్పాడో ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా రోజు ఎలా వస్తుంది?

థెస్సలొనీకయులకు రాసిన తన మొదటి ఉత్తరంలో అపొస్తలుడైన పౌలు ఎన్నో పోలికల్ని ఉపయోగించాడు; వాటి నుండి మనం ప్రయోజనం పొందవచ్చు (3వ పేరా చూడండి)

3. యెహోవా రోజు రాత్రిపూట దొంగ వచ్చినట్టు ఎలా వస్తుంది? (చిత్రం కూడా చూడండి.)

3 “రాత్రిపూట దొంగ వచ్చినట్టు.” (1 థెస్స. 5:2) యెహోవా రోజు ఎలా వస్తుందో చెప్పడానికి పౌలు ఉపయోగించిన మూడు పద చిత్రాల్లో ఇది మొదటిది. సాధారణంగా దొంగలు, రాత్రిపూట ఎవ్వరూ ఊహించని సమయంలో వచ్చి, రెప్పపాటులో దొంగతనం చేసేస్తారు. యెహోవా రోజు కూడా ఎవ్వరూ ఊహించనప్పుడు ఉన్నపళంగా వస్తుంది. మామూలు ప్రజలే కాదు, నిజక్రైస్తవులు కూడా రెప్పపాటులో జరిగే ఆ సంఘటనల్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. కానీ చెడ్డవాళ్లలా మనం నాశనం అవ్వము.

4. యెహోవా రోజును గర్భిణీ స్త్రీకి వచ్చే పురిటినొప్పులతో ఎలా పోల్చవచ్చు?

4 “గర్భిణీ స్త్రీకి పురిటినొప్పులు వచ్చినట్టు.” (1 థెస్స. 5:3) గర్భిణి స్త్రీకి పురిటినొప్పులు ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేం. కానీ, పురిటినొప్పులు ఖచ్చితంగా వస్తాయి. అవి ఉన్నపళంగా వస్తాయి, అప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది, వాటిని ఆపలేం. అదేవిధంగా, యెహోవా రోజు కూడా ఏ రోజు, ఏ గంట మొదలౌతుందో మనకు తెలీదు. కానీ అది మాత్రం ఖచ్చితంగా వస్తుంది; అప్పుడు చెడ్డవాళ్లను యెహోవా ఉన్నపళంగా నాశనం చేస్తాడు, వాళ్లు దాన్ని తప్పించుకోలేరు.

5. మహాశ్రమను వెలుగుతో ఎలా పోల్చవచ్చు?

5 వెలుగుతో పోల్చవచ్చు. పౌలు మూడో ఉదాహరణను చెప్తున్నప్పుడు, రాత్రిపూట దొంగతనం చేయడానికి వచ్చే దొంగల గురించి మళ్లీ మాట్లాడాడు. కానీ, ఈసారి ఆయన యెహోవా రోజును వెలుగుతో పోల్చాడు. (1 థెస్స. 5:4) రాత్రిపూట వచ్చే దొంగలు దొంగతనం చేయడంలో మునిగిపోయి, టైం ఎంత అయ్యిందో కూడా పట్టించుకోరు. తెల్లవారిన తర్వాత బహుశా ఆ వెలుగు వాళ్లను పట్టిస్తుంది. మహాశ్రమ కూడా చీకటిలో ఉంటూ, యెహోవాకు ఇష్టంలేని పనులు చేస్తున్న దొంగల్లాంటి వాళ్లను పట్టిస్తుంది. మనం వాళ్లలా యెహోవాకు ఇష్టంలేని పనులు చేయకుండా, “అన్నిరకాల మంచితనం, నీతి, సత్యం” ఉన్న పనులు చేస్తూ ఆ రోజు కోసం సిద్ధపడవచ్చు. (ఎఫె. 5:8-12) అయితే, ఆ రోజును తప్పించుకోని వాళ్ల గురించి మాట్లాడుతూ పౌలు రెండు ఉదాహరణల్ని చెప్పాడు. దానిగురించి ఇప్పుడు చూద్దాం.

యెహోవా రోజును ఎవరు తప్పించుకోరు?

6. ఏ విషయాల్లో చాలామంది నిద్రపోతున్నారు? (1 థెస్సలొనీకయులు 5:6, 7)

6 “నిద్రపోయేవాళ్లు.” (1 థెస్సలొనీకయులు 5:6, 7 చదవండి.) యెహోవా రోజును తప్పించుకోని వాళ్లను పౌలు నిద్రపోయేవాళ్లతో పోల్చాడు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గానీ, కాలం గడుస్తుందన్న సంగతి గానీ వాళ్లకు తెలీదు. అందుకే, ఏవైనా ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు వాళ్లకు తెలీదు లేదా వాళ్లు వాటికి స్పందించలేరు. ఈరోజుల్లో చాలామంది దేవునికి సంబంధించిన విషయాల్లో నిద్రపోతున్నారు. (రోమా. 11:8) మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామనే, మహాశ్రమ చాలా త్వరలో వస్తుందనే రుజువుల్ని వాళ్లు నమ్మట్లేదు. కానీ ప్రపంచంలో ఏవైనా పెద్దపెద్ద మార్పులు జరిగినప్పుడు, వాళ్లు ఆ నిద్ర నుండి తేరుకొని మంచివార్త పట్ల కాస్త ఆసక్తి చూపించవచ్చు. అయినాసరే, మెలకువగా ఉండే బదులు చాలామంది మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. ఆఖరికి, ఆ తీర్పు రోజును నమ్మిన వాళ్లు కూడా అది ఇంకా చాలా దూరంలో ఉందని అనుకుంటారు. (2 పేతు. 3:3, 4) అయితే మనం మాత్రం ఒక్కోరోజు గడిచేకొద్దీ, యెహోవా తీర్పు రోజు దూరం తగ్గుతుందని నమ్ముతూ మెలకువగా ఉండడం చాలాచాలా ముఖ్యం.

7. యెహోవా రోజును తప్పించుకోని వాళ్లు మద్యం మత్తులో ఉన్నారని ఎలా చెప్పవచ్చు?

7 “మద్యం మత్తులో ఉండేవాళ్లు.” యెహోవా రోజుని తప్పించుకోని వాళ్లను, పౌలు మద్యం మత్తులో ఉండేవాళ్లతో పోల్చాడు. అలా మద్యం మత్తులో తూలుతూ ఉండేవాళ్లు చుట్టూ జరుగుతున్న పరిస్థితులకు వెంటనే స్పందించలేరు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అలాగే, దేవుడిచ్చే హెచ్చరికలు చెడ్డవాళ్ల చెవికి ఆనవు. వాళ్లు తమ గోతిని తామే తవ్వుకొని నాశనమౌతారు. కానీ, క్రైస్తవులు తమ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుంటూ విషయాల్ని స్పష్టంగా ఆలోచించాలని పౌలు చెప్పాడు. (1 థెస్స. 5:6) విషయాల్ని స్పష్టంగా ఆలోచించడం గురించి ఒక బైబిలు పండితుడు ఏమన్నాడంటే: “ప్రశాంతంగా, నిలకడగా ఉంటే విషయాల్ని సరిగ్గా అంచనా వేయగలుగుతాం, దానివల్ల సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.” ఇంతకీ మనం ఎందుకు ప్రశాంతంగా, నిలకడగా ఉండాలి? ఈ లోక రాజకీయాల్లో లేదా సమాజంలో జరుగుతున్న విషయాల్లో తలదూర్చకుండా ఉండడానికి అలా ఉండాలి. కానీ, యెహోవా రోజు దగ్గరపడేకొద్దీ ఎవరో ఒకరి పక్షాన ఉండమనే ఒత్తిడి ఎక్కువ అవ్వొచ్చు. అయితే, అప్పుడు మనం ఎలా స్పందిస్తాం అన్న దానిగురించి ఇప్పుడే కంగారుపడాల్సిన అవసరంలేదు. యెహోవా పవిత్రశక్తి సహాయంతో మనం ప్రశాంతంగా, నిలకడగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.—లూకా 12:11, 12.

యెహోవా రోజు కోసం మనం ఎలా సిద్ధపడవచ్చు?

యెహోవా రోజు గురించి చాలామంది పట్టించుకోకపోయినా మనం మాత్రం విశ్వాసం, ప్రేమ అనే ఛాతి కవచాన్ని ధరించుకుని, నిరీక్షణ అనే హెల్మెట్‌ పెట్టుకుని దానికోసం రెడీగా ఉంటాం (8, 12 పేరాలు చూడండి)

8. యెహోవా రోజును తప్పించుకోడానికి సహాయం చేసే లక్షణాల్ని, 1 థెస్సలొనీకయులు 5:8 వేటితో పోల్చింది? (చిత్రం కూడా చూడండి.)

8 “ఛాతి కవచాన్ని . . . హెల్మెట్‌ని . .  పెట్టుకోండి.” పౌలు మనల్ని యుద్ధం కోసం రెడీగా ఉన్న సైనికులతో పోల్చాడు. (1 థెస్సలొనీకయులు 5:8, అధస్సూచి చదవండి.) డ్యూటీలో ఉన్న సైనికుడు యుద్ధం కోసం ఎప్పుడూ రెడీగా ఉంటాడు. మనం కూడా అలాగే ఉండాలి. విశ్వాసం, ప్రేమ అనే ఛాతి కవచాన్ని, నిరీక్షణ అనే హెల్మెట్‌ని పెట్టుకుని యెహోవా రోజు కోసం మనం సిద్ధంగా ఉండాలి. ఆ రోజును తప్పించుకోడానికి ఈ లక్షణాలు మనకు బాగా సహాయం చేస్తాయి.

9. మన విశ్వాసం మనల్ని ఎలా కాపాడుతుంది?

9 ఛాతి కవచం ఒక సైనికుడి గుండెను కాపాడినట్లే విశ్వాసం, ప్రేమ మన సూచనార్థక హృదయాన్ని కాపాడుతుంది. యెహోవా సేవను నమ్మకంగా చేయడానికి, యేసును అనుకరించడానికి ఆ లక్షణాలు సహాయం చేస్తాయి. మనకు విశ్వాసం ఉంటే, మనస్ఫూర్తిగా యెహోవాను వెదికినప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్ముతాం. (హెబ్రీ. 11:6) అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా, మన నాయకుడైన యేసుకు నమ్మకంగా ఉంటాం. మనం కష్టాల్ని సహించాలంటే మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలి. దానికోసం, సరిపడా డబ్బులు లేక కష్టాలుపడుతూ లేదా భయంకరమైన హింసను ఎదుర్కొంటూ నమ్మకంగా ఉన్న మనకాలంలోని చాలామందిని చూసి నేర్చుకోవచ్చు. అంతేకాదు, దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ సాదాసీదాగా జీవిస్తున్న వాళ్లను అనుకరిస్తే, ఆస్తిపాస్తుల్ని పోగేసుకోవాలనే ఉరి నుండి తప్పించుకుంటాం. b

10. దేవుని మీద, తోటివాళ్ల మీద ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం?

10 మనం మెలకువగా ఉండాలన్నా, మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవాలన్నా ప్రేమ కూడా చాలా ముఖ్యం. (మత్త. 22:37-39) మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి, ప్రీచింగ్‌లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని సహిస్తాం. (2 తిమో. 1:7, 8) అంతేకాదు, యెహోవాను ఆరాధించని వాళ్లను కూడా ప్రేమిస్తాం కాబట్టి, మన టెరిటరీలో మనం ప్రీచింగ్‌ చేస్తూనే ఉంటాం. ఆఖరికి టెలిఫోన్‌ ద్వారా, ఉత్తరాల ద్వారా కూడా అలా చేస్తాం. మన ఇరుగుపొరుగువాళ్లు ఏదోకరోజు మారి, సరైనది చేయడం మొదలుపెడతారనే ఆశను మనం ఎప్పుడూ వదులుకోం.—యెహె. 18:27, 28.

11. తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ని ప్రేమిస్తే ఏం చేస్తాం? (1 థెస్సలొనీకయులు 5:11)

11 మనం మన తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ని కూడా ప్రేమిస్తాం. “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ” ఉండడం ద్వారా మనం అలా ప్రేమ చూపిస్తాం. (1 థెస్సలొనీకయులు 5:11 చదవండి.) యుద్ధంలో సైనికులు ఒకరికొకరు మద్దతిచ్చుకున్నట్టే, మనం కూడా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం. అయితే, కొన్నిసార్లు యుద్ధంలో ఒక సైనికుడు తెలీకుండా తన తోటి సైనికుడిని గాయపర్చవచ్చు. అలాగని ఆయన కావాలని అలా ఎప్పుడూ చేయడు. అదేవిధంగా, మనం కూడా కావాలని ఎప్పుడూ మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ని నొప్పించం లేదా హాని చేసినవాళ్లకు తిరిగి హాని చేయం. (1 థెస్స. 5:13, 15) అంతేకాదు, సంఘంలో నాయకత్వం వహిస్తున్న బ్రదర్స్‌ని గౌరవించడం ద్వారా కూడా మనం ప్రేమను చూపించవచ్చు. (1 థెస్స. 5:12) పౌలు ఈ ఉత్తరం రాసే సమయానికి, థెస్సలొనీకలో సంఘం స్థాపించబడి సంవత్సరం కూడా కాలేదు. కాబట్టి అక్కడున్న నియమిత పురుషులకు బహుశా అంత అనుభవం ఉండకపోవచ్చు, వాళ్లు కూడా పొరపాట్లు చేసుంటారు. అయినా, వాళ్లు గౌరవానికి అర్హులు. మహాశ్రమ దగ్గరపడినప్పుడు నిర్దేశం కోసం మనం స్థానిక పెద్దల మీద ఇప్పటికన్నా ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. బహుశా ఆ సమయంలో, ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి లేదా బ్రాంచి ఆఫీసు నుండి నేరుగా మనకు నిర్దేశాలు అందకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే మనం మన పెద్దల్ని గౌరవించడం, ప్రేమించడం నేర్చుకోవాలి. అయితే, ఏదేమైనా సరే మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుంటూ, వాళ్ల లోపాల మీద మనసుపెట్టకుండా, ఆ నమ్మకమైన పురుషుల్ని యెహోవాయే యేసు ద్వారా నడిపిస్తున్నాడని గుర్తుంచుకుందాం.

12. నిరీక్షణ మన ఆలోచనల్ని ఎలా కాపాడుతుంది?

12 హెల్మెట్‌ ఒక సైనికుడి తలను కాపాడినట్లే, నిరీక్షణ మన ఆలోచనల్ని కాపాడుతుంది. మనకు బలమైన నిరీక్షణ ఉంటే లోకం ఇచ్చేదేదైనా చెత్తతో సమానంగా చూస్తాం. (ఫిలి. 3:8) ఆ నిరీక్షణ వల్లే మనం ప్రశాంతంగా, నిలకడగా ఉండగలుగుతాం. ఆఫ్రికా బెతెల్‌లో సేవ చేస్తున్న వ్యాలీస్‌, లోరిండా అనే దంపతుల విషయంలో అదే నిజమైంది. మూడు వారాల వ్యవధిలోనే లోరిండా వాళ్ల అమ్మ, వ్యాలీస్‌ వాళ్ల నాన్న చనిపోయారు. కోవిడ్‌ వల్ల వాళ్లు చివరి చూపులకు కూడా వెళ్లలేకపోయారు. వ్యాలీస్‌ ఇలా అంటున్నాడు: “పునరుత్థాన నిరీక్షణ వల్ల, ఈ లోకంలో నావాళ్ల చివరి రోజుల్ని కాదుగానీ, కొత్తలోకంలో వాళ్ల తొలి రోజుల గురించి ఆలోచించగల్గుతున్నాను. ఆ నిరీక్షణ వల్లే నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, నావాళ్లను కోల్పోయాను అనే బాధ నుండి బయట పడగలుగుతున్నాను.”

13. మనకు పవిత్రశక్తి కావాలంటే ఏం చేయాలి?

13 “పవిత్రశక్తి జ్వాలను ఆర్పకండి.” (1 థెస్స. 5:19) పౌలు పవిత్రశక్తిని మనలో ఉన్న జ్వాలతో పోల్చాడు. మనకు పవిత్రశక్తి ఉంటే సరైంది చేయాలనే ఉత్సాహంతో వెలిగిపోతాం, యెహోవా పని చేయడానికి బలాన్ని పుంజుకుంటాం. (రోమా. 12:11) అయితే, మనకు పవిత్రశక్తి కావాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, పవిత్రశక్తితో నడిచే సంస్థతో సహవసించాలి. ఇవన్నీ చేసినప్పుడు, ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని’ పెంచుకోగలుగుతాం.—గల. 5:22, 23.

ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవుని పవిత్రశక్తిని పొందుతూ ఉండాలని నేను కోరుకుంటున్నట్టు నా పనులు చూపిస్తున్నాయా?’ (14వ పేరా చూడండి)

14. మనం పవిత్రశక్తిని పొందుతూ ఉండాలంటే ఏ పనులు చేయకూడదు? (చిత్రం కూడా చూడండి.)

14 యెహోవా మనకు తన పవిత్రశక్తిని ఇచ్చిన తర్వాత, మనం ఆ ‘పవిత్రశక్తి జ్వాలను ఆర్పకుండా’ జాగ్రత్తపడాలి. ఆలోచనల్లో, ప్రవర్తనలో పవిత్రంగా ఉండేవాళ్లకే యెహోవా తన పవిత్రశక్తిని ఇస్తాడు. చెడ్డ ఆలోచనల్లో విహరిస్తూ, చెడ్డ పనులు చేస్తూ ఉండేవాళ్లకు ఆయన తన పవిత్రశక్తిని ఇవ్వడు. (1 థెస్స. 4:7, 8) యెహోవా పవిత్రశక్తిని పొందుతూ ఉండాలంటే, ‘ప్రవచనాల్ని చులకనగా చూడకూడదు.’ (1 థెస్స. 5:20) “ప్రవచనాలు” అంటే, యెహోవా తన పవిత్రశక్తితో చెప్పిన విషయాలు. వాటిలో యెహోవా రోజు గురించి, మనం జీవిస్తున్న కాలం ప్రాముఖ్యత గురించిన విషయాలు కూడా ఉన్నాయి. మనం బ్రతికుండగా హార్‌మెగిద్దోన్‌ రాదులే అని ఆలోచిస్తూ యెహోవా రోజును మన మనసులో నుండి తీసేసుకోకూడదు. బదులుగా, మనం పవిత్రంగా నడుచుకుంటూ, “దైవభక్తిగల పనులు చేస్తూ” ఆ రోజును ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి.—2 పేతు. 3:11, 12.

‘అన్నిటినీ పరీక్షించండి’

15. సాతాను ప్రేరేపించిన తప్పుడు ప్రచారానికి పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయవచ్చు? (1 థెస్సలొనీకయులు 5:21)

15 త్వరలో దేవుని శత్రువులు ఒకరకంగా, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన చేస్తారు. (1 థెస్స. 5:3) సాతాను ప్రేరేపించిన ఆ ప్రచారం లోకంలో చాలామంది కళ్లు కప్పేయవచ్చు. (ప్రక. 16:13, 14) మరి మన సంగతేంటి? మనం ‘అన్నిటినీ పరీక్షించినప్పుడు’ మోసపోము. (1 థెస్సలొనీకయులు 5:21 చదవండి.) “పరీక్షించి” అనే పదాన్ని గ్రీకులో బంగారం, వెండి లాంటి లోహాలు అసలైనవో కావో తెలుసుకునే సందర్భంలో ఉపయోగించేవాళ్లు. అదేవిధంగా, మన కంటపడ్డ లేదా చెవినపడ్డ విషయం నిజమో కాదో పరీక్షించి తెలుసుకోవాలి. థెస్సలొనీకలో ఉన్నవాళ్లకు ఈ సలహా చాలా ప్రాముఖ్యం. వాళ్లకే కాదు, మహాశ్రమ దగ్గరపడుతుండగా మనకు కూడా ఈ సలహా చాలా ప్రాముఖ్యం. వేరేవాళ్లు చెప్పేవాటిని అమాయకంగా నమ్మే బదులు మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి, మన కంటపడ్డ లేదా చెవినపడ్డ విషయం బైబిలు చెప్పేవాటితో, యెహోవా సంస్థ చెప్పేవాటితో సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అలా చేసినప్పుడు సాతాను చేసే ప్రచారానికి మనం పడిపోము.—సామె. 14:15; 1 తిమో. 4:1.

16. మనకు ఏ నిరీక్షణ ఉంది? మనం ఏం చేయాలి?

16 ఒక గుంపుగా యెహోవా సేవకులు మహాశ్రమను దాటుతారు. కానీ, మనలో ఒక్కొక్కరికి రేపేమి జరుగుతుందో తెలీదు. (యాకో. 4:14) అయితే, మనం బ్రతికున్నప్పుడే మహాశ్రమ వచ్చినా లేదా మహాశ్రమ రాకముందే చనిపోయినా, నమ్మకంగా ఉంటే శాశ్వత జీవితం అనే బహుమానాన్ని పొందుతాం. అభిషిక్తులైతే క్రీస్తుతో పాటు పరలోకంలో ఉంటారు. వేరే గొర్రెలైతే పరదైసు భూమ్మీద ఉంటారు. కాబట్టి మనందరం, మనకున్న అద్భుతమైన నిరీక్షణ మీద మనసుపెట్టి, యెహోవా రోజు కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉందాం!

పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

a భవిష్యత్తులో రాబోయే యెహోవా రోజు గురించి తెలుసుకోవడానికి, 1 థెస్సలొనీకయులు 5వ అధ్యాయంలో ఉన్న కొన్ని పోలికల్ని చూస్తాం. “యెహోవా రోజు” అంటే ఏంటి? అదెలా వస్తుంది? దాన్ని ఎవరు తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకోరు? మనం దానికోసం ఎలా సిద్ధంగా ఉండవచ్చు? అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటల్ని పరిశీలించి ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం.