జీవిత కథ
యెహోవా సేవలో ఊహించని ఆనందాలు, వాటి నుండి నేర్చుకున్న పాఠాలు
చిన్నప్పుడు విమానాన్ని చూసినప్పుడల్లా, ఏరోజుకైనా దాన్ని ఎక్కి వేరేదేశానికి వెళ్లాలని అనిపించేది. కానీ అది కలలో కూడా జరగదని అనుకున్నాను.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో, మా తల్లిదండ్రులు ఎస్టోనియాను వదిలి జర్మనీకి వచ్చారు. నేను అక్కడే పుట్టాను. ఆ తర్వాత వాళ్లు కెనడాకు వచ్చేశారు. కెనడాలోని ఒట్టావాలో, కోళ్ల ఫారం ఉన్న ఒక బిల్డింగ్‌లో మా ఇల్లు ఉండేది. మేము చాలా పేదవాళ్లం. కానీ పొద్దునే తినడానికి మాత్రం కోడిగుడ్లు ఉండేవి.
ఒకరోజు యెహోవాసాక్షులు మా అమ్మను కలిసి, ప్రకటన 21:3, 4 వచనాలు చదివారు. ఆ మాటలు మా అమ్మ హృదయాన్ని ఎంత తాకాయంటే, ఆమె కంట్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. తర్వాత మా అమ్మానాన్నలు బైబిలు స్టడీ మొదలుపెట్టి, చాలా త్వరగా బాప్తిస్మం తీసుకున్నారు.
మా అమ్మానాన్నలు పెద్దగా చదువుకోలేదు కాబట్టి వాళ్లకు ఇంగ్లీషు అంతగా రాదు. అయినాసరే, వాళ్లు యెహోవా సేవ చేయడానికి చాలా ఉత్సాహం చూపించారు. మా నాన్న ఒంటారియోలోని సడ్బురిలో, లోహాల్ని కరిగించే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయన రాత్రంతా పని చేసినా ప్రతీ శనివారం నన్ను, మా చెల్లి సిల్వియాను ప్రీచింగ్‌కి తీసుకెళ్లేవాడు. ప్రతీవారం మేము కుటుంబంగా కావలికోట చదువుకునేవాళ్లం. మా అమ్మానాన్న నాలో దేవుని మీద ప్రేమను నాటారు. దాంతో నేను సమర్పించుకుని పదేళ్ల వయసులో అంటే, 1956లో బాప్తిస్మం తీసుకున్నాను. మా అమ్మానాన్నలకు యెహోవా మీద ఉన్న ప్రేమను చూసి, నేను కూడా జీవితాంతం యెహోవా సేవ చేస్తూ ఉండాలని నిర్ణయించుకున్నాను.
హైస్కూలు పూర్తయ్యాక నేను కాస్త పక్కదారి పట్టాను. నేను పయినీరైతే ఎక్కువ డబ్బు సంపాదించలేనని, విమానం ఎక్కి ప్రపంచాన్ని చుట్టేయాలనే నా కల కలగానే మిగిలిపోతుందని అనుకున్నాను. కాబట్టి నేను రేడియో జాకీగా ఉద్యోగం వెతుక్కున్నాను. ఆ పని నాకెంతో నచ్చింది. అయితే నేను ఎక్కువశాతం సాయంత్రాలు పనిచేసేవాణ్ణి కాబట్టి, అప్పుడప్పుడే మీటింగ్స్‌కి వెళ్లేవాణ్ణి. అలాగే దేవున్ని ప్రేమించని వాళ్లతో ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. కానీ చిన్నప్పటినుండి నేను యెహోవా గురించి నేర్చుకున్న విషయాలు నా మనసులో ఉండడంతో, వాటినిబట్టి నేను మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
నేను ఒంటారియోలోని, ఒషావాకు వచ్చాను. అక్కడ నేను రే నోర్మన్, వాళ్ల చెల్లి లెస్లీ, ఇంకొంతమంది పయినీర్లను కలిశాను. వాళ్లు నన్ను బాగా చూసుకున్నారు. పయినీరు సేవలో వాళ్లు సంతోషంగా ఉండడం చూసినప్పుడు, నేను ఇంకోసారి నా లక్ష్యాల గురించి ఆలోచించాను. పయినీరు సేవ చేయమని వాళ్లు నన్ను ప్రోత్సహించడంతో 1966, సెప్టెంబరులో నేను మొదలుపెట్టాను. అలా పయినీరు సేవ చేస్తూ, నా జీవితం ప్రశాంతంగా సాగుతుంది. అయితే నా జీవితంలో ఆసక్తికరమైన మలుపులు ముందున్నాయి.
యెహోవా మిమ్మల్ని ఏదైనా చేయమని ఆహ్వానిస్తే, దాన్ని చేయడానికి చూడండి
నేను ఇంకా హైస్కూల్లో ఉన్నప్పుడే కెనడాలోని, టోరంటో బెతెల్‌కి అప్లయి చేశాను. ఆ తర్వాత పయినీరింగ్
చేస్తున్నప్పుడు, నాలుగు సంవత్సరాలు బెతెల్‌లో సేవచేయమని ఆహ్వానం వచ్చింది. కానీ నాకు లెస్లీ అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తే, తనను ఇంకెప్పుడూ చూడలేనని భయపడ్డాను. నా మనసులో ఉన్నదంతా యెహోవాకు చాలాసేపు చెప్పిన తర్వాత, బరువెక్కిన గుండెతో లెస్లీకి వీడ్కోలు చెప్పి, బెతెల్‌కి వెళ్లిపోయాను.నేను బెతెల్‌లోని లాండ్రీలో, ఆ తర్వాత సెక్రటరీగా కూడా సేవచేశాను. ఈలోపు లెస్లీ క్విబెక్‌లోని, గాటిన్యోలో ప్రత్యేక పయినీరు అయ్యింది. నేను బెతెల్‌లో ఉన్నాను గానీ, నా మనసంతా ఆమె దగ్గరే ఉంది. నేను బెతెల్‌కు వచ్చి మంచి పనే చేశానా లేదా అని అనుకునేవాణ్ణి. ఆ తర్వాత ఎగిరిగంతేసే ఒక సందర్భం నా జీవితంలో వచ్చింది. లెస్లీ వాళ్ల అన్న రే బెతెల్‌కి వచ్చాడు, నా రూంమేట్ అయ్యాడు. దానివల్ల లెస్లీతో నా స్నేహం మళ్లీ చిగురించింది. అలా 1971, ఫిబ్రవరి 27న, నాలుగు సంవత్సరాల నా బెతెల్ సేవ చివరి రోజున మేము పెళ్లి చేసుకున్నాం.
క్విబెక్‌లో ఉన్న ఒక ఫ్రెంచ్ భాషా సంఘానికి మమ్మల్ని నియమించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అంటే నాకు 28 ఏళ్లున్నప్పుడు, ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవ చేయమనే ఆహ్వానం వచ్చింది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే నాకంత వయసు, అనుభవం లేదని అనుకున్నాను. కానీ యిర్మీయా 1:7, 8లో ఉన్న మాటలు ఆ నియామకాన్ని ఒప్పుకోవడానికి నాకు సహాయం చేశాయి. అయితే లెస్లీకి గతంలో రెండు కారు యాక్సిడెంట్లు అవ్వడం వల్ల, తనకు నిద్ర సరిగ్గా పట్టేది కాదు. కాబట్టి మేము ప్రాంతీయ సేవ ఎలా చేయగలమని అనుకున్నాం. కానీ లెస్లీ ఇలా అంది: “యెహోవా ఏదైనా చేయమని మనల్ని ఆహ్వానిస్తే, దాన్ని ఎందుకు చేసి చూడకూడదు?” దాంతో, మేము ఆ నియామకాన్ని ఒప్పుకొని, 17 సంవత్సరాలు ప్రాంతీయ సేవలో సంతోషంగా గడిపాం.
నేను ప్రాంతీయ పర్యవేక్షకునిగా చాలా బిజీగా ఉండేవాణ్ణి. దానివల్ల లెస్లీతో అంత సమయం గడపడం వీలయ్యేదే కాదు. నేనిప్పుడు ఇంకొక పాఠం నేర్చుకోవాల్సి వచ్చింది. ఒకరోజు సోమవారం పొద్దున్నే మా కాలింగ్ బెల్ మోగింది, వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఒక బుట్టలో టేబుల్ క్లాత్, కొన్ని పండ్లు, బ్రెడ్, చీస్, వైన్ బాటిల్, రెండు గ్లాసులు అలాగే ఒక చిన్న లెటర్ ఉంది. దాంట్లో “నీ భార్యను తీసుకుని పిక్‌నిక్‌కి వెళ్లు” అని ఉంది. ఆ రోజు ప్రకృతి చాలా వెచ్చగా, ఆహ్లాదంగా ఉంది. కానీ, నేను టాక్స్‌కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి బయటికి వెళ్లడం కుదరదని లెస్లీకి చెప్పాను. తను అర్థంచేసుకుంది గానీ, ముఖం కొంచెం చిన్నబుచ్చుకుంది. ఆ తర్వాత నేను టాక్స్‌కి ప్రిపేర్ అవ్వాలని కూర్చున్నాను గానీ, నా మనసు మనసులో లేదు. నాకు ఎఫెసీయులు 5:25, 28 లేఖనాలు గుర్తొచ్చాయి. నేను నా భార్య ఫీలింగ్స్‌ని కూడా పట్టించుకోవాలని యెహోవా చెప్తున్నట్టు అనిపించింది. ఆ తర్వాత నేను ప్రార్థించి, లెస్లీతో “పదా వెళ్దాం!” అన్నాను, దాంతో ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మేము నది పక్కన ఒక అందమైన చోట ఆగి, కాసేపు సమయం గడిపాం. అది మేము మర్చిపోలేని రోజుల్లో ఒకటి. ఆ తర్వాత నేను ఇంటికొచ్చి టాక్స్‌కి కూడా ప్రిపేర్ అయ్యాను.
బ్రిటీష్ కొలంబియా నుండి, న్యూఫౌండ్‌ల్యాండ్ వరకు మేము చాలా ప్రాంతాల్లో ప్రాంతీయ సేవను ఆనందించాం. విమానం ఎక్కాలనే నా చిన్నప్పటి కల కూడా ఇప్పుడు నెరవేరింది. నేను గిలియడ్ పాఠశాలకు వెళ్లాలనుకున్నాను, కానీ వేరే దేశంలో మిషనరీగా సేవ చేయాలనే కోరిక నాకు లేదు. ఎందుకంటే మిషనరీలు చాలా ప్రత్యేకమైన వాళ్లని, దానికి
నాకు అర్హతలేదని అనిపించింది. దానికితోడు యుద్ధాలు, రోగాలతో నిండిన ఆఫ్రికాలో ఒక దేశానికి మమ్మల్ని పంపిస్తారేమో అని భయపడ్డాను. మాకు కెనడాలోనే బాగుందని అనుకున్నాను.ఎస్టోనియాకు, బాల్టిక్ దేశాలకు ఊహించని ఆహ్వానం
ఒకప్పుడు సోవియట్ యూనియన్ పరిపాలించిన దేశాల్లో, మన పని మళ్లీ 1992లో మొదలైంది. అప్పుడు, మిషనరీలుగా ఎస్టోనియాకు వెళ్లగలమా అని మమ్మల్ని అడిగారు. మాకు ఏం చేయాలో తోచలేదు, దానిగురించి ప్రార్థన చేశాం. ‘ఒకవేళ యెహోవా ఏదైనా చేయమని ఆహ్వానిస్తే, దాన్ని ఎందుకు చేసి చూడకూడదు?’ అని మళ్లీ అనుకున్నాం. ‘అయినా, మమ్మల్ని ఆఫ్రికాకు వెళ్లమని చెప్పలేదు కదా!’ అని అనుకొని, దానికి ఒప్పుకున్నాం.
మేము అక్కడికి వెళ్లిన వెంటనే ఎస్టోనియన్ భాష నేర్చుకున్నాం. కొన్ని నెలల తర్వాత మమ్మల్ని ప్రాంతీయ సేవ చేయమని అడిగారు. దాంట్లో భాగంగా మూడు బాల్టిక్ దేశాల్లో అలాగే రష్యాలోని కాలినిన్‌గ్రాడ్‌లో ఉన్న దాదాపు 46 సంఘాలకు, గ్రూపులకు వెళ్లాం. దానికోసం మేము లాట్వియన్, లిథువేనియన్, రష్యన్ భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నించాం. ఆ భాషలు నేర్చుకోవడానికి మేము కిందామీదా పడ్డాం. కానీ మేము చేసే ప్రయత్నాల్ని చూసి అక్కడున్న బ్రదర్స్, సిస్టర్స్ సంతోషించారు. అలాగే ఆ భాష నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు. 1999లో ఎస్టోనియాలో బ్రాంచి కార్యాలయం ఏర్పడింది. అప్పుడు నేను, థోమస్ ఎడూర్, లెమ్‌బిట్ రెయిలీ, టోమీ కౌకోతో కలిసి బ్రాంచి కమిటీలో సేవ చేశాను.
ఒకప్పుడు శిక్షపడి సైబీరియాకు తరలించబడిన ఎంతోమంది బ్రదర్స్, సిస్టర్స్‌ని మేము కలిశాం. వాళ్లను జైల్లో చిత్రహింసలు పెట్టినా, వాళ్ల కుటుంబం నుండి విడగొట్టినా వాళ్లు ఎప్పుడూ కోపంతో తిరగబడలేదు. ప్రీచింగ్‌లో వాళ్ల సంతోషం, ఉత్సాహం చెక్కుచెదరలేదు. ఎన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినా సంతోషంగా సహించాలని వాళ్లను చూసి మేము నేర్చుకున్నాం.
సమయం చాలా వేగంగా గడిచిపోయింది. మేము విశ్రాంతి తీసుకోకుండా చాలా సంవత్సరాలు పనిచేశాం కాబట్టి లెస్లీ బాగా అలసిపోయేది. అయితే ఆ అలసట, ఫైబ్రోమైల్‌జియా అనే జబ్బు వల్ల వస్తుందని మాకు మొదట్లో తెలియలేదు. ఇక మేము కెనడాకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈలోపు, న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో జరిగే బ్రాంచి స్కూల్‌కి మాకు ఆహ్వానం వచ్చింది. మేము వెళ్లగలమా అని ఆలోచించాం. దాని గురించి బాగా ప్రార్థించిన తర్వాత మేము వెళ్లాలని నిర్ణయించుకున్నాం. యెహోవా మా నిర్ణయాన్ని దీవించాడు. ఆ స్కూల్‌కి వెళ్లిన తర్వాత, లెస్లీకి కావల్సిన వైద్యం అందింది. అయితే కొంతకాలానికి లెస్లీ కోలుకున్నాక, మేము ఎప్పటిలాగే మామూలుగా పనులు చేసుకోగలిగాం.
ఇంకొక ఖండానికి ఊహించని ఆహ్వానం
ఎస్టోనియాలో ఉన్నప్పుడు, 2008 లో ఒకరోజు సాయంత్రం ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాంగోకి వెళ్లి సేవ చేయగలమా అని వాళ్లు అడిగారు. నాకు కాళ్లు చేతులు ఆడలేదు, ఎందుకంటే ఏ విషయమో తర్వాతి రోజే చెప్పేయమన్నారు. దీని గురించి చెప్తే రాత్రంతా నిద్రపోదని, నేను లెస్లీకి చెప్పలేదు. నిజానికి రాత్రంతా నేను నిద్రపోలేదు, ఆఫ్రికా గురించి నాకున్న భయాలన్నీ యెహోవాకు చెప్తూ ప్రార్థన చేశాను.
తర్వాతి రోజే ఈ విషయాన్ని లెస్లీకి చెప్పాను. “యెహోవా మనల్ని ఆఫ్రికాకు ఆహ్వానిస్తున్నాడు, అక్కడ మనం సంతోషంగా సేవచేస్తామో లేదో వెళ్తేనే కదా తెలిసేది” అని అనుకున్నాము. కాబట్టి 16 సంవత్సరాలు ఎస్టోనియాలో సేవ చేసిన తర్వాత, కాంగోలోని, కిన్‌షాసాకి
వెళ్లాం. అక్కడ బ్రాంచి ఆఫీస్ అందమైన పూల మొక్కలతో పచ్చని తివాచీ పరచినట్టు ఉంది. మేము అక్కడికి వెళ్లిన వెంటనే కెనడా నుండి లెస్లీ తెచ్చుకున్న ఒక కార్డ్‌ని మా రూంలో పెట్టింది. దానిమీద “నువ్వు ఎక్కడ నాటబడితే అక్కడ వికసించు” అనే మాటలు ఉన్నాయి. అక్కడ బ్రదర్స్‌ని కలిశాం, బైబిలు స్టడీలకు వెళ్లాం, మిషనరీలుగా సేవ చేసే ఆనందాన్ని రుచి చూశాం. అలా మా సంతోషం రెట్టింపు అయ్యింది. కొంతకాలానికే దాదాపు 13 ఇతర ఆఫ్రికా దేశాల్లోని బ్రాంచి కార్యాలయాల్ని సందర్శించే అవకాశం మాకు దొరికింది. దాంతో మేము రకరకాల ప్రజల్ని కలిశాం, వాళ్లలో ఉన్న అందమైన లక్షణాల్ని చూడగలిగాం. అప్పుడు నాలో ఉన్న భయాలన్నీ మటుమాయం అయిపోయాయి. ఆఫ్రికాలో సేవ చేయడానికి పంపించినందుకు యెహోవాకు మేము థ్యాంక్స్ చెప్పాం.కాంగోలో బ్రదర్స్, సిస్టర్స్ పురుగుల్ని తినేవాళ్లు. మేమైతే వాటిని ఎప్పుడూ తినలేమని అనుకున్నాం. కానీ వాళ్లు చాలా ఇష్టంగా తినడం చూసి, మాకు కూడా తినాలనిపించింది. మేము కూడా తిన్నాం, అవి మాకు బాగా నచ్చాయి.
ఆ దేశంలో ఉన్న దొంగల ముఠాలు ఊళ్ల మీద పడి, ఆడవాళ్ల మీద, పిల్లల మీద దాడిచేశారు. అప్పుడు అక్కడున్న బ్రదర్స్‌ని ప్రోత్సహించడానికి, వాళ్లకు అవసరమైన సహాయాన్ని చేయడానికి మేము వెళ్లాం. అక్కడ చాలావరకు మన బ్రదర్స్ పేదవాళ్లే. కానీ పునరుత్థానం మీద వాళ్లకున్న ఆశ, యెహోవా మీద ప్రేమ, ఆయన సంస్థ మీద వాళ్లకున్న నమ్మకం చాలా బలంగా ఉండేది. వాళ్లను చూసి మేము చాలా నేర్చుకున్నాం. మేము యెహోవా సేవ ఎందుకు చేస్తున్నామో మళ్లీ ఆలోచించుకోవడానికి, మా విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి అది సహాయం చేసింది. కొంతమంది బ్రదర్స్ అయితే వాళ్ల ఇళ్లను కోల్పోయారు, వాళ్లకు పంట నష్టం జరిగింది. అది చూశాక, మన దగ్గరున్న వస్తువులు త్వరగా కనుమరుగైపోవచ్చు గానీ ఆధ్యాత్మిక సంపదని మాత్రం ఎవరూ దోచుకోలేరని అర్థం చేసుకున్నాం. అంత తీవ్రమైన కష్టాలున్నా, అక్కడ బ్రదర్స్ ఎవర్నీ నిందించలేదు. వాళ్లను చూసినప్పుడు మాకు వచ్చే ఏ కష్టాలనైనా, ఆఖరికి అనారోగ్య సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని అనుకున్నాం.
ఆసియా ఒడిలో
మాకు ఊహించని మరో ఆహ్వానం వచ్చింది. హాంగ్‌కాంగ్ బ్రాంచికి వెళ్లమని మాకు చెప్పారు. మేము ఆసియాలో ఉంటామని కలలో కూడా ఊహించలేదు. కానీ ఇప్పటివరకు మేము చేసిన అన్నీ నియామకాల్లో యెహోవా మాకు తోడుండడం చూసి ఈ ఆహ్వానాన్ని ఒప్పుకున్నాం. 2013లో కళ్లనిండా నీళ్లతో, గుండెనిండా స్నేహితుల జ్ఞాపకాలతో, మనసునిండా ఆఫ్రికా అందాలతో, ముందు ఏ మలుపులు వస్తాయో తెలీకుండా ప్రయాణాన్ని మొదలుపెట్టాం.
హాంగ్‌కాంగ్, ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన రకరకాల ప్రజలతో నిత్యం కిటకిటలాడే నగరం. అక్కడికి వెళ్లడం మా జీవితంలో పెద్ద మార్పే. చైనీస్ భాష నేర్చుకోవడం కూడా మాకు కష్టమైంది. కానీ బ్రదర్స్, సిస్టర్స్ మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు, అక్కడ ఆహారం కూడా మాకు బాగా నచ్చింది. బ్రాంచి కార్యాలయంలోని పనులు చాలా వేగంగా దూసుకెళ్తున్నాయి. కానీ దానికి తగ్గట్టు కావల్సిన భవనాలు మాత్రం లేవు, కొనాలంటే రేట్లు ఆకాశాన్నంటాయి. అందుకే బ్రాంచి ఆస్తుల్లోని కొన్నిటిని అమ్మేయాలని పరిపాలక సభ తెలివిగా నిర్ణయించింది. తర్వాత కొంతకాలానికే, అంటే 2015లో మేము దక్షిణ కొరియాకు వచ్చాం. అప్పటినుండి ఇప్పటివరకు మేము ఇక్కడే సేవచేస్తున్నాం. ఇక్కడ భాష నేర్చుకోవడం కూడా మాకు కష్టమైంది. మేము ఇంకా దాన్ని సరిగ్గా మాట్లాడలేకపోయినా ఇక్కడ బ్రదర్స్, సిస్టర్స్ మాత్రం మేము కొరియన్ భాషను బాగానే నేర్చుకుంటున్నామని మమ్మల్ని మెచ్చుకుంటున్నారు.
నేర్చుకున్న పాఠాలు
కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. కానీ చొరవ తీసుకొని ఆతిథ్యం ఇచ్చినప్పుడు వేరేవాళ్ల గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు. మన బ్రదర్స్, సిస్టర్స్ అందరూ వేరుగా కనిపించవచ్చు గానీ మనందరం దాదాపు ఒకటే అని అర్థమైంది. మన హృదయాల్ని విశాలం చేసుకుని, చాలామంది స్నేహితుల మీద ప్రేమ చూపించేలా యెహోవా మనల్ని సృష్టించాడు.—2 కొరిం. 6:11.
యెహోవా రకరకాల ప్రజల్ని అంగీకరించినట్టే, మనమూ అంగీకరించాలని మేము నేర్చుకున్నాం. అంతేకాదు యెహోవా మమ్మల్ని ప్రేమిస్తున్నాడని, నడిపిస్తున్నాడని రుజువుల్ని కూడా చూశాం. మేము ఎప్పుడైనా డీలా పడినప్పుడు లేదా బ్రదర్స్, సిస్టర్స్ మమ్మల్ని ఇష్టపడుతున్నారా అని డౌట్ వచ్చినప్పుడు స్నేహితులు రాసిన ఉత్తరాల్ని, కార్డ్స్‌ని తిరగేస్తాం. అవును, యెహోవా మమ్మల్ని ప్రేమిస్తూ, మా నియామకంలో కొనసాగడానికి కావల్సిన బలాన్ని ఇస్తూ మా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చాడు.
గడిచిన ఇన్ని సంవత్సరాల్లో నేను, లెస్లీ నేర్చుకున్నది ఏంటంటే మేము ఎంత బిజీగా ఉన్నా, ఒకరితో ఒకరం టైం గడపడం చాలా ప్రాముఖ్యం. అలాగే మేము కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు ఏవైనా తప్పులుపోతే నవ్వుకోవాలని నేర్చుకున్నాం. ఇంకా, రోజంతటిలో మాకు సంతోషాన్ని ఇచ్చిన ఏదోక విషయం గురించి ప్రతీరోజు రాత్రి యెహోవాకు థ్యాంక్స్ చెప్పాలని నేర్చుకున్నాం.
నిజం చెప్పాలంటే, నేను మిషనరీగా సేవ చేస్తానని లేదా వేరే దేశాల్లో ఉంటానని అస్సలు అనుకోలేదు. అయినా యెహోవా సహాయంతో అవన్నీ సాధ్యమవ్వడం నేను కళ్లారా చూశాను. యిర్మీయా ప్రవక్త మాటలు నాకు గుర్తొచ్చాయి: “యెహోవా, నువ్వు నన్ను వెర్రివాణ్ణి చేశావు.” (యిర్మీ. 20:7) అవును, ఆయన ఎన్నో ఆనందాల్ని, ఊహించని దీవెనల్ని, ఆఖరికి విమానం ఎక్కాలనే నా కోరికను కూడా నెరవేర్చాడు. నేను చిన్నప్పుడు కలలో కూడా ఊహించని ఎన్నో ప్రాంతాలకు విమానంలో వెళ్లాము. ఐదు ఖండాల్లో బ్రాంచి కార్యాలయాల్ని సందర్శించాను. ఈ నియామకాలు అన్నిటిలో లెస్లీ నాకు ఇచ్చిన మద్దతు మరువలేనిది.
మేము ఇదంతా ఎందుకు చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాం. మేము ఇప్పుడు పొందే దీవెనలు, రాబోయే శాశ్వత జీవితంలో మనం పొందే ఎన్నో దీవెనలకు జస్ట్ శాంపిల్ మాత్రమే. అప్పుడు యెహోవా ‘తన గుప్పిలి విప్పి ప్రతీ జీవి కోరికను తృప్తిపరుస్తాడు.’—కీర్త. 145:16.