కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన సంపదలను వెదకండి

నిజమైన సంపదలను వెదకండి

“ఈ అవినీతి లోకంలోని సంపదలతో మీ కోసం స్నేహితుల్ని సంపాదించుకోండి.”లూకా 16:9.

పాటలు: 122, 129

1, 2. ఈ దుష్టలోకంలో పేదరికం ఎప్పటికీ ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు?

 నేడున్న ఆర్థిక వ్యవస్థ నిర్దయగా, అన్యాయంగా తయారౌతోంది. ఉదాహరణకు, చాలామంది యౌవనస్థులు ఉద్యోగాల కోసం నానాకష్టాలు పడుతున్నారు. కొంతమంది ప్రాణాలకు తెగించి సంపన్న దేశాలకు తరలి వెళ్తున్నారు. ఆ సంపన్న దేశాల్లో కూడా ఎంతోమంది పేదవాళ్లు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్లు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు. తాజా నివేదికల ప్రకారం, ప్రపంచ జనాభాలోని 1 శాతం ధనవంతుల దగ్గర ఉన్న డబ్బు, జానాభాలోని మిగతా 99 శాతంమంది దగ్గర ఉన్న మొత్తం డబ్బుకు సమానంగా ఉంది. అవును, కొంతమంది దగ్గర ఎన్ని తరాలు గడిచినా తరగని డబ్బు ఉంది. కానీ లక్షలమంది మాత్రం కడు పేదరికంలో బ్రతుకుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటుందని యేసుకు తెలుసు కాబట్టే ఇలా అన్నాడు, “పేదవాళ్లు ఎప్పుడూ మీతోనే ఉంటారు.” (మార్కు 14:7) అసలు ఇంత అన్యాయం ఎందుకు జరుగుతోంది?

2 దేవుని రాజ్యం మాత్రమే ఈ లోకంలోని వాణిజ్య వ్యవస్థను a మార్చగలదని యేసుకు తెలుసు. రాజకీయాలు, మతాలతో పాటు “వర్తకులు” లేదా వాణిజ్య వ్యవస్థ కూడా సాతాను లోకంలో భాగమేనని బైబిలు చెప్తోంది. (ప్రక. 18:3) దేవుని ప్రజలు రాజకీయాలతో, అబద్ధ మతాలతో పూర్తిగా తెగతెంపులు చేసుకోగలిగారు. కానీ, చాలామంది దేవుని ప్రజలకు సాతాను లోకంలోని వాణిజ్య వ్యవస్థను పూర్తిగా విడిచి రావడం కుదరదు.

3. మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 లోకంలోని వాణిజ్య వ్యవస్థ పట్ల మన ఆలోచనా విధానం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. అందుకోసం ఈ ప్రశ్నల్ని వేసుకోవచ్చు, ‘నా వస్తుసంపదల్ని ఎలా ఉపయోగిస్తే నేను దేవునికి నమ్మకంగా ఉన్నానని చూపించగలను? వాణిజ్య వ్యవస్థకు సాధ్యమైనంత దూరంగా ఉండడానికి నేనేమి చేయగలను? నేడున్న దేవుని ప్రజలు యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచుతున్నారని ఏ అనుభవాలు చూపిస్తున్నాయి?’

అన్యాయస్థుడైన గృహనిర్వాహకుని ఉపమానం

4, 5. (ఎ) యేసు చెప్పిన ఉపమానంలోని గృహనిర్వాహకునికి ఏమి జరిగింది? (బి) యేసు తన అనుచరులకు ఏమి చేయమని చెప్పాడు?

4 లూకా 16:1-9 చదవండి. యేసు చెప్పిన అన్యాయస్థుడైన గృహనిర్వాహకుని ఉపమానం గురించి మనందరం ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ ఉపమానంలోని గృహనిర్వాహకుడు డబ్బును వృథా చేస్తున్నాడనే కారణంతో యజమాని అతన్ని ఉద్యోగం నుండి తీసేయాలని నిర్ణయించుకున్నాడు. b అప్పుడు ఆ గృహనిర్వాహకుడు “తెలివిగా నడుచుకున్నాడు.” అతను ఉద్యోగం వదిలి వెళ్లిపోయే ముందు, భవిష్యత్తులో అతనికి సహాయపడగల వాళ్లను స్నేహితులుగా చేసుకున్నాడు. నిజానికి, ఈ లోకంలో బ్రతకాలంటే అన్యాయంగా ప్రవర్తించాలని తన శిష్యులను ప్రోత్సహించడానికి యేసు ఈ ఉపమానం చెప్పలేదు. కానీ ఈ లోకంలోని ప్రజలు అలా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పాడు. యేసు ఈ ఉపమానాన్ని ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించడానికే చెప్పాడు.

5 హఠాత్తుగా కష్టాల్లో చిక్కుకున్న గృహనిర్వాహకునిలాగే, తన అనుచరులైన చాలామందికి కూడా అన్యాయంతో నిండిన ఈ లోకంలో ఉద్యోగం సంపాదించడం కష్టంగా ఉంటుందని యేసుకు తెలుసు. అందుకే ఆయన వాళ్లతో ఇలా అన్నాడు, “ఈ అవినీతి లోకంలోని సంపదలతో మీ కోసం స్నేహితుల్ని సంపాదించుకోండి. ఆ సంపదలు అయిపోయినప్పుడు వాళ్లు [యెహోవా, యేసు] మిమ్మల్ని శాశ్వత నివాస స్థలాల్లో చేర్చుకుంటారు.” యేసు ఇచ్చిన ఆ సలహా నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

6. ఎక్కువ డబ్బు సంపాదించడం దేవుని సంకల్పంలో భాగం కాదని మనమెలా చెప్పవచ్చు?

6 వస్తుసంపదల్ని యేసు “అవినీతి” సంపదలని ఎందుకు అన్నాడో బైబిలు చెప్పట్లేదు. కానీ ఎక్కువ డబ్బు సంపాదించడం దేవుని సంకల్పంలో భాగం కాదని బైబిలు స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు, యెహోవా ఏదెను తోటలో ఆదాముహవ్వలకు కావాల్సినవన్నీ ఉచితంగా, సమృద్ధిగా ఇచ్చాడు. (ఆది. 2:15, 16) ఆ తర్వాత, తన అభిషిక్తులకు దేవుడు పవిత్రశక్తిని ఇచ్చినప్పుడు “వాళ్లలో ఏ ఒక్కరూ తమకున్నవి తమవని అనుకునేవాళ్లు కాదు. బదులుగా, తమకు ఉన్నవన్నీ ఇతరులతో పంచుకునేవాళ్లు.” (అపొ. 4:32) యెషయా ప్రవక్త కూడా భూమ్మీద పండేవన్నీ మనుషులందరూ ఉచితంగా ఆస్వాదించే సమయం వస్తుందని చెప్పాడు. (యెష. 25:6-9; 65:21, 22) కానీ ఆ సమయం వచ్చేంతవరకు, యేసు అనుచరులు ‘తెలివిగా నడుచుకోవాలి.’ బ్రతకడానికి ఈ అవినీతి లోకంలోని సంపదలను ఉపయోగించుకుంటూనే, దేవున్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి.

అవినీతి లోకంలోని సంపదల్ని తెలివిగా ఉపయోగించడం

7. లూకా 16:10-13 వచనాల్లో యేసు ఏ సలహా ఇచ్చాడు?

7 లూకా 16:10-13 చదవండి. యేసు ఉపమానంలోని గృహనిర్వాహకుడు స్వార్థం కోసం స్నేహితుల్ని సంపాదించుకున్నాడు. అయితే తన అనుచరులు నిస్వార్థంగా పరలోకంలో స్నేహితుల్ని సంపాదించుకోవాలని యేసు కోరుకున్నాడు. అయితే మన దగ్గరున్న సంపదల్ని ఉపయోగించే విధానాన్నిబట్టి మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నామా లేదా అనేది తెలుస్తుంది. ఆ విషయాన్ని మనం అర్థంచేసుకోవాలని యేసు కోరుకున్నాడు. మరి, మనం దేవునికి నమ్మకంగా ఉన్నామని ఎలా చూపించగలం?

8, 9. కొంతమంది తమ వస్తుసంపదల్ని ఎలా ఉపయోగిస్తున్నారు?

8 వస్తుసంపదల్ని ఉపయోగించే విషయంలో మనం నమ్మకంగా ఉన్నామని నిరూపించుకునే ఒక మార్గమేమిటంటే, యేసు ముందే చెప్పిన ప్రపంచవ్యాప్త ప్రకటనా పని కోసం విరాళాలు ఇవ్వడం. (మత్త. 24:14) ఇండియాలోని ఒక చిన్న పాప డిబ్బీలో డబ్బులు దాచుకునేది. అలా దాచుకోవడానికి బొమ్మలు కూడా కొనుక్కోవడం మానేసింది. ఆ డిబ్బీ నిండినప్పుడు, ఆ డబ్బంతా ప్రకటనా పనికోసం విరాళంగా ఇచ్చేసింది. అదే దేశంలోని ఒక సహోదరునికి కొబ్బరి తోట ఉంది. అతను కొబ్బరికాయల్ని మళయాలం రిమోట్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసుకు (RTO) విరాళంగా ఇస్తుంటాడు. ఎందుకంటే, వంట కోసం వాళ్లకు రోజూ కొబ్బరికాయలు అవసరం కాబట్టి డబ్బు ఇవ్వడం కన్నా కొబ్బరికాయల్ని ఇస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందని ఆ సహోదరుడు అనుకున్నాడు. అది ఎంత ‘తెలివైన’ ఆలోచనో కదా! అదే విధంగా, గ్రీసులోని సహోదరులు అక్కడి బెతెల్‌ కుటుంబ సభ్యుల కోసం ఒలీవ నూనెను, చీజ్‌ను ఇంకా వేరే ఆహార పదార్థాల్ని విరాళంగా ఇస్తుంటారు.

9 శ్రీలంకలో ఉండే ఒక సహోదరుడు తనకున్న స్థలాన్ని, ఇల్లును మీటింగ్స్‌, సమావేశాలు జరుపుకోవడానికి అలాగే పూర్తికాల సేవకులు ఉండడానికి ఇచ్చాడు. నిజానికి ఆ సహోదరుడు తనకు వచ్చే ఆదాయాన్ని త్యాగం చేశాడు. అక్కడున్న ప్రచారకుల ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగానే ఉంది కాబట్టి అతను చేసిన సహాయం వాళ్లకు ఎంతో ఉపయోగపడింది. ప్రకటనా పనిపై ఆంక్షలు ఉన్న దేశాల్లోని సహోదరులు తమ ఇళ్లనే రాజ్యమందిరాలుగా ఉపయోగిస్తున్నారు. దానివల్ల అద్దె కట్టే అవసరం లేకుండానే అక్కడున్న ప్రచారకులు, పయినీర్లు మీటింగ్స్‌ జరుపుకోగలుగుతున్నారు.

10.మనం ఉదారంగా ఇవ్వడంవల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

10 ఈ అనుభవాల్ని బట్టి దేవుని ప్రజలు “చాలా చిన్న విషయాల్లో నమ్మకంగా” ఉన్నారని అర్థమౌతోంది. (లూకా 16:10) వాళ్లు తమ వస్తుసంపదల్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. యెహోవా స్నేహితులైన ఆ సహోదరులు తాము చేస్తున్న త్యాగాల గురించి ఎలా భావిస్తారు? ఉదారంగా ఇచ్చినప్పుడు పరలోకంలో “నిజమైన” సంపదల్ని సంపాదించుకుంటారని తెలుసుకొని వాళ్లెంతో సంతోషిస్తున్నారు. (లూకా 16:11) ఒక సహోదరి రాజ్య ప్రకటనాపని కోసం క్రమంగా విరాళాలు ఇస్తుంటుంది. అలా ఉదారతను చూపించడం వల్ల పొందిన దీవెన గురించి ఆమె ఇలా వివరించింది, “నేను డబ్బును ఉదారంగా ఇచ్చేకొద్దీ, ఇతరుల గురించి నేను ఆలోచించే తీరులో చక్కని మార్పు వస్తోంది. నేను ఇప్పుడు ఇతరుల్ని ఎక్కువగా క్షమించగలుగుతున్నాను, వాళ్లతో ఎక్కువ ఓపిగ్గా ఉండగలుగుతున్నాను, నిరుత్సాహాన్ని అధిగమించగలుగుతున్నాను, ఏదైనా సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించగలుగుతున్నాను.” కాబట్టి ఉదారంగా ఇవ్వడంవల్ల తాము ప్రయోజనం పొందుతున్నామని చాలామంది గ్రహించారు.—కీర్త. 112:5; సామె. 22:9.

11.(ఎ)ఉదారంగా ఇవ్వడం వల్ల మనం ఎలా ‘తెలివిని’ చూపిస్తాం? (బి) నిధులు సమృద్ధిగా ఉన్న దేశాలనుండి పంపిస్తున్న డబ్బు ఎలా ఉపయోగించబడుతోంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 మనం ‘తెలివిని’ చూపించగల మరో మార్గమేమిటంటే, మన వస్తుసంపదల్ని ప్రకటనాపనిని విస్తృతపర్చడానికి ఉపయోగించడం. ఆ విధంగా, మనం పూర్తికాల సేవ చేయలేకపోయినా లేదా అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లలేకపోయినా ఇతరులకు సహాయం చేయగలుగుతాం. (సామె. 19:17) ఉదాహరణకు, బాగా పేద దేశాల్లో జీవిస్తున్న చాలామంది సత్యంలోకి వస్తున్నారు. మనమిచ్చే విరాళాలు అలాంటి ప్రాంతాల్లోని వాళ్లకు ప్రచురణల్ని పంపించడానికి, ప్రీచింగ్‌ చేయడానికి సహాయపడతాయి. కాంగో, మడగాస్కర్‌, రువాండా వంటి దేశాల్లో బైబిళ్లు చాలా ఖరీదు ఉంటాయి. కొన్నిసార్లు ఒక బైబిలు ఖరీదు ఒక వారం లేదా ఒక నెల జీతమంత ఉంటుంది. చాలాసార్లు, వచ్చిన డబ్బుతో కుటుంబం కోసం ఆహారం కొనుక్కోవాలో లేదా బైబిలు కొనుక్కోవాలో మన సహోదరులు ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇతరులు ఇచ్చే విరాళాలతో, అలాగే నిధులు సమృద్ధిగా ఉన్న దేశాలనుండి అవసరం ఉన్న ప్రాంతాలకు పంపిస్తున్న డబ్బుతో యెహోవా సంస్థ బైబిళ్లను అనువదించి, ప్రతీ కుటుంబానికి అలాగే బైబిలు స్టడీ తీసుకుంటున్నవాళ్లకు కూడా ఒక బైబిలు కాపీని ఉచితంగా ఇవ్వగలుగుతోంది. (2 కొరింథీయులు 8:13-15 చదవండి.) కాబట్టి ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లు ఇద్దరూ యెహోవా స్నేహితులు అవ్వవచ్చు.

వాణిజ్య వ్యవస్థకు సాధ్యమైనంత దూరంగా ఎలా ఉండగలం?

12.తనకు దేవుని మీద నమ్మకం ఉందని అబ్రాహాము ఎలా చూపించాడు?

12 ఈ లోకంలోని వాణిజ్య వ్యవస్థకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ “నిజమైన” సంపదల్ని వెదకడం ద్వారా కూడా మనం యెహోవాకు స్నేహితులవ్వవచ్చు. దేవున్ని నమ్మకంగా సేవించిన అబ్రాహాము అదే చేశాడు. అతను యెహోవాకు స్నేహితుడిగా ఉండడం కోసం ఆయన మాట విని ఎంతో సంపన్న దేశమైన ఊరును విడిచి గుడారాల్లో జీవించడానికి వెళ్లాడు. (హెబ్రీ. 11:8-10) అతను వస్తుసంపదలమీద కాకుండా ఎల్లప్పుడూ దేవుని మీదే నమ్మకం పెట్టుకున్నాడు. (ఆది. 14:22, 23) అలాంటి విశ్వాసాన్ని చూపించమని యేసు ఇతరుల్ని ప్రోత్సహించాడు. ఒకసారి యేసు, ధనవంతుడైన ఒక యువకునితో ఇలా అన్నాడు, “నువ్వు పరిపూర్ణుడివి కావాలనుకుంటే, వెళ్లి నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి, వచ్చిన డబ్బును పేదవాళ్లకు ఇవ్వు. అప్పుడు నీకు పరలోకంలో ఐశ్వర్యం కలుగుతుంది. ఆ తర్వాత వచ్చి నా శిష్యుడివి అవ్వు.” (మత్త. 19:21) అయితే, ఆ యువకునికి అబ్రాహాముకు ఉన్నలాంటి విశ్వాసం లేదు. కానీ కొంతమంది మాత్రం దేవుని మీద నమ్మకం ఉంచారు.

13.(ఎ)పూర్తికాల సేవకుడైన తిమోతికి పౌలు ఏ సలహా ఇచ్చాడు? (బి) దాన్ని నేడు మనమెలా పాటించవచ్చు?

13 తిమోతికి ఎంతో విశ్వాసం ఉంది. తిమోతిని “క్రీస్తుయేసుకు మంచి సైనికుడు” అని పిలుస్తూ పౌలు అతనికిలా చెప్పాడు, “సైనికుడిగా సేవచేసే ఏ వ్యక్తీ వాణిజ్య సంబంధ వ్యాపారాల్లో పాల్గొనడు. ఎందుకంటే అతను, తనను సైనికుడిగా చేర్చుకున్న వ్యక్తి ఆమోదం పొందాలనుకుంటాడు.” (2 తిమో. 2:3, 4) పదిలక్షల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న పూర్తికాల సేవకులతో సహా నేడున్న యేసు అనుచరులు పౌలు చెప్పిన మాటల్ని పాటించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. దురాశతో నిండిన ఈ లోకం చూపించే వాణిజ్య ప్రకటనలకు దేవుని సేవకులు ఆకర్షితులవ్వరు. “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు” అనే సూత్రాన్ని వాళ్లు గుర్తుంచుకుంటారు. (సామె. 22:7) తన గుప్పిట్లో ఉన్న వాణిజ్య వ్యవస్థ కోసం మన సమయాన్ని, శక్తినంతటినీ ఉపయోగించాలని సాతాను కోరుకుంటున్నాడు. కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి, కారు కొనుక్కోవడానికి, చదువు కోసం లేదా పెళ్లి కోసం కూడా ఎక్కువ మొత్తంలో లోన్‌ తీసుకుంటారు. ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే, వాటిని తీర్చడానికే ఎక్కువ సంవత్సరాలు కష్టపడాల్సి రావచ్చు. కాబట్టి మనం సాదాసీదాగా జీవిస్తూ, అప్పులకు దూరంగా ఉంటూ, డబ్బును పొదుపుగా వాడితే తెలివిగా నడుచుకున్న వాళ్లమౌతాం. అప్పుడు, మనం ఈ వాణిజ్య వ్యవస్థకు బానిసలు కాకుండా దేవున్ని స్వేచ్ఛగా ఆరాధించగలుగుతాం.—1 తిమో. 6:10.

14.మనం ఏమి చేయాలని నిర్ణయించుకోవాలి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.

14 మనం సాదాసీదాగా జీవించాలంటే దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వాలి. ఒక సహోదరుడు తన భార్యతో కలిసి పెద్ద వ్యాపారం చేస్తూ మంచి లాభాలు సంపాదిస్తున్నాడు. అయితే, వాళ్లు ఒకప్పుడు చేసిన పూర్తికాల సేవను మళ్లీ మొదలుపెట్టాలని అనుకున్నారు. కాబట్టి వాళ్లు తమ వ్యాపారాన్ని, స్పీడ్‌ బోటును, ఇతర వస్తువుల్ని అమ్మేశారు. దానితర్వాత, న్యూయార్క్‌లోని వార్విక్‌లో కొత్త ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించే పనిలో స్వచ్ఛందంగా సహాయం చేయడానికి వెళ్లారు. వాళ్లకు అది ఒక ప్రత్యేకమైన అవకాశం. ఎందుకంటే అక్కడి బెతెల్‌లో సేవచేస్తున్న తమ కూతురు, అల్లుడుతో కలిసి పనిచేయగలిగారు. అంతేకాదు ఆ సహోదరుని అమ్మానాన్నలతో కూడా కలిసి కొన్ని వారాలు వార్విక్‌ నిర్మాణ పనిలో సహాయపడగలిగారు. అమెరికాలోని, కొలరాడోలో పయినీరు సేవ చేస్తున్న ఒక సహోదరికి బ్యాంకులో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం దొరికింది. అక్కడ యజమానులకు ఆమె పనితీరు ఎంతగా నచ్చిందంటే, మూడు రెట్లు ఎక్కువ జీతం తీసుకొని ఫుల్‌టైమ్‌ పని చేయమని అడిగారు. అది మంచి అవకాశమే అయినప్పటికీ, ఫుల్‌టైమ్‌ ఉద్యోగం చేస్తే ఎక్కువ పరిచర్య చేయడం కుదరదు కాబట్టి ఆమె ఆ అవకాశాన్ని వదులుకుంది. యెహోవా సేవకులు ఇలాంటి త్యాగాలు ఎన్నో చేశారు వాటిలో ఇవి కొన్ని మాత్రమే. దేవుని రాజ్య పనులకు మొదటిస్థానం ఇవ్వాలని మనం నిర్ణయించుకున్నప్పుడు, వస్తుసంపదల కన్నా దేవునితో మన స్నేహానికి, నిజమైన సంపదలకే ఎక్కువ విలువిస్తున్నామని చూపిస్తాం.

వస్తుసంపదలు “అయిపోయినప్పుడు”

15.ఎలాంటి సంపదలు గొప్ప సంతృప్తినిస్తాయి?

15 ఆస్తి-అంతస్తులు ఉన్నంత మాత్రాన దేవుని ఆశీర్వాదం ఉందని చెప్పలేం. “మంచిపనులు ఎక్కువగా” చేసేవాళ్లను యెహోవా దీవిస్తాడు. (1 తిమోతి 6:17-19 చదవండి.) ఉదాహరణకు, అల్బేనియాలో ప్రచారకుల అవసరం ఎక్కువ ఉందని లూచీయా అనే సహోదరికి తెలిసింది. c దాంతో ఆమె 1993లో ఇటలీ నుండి అల్బేనియాకు వెళ్లిపోయింది. ఆమెకు ఉద్యోగం లేదు కానీ యెహోవా తన అవసరాల్ని తీరుస్తాడని నమ్మింది. ఆమె అల్బేనియా భాష నేర్చుకుని, 60 కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేసింది. మనం పరిచర్య చేస్తున్న ప్రాంతంలో అలాంటి ఫలితాలే రాకపోవచ్చు. కానీ యెహోవా గురించి తెలుసుకోవడానికి, ఆయనకు స్నేహితులు అవ్వడానికి ఇతరులకు చేసే ఏ సహాయమైనా మనకు చిరకాలం గుర్తుండిపోతుంది.—మత్త. 6:20.

16.(ఎ)నేడున్న వాణిజ్య వ్యవస్థకు ఏమి జరుగుతుంది? (బి) అది తెలుసుకున్నాక, వస్తుసంపదల గురించి మన ఆలోచనా తీరు ఎలా ఉండాలి?

16 లూకా 16:9 లో నేడున్న వాణిజ్య వ్యవస్థ అంతమౌతుందని యేసు స్పష్టం చేశాడు. ఆయన అలాంటి వస్తుసంపదలు “అయిపోయినప్పుడు” అని అన్నాడుగానీ ఒకవేళ అయిపోతే అని అనలేదు. ఈ చివరిరోజుల్లో, కొన్ని బ్యాంకులు దివాలా తీశాయి, మరికొన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. కానీ ముందుముందు పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారవుతాయి. సాతాను లోకంలో భాగంగా ఉన్న రాజకీయాలు, మతాలు, వాణిజ్య వ్యవస్థలు పనికిరాకుండా పోతాయి. వాణిజ్య వ్యవస్థ ఎంతో విలువైనవాటిగా చూసిన బంగారం, వెండి ముందుముందు దేనికీ ఉపయోగపడవని యెహెజ్కేలు, జెఫన్యా ప్రవక్తలు ముందే చెప్పారు. (యెహె. 7:19; జెఫ. 1:18) ఒకవేళ మనం ముసలివాళ్లం అయ్యాక, ఈ లోకంలోని అవినీతి సంపదల కోసం నిజమైన సంపదల్ని త్యాగం చేశామని గ్రహిస్తే మనకెలా అనిపిస్తుంది? అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బంతా నకిలీదని గ్రహించిన వ్యక్తి పరిస్థితిలా ఉంటుంది. (సామె. 18:11) ఈ లోకంలోని వస్తుసంపదలు అయిపోతాయి. కాబట్టి మీ వస్తుసంపదల్ని ఉపయోగించి పరలోకంలో స్నేహితుల్ని చేసుకునే అవకాశాన్ని వదులుకోకండి. మనం యెహోవా కోసం, ఆయన రాజ్యం కోసం చేసేవే మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తాయి.

17, 18.దేవుని స్నేహితులు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

17 దేవుని రాజ్యం వచ్చాక, ఎవ్వరూ అద్దె కట్టాల్సిన లేదా లోన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆహారం ఉచితంగా, కావాల్సినంత దొరుకుతుంది. డాక్టర్లతో, మందులతో అవసరం ఉండదు. యెహోవా స్నేహితులు భూమ్మీద పండే శ్రేష్ఠమైన వాటిని ఆస్వాదిస్తారు. బంగారాన్ని, వెండిని అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగిస్తారేగానీ ధనవంతులు అవ్వడానికి కాదు. చక్కని ఇళ్లు కట్టుకోవడానికి నాణ్యమైన చెక్క, రాయి, లోహం ఉచితంగా దొరుకుతాయి. మన స్నేహితులు ప్రేమతో సహాయం చేస్తారేగానీ డబ్బు కోసం కాదు. భూమ్మీద పండే ప్రతీదాన్ని అందరం పంచుకుంటాం.

18 పరలోకంలో స్నేహితుల్ని సంపాదించుకునేవాళ్లు అనుభవించే వెలకట్టలేని బహుమతుల్లో అవి కొన్ని మాత్రమే. అయితే, “నా తండ్రి ఆశీర్వాదం పొందినవాళ్లారా, రండి. ప్రపంచం పుట్టిన దగ్గర నుండి మీకోసం సిద్ధం చేయబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి” అని యేసు చెప్పడం విన్నప్పుడు, భూమ్మీద ఉండే యెహోవా ఆరాధకుల సంతోషానికి అవధులుండవు.—మత్త. 25:34.

a ఈ ఆర్టికల్‌లో వాణిజ్య వ్యవస్థ అనే మాట ఎక్కువ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా చేసుకున్న, అవసరం లేకపోయినా ఎక్కువ వస్తువులు కొనుక్కునేలా ప్రజల్ని ప్రోత్సహిస్తున్న సాతాను లోకంలోని భాగాన్ని సూచిస్తుంది.

b గృహనిర్వాహకుడు నిజంగా ఆస్తిని దుబారా చేస్తున్నాడని యేసు చెప్పలేదు. ఆదిమ భాష నుండి అనువదించబడిన లూకా 16:1 లోని “ఫిర్యాదు” అనే మాట ప్రకారం ఆ గృహనిర్వాహకుని గురించి ఎవరో అబద్ధం చెప్పడం వల్లే అతని మీద నిందపడి ఉండవచ్చు. అయితే, గృహనిర్వాహకుడు ఉద్యోగాన్ని కోల్పోవడానికిగల కారణాల గురించి కాదుగానీ ఆ సమయంలో అతను వ్యవహరించిన తీరు గురించే యేసు ముఖ్యంగా చెప్పాడు.

c సహోదరి లూచీయా మూసానెట్‌ జీవిత కథను 2003, జూన్‌ 22 తేజరిల్లు! (ఇంగ్లీషు) సంచికలోని 18-22 పేజీల్లో చూడండి.