కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 29

“నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి”

“నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి”

“నేను క్రీస్తును బట్టి, నా బలహీనతల విషయంలో, ఇతరులు నన్ను ఎగతాళి చేసినప్పుడు, నేను అవసరంలో ఉన్నప్పుడు, నాకు హింసలూ కష్టాలూ ఎదురైనప్పుడు సంతోషిస్తాను.”—2 కొరిం. 12:10.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

ఈ ఆర్టికల్‌లో . . . *

1. అపొస్తలుడైన పౌలు ఏ విషయాల్ని ఒప్పుకున్నాడు?

అపొస్తలుడైన పౌలు, తాను కొన్ని సందర్భాల్లో బలహీనపడ్డానని ఒప్పుకున్నాడు. అవును, తన శరీరం ‘కృశించిపోతోందని,’ సరైనది చేయడానికి పోరాడాల్సి వస్తోందని, కొన్నిసార్లు తన ప్రార్థనలకు ఆశించిన జవాబు రాలేదని ఆయన చెప్పాడు. (2 కొరిం. 4:16; 12:7-9; రోమా. 7:21-23) అంతేకాదు, వ్యతిరేకులు తనను బలహీనుడిలా చూశారని కూడా ఆయన ఒప్పుకున్నాడు. * అయితే, ఇతరులు అన్న మాటల్ని బట్టి లేదా తనలోని లోపాల్ని బట్టి తాను పనికిరానివాణ్ణని పౌలు ఎన్నడూ అనుకోలేదు.—2 కొరిం. 10:10-12, 17, 18.

2. రెండో కొరింథీయులు 12:9, 10 ప్రకారం, పౌలు నేర్చుకున్న విలువైన పాఠం ఏంటి?

2 ఒక వ్యక్తి బలహీనమైన స్థితిలో కూడా బలంగా ఉండగలడనే విలువైన పాఠాన్ని పౌలు నేర్చుకున్నాడు. (2 కొరింథీయులు 12:9, 10 చదవండి.) యెహోవా పౌలుతో, “నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నా శక్తి ఇంకా బలంగా పనిచేస్తుంది” అని చెప్పాడు. అంటే, పౌలుకు అవసరమైన బలాన్ని యెహోవా ఇస్తాడని దానర్థం. ముందుగా, వ్యతిరేకులు ఎగతాళి చేసినప్పుడు మనం ఎందుకు నిరుత్సాహ పడకూడదో పరిశీలిద్దాం.

‘ఎగతాళికి గురైనప్పుడు సంతోషించండి’

3. మనం ఎగతాళికి గురైనప్పుడు ఎందుకు సంతోషించవచ్చు?

3 ఎగతాళికి గురవ్వాలని మనలో ఎవ్వరం కోరుకోం. ఒకవేళ వ్యతిరేకుల ఎగతాళిని పట్టించుకుంటే మనం నిరుత్సాహపడవచ్చు. (సామె. 24:10) మరి, అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలి? పౌలులాగే మనం కూడా, ఇతరులు ‘ఎగతాళి చేసినప్పుడు సంతోషించవచ్చు.’ (2 కొరిం. 12:10) ఎందుకు? ఎందుకంటే, ప్రజలు మనల్ని ఎగతాళి చేసి వ్యతిరేకిస్తున్నారంటే, మనం యేసుకు నిజమైన శిష్యులమని అర్థం. (1 పేతు. 4:14) తనను అనుసరించేవాళ్లను లోకం హింసిస్తుందని యేసు చెప్పాడు. (యోహా. 15:18-20) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అలాంటి హింసనే ఎదుర్కొన్నారు. అప్పట్లో గ్రీకు సంస్కృతి ప్రభావానికి గురైన చాలామంది, క్రైస్తవుల్ని తెలివిలేనివాళ్లలా, బలహీనుల్లా చూశారు. యూదులేమో, క్రైస్తవులందర్నీ ‘చదువుకోని సామాన్యుల్లా’ చూశారు; అపొస్తలులైన పేతురు, యోహానుల విషయంలో అదే జరిగింది. (అపొ. 4:13) క్రైస్తవులు రాజకీయాల్లో పాల్గొనరు, సైన్యంలో చేరరు కాబట్టి ప్రజలు వాళ్లను బలహీనులుగా చూసేవాళ్లు; సమాజం కూడా వాళ్లను హీనంగా చూసేది.

4. వ్యతిరేకులు ఎగతాళి చేస్తున్నారని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు నిరుత్సాహపడ్డారా?

4 వ్యతిరేకులు ఎగతాళి చేస్తున్నారని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు నిరుత్సాహపడ్డారా? లేదు. యేసును అనుసరిస్తున్నందుకు, ఆయన గురించి బోధిస్తున్నందుకు ఎగతాళికి గురవ్వడం తమకు దొరికిన గొప్ప అవకాశమని పేతురు, యోహానులు భావించారు. (అపొ. 4:18-21; 5:27-29, 40-42) అవును, శిష్యులు సిగ్గుపడడానికి ఏ కారణమూ లేదు. ప్రజలు వాళ్లను గౌరవించకపోయినా, వాళ్లు మాత్రం ప్రజలకు సహాయం చేయడానికి ఎంతో కృషిచేశారు. ఉదాహరణకు, పవిత్రశక్తి ప్రేరణతో కొంతమంది తొలి క్రైస్తవులు రాసిన పుస్తకాలు ఎంతోమందికి సహాయం చేస్తున్నాయి, ఊరటను ఇస్తున్నాయి. వాళ్లు ప్రకటించిన దేవుని రాజ్యం ప్రస్తుతం పరలోకంలో పరిపాలిస్తోంది, త్వరలో భూమంతటినీ పరిపాలిస్తుంది. (మత్త. 24:14) అంతేకాదు, క్రైస్తవుల్ని హింసించిన ప్రాచీన రోమా ప్రభుత్వం ఉనికిలో లేకుండా పోయింది; కానీ హింసను సహించిన ఆ నమ్మకమైన క్రైస్తవులు ప్రస్తుతం పరలోకంలో రాజులుగా పరిపాలిస్తున్నారు. వాళ్లను హింసించిన వ్యతిరేకులు మట్టిలో కలిసిపోయారు. ఒకవేళ ఆ వ్యతిరేకులు భవిష్యత్తులో పునరుత్థానమైతే, ఏ క్రైస్తవులనైతే వాళ్లు హింసించారో, ఆ క్రైస్తవులే వాళ్లను పరిపాలిస్తారు.—ప్రక. 5:10.

5. యోహాను 15:19 ప్రకారం, లోకం యెహోవా ప్రజల్ని ఎందుకు చిన్నచూపు చూస్తుంది?

5 నేడు కొన్నిసార్లు ప్రజలు మనల్ని తక్కువగా చూస్తుంటారు; తెలివితక్కువ వాళ్లమని, బలహీనులమని ఎగతాళి చేస్తుంటారు. కారణం? మనం లోకంలోని ప్రజల్లా ప్రవర్తించం; వినయంగా, సౌమ్యంగా ఉండడానికి కృషి చేస్తాం. కానీ లోకంలోని ప్రజలకు గర్విష్ఠులు, కోపిష్ఠులే నచ్చుతారు. అంతేకాదు, రాజకీయాల్లో పాల్గొనం, సైన్యంలో చేరం అనే కారణాన్ని బట్టి కూడా ప్రజలు మనల్ని ఎగతాళి చేస్తారు. మనం లోకంలోని వాళ్లలా ఉండం కాబట్టి, ప్రజలు మనల్ని చిన్నచూపు చూస్తారు.—యోహాను 15:19 చదవండి; రోమా. 12:2.

6. యెహోవా తన ప్రజల్ని ఉపయోగించుకుని ఎలాంటి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాడు?

6 లోకం మనల్ని బలహీనుల్లా చూస్తున్నా, యెహోవా మాత్రం మనల్ని ఉపయోగించుకుని అసాధారణ పనులు చేస్తున్నాడు. మానవ చరిత్రలో ఎప్పుడూ జరగని స్థాయిలో ప్రకటనా పనిని జరిపిస్తున్నాడు. ఆయన సేవకులు ప్రపంచంలో వేరే ఎవ్వరికన్నా ఎక్కువ భాషల్లోకి పత్రికల్ని అనువదిస్తున్నారు, వాటిని ఎక్కువ సంఖ్యలో పంచిపెడుతున్నారు; వాళ్లు బైబిల్ని ఉపయోగించి ఎంతోమంది జీవితాల్లో సంతోషం నింపుతున్నారు. వీటన్నిటి ఘనత యెహోవాకే చెందుతుంది. లోకం బలహీనులుగా చూస్తున్న ప్రజల్ని ఉపయోగించుకుని, యెహోవాయే ఈ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాడు. మరి, వ్యక్తిగతంగా మనలో ప్రతీఒక్కరికి అవసరమైన బలాన్ని ఆయన ఇస్తాడా? ఇస్తాడు. దాన్ని పొందడానికి మనం ఏం చేయాలి? మనం ముఖ్యంగా మూడు పనులు చేయాలి. వాటిని తెలుసుకోవడానికి అపొస్తలుడైన పౌలు ఉదాహరణను పరిశీలిద్దాం.

మీ సొంత శక్తిపై ఆధారపడకండి

7. పౌలు ఉదాహరణ నుండి మనం నేర్చుకోగల ఒక పాఠం ఏంటి?

7 పౌలు ఉదాహరణ నుండి మనం నేర్చుకోగల ఒక పాఠం: యెహోవా సేవ చేసే విషయంలో మన సొంత బలం మీద, సామర్థ్యాల మీద ఆధారపడకూడదు. మనుషుల దృష్టితో చూస్తే పౌలు గర్వపడడానికి, సొంత తెలివి మీద ఆధారపడడానికి సరైన కారణం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన ఒక రోమా ప్రాంతానికి రాజధాని అయిన తార్సులో పెరిగాడు. తార్సు అభివృద్ధి చెందిన నగరం, పైగా అక్కడున్న విశ్వవిద్యాలయానికి మంచిపేరు ఉంది. పౌలు బాగా చదువుకున్నవాడు; ఆ కాలంలో యూదా నాయకుల్లో ప్రముఖుడైన గమలీయేలు దగ్గర ఆయన చదువు నేర్చుకున్నాడు. (అపొ. 5:34; 22:3) ఒకానొక సమయంలో, పౌలు యూదుల్లో ప్రముఖమైన వ్యక్తిగా పేరు పొందాడు. ఆయనిలా చెప్పాడు: “యూదా మతాన్ని అనుసరించే విషయంలో నా వయసు ఉన్న చాలామంది యూదుల కన్నా నేను ఎంతో ముందుండేవాణ్ణి.” (గల. 1:13, 14; అపొ. 26:4) కానీ పౌలు తన సొంత బలం మీద ఆధారపడలేదు.

పౌలు క్రీస్తు అనుచరునిగా ఉండడం కోసం, లోకం గొప్పగా చూసే వాటన్నిటినీ ‘చెత్తతో సమానంగా ఎంచాడు’ (8వ పేరా చూడండి) *

8. ఫిలిప్పీయులు 3:8 ప్రకారం, తనను గొప్పవాణ్ణి చేసిన వాటిని పౌలు ఎలా ఎంచాడు? పౌలు ఎందుకు తన ‘బలహీనతల విషయంలో సంతోషించాడు’?

8 లోకం దృష్టిలో తనను గొప్పవాణ్ణి చేసిన వాటిని పౌలు సంతోషంగా వదులుకున్నాడు. నిజానికి, ఆయన వాటన్నిటినీ ‘చెత్తతో సమానంగా ఎంచాడు.’ (ఫిలిప్పీయులు 3:8 చదవండి.) క్రీస్తు అనుచరుడు అయినందుకు ఆయన ఎన్నో కష్టాల్ని సహించాడు. తోటి యూదులు ఆయన్ని చంపాలనుకున్నారు. (అపొ. 23:12-14) తోటి రోమా పౌరులు ఆయన్ని కొట్టి, చెరసాలలో బంధించారు. (అపొ. 16:19-24, 37) దానికి తోడు, తనలో ఉన్న లోపాలతో ఆయన పోరాడాల్సి వచ్చింది. (రోమా. 7:21-25) అయితే హింసలు ఎదురౌతున్నాయనో, లోపాలు ఉన్నాయనో పౌలు యేసును అనుసరించడం మానేయలేదు. బదులుగా, తన ‘బలహీనతల విషయంలో సంతోషించాడు.’ ఎందుకు? ఎందుకంటే, తాను బలహీనంగా ఉన్నప్పుడు దేవుని శక్తి తనలో బలం నింపడాన్ని పౌలు గుర్తించాడు.—2 కొరిం. 4:7; 12:10.

9. మన పరిస్థితుల్ని మనం ఎలా చూడాలి?

9 యెహోవా ఇచ్చే శక్తిని పొందాలంటే మన బలాన్ని, చదువును, సంస్కృతిని, డబ్బును చూసుకుని గొప్పవాళ్లమని అనుకోకూడదు. యెహోవా వాటిని ప్రాముఖ్యంగా ఎంచడు. నిజానికి ఆయన సేవకుల్లో చాలామంది, “మనుషుల దృష్టిలో తెలివిగలవాళ్లు కాదు, శక్తిమంతులు కాదు, గొప్ప వంశాల్లో పుట్టినవాళ్లు కాదు.” అయినా, యెహోవా తన పనికోసం “లోకంలోని బలహీనుల్ని ఎంచుకున్నాడు.” (1 కొరిం. 1:26, 27) కాబట్టి ఈ పేరా మొదట్లో ప్రస్తావించినవి మీకు లేకపోయినా, యెహోవా సేవ చేయడానికి మీరు అర్హులే. మీ పరిస్థితిని ఒక ఆటంకంలా కాకుండా, యెహోవా శక్తిని చూసే అవకాశంలా ఎంచండి. ఉదాహరణకు, మీ నమ్మకాల్ని ప్రశ్నించేవాళ్లను చూసి భయమేస్తే, వాళ్లతో ధైర్యంగా మాట్లాడడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. (ఎఫె. 6:19, 20) ఒకవేళ మీరు తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే, మీ మనసును ఆయన సేవ మీద నిలపడానికి సహాయం చేయమని యెహోవాను అడగండి. ఆయన మీకు సహాయం చేసే విధానాన్ని చూసిన ప్రతీసారి, మీ విశ్వాసం అంతకంతకూ ఎక్కువౌతుంది.

బైబిలు ఉదాహరణల నుండి నేర్చుకోండి

10. హెబ్రీయులు 11:32-34⁠లో ఉన్నవాళ్ల లాంటి నమ్మకమైన బైబిలు ఉదాహరణలను మనం ఎందుకు అధ్యయనం చేయాలి?

10 పౌలు లేఖనాల్ని శ్రద్ధగా అధ్యయనం చేసేవాడు. దేవుని వాక్యంలో ఉన్న నమ్మకమైన సేవకుల ఉదాహరణల నుండి ఆయన ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలాంటివాళ్ల ఉదాహరణల గురించి ఆలోచించమని హెబ్రీ క్రైస్తవుల్ని కూడా ప్రోత్సహించాడు. (హెబ్రీయులు 11:32-34 చదవండి.) నమ్మకమైన సేవకుల్లో ఒకరైన దావీదు రాజు గురించి పరిశీలిద్దాం. ఆయనకు శత్రువుల నుండే కాదు, కొంతమంది స్నేహితుల నుండి కూడా వ్యతిరేకత ఎదురైంది. దావీదు ఉదాహరణను అధ్యయనం చేయడం వల్ల పౌలు ఎలా బలం పొందాడో తెలుసుకుందాం. మనం పౌలును ఎలా అనుకరించవచ్చో నేర్చుకుందాం.

దావీదు చిన్నవాడు, పైగా యుద్ధం చేసిన అనుభవం లేదు. అయినా గొల్యాతుతో పోరాడడానికి భయపడలేదు. ఎందుకంటే, గొల్యాతును ఓడించడానికి కావల్సిన బలాన్ని యెహోవా ఇస్తాడని దావీదు నమ్మాడు. దావీదు నమ్మకమే నిజమైంది (11వ పేరా చూడండి)

11. గొల్యాతుకు దావీదు బలహీనంగా ఎందుకు కనిపించాడు? (ముఖచిత్రం చూడండి.)

11 బలవంతుడైన, యోధుడైన గొల్యాతుకు దావీదు బలహీనంగా కనిపించాడు. అందుకే అతను దావీదును “చిన్నచూపు చూసి, ఎగతాళి చేశాడు.” గొల్యాతు భారీకాయుడు, అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, పైగా యుద్ధం చేయడంలో శిక్షణ కూడా పొందాడు. దావీదుకేమో యుద్ధం చేసిన అనుభవం గానీ, సరైన ఆయుధాలు గానీ లేవు. కానీ దావీదు నిజంగా బలహీనుడు కాదు. ఎందుకంటే ఆయన యెహోవా మీద ఆధారపడ్డాడు, యెహోవా ఆయనకు బలాన్నిచ్చాడు; ఆ బలంతోనే గొల్యాతును ఓడించాడు.—1 సమూ. 17:41-45, 50.

12. దావీదుకు ఎదురైన మరో సమస్య ఏంటి?

12 తనను బలహీనపర్చే మరో సమస్య దావీదుకు ఎదురైంది. యెహోవా సౌలును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. దావీదు సౌలుకు నమ్మకంగా ఉండేవాడు. మొదట్లో సౌలు కూడా దావీదును గౌరవించాడు. కొంతకాలానికి, గర్విష్ఠిగా మారిన సౌలు దావీదును చూసి అసూయపడడం మొదలుపెట్టాడు. దావీదుతో దురుసుగా ప్రవర్తించాడు, ఆఖరికి చంపడానికి కూడా ప్రయత్నించాడు.—1 సమూ. 18:6-9, 29; 19:9-11.

13. సౌలు చెడు ప్రవర్తన బట్టి దావీదు ఎలా స్పందించాడు?

13 రాజైన సౌలు ఎంత దురుసుగా ప్రవర్తించినా, యెహోవా అభిషేకించిన రాజును దావీదు గౌరవిస్తూనే వచ్చాడు. (1 సమూ. 24:6) సౌలు చెడు ప్రవర్తన బట్టి దావీదు యెహోవాను నిందించలేదు. బదులుగా, తనకు ఎదురౌతున్న కష్టాల్ని సహించేలా బలాన్ని ఇవ్వమని యెహోవాను వేడుకున్నాడు.—కీర్త. 18:1, పైవిలాసం.

14. దావీదులాగే పౌలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు?

14 అపొస్తలుడైన పౌలుకు కూడా దావీదు లాంటి సమస్యే ఎదురైంది. పౌలు శత్రువులు ఆయన కన్నా ఎన్నో రెట్లు బలవంతులు. ఆయన కాలంలో జీవించిన ఎంతోమంది ప్రముఖ నాయకులు పౌలును ద్వేషించారు. చాలాసార్లు ఆయన్ని కొట్టించి చెరసాలలో వేయించారు. దావీదులాగే పౌలు కూడా స్నేహితుల వల్ల కష్టాలు ఎదుర్కొన్నాడు. క్రైస్తవ సంఘంలోని కొంతమందైతే ఆయన్ను వ్యతిరేకించారు కూడా. (2 కొరిం. 12:11; ఫిలి. 3:18) కానీ పౌలు వాళ్లందరి మీద విజయం సాధించాడు. ఏవిధంగా? వ్యతిరేకత ఎదురౌతున్నా ఆయన ప్రకటనా పని కొనసాగించాడు. తోటి సహోదరసహోదరీలు తనను బాధపెట్టినా ఆయన వాళ్లను అంటిపెట్టుకుని ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, జీవితాంతం దేవునికి నమ్మకంగా ఉన్నాడు. (2 తిమో. 4:8) పౌలు ఇవన్నీ తన సొంత శక్తితో చేయలేదు, యెహోవా ఇచ్చిన బలంతోనే చేయగలిగాడు.

మీ నమ్మకాల్ని ప్రశ్నించేవాళ్లకు మర్యాదగా, దయగా జవాబు ఇవ్వండి (15వ పేరా చూడండి) *

15. మనం చెడు మీద ఎలా విజయం సాధించవచ్చు?

15 తోటి విద్యార్థులు, తోటి ఉద్యోగులు, లేదా సత్యంలో లేని కుటుంబసభ్యులు ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా, హింసిస్తున్నారా? తోటి సహోదరసహోదరీలు ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టారా? అలాంటి పరిస్థితుల్లో దావీదు, పౌలు ఉదాహరణల్ని గుర్తుచేసుకోండి. మీరు ‘మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ ఉండవచ్చు.’ (రోమా. 12:21) దావీదులా మీరు అవతలి వ్యక్తిని రాయితో కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్లకు యెహోవా గురించి, బైబిలు గురించి చెప్పడం ద్వారా మీరు చెడు మీద విజయం సాధించవచ్చు. అలా విజయం సాధించాలంటే, ప్రజల ప్రశ్నలకు బైబిలు నుండి జవాబు ఇవ్వండి; మిమ్మల్ని బాధపెట్టేవాళ్లతో మర్యాదగా, దయగా ప్రవర్తించండి; ప్రతీఒక్కరికి ఆఖరికి మీ శత్రువులకు కూడా మంచి చేయండి.—మత్త. 5:44; 1 పేతు. 3:15-17.

ఇతరుల సహాయం తీసుకోండి

16-17. పౌలు ఏ పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు?

16 అపొస్తలుడైన పౌలు క్రీస్తు శిష్యునిగా మారకముందు, అంటే యౌవనంలో ఉన్నప్పుడు యేసు అనుచరుల్ని గౌరవించేవాడు కాదు, బదులుగా వాళ్లను హింసించేవాడు. (అపొ. 7:58; 1 తిమో. 1:13) అప్పట్లో ఆయన్ని సౌలు అని పిలిచేవాళ్లు. యేసే స్వయంగా కలుగజేసుకుని, క్రైస్తవుల్ని హింసించకుండా ఆయన్ని ఆపాడు. యేసు పరలోకం నుండి ఆయనతో మాట్లాడాడు, ఆయన చూపు పోయేలా చేశాడు. తిరిగి చూపు పొందడానికి పౌలు తాను హింసించిన క్రైస్తవుల సహాయాన్నే తీసుకోవాల్సి వచ్చింది. అందుకోసం పౌలు వినయంగా, అననీయ అనే క్రీస్తు శిష్యుని సహాయం తీసుకున్నాడు.—అపొ. 9:3-9, 17, 18.

17 కొంతకాలం తర్వాత, పౌలు క్రైస్తవ సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. కానీ దమస్కుకు వెళ్లే దారిలో యేసు నేర్పిన పాఠాన్ని మాత్రం పౌలు ఎప్పటికీ మర్చిపోలేదు. పౌలు జీవితాంతం వినయం చూపించాడు, తోటి సహోదరసహోదరీల సహాయాన్ని సంతోషంగా తీసుకున్నాడు. వాళ్లు తనకు ‘సహాయం చేసి బలపర్చారని’ చెప్పాడు.—కొలొ. 4:10, 11, అధస్సూచి.

18. ఇతరుల సహాయాన్ని తీసుకోవడానికి కొన్నిసార్లు మనం ఎందుకు ఇష్టపడకపోవచ్చు?

18 పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? సత్యం నేర్చుకుంటున్న కొత్తలో మనకు ఎక్కువ విషయాలు తెలియవు కాబట్టి సహోదరసహోదరీల సహాయం తీసుకోవడానికి ఇష్టపడి ఉంటాం. (1 కొరిం. 3:1, 2) మరి ఇప్పుడు ఎలా ఉన్నాం? ఎంతోకాలం నుండి సత్యంలో ఉండి చాలా అనుభవం సంపాదించిన తర్వాత, ఇతరుల సహాయం తీసుకోవడానికి మనం అంతగా ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ సహాయం చేసేవాళ్లు మన తర్వాత సత్యంలోకి వచ్చిన వాళ్లయితే అస్సలు ఇష్టపడకపోవచ్చు. కానీ, మనల్ని బలపర్చడానికి యెహోవా తరచూ సహోదరసహోదరీల్ని ఉపయోగించుకుంటాడు. (రోమా. 1:11, 12) ఆయనిచ్చే బలాన్ని పొందాలంటే, మనం తోటి సహోదరసహోదరీల సహాయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి.

19. పౌలు అద్భుతమైన పనుల్ని ఎలా చేయగలిగాడు?

19 క్రైస్తవునిగా మారిన తర్వాత పౌలు కొన్ని అద్భుతమైన పనులు చేశాడు. ఒక వ్యక్తికున్న శారీరక బలం, చదువు, సంస్కృతి, డబ్బు ముఖ్యం కాదుగానీ; వినయంగా ఉంటూ బలం కోసం యెహోవా మీద ఆధారపడితే ఎన్నో అద్భుతమైన పనులు చేయగలమని పౌలు తెలుసుకున్నాడు. మనం కూడా పౌలును అనుకరిస్తూ (1) యెహోవా మీద ఆధారపడదాం, (2) బైబిలు ఉదాహరణల నుండి నేర్చుకుందాం, (3) తోటి సహోదరసహోదరీల సహాయం తీసుకుందాం. అలా చేస్తే, మనం ఎంత బలహీనంగా ఉన్నా, యెహోవా మనల్ని బలవంతులుగా చేస్తాడు.

పాట 71 యెహోవా సైన్యం మనం!

^ పేరా 5 ఈ ఆర్టికల్‌లో అపొస్తలుడైన పౌలు ఉదాహరణను పరిశీలిస్తాం. వినయంగా ఉంటే యెహోవా మనకు ఎగతాళిని తట్టుకోవడానికి, బలహీనతల్ని అధిగమించడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడని తెలుసుకుంటాం.

^ పేరా 1 పదాల వివరణ: అపరిపూర్ణత, పేదరికం, అనారోగ్యం, చదువులేకపోవడం లాంటి రకరకాల కారణాల వల్ల, మనం బలహీనులమని మనకు అనిపించవచ్చు. అంతేకాదు, వ్యతిరేకులు మనతో దురుసుగా మాట్లాడడం ద్వారా, మనపై దాడి చేయడం ద్వారా మనం బలహీనులమనే భావనను మనలో కలిగించవచ్చు.

^ పేరా 57 చిత్రాల వివరణ: పౌలు, పరిసయ్యునిగా తన దగ్గరున్న వాటిని విడిచిపెట్టి, క్రీస్తు గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. పౌలు విడిచిపెట్టిన వాటిలో ఆయన చదివిన గ్రంథాలు, లేఖనాల పెట్టె ఉండివుంటాయి.

^ పేరా 61 చిత్రాల వివరణ: తమతో కలిసి తోటి ఉద్యోగి పుట్టినరోజు వేడుకలో పాల్గొనమని కొంతమంది సహోదరుణ్ణి బలవంతపెడుతున్నారు.